మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలో ప్రఖ్యాత కుంగ్ ఫూ స్టార్ బ్రూస్లీ పేరు తెలియనివారు ఎవరూ ఉండరు. ఇతను 32 ఏళ్ల చిన్న వయసులోనే అనుమానాస్పద పరిస్తితుల్లో మరణించాడు. ఆ తర్వాత ఎందరు ఎన్నిరకాలుగా ఊహించినా బ్రూస్ లీ దుర్మరణం వెనుకఉన్న రహస్యం ఇప్పటికీ తేలకుండా అలాగే ఉండిపోయింది.
బ్రూస్లీ 1940 లో పుట్టి 1973 లో 32 ఏళ్ల వయసులో చనిపోయాడు. ఇతని కుమారుడైన బ్రాండన్ లీ 1965 లో పుట్టి 1993 లో 28 ఏళ్ల వయసులో మరణించాడు. ఇతనిదీ అనుమానాస్పదమరణమే. ఇప్పటివరకూ ఇవి మిస్టరీలు గానే మిగిలిపోయాయి.
ఇటువంటి చిక్కుముళ్ళను విడదీయడానికి జ్యోతిష్యశాస్త్రం బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. జ్యోతిష్యశాస్త్ర సహాయంతో బ్రూస్లీ -- బ్రాండన్లీ ల మరణానికి వెనుకఉన్న మిస్టరీని చేదించేముందు లోకంలో ఈవిషయంపై ప్రచారంలో ఉన్న పుకార్లు ఏమంటున్నాయో చూద్దాం.
1. బ్రూస్లీ వంశానికి శాపం ఉంది. అతని తండ్రికూడా తమవంశంలో శాపంఉందని నమ్మేవాడు. ఆ శాపకారణంగానే బ్రూస్లీ చనిపోయాడు. ఈ శాపంవల్లనే ఇతని కుమారుడు బ్రాండన్ లీ కూడా చిన్నవయసులో చనిపోయాడు.
2. బ్రూస్లీ కి బాడీఫిట్నెస్ అంటే విపరీతమైన మక్కువ. అనుక్షణం తనశరీరం ఖచ్చితమైన ఫిట్ నెస్ లో ఉండాలని కోరుకునేవాడు. తనశరీరంలో కొంచెం కొవ్వు కనిపించినా దాన్ని కరిగించేవరకూ అతనికి నిద్రపట్టేది కాదు. ఈనాడు కుర్రకారు వెర్రెక్కించుకుంటున్న సిక్స్ పాక్, ఎయిట్ పాక్ బాడీ 40 ఏళ్లక్రితమే బ్రూస్లీకి ఉండేది. అందుకోసం అనునిత్యమూ అనేక రకాలైన వ్యాయామాలు చేసేవాడు. పాత వ్యాయామాలు చాలక తనే కొత్తకొత్త వ్యాయామాలు డిజైన్ చేసుకుని మరీ ప్రాక్టీస్ చేసేవాడు. అలా మితిమీరి చేసిన వ్యాయామాల వల్ల అతని మరణం సంభవించింది.
3. తలనొప్పి తగ్గడానికి అతని గర్ల్ ఫ్రెండ్ "బెట్టీ" ఇచ్చిన మందుబిళ్ళ Equagesic రియాక్షన్ వల్ల అతను చనిపోయాడు.
4. విపరీత లైంగికసామర్ధ్యం కోసం అతను ఒకమందు వాడేవాడు. ఆ మందుప్రభావం వల్ల అతన్ని భరించడం ఏ స్త్రీకైనా కష్టంగా ఉండేది. అలాంటి ఒక సందర్భంలో, అతన్ని ఇక ఆపకపోతే తన ప్రాణానికే ప్రమాదం అన్నస్తితిలో, ఆ స్త్రీ తన చేతికిదొరికిన గాజు యాష్ ట్రే తో అతని తలమీద బలంగా మోదిందనీ ఆ దెబ్బ ఎడమకణతకు తగలడం వల్ల బ్రూస్లీ స్పృహతప్పి కోమాలోకి పోయి అలాగే చనిపోయాడనీ ఒక కధ హాంకాంగ్ లో ప్రచారంలో ఉంది.
5.ఇతరులకు చెప్పకూడని కుంగ్ ఫూ రహస్యాలను అమెరికన్స్ కు నేర్పిస్తున్నాడని కోపంవచ్చిన చైనీస్ మార్షల్ ఆర్ట్స్ కమ్యూనిటీ చేసిన చేతబడిలాంటి ఒక క్రియ వల్ల అతను చనిపోయాడని కొందరు అంటారు. "కుంగ్ ఫూ" మరియు "తాయ్ చీ" విద్యల్లో ఉన్నతస్థాయిలలో మనచేతబడికి దగ్గరగా ఉండే ప్రాణవిద్యాప్రక్రియలు ఉంటాయి.
6. తన కెరీర్ లో బ్రూస్లీ అనేకమంది మార్షల్ ఆర్టిస్టులతో, మాస్టర్లతో, తనను చాలెంజ్ చేసిన అనేకమందితో, చివరికి వీధిరౌడీలతోకూడా తలపడి ఫైట్స్ చేసాడు. వారిలో ఎవరో ఒకరు డిం-మాక్ ప్రయోగించారనీ దానివల్ల బ్రూస్ లీ మెదడు క్రమేణా ఉబ్బిపోయి మరణించాడనీ కొందరు అంటారు. "డిం-మాక్" నే "డెత్ టచ్" అని కూడా అనవచ్చు. ఇది మనదేశపు మర్మవిద్యలాటిది. దీనిలోని కొన్ని దెబ్బలు వెంటనే ప్రభావం చూపవు. క్రమేణా స్లో పాయిజన్ లాగా పనిచేసి నాడీమండలాన్ని క్షీణింపచేసి హటాత్తుగా ఒకరోజున మరణాన్ని కొనితెస్తాయి.
7.అసలివేవీ నిజమైన కారణాలు కావు, బ్రూస్లీకి డ్రగ్స్ అలవాటుందనీ, డ్రగ్స్ వాడకం వల్లనే అతని బ్రెయిన్లో రియాక్షన్స్ వచ్చి "సెరిబ్రల్ ఎడీమా" తో చనిపోయాడనీ కొందరంటారు.
8. ఒక ఆసియన్ నటుడు హాలీవుడ్ లో అనూహ్యంగా ఎదగడాన్ని జీర్ణించుకోలేని అమెరికన్ మాఫియా కుట్రవల్లే బ్రూస్లీ హత్యచేయబడ్డాడనీ దాన్ని బయటకు రాకుండా కప్పిపెట్టారనీ ఒక వాదనుంది.
9. హాంకాంగ్ మాఫియా అయిన "ట్రయాడ్" కు డబ్బు( రౌడీమామూలు) చెల్లించకుండా ఎదురు తిరిగినందుకు అతన్ని చంపి అది "మెడికల్ యాక్సిడెంట్" అని లోకాన్ని నమ్మించారని కొందరంటారు.
10. బ్రూస్లీకి అమ్మాయిల పిచ్చి ఎక్కువనీ, విపరీతమైన తిరుగుడు వల్లే ఆరోగ్యం పాడైపోయి అతను మరణించాడనీ కొందరి వాదన.
ఇక బ్రూస్లీ కుమారుడైన బ్రాండన్ లీ చిన్న వయసులో చనిపోడానికి ఈ క్రింది కారణాలు ఉన్నాయని కొన్ని పుకార్లు ఉన్నాయి.
1. అమెరికన్ మాఫియా కుట్ర అనే వాదన ఇతని మీద కూడా ఉంది.
2. తన తండ్రిహత్యకు కారకులు ఎవరో బ్రాండన్ లీ కనుక్కున్నాడనీ అందుకే ఆ నిజం బయటకు రాకుండా ఇతన్ని కూడా మట్టుపెట్టారనీ ఒక వాదనుంది.
3. వీళ్ళ వంశంలో ఉన్న శాపం కారణం అని కొందరంటారు.
4. ఇవేమీ కారణాలు కాదు ఇదొక కాకతాళీయసంఘటన అని కొందరి వాదన.
ఈ విధంగా ఎవరికీ తోచిన కారణాలు వాళ్ళు చెబుతూ వచ్చారు. నిజానిజాలు ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనం భారతీయ జ్యోతిష్యశాస్త్రాన్ని ఉపయోగించి వీళ్ళ దుర్మరణాల వెనుక ఉన్న అసలు కారణాలు ఎలా కనుక్కోవచ్చో వచ్చే పోస్ట్ లలో చూద్దాం.