“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

5, డిసెంబర్ 2011, సోమవారం

అభీ నా జావో ఛోడ్ కర్

మొన్నొకసారి స్కైప్ మీటింగ్ లో మిత్రులతో అన్నాను గోచారరవి నీచరాహువు దగ్గరకి వచ్చినపుడు ప్రముఖుల మరణం సంభవిస్తుంది,అని. ఇంకా అనేక విషయాలు సంభవించవచ్చు అని కూడా అనుకున్నాం. ఉదాహరణకి ఇప్పుడు ఆంధ్రాలో జరుగుతున్న రాజకీయ సంక్షోభం వంటివి. కాని విధి విచిత్రం కాకపోతే, దేవానంద్ మరణం కూడా ఇప్పుడే జరగాలా?

మనకున్న సమాచారాన్ని బట్టి దేవానంద్ 26 -9 -1923  న గురుదాసపూర్ లో పుట్టాడు. ఆయన జన్మసమయం తెలియదు. అందుకని చంద్రలగ్నాత్ జాతకాన్ని చూద్దాం. ఈయన రేవతీనక్షత్రంలో పుట్టాడు. రేవతీనక్షత్ర జాతకులకు ప్రస్తుతం అష్టమశని జరుగుతున్నది. అష్టమశని అనేది చెడుకాలం అని ఇంతకుముందు పోస్ట్ లో వ్రాశాను. ఈయనకు ప్రస్తుతం 88 ఏళ్ళు. ఎనిమిదో అంకె శనియొక్క ఆధీనంలో ఉంటుంది. 88 అంటే డబల్ శనిప్రభావం అనుకోవచ్చు. ఈ సమయంలోనే మరణం ఆయన్ను వరించింది.

కన్యారాశిలో ఉన్న బుధశుక్రులయుతి అనేది ఈయన జాతకంలో ఒక విచిత్రయోగం. కన్యారాశి బుధునికి ఉచ్చస్తితినీ, శుక్రునికి నీచస్తితినీ ఇస్తుందని మనకు తెలుసు. శుక్రుడు కళత్రకారకుడేకాక, ప్రేమవ్యవహారాలకు కారకుడనీ మనకు తెలుసు. ఈ శుక్రుని నీచస్తితివల్లనే తాను అమితంగా ప్రేమించిన సురయాను పెళ్లిచేసుకోలేక పోయాడు. శుక్రునినీచత్వం, చంద్రునినుంచి బుధుని యొక్క కేంద్రస్తితివల్ల రద్దుఅయిందని అనుకోవచ్చు. కాని ఇది పూర్తిగా నిజంకాదు. ఎందుకంటే బుధుడు వక్రస్తితిలో ఉండి బలహీనుడుగా ఉన్నాడు. కనుక శుక్రునియొక్క నీచత్వాన్ని బుధుడు పూర్తిగా రద్దు చెయ్యలేడు. అందుకే శుక్రునియొక్క దుష్టప్రభావం ఇతని జీవితంలో అలా పనిచేసింది. ఇతనికి ఒక రొమాంటిక్ హీరో ఇమేజినీ ఇదే ఇచ్చింది. భగ్నప్రేమనూ, బాధాతప్తహృదయాన్నీ ఇదే ఇచ్చింది. ఈ బుధశుక్రులకలయిక ఇతనిజాతకంలోని  "కార్మిక్ సిగ్నేచర్" అని చెప్పవచ్చు. 

ఇతని జీవితంలోని ప్రతిఘట్టంలోనూ ఈగ్రహయుతి ప్రభావం కనిపిస్తుంది. ఈయన వ్రాసుకున్న " రొమాన్సింగ్ విత్ లైఫ్" అనేపుస్తకం పేరుకూడా బుధశుక్రుల ప్రభావానికి అతీతంగా ఏమీలేదు. రొమాన్స్ శుక్రుని ఆధీనంలోనూ, ఓపెన్ గా మాట్లాడటం బుధుని ఆధీనంలోనూ ఉంటుందని మనకు తెలుసు. అందుకే ఆ పుస్తకం పేరుకూడా అలా పెట్టబడింది. ఈ విధంగా జీవితంలో ఒకరు చేసే ప్రతిపనీ గ్రహాధీనంలోనే ఉంటుంది. మన సొంతంగా మనం చేస్తున్నాం అనుకునేపని వెనుకకూడా మనకు తెలీని శక్తులప్రభావం ఉంటుంది. ఇదే గ్రహప్రభావం వల్ల, తనజీవితంలో ఎంతమంది అమ్మాయిలతో తానుప్రేమలో పడిందీ దేవానంద్ బాహాటంగా చాలాసార్లు చెప్పేవాడు. 

ప్రస్తుతం గోచారశుక్రుడు రాహువునుదాటి ముందుకు వచ్చాడు. 14 -11 -11  న శుక్రుడు రాహువుతో కలిసి ఉన్నప్పటినుంచీ ఈయనగానీ ఈయనసతీమణి గానీ అనారోగ్యంతో బాధపడుతూ ఉండాలి అని నాఊహ. కాని జాతకబలం వల్ల గోచారసూర్యుడు రాహువుతోకలిసి బాగా దగ్గరకు వచ్చేవరకూ మరణం దూరంగా వేచిచూచింది. ఈయన రవివారంరోజున రవిహోరలో కన్నుమూయడం ఒకవిచిత్రం. రవి గుండెకు కారకుడని మనకు తెలుసు, రాహువు నిద్రకు కారకుడు. కనుక రవివారంనాడు, రవిహోరలో, గోచారసూర్యుడు రాహువుకు బాగాదగ్గరగా ఉన్నప్పుడు నిద్రలో గుండెపోటుతో తనువు చాలించాడు.

అష్టమశనికి తోడు, గోచారరవిబుధులు నీచరాహువుకు బాగాదగ్గరగా వచ్చారు. రాహువు విదేశాలకు కారకుడు. అందుకే విదేశం అయిన లండన్లో మరణాన్ని ప్రసాదించాడు. అంతేకాక  రవిబుధులు వృశ్చికం 17 డిగ్రీ మీద కంజంక్షన్లో ఉన్నారు. వృశ్చికం 17 డిగ్రీ అంటే నవాంశలో ధనుస్సు అవుతుంది. జైమినిమహర్షి ప్రకారం ధనురాశి హటాత్ పరిణామాలకూ, ఉన్నతస్థానంనుంచి  పతనానికీ కారణం అవుతుంది. ప్రస్తుతం అదే జరిగింది.

నవంబర్ 15  న శనిభగవానుడు తులారాశికి మారినప్పటి నుంచీ రేవతీనక్షత్రజాతకులకు అష్టమశని ప్రభావంవల్ల అనేక బాధలు మొదలయ్యాయి. ఈ బాధలనేవి ఆయా జాతకుల దశాభుక్తులను బట్టి, వారివారి వయస్సును బట్టి జరుగుతుంటాయి. ప్రస్తుతం దేవానంద్ 88 ఏళ్ల వృద్ధుడు. ముసలివయసులో శనిగోచారం ప్రమాదకరమైనది. కనుక అష్టమశని ఈయనకు దేహబాధల నుంచి విముక్తి ప్రసాదించింది. జీవితమనే స్టేజిమీదనుంచి గ్రీన్ రూం లోకి  తీసుకెళ్ళింది. మళ్ళీ కొత్తమేకప్ వేసుకుని ఇంకోకొత్తవేషంలో ఎక్కడో ఏదోనాటకంలో ఇంకోపాత్ర ధరింపచేయడానికి భగవంతుడు ఆయన్ని తీసుకెళ్ళాడు. 


జీవకారకుడైన జననగురువుపైన కర్మకారకుడైన గోచారశని సంచరించడం మరణసూచకం (సరైన దశలు నడుస్తుంటే). నాడీజ్యోతిష్యంలో ఇదొక రహస్యం. ప్రస్తుతం దేవానంద్ జాతకంలో అదే జరిగినట్లుంది.

ఈ రహస్య విశ్వప్రణాళికలో, తన కర్మానుసారం చేరవలసిన సరైనచోటుకి, దేవానంద్ ఆత్మ చేరుతుందని ఆశిద్దాం.