కోపెన్హాగెన్ విశ్వవిద్యాలయంలో జరిపిన పరిశోధనలలో ఒక విషయం వెల్లడైందిట. అదేమంటే కీళ్ళవాతం(రుమటాయిడ్ ఆర్ధరైటిస్)ఉన్నవారికి గుండె దెబ్బతినే అవకాశం మిగతా వారికంటే 40% ఎక్కువ. అలాగే వారికి పక్షవాతం వచ్చే అవకాశమూ ఎక్కువేట. పోనీలే ఇన్నాళ్ళకైనా ఈవిషయం వారు గ్రహించగలిగారు. సంతోషం కలిగింది.
ఈ విషయాన్నిహోమియో వైద్యసృష్టికర్త శామ్యూల్ హన్నేమాన్ రెండువందల ఏళ్ల క్రితమే స్పష్టంగా చెప్పాడు. ఆయన వ్రాసిన "క్రానిక్ డిసీజెస్" అన్న పుస్తకంలో ఈ విషయం స్పష్టంగా వివరించాడు. సైకోసిస్ అనే మయాజం రక్తంలో ఉంటె దానివల్ల కీళ్ళనొప్పులు వస్తాయనీ దాని అణచివేత వల్ల గుండెదెబ్బ తింటుందనీ, గుండెకు వచ్చే దాదాపు అన్ని వ్యాదులకూ మయాజమ్స్ కారణమనీ ఆయన చాలా క్లియర్ గా తన పరిశోధనల ఫలితంగా తేల్చి చెప్పాడు. అంతేకాదు కీళ్ళనొప్పులూ గుండెజబ్బూ కూడా ప్రత్యెక వ్యాధులు కావనీ నూటికి తొంభైతొమ్మిది శాతం ' సోరా' 'సైకోసిస్' అనబడే మయాజంల వలన వచ్చే సెకండరీ మరియు టెర్షియరీ ఫలితాలనీ, అవి రెండూ ఒకేవ్యాధి యొక్క భిన్నరూపాలనీ ఎప్పుడో రెండు శతాబ్దాల క్రితమే వివరించాడు. కాని ఆయనమాట ఎవరూ పట్టించుకోలేదు.
హోమియో వైద్యవిధానంలో ఒక గుండెజబ్బును ట్రీట్ చేస్తే అది తగ్గి ఆరోగికి కీళ్ళనొప్పులు బయటపడిన కేసులూ, ట్రీట్మెంట్ కంటిన్యూ చేయగా అవీ తగ్గి చర్మరోగాలూ, ఎప్పుడో అణచివేయబడిన గనోరియా బయటపడిన కేసులూ ఆ తర్వాత అవీ క్రమంగా తగ్గిన కేసులూ ఎన్నో ఉన్నాయి. హోమియో విధానంలో ఇది చాలా చక్కని శాస్త్రీయ అవగాహన. కానీ, చాలామంది వీటిని నమ్మరు. అనుభవించే ఖర్మ ఉన్నప్పుడు నమ్మకం కలగదు. ఎవరికీ ఎంత ఏ రకంగా వదలాలో అంత వదిలి అల్లోపతీ వైద్యుల చేతిలో నానాబాధలూ పడితేగాని కర్మతీరదు మరి.
రెండువందల ఏళ్ల క్రితమే హన్నేమాన్ చెప్పిన సిద్ధాంతాలు నేడు పరిశోదనకు నిలబడి, అవి అక్షరసత్యాలే అని కనీసం నేడైనా మెడికల్ సైన్స్ నమ్మాల్సి రావడం ముదావహం. అలాగే జ్యోతిష్యం కూడా సైన్సా కాదా అని వాదించుకునే రచ్చబండ బైతన్నలు వారే అందులో పరిశోధన చేసి అది సైన్సో కాదో నిరూపించేపనికి తామే ముందుకు వస్తే బాగుంటుందేమో. ఆ పనికి మాత్రం ఎవరూ ముందుకు రారు.అలా చెయ్యాలంటే ఎంతో అధ్యయనం చెయ్యాలి. కొన్ని వేలజాతకాలను శోధించాలి. అనేక సూత్రాలను అనేక జాతకాల మీద నిగ్గుతేల్చి చూడాలి. సిద్ధాంతబాగంలోనూ ఫలితభాగంలోనూ ఉన్న ప్రాధమికసిద్ధాంతాలనుంచి మొదలుపెట్టి అర్ధం చేసుకుంటూ పరిశీలిస్తూ రావాలి. దానికి ఎంతో కష్టపడాలి. బోలెడంత సమయమూ ధనమూ వెచ్చించాలి.ఇదంతా చేస్తే మిగిలేది ఆత్మసంతృప్తి తప్ప డాలర్లేమీ రాలవాయె. అదంతా చేసే ఓపిక ఎవరికుందీ? దానిబదులు ఏదో మన నోటికి వచ్చింది నాలుగుకామెంట్లు రాసేసి/చేసేసి, ఒకవేళ అలా ఎవరైనా రీసెర్చి చేస్తుంటే వాళ్ళమీద నాలుగు రాళ్ళేసి,మన అజ్ఞానం బయటపెట్టుకునే చాన్స్ ఉన్నపుడు ఇంత కష్టపడి ఏళ్లకేళ్ళు రీసెర్చి చేసి మాట్లాడే ఓపిక ఎవరికుంది గనుక? చిన్న ఉదాహరణ. రాహుకేతువులు అసలు భౌతికంగా లేవుకదా వాటిని గ్రహాలని చెప్పే జ్యోతిష్యం అసలు ఒక విజ్ఞానమా? అని మొన్న ఎవరో వాదిస్తున్నారు.
జీవవిజ్ఞానం, ప్రాణవిజ్ఞానం లేనివాళ్ళు నేడు డాక్టర్లు! కనీసం గ్రహం అనే పదానికి అర్ధం తెలియనివాళ్ళు జ్యోతిష్యంమీద బ్లాగుల్లోనూ టీవీలలోనూ చర్చించి అమీతుమీ కంక్లూజన్స్ ఇచ్చేవాళ్ళు!! చూస్తుంటే, ప్రపంచంలో అసలైన సత్యాలు ఎప్పటికీ మైనారిటీలుగానే ఉండాలేమో,అవి అందరికీ తెలియకూడదేమో,సృష్టిధర్మం ఇదేనేమో అనిపిస్తోంది. అజ్ఞానమా వర్ధిల్లు !!!