నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

25, మార్చి 2012, ఆదివారం

యాగంటి యాత్ర


యాగంటి అనేది బనగానపల్లెకు దగ్గరగా ఉన్న ఉమామహేశ్వర క్షేత్రం. అహోబిలం నుంచి ఆళ్లగడ్డ, కోయిలకుంట్ల మీదుగా బనగానపల్లె వచ్చి అక్కణ్ణించి యాగంటి చేరాలి. యాగంటి కూడా ఎత్తైన కొండలమధ్యలో ఉన్న క్షేత్రమే. ఇక్కడ కొండలు పొరలుపొరలుగా, పలకలను ఒకదానిపైన ఒకటి పెర్చినట్లుగా ఉంటాయి. బహుశా వీటిలో సున్నం పాళ్ళు ఎక్కువగా ఉన్నట్లుంది. స్థలపురాణం ప్రకారం, అగస్త్య మహర్షి ఇక్కడ కొన్నాళ్ళు తపస్సు చేసిన తర్వాత విష్ణువు కోసం ఒక ఆలయం నిర్మించాలని భావించాడట. ఆలయం అంతా పూర్తయిన తర్వాత వేంకటేశ్వరుని విగ్రహాన్ని చెక్కిన చోటనుంచి కదిలించి గర్భ గుడిలోనికి తీసుకురాబోతుంటే ఆ విగ్రహం కాలి బొటనవేలు విరిగిందట. భిన్నమైన విగ్రహం ప్రాణప్రతిష్టకు పనికిరాదు గనుక ఏమి చెయ్యలా అని ఆలోచిస్తున్న అగస్త్యుని కలలోకి ఈశ్వరుడు వచ్చి, " నాయనా. ఇక్కడ ఏడాది పొడుగునా పారే జలపాతం చూచావు కదా. నేను అభిషేక ప్రియుణ్ణి. కనుక ఈ జలపాతం ఉన్నచోట నాకు ఆలయం కట్టించాలి కాని విష్ణువుకు కాదు. కనుక నీవు వెంకటేశ్వర విగ్రహప్రతిష్ట మానుకో. దానిబదులు శివలింగాన్ని ప్రతిష్టించు ". అని చెప్పాడు. అందువల్ల, ఆలయం విష్ణువుదైనా విగ్రహప్రతిష్ట జరిగే సమయంలో శివలింగాన్ని ప్రతిష్ట చేసారు. అమ్మవారి విగ్రహం ప్రత్యేకంగా ఉండదు. శివునిలోనే అమ్మవారు కూడా ఉన్నట్లు భావిస్తారు. ఇదీ ఇక్కడి ఆలయప్రత్యేకత. ఆలయంలో ద్వారపాలకులు,ఇతరవిగ్రహాలూ అన్నీ విష్ణుఆలయంలో వలె ఉంటారు. కాని గర్భాలయంలో శివలింగం ఉంటుంది. అదికూడా మిగతా శివలింగాల వలె కాకుండా ఒక గొగ్గులుగా ఉన్న పలక మాదిరి ఉంటుంది. బహుశా అక్కడ దొరికే పలకలలో ఒకదానిని ప్రాణప్రతిష్టకు వాడారేమో అన్న అనుమానం కలుగుతుంది.


రాయలసీమలో ఉన్న ఆలయాలలో ఒక పుష్కరిణి దానికి నాలుగు వైపులా స్నానానికి మండపాలు ఉంటాయి. ఇవి అక్కడి ప్రాచీన ఆలయాల నిర్మాణ రీతులు. అలాంటి పుష్కరిణిని ఇక్కడ చూడవచ్చు. ఎక్కడో కొండలనుంచి జాలువారుతున్న జలపాతం గుడి ఆవరణ గుండా ప్రవహిస్తూ వచ్చి ఈ పుష్కరిణిలో పడి అక్కడనుంచి పల్లానికి ప్రవహిస్తూ క్రిందుగా ఉన్న పొలాలను సాగుచేయ్యడానికి ఉపయోగపడుతుంది. ఇటువంటి ప్లాన్ తో కట్టిన దేవాలయాలు రాయలసీమలో చాలా ఉన్నాయి. మహానంది కూడా ఇలాగే ఉంటుంది. పాతకాలంలో, నీటివసతి ఉన్న చోట ఇలాంటిబహుళ ఉపయోగకర ప్రాజెక్టులవంటివి కట్టేవారు. దైవదర్శనంవల్ల ప్రజలకు ధర్మచింతనా పెరుగుతుంది. దేవాలయానికీ యాత్రికులకూ ఏడాది పొడుగునా నీటివసతి ఉంటుంది. పొలాలకు సాగునీరూ సరఫరా అవుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఇలాంటి దేవాలయాల వల్ల కలిగేవి.మేము వెళ్ళిన సమయంలో వానరవీరులు ఆ పుష్కరిణిలో చక్కగా ఈతలు కొడుతూ కనిపించారు.ఇక్కడ ఉన్న ఇంకొక విచిత్రం. ఈ ఆలయ ప్రాంగణంలో  కానీ చుట్టూ ఉన్న కొండలలో కానీ ఎక్కడా 'కాకి' కనిపించదు. దానికొక కధ చెప్తారు. అగస్త్య మహర్షి తపస్సు చేసుకునే సమయంలో కాకులు ఆయన చుట్టూ చేరి గోలగోల చేసి చీకాకు పరచాయట. ఆయనకు కోపం వచ్చి"మీకు కానీ మీ స్వామి అయిన శనీశ్వరునికి కానీ ఇక్కడ స్థానం లేదు. పొండి" అని శపించాడట. అందుకనే ఈ ఆలయంలో నవగ్రహాలు ఉండవు. అలాగే కాకి కూడా ఇక్కడ వాలదు.చూద్దామన్నా ఎక్కడా కనిపించదు. శని అడుగుపెట్టలేని క్షేత్రం ఇదొక్కటే అని అంటారు. అందుకనే శనిదోషాలున్న వారు ఇక్కడకు వచ్చి పూజలుచేస్తే ఆ దోషాలు తొలగిపోతాయని చెప్తారు.  ఆలయం వెనుకగా ఎత్తైన గుట్టమీద ఒక దీపాన్ని వెలిగిస్తారు. ఆ గుట్ట ఒంటికొమ్ము స్తంభంలాగా ఉంటుంది. మెట్లు ఉండవు. అలవాటు ఉన్న ఒక పూజారి మాత్రమే గత ఇరవై ఏళ్లుగా దానిపైకి పాకుతూ ఎక్కి అక్కడ దీపాన్ని వెలిగించి వస్తాడు. ఎంత గాలికీ అది ఆరకుండా వెలుగుతుంది. ఎక్కేటప్పుడు చెయ్యిజారి అక్కణ్ణించి పడితే ఇంతే సంగతులు.





ఇక్కడే పక్కగాఉన్న కొండలలో ఒక గుహలా కనిపిస్తుంది. మెట్లెక్కి దానిలోకి పోతే, అక్కడ ఒక వెంకటేశ్వరస్వామి విగ్రహం కనిపిస్తుంది. వెంకటేశ్వరస్వామి తిరుమలకు పోక ముందు ఇక్కడే ఉన్నాడనీ, చివరిలో ఆలయాన్ని శివాలయంగా మార్చడం వల్ల ఆయన మూడు 
అంగలలో తిరుమలకు చేరుకున్నాడనీ చెప్తారు. మొదటి అడుగు యాగంటిలో, రెండవ అడుగు దేవునికడపలో, మూడవ అడుగు తిరుమలలోని శ్రీవారి పాదాలవద్దా వేశాడని ఒక కధ చెబుతారు. గుహలోనుంచి ఆయన వెళ్ళినట్లుగా చెబుతున్న దారిలోని మెట్లవద్ద దేపాలు వెలిగిస్తారు. ఇక్కడే ఇంకొక పక్కగా ఉన్న గుహలో బ్రహ్మంగారు తన శిష్యురాలికి ఉపదేశం చేసిన ప్రదేశం ఉంది. బ్రహ్మంగారు ఇక్కడ గుహలో కొన్నాళ్ళు తపస్సు చేసాడని చెబుతారు. బనగానపల్లె ఇక్కడకి బాగా దగ్గరగా ఉంటుంది. ఈ ప్రదేశం అంతా కోతులు ఎక్కువగా కనిపిస్తాయి. యాత్రికులను ఏమీ చెయ్యవు. వాటి ఆటలు అవి ఆడుకుంటూ, మనం ఏమైనా పెడితే తింటూ తిరుగుతూ ఉంటాయి. మనం పూజలు చేసేటప్పుడు కూడా పైన చూర్ల లో, పందిళ్ళలో దాక్కుని కిందఉన్న మన చేతిలో ఏమున్నాయో గమనిస్తూ ఉంటాయి.ఒక్కొక్కసారి చేతిలోని సెల్ఫోన్లూ,కళ్ళజోడులూ,కెమేరాలూ లాక్కుని పారిపోవడమూ జరుగుతుంది.




వెంకటేశ్వరస్వామి గుహలోనుంచి చూస్తె యాగంటి గోపురం ఇలా కనిపిస్తుంది. ఈ గోపురం ఎదురుగానే గర్భగుడి ఉంటుంది. మామూలుగా శివాలయంలో స్వామి ఎదురుగా ఉండే నందీశ్వరుడు ఇక్కడ ఒక పక్కగా ఉండటం చూడవచ్చు. కొన్నేళ్ళ క్రిందట ఆ నంది విగ్రహం నాలుగు స్తంభాల మంటపం మధ్యలో ఉండేది. అప్పుడు నందికి ప్రదక్షిణం చెయ్యాలంటే మంటపం లోపలే చెయ్యగలిగేవారు. కాని నేడు ఆ నంది పెరిగి మంటపం అంతా ఆక్రమించింది. కనుక ఇప్పుడు ప్రదక్షిణం చెయ్యాలంటే స్తంభాల బయటగా చెయ్యవలసి వస్తున్నది. కొన్ని బండరాళ్ళకు పెరిగే గుణం ఉంటుంది. వాటిని విగ్రహాలుగా చెక్కటం వల్ల ఆ విగ్రహాలు కూడా క్రమేణా పెరుగుతున్నట్లు కనిపిస్తాయి. కాణిపాకం వినాయకుని విగ్రహమూ అలాంటి లక్షణం ఉన్నదే. యాగంటి నంది పెరుగుతున్న విధం చూస్తే, ఒక తీరూ తెన్నూ లేకుండా అసౌష్టవంగా పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. చేక్కినప్పుడు మంచి సౌష్టవంగా ఉన్నప్పటికీ తర్వాత ఆ రాయి అన్ని వైపులకూ సమంగా పెరిగినట్లు కనపడదు. అందుకే నంది యొక్క కొలతలు అన్నీ తారుమారుగా ఉన్నట్లు మనకు కనిపిస్తాయి. బ్రహ్మంగారు ఈ నంది గురించే వ్రాస్తూ ఇది పెరిగి పెరిగి కలియుగాంతంలో రంకె వేస్తుందని అంటారు. అంటే బాగా పెరిగి పెటిల్లని పగిలిపోతుందేమో. దానినే రంకె వెయ్యడం అని మార్మికభాషలో వ్రాసి ఉండవచ్చు.   



బనగానపల్లె నుంచి యాగంటికి పోయే దారిలో అరుంధతి కోట ఉంది. హారర్ సినిమా 'అరుంధతి' లో కోట ఇదేనని అక్కడివారు చెప్పారు. సినిమా యూనిట్ అంతా అక్కడ ఒక నెలరోజులు ఉండి, షూటింగ్ తీశారని ఆ కోటకు కాపలాగా ఉన్న ఒక ముసలమ్మ చెప్పింది. తనకు కొంత డబ్బులిస్తే లోపల రూములు చూపిస్తానంది. సరే అలాగే చేసి, తాళాలు తీయించి లోపలి రూములు చూచాము. మాంత్రికుణ్ణి జీవసమాధి చేసే హాలు లోపల ఉంది. ఈ కోట ఒక పెద్ద గుట్టమీదుగా ఉంటుంది. నిజానికి ఇది బనగానపల్లె నవాబు తన ఉంపుడుకత్తెకు కట్టించి ఇచ్చిన కోట అని ఆమె చెప్పింది. ప్రస్తుతం నవాబు కుటుంబీకులు హైదరాబాదులో ఉన్నారనీ, కోటని కనిపెట్టుకుని ఉన్నందుకు తనకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తారనీ చెప్పింది. కోట లోపల కొన్ని గదుల్లో కప్పు రాలిపోయింది. మొత్తం తొమ్మిది గదులూ పెద్ద హాలూ ఉన్నాయి. కింద నేలమాళిగ ఉన్నట్లుంది. దాని తలుపు మాత్రం ఆమె తియ్యలేదు.


మన దేశంలో అనేక బౌద్దాలయాలు శివాలయాలుగా విష్ణ్వాలయాలుగా మార్చబడ్డాయి. అలాగే, శైవులకూ వైష్ణవులకూ జరిగిన గొడవలలో అనేక దేవాలయాలు ఇటునించి అటూ,అటునించి ఇటూ మార్చబడ్డాయి. అటువంటి ఆలయాలలో ఇదీ ఒకటి అయ్యుండవచ్చు అని నాకూ అనిపించింది. దానికి అగస్త్యమహర్షికధను అల్లి జోడించి ఉంటారు.ఇలాటి కధలు అల్లడంలో మనవాళ్ళు సిద్ధహస్తులు.ఏది ఏమైనా,ఒకసారి తప్పక దర్శించదగ్గ శైవక్షేత్రాలలో యాగంటి ఒకటి అని చెప్పవచ్చు.