నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

7, నవంబర్ 2011, సోమవారం

"ప్రజ్ఞా సురభి" కొత్త ఇంగ్లీష్ బ్లాగ్ మొదలైంది

భారతదేశ సంస్కృతినీ, మతాన్నీ, యోగ, జ్యోతిష, మంత్ర తంత్రాది విద్యలనూ, ప్రాచీన వీరవిద్యలనూ ఇష్టపడేవారు ప్రపంచ వ్యాప్తంగా ఎందఱో ఉన్నారు. వారిలో తెలుగు భాష రానివారు కోకొల్లలు. 

కాని వారి విజ్ఞానతృష్ణ మనకంటే ఎంతో అధికం. వారికున్న మతమూ, విజ్ఞానమూ వారికి అత్యన్తికమైన తృప్తిని ఇవ్వలేకపోతున్నాయి. నిజమైన మతాన్ని, ప్రాచీన సంస్కృతుల విజ్ఞానాన్నీ తెలుసుకోవాలని ఆశపడేవారు ఎందఱో ఉన్నారు. వారందరి దృష్టినీ ఆకర్షించే ఒకేఒక్క దేశం మనదేశం. ఎందుకంటే ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన కీర్తి మనసొంతం.

మనదేశపు ప్రాచీన జ్ఞానసంపద అద్భుతమైనది. ఆశ్చర్యజనకమైనది. అవి వేదోపనిషత్తులైనా, పురాణేతిహాసాలలో దాగిఉన్న జ్ఞానసంపదైనా,  జ్యోతిష్యమైనా, వేదాంతమైనా , యోగమైనా, తంత్రమైనా, వీరవిద్యలైనా, ఆయుర్వేదమైనా -- ఏదైనా సరే, ఆ విజ్ఞాన సంపద అత్యద్భుతమైనది. మన సంపదలను మనం మర్చిపోయినా లోకం దానికోసం అర్రులు చాస్తున్నది. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, బ్రిటన్ లో ఇంకా ఎన్నో దేశాలలో భారతీయ జ్యోతిష్యంమీద చాలా సీరియస్ రీసెర్చి చేస్తున్నవారు ఎందఱో ఉన్నారు. మన మతంగురించి మనకంటే మంచి అవగాహన ఉన్నవారు ఎందఱో ఉన్నారు. వీటిని తెలుసుకోవాలని ఆశించేవారు వీరికి ఎన్నోరెట్లు ఎక్కువగా ఉన్నారు. వారిలో ఎవరికీ తెలుగు భాష రాదు.

మన దేశంలోనే ఇతరరాష్ట్రాలకు చెందిన భరతమాత నిజమైన బిడ్డలు  ఎందఱో కూడా ఈ రంగాలలో ఎంతో పరిశ్రమ చేసినవారు, చేస్తున్నవారు, ఎంతో జ్ఞానసంపదను ఆర్జించినవారు ఉన్నారు. వారికీ తెలుగురాదు. కనుక ఇలాటివారితో నా భావాలను ఇచ్చిపుచ్చుకోవాలంటే తెలుగుభాషకున్నటువంటి  పరిమితి చాలదు.

తెలుగురాని ఇలాంటి ఎందఱో జిజ్ఞాసువులకు మన సంస్కృతిలోని మహత్తరమైన జ్ఞానసంపదను, నా వ్రాతలద్వారా, తెలియచేయ్యాలనే సదుద్దేశ్యంతో " ప్రజ్ఞా సురభి" అన్న కొత్త ఇంగ్లీష్ బ్లాగ్ మొదలు పెట్టాను. ఆ బ్లాగ్ ను ఇక్కడ చూడవచ్చు. 

అద్భుతమైన మన ప్రాచీన జ్ఞానసంపదను ప్రపంచంతో పంచుకోవాలనే మంచిఉద్దేశ్యంతో ఈప్రయత్నం మొదలైతున్నది. సర్వేశ్వరుడైన పరమాత్మ తన అనుగ్రహాన్ని ఈ చిన్నిప్రయత్నానికి అందించుగాక అని ప్రార్ధిద్దాం.