మొన్న మూడోతేదీనుంచి ఈ రోజువరకూ కుజుడు భూమికి బాగా దగ్గరకి వచ్చాడు. ఈ రోజు వీరిద్దరి మధ్య దూరం 100 మిలియన్ కిమీ ఉంది. లెక్కల ప్రకారం వీరి మధ్యన అతి తక్కువ దూరం 55 మిలియన్ కి.మీ గానూ అతి ఎక్కువ దూరం 400 మిలియన్ కి.మీ గానూ ఉంటుంది. కనుక ప్రస్తుతం కుజుడు భూమికి బాగా దగ్గరగా ఉన్నట్లే లెక్క. అందుకే కుజుని తేజస్సు బాగా కనిపిస్తూ సింహరాశిలో ఈగ్రహం కంటికి చక్కగా దర్శనం ఇస్తోంది. మరి అగ్నితత్వ గ్రహమైన కుజుడు భూమికి దగ్గరగా వస్తే ఏమి జరుగుతుంది? కుజుని కారకత్వాలు మనకు తెలుసు. అగ్ని ప్రమాదాలు, గొడవలు, యుద్ద వాతావరణం, ప్రకృతివిలయాలు, సామూహిక జననష్టాలు ఈయన కారకత్వాలలోనివి అని జ్యోతిష్యగ్రంధాలు చెబుతున్నాయి. గత రెండు రోజులుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఇవి నిజమే అని అర్ధం అవుతుంది.
>>4 వ తేదీ ఆదివారంనాడు రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఆయుధడిపో పేలిపోయి దాదాపు 200 మంది మాడి మసైపోయారు. ఇంకొక 2000 మంది ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఇల్లూ వాకిళ్ళూ వదలి పారిపోయారు.
>>3 వ తేదీ శనివారం నాడు పోలాండ్ లో రెండు రైళ్ళ హెడ్ ఆన్ కొలిజన్ లో 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
>>ఇదే శనివారంనాడు సెంట్రల్ అమెరికాలో తుఫానులు భీభత్సం సృష్టించాయి. దాదాపు 13 తుఫానులు శుక్రవారం నుంచి శనివారం లోపు విలయతాండవం చేసాయి. ఇండియానా రాష్ట్రంలోని మేరీస్ విల్లి అనే ఊరు ఊరే లేకుండా మాయమై పోయింది అని న్యూస్ చెబుతోంది.
>>2 వ తేదీ శుక్రవారం పాకిస్తాన్ లో జరిగిన దాడులలో కనీసం 100 మంది చనిపోయారు.
>>4 తేదీ ఆదివారం నాడు చైనా తన మిలిటరీ బడ్జెట్ ను 100 బిలియన్లు గా ప్రకటించింది. ఈ ప్రకటనవల్ల అనేక ప్రపంచదేశాల గుండెల్లో గుబులు మొదలైంది. యుద్దానికి, మిలటరీకి సంబంధించిన విషయాలు కుజుని ఆధీనంలో ఉంటాయని మనకు తెలుసు.
>> ఇరాన్ తో మిగతా దేశాల వైరం ఊపందుకుంటున్నది. రాబోతున్న అమెరికా ఎన్నికల దృష్ట్యా మరొక "బూచిని" ఇరాన్ రూపంలో అమెరికా ప్రజలకు చూపించి ఓటర్లను మాయ చేసే ప్రయత్నం జరుగుతున్నది. ఇది ముందుముందు యుద్ధానికి దారి తీసే సూచనలున్నాయి.
గ్రహప్రభావం భూమిమీద తప్పకుండా ఉంటుంది. మనిషి జీవితంమీద కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాకుంటే ఎక్కడ ఎలా ఆ ప్రభావాలుంటాయో తెలుసుకోగలిగితే కొంత ఉపయోగం ఉంటుంది. సామూహిక జన హననం ఆపడం ఎవరివల్లా కాదు. ఎందుకంటే సామూహికకర్మను ఆపే శక్తి ఎవరికీ ఉండదు. ఆపగల శక్తి ఉన్నటువంటి శ్రీకృష్ణునివంటి అవతారపురుషులే చూస్తూ ఊరుకున్నారు.కాని వ్యక్తి జాతకంలో ఇలాంటి దుస్సంఘటనలు జరిగే పరిస్తితులు ఉన్నపుడు వాటిని తగిన రెమెడీస్ ద్వారా నివారించుకోవచ్చు. అంతవరకు జ్యోతిశ్శాస్త్రం వీలు కల్పిస్తుంది. ప్రపంచానికి మనం గొడుగు పట్టలేం. కాని మనవరకు మనం గొడుగు వేసుకుని ఎండనుంచి రక్షణ పొందవచ్చు.
రేపు 8 వ తేదీన పౌర్ణమి రాబోతున్నది. ఈ లోపల మరిన్ని సంఘటనలకు రెడీగా ఉందాం. వ్యక్తిగత జీవితాలలో కూడా ఈ మధ్యలో ఏక్సిడేంట్లు జరగడం , దెబ్బలు తగలడం, అనారోగ్యాలు ఎక్కువ కావడం, అనవసర ఉద్రేకాలు పెరగడం, ఇతరులతో గొడవలు, వస్తువులు రిపేర్లు రావడం గమనించవచ్చు.