నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

30, జనవరి 2012, సోమవారం

వీరవిద్యలు- వింతవాస్తవాలు

కుజప్రభావానికి మనమూ అతీతులము కాము కదా. కనుక కుజ కారకత్వాలలో ఒకటైన మార్షల్ ఆర్ట్స్ గురించి కొంత మాట్లాడుకుందాం.


మార్షల్ ఆర్ట్స్ ప్రపంచం కూడా మాయకు అతీతం ఏమీ కాదు. అందులో కూడా బోలెడంత మోసం ఉంది. కుళ్ళూ కపటమూ ఉన్నాయి. అదొక బిజినెస్. వందల సంవత్సరాల నాటి  మార్షల్ ఆర్ట్స్ లో ఎన్నో విలువలుండేవి. ఇప్పటి స్కూల్స్ లో అవి పోయి రాజకీయాలు పెరిగాయి. డబ్బులిస్తే బ్లాక్ బెల్ట్ లు పడేసే మాస్టర్లు బోలెడు మంది ఉన్నారు. అసలైన ఆర్ట్ ని నేర్పకుండా టోర్నమెంట్లు పెట్టుకుంటూ డబ్బు సంపాదించుకుంటున్న మాస్టర్లు బోలెడు మంది ఉన్నారు. కొన్నాళ్ళు ఒక సంస్థలో నేర్చుకుని వేరు కుంపటి పెట్టుకున్న వాళ్ళు ఎందఱో ఉన్నారు. నేను  చెప్తున్నది ఒక ఇరవై అయిదేళ్ళ క్రిందటి మాట. ఆనాటి మాస్టర్లు చాలామంది స్కూల్స్ మూసేసి ఈనాడు ఇతర వ్యాపారాలలో స్తిరపడ్డారు. చాలామంది అమెరికాకు వెళ్ళిపోయి సాఫ్ట్ వేర్ రంగంలో స్తిరపడ్డారు. నాకు తెలిసిన హైదరాబాద్ మాస్టర్లు కొందరు   ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నారు.


బ్రూస్లీ పుణ్యమాని ప్రపంచవ్యాప్తంగా వీరవిద్యలకు ఒకప్పుడు డిమాండ్ వెల్లువెత్తింది. కాని జనాలకు తెలియక కరాటే నేర్చుకోవడం మొదలు పెట్టారు. బ్రూస్లీ అభ్యాసం చేసింది కరాటే కాదు. అతను కుంగ్ఫూ నేర్చుకున్నాడు. తర్వాత చాలా దేశాల వీరవిద్యలనుంచి చాలా టెక్నిక్స్ కలగలిపి ఒక సాంబార్ వండాడు. దానిపేరు 'జీత్ కునే డో'. ఇదంతా జనాలకు తెలియక 1970 -80  దశకాల్లో  'కరాటే' విద్య వైపు పిచ్చిగా మళ్ళారు. అప్పట్లో మన దేశంలో కుంగ్ఫూ నేర్పేవాళ్ళు చాలా తక్కువగా ఉండేవారు. చాలామందికి కరాటే కుంగ్ఫూ విద్యల మధ్య తేడా తెలీదు. రెండూ ఒకటే అనుకునేవాళ్లు ఇప్పటికీ చాలామంది ఉన్నారు.


కరాటేని దాదాపు పదేళ్ళు అభ్యాసం చేసిన తర్వాత  అదంటే నాకు మొహం మొత్తి ఇతర విద్యల వైపు మళ్ళడానికి కొన్ని కారణాలున్నాయి. మొదటిది - టోర్నమెంట్ కరాటే అసలు కరాటేనే కాదు. అదొక చెత్త. పాయింట్ సిస్టం పెట్టి శుద్ధమైన కరాటేని ఖూనీ చేశారు. కరాటే టోర్నమెంట్లలో  జరిగే రాజకీయాలు అన్నీఇన్నీకావు.అందులో కులమూమతమూ జోరబడ్డాయి. ప్రాంతీయాభిమానాలూ భాషాభిమానాలూ ఉన్నాయి. ఇక టోర్నమెంట్డలో డబ్బు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రేపు టోర్నమెంట్ అనగా రాత్రికి మాస్టార్ని బారుకు తీసుకుపోయి పార్టీ ఇచ్చి మందు పోయించి మర్నాడు పోటీలో మార్కులు కొట్టేసి పతకాలు సంపాదించిన ఘనులు నాకు తెలుసు. తాగి పడిపోయి టోర్నమెంట్ కి ఆలస్యంగా ఉబ్బరించిన మొహంతో వచ్చిన మాస్టర్లూ నాకు తెలుసు.


ఈ కుళ్ళుని అలా ఉంచితే, అసలు కరాటే సిలబస్ కూ, నేర్చుకున్న విద్యకూ, టోర్నమెంట్ లో జరిగే 'డాన్స్' కూ పోలికే ఉండదు. ఏళ్లకేళ్ళు కష్టపడి నేర్చుకున్న "కటాస్" టోర్నమెంట్లో ఎందుకూ పనికిరావు. కటాలలో నేర్చుకున్న ఏ ఒక్క టేక్నిక్కూ టోర్నమెంట్లో ఉపయోగపడదు. ఉపయోగపడని టెక్నిక్స్ అలా ఏళ్లతరబడి ఎందుకు నేర్చుకోవాలో ఏ ఒక్క మాస్టారూ చెప్పడు.చెప్పటానికి వాడికే తెలిసిచావదు. క్లాస్ లోనేమో గంటలుగంటలు చెమటోడ్చి ఒళ్ళొంచి కటాస్ నేర్చుకుంటారు.టోర్నమెంట్లో కొచ్చేసరికి కోతిలా ఎగురుతూ చెత్తచెత్త మూమెంట్స్ తో ఏవో మార్కులు కొట్టేయ్యాలని చూస్తారు. ఇది చూడటానికి చాలా చండాలంగా ఉంటుంది. టోర్నమెంట్ కరాటేకూ నిజమైన కరాటేకూ పోలికే లేదు.


నిజమైన కరాటే ప్రాణాపాయ పరిస్తితుల్లోంచి పుట్టింది. ప్రాచీన జపాన్లో అది నేర్చుకోకపోతే సైనికుల చేతుల్లోనో బందిపోట్ల చేతుల్లోనో వాడికి చావు మూడినట్లే. కనుక చాలా సీరియస్ గా ఆ విద్యని నేర్చుకునేవారు.ఆనాటి అభ్యాస విధానాలు కూడా వేరు. ఈనాటి కరాటేని చూస్తె ప్రాచీన యోధులు 'ఇదొక వీరవిద్యా?' అంటూ నవ్వుతారు. అంత చెత్తగా తయారైంది నేటి కరాటే. టోర్నమెంట్ కరాటే అనేది కోతిగంతులు తప్ప ఇంకేమీ కాదు. టోర్నమెంట్లో మెడల్స్ తెచ్చుకున్న వాళ్ళు స్ట్రీట్ ఫైట్ లో మామూలు మనుషులచేతిలో బాగా దెబ్బలు తిన్న సంఘటనలు చాలా ఉన్నాయి. టోర్నమెంట్ కరాటే నిజజీవితంలో పనికిరాదు. ఈ విషయం అర్ధమైన తర్వాత నిజజీవితంలో స్ట్రీట్ ఫైట్ లో పనికొచ్చే కరాటే (లేదా ఇతర వీరవిద్యల) టెక్నిక్స్ మీద నా దృష్టి పెట్టడం సాగించాను. ఇదంతా 1980 -90 మధ్యలో జరిగింది. ఆ రోజుల్లో రోజుకు మూడు నాలుగుగంటల ప్రాక్టీస్ చేసిన రోజులు చాలా ఉన్నాయి.


తర్వాత మార్షల్ ఆర్ట్స్ లో నాకు నచ్చని ఇంకొక అంశం -- నాది 'ఫలానా స్టైల్' అని గిరిగీసుకోవడం.ఇది నాకస్సలు నచ్చేదికాదు. అందుకే అన్ని మార్షల్ ఆర్ట్స్ నుంచీ ఎన్నో టెక్నిక్స్ నేను అభ్యాసం చేసేవాణ్ణి.నా శిష్యులకు కూడా నేర్పించేవాణ్ని.నా శిష్యులలో మంచి ఫైటర్స్ చాలామంది ఉన్నారు. కాని ప్రాణవిద్యాస్థాయికి ఎదిగిన వాళ్ళు ఒక్కరూ లేరు.ఈ విషయంలో బ్రూస్లీని మెచ్చుకోవాలి. 'గిరి గీసుకుని కూచుంటే ఆ గిరి బయట ఉన్న విజ్ఞానం మనకు దూరం అయినట్లే' అని అతను భావించేవాడు. అందులో చాలా వాస్తవం ఉంది. ఒక రకంగా నేడు అమెరికాలో బహుళ ప్రచారంలో ఉన్న 'మిక్సేడ్ మార్షల్ ఆర్ట్స్ స్టైల్' (M.M.A)కు ఇతనే ఆద్యుడని చెప్పవచ్చు.


నేను నేర్చుకునే రోజుల్లో చాలామంది కొట్లాటకు పనికొచ్చే నాలుగు టెక్నిక్స్, నాలుగు కటాస్ నేర్చుకుని 'నాకు కరాటే వచ్చేసింది' అనుకునేవారు. నాకేమో అంతటితో సంతృప్తి ఉండేది కాదు. దీనిలో ఇంకా ఏదో లోతు ఉంది అని నా మనసుచెప్పేది. ప్రాణవిద్యా రహస్యాలు, మర్మవిద్యా రహస్యాలు ఎవరూ స్కూళ్ళలో చెప్పరేమిటి? అవన్నీ ఏమి పోయాయి?అని నాకు అనిపించేది. అసలైన రహస్యవిద్య ఇది కాదు, ఇంకేదో ఉంది అని నాకు లోలోపల అనిపించేది. అదొకటి ఉందని నాకు ఎవరో లోపల్నించి చెప్తున్నట్టు ఉండేది.


తర్వాత ఆ ఫీల్డ్ లో ఎంతో రీసెర్చి చేసిన అనంతరం మర్మవిద్యా రహస్యాలు నాకు అవగతమయ్యాయి. నేడు 4th degree, 5th degree black belts అని చెప్పుకునే వారికి కూడా ప్రాణవిద్యా  రహస్యాలు తెలీవని నేను గట్టిగా చెప్పగలను. కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉన్నవారికి కూడా మర్మవిద్యలో ఓనమాలు తెలియవు. అవి ఏ స్కూల్స్ లోనూ నేర్పరు. నేర్పడానికి అసలు వాళ్ళకే అవి తెలియవు. ఒక్క కేరళలోని 'కలరిపయట్' విద్యలో మాత్రం ఇంకా ఆ రహస్యాలు మిగిలి ఉన్నాయి. కాని వాటిని నేర్పే మాస్టర్లు అక్కడా అంతరిస్తున్నారు. వాటిని ఎవరికి పడితే వారికి చచ్చినా నేర్పరు. శిష్యుడిపైన ఎంతో నమ్మకం కుదిరితే కాని ఆ రహస్యాలు చెప్పరు. మర్మవిద్యతో పోలిస్తే నేటి కరాటే పరమచెత్తవిద్య అని నేను అనుభవ పూర్వకంగా చెప్పగలను. కాని అది నేర్చుకోవాలంటే ఒక ప్రాచీనకాలపు గురుకులంలో చేరి గురువుకు సేవచేస్త్తూ నిష్టగా విద్య నేర్చుకునే శిష్యుడికి ఉండే లక్షణాలు ఉండాలి.ఒక యోగవిద్యా సాధకుడికి ఏఏ నైతిక విలువలూ లక్షణాలూ ఉండాలో మర్మవిద్యా సాధకుడికి కూడా అవే ఉండాలి.ఆ స్థాయిలో విలువలు పాటిస్తూ అసలైన విద్యను నేర్చుకునే శిష్యులే ప్రస్తుతం లేరు. ఇదొక విచిత్ర సంకటంలా ఉంది. అర్హత ఉన్నవాడికే ఈ విద్యను నిస్వార్ధంగా నేర్పించాలి. ఆ అర్హత ఉన్నవాడు మాత్రం ఎక్కడా దొరకడు. చాలా విద్యలు ఇలాగే నశించి పోయాయని నాకు చాలాసార్లు అనిపిస్తుంది.


కేరళలో మర్మవిద్యా గురువులు ఎందఱో తమ రహస్యాలను ఎవరికీ చెప్పకుండా అలాగే వెళ్లిపోయారు. కొందరైతే తమ తాటాకు పుస్తకాలను కాల్చేసి మరీ చనిపోయారు. ఇదేంటి అని అడిగిన కొందరికి 'అర్హత ఉన్నవాడికి వాడి తపనే అంతా నేర్పిస్తుంది' అని మాత్రం చెప్పారుట. ఈ విషయం కేరళలో ఒక 'కలరి' లో విన్నాను.


నిజమైన తపన ఉన్నవాడికి, అది ఏవిద్య అయినా కావచ్చు, అందులో సంతృప్తి మాత్రం ఉండదు. ఉండకూడదు. అప్పుడే వానికి నిరంతర పురోగతి కొనసాగుతూ ఉంటుంది. ఒక విద్యను నేర్చుకోవాలంటే దానికోసం తపించాలి. గురువులకోసం వెదకాలి. సమయమూ ధనమూ వెచ్చించాలి. అదొక జీవితాశయంగా మారినప్పుడే ఇదంతా సాధ్యమౌతుంది. గ్రాండ్ మాస్టర్ ఒయామా అలాంటి తపనతోనే 'క్యోకుశింకై కరాటే'ను మొదలు పెట్టాడు. కొన్నాళ్ళకు అదీ ఒక నిర్బంధచట్రంలా తయారైంది. ఆ నిర్బంధం నచ్చని కొందరు దాన్నుంచి బయటకొచ్చి 'అషిహర కరాటే' మొదలు పెట్టారు. కొన్నాళ్ళకు అదీ నచ్చని ఇంకొందరు మళ్ళీ విడిపోయి 'ఎన్షిన్ కరాటే' మొదలు పెట్టారు.  ఇంతా చేస్తే మొదటి దాంట్లో మొద్దు బలానికీ లీనియర్ మూమెంట్స్ కీ ప్రాధాన్యత ఉంటె, రెండవ మూడవ స్టైల్స్ లో స్పీడ్ కీ సర్కులర్ మూమెంట్స్ కీ ప్రాధాన్యత  ఉంటుంది. ఇంతే తేడా. 'సబాకి' అనే టెక్నిక్ తోనే రెంటి మధ్యా తేడా వస్తుంది. ఈ 'సబాకి' అనే టెక్నిక్, కుంగ్ఫూ విద్యలోని 'వాటర్ ప్రిన్సిపుల్' నుంచి పుట్టింది. వైట్ క్రేన్,ప్రేయింగ్ మాంటిస్, వింగ్ చున్ మొదలైన కుంగ్ఫూ స్టైల్స్ లో ఇదే ప్రధానసూత్రం. ఇది సాప్ట్ స్టైల్స్ లో వాడేటటువంటి విధానం. హార్డ్ స్టైల్స్ కు ఇది తెలీదు.మరి రెండూ ఒకదానిలోనే ఎందుకు ఇమడలేవు?  లీనియర్ మూమెంట్స్, సర్కులర్ మూమెంట్స్, హార్డ్ టెక్నిక్స్, సాఫ్ట్ టెక్నిక్స్ ఒకే స్కూల్లో ఎందుకు కలిసిమెలిసి ఉండలేవు? అనేది నా ప్రశ్న. ఈ ప్రశ్నే నన్ను మార్షల్ ఆర్ట్స్ లో రీసెర్చికి పురికొల్పింది.


పందెపు ఎద్దులను కూడా ఒకే గుద్దుతో మట్టి కరిపించిన గ్రాండ్ మాస్టర్ 'ఒయామా'చివరికి హాంకాంగ్ లో ఒక బలహీనంగా కనిపిస్తున్న ముసలివాడి చేతిలో ఓడిపోయాడని చెప్తారు.ఆ ముసలివాడు 'తాయ్ చీ' విద్యలో అఖండుడు. అతని గురించి ఒయామా ఎంతో విన్నాడనీ, కాని అతనితో ఫైట్ చెయ్యాలని హాంగ్ కాంగ్ వెళ్ళిన ఒయామా,సన్నగా ఒక పేషంట్లా ఉన్న అతన్ని చూచి, అసలితను ఒక మాస్టరేనా అన్న అనుమానంతో, గుద్దితే అతను చనిపోతాడేమో  అన్న భయంతో,  ఫైట్ చెయ్యకుండా వెనక్కి వెళ్ళిపోదామని అనుకున్నాడనీ అంటారు.


"ఇక్కడి దాకా వచ్చావుకదా, 'తాయ్ చీ' ఎలా ఉంటుందో కూడా చూడు" అన్న ముసలిమాస్టర్ ఆహ్వానంతో బరిలోకి దిగిన ఒయామా కొద్ది నిముషాలలోనే, అతన్ని ఓడించడం అసాధ్యం అన్నసంగతి గ్రహించాడు.ఒయామా ప్రయోగించిన పంచెస్ కిక్స్ అన్నింటినీ ముసలిమాస్టర్ అతి సులభంగా న్యూట్రలైజ్ చెయ్యగలిగాడు. ప్రత్యేకమైన 'చెన్ స్టైల్ తాయ్ చీ' టెక్నిక్స్ ఉపయోగిస్తున్న ఆ ముసలి మాస్టర్ను ఒయమా గుద్దులు అసలు తాకలేకపోయాయి. చాలాసేపు ఫైట్ చేసిన అనంతరం 'ఒయామా' ఆయాసంతో కూలబడ్డాడు. కాని ముసలి మాస్టర్ మాత్రం నవ్వుతూ మామూలుగా ఉన్నాడు. 'ఈ రహస్యం ఏమిటి?' అని అడిగిన ఒయామాకు ' నీది మామూలు కండబలం.నాది ప్రాణశక్తి. అందుకే నువ్వు అలిసిపోతున్నావు. నాకు అలుపు లేదు.నీవి లీనియర్ మూమెంట్స్. నావి సర్కులర్ మూమెంట్స్.నీ శక్తిని నీవు ఉపయోగిస్తున్నావు.నేనేమో నీశక్తిని తిప్పి నీమీదే ప్రయోగిస్తున్నాను.నీ శక్తి ఖర్చై పోతున్నది. నా శక్తిలో మార్పు లేదు. అదీ మనిద్దరికీ తేడా.' అని 'తాయ్ చీ' మాస్టర్ జవాబిచ్చాడు. ఈ సంఘటన జరిగిన తరువాతే క్యోకుశిన్ కరాటేలో సర్కులర్ మూమెంట్స్ కి ప్రాధాన్యత పెరిగింది అని ఒక వాదన ఉన్నది. పాయింట్ అండ్ సర్కిల్ మెథడ్ మీదే క్యోకుశిన్ కరాటే ఆధారపడి ఉంటుంది.


కండబలం మీద ఆధారపడే మొద్దువిద్యలకూ, ప్రాణశక్తి మీద ఆధారపడే వీరవిద్యలకూ చాలా తేడా ఉంటుంది. అది విశ్వామిత్రుడికీ వశిష్టుడికీ  మధ్య ఉన్న తేడా లాంటిది. కండబలం త్వరగా వస్తుంది. త్వరగా పోతుంది. ప్రాణశక్తి త్వరగా రాదు. ఒకసారి పట్టుపడితే ఎన్నటికీ పోదు. కండబలానికి పరిమితులు ఉంటాయి.ప్రాణశక్తికి లిమిట్స్ లేవు. కండబలం తిండినుంచి,వ్యాయామంనుంచీ  వస్తుంది. ప్రాణశక్తి ప్రకృతిలో అమితంగా ఉంది. దాన్ని శరీరంలోనికి స్వీకరించే రహస్యం తెలిస్తే దానికి అంతంటూ ఉండదు. అదేన్నటికీ నశించదు కూడా.


కరాటే స్కూల్స్ మధ్యకూడా హార్డ్ సాఫ్ట్ అంటూ తేడాలు పెట్టుకుని గిరిగీసుకుని శత్రుత్వాలు పెంచుకుంటూ ఉంటారు.ఉదాహరణకి శోటోకాన్  కరాటే అనేది హార్డ్ స్టయిల్. గోజుర్యు కరాటే అనేది సాఫ్ట్ స్టయిల్. ఇలా గిరి గీసుకోవడం వల్లే ఒక స్కూల్ కీ, ఇంకొక స్కూల్ కీ  మధ్య గొడవలు విభేదాలు పెరిగిపోయాయి. అజ్ఞానంతోనే ఇలాంటి గిరి గీసుకోవడం జరుగుతుంది. ఇది మంచిది కాదని నా ఉద్దేశం.


ఏ హార్డ్ స్టైల్ అయినా సాప్ట్ స్టైల్ లో ఉన్న రహస్యాలు కూడా అవగతం చేసుకున్నప్పుడే దానికి సార్ధకత ఏర్పడుతుంది. ఎందుకంటే సాప్ట్ స్టైల్ అనేది ప్రాణవిద్య మీద ఆధారపడి ఉంటుంది.  మొద్దుబలం పనికి రాదు అన్న విషయం మనిషికి నిదానంగా తెలుస్తుంది. సాప్ట్ స్టైల్స్ అంత  త్వరగా పట్టు చిక్కవు.మామూలు కరాటేను నేర్చుకోవడానికి ఒక అయిదేళ్ళు సరిపోతే, సాఫ్ట్ స్టైల్ కరాటే నేర్చుకోవడానికి పన్నెండేళ్ళు పడుతుంది. అసలైన 'తాయ్ చీ' విద్యను ఫైట్లో సమర్ధవంతంగా వాడాలంటే వెయ్యిమందిలో ఒక్కరే ఆ పని చెయ్యగలరు.కారణం,వారికి ప్రాణశక్తి యొక్క రహస్య విజ్ఞానం అనుభవం లోకి రావాలి. అది అంత త్వరగా పట్టు చిక్కదు. దానికంటే జిమ్ కెళ్ళి కండలు పెంచడం అతి సులభం. ఆ కండలు మళ్ళీ కరిగిపోవడమూ అంతే త్వరగా జరిగిపోతుంది.


అందుకే నా అనుభవంతో నేను తయారు చేసుకున్న స్టయిల్ కి 'ఇంటెగ్రల్ మార్షల్ ఆర్ట్' అని పేరు పెట్టుకున్నాను. ఇదీ ఒక రకమైన మిక్సేడ్ మార్షల్ ఆర్టే అని చెప్పవచ్చు. యోగవిద్యా రహస్యాలు కలిసిన ఈవిద్య ఒక పరిపూర్ణ వీరవిద్య అని నేను భావిస్తాను. మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలో ఉన్న కుళ్ళు నన్ను ఈరకంగా కాపాడింది అని, అసలైన వీరవిద్యకోసం వెదికేలా చేసింది అనీ, నాదైన ఒకవిద్యను నాకు చూపింది అనీ ఎప్పుడూ అనుకుంటాను. చెడునుంచి  కూడా మంచిని తీసుకోవచ్చు అంటే ఇదేనేమో?