జర్మనీదేశంలో పుట్టిన హోమియోపతి అనే వైద్యవిధానం మొదటగా మన దేశంలో పంజాబ్ రాష్ట్రంలో కాలుపెట్టింది. దాదాపు 1830 ప్రాంతంలో డాక్టర్ జాన్ మార్టిన్ హోనిగ్ బెర్గెర్ అనేవాడు పంజాబ్ రాజైన మహారాజా రంజిత్ సింగ్ ను హోమియోపతి వాడి ప్రాణాపాయం నుంచి రక్షించాడు. ఈ డాక్టర్, హన్నేమాన్ వద్ద హోమియోపతి నేర్చుకున్నాడు. మహారాజా రంజిత్ సింగ్ జలోదరంతో బాధపడుతుంటే డాక్టర్ హోనిగ్ బెర్గేర్ ఇచ్చిన 'డల్కమారా' అనే మందుతో అతనికి బాధ తగ్గి ఆరోగ్యం చేకూరింది. వర్షాకాలంలో వచ్చే దురదలకూ, ఏసీ రూముల్లో ఎక్కువసేపు ఉంటె వచ్చే బాధలకూ, వర్షంలో తడిస్తే వచ్చే బాధలకూ, ఎప్పుడూ తడిబట్టలలో నానుతూ ఉండవలసి వచ్చేవారికీ, నీళ్ళల్లో ఎక్కువగా తడిసేవారికీ ఈ మందు అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాక మహారాజా రంజిత్ సింగ్ గుర్రానికి దెబ్బలు తగిలి గాయాలతో ఉంటే ఆ పుండ్లను హోమియో ఔషధాలతో ఇతను నయం చేశాడు. మహారాజు ఇతన్ని ఆదరించి తన ఆస్థానవైద్యునిగా ఉండనిచ్చాడు. డాక్టర్ హోనిగ్ బెర్గేర్ కలకత్తాలో చాలా రోజులు ఉండి హోమియో వైద్యాన్ని ప్రచారంలోకి తెచ్చాడు. 'సింకోనా' అనే మందుతో హోమియో వైద్యం ఆవిర్భవిస్తే, 'దల్కమారా' అనే మందుతో అది భారతదేశంలో అడుగుపెట్టింది.
తర్వాత బెంగాల్ రాష్ట్రంలో ఉద్దండులనదగిన హోమియో వైద్యులు ఆవిర్భవించారు. భారతదేశపు హోమియోవైద్య పితామహునిగా 'డాక్టర్ రాజేంద్రలాల్ దత్త' ను చెప్పుకోవాలి. ఇతనివల్లనే హోమియో వైద్యం బెంగాల్ రాష్ట్రంలో ఎంతో ప్రచారంలోకి వచ్చింది. ఈయన పండిత ఈశ్వరచంద్రవిద్యాసాగర్ కు వైద్యుడు. అంతేకాక, అప్పట్లో కలకత్తాలో ప్రముఖ అల్లోపతీ MD అయిన డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ ను హోమియో వైద్యంవైపు మళ్లించిన ఘనత ఈయనదే. డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ 1863 లో కలకత్తా మెడికల్ కాలేజీనుంచి MD ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన మేధావి. అప్పటి యూరోపియన్ ప్రొఫెసర్లకు ప్రియశిష్యుడు. ఈయనకి మొదట్లో హోమియోపతి అంటే సరిపడేది కాదు. అల్లోపతీ డాక్టర్ అవడంవల్ల సహజంగా హోమియోని ఎగతాళి చేసేవాడు. తర్వాత డాక్టర్ రాజేంద్రలాల్ దత్త చేసిన అద్భుతమైన క్యూర్స్ చూచిన తర్వాత ఈయన హోమియోపతి వైపు మళ్లాడు. తద్వారా తన కొలీగ్స్ నుంచి ఎంతో ప్రతిఘటననూ, ఎగతాళినీ ఎదుర్కొన్నాడు. అయినా సరే వెనక్కు మళ్ళకుండా హోమియోపతిని అధ్యయనం చేసి ఎంతో మంచిపేరును సంపాదించాడు. నాటినుంచీ నేటివరకూ ఆలోచనాపరులైన అల్లోపతీ డాక్టర్లు ఎందఱో హోమియోవైద్యం వైపు మళ్లుతున్నారు. డాక్టర్ ప్రతాప్ చంద్ర మజుందార్, డాక్టర్ భగత్ రాం, డాక్టర్ యుద్ధవీర్ సింగ్, ఫాదర్ ముల్లర్,డాక్టర్ NM చౌధురీ మొదలైన డాక్టర్లు హోమియోపతిని ఎంతో అధ్యయనం చేసి ఎన్నో రోగాలను సమర్ధవంతంగా నయం చేసి ఎంతో మంచిపేరు తెచ్చుకున్నారు.
డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్, శ్రీ రామకృష్ణపరమహంసకు కాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చి జీవితాన్ని చరితార్ధం చేసుకున్న ధన్యుడు.శ్రీ రామకృష్ణుని చివరిరోజులలో ఆయనకు ట్రీట్ మెంట్ ఇస్తూ 'లైకోపోడియం-200 ' అనే మందును ఇచ్చాడు. ఆ మందు ప్రభావం వల్ల శ్రీ రామకృష్ణునికి కొంత తేలికగా అనిపించి లేచి నడవగలిగారు. తత్ఫలితంగానే 1886 జనవరి ఒకటో తేదీన ఆయన లేచి నడుస్తూ బయటకు వచ్చి, శిష్యులందరికీ మహత్తరమైన దివ్యానుభూతులను ఆరోజు ప్రసాదించారు. ఎవరు ఏ వరం అడిగితే ఆ వరం ఆరోజు ఆయన ఇచ్చారు. అప్పటినుంచీ శ్రీ రామకృష్ణ భక్తులు జనవరి ఒకటిని 'కల్పతరుదినం'గా జరుపుకుంటారు. భగవత్శక్తికి మందులతో పని లేనప్పటికీ, శరీరధర్మానుసారం డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ ఆ మందును ఇవ్వడమూ తత్ఫలితంగా 'కల్పతరుదినం' అనేది చక్కగా జరగటమూ, ఎంతో మంది భక్తులు ఆరోజున అనేక దివ్యానుభవాలను పొందటమూ సంభవించింది. ఆ విధంగా శ్రీరామక్రిష్ణునికీ హోమియోపతివైద్యానికీ సంబంధం కలిగింది. ఆయన బ్లెస్సింగ్స్ ఆ వైద్య విధానానికి ఉన్నాయి.
తర్వాత ఎందఱో మహనీయులైన వైద్యులు నిస్వార్ధంగా జీవిస్తూ అతి తక్కువ ఫీజు తీసుకుంటూ ఎందఱో రోగులకు చక్కని సేవలందిస్తూ హోమియోపతి వైద్యాన్ని పరిపుష్టం చేసారు. వారు కూడా డబ్బు సంపాదించారు. దానితో పాటు మంచిపేరూ సంపాదించారు.చక్కని వ్యక్తిత్వాన్నీ సొంతం చేసుకున్నారు. కాని నేటి వైద్యులలాగా కక్కుర్తి పడలేదు. డబ్బే పరమావధిగా ప్రవర్తించనూ లేదు. వారి కృషివల్ల బెంగాల్లో హోమియోపతి ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. బెంగాల్లో మారుమూల గ్రామాలకు వెళ్లి చూచినా అక్కడ పల్లెకారుప్రజలు కూడా హోమియో ఔషధాలు వాడుతూ ఉంటారు. అక్కడ హోమియో వైద్యం కూడా చాలా చవక. డాక్టర్ ఫీజు అయిదు రూపాయలో పది రూపాయలో ఉంటుంది. అందులోనే మందులు కూడా డాక్టరే ఇస్తాడు. అదంతా ఒకప్పటి మాట. కాని నేటి పరిస్తితి మాత్రం చాలా ఘోరంగా తయారైంది. దానికి కారణం, ధనపిశాచి ఆవహించిన నేటి డాక్టర్లు.
ప్రస్తుతం హోమియోపతిని కూడా కార్పోరేట్ స్థాయికి తీసుకెళ్ళే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వైద్యంలో నైపుణ్యతాస్థాయి ఏమాత్రం పెరగలేదు. ఇంకాపైగా ఘోరంగా దిగజారిపోతున్నది. డా|| హన్నేమాన్ కానీ ఇతర హోమియోపయనీర్స్ గానీ చేసిన బ్రిలియంట్ క్యూర్స్ నేటి హోమియో వైద్యులు కలలోకూడా చెయ్యలేరు.నేటి కుర్రడాక్టర్లు మామూలు జ్వరాన్నికూడా శుద్ధమైన హోమియోపతితో తగ్గించలేరు.హోమియోమందుతో జ్వరాన్ని తగ్గించడం చేతకాక, పారాసేటమాల్ ఇచ్చిన హోమియోడాక్టర్లు నాకు తెలుసు. కాని ఫీజులు మాత్రం వేలకువేలు వసూలు చేస్తున్నారు. రోగియొక్క అన్ని లక్షణాలకూ కలిపి ఒకసారికి ఒక్క మందును మాత్రమె వాడమని, అది కూడా మినిమం డోస్ లో వాడమనీ హన్నేమాన్ చెబితే, నేటి వైద్యులు మాత్రం పచారీ కొట్లో సరుకులలాగా మందులు మూటలు కట్టి ఇస్తూ, హన్నేమాన్ కూ హోమియోపతికీ తలవంపులు తెస్తున్నారు. కొందరైతే జ్వరానికి సంబంధించిన మందులన్నీ కలగలిపి 'ఫీవర్ మిక్చర్' అని ఇస్తున్నారు.ఇది చాలా తప్పు విధానం. తెలియనివారు ఇదే నిజమైన హోమియో వైద్యం అనుకునే ప్రమాదం ఉంది.
నేను ఒకటి రెండుఏళ్ళ క్రితం ఏదోమందు కావలసివచ్చి హైదరాబాద్లో ఒక హోమియో స్టోర్ కు వెళ్లాను. అదొక క్లినిక్ కం స్టోర్. హాల్లో ఒక ముప్పై మంది పేషంట్లు కూచుని ఉన్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వ్రాసి ఇచ్చిన తర్వాత, మందులకోసం ఆ చీటీ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న డిస్పెంసరీ కి వెళుతుంది. అక్కణ్ణించి ఏతాంలో నీళ్ళు తోడినట్లు ఒక బక్కెట్లో మందులు మూటకట్టి హాల్లోకి దించుతున్నారు. హాల్లో వెయిట్ చేస్తున్న పేషంట్లు ఆ బక్కేట్లోని మందుల మూటను దించుకొని తీసుకుపోతున్నారు. అసలు హోమియోలో అన్నన్ని మందులు ఎందుకు వాడాలో నాకైతే అర్ధం కాలేదు. జ్వరాల దగ్గరనుంచీ ఎన్నో క్రానిక్ డిసీజెస్ వరకూ ఒకటి లేదా రెండు మందులను మాత్రమే వాడి నయం చెయ్యటం నేను చూచాను. అదే విధానం నేను నేర్చుకున్నాను. అంతేకాని కేజీలు కేజీలు మందులు మింగించడాన్ని హోమియోపతి అని ఎలా అంటారో నాకైతే అర్ధం కాదు.
నేటి హోమియో షాపులలో అల్మారాలలో కనిపించే టూత్ పెస్టులూ, హెయిర్ ఆయిల్సూ, సబ్బులూ, కాస్మేటిక్సూ, ఆయింట్ మెంట్లూ అన్నీ హోమియో సిద్ధాంతాలకు వ్యతిరేకమైనవే. హన్నేమాన్ ఇలాంటి హోమియోపతిని బోధించలేదు. ఊహించలేదు. ఇదంతా నేటికాలపు వ్యాపార హోమియోపతీ మాత్రమె. అందుకే అది అస్సలు పనిచెయ్యదు. హోమియోపతీలో కేటలాగ్ వైద్యం లేనే లేదు. పైపూతలకు హోమియోలో విలువ లేదు. ఏదైనా ప్రాణశక్తి నుంచే, లోపలనుంచే రావాలి.ప్రాణానికి విలువ ఇచ్చే వైద్యం ఒక్క హోమియోపతి మాత్రమే.
అయితే ఒకటి మాత్రం నిజం. నేటి ప్రజలు కూడా పత్యాలూ నియమాలూ పాటించమంటే వినేరకాలు కారు. ఆహారపు అలవాట్లూ, జీవనవిధానాలూ మార్చుకోమ్మంటే ససేమిరా వినరు. వీళ్ళు ఉండే అనాచారపద్దతుల్లో వీరు ఉంటారు. కాని రోగాలు మాత్రం తగ్గిపోవాలి. ఆ క్రమంలో స్టెరాయిడ్స్ వాడినా,ఒళ్ళు గుల్ల అయినా వారికి అనవసరం. అందినంతవరకూ జీవితాన్ని విచ్చలవిడిగా ఎంజాయ్ చెయ్యడం.ఒంట్లో ఏదైనా చెడిపోతే కార్పోరేట్ హాస్పటల్ కు పరిగెత్తి ICU లో పడుకోవడం. ఆఫ్ కోర్స్. అక్కడ బెడ్స్ ను ఎలాగూ అవినీతిమంత్రులూ,కేసులేదుర్కొంటున్న అధికారులూ ముందే ఆక్రమించుకొని ఉంటారనుకోండి. అది వేరే సంగతి.ఇలాంటి మనస్తత్వాలు ఉన్న పేషంట్లకు నేటి కార్పోరేట్ అల్లోపతీ వైద్యులే సరైన గురువులు. పాతకాలంలో వైద్యుని వద్దకు వెళితే జేబు మాత్రమె ఖాళీ అయ్యేది. నేడు వైద్యుని వద్దకు వెళితే బేంక్ బేలన్స్ మొత్తం ఖాళీ అవుతున్నది. కానీ రోగం మాత్రం పూర్తిగా తగ్గటం లేదు. ఒకరకంగా నేటి ప్రజలకు ఇలాంటి డాక్టర్లే కావాలి. అక్రమసంపాదనకు అలవాటు పడ్డ నేటి ప్రజలకు అక్రమంగా దోచుకునే డాక్టర్లే సరియైన గురువులు.పాతకాలపు శుద్ధమైన వైద్యం నిస్వార్ధంగా చేసే డాక్టర్లు నేటి తరానికి నచ్చరు.
అయితే చవకైన హోమియోపతీ వైద్యాన్ని కూడా అత్యంతఖరీదైన వైద్యంగా మార్చే ప్రయత్నాలు ఈమధ్యన జరుగుతున్నాయి. చెయిన్ క్లినిక్సూ, మల్టి స్పెషాలిటీ హోమియో క్లినిక్సూ వెలుస్తున్నాయి. మొన్నీ మధ్యన సంతానం లేని ఒక జంట 'హోమియో ఫెర్టిలిటీ క్లినిక్' ఒకదానికి వెళ్లి అక్కడి డాక్టర్ని కలిస్తే, మీ సమస్యకు ఆరునెలలు ట్రీట్ మెంట్ తీసుకోవాలి, ఒక్కొక్కరికి పాతిక వేలు అవుతుంది అని చెప్పి ముందుగానే ఏభై వేలూ కట్టమని చెప్పారట. వాళ్ళ గుండాగినంత పనయ్యి మాకోద్దులే ఈ వైద్యం అని చక్కా వచ్చారు. నిజానికి ఆ సమస్యకు ఇచ్చే ట్రీట్మెంట్ కు అందులో ఎభైయ్యో వంతు (అంటే వెయ్యి రూపాయలు) కూడా అవదు. కాకపోతే కార్పోరేట్ ఆస్పత్రి ఖర్చులు, మేయిన్టేనేన్సూ ఎవరు పెట్టుకోవాలి? అని డాక్టర్లు వాదిస్తారు. అదే డాక్టర్లు మరి పాతకాలపు హోమియో దిగ్గజాలకున్న వైద్యనైపుణ్యాన్ని అందుకోవాలని మాత్రం ప్రయత్నించరు. అదేమంటే ఆ పాతకాలపు పద్దతులు ఇప్పుడు పనికిరావు అంటారు.
'రోగీ పాలే కోరాడు వైద్యుడూ పాలే తాగమన్నాడు' అన్నట్లు నేటి ప్రజలకూ హంగులూ ఆర్భాటాలూ చూపి మోసంచేసే వైద్యులే కావాలి. డాక్టర్లకేమో సాయంత్రానికి లక్షలు కావాలి.అందుకే ఒకరికొకరు సరిపోయారు.కానీ, హోమియో వంటి ఉన్నతమైన ఆశయాలతో పుట్టిన వైద్యవిధానాన్ని కూడా భ్రష్టు పట్టిస్తున్న నేటి హోమియోడాక్టర్లను చూచి హన్నేమాన్ ఆత్మ ఎలా క్షోభిస్తుందో నేనైతే ఊహించలేకున్నాను. నేటి డాక్టర్లకు ఆశ ఎక్కువ నైపుణ్యం తక్కువ. అందుకే హోమియోవైద్యం గురించి ప్రజలకు సరైన వాస్తవాలు తెలియని పరిస్తితి ఇంకా సమాజంలో ఉన్నది.
మన దేశంలో హోమియో వైద్యరంగంలో మొదటితరపు దిగ్గజాల ఉత్తేజపూరిత జీవితాలు చదివి అయినా నేటితరపు డాక్టర్లు కొంత విలువలనూ, ఆశయాలనూ, నైపుణ్యాన్నీ నేర్చుకుంటే అదే పదివేలు. భారీ ఫీజులు వసూలు చేస్తే చేసారు, కనీసం శుద్ధమైన హోమియోపతిని వాడి ప్రజలకు వైద్యం చేసే డాక్టర్లు కొంతమంది అయినా తయారైనప్పుడే మళ్ళీ పాతకాలపు స్వర్ణయుగం హోమియో ప్రపంచంలో వస్తుంది. ఉన్నత ఆశయాలతో ఒక విప్లవాత్మకమైన వైద్య విధానాన్ని సృష్టించిన డాక్టర్ హన్నేమాన్ ఆత్మ కొంతైనా సంతోషిస్తుంది. కాని అంతటి నైపుణ్యాన్ని సాధించాలంటే, ఎంతో దీక్షతో పట్టుదలతో విలువలతో కూడిన అధ్యయనం ఉండాలి. నేటి డాక్టర్లకు అంతటి దీక్ష ఉందా అనేది నాకైతే అనుమానమే.