“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

15, ఆగస్టు 2011, సోమవారం

హిందూ మతోద్దారకులు

మొన్నీ మధ్య ఒక ప్రయాణంలో ఉండగా ఇద్దరు హిందూ మతోద్దారకులను కలిశాను. వాళ్ళిద్దరూ ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థ అయిన ఒక హిందూ సంస్థకు చెందినవారు. ఈ సంస్థ సభ్యులతో నాకు ఇంతకూ ముందే కొంత పరిచయం ఉంది. వీళ్ళలో ఆవేశంపాళ్ళు ఎక్కువ జ్ఞానంపాళ్ళు తక్కువ. హిందూ మతంలో వీళ్ళకు తెలిసిన వ్యక్తి ఒక్క శివాజీ మాత్రమే.

వాళ్ళంతట వాళ్ళు మాటలు కల్పించుకుని హిందూ మతానికి జరుగుతున్న అన్యాయాన్ని గురించి, క్రైస్తవ మత ప్రచారకుల దురంతాల గురించీ లెక్చరు మొదలు పెట్టారు. చాలాసేపు నేను మౌనంగా వింటున్నాను. ఇంతలో ఒకాయన నన్ను పలకరించి " సార్ మీరు హిందువే కదా" అన్నాడు.


"అవును" అని జవాబిచ్చాను.


" మీరు బొట్టు ఎందుకు పెట్టుకోలేదు " అన్నాడు. అదేదో నేరం అయినట్లు.


" బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? " అని అడిగాను నేను.


" అది మన హిందూమత దర్మం" అన్నాడు ఒకాయన.


" ఏ బొట్టు పెట్టుకోమంటారు. అడ్డ బొట్టా, నిలువు బొట్టా, చుక్క బొట్టా, వీభూతా, కుంకుమా, చందనమా?" అడిగాను.


"ఏదైనా ఒకటే. ఏది పెట్టుకున్నా హిందూ మతంలో ఉన్నట్లే." అని ఒకాయన అన్నాడు.


"అలాంటప్పుడు ఏ బొట్టూ పెట్టుకోకున్నా హిందువు కావడానికి అభ్యంతరం ఏముంది? అదీ గాక వేదకాలంలో ఎవరూ బొట్టు పెట్టుకున్న దాఖలాలు లేవే?" అడిగాను.


సమాధానం తెలియక వాళ్లకు చిర్రెత్తింది.


వారిలో ఒకడు కొంచం శ్రుత పాండిత్యంగాడున్నాడు. " అదికాదు. కనుబొమల మధ్యన ఆగ్నేయ చక్రం ఉంటుంది. బొట్టు పెట్టుకుంటే ఆగ్నేయ చక్రం యాక్టివేట్ అవుతుంది." అన్నాడు.


"ఆగ్నేయ చక్రం ఉంటుందా? ఆ పేరు ఎక్కడా వినలేదే?" అన్నాను నేను.


"ఉంది సార్. యోగాకోర్సు చేస్తే మీకు తెలుస్తుంది." అన్నాడు.


"యోగాకోర్స్ సంగతి తర్వాత చూద్దాంలేగాని ఆగ్నేయచక్రం అన్నమాట రామకృష్ణ పాడింది కదా,  N.T.R బ్రహ్మంగారిచరిత్ర కాసేట్టులో విన్నావా నాయనా?" లోలోపల నవ్వుకుంటూ అడిగాను.   


"అవును సార్"


"అంతేలే. మన హిందూమతం కాసెట్లలోనూ సీడీలలోనేగా చివరికి మిగిలింది. సరే గాని. ఆగ్నేయచక్రం యాక్టివేట్ అయితే ఏం జరుగుతుంది? " యాక్టివేట్" అన్న పదం కాస్త వత్తి పలుకుతూ అన్నాను.

"జ్ఞానం వస్తుంది. జరగబోయేది తెలుస్తుంది." అన్నాడు.


"మరి ఇన్నివేల సంవత్సరాలుగా ఎంతో మంది బొట్టు పెట్టుకుంటున్నారు. వాళ్లకు జ్ఞానం కలిగిందా? అంతెందుకు నీవూ బొట్టు పెట్టుకునే ఉన్నావుగా. నీకు ఆగ్నేయచక్రం యాక్టివేట్ అయిందా?" అడిగాను.

"సార్. మీరు వితండవాదం చేస్తే మేమేమీ చెప్పలేము" అన్నాడు.


"ఇందులో వితండవాదం ఏముంది నాయనా. నీవు చెప్పినదానికే నా సందేహం అడిగాను. నీకు జవాబు తెలీకపొతే పరవాలేదులే ఒదిలెయ్ ". అన్నాను.


వాళ్ళ అహం దెబ్బ తింది.


"అసలు హిందూమతం అంటే మీ అభిప్రాయం చెప్పండి సార్". అన్నారు.


"చెప్తా గాని. మీ కులం ఏమిటి నాయనా". అడిగాను.


వారిలో ఒకాయన బ్రాహ్మణుడు. ఒకాయన నాయుడుగారు.


"మీ గోత్రం ఏమిటి ?" బ్రాహ్మణున్ని అడిగాను.


"భారద్వాజ గోత్రం " గర్వంగా చెప్పాడు.


"అబ్బా. అలాగా. సరే కాస్త మీ ప్రవర చెప్పు నాయనా వింటాను?"
 

చెప్పలేక నీళ్ళు నములుతున్నాడు. 

"పవరా అదేంటి ? " అడిగాడు నాయుడు గారు.

"నువ్వు కాసేపుండు నాయనా. నీ దగ్గరికి కూడా వస్తా. పోనీ మీరు ఏ వేదానికి చెందినవారు? ఆ వేదంలో మీ శాఖ ఏమిటి? మీ వేదశాఖలోని ఉపనిషత్తు ఏమిటి? ఆ ఉపనిషత్తు యొక్క ద్రష్ట లెవరు?" అడిగాను.

వెర్రి మొఖం వేసుకుని చూస్తున్నాడు.

 

"పోనీ షడ్దర్శనాలు అంటే ఏమిటి? వాటి కర్తలెవరో కాస్తచెప్పు నాయనా" అడిగాను.

సమాధానం లేదు.

"న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఉత్తరమీమాంసల పేర్లు ఎప్పుడైనా విన్నావా? అడిగాను.

వాళ్లకు ఏదో అనుమానం వచ్చింది. మనం దొరికిపోయాం అన్న అనుమానం చూపులలో కనిపించింది. 


"పోనీ నాస్తిక దర్శనాలైన చార్వాక, బౌద్ధ, జైనాల గురించి తెలుసా?" అడిగాను.

"బౌద్ధం, జైనం గురించి తెలుసు" అన్నారు.

"ఏం తెలుసో కాస్త చెప్పు నాయనా వింటాను. '

"బుద్దుడూ జైనుడూ అహింసను బోధించారు" అన్నాడు నాయుడుగారు.

జైనుడు కాదు నాయనా ఆయన పేరు వర్ధమాన మహావీరుడు. సరే ఇద్దరూ అహింసనే బోధిస్తే మరి ఇద్దరి బోధలలో తేడాలేమిటి? అడిగాను

మళ్ళీ మౌనమే శరణ్యం.

"చూడు నాయనా. నీకు వేదాల గురించి తెలియదు. ఉపనిషత్తుల గురించి తెలియదు. దర్శనాల గురించి తెలియదు. వేదం యొక్క షడంగాలు తెలియదు. మీ గోత్ర రుషులేవరో నీకు తెలియదు. వాళ్ళ చరిత్రలు అసలే తెలియవు. పోనీ ఇతర మతాల గురించీ తెలియదు.  మన మతానికీ ఇతర మతాలకీ ఉన్న తేడాలు తెలియవు. మరి ఇవేమీ తెలియని మీరు హిందూ మతాన్ని ఉద్దరిస్తారా? ఎలా ఉద్దరిస్తారో మీరే ఆలోచించండి. మీకు తెలిసిందల్లా బొట్టు పెట్టుకోడం ఒక్కటే. బొట్టు పెట్టుకున్నంత మాత్రాన హిందూత్వం రాదు. నార్త్ ఇండియాలో చాలామంది  హిందువులు బొట్టు పెట్టుకోరు. అంతమాత్రం చేత వాళ్ళు హిందువులు కారంటారా?" అడిగాను

జవాబు లేదు.

"ప్రస్తుతం మీరు చెయ్యవలసింది హిందూ మత ఉద్దరణ కాదు. ముందు మిమ్మల్ని మీరు ఉద్దరించుకొండి. అంటే ఏదో పెద్ద ఘనకార్యం చెయ్యనక్కరలేదు. నేను అడిగిన విషయాల గురించి కూలంకషంగా తెలుసుకోండి. ఆ తర్వాత వాటిని మీ జీవితంలో ఆచరణలోకి తీసుకురండి. అప్పుడు మీకు హిందూమతం అంటే ఏమిటో, దాని గొప్పతనం ఏమిటో అర్ధం అవుతుంది. హిందూమతం ఒకరి చేత ఉద్దరించబడేంత దుస్థితిలో లేదు. మీ మతమేంటో తెలియని దుస్థితిలో మీరున్నారు. మీకు కావలసింది ఆత్మోద్దరణ. రాజకీయ పార్టీలలో చేరి రైళ్ళలో ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన మతం ఉద్దరింప బడదు. సీడీలు విని హిందూ మతాన్ని తెలుసుకోవడం కాదు. మూల గ్రంధాలు చదవండి. అర్ధం కాకపోతే భాష్యాలు చదవండి. సంస్కృతం నేర్చుకోడానికి ప్రయత్నం చెయ్యండి. అప్పుడు మీకు ఆగ్నేయచక్రానికీ ఆజ్ఞాచక్రానికీ భేదం తెలుస్తుంది. 

హిందూమతాన్ని గురించి బాకా ఊదటం కాదు.  ముందుగా అదేమిటో తెలుసుకోండి. తరువాత మీ జీవితాలలో దాన్ని ఆచరించి చూపండి. హిందూమతం అంటే సనాతనధర్మం. అదెప్పటికీ నిలిచి ఉంటుంది. విశ్వం నిలబడటానికి మూలాలేవో అవే దాని సిద్ధాంతాలు. కనుక సనాతన ధర్మం ఎప్పటికీ నశించదు. దానిని మీ జీవితంలో ఆచరించాలి. అదే దాన్ని ఉద్దరించడానికి సరియైన మార్గం. అంతే గాని ఇతరులకు తెలిసీ తెలియని లెక్చర్లు ఇవ్వడం కాదు." అన్నాను.

వాళ్ళ ముఖాలలో కళ తప్పింది.

"మీకు నిజమైన హిందూమతాన్ని గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంటె ఇదిగో నా కార్డ్" -- అని నా విజిటింగ్ కార్డ్ వాళ్ళ చేతిలో పెట్టాను. ఇంతలో నేను దిగాల్సిన స్టేషన్ వచ్చింది. దిగి నా దారిన నేను చక్కా వచ్చాను.

నా ప్రశ్నలకు సమాధానం తెలిసిన హిందువులు మీలో ఎందరున్నారో మీరూ ఆలోచించుకోండి మరి.