నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

25, ఫిబ్రవరి 2012, శనివారం

విస్మృత యాత్రికుడు

శాంతి కొఱకై వెదకితి నెన్నొ ఏండ్లు
దిక్కులన్నిట జూచితి నీడ కొరకు
అర్ధమయ్యెను కడకొక్క సత్యమింక   
నేను వెదకెడి శాంతియు నీడ నేనె

శాంతి లేదెంత వెదకిన నా యందుదప్ప  
బహువాకిళ్ళ బిచ్చమెత్తితి ప్రేమకొరకు
పరువులెత్తితి కోరితి దాహశాంతి   
లేదెచటనోయది నా హృదంతరాలపు సీమదప్ప

తీర్ధ యాత్రల దిరిగితి అనుగ్రహార్ధినై 
ఎంత మూర్ఖుడ నేను?
వెదకుచుంటిని సుదూరసీమలందు
హృదయాగాధపు లోతుల నెపుడు
వెలుగుచున్నట్టి శాంతిని కానలేక 
ఎంత మూర్ఖుడ నేను?
యోజనములు పరుగిడి వెదకుచుంటి
నిజయాత్ర నాలోన వేచియుండ

కస్తూరి జింక తన సుగంధ భ్రాంతి చేత 
వనమునంతయు దిరిగి వేసారినట్లు 
నావ కొసను నిలచియున్న పక్షికి 
నీడ చూడగ నెక్కడ దొరకనట్లు  
కొలనిలోన విహరించెడు  మీనుకేమొ
దాహ భ్రాంతిని గొంతెండి పోయినట్లు 

ఏ గృహపు ముంగిట నింక నర్ధించబోను
ప్రేమార్దినై వెతల నందబోను
వెదకులాటలు ప్రయాస వేసరములు 
స్వచ్చమౌ ప్రేమ లేదను మాట నిజము.

ప్రేమకోరకై బిచ్చమెత్తితి వీధులందు 
స్వార్ధమే కనిపించే నన్నిచోట్ల 
ప్రేమముసుగున, నింక ఈ ఆట చాలు
విరమించెద నీ జూదక్రీడ ఇదియె మేలు

ఆశ పెకలించి నాలోనె విశ్రమింతు 
ఎవరినైనను ఇకనేమి కోరబోను
ఎంత యద్భుత మిది జూడ ఏమి వింత 
ముగియనున్నది యుగయుగాల వెదుకులాట 

ఎంత మూర్ఖుడ నేను?
వేచి యుంటిని నీకొరకు వేలఏండ్లు 
రమ్ము నాయెద్ద కంచును చేయిసాచి 
వెదకుచున్నది నాలోనె దాగియుండ
వెదకుచుంటిని లోకాన వేసరిల్లి 

మృతిని పొందితి నెంతయు నెన్నొమార్లు
మరల పుట్టితి జూడగ నన్నిసార్లు
పరువులెత్తితి మరీచిక వీధులందు 
తేటయయ్యె సత్యమిపుడు తేరిచూడ

ఇంతకాలము నేనిట వెదకు ప్రేమ 
నిలిచియున్నది నాలోన మౌనముగను
చేయి సాచుచు రమ్మను తల్లివోలె 
వేయి తప్పులు క్షమియించు తల్లివోలె 

ప్రేమించినంతసేపు నా చిన్నబ్రతుకును
చావు వెంటాడె నన్ను నా నీడవోలె 
నాఇల్లు వదలి నే బయలు వెడలినపుడు 
లోకమే నా ఇల్లయి నిలచేనిపుడు

మృతికి వెరువను నేనిక ఎన్నడైన
దాని రమ్మంటి నావైపు చేయి సాచి
మిత్రుడయ్యెను నాకది ఏమి వింత?
బోధించెనొక నిగూఢరహస్యము నిశ్చయముగ
చావు బ్రతుకులనన్నిటి మించి వెలుగు
విశ్వజీవితజ్ఞానము తెల్లమయ్యె  

స్వప్నముల చిక్కుట కల్ల ఇంక
దేబిరించుట లెల్లను దూరమయ్యె
రుతువులోచ్చును పోవును రోజుమారు 
పెరిగి తరుగును లోకము లీలయందు 
నాయందు నేనుందు నిశ్చలముగ
నిర్మలాకాశరీతిని నెమ్మదించి 

నియమాల నన్నిటి నే ధిక్కరింతు
సాగెద జీవితాన నా ఇష్టరీతి
నేనొక ఉన్మత్తుడనని తలచిరి లోకులెల్ల  
తలువనిమ్ము వారికి తోచినట్లు 
నాకు తెలియును నాదగు తత్వమేమొ 

చల్లగాలుల నేనిక సాగిపోదు
వేడిగాడ్పుల జేసెద నాట్యరవళి
సాగిపోయెడి  మబ్బుల తేలిపోదు
కురియు వానల జల్లుల నేలబడుదు
భూమిలోపల కింకుచు దాగిపోదు 
గగనసీమల రేగుచు విక్రమింతు 
మృతిని మించుచు లేచెడి పక్షివోలె

జీవనుల యందలి జీవితమ్ము నేను
మృతుల ఘూర్ణించు తమోగుణధృతియు నేనె
జీవనమ్మున రేగేద విస్తరించి
ముదము నొందెద మృతిలోన మునిగియుండి

వర్షధారల నర్తించు వృక్షమేను
గగనసీమల పారెడి మబ్బు నేను
స్థిరత నిలచెడి పర్వతరాజమేను
సంద్రమును చేర పరువెత్తు నదిని నేను

ప్రేమికుల గాఢ పరిష్వంగసుఖము నేనె
నిరాశాదృక్కుల దోచు ఎడారి నేనె        
దిక్కులేని బతుకుల వ్యధయు నేనె  
ధన్యజీవుల జీవనతృప్తి నేనె
కష్టజీవుల కడగండ్లపాట్లు నేనె
చక్రవర్తుల రాజసదీప్తి నేనె

గగనసీమల సాగెడి పక్షి నేను
సంద్రమున ఈదెడి మీను నేను
భీకరమ్ముగ చెలరేగి బాధపెట్టు
మృత్యువిహ్వల ప్రచండమూర్తి నేను 
జగతి నిదురించు నిశీధ సమయమందు 
నిద్రలేకుండ రాజిల్లు మౌనమేను   

ఏకాగ్రచిత్తుడౌ యోగి నేత్రాలలో 
తెరపులేక జ్వలించు ఎరుక నేను
కాటికేగెడి శవాల తోడునీడ
సాగిపోయెడి మృత్యువు చాయ నేను

కొండలోయల ఆనందనృత్యమాడు 
పిల్లగాలుల తేలెడి పువ్వు నేను
శిశిరఋతువున పండుచు రాలిపోవు
మట్టి కలసెడి విశీర్ణ పత్రమేను 

తనదు బిడ్దను ముద్దిడు తల్లియందు
కరగిపోదును నేనిక ప్రేమ నగుచు 
ప్రేమతాపపు మంటల కాగిపోవు 
యువకరక్తపు ఎర్రనిఛాయ నేను
ప్రేమ బెంచిన సుతుల చీదరింపులతో
కుమిలి ఏడ్చెడి వార్ధక్యవ్యధలు నేను   

గుండెలోతుల ధ్వనియించు నాదమేను
ధ్యాని చవిచూచు ఆనందసీమ నేను
స్వప్నసీమల తోచెడి వెలుగు నేను
చెక్కుచెదరని యోగుల దృష్టి నేను

బ్రహ్మచారుల తేజపు వెలుగు నేను
పైకిలేచెడి యోగపు శక్తి నేను
సాదుమూర్తుల పవిత్రదీప్తి నేను
జ్ఞానిచూపుల కరుణాసంద్రమేను

సూర్యకాంతుల నాట్యమొనరింతు నేను  
మృతిని బోలెడు రాత్రుల విశ్రమింతు
వీరయోధుల శక్తియు యుక్తి నేను
ఓడిపోయెడి వారల సిగ్గు నేను

యాచకుని ఆకలి యందు నుందు
ధనపు మదమున తూలెడి మత్తు నేను
యవ్వనమ్మున రేగెడి శక్తి నేను
వణకుచుండెడి వార్ధక్యస్తితిని నేను
శిశువు కన్నుల మెరసెడి నవ్వు నేను
శక్తిహీనత పడియుండు శవము నేను

రాత్రిచుక్కల మెరపుల మేళవింతు
సాంద్రఘోషల నెగసెడి  శబ్దమేను
మంద్రగతి సాగెడి నదిని నేను
సడిలేక నిలచు గంభీరసంద్రమేను

లోకరీతుల నన్నిట నేనె యుందు  
అష్టదిక్కుల నిండెద విస్తరించి
వేడినిచ్చెడి వెలుగులరేడు నేను
చల్లచల్లని చందురు కాంతి నేను 
 
మౌనధ్యానపు లోతుల ఉబికివచ్చు
స్వర్లోక సుమధుర గానమేను  
రాత్రిఝాముల నిశ్శబ్దసీమయందు
వినగవచ్చెడి వేణువు నాదమేను    

ముసిగ నవ్వెడి ముగ్ధంపు శిశువు నేను
కామజ్వాలల తపియించు కాంక్ష నేను
కర్రయూతాన వణకెడి ముసలి నేను
చితిని మండెడి నికృష్టశవము నేను

కసాయి కత్తి కరకుదనము నేనె
గొంతు తెగిపోవు జంతువు గూడ నేనె
కుష్టురోగుల వ్రణముల రసిని నేను  
నష్టలోకపు నిరాశ ఛాయ నేను.

తల్లిపాదాల చెంతన నేర్చుకొంటి 
ధన్యజీవిత రహస్యజ్ఞానమేల్ల
బ్రతుకుటెట్టులో మరి చచ్చుటెట్లో   
నేర్పే మాయమ్మ తన జీవయాత్ర చేత
     
అమ్మ మాటల నెప్పుడు ఆచరించి
బ్రతికేదను రోజు మరియును చత్తునట్లే
జీవింతు ప్రతిక్షణము మరుక్షణమున చత్తునటులే
బ్రతికియుందును మృతియందు చిత్రముగను

మృతిని బొందెద ప్రతిరోజు మానకుండ    
తిరిగిలేచేద మరునాడు శిశువువోలె 
తేటకన్నుల చూచెద లోకమెల్ల
అమ్మ నేర్పిన రహస్యజ్ఞానమిదియె

జోలపాటల నూగితి నెన్నొమార్లు
కాలిపోయితి చితిలోన అన్నిసార్లు
కనులు తెరచితి నిప్పుడు నిశ్చయముగ 
కనుక వాటి చాయలకింక పోను

స్వప్నభ్రాంతిని బోలెడు లోకమెల్ల 
కనుల ముందర కదలాడి సాగిపోవు
నన్ను తాకంగ దానికి శక్తిలేదు      
చూతునన్నిటి నొక మౌనసాక్షి వోలె
మూలనిలచిన అదృశ్యఆత్మ వోలె

సాటిజీవుల బాధలు పట్టకుండ
పూజచేయగ చూచి నవ్వుకొందు
మార్పులేనట్టి జీవనరీతి జూచి
పొరలి నవ్వుదు నెంతయు వేడ్కతోడ
గుడ్డిగురువుల చేష్టల గుర్తుబట్టి
నవ్వుకొందును వారల గతులనెరిగి  

సురలనొల్లను, నెప్పుడు చూడబోను
వారలందరు నన్నిట వదలిపోరు
ధిక్కరింతు నందరి పొండు పొండనుచు       
కాని అంతయు నాదె ఇదియె వింత 

అడిగిరేవ్వరొ నన్ను-- గుడులు గోపురాలు తిరుగవేల?
అతనినడిగితి నోక్కగు వింత ప్రశ్న
మనిషి హస్తము తాకని దేవళమును 
చూపుమా పరుగెత్తిపోయేద నచటికంచు

ఒకరనిరి నాతోడ ఒక్కరోజు
పూజమానిన నరకాన పడేదవంచు
పొరలినవ్వితి వానిజూచి పక్కుమంచు
స్వర్గనరకాలు నాలోని కలలు జూడ      
ఎచటికేగేద నేను? ఎట్లు బోదు?

జనులు నవ్విరి నన్నుజూచి
పనికిమాలిన వాడవు నీవటంచు
నేనును నవ్వితిని వారిజూచి
నిజము మీరలు చెప్పెడి మాట నిజము   

పనులన్నియు నన్ను విడచి పారిపోయె
సర్వనక్షత్రసీమల నావరించు
శూన్యమునదూరితి శూన్యమైతి
పనికిమాలినవాడనె పచ్చినిజము

నాదుకన్నుల దోచెడి శూన్యదృష్టి
జనులమనమున భయమును దోపచేయు
వారు నన్నొక జడుడవనిరి
నేను నవ్వెద వారల శ్రుతిని గలిపి
పొరలి నవ్వెద లోకుల పాటుజూచి

చంపువాడును మరియిక చచ్చువాడు
చంపు క్రియయును ఈమూడు కలసిపోయి
కలల రీతిని నాలోనె  కానుపింప    
ఏమి చేయంగ గలవాడనింక నేను?

లోకలీలను చూచుచు సంతసింతు
అంతరంగాన నవ్వుల తేలిపోదు
ఉన్నవన్నియు లోకాన చక్కగానె
చావుపుటకల జూచితి నే జన్మయందో
మరచిపోయితి వానిని ఇప్పుడింక
read more " విస్మృత యాత్రికుడు "

18, ఫిబ్రవరి 2012, శనివారం

హోమియోపతి-మరికొన్ని కేన్సర్ ఔషధాలు

నిజానికి హోమియోపతిలో ఈ రోగానికి ఈ మందు అని ఉండదు. అదే హోమియోపతి వైద్య విధానంలోని విచిత్రం. ఇది వినడానికి కొంచం చిత్రంగా ఉంటుంది. కాని కొంత వివరణ తర్వాత దీని వెనుక ఉన్న నిజం అర్ధం అవుతుంది. 

ఒకే రోగంతో బాధపడుతున్న ఇద్దరు వ్యక్తులకు రోగలక్షణాలు ఒకే విధంగా ఉండవు. ఇద్దరిలోనూ రోగం ఒకే స్థాయిలో ఉండదు అని కాదు దీని అర్ధం. రోగం ముదిరిన తీరునుబట్టి దాని లక్షణాలు ఒకరోగికీ ఇంకొకరోగికీ భిన్నంగానే ఉంటాయి. రోగం యొక్క ఎదుగుదలను బట్టి ,దాని స్థాయిని బట్టి దాని లక్షణాలు ఉంటాయి. దీని గురించి నేను చెప్పటం లేదు. 

ఒకేస్థాయిలో ఉన్న ఒకేరోగంతో బాధపడే ఇద్దరు రోగులకు హోమియోపతిలో ఒకేమందు ఇవ్వడం జరుగదు. ఎందుకంటే ఇక్కడ రోగి యొక్క లక్షణాలు కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. శారీరిక మానసిక లక్షణాలు ఏ ఇద్దరికీ ఒకే విధంగా ఉండవు. ఈ శారీరిక మానసిక లక్షణాలు అనేవి మన పూర్వీకులనుంచి జీన్స్ రూపంలో సంక్రమిస్తాయి. వాటికి తోడు రోగలక్షణాలు కలుస్తాయి. కనుక వాటిని లెక్కలోకి తీసుకోకుండా చేసే వైద్యం శాస్త్రీయ వైద్యం అనిపించుకోదు. ఈ కోణంలో చూచినపుడు, ఒకే స్థాయిలో ఉన్న ఒకే రోగంతో బాధపడే ఇద్దరు వ్యక్తుల లక్షణాలు భిన్నంగా ఉండటం చూడవచ్చు. కనుక ఆ ఇద్దరికీ రెండు వేర్వేరు మందులు సూచింపబడతాయి. హోమియోపతిలో రోగంతో బాటు రోగిని కూడా చాలా సూక్ష్మంగా పరిశీలించడం జరుగుతుంది. అల్లోపతిలో రోగాన్ని మాత్రమే పరిశీలించడం ఉంటుంది. రోగం శరీరంలో తీసుకొచ్చిన మార్పులు మాత్రమే అక్కడ ప్రాముఖ్యతను పొందుతాయి. వారికి రోగి యొక్క మానసిక స్తితి అనవసరం. అందుకనే, చాలామంది అల్లోపతీ వైద్యులు, రోగి చెబుతున్న విషయాలు ఏమీ పట్టించుకోకుండా ఏదేదో ప్రిస్క్రిప్షన్ రాసి రోగి ముఖాన కొట్టడం సర్వసాధారణ దృశ్యంగా మనం చూడవచ్చు. ఇది సరియైన వైద్యం కానేకాదు.

హోమియోపతిలో ఉన్న అన్ని మందులూ సమయం సందర్భాన్ని బట్టి కేన్సర్ వంటి దీర్ఘరోగాల్లో బాగా పని చేస్తాయి.  లక్షణాలను బట్టి వీటిని వాడుకోవాలి. పోయిన సారి కోనయం గురించి వ్రాశాను. ఇప్పుడు మిగిలినవాటిలో కొన్ని మందుల స్వరూప స్వభావాలను ఇక్కడ పరిచయం చేస్తాను.

కార్బో ఏనిమాలిస్ 
ఇది యానిమల్ చార్కోల్. కర్బన కుటుంబానికి చెందిన మందులన్నీ దీర్ఘరోగాలలో అద్భుతంగా పని చేస్తాయి. ఎందుకంటే జీవం యొక్క పరమాణు నిర్మాణంలో కర్బనం (Carbon )ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దీర్ఘరోగాలలో, కణాలలోని కర్బనబంధాలలో మార్పులు వస్తాయి. ఆ మార్పులను పోటేన్సీలలో వాడే ఈమందులు పరమాణు స్థాయిలో సరి చేస్తాయి.

ఈ రోగులలో ప్రాణశక్తి బాగా క్షీణించి ఉంటుంది. కేన్సర్ కణుతులు వచ్చి ఉంటాయి. గ్రంధులు వాచి ఉంటాయి. సిరలు ఉబ్బి వాచి నీలంగా ఉంటాయి. బరువులెత్తడం వల్ల తేలికగా వీరు బాధలకు లోనవుతారు. శరీరంలో పుళ్ళు పడి అవి కుళ్ళుడుగా మారుతాయి. వీరి ఒంటిలోనుంచి వచ్చే స్రావాలు భయంకర దుర్వాసనగా ఉంటాయి. శరీరంలో ఏదో ఒక ప్రాంతంలో వాపులు ఉంటాయి కాని వేడి ఉండదు. ప్రాణశక్తి క్షీణతవల్ల శరీరవేడి తగ్గుతుంది. వాపు ఉన్నచోట వేడి ఉండాలి. అది లేకుంటే విచిత్రలక్షణంగా (peculiar symptom ) పరిగణించాల్సి ఉంటుంది. 

వీరు మనుషులతో కలవరు. మౌనంగా ఉండటానికి ఇష్టపడతారు. ఎప్పుడూ డిప్రెషన్ లో ఉంటారు.వీరిలో వినికిడి శక్తి అయోమయంలో ఉంటుంది. శబ్దం ఏ వైపునుంచి వస్తున్నదో చెప్పలేరు. జీర్ణక్రియ బాగా దెబ్బ తిని ఉంటుంది. పొట్ట కేన్సర్ ఉండవచ్చు. గాలి త్రేన్పులు, పొట్ట ఉబ్బరం, చికాకు ఉంటాయి. కొందరిలో పైల్స్ కూడా ఉండవచ్చు. స్త్రీలలో నెలసరి తర్వాత అమిత నీరసంగా ఉంటారు.స్తనాలలో మెరుపులలాగా (shooting pains ) నొప్పులు వస్తుంటాయి. పరీక్షించినప్పుడు వాటిలో గడ్డలలాగా చేతికి తగులుతాయి. ముఖ్యంగా కుడిస్తనంలో ఈ బాధలు ఎక్కువగా ఉంటాయి. గర్భాశయ కేన్సర్ ఉండవచ్చు. ఇలాటి వారిలో గర్భాశయద్వారం (cervix) వాచి ఉంటుంది.

శరీరంలో గ్రంధులు వాచి నొప్పిగా ఉంటాయి. మెడలో, చంకలలో, స్థనాలలో, గజ్జలలో గ్రంధులు వాచి ఉంటాయి. గ్రందుల్లో నొప్పులు దారుణంగా, కత్తితో కోస్తున్నట్లు, మంటతో కూడి ఉంటాయి.

కాడ్మియం మెటాలికం
ఇది ముఖ్యంగా పొట్ట కేన్సర్ మీద బాగా పని చేస్తుంది. ఆహారం గాని ద్రవాలు గాని తీసుకొని తీసుకోక ముందే వాంతి అయిపోతుంటాయి. వాటిని ఏ మాత్రం అరిగించుకోలేని స్తితిలో జీర్ణాశయం ఉంటుంది. వాంతి నల్లగా కాఫీ డికాషిన్ రంగులో ఉంటుంది. 

కాడ్మియం అనే మందు హోమియో ఔషధాలలో చేరకముందు ఎందఱో కేన్సర్ రోగులు బలైపోయారు. కాని ఈ మందు ప్రూవింగ్ అయిన తర్వాత ఎందఱో రోగులు కాపాడబడ్డారు.  వీటిలో కాడ్మియం బ్రోమేటం, కాడ్మియం సల్ఫ్, కాడ్మియం అయోడం మొదలైన ఇతర కాంబినేషన్ డ్రగ్స్ ఉన్నాయి. వాటి లక్షణాలు కూడా ఒకదానికొకటి విభిన్నం గా ఉంటాయి. ఉదాహరణకు కాడ్మియం బ్రోమేటం అనే మందు ఊపిరితిత్తుల బాధలమీదా ఉదరకోశ కేన్సర్ మీదా పనిచేస్తుంది. కాడ్మియం అయోడం అనేది పేగు కేన్సర్ మీదా, తదితర బాధల మీదా పనిచేస్తుంది. కాడ్మియం సల్ఫ్ అనేది నల్లని వాంతి అవుతున్న దశలోనూ, ముఖ పక్షవాతం లోనూ,ఇతర ఉదరకోశ కేన్సర్ స్తితులలోనూ పనిచేస్తుంది.

ఆర్సేనికం ఆల్బం
కేన్సర్ రోగం లో ముందుగా ఈ మందును చెప్పుకోవాలి. ఇందులో బాధలన్నీ అర్ధరాత్రి గానీ మిట్ట మధ్యాన్నం గానీ ఉద్రేకిస్తాయి. రోగి చాలా చికాకుగా ఉంటాడు. స్తిమితం ఉండదు. ఒకచోట ఉండలేదు. కోపంగా ఉంటాడు. చాలా నీరసంగా ఉంటాడు. వేడి పానీయాలు తాగితే ఇతనికి హాయిగా ఉంటుంది. రక్తం వాంతులు అవ్వవచ్చు. ఇతని బాధలన్నీ మంటలతో కూడి ఉంటాయి. అయినా సరే వేడి ఇతనికి హాయినిస్తుంది. ఇతనికి ఉదరకోశ కేన్సర్ ఉండవచ్చు. పొట్టలో వస్తున్న మంటలతో కూడిన బాధలు తట్టుకోలేక హాహాకారాలు చేస్తుంటాడు.
కార్సినోసిన్ 
ఇది కేన్సర్ కణుతుల నుండి తీసిన పదార్ధాన్ని పోటెన్సీలోకి  మార్చి రాబట్టిన మందు. హోమియో విధానంలో రోగి యొక్క స్రావాలనుంచే మందులు తయారు చేసే పద్దతి ఉంది. ఇలా తయారుచేసిన మందులను 'నోసోడ్స్' అంటారు. సూచింపబడుతున్న ఇతరమందులు ఏవీ పనిచెయ్యని స్తితిలో ఈ మందును వాడుతారు. అప్పుడు రోగి యొక్క ప్రాణశక్తి ఉత్తేజితమై, మళ్ళీ మందులను స్వీకరించి పనిచేసే స్తితికి వస్తుంది.అప్పుడు సూచింపబడుతున్న ఇతర మందులు మళ్ళీ వాడుకోవచ్చు. కొన్ని సార్లు సరాసరి కేన్సర్ బాధలమీద కూడా ఈమందు అద్భుతంగా పనిచేస్తుంది. ప్రాణశక్తి బాగా క్షీణించి కుప్పకూలిన స్తితిలో ఉంటుంది. రోగి చాలా నీరసంగా ఉంటాడు. పొట్టలో మండుతున్న బాధలుంటాయి. దొడ్డికి పోయినప్పుడు విపరీతమైన మంటగా ఉంటుంది. ఇతర కేన్సర్ లక్షణాలు ఉంటాయి.

హోమియోపతిలో కనీసం నూరుమందులు కేన్సర్ మీద పనిచేసేవి ఉన్నాయి.అవి రోగంలోని వివిధస్థాయిలలో వివిధబాధలలో ఉపయోగపడతాయి. లక్షణాలపరంగా జాగ్రత్తగా ఎంచుకొని సరియైన పోటేన్సీలో హోమియోసూత్రాల కనుగుణంగా వీటిని వాడుకోవాలి. చాలా మంది రోగులు కేమోథెరపీ అయిన తర్వాత ఆ బాధలు భరించలేక హోమియోని ఆశ్రయిస్తుంటారు. దానివల్ల పెద్దగా ఫలితం ఉండదు. ముందే హోమియోపతి వాడితే రోగం ముదరడం జరుగదు. రోగం మొదటినుంచే హోమియో ఔషధాలు వాడితే అది ముదిరి సర్జరీ వరకూ రావడం ఎన్నటికీ జరుగదు. అయితే రోగం బాగా ముదిరి ఇతర వైద్యవిధానాలు వాడిన తర్వాత హోమియోఔషధాలు మొదలుపెడితేనో,లేక అల్లోపతీ మందులూ హోమియోపతీ మందులూ కలిపి వాడితేనో పూర్తి ఫలితాలు కనపడవు. రోగం పూర్తిగా తగ్గటమూ జరుగదు. కొన్నాళ్ళు రోగం ముదరటం మాత్రం వాయిదా వెయ్యబడుతుంది. కనుక ముందునుంచే హోమియో ఔషధాలు వాడటం శ్రేయస్కరం.
read more " హోమియోపతి-మరికొన్ని కేన్సర్ ఔషధాలు "

11, ఫిబ్రవరి 2012, శనివారం

హోమియోపతిలో కేన్సర్ ఔషధాలు-కోనయం మాక్యులేటం

ఒక వ్యాధిని హోమియౌ వైద్య శాస్త్రం చూచే దృష్టి అల్లోపతీ కంటే భిన్నంగా ఉంటుంది. ఎక్యూట్ రోగాలలో రోగకారక క్రిముల పాత్రను హోమియో వైద్య శాస్త్రం కూడా ఒప్పుకుంటుంది. ఈ విషయంలో ఇతర వైద్యాలకూ హోమియో విధానానికీ స్పర్థ లేదు. కానీ, దీర్ఘరోగాల విషయంలో హోమియో సిద్ధాంతాలు భిన్నమైనవి. చాలా దీర్ఘ రోగాలకు కారణాలు ఏమిటో అల్లోపతీ విధానం ఇంతవరకూ కనిపెట్టలేదు. ఉదాహరణకు నిన్న గాక మొన్న యువరాజ్ సింగ్ కు వచ్చిన రోగానికి కారణం ఏమిటో స్పెషలిస్టులు కూడా చెప్పలేకపోతున్నారు. లక్షలో ఒకరికి ఈ వ్యాధి రావచ్చు అంటారు గాని, ఆ ఒక్కడూ ఇతనే ఎందుకు కావాలో చెప్పలేరు. 

ట్రీట్మెంట్ విధానం కూడా అల్లోపతీలో ఎలా ఉంటుందంటే, క్షీణిస్తున్న ప్రాణశక్తికి సూక్ష్మ స్త్తాయిలో బలాన్ని ఇవ్వడం ఒదిలేసి, ప్రాణం చెయ్యవలసిన పనిని వారు మందులద్వారా పరికరాల ద్వారా పూరించాలని చూస్తారు. తద్వారా, తన పని ఎవరో చేస్తున్నారు కనుక ప్రాణం ఇంకా ఇంకా చతికిలబడుతూ ఉంటుంది. కనుకనే, అనుకూల పరిస్తితి వచ్చినపుడు వ్యాధి మళ్ళీ రిలాప్స్ అవుతుంది. హోమియోపతిలో అయితే,ప్రాణాన్ని సూక్ష్మ స్థాయిలో సరిదిద్దటం ద్వారా వ్యాధిని ప్రాణమే సమర్ధవంతంగా ఎదుర్కొనేలా చెయ్యడం ఉంటుంది. ఈ ప్రక్రియ పోటేన్సీ ఔషధాల ద్వారా జరుగుతుంది. పోటేన్సీలు ప్రాణవ్యాకులత ఉన్న పరమాణు స్థాయిలోకి వెళ్లి అక్కడి లోటును సరిదిద్దుతాయి. కనుక ప్రాణం బలాన్ని పుంజుకొని వ్యాధిని తిప్పికొట్టగలుగుతుంది. అల్లోపతీలో వాడే స్థూలస్థాయి మందులు పరమాణుస్థాయిలోకి వెళ్ళలేవు.

ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక ఉద్యోగం లేని వ్యక్తికి, రెండు విధాలుగా మనం సాయం చెయ్యవచ్చు. ఒకటి-- జీవితాంతం అతన్ని మనం పోషిస్తూ  ఆదుకోవడం. రెండు- అతని కాళ్ళమీద అతనే నిలబడేలా చేసి జీవనోపాధి కలిపించడం. . ఇందులో మొదటి విధానం అల్లోపతీ అయితే, రెండవ విధానం హోమియోపతి అని చెప్పవచ్చు. అల్లోపతీలో జీవితాంతం మందులు వాడుతూ ప్రాణం చేసే పని మనం చేస్తాం. హోమియోపతీలో ప్రాణాన్ని చక్కదిద్ది దానిపని అది చేసుకునేలా చేస్తాం. ఇదీ రెంటికీ తేడా.

కేన్సర్ కు వాడే హోమియో ఔషధాలలో 'కోనయం మాక్యులేటం' అనే మందు ఒకటి. దీని ముఖ్య లక్షణాలు కొన్ని పరిశీలిద్దాం. ఇవి ముఖ్య లక్షణాలు మాత్రమేననీ, మందు యొక్క సమగ్ర స్వరూపం కాదనీ గుర్తుంచుకోవాలి. 

ఇది 'హెమ్లాక్' అనే విషం. సోక్రటీస్ కు ఇది ఇచ్చినందువల్లె ఆయన  చనిపోయాడు. చనిపోయేముందు ఆయన పడిన బాధలనూ, ఆ బాధలను వర్ణించిన తీరునూ సోక్రటీస్ శిష్యుడైన  'ప్లేటో' వ్రాసి పెట్టాడు. బహుశా 'కోనయం' మొదటి ప్రూవింగ్ అదే అయ్యుండవచ్చు. అందులో, శరీరం క్రమేణా చచ్చు బడినట్లు అనిపిస్తున్నదనీ అలా చచ్చుబడటం కాళ్ళలో మొదలై క్రమేణా పైకి పాకుతున్నదనీ సోక్రటీస్ అంటాడు. 

ఈ మందు అవసరం అయ్యే పేషంట్లు గట్టివారు. వారి గ్రంధులు గట్టిపడి ఉంటాయి. వీరికి ఏ పనీ చేద్దామని ఉండదు. ఊరకే అలా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఎప్పుడూ నీరసంగా ఉంటుంది. జ్ఞాపక శక్తి కూడా క్షీణించి ఉంటుంది. తేలికగా ఉద్రేకపడతారు. ఊరకే ఇతరులతో గొడవలు పెట్టుకుంటారు. ఎవరైనా వీరికి ఎదురుచేబితే భరించలేరు. ఉద్రేకం ఎక్కువై దాన్నుంచి డిప్రెషన్ లోకి పోతుంటారు. 

ఆడవారిలో స్థనాలు, మగవారిలో వృషణాలు బాగా గట్టిపడి రాళ్ళలా ఉంటాయి. స్త్రీలలో నెలసరికి ముందూ, నెలసరి సమయంలోనూ స్థనాలు గట్టిపడి నొప్పిగా బాధగా ఉంటాయి. ఇలాటి వారిలో బ్రెస్ట్ కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.స్తనాలను పరిశీలించినప్పుడు వాటిలో రాళ్ళలాగా గడ్డలు తగులుతాయి. కొందరిలో  చంకలలో గ్రంధులు వాచి ఆ నొప్పి తిమ్మిరిలాగా చేతిగుండా పాకుతూ వేళ్ళవరకూ వస్తుంది. 

ఒవరీలలోనూ, గర్భాశయంలోనూ బాధలున్నవారిలో కొందరికి కళ్ళు గిర్రున తిరుగుతాయి. మెడ పక్కకు తిప్పినా, కళ్ళు పక్కకు తిప్పినాs గది మొత్తం గిర్రున తిరిగినట్లు ఉంటుంది. ఎక్కువగా ఈ లక్షణం బెడ్ మీద పడుకుని ఉన్నపుడు కనిపిస్తుంది.

ప్రోస్టేట్ కేన్సర్ ఉన్న మగవారిలోనూ, గర్భాశయ సమస్యలున్న ఆడవారి లోనూ ఒంటేలుకు పోయేటప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది. యూరిన్ ధార మధ్యమధ్యలో ఆగిఆగి వస్తుంది.ఆడవారిలో నెలసరి ఆగిపోతుంది. నెలసరికి ముందు ఒంటిమీద ఎర్రని సన్ననిదద్దుర్లు వచ్చి నెలసరి రాగానే మాయమౌతాయి. నెలసరి తర్వాత పది రోజులకు లుకోరియా కనిపిస్తుంది. 

సెక్స్ కోరికలను బలవంతంగా అణచిపెట్టుకున్నవారిలోనూ, లేక విపరీతంగా కోరికలు తీర్చుకున్నవారిలోనూ లేటు వయసులో కేన్సర్ వచ్చే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈవిషయం అల్లోపతీకి తెలియదు.ఇది హోమియో వైద్యపు insights లో ఒకటి. ఇలాటి వారికి సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయి. కాని శరీరం సహకరించదు. అంటే యయాతిలాంటి వారన్నమాట. అలాటి వారికి ముందుముందు కేన్సర్ రావచ్చు అని అనుమానించవచ్చు. ఇటువంటి వారికి ఈ మందు అద్భుతంగా పనిచేస్తుంది.

వీరికి పగలూ రాత్రీ ఒకటే చెమటలు పడుతుంటాయి. ఈ మందు అవసరమైన వారి లక్షణాలు రాత్రిపూట ఉద్రేకిస్తాయి.పక్కమీద చేరిన తర్వాత బాధలు  ఎక్కువౌతాయి. బ్రహ్మచర్యం పాటిస్తే వీరి బాధలన్నీ ఉద్రేకిస్తాయి. 
    
కోనయం రోగికి బాధలు శరీరంలో కిందినుంచి పైకి వ్యాపిస్తాయి. Ascending  paralysis వీటిలో ఒకటి. ఈ పక్షవాతం అనేది క్రమేనా పై పైకి ఎదిగి చివరికి ఊపిరితిత్తులను ఆక్రమించి శ్వాస అందకపోవడం వల్ల చావును కొని తెస్తుంది. ఇలాంటి వారికి ముఖ్యంగా నీరసంగా ఉంటుంది. కాళ్ళలో కండరాలు చాలా నీరసంగా అనిపిస్తాయి.

వీరికి ఉపవాసం ఉంటె బాధలు శాంతిస్తాయి. చీకటిలో ఉంటే బాగుంటుంది. తిరుగుతూ ఉన్నా, ఒళ్ళు పట్టించుకున్నా హాయిగా ఉంటుంది. కాళ్ళూ చేతులూ బెడ్ మీదనుంచి కిందకు వేలాడేసి పడుకుంటే హాయిగా ఉంటుంది. 

మందులక్షణాలూ, రోగిలక్షణాలూ, రోగలక్షణాలూ కలిసినప్పుడు ఈ మందు ఇండికేట్ అవుతుంటే సరైన దశలోగనుక దీనిని వాడగలిగితే ఈ మందు కేన్సర్ ను కూడా తగ్గిస్తుంది.దీని ప్రభావంవల్ల కేన్సర్ కణుతులు కరిగిపోయి కనిపించకుండా మాయమౌతాయి.కెమోథెరపీ,రేడియేషన్ థెరపీలు చెయ్యలేని పని ఈమందు చేస్తుంది.రోగి యొక్క మానసికశారీరికలక్షణాలు పరిశీలించి సరియైన పోటేన్సీలో హోమియోసూత్రాల కనుగుణంగా దీనిని వాడవలసి ఉంటుంది. అప్పుడు అద్భుతాలు జరగడం చూడవచ్చు.

వచ్చే పోస్ట్ లో మరికొన్ని కేన్సర్ మందులు చూద్దాం.
read more " హోమియోపతిలో కేన్సర్ ఔషధాలు-కోనయం మాక్యులేటం "

8, ఫిబ్రవరి 2012, బుధవారం

కాలజ్ఞానం - 5

మాఘ కృష్ణ ఏకాదశి మార్గమేదో చూపుతోంది
నీచరాహు దృష్టంతా దనుజగురువు మీదుంది 
తమకు తగని మన్మధాగ్ని లోకాన్నే కమ్ముతుంది 
జనుల మానసాలలోన చిచ్చునేమొ పెంచుతుంది

రాజులనగ  పేదలనగ వ్యత్యాసం లేకుండా 
ప్రతివారిని కామాగ్ని పడవేయ బూనుతుంది 
వింత వింత చేష్టలతో లోకం పోటెత్తుతుంది 
మదనబాణ ధాటిలోన మాటలేక పడుతుంది

శివభక్తులకే చూడగ చిత్రమైన రక్షణుంది
మోరెత్తుకు తిరుగువారి మాడు పగిలిపోతుంది 
అహంకారులను చూస్తె అంటకాగబెడుతుంది
ఎరుకగలుగువారినేమొ ఏమనక సాగుతుంది
read more " కాలజ్ఞానం - 5 "

నాతో కలిసి నడుస్తావా నేస్తం?

గోవుల్లాంటి మూగజీవులకు 
చెత్తకుండీలలో ఎంగిలాకులు
కుక్కాపిల్లీ క్రూరజంతువులకు 
ఏసీరూములు సోఫామెత్తలు
గమనించావా లోకపు న్యాయాన్ని?

మెత్తనిభర్తలకు కరుకుభార్యలు 
లేతమొగ్గలకు వ్యసనపు మొగుళ్ళు 
చదువుకోవాలంటే అవకాశాలు శూన్యం 
వసతులమరిస్తే చదువు పూజ్యం
ఏమిటంటావ్ ఈ విచిత్రం?

ఆలయాలలో హోరున పూజలు 
నడిరోడ్డున దిక్కులేని శవాలు
వేదికలపైన ధార్మికోపన్యాసాలు 
రాతిగుండెల శ్రోతల జీవితాలు
మితిలేని ఆత్మవంచనలు; కాదనగలవా?


ఆశకూ ఆనందానికీ మధ్య ఇంతటి దూరాలెందుకో?
కన్నీటికీ చిరునవ్వుకీ మధ్య తీరని అంతరాలేమిటో
విచిత్రమైంది కదూ ఈ సృష్టి?


ఆశల పెనాల మీద ఆవిరయ్యే జీవితాలు
గమ్యం చేరుకోలేక కూలే ఊహలవిహంగాలు
ఎప్పటికీ మారని ఎదురుచూపులు
ఎన్నటికీ తీరని మనిషి కోరికలు
ఎక్కడికంటావ్ మన పరుగు?

కోరుకున్నది వెంటనే దొరికితే తెలుస్తుందా జీవితం విలువ?
అన్నీ సుఖంగా అమిరితే పుట్టుకొస్తుందా తెగువ?
చీకటే లేకుంటే పగటికి విలువేది?
లేమి నుంచేగా కలిమి మొదలయ్యేది? 


కడుపు నిండినా ఇంకా తినాలని ఆశెందుకో
ఎన్నటికీ తృప్తిలేని సుఖాలపై మోజెందుకో
అంతముందా ఆశల అన్వేషణకు 
పొంతనుందా లోకపు తీరులకు
కళ్ళుతేరిచి చూడు నేస్తం నీవే గ్రహిస్తావు సమస్తం 


పగలూ రాత్రీ అంతులేని ఆటలో
దారీతెన్నూ తోచని పరుగు పందెంలో
ఆలోచించావా ఎప్పుడైనా?
ఎన్నాళ్ళుగా గడిపావో ఈ వ్యధాభరిత జీవితాన్ని
ఎన్నేళ్ళుగా నడిచావో వృధాగా ఈ ఎడారి నడకల్ని


ఎక్కడికో నీ ప్రయాణం ఈ లోకంలో
ఎందుకోసమో నీ అన్వేషణ ఈ మోహంలో 
దాక్కున్నావా బాధ్యతల ముసుగులో?
దారితప్పావా ఆత్మవంచన అనే అడివిలో?
నీకేం కావాలో నీకైనా తెలుసా? 
నీ పయనం ఎక్కడికో అదైనా తెలుసా?


మారిందా లోకమనే కుక్కతోక ఎన్నడైనా?
తీరిందా మనసు దాహం ఎప్పుడైనా?
పాతకాలం నుంచీ మనిషితీరు మారిందా ?
మనసుపాశం ఎన్నడైనా మనిషిని వదిలిందా ?
లోకంలో ఆనందం ఆకాశపుష్పమేనోయ్
ఉందని అనుకోవడం నీ భ్రమేనోయ్ 

ఎవరెలా పోతే నీకెందుకు లోకమేమైపోతే నీకెందుకు 
నీవెవరో ముందు తెలుసుకో నిన్నే నీగమ్యంగా నిలుపుకో 
నీవే నీకు తెలియవు లోకాన్నేం జయిస్తావ్ నువ్వు? 
స్వార్ధమే నీకు కావలిస్తే అమితంగా దానిని పెంచుకో 
ప్రపంచాన్ని మొత్తం మింగేసి నీవొక్కడివే మిగులు 

లోకమనేది ఎక్కడా లేదనేది తెలుసుకో 
ఉన్నది మనుషులూ వాళ్ళ స్వార్ధమే 
నీలోకి నువ్వే నడచిపో మిగిలినదంతా వ్యర్ధమే
భరించలేవా ఈ నిజాన్ని? తాకలేవా ఈ అగ్నిని? 
అయితే నీ జీవితం వృధాయేనంటాను నేను


ఎక్కడున్నావ్ పుట్టకముందు? 
ఏమౌతావ్ పోయిన తర్వాత?
ఊహించావా ఎప్పుడైనా ఒక్క క్షణం?
బ్రతుకుపోరాటంలో పడి మరిచావా ఈ ప్రశ్నని?
కట్టుకున్నావ్ కదూ నీ కళ్ళకి పట్టుగంతల్ని?


శాశ్వతమనుకుంటున్నావా నువ్విక్కడ 
అదే నిజమైతే, నీ ముందరివాళ్ళంతా ఎక్కడ?
నీవు పోయిన మరుక్షణం నిన్ను మరిచిపోతుందీ లోకం
నీకు నచ్చినా నచ్చకున్నా ఇదే అసలైన చేదునిజం 
నీ జీవితకాలం ఈలోకంలో అతి స్వల్పం 
విశాలవిశ్వంలో నీ బ్రతుకే అత్యల్పం 

కనీసం ఇప్పుడైనా కళ్ళుతెరవవా మరి 
లోకమూ వద్దు నీమనసూ వద్దు 
ఈరెంటినీ వదిలిచూడు ఒకసారి
నేనన్నది నిజమేనని అంటావప్పుడు
ఎన్నడూ వినని నాదం వింటావప్పుడు


అన్ని సమస్యలూ అర్ధమౌతాయప్పుడు
చిక్కుముళ్లన్నీ విడిపోతాయప్పుడు
నీ పెద్దలందరూ ఈ బాటనే నడిచారు 
అందరు దేవుళ్ళూ ఆత్మదేవుణ్నేకొలిచారు

ఆరాటమనేదుంటే ఆచరించు ఈవిధానం స్వయంగా 
నీవే చూడు, చేరుతావో లేవో నీగమ్యం నిజంగా
read more " నాతో కలిసి నడుస్తావా నేస్తం? "

5, ఫిబ్రవరి 2012, ఆదివారం

యువరాజ్ సింగ్ కు కాన్సర్- గ్రహప్రభావాలు

క్రికెటర్ యువరాజ్ సింగ్ కు లంగ్ కాన్సర్ అనీ, దానికి విదేశాలలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడనీ వార్తలు వస్తున్న నేపధ్యంలో అతని జాతకం పరిశీలిస్తే ఆశ్చర్యకరవిషయాలు కొన్ని  కన్పించాయి. అవేమిటో చూద్దాం.

ఇతను డిసెంబర్ 12 ,  1981 న చండీఘర్ లో పుట్టాడని సమాచారం దొరుకుతోంది. ఇది నిజమో కాదో తెలియదు.డిసెంబర్ పన్నెండున పుట్టినవాళ్ళు సామాన్యంగా మహా మొండివాళ్లై  ఉంటారు. నాకు క్రికెట్ మీద బొత్తిగా ఆసక్తి లేదు కనుక అతని ఆట గురించి నాకు తెలియదు. క్రికెట్ ఆటను నేను అసలు చూడను. కానీ సామాన్యంగా ప్రతి ఆటగాడూ మొండివాడై ఉండాలని నేను నమ్ముతాను. లేకుంటే ప్రతికూల పరిస్తితుల్లో ఆటను ఆడలేడు.కనుక ఇతనూ మొండిమనిషే అని అనుకుంటున్నాను. అలాంటప్పుడు డిసెంబర్ 12 సరియైన జననతేదీనే కావచ్చు.ఇంతకంటే ఖచ్చితమైన సమాచారం దొరికేవరకూ ఇదే నిజమని అనుకుందాం.

సాధారణంగా ప్రముఖుల అసలైన జననవివరాలు వారు బయటపెట్టరు. దానికి కారణాలు అనేకం ఉంటాయి. ప్రస్తుతం మాత్రం ఈ వివరాలు నిజమే అని నమ్ముతూ ఈ విశ్లేషణలో ఏమి కనిపిస్తుందో చూద్దాం.ఇతని సరియైన జననసమయం మాత్రం తెలీలేదు. కనుక స్థూలవిచారణ చేద్దాం.ఇతని జాతకంలో ముఖ్యంగా కనిపించే అంశాలు కొన్ని --

1 . రాహుకేతువులు సున్నా డిగ్రీలలో ఉండటం.

2 . శని కన్యారాశిలో 26  డిగ్రీలలో ఉంటూ తృతీయదృష్టితో వృశ్చికరాశిలో 26 డిగ్రీలలో ఉన్న రవిని డిగ్రీదృష్టితో వీక్షించడం.

3 . బుధుడు రవికి అతి దగ్గరగా ఉండి అస్తంగతుడవ్వడం.

4 . గురువు తులారాశిలో 9 డిగ్రీలలో ఉంటూ బలహీనుడైన (?) రాహు నక్షత్రంలో ఉండటం.

కేన్సర్ కు అనేక గ్రహస్తితులు కారణం అవుతాయి. వాటిలో గురు శనులు, గురు కుజులు, గురు రాహువులు, గురు కేతువులు ప్రముఖ పాత్ర వహిస్తారు. అందరిలోకీ గురువుపాత్ర మాత్రం ఖాయంగా ఉంటుంది. గురువు సంపూర్ణ శుభగ్రహం కదా ఇదేంటి ? దేవగురువైన బృహస్పతి కాన్సర్ ను కలిగిస్తాడా ? అన్న అనుమానానికి నా పాత పోస్ట్ లలో వివరణ ఇచ్చాను. వాటిలో గురువూ శనీ ఎలా కాన్సర్ కు కారకులౌతారో వివరించాను.కావలసినవారు అవి ఒకసారి చదువవచ్చు.  

గోచారరీత్యా ఇప్పుడు గురువు మళ్ళీ మేషరాశి 9  డిగ్రీలలో ఉండి జననకాల గురువును ఖచ్చితమైన డిగ్రీదృష్టితో చూస్తున్నాడు. జననకాలశుక్రుడు వీరిద్దరికీ సరిగ్గా మధ్యన మకరం 8 డిగ్రీలలో ఉండటం చూడవచ్చు. దీని వివరాన్ని నేను చెప్పదలుచుకోలేదు. ఇదొక వివాదాస్పద అంశం. జ్యోతిష్య వేత్తలకు దీని అర్ధం తెలుస్తుంది.

గోచారశని తులారాశి 5  డిగ్రీల మీద సంచరిస్తూ జననకాల గురువుకు అతి దగ్గరగా ఉన్నాడు. కనుక శని గురువుల ప్రాధమిక ప్రభావం ఇతని రోగం వెనుక కనిపిస్తున్నది. అంతేకాక సహజతృతీయరాశి అయిన మిథునానికి అధిపతి అవుతూ ఊపిరితిత్తులకు సూచకుడైన బుధుడు రవికి అతిదగ్గరగా ఉంటూ అస్తంగతుడై, శనిదృష్టివల్ల  ఊపిరితిత్తుల కాన్సర్ కు దారి తీశాడు. ఈ కాన్సర్ కణితి గుండెకు అతిదగ్గరగా ఉండటం కూడా రవిపైన ఖచ్చితమైన శనిదృష్టి వల్లనే జరిగింది. రవి గుండెకు కారకుడని మనకు తెలుసు.


జననకాల మరియు గోచారగురుశనుల ప్రభావం వల్లనే ఈపరిస్తితి తలెత్తింది.కేన్సర్ కారకులలో గురు, శని గ్రహాల యొక్క పాత్ర ఈవిధంగా మళ్ళీ రుజువౌతున్నది. రవి వల్ల గుండె, బుదునివల్ల ఊపిరితిత్తులూ సూచింప  బడుతున్నాయి. ఏ జాతకానికైనా రవి చంద్రుల బలం ప్రధానం. ఎందుకంటే వీరిద్దరూ జీవితానికి వెలుగునిచ్చే గ్రహాలు. ఇతని జాతకంలో వీరిద్దరూ శని ప్రభావానికి లోనయ్యారు.శని యొక్క తృతీయదశమదృష్టులు రవి చంద్రులపైన ఉండటం చూడవచ్చు. 


చంద్ర లగ్నాత్ పరిశీలిస్తే, షష్ఠఅష్టమ స్తానాదిపతులైన కుజశనులు చాతీని సూచించే చతుర్దంలో కలవడం వల్ల ఛాతీకి సంబంధించిన తీవ్రరోగం సూచితం. శనికుజుల కలయిక మంచిది కాదు. దీనివల్ల తప్పక తీవ్రపరిణామాలు ఉంటాయి.రోగస్థానంలో లగ్నాధిపతి అయిన బుధుడు ఆయుస్థానాధిపతి అయిన రవితో కల్సి ఉండటం, వారిమీద చతుర్ధం నుంచి శనికుజుల దృష్టి పడటం కూడా ఆరోగ్యపరంగా తీవ్ర పరిణామాలు సూచిస్తున్నది.   


జైమిని మహర్షి తన ఉపదేశసూత్రాలలో ప్రధమాధ్యాయంలో 'కుజదృష్టే మహారోగః' అన్నాడు. కారకాంశకు చతుర్ధమున చంద్రుడుండి కుజునిచేత చూడబడితే 'మహారోగం' కలుగుతుంది అన్నాడు. అంటే ఒక పెద్దరోగం అని అర్ధం.ఈ సూత్రం ఇక్కడ వర్తిస్తుంది.యువరాజసింగ్ జాతకంలో ఆత్మకారకుడు బుధుడయ్యాడు. కారకాంశ మీనం అయింది. మీనం నుంచి చతుర్దంలో చంద్రుడున్నాడు. కన్యనుంచి రాశిదృష్టితో కుజుడు చంద్రుని వీక్షిస్తున్నాడు. జైమినిమహర్షి రాశి దృష్టులను చెప్పాడు. దాని ప్రకారం ద్విస్వభావ రాశులు ద్విస్వభావరాశులను వీక్షిస్తాయి. జైమిని మహర్షి చెప్పిన సూత్రం ఇతని జాతకంలో ఖచ్చితంగా రుజువైంది.ఏం పరవాలేదు ఇది చిన్నరోగమే అని కొందరు అంటున్నప్పటికీ, చిన్నరోగం అయితే అమెరికా వెళ్లి స్పెషలిస్టుల వద్ద ట్రీట్మెంట్ తీసుకోవలసిన అవసరం లేదు. 
   
ఇకపోతే ప్రస్తుత పరిస్తితి చూద్దాం.


రేపు 8 వ తేదీనుంచి శనిభగవానుడు వక్రస్తితిలోకి ప్రవేశిస్తున్నాడు. జూన్ 24 వరకూ వెనక్కు వెళుతూ మళ్ళీ కన్యారాశిలో ప్రవేశిస్తాడు. కనుక జననకాల గురువుకు క్రమంగా దూరమౌతాడు. ఈ సమయంలో ఇతని ఆరోగ్యపరిస్తితి మెరుగుపడుతుంది.  ఆ తర్వాత శనిభగవానుడు మళ్ళీ రుజుగమనంలోకి వచ్చి, అక్టోబర్ 31 ప్రాంతంలో మళ్ళీ తులారాశిలోని జననకాల గురువుమీద సంచరిస్తాడు. కనుక ఆ సమయంలో మళ్ళీ ఇతనికి వ్యాధి తిరగబెట్టవచ్చు. లేదా ఇంకొక రౌండ్ ట్రీట్మెంట్ అవసరం కావచ్చు. జూన్ లో గురువు గోచారరీత్యా ద్వాదశరాశిలో ప్రవేసిస్తాడు.కనుక అప్పుడు ఇతనికి విపరీత ఖర్చులు ఉంటాయి. అవి ట్రీట్మెంట్  కోసమే కావచ్చు.


యువరాజ్ సింగ్ జననసమయం ఖచ్చితంగా తెలిస్తే ఇతని జాతకాన్ని ఇంకా వివరంగా పరిశీలించవచ్చు. ఇతనికి కావలసిన రెమెడీస్ కూడా చెప్పవచ్చు. ప్రస్తుతానికి మనకు ఇంతకంటే వివరాలు దొరకలేదు. చిన్న వయసులో కేన్సర్ రావడం దురదృష్టమే. ఇతని కెరీర్ ఇకముందు ఎలా ఉంటుందో సందేహమే. ఇతనికి త్వరలో నయం కావాలని మాత్రం కోరుకుందాం.
read more " యువరాజ్ సింగ్ కు కాన్సర్- గ్రహప్రభావాలు "

3, ఫిబ్రవరి 2012, శుక్రవారం

కార్పోరేట్ హోమియోపతి

జర్మనీదేశంలో పుట్టిన హోమియోపతి అనే వైద్యవిధానం  మొదటగా మన దేశంలో పంజాబ్ రాష్ట్రంలో కాలుపెట్టింది. దాదాపు 1830 ప్రాంతంలో డాక్టర్ జాన్ మార్టిన్ హోనిగ్ బెర్గెర్ అనేవాడు పంజాబ్ రాజైన మహారాజా రంజిత్ సింగ్ ను హోమియోపతి వాడి ప్రాణాపాయం నుంచి రక్షించాడు. ఈ డాక్టర్, హన్నేమాన్ వద్ద హోమియోపతి నేర్చుకున్నాడు. మహారాజా రంజిత్ సింగ్ జలోదరంతో బాధపడుతుంటే డాక్టర్ హోనిగ్ బెర్గేర్ ఇచ్చిన 'డల్కమారా' అనే మందుతో అతనికి బాధ తగ్గి ఆరోగ్యం చేకూరింది. వర్షాకాలంలో వచ్చే దురదలకూ, ఏసీ  రూముల్లో ఎక్కువసేపు ఉంటె వచ్చే బాధలకూ, వర్షంలో తడిస్తే వచ్చే బాధలకూ, ఎప్పుడూ తడిబట్టలలో నానుతూ ఉండవలసి వచ్చేవారికీ, నీళ్ళల్లో ఎక్కువగా తడిసేవారికీ  ఈ మందు అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాక   మహారాజా రంజిత్ సింగ్ గుర్రానికి దెబ్బలు తగిలి గాయాలతో ఉంటే ఆ పుండ్లను హోమియో ఔషధాలతో ఇతను నయం చేశాడు.  మహారాజు ఇతన్ని ఆదరించి తన ఆస్థానవైద్యునిగా ఉండనిచ్చాడు. డాక్టర్ హోనిగ్ బెర్గేర్ కలకత్తాలో చాలా రోజులు ఉండి హోమియో వైద్యాన్ని ప్రచారంలోకి తెచ్చాడు. 'సింకోనా' అనే మందుతో హోమియో వైద్యం ఆవిర్భవిస్తే, 'దల్కమారా' అనే మందుతో అది భారతదేశంలో అడుగుపెట్టింది.

తర్వాత బెంగాల్ రాష్ట్రంలో ఉద్దండులనదగిన హోమియో వైద్యులు ఆవిర్భవించారు. భారతదేశపు హోమియోవైద్య పితామహునిగా 'డాక్టర్  రాజేంద్రలాల్  దత్త' ను చెప్పుకోవాలి. ఇతనివల్లనే హోమియో వైద్యం బెంగాల్ రాష్ట్రంలో ఎంతో ప్రచారంలోకి వచ్చింది. ఈయన పండిత ఈశ్వరచంద్రవిద్యాసాగర్ కు వైద్యుడు. అంతేకాక, అప్పట్లో కలకత్తాలో ప్రముఖ అల్లోపతీ MD అయిన డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ ను హోమియో వైద్యంవైపు మళ్లించిన ఘనత ఈయనదే. డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ 1863 లో కలకత్తా మెడికల్ కాలేజీనుంచి MD ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన మేధావి. అప్పటి యూరోపియన్ ప్రొఫెసర్లకు ప్రియశిష్యుడు. ఈయనకి మొదట్లో హోమియోపతి అంటే సరిపడేది కాదు. అల్లోపతీ డాక్టర్ అవడంవల్ల సహజంగా హోమియోని ఎగతాళి చేసేవాడు. తర్వాత డాక్టర్ రాజేంద్రలాల్ దత్త చేసిన అద్భుతమైన క్యూర్స్ చూచిన తర్వాత ఈయన హోమియోపతి వైపు మళ్లాడు. తద్వారా తన కొలీగ్స్ నుంచి ఎంతో ప్రతిఘటననూ, ఎగతాళినీ ఎదుర్కొన్నాడు. అయినా సరే వెనక్కు మళ్ళకుండా హోమియోపతిని అధ్యయనం చేసి ఎంతో మంచిపేరును సంపాదించాడు. నాటినుంచీ నేటివరకూ ఆలోచనాపరులైన అల్లోపతీ డాక్టర్లు ఎందఱో హోమియోవైద్యం వైపు మళ్లుతున్నారు. డాక్టర్ ప్రతాప్ చంద్ర మజుందార్, డాక్టర్ భగత్ రాం, డాక్టర్ యుద్ధవీర్ సింగ్, ఫాదర్ ముల్లర్,డాక్టర్ NM చౌధురీ  మొదలైన డాక్టర్లు హోమియోపతిని ఎంతో అధ్యయనం చేసి ఎన్నో రోగాలను సమర్ధవంతంగా నయం చేసి ఎంతో మంచిపేరు తెచ్చుకున్నారు. 

డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్, శ్రీ రామకృష్ణపరమహంసకు కాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చి జీవితాన్ని చరితార్ధం చేసుకున్న ధన్యుడు.శ్రీ రామకృష్ణుని  చివరిరోజులలో ఆయనకు ట్రీట్ మెంట్ ఇస్తూ 'లైకోపోడియం-200 ' అనే మందును ఇచ్చాడు. ఆ మందు ప్రభావం వల్ల శ్రీ రామకృష్ణునికి  కొంత తేలికగా అనిపించి లేచి నడవగలిగారు. తత్ఫలితంగానే 1886  జనవరి ఒకటో తేదీన ఆయన లేచి నడుస్తూ బయటకు వచ్చి, శిష్యులందరికీ మహత్తరమైన దివ్యానుభూతులను ఆరోజు ప్రసాదించారు. ఎవరు ఏ వరం అడిగితే ఆ వరం ఆరోజు ఆయన ఇచ్చారు. అప్పటినుంచీ శ్రీ రామకృష్ణ భక్తులు జనవరి ఒకటిని 'కల్పతరుదినం'గా జరుపుకుంటారు. భగవత్శక్తికి మందులతో పని లేనప్పటికీ, శరీరధర్మానుసారం డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ ఆ మందును ఇవ్వడమూ తత్ఫలితంగా 'కల్పతరుదినం' అనేది చక్కగా జరగటమూ, ఎంతో మంది భక్తులు ఆరోజున అనేక దివ్యానుభవాలను పొందటమూ సంభవించింది. ఆ విధంగా శ్రీరామక్రిష్ణునికీ హోమియోపతివైద్యానికీ సంబంధం కలిగింది. ఆయన బ్లెస్సింగ్స్ ఆ వైద్య విధానానికి ఉన్నాయి. 

తర్వాత ఎందఱో మహనీయులైన వైద్యులు నిస్వార్ధంగా జీవిస్తూ అతి తక్కువ ఫీజు తీసుకుంటూ ఎందఱో రోగులకు చక్కని సేవలందిస్తూ హోమియోపతి వైద్యాన్ని పరిపుష్టం చేసారు. వారు కూడా డబ్బు సంపాదించారు. దానితో పాటు మంచిపేరూ సంపాదించారు.చక్కని వ్యక్తిత్వాన్నీ సొంతం చేసుకున్నారు. కాని నేటి వైద్యులలాగా కక్కుర్తి పడలేదు. డబ్బే పరమావధిగా ప్రవర్తించనూ లేదు. వారి కృషివల్ల బెంగాల్లో హోమియోపతి ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. బెంగాల్లో మారుమూల గ్రామాలకు వెళ్లి చూచినా అక్కడ పల్లెకారుప్రజలు కూడా హోమియో ఔషధాలు వాడుతూ ఉంటారు. అక్కడ హోమియో వైద్యం కూడా చాలా చవక. డాక్టర్ ఫీజు అయిదు రూపాయలో పది రూపాయలో ఉంటుంది. అందులోనే మందులు కూడా డాక్టరే ఇస్తాడు.  అదంతా ఒకప్పటి మాట. కాని నేటి పరిస్తితి మాత్రం చాలా ఘోరంగా తయారైంది. దానికి కారణం, ధనపిశాచి ఆవహించిన నేటి డాక్టర్లు.

ప్రస్తుతం హోమియోపతిని కూడా కార్పోరేట్ స్థాయికి తీసుకెళ్ళే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వైద్యంలో నైపుణ్యతాస్థాయి ఏమాత్రం పెరగలేదు. ఇంకాపైగా ఘోరంగా దిగజారిపోతున్నది. డా|| హన్నేమాన్ కానీ ఇతర హోమియోపయనీర్స్ గానీ చేసిన బ్రిలియంట్ క్యూర్స్ నేటి హోమియో వైద్యులు కలలోకూడా చెయ్యలేరు.నేటి కుర్రడాక్టర్లు మామూలు జ్వరాన్నికూడా శుద్ధమైన హోమియోపతితో తగ్గించలేరు.హోమియోమందుతో జ్వరాన్ని తగ్గించడం చేతకాక, పారాసేటమాల్ ఇచ్చిన హోమియోడాక్టర్లు నాకు తెలుసు. కాని ఫీజులు మాత్రం వేలకువేలు వసూలు చేస్తున్నారు. రోగియొక్క అన్ని లక్షణాలకూ కలిపి ఒకసారికి ఒక్క మందును మాత్రమె వాడమని, అది కూడా మినిమం డోస్ లో వాడమనీ  హన్నేమాన్ చెబితే, నేటి వైద్యులు మాత్రం పచారీ కొట్లో సరుకులలాగా మందులు మూటలు కట్టి ఇస్తూ, హన్నేమాన్ కూ హోమియోపతికీ తలవంపులు తెస్తున్నారు. కొందరైతే జ్వరానికి సంబంధించిన మందులన్నీ కలగలిపి 'ఫీవర్ మిక్చర్' అని ఇస్తున్నారు.ఇది చాలా తప్పు విధానం. తెలియనివారు ఇదే నిజమైన హోమియో వైద్యం అనుకునే ప్రమాదం ఉంది.

నేను ఒకటి రెండుఏళ్ళ క్రితం ఏదోమందు కావలసివచ్చి హైదరాబాద్లో ఒక హోమియో స్టోర్ కు వెళ్లాను. అదొక క్లినిక్ కం స్టోర్. హాల్లో ఒక ముప్పై మంది పేషంట్లు కూచుని ఉన్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వ్రాసి ఇచ్చిన తర్వాత, మందులకోసం ఆ చీటీ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న డిస్పెంసరీ కి వెళుతుంది. అక్కణ్ణించి ఏతాంలో నీళ్ళు తోడినట్లు ఒక బక్కెట్లో మందులు మూటకట్టి హాల్లోకి దించుతున్నారు. హాల్లో వెయిట్ చేస్తున్న పేషంట్లు ఆ బక్కేట్లోని మందుల మూటను దించుకొని తీసుకుపోతున్నారు. అసలు హోమియోలో అన్నన్ని మందులు ఎందుకు వాడాలో నాకైతే అర్ధం కాలేదు. జ్వరాల దగ్గరనుంచీ ఎన్నో క్రానిక్ డిసీజెస్ వరకూ ఒకటి లేదా రెండు మందులను మాత్రమే వాడి నయం చెయ్యటం నేను చూచాను. అదే విధానం నేను నేర్చుకున్నాను. అంతేకాని కేజీలు కేజీలు మందులు మింగించడాన్ని హోమియోపతి అని ఎలా అంటారో నాకైతే అర్ధం కాదు. 

నేటి హోమియో షాపులలో అల్మారాలలో కనిపించే టూత్ పెస్టులూ, హెయిర్ ఆయిల్సూ, సబ్బులూ, కాస్మేటిక్సూ, ఆయింట్ మెంట్లూ అన్నీ హోమియో సిద్ధాంతాలకు వ్యతిరేకమైనవే. హన్నేమాన్ ఇలాంటి హోమియోపతిని బోధించలేదు. ఊహించలేదు. ఇదంతా నేటికాలపు వ్యాపార హోమియోపతీ మాత్రమె. అందుకే అది అస్సలు పనిచెయ్యదు. హోమియోపతీలో కేటలాగ్ వైద్యం లేనే లేదు. పైపూతలకు హోమియోలో విలువ లేదు. ఏదైనా ప్రాణశక్తి నుంచే, లోపలనుంచే రావాలి.ప్రాణానికి విలువ ఇచ్చే వైద్యం ఒక్క హోమియోపతి మాత్రమే.   

అయితే ఒకటి మాత్రం నిజం. నేటి ప్రజలు కూడా పత్యాలూ నియమాలూ పాటించమంటే వినేరకాలు కారు. ఆహారపు అలవాట్లూ, జీవనవిధానాలూ మార్చుకోమ్మంటే ససేమిరా వినరు. వీళ్ళు ఉండే అనాచారపద్దతుల్లో వీరు ఉంటారు. కాని రోగాలు మాత్రం తగ్గిపోవాలి. ఆ క్రమంలో స్టెరాయిడ్స్ వాడినా,ఒళ్ళు గుల్ల అయినా వారికి అనవసరం. అందినంతవరకూ జీవితాన్ని విచ్చలవిడిగా ఎంజాయ్ చెయ్యడం.ఒంట్లో ఏదైనా చెడిపోతే కార్పోరేట్ హాస్పటల్ కు పరిగెత్తి ICU లో పడుకోవడం. ఆఫ్ కోర్స్. అక్కడ బెడ్స్ ను ఎలాగూ అవినీతిమంత్రులూ,కేసులేదుర్కొంటున్న అధికారులూ ముందే ఆక్రమించుకొని ఉంటారనుకోండి. అది వేరే సంగతి.ఇలాంటి మనస్తత్వాలు ఉన్న పేషంట్లకు నేటి కార్పోరేట్ అల్లోపతీ వైద్యులే సరైన గురువులు. పాతకాలంలో వైద్యుని వద్దకు వెళితే జేబు మాత్రమె ఖాళీ అయ్యేది. నేడు వైద్యుని వద్దకు వెళితే బేంక్ బేలన్స్ మొత్తం ఖాళీ అవుతున్నది. కానీ రోగం మాత్రం పూర్తిగా తగ్గటం లేదు. ఒకరకంగా నేటి ప్రజలకు ఇలాంటి డాక్టర్లే కావాలి. అక్రమసంపాదనకు అలవాటు పడ్డ నేటి ప్రజలకు అక్రమంగా దోచుకునే డాక్టర్లే సరియైన గురువులు.పాతకాలపు శుద్ధమైన వైద్యం నిస్వార్ధంగా చేసే డాక్టర్లు నేటి తరానికి నచ్చరు.

అయితే చవకైన హోమియోపతీ వైద్యాన్ని కూడా అత్యంతఖరీదైన వైద్యంగా మార్చే ప్రయత్నాలు ఈమధ్యన జరుగుతున్నాయి. చెయిన్ క్లినిక్సూ, మల్టి స్పెషాలిటీ హోమియో క్లినిక్సూ వెలుస్తున్నాయి. మొన్నీ మధ్యన సంతానం లేని ఒక జంట 'హోమియో ఫెర్టిలిటీ క్లినిక్' ఒకదానికి వెళ్లి అక్కడి డాక్టర్ని కలిస్తే, మీ సమస్యకు ఆరునెలలు ట్రీట్ మెంట్ తీసుకోవాలి, ఒక్కొక్కరికి పాతిక వేలు అవుతుంది అని చెప్పి ముందుగానే ఏభై వేలూ కట్టమని చెప్పారట. వాళ్ళ గుండాగినంత పనయ్యి మాకోద్దులే ఈ వైద్యం అని చక్కా వచ్చారు. నిజానికి ఆ సమస్యకు ఇచ్చే ట్రీట్మెంట్ కు అందులో ఎభైయ్యో వంతు (అంటే వెయ్యి రూపాయలు) కూడా అవదు. కాకపోతే కార్పోరేట్ ఆస్పత్రి ఖర్చులు, మేయిన్టేనేన్సూ  ఎవరు పెట్టుకోవాలి? అని డాక్టర్లు వాదిస్తారు. అదే డాక్టర్లు మరి పాతకాలపు హోమియో దిగ్గజాలకున్న వైద్యనైపుణ్యాన్ని అందుకోవాలని మాత్రం ప్రయత్నించరు. అదేమంటే ఆ పాతకాలపు పద్దతులు ఇప్పుడు పనికిరావు అంటారు. 

'రోగీ పాలే కోరాడు వైద్యుడూ పాలే తాగమన్నాడు' అన్నట్లు నేటి ప్రజలకూ హంగులూ ఆర్భాటాలూ చూపి  మోసంచేసే వైద్యులే కావాలి. డాక్టర్లకేమో సాయంత్రానికి లక్షలు కావాలి.అందుకే ఒకరికొకరు సరిపోయారు.కానీ, హోమియో వంటి ఉన్నతమైన ఆశయాలతో పుట్టిన వైద్యవిధానాన్ని కూడా భ్రష్టు పట్టిస్తున్న నేటి హోమియోడాక్టర్లను చూచి హన్నేమాన్ ఆత్మ ఎలా క్షోభిస్తుందో నేనైతే ఊహించలేకున్నాను. నేటి డాక్టర్లకు ఆశ ఎక్కువ నైపుణ్యం తక్కువ. అందుకే హోమియోవైద్యం గురించి ప్రజలకు సరైన వాస్తవాలు తెలియని పరిస్తితి ఇంకా సమాజంలో ఉన్నది. 

మన దేశంలో హోమియో వైద్యరంగంలో మొదటితరపు దిగ్గజాల ఉత్తేజపూరిత జీవితాలు చదివి అయినా నేటితరపు డాక్టర్లు కొంత విలువలనూ, ఆశయాలనూ, నైపుణ్యాన్నీ నేర్చుకుంటే అదే పదివేలు. భారీ ఫీజులు వసూలు చేస్తే చేసారు, కనీసం శుద్ధమైన హోమియోపతిని వాడి ప్రజలకు వైద్యం చేసే డాక్టర్లు కొంతమంది అయినా తయారైనప్పుడే మళ్ళీ పాతకాలపు స్వర్ణయుగం హోమియో ప్రపంచంలో వస్తుంది. ఉన్నత ఆశయాలతో ఒక విప్లవాత్మకమైన వైద్య విధానాన్ని సృష్టించిన డాక్టర్ హన్నేమాన్ ఆత్మ కొంతైనా సంతోషిస్తుంది. కాని అంతటి నైపుణ్యాన్ని సాధించాలంటే, ఎంతో దీక్షతో పట్టుదలతో విలువలతో కూడిన అధ్యయనం ఉండాలి. నేటి డాక్టర్లకు అంతటి దీక్ష ఉందా అనేది నాకైతే అనుమానమే. 
read more " కార్పోరేట్ హోమియోపతి "