నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

31, జులై 2012, మంగళవారం

తమిళనాడు ఎక్స్ ప్రెస్ ప్రమాదం - ఎవరేం నేర్చుకోవాలి?

నాలుగేళ్ల క్రితం గౌతమీ ఎక్స్ ప్రెస్ ప్రమాదం జరిగి ఇలాగే ప్రయాణీకులు మంటల్లో మాడిపోయారు. మళ్లీ నిన్న తమిళ్ నాడు ఎక్స్ ప్రెస్ లో అదే రకమైన ఘటన జరిగి 30 మంది పైగా సజీవదహనం అయ్యారు.దీన్నుంచి ఎవరైనా ఏమైనా నేర్చుకున్నారా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

అమెరికాలో ట్విన్ టవర్స్ ప్రమాదం జరిగితే మళ్లీ అలాంటి ప్రమాదం ఇంకోటి జరక్కుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అనుమానం ఉన్న ప్రతిచోటా ఇప్పటికీ సోదాలు చేస్తున్నారు. చైనాలో ఒక రైలు ప్రమాదం జరిగినా, ఒక వంతెన కూలిపోయినా బాధ్యులైన వారికి పడే శిక్షలు దారుణంగా ఉంటాయి. అందుకే అక్కడ అలాంటివి మళ్లీ మళ్లీ జరగవు. మన దేశంలో మాత్రం అలా కాదు. ఇక్కడ ఏ రోజుకి ఆ రోజే. మర్నాటికి అందరూ అన్నీ మర్చిపోతారు.

మనదేశంలో పరిస్తితి భలే విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ ఏం జరిగినా ఎవరికీ పట్టదు. మూడో రోజుకి ఇది చద్దిన్యూస్ అయిపోతుంది. అందరూ దీనిని చక్కగా మర్చిపోతారు. మళ్లీ ఇంకో కొత్త సెన్సేషనల్ న్యూస్ మనకు కావాలి. ఆ కాసేపు మీడియా హడావుడి చేస్తుంది. అధికారులు ఏమీ చెప్పలేరు. ఎంక్వైరీ అయ్యాక చెప్తామంటారు. అదెప్పుడు అవుతుందో ఎవరికీ తెలియదు. నాలుగేళ్ల క్రితం జరిగిన గౌతమీ ఎక్స్ ప్రెస్ సంఘటనలోనే ఇంతవరకూ ఎక్స్ గ్రేషియా ఇవ్వలేదట. చాలా బాగుంది. రూల్స్ అనేవి ఇలాంటప్పుడే మేమున్నాం అంటూ నిద్రలేస్తాయి. మరి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడూ, వాటికి బాధ్యులను శిక్షించాల్సి వచ్చినపుడూ ఆ రూల్స్ ఎక్కడుంటాయో ఎవరికీ తెలియదు.

ముంబాయి పేలుడుకు కారకులైన హంతకులను, పార్లమెంట్ దాడి హంతకులను హైక్లాస్ జైలు లో ఉంచి బిరియానీలతో మేపుతూ, ఏళ్ళ తరబడి వాళ్ళను పోషింఛి, వారిని వస్తాదుల్లా తయారుచేసే  మనకు ఇలాంటి శాస్తి జరగవలసిందే. అయితే నాయకులు చేస్తున్న పనులకు శిక్ష మాత్రం సామాన్యుడికి పడుతున్నది. అదీ విచిత్రం. 

మొన్న మంటల్లో మాడి మసై పోయింది, హంతకులో, టెర్రరిష్టులో కాదు. జేబులో డబ్బు చెల్లించి హుందాగా ప్రయాణం చేద్దామనుకున్న అమాయక ప్రయాణీకులు. యధావిధిగా అనుమానాలు అన్నీ మూడు కారణాలవైపు మళ్ళుతున్నాయి. ఒకటి -- విద్యుత్ షార్ట్ సర్క్యూట్. రెండు --విద్రోహ చర్య. మూడు -- కాకతాళీయ ప్రమాదం. కారణం ఈ మూడిట్లో ఏదైనా, దానిని నివారించలేకపోయిన ఇంత పెద్ద యంత్రాంగం సిగ్గుతో ఆత్మహత్య చేసుకోవాలి.ఎవరికో జరిగిందిలె మనం సేఫ్ అని నేడు అనుకుంటే రేపు ఇలాంటి ఇంకో ప్రమాదంలో మన బంధువులే ఉండొచ్చు, లేదా మనమే ఉండొచ్చు.

ఇలాంటి ప్రమాదాలకు కొన్ని కారణాలు, వాటిని నివారించవలసిన తీరులు పరిశీలిద్దాం.

1. రైల్వే కోచ్ లకు పీరియాడికల్ ఓవర్ హాలింగ్ అనేది కాగితాలకే పరిమితమా లేక నిజంగా జరుగుతున్నదా అన్న విషయం పరిశీలించాలి. కాలం చెల్లిన కోచ్ లను కూడా ఇంకా కొన్ని లైన్లలో తిప్పడం నిజమేనా కాదా పరిశీలించాలి.   

2. మూడు నాలుగు కోచ్ లకు ఒక టీటీఈ ఉంటే అతను ఏ కోచ్ పైనా దృష్టి పెట్టలేడు. ఏ సంఘటనకూ అతన్ని బాధ్యుడినీ చెయ్యటం వీలుకాదు. కనుక ఈ రూల్ ను మార్చాలి. ప్రతి కోచ్ లోనూ ఒక టీటీఈ ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. ఒకవేళ ఇది వీలుకాని పక్షంలో ప్రత్యామ్నాయం ఏదో ఒక ఏర్పాటు చెయ్యాలి. అంతేగాని భద్రతను గాలికి వదిలేయ్యకూడదు. ఒక స్టేషన్లో రైలు ఆగితే, టీటీఈ తను పని చేస్తున్న నాలుగు కోచ్ లకున్న 16 తలుపులనుంచీ ఎవరు ఎక్కుతున్నారో ఎవరు దిగుతున్నారో ఎవరు ఏమి తీసుకుని ఎక్కుతున్నారో చూడగలడా? ప్రాక్టికల్ గా ఇది సాధ్యమేనా?   

3. ప్రమాదం జరిగాక చేసే కంటితుడుపు చేష్టలు మానేసి చిత్తశుద్ధితో ముందుచూపుతో భద్రతాచర్యలు చేపట్టాలి. రైళ్ళలో రక్షకసిబ్బంది సంఖ్యను పెంచాలి. వాళ్ళు హాయిగా పక్కేసుకుని నిద్రపోకుండా చర్యలు చేపట్టాలి. చాలారైళ్ళలో భద్రతా సిబ్బంది నిద్రపోతుంటే ప్రయాణీకులు మేలుకుని కాపలా కాస్తూ ఉంటున్నారు. నేటికీ రైళ్ళను ఆపి దారిదోపిడీలు చేస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి అంటే మనం అడివిలో ఉన్నామో, నాగరిక ప్రపంచంలో ఉన్నామో ఆలోచించాలి.

4. ఎనిమిదేళ్ళుగా రైల్వే చార్జీలు పెంచలేదు. పెంచుదామని ఒక మంత్రి ప్రయత్నిస్తే అతన్ని ఇంటికి పంపించిన ఘనమైన వ్యవస్థ మనది. ఓట్లకోసం చూచుకుంటూ రేట్లు పెంచకపోతే సిస్టం మెయింటేనేన్స్  కు ఫండ్స్ లేక ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో కలుస్తాయని ఎన్నో కమిటీలు మొత్తుకున్నాయి. ఎవరు వింటారు? పోయేది ఎవరివో ప్రాణాలు కదా? ఏసీ రూముల్లో కూచుని ఆదేశాలిచ్చే వారికి ఆ కష్టం ఎలా తెలుస్తుంది? ఆమ్ ఆద్మీ మాకు ముఖ్యం రెట్లు పెంచకూడదు అని గందరగోళం చేశారు. మరిప్పుడు చస్తున్నది ఆమ్ ఆద్మీనే కదా. దీనికి వారి జవాబు ఏమిటి?

5. నిన్న జరిగిన సంఘటనలో ముఖ్యమైన విషయం -- కోచ్ కి ఉన్న నాలుగు తలుపులలో మూడు తెరుచుకోలేదు. ఒక్కటే తెరుచుకుంది అంటున్నారు. ఆ ఒక్క తలుపు దగ్గర ఆ మంటలలో పొగలో ఎంత తొక్కిసలాట జరిగి ఉంటుందో ఊహించవచ్చు. మూడు తలుపులు నిజంగానే 'జాం' అయ్యాయా అన్న విషయం పరిశీలించాలి. ఒకవేళ అలా 'జాం' అయి ఉంటే, మరి దానికి బాధ్యులెవరు, అసలు తలుపులు ఎలా 'జాం' అయ్యాయి  అన్నది తేల్చాల్సి ఉంది.

6. కొత్త రైళ్ళు కొత్త లైన్లు లేక, ప్రయాణాలు చేసేవారి సంఖ్య పెరిగి, ఉన్న రైళ్ళలో ప్రయాణీకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది. లాంగ్ డిస్టెన్స్ రైళ్ళలో జనరల్ కోచ్ ల పరిస్తితి చూస్తే చాలా దారుణంగా ఉంటున్నది. టాయిలెట్ లో పదిమంది ఇరుక్కుని ప్రయాణిస్తూ కనిపిస్తున్నారు. ఇలాంటి దారుణం ఆఫ్రికన్ దేశాలలో కూడా ఉండదేమో అనిపిస్తుంది. దీనిని తక్షణమే నివారించే చర్యలు చేపట్టాలి.

7. స్లీపర్ క్లాస్ రిజర్వేషన్ కోచ్ లో మామూలుగా 72 మంది మాత్రమె ప్రయాణించాలి. కాని రాత్రిపూట కనీసం నూరుమంది ఉంటున్నారు. చాలామంది కింద పడుకొని ప్రయాణం చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదం ఏదైనా జరిగినప్పుడు జరిగే తొక్కిడిలో బయటపడలేక ఎందఱో ఎక్కడికక్కడే మాడి మసై పోతున్నారు. కోచ్ లలో ఓవర్ క్రౌడింగ్ నివారించాలి.

8. మొన్నటికి మొన్న నీళ్ళతో నడిచే కార్ ఇంజన్ కనుక్కున్నామని పాకిస్తాన్ ప్రకటించింది. అక్కడ ప్రభుత్వం లేదు. అంతర్యుద్ధం జరుగుతోంది. అలాంటి చోట అలాంటి ఆవిష్కరణలు వస్తున్నాయి. మన దేశంలో ఐఐటీ లున్నాయి, ఎన్ఐటీ లున్నాయి. వేలకోట్ల రూపాయలు రీసెర్చి మీద ఖర్చు పెడుతున్నారు. మంటలు అంటుకోని మెటీరియల్ తో  కోచ్ లు తయారుచేసే పరిజ్ఞానం పెద్ద గొప్ప ఆవిష్కరణ ఏమీ కాదు. అది చాలా సింపుల్ టెక్నాలజీ. దానిమీద ఎవరూ ఎందుకు దృష్టి పెట్టరో, ఇన్ని ప్రమాదాలు జరిగిన తర్వాత కూడా, ఎందుకు పట్టించుకోరో అర్ధం కాదు.   


9. చాలా స్టేషన్లలో పాయింట్స్ మెన్ లేరు. సహాయకుడు లేకుండా స్టేషన్ మాస్టర్ ఒక్కడే విధులు నిర్వహిస్తున్న స్టేషన్లు వందల్లో ఉంటున్నాయి. రైలు రెండో వైపు వెళ్లి పరిస్తితి గమనించి గ్రీన్ లైట్ సిగ్నల్ ఇవ్వాల్సిన పాయింట్స్ మెన్ లేకపోవడం సేఫ్టీకి తిలోదకాలివ్వడమే కదా.

10. రైల్వేలలో సేఫ్టీ చాలా ఘోరంగా ఉంది. కాలం చెల్లిన వంతెనలు, సరిగ్గా పట్టించుకోని ట్రాకూ, కాలం చెల్లిన సిగ్నలింగ్ వ్యవస్థా, సింగిల్ లైన్లూ, క్రమశిక్షణ లేని సిబ్బందీ ఇలా ఎన్నో కోణాలలో 'భద్రత' నీరుగారి పోతున్నది అని 'ఖన్నా కమిటీ' లాంటి ఎన్నో సేఫ్టీ కమిటీలు మొత్తుకున్నాయి. అవన్నీ ఎప్పుడో చెత్తబుట్ట పాలయ్యాయి. ట్రాక్ లేయింగ్ పనులు అవుట్ సోర్సింగ్ చెయ్యడం వల్ల పనుల్లో నాణ్యత లోపిస్తున్నది. క్రిమినల్ చరిత్ర కలిగిన లోకల్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించే బదులు L&T వంటి వారికి సోల్ కాంట్రాక్ట్ ఇస్తే పనుల్లో నాణ్యత బ్రహ్మాండంగా ఉంటుంది. సకాలంలో ఎస్టిమేట్ ప్రకారం పనీ పూర్తవుతుంది. లోకల్ రాజకీయాలకూ అడ్డుకట్ట పడుతుంది. భద్రతా ప్రమాణాలూ బాగుంటాయి. కాని ఆ పని ఎవ్వరూ చెయ్యరు. దానికి రూల్స్ అడ్డు వస్తాయి. రూల్స్ పెట్టుకున్నది మనమే. కాని మారుతున్న కాలంతో బాటు వాటిని మార్చుకోవాలి అన్న సంగతి మనం విస్మరించాం. కనుక ఈ ఖర్మ తప్పదు.


11. నెల్లూరు స్టేషన్లో అంతా బాగానే ఉన్నట్లు స్టేషన్ మాస్టర్ చెబుతున్నాడు. మరి ఆ స్టేషన్ దాటి ఒక కిలోమీటర్ కూడా పోకముందే అంత పెద్ద ఎత్తున మంటలు ఒక్కసారిగా లేచి కోచ్ మొత్తం ఒక పావుగంటలో తగలబడిపోయిందీ అంటే దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి? లోపం ఎక్కడుంది? ఒకవేళ ఎవరన్నా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి అతన్ని అంతం చెయ్యడానికి ఈ పద్దతి ఉపయోగించారా? విద్రోహ చర్య కాకుంటే ఇలా పావుగంటలో మొత్తం కోచ్ తగలబడే ఆస్కారం ఎంతమాత్రం లేదు కదా. కానీ అప్పుడు కూడా దానిని గమనించాల్సిన భద్రతా సిబ్బంది ఏమి చేస్తున్నట్లు?

ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో లోపాలున్నాయి. ఇన్ని లోపాలున్న వ్యవస్థలో ఎప్పుడో ఒక ప్రమాదం 'మాత్రమే' జరగటం దేన్నీ సూచిస్తున్నది? వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్న విషయం తెలీటం లేదూ? మన అనుమానాలు పనికిమాలినవనీ, ఆవేశాలు అసలే పనికిరానివనీ మనకెప్పుడు అర్ధమౌతుందో ఏమో?  


సరే ఈవిధంగా ఎవరెన్ని మాట్లాడుకున్నా,ఎన్ని చర్చలు చేసినా,పరిపక్వత చెందిన ప్రజాభిప్రాయమే ప్రజాస్వామ్యంలో శ్రీరామరక్ష అన్నది నగ్నసత్యం. దురదృష్టవశాత్తూ అదే మన వ్యవస్థలో లోపించింది. ప్రజలు ప్రలోభాలకు తలొగ్గి ఓట్లను అమ్ముకునే మన ఛండాలపు వ్యవస్థలో, రాజకీయులూ ప్రజలూ కలిసి దోపిడీ సాగిస్తున్న ఈ దేశంలో, ఇంతకంటే గొప్ప పరిస్తితి ఎలా ఊహించగలం? ఈ దేశంలో ఏదో ఉన్నతంగా జరగాలని ఊహించడమే అసలు మనం చేస్తున్న మొదటితప్పు. కనుక ఏది జరిగినా ఆ రోజుకి చర్చించడం, మర్నాటికి మర్చిపోవడం ఇంతే మనదేశంలో జరిగేది. ముందుముందు జరుగబోయేది కూడా ఇదే. ఖర్మ అనుభవిన్చేవాళ్ళు అనుభవిస్తారు. ఎంజాయ్ చేసేవారు చేస్తూ ఉంటారు. పోయేవారు పోతూ ఉంటారు. ఎప్పటికైనా ఈ దేశపు ఖర్మ ఇంతే.

ఏ.ఎల్.బాషం  రాసిన ఒక పుస్తకం ఉన్నది 'ది వండర్ దట్ వజ్ ఇండియా' అని. ఎంత నిజం? ఇండియా ఒకప్పుడు వండర్ కంట్రీనే. కానీ ఇప్పుడు మాత్రం కాదు. ఇప్పుడు పైన పటారం లోన లొటారం. అన్ని రకాల రోగాలతో కుళ్ళిపోతున్న స్తితిలో ప్రస్తుతం మనదేశం ఉంది. అదీ సంగతి. కనీసం ఇంతకు  ముందు చేసిన తప్పులనుంచి కూడా మనం గుణపాఠాలు నేర్చుకోక పోతే మనకంటే మూర్ఖులు ఇంక ఉండరు. అదే కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇతర దేశాలు మనల్ని చూచి పగలబడి నవ్వుతున్నాయి. మనకి మాత్రం ఎన్నటికీ బుద్ధి రాదు. 

మన దేశంలో ఏది నేర్చుకున్నా సామాన్యుడే నేర్చుకోవాలి. ప్రయాణాలు చెయ్యకుండా ఉన్నచోటే ఉండటం ఎలాగో అతను నేర్చుకోవాలి. తిండి తినకుండా ఉండటం నేర్చుకోవాలి.నీళ్ళు తాగకుండా ఎలా ఉండాలో నేర్చుకోవాలి. గాలి పీల్చకుండా ఉండటం అభ్యాసం చెయ్యాలి. అసలు ఏదీ ఆశించకుండా ఏదీ కోరుకోకుండా ఒక యంత్రంలా ఎలా బ్రతకాలో అతను ముందుగా నేర్చుకోవాలి. రాజకీయులూ అధికారులూ మాత్రం ఎప్పటికీ ఏమీ నేర్చుకోరు. కనీసం నేర్చుకునే ప్రయత్నమూ చెయ్యరు. వారిని ఎవరూ ప్రశ్నించలేరు. ప్రశ్నించే సాహసం సామాన్యుడు చెయ్యలేడు. ఇక సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? ప్రమాదాలు ఎలా ఆగుతాయి? 


కనుక ఊరకే మాట్లాడుకుంటూ మనకు మాత్రం టైంవేస్ట్ ఎందుకు? ఎక్కడా ఏమీ జరగలేదు. ఎవరో పోతే పోయారు. మనం బాగానే ఉన్నాం కదా. సో, ఎవరి పని వారు చూచుకుందాం.

జైహింద్. జై భారత్.
read more " తమిళనాడు ఎక్స్ ప్రెస్ ప్రమాదం - ఎవరేం నేర్చుకోవాలి? "

28, జులై 2012, శనివారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 2

మల్లుగారు నవ్వుతూ పలకరించాడు.

"పోయినసారి మీ ఇంటికి వచ్చినపుడే మిమ్మల్ని కలవడం. మళ్ళీ ఇప్పుడే" అన్నా నేను.

"అవును." అంటూ, మా చేతిలోని  సామగ్రి చూచి,  "ముందు ఆలయానికి వెళ్లి రండి. తర్వాత మాట్లాడుకుందాం" అన్నాడాయన.

అమ్మ ఆలయాలకు వెళ్లి ప్రణమిల్లి కొంచంసేపు మౌనప్రార్ధనలో ఉండి, వెనక్కు వచ్చి మేడమీద అమ్మగదికి వెళ్లి కాసేపు కూచుందామని వచ్చాము. గది తాళం వేసిఉంది. అనసూయాదాస్ గారి రూంకి వెళ్లి తాళాలు తీసుకుని మేమే తలుపులు తీసి అమ్మ గదిలో కాసేపు మౌనధ్యానంలో ఉండి కిందకు వచ్చాము.

ఆఫీస్ రూంలో దినకర్ గారు ఇంకెవరో ఒకాయనా కూచుని ఉన్నారు. ఆయన పేరు  నాకు తెలియలేదు. చరణ్ కు ఆ వాతావరణం అంతా చూస్తె మైమరపు కలుగుతుంది. తను చిన్నప్పుడు ఒక ఏడాదో ఏమో అక్కడ ఉండి చదువుకున్నాడు  అతని ఉపనయనం కూడా అమ్మ చేతులమీదే జరిగింది  అందుకని ఆ అనుభవాలు అన్నీ గుర్తొచ్చి మైమరచి పోతుంటాడు

"ఇప్పుడేముంది అన్నగారు? ఇలా అనుకుంటే అలా రాగలుగుతున్నాం, అప్పట్లో అయితే దారీ తెన్నూ లేదు.పొలాల గట్లమీద నుంచి నడుచుకుంటూ రావాలి.అలాగే వచ్చేవాళ్ళం.మా నాన్నగారు ఉద్యోగరీత్యా రాయచోటిలో ఉండేవారు. అక్కణ్ణించి బస్సులో కడపకు వచ్చి, అక్కడ బస్సుమారి కడపనుంచి నెల్లూరుకు వచ్చి, అక్కడ రైలెక్కి బాపట్ల వచ్చి, అక్కణ్ణించి మళ్లీ  బస్సెక్కి ఏడోమైలు దగ్గర దిగి, అక్కణ్ణించి మోకాలి లోతు బురదలో నడుస్తూ వచ్చేవాళ్ళం. అమ్మను చూడగానే ఆ కష్టం అంతా ఎగిరిపోయేది అప్పట్లో ఇన్ని సౌకర్యాలు ఇక్కడ లేవు.ఎక్కడ చోటు దొరికితే అక్కడ పడుకునే వాళ్ళం.ఒక్కోసారి చెట్లకిందే రాత్రంతా పడుకునేవాళ్ళం. దోమలూ చీమలూ ఏవీ పట్టేవి కావు, కుట్టేవి కావు, తెలిసేవి కావు. అలా ఎంతమందో? ఒక్కసారి వచ్చినవాడు మళ్ళీ వెనక్కి పోలేదు. ఏమిటో మన సొంత ఇంటికి వచ్చినట్లు అనిపించేది. ఎవరికివారు అలాగే అనుకునేవారు.

కమ్యూనిస్టులు నక్సలైట్లు నాస్తికులు ఒకరేమిటి అమ్మతో వాదించాలని వచ్చిన ప్రతి ఒక్కరూ అమ్మను చూచి కాసేపు మాట్లాడగానే ఆమెకు పాదాక్రాంతులై  పోవడమేగాని వేరుమాట లేదు.అమ్మ ప్రభావం అలా ఉండేది.అవ్యాజమైన ఆ ప్రేమతత్వం ముందు వెక్కిళ్ళు పెట్టి ఏడవనివారు లేరు. వీరమాచనేని ప్రసాదరావుగారని ఒక కమ్యూనిష్టు  ఎంపీ ఉండేవారు. అమ్మతో వాదించాలని అమ్మను పరీక్షించాలని వచ్చి అమ్మకు సరెండర్ అయిపోయాడు. యార్లగడ్డ బాస్కరన్నయ్య, యార్లగడ్డ లక్ష్మయ్య మొదలైన అనేకులు అమ్మకు పూర్తిగా సరెండర్ అయినవారే. అమ్మ ఉన్నరోజుల్లో ఇక్కడ నిత్యం ఉత్సవంలా ఉండేది. ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో ఎవరికీ తెలిసేది కాదు ఎన్నాళ్ళున్నా ఎవరూ అడగరు వచ్చినవారికి వచ్చినట్లు భోజనాలు నడుస్తూ ఉండేవి. ఆ సమయానికి సరుకులు అలా వస్తూ ఉండేవి. చూచిపోదామని వచ్చి జీవితాంతం ఇక్కడే ఉండిపోయినవాళ్ళు ఉన్నారు.

ఈ రూం జేమ్స్ ది. కాని ఇందులో ఆయనకే చోటుండేది కాదు. రూము నిండా ఎవరెవరో లగేజీలు సంచులు పెట్టి పోయేవారు  ఎవరెవరో వచ్చి పడుకునేవారు, తన రూం లో తనకే చోటులేక  పాపం జేమ్స్ ఒక్కోసారి ఆ కుర్చీలో ముడుక్కుని అలాగే నిద్రపోయేవాడు.                      

1977 వరదల్లో ఇక్కడంతా నీళ్ళు వచ్చాయి వాటితో పాటు తేళ్ళు పాములు జెర్రులు అనేకం కొట్టుకు వచ్చాయి. ఇక్కడ పిల్లా జెల్లా ఎందఱో ఉన్నారు. వాళ్ళలో ఎవరినైనా అవి కరుస్తాయేమో ఇక్కడ వైద్య సదుపాయం కూడా లేదు. ఎలారా దేవుడా అని అమ్మను అడిగాం  అమ్మ ఒకటే మాట చెప్పింది  "ఏ ప్రాణినీ చంపవద్దు. మీలాగే అవికూడా ప్రాణభయంతో కొట్టుకు వచ్చాయి. ఎవరినీ అవి కాటెయ్యవు మీరు వాటిని ఏమీ చెయ్యవద్దు" అని చెప్పింది. అమ్మ చెప్పినట్లే ఒక్క పాముకాటు కేసుకూడా మేము వినలేదు రెండు రోజులలో మళ్ళీ అవన్నీ ఎటు పోయాయో వెళ్ళిపోయాయి ఎంతో మంది పిల్లలు అలా వాటిమధ్యే తిరుగుతున్నారు కాని ఒక్కరిని కూడా అవి కాటెయ్యలేదు.ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఎన్నెన్నో ప్రతిరోజూ జరిగేవి. కాని ఇవి అద్భుతాలు అని అప్పుడు తెలిసేది కాదు. సహజంగా జరిగినట్లు ఉండేది.

ఇలా మాట్లాడుకుంటూ మల్లుగారి ఇంటికి చేరాము. దారిలో తాగుదామని గుంటూరునుంచి ప్లాస్క్ లో టీ కలిపి తెచ్చాము కాని దారిలో ఎక్కడ తాగాలని అనిపించక ఇక్కడికొచ్చాక మల్లు అన్నయ్య గారింట్లో కూచుని వారికి కాస్త ఇచ్చి మేమూ తాగాము.

1970 ప్రాంతాల్లో గుంటూరులో ఒక భక్తుడు ఉండేవాడు. ఒకరోజు ఆయనకు నిద్ర పట్టలేదు. అమ్మ పొద్దున్నే కాఫీ తాగుతుందని ఆయనకు తెలుసు. అందుకని ఇంట్లో కాపీ పెట్టించి ప్లాస్క్ లో పోసుకుని సైకిలు మీద రాత్రికి రాత్రి  బయలుదేరి గుంటూరునుంచి బాపట్ల మీదుగా జిల్లెళ్ళమూడి వచ్చి తెల్లవారుజాము మూడుకల్లా ఆ చిమ్మచీకట్లో అమ్మ లేవడంతోనే ఆ కాఫే అమ్మకు అందించాడొకసారి. ఆరోజుల్లో అంత భక్తి కలిగినవాళ్ళు ఉండేవారు.

ఒకరోజున ఎవరో ఈయన్ని ఆక్షేపించారు. "అమ్మ అమ్మ అంటావు. ఏమిటి మీ అమ్మగారి మహత్యం?" అని. చూపిస్తా ఉండమని వెంటనే కరెంటు ప్లగ్గులో వైర్లు పెట్టి అవి పట్టుకున్నాడు. అతనికి ఏమీ కాలేదు. కరెంటు లేదేమోనని అనుమానంతో ఫాన్ వేసి చూస్తే తిరిగింది. "కావాలంటే నన్ను పట్టుకో ఇప్పుడు" అంటూ ఆ చాలెంజ్ చేసిన వ్యక్తిని పిలిచాడు. అతనికి ధైర్యం చాలలేదు. ఆ సమయానికి ఆ షాక్ జిల్లెల్లమూడిలో ఉన్న అమ్మకు కొట్టింది. అమ్మకు ఒళ్ళు జలదరించి "వాడు నన్ను పరీక్షిస్తున్నాడురా" అంది. ఎవరో ఏం పరీక్షిస్తున్నారో మాకు తెలియలేదు. తనూ చెప్పలేదు. తర్వాత జరిగిన సంఘటనలు తెలిసి ఆశ్చర్యపోయాం.

సామాన్య రైతుకుటుంబం నుంచి వచ్చిన యార్లగడ్డ భాస్కరరావు గారు అమ్మ జీవితచరిత్ర రాశాడు అమ్మ చెబుతుంటే తను రాశేవాడు కాని తనకు ఏమీ తలియదు. పాండిత్యం లేదు భాషాజ్ఞానం లేదు. ఎలా రాశాడో తనకే తెలియదు. అమ్మ ఒకపక్క చెబుతూ ఉంటె, ఆ పాత్రలు కళ్ళముందు కనిపిస్తూ వాటి మాటల్లో అవి మాట్లాడేవి. ఆమాటలనే యధాతధంగా వ్రాశాడు. ఇప్పుడు ఆయనకీ ఏమీ గుర్తు కూడా లేదు. ఆద్యాత్మికజీవితంలో సరళమైన మంచిహృదయం ఒక్కటి ఉంటే చాలు ఇంకేమీ అర్హతలు అవసరంలేదు అని భాస్కరరావుగారి ద్వారా అమ్మ రుజువు చేసింది. "అమ్మ జీవిత మహోదధి" అన్న పుస్తకం అలా వచ్చింది 

మల్లు గారు, ఆయన భార్య, చరణూ తమ తమ జ్ఞాపకాలను కలబోసుకోవడం మొదలుపెట్టారు.

"నదీరా అన్నయ్య అమ్మ గురించి అనేక పాటలు వ్రాశాడు. చాలా ఉన్నై. ఉదాహరణకి ఒక మంచి వాక్యం ఎలా వ్రాశాడో వినండి. 

"ఆకలేసి కేకలేసినారెందరో తల్లీ 
ఆకులేసి కేకలేసె ఈ అందరి తల్లి" 

ఆకలేసి కేకలేశానన్నాడు శ్రీశ్రీ. వారి ఆకలి హింసనూ దౌర్జన్యాన్నీ ద్వేషాన్నీ వర్గపోరాటాన్నీ ప్రేరేపించింది. వాటివల్ల ప్రపంచ సమస్యలు పరిష్కారం కావు. కాని అమ్మ మార్గం విభిన్నం. వచ్చినవారందరికీ ముందు ప్రేమతో అన్నం పెట్టేది. ఆకులేసి అన్నం తినమని కేకలేసేది. లోకమంతా నాది, అందరూ నా బిడ్డలే అనుకునే ఈ ప్రేమతత్త్వం వల్లనే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. ఎప్పటికైనా లోకానికి ప్రేమే శరణ్యం. అదే జీవితాలను గట్టేక్కిస్తుంది. అందుకే లోకంలో సంస్కర్తలు సాధించలేనిది అమ్మ సమక్షంలో సులభంగా సహజంగా జరిగేది.సాంప్రదాయ బ్రాహ్మణకుటుంబంలో పుట్టిన అమ్మ కులమతాలను ఎన్నడూ పాటించేది కాదు. "గుణభేదమే చూడని నాకు కులభేదమేమిటి నాన్నా?" అనేది. మనుషులలో తప్పులను అమ్మ ఎన్నడూ చూచేది కాదు. "తప్పులు చూచేది తల్లి కాదు"  అని అమ్మ ఎన్నో సార్లు అనేది. "నేనే గనుక తప్పులు ఎంచటం మొదలుపెడితే ఏడో మైలు దాటి ఒక్కరూ రాలేరు" అనేది అమ్మ. 

మంచివాడినీ చెడ్డవాడినీ సమంగా చూచిన అమ్మకు, కులంతో అసలు పనేముంది? అమ్మ అటువంటి ప్రేమమూర్తి గనుకనే,అమ్మతో వాదించాలనీ, ఇక్కడేదో బూటకం ఉందనీ,దాన్ని బయటపెట్టాలనీ వచ్చిన అనేకులు కాసేపు అమ్మతో మాట్లాడితే చాలు సరెండర్ అయిపోయేవారు. చాలామంది ఊరకే అమ్మ సమక్షంలో కూచుని అమ్మ వైపు అలా చూస్తూ వలవలా ఏడుస్తూ ఉండేవారు. ఆ దృశ్యం సర్వసాధారణంగా ఇక్కడ కనిపించేది. అమ్మ మాత్రం మౌనంగా ఉండేది. "వాళ్ళెందుకమ్మా అలా ఏడుస్తున్నారు?" అంటే "వాళ్ళు ఏడవడానికే వచ్చార్రా ఏడవనివ్వు" అనేది గాని వివరించి చెప్పేదికాదు. వారికీ తనకూ మధ్య ఏమి జరిగేదో వారికీ తనకే తెలిసేది. మూడో వ్యక్తికి అర్ధమయ్యేది కాదు.

"జయహో మాతా శ్రీఅనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి" అన్న మహా మంత్రాన్ని మొదటగా పలికింది "మౌలాలి" అనే ఒక ముస్లిం. ఒక ముస్లిం భక్తుని నోటి వెంట ఆశువుగా పలికిన ఈ మహామంత్రం ఈరోజున లక్షలమంది నోళ్ళలో నానుతోంది. నిత్యం ఇక్కడ నామస్మరణలో వినిపిస్తోంది. 

అప్పట్లో ఇక్కడ అయిదుగురు గుడ్డివాళ్ళు ఉండేవారు. వారిలో కాసు రాధాకృష్ణారెడ్డి, కాసు వెంకటేశ్వరరెడ్డి అన్నదమ్ములు. ఇద్దరూ పుట్టు గుడ్డివాళ్ళే. ఇద్దరూ విజయనగరం సంగీత కళాశాలలో సంగీతం చదువుకున్నారు. చక్కగా పాడేవాళ్ళు. ఒకరోజున కాసు వెంకటేశ్వరరెడ్డి అమ్మ దగ్గరకు వచ్చి " దేవుడికేం హాయిగ ఉన్నాడు. ఈ మానవుడే బాధలు పడుతున్నాడు" అన్న సినిమా పాట పాడాడు. ఘంటసాలను మరిపించేలా అద్భుతంగా పాడాడు. అమ్మ అంతా విని " దేవుడికి బాధలు లేవా? ఎవరన్నార్రా? ఆయనకున్న బాధ నీకు తెలుసా? అది గ్రహిస్తే నీవు తట్టుకోగలవా? మీరందరూ ఇలా ఉన్నారనేరా ఆయన బాధ. ఆయన బాధలో కోటో వంతు కూడా మానవులకు లేదురా. అన్నీ అమర్చి పెడుతుంటే ఈ మాత్రానికే మీరేదో తెగబాధలు పడుతున్నట్లు అనుకుంటున్నారా?" అన్నది.

కాసు రాధాకృష్ణారెడ్డిగారు అద్భుతమైన గాయకుడు. కీర్తనలు అద్భుతంగా పాడేవాడు. ఈ ఊరిలోకి రాబోయే ముందు కనిపించే వినాయకవిగ్రహం కిందే ఆయన సమాధి ఉంది. మంచి ఆజానుబాహుడు. విపరీతమైన తిండి పుష్టి కలవాడు. ఒకరోజున ఏభై ఇడ్లీ ఒక్కడే తిని ఆరుగ్లాసుల మజ్జిగ తాగాడు."ఇంకొంచం తిను అన్నయ్యా" అంటే "ఒద్దులేరా మళ్ళీ మధ్యాన్నం భోంచెయ్యాలిగా ఒద్దులే" అనేవాడు.అప్పటికి ఉదయం పదయ్యేది. అంత తిండిపుష్టి కలవాడు. మొదట్లో సత్యసాయి ప్రశాంతి నిలయంలో ఉండేవాడు. అక్కడ ఆయనకు నచ్చక ఇక్కడకు వచ్చి చేరాడు. కళ్ళు లేకపోయినా ఒక్కడే ఎక్కడెక్కడో దేశమంతా తిరిగేవాడు. జేబులో చిల్లిగవ్వ ఉండేది కాదు. ఎలా తిరిగేవాడో ఏమో తెలియదు. పాటలు అద్భుతంగా పాడేవాడు. ఆలయంలో కూచుని గొంతెత్తి నామం చేస్తుంటే అమ్మ తట్టుకోలేక కిందికి దిగి వచ్చేది. అంత ఆర్తితో హృదయపూర్వకంగా గొంతెత్తి అమ్మను కీర్తించేవాడు. "ఒరే వాడు పాడుతున్నాడురా. నన్ను పిలుస్తున్నాడు. నేను వెళ్ళాలి" అంటూ అమ్మ కిందికి దిగి వచ్చేది.

ఆయనకు ఎంతటి గ్రహణ శక్తి ఉండేదో !! వంటింట్లో గిన్నెల చప్పుడు బట్టి, ఎంత ఆహారం వండారో గ్రహించి  తానెంత తినాలో నిర్ణయించుకుని ఆకలి ఉన్నాకూడా "ఇంక చాలమ్మా" అని లేచిపోయేవాడు. ఒకసారి హైదరాబాద్లో బస్సులో నేనూ ఆయనా పోతున్నాం. పక్కన ఎవరో ఒకాయన చెయ్యి ఆయనకు తగిలింది. వెంటనే ఆయన్ను గుర్తుబట్టి " ఏం మోహన్రావు గారు బాగున్నారా?" అని పలకరించాడు. ఈయన మీకేక్కడ పరిచయం అనడిగితే " ఎప్పుడో అయిదేళ్ళ క్రితం ఇలాగే రైల్లో పరిచయం" అని చెప్పాడు. అప్పటి ఆయన స్పర్శను గుర్తుంచుకుని ఇన్నేళ్ళ తర్వాత బస్సులో చెయ్యి తగిలిన మనిషిని పేరుతో పిలిచి గుర్తుపట్టాడు. కళ్ళు ఇవ్వకపోయినా అంత అద్భుతమైన గ్రహణ శక్తిని ఆయనకు ఇచ్చాడు దేవుడు.

ఆల్ ఇండియా మ్యూజిక్ ఫెస్టివల్ కి ఆయన్ను రమ్మని ప్రభుత్వం నుంచి ఆహ్వానం వస్తూ ఉండేది. అప్పుడు డిల్లీ వెళ్లి వేదిక మీద కచ్చేరీ చేసి వచ్చేవాడు. ఎక్కడెక్కడ తిరిగినా మళ్ళీ జిల్లెళ్ళమూడి వచ్చి చేరుకునేవాడు. చివరికి ఇక్కడే అమ్మ చరణసన్నిధిలో గతించాడు.ఆయన సమాధి మీదనే వినాయకుడి విగ్రహం పెట్టారు. అది మనం వచ్చేదారిలోనే ఊరి మొదట్లోనే కనిపిస్తుంది.

అప్పట్లో నీళ్ళు ఉండేవి కావు. ఊళ్లోని చేరువునుంచి బిందెలు మోసుకుని ఇక్కడిదాకా తెచ్చేవాళ్ళం. తాను కూడా ఒక పెద్ద గంగాళాన్ని భుజాన పెట్టుకుని దానితో నీళ్ళు మోసుకుంటూ ముందు వెళుతున్న ఎద్దుబండి చప్పుడు ఆధారంగా ఇక్కడికి నీళ్ళు మోసుకోచ్చేవాడు.

అందరం హాల్లో కూచుని ఉండగా " ఈ రోజు అమ్మ పచ్చరంగు చీర కట్టుకుని వస్తుంది" అనేవాడు. ఏదో మాట్లాడుతున్నాడులే అని అందరం అనుకునేవాళ్ళం. కాని అమ్మ అలాగే పచ్చ చీరే కట్టుకుని ఆరోజు దర్శనం  ఇచ్చేది. కళ్ళులేనివాడు కళ్ళున్న మా అందరికంటే ఎక్కువగా ఎలా చూడగలిగేవాడో జరగబోయేది ఎలా చెప్పేవాడో తెలిసేది కాదు.

ఒకరోజున "అమ్మా. దేవుడు నాకిలాంటి కళ్ళులేని జన్మ ఇచ్చాడు. నీ రూపాన్ని చూడాలని ఉందమ్మా" అంటూ ఏడిచాడు. "చూడు నాయనా" అంటూ అమ్మ అతనికి కళ్ళను ఇచ్చింది. అతనికి పుట్టుకతోనే కనుగుడ్లు లేవు. కళ్ళ స్థానంలో గుంటలు ఉండేవి. కాని అలాంటివాడికి చూపు వచ్చింది. అమ్మను చూచాడు. "నిన్ను చూచిన కళ్ళతో ఈ లోకాన్ని చూడలేనమ్మా. ఈ చూపు నాకొద్దు. తీసేసుకో" అని వేడుకున్నాడు. మళ్ళీ చూపు పోయింది. ఇది మా కళ్ళ ఎదురుగా జరిగింది. ఇదీ రాధన్నయ్య కధ.

"ఇక నాకధ కొంచం వినండి" అంటూ మల్లు గారు ఈ సంఘటన చెప్పాడు.

1960 ప్రాంతాలలో మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం. మా అన్నయ్యకూ నాకూ కూడా అప్పటికి పెళ్ళిళ్ళు కాలేదు. మా అన్నయ్యకు సంబంధం సెటిల్ చేసి పెళ్లి నిశ్చయం చేసారు. ఆయనకు సంసారం ఇష్టం లేదు. అందుకని ఒకరోజున చెప్పాపెట్టకుండా ఉన్నట్టుండి అన్నీ వదిలేసి గోచీ పెట్ట్టుకుని శ్రీశైలం అడవులలోకి వెళ్ళిపోయాడు. సంసారం వద్దు అని తీవ్ర వైరాగ్యం ఆయనలో ఉండేది. ఆయన్ను చూచి నేనూ ఇంటిలోనుంచి వచ్చేసి బాంబే వెళ్ళిపోయాను. ఇక మా తల్లిదండ్రులు గోల, మా నాన్నగారు, జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మతో జరిగింది అంతా చెప్పారు. అమ్మ నవ్వి, "పెళ్లి ఏర్పాట్లు చేసుకోరా. వాడేక్కడికి పోతాడు. వస్తాడులే." అన్నదిట. అమ్మ మీద నమ్మకంతో పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో శ్రీశైలం అడవుల్లో ఉన్న మా అన్నయ్యకు అమ్మ కనిపించి " అక్కడ మీనాన్న వాళ్ళు అలా ఏడుస్తుంటే నువ్విక్కడ ఏం చేస్తున్నావురా? వెంటనే బయలుదేరి జిల్లెళ్ళమూడి రా." అని చెప్పి మాయమైంది. ఇక ఆగలేక వెంటనే బయలుదేరి వచ్చాడు. వివాహప్రాముఖ్యతను వివరించిన  అమ్మ, అన్నయ్య పెళ్లిని దగ్గరుండి చేసింది. ఇక పోతే బాంబేలో ఉన్న నాకు ఎందుకో ఒకరోజున జిల్లెళ్ళమూడి వెళ్లాలని బలంగా అనిపించింది. ఎవరో తాడుకట్టి లాగుతున్నట్లు అనిపించి నిలవలేక వెంటనే బయలుదేరి నేనూ నాలుగురోజుల్లో ఇక్కడకు వచ్చేశాను. అంతా సుఖాంతం అయింది. ఇలాంటి మహిమలు ఎన్నో చేసింది అమ్మ. అయితే అప్పుడు అవి మహిమలు అని తెలిసేవి కాదు. అమ్మ ఏది చేసినా సహజంగా ఉండేది. ఏమీ చెప్పేది కాదు. సంకల్పంతోనే పనులు చక్కబెట్టేది.

ఇలాంటి భక్తులు ఎందఱో ఎందరెందరో. వీరిని భక్తులు అనకూడదేమో. ఎందుకంటే అమ్మే స్వయంగా చెప్పింది. "నాకు శిష్యులు లేరు నాన్నా అందరూ శిశువులే" అనేది. ఆ రకంగా ఒక్కొక్కరిది ఒక్కొక్క కధ. ఒక్కొక్క చరిత్ర. కదిలిస్తే ఇక్కడ చెట్లూ పుట్టలూ కూడా గాధలు వినిపిస్తాయి.

(సశేషం)
read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 2 "

24, జులై 2012, మంగళవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 1

జిల్లెళ్ళమూడి వెళ్లి చాలారోజులైంది మళ్ళీ ఒకసారి పోయివద్దాం అని అనుకున్నాం. ముందే అనుకున్నట్లుగా చరణ్ సరిగ్గా అయిదింటికల్లా మా ఇంటికి వచ్చి చేరాడు. నేను తెల్లవారుజామున మూడున్నరకే లేచి తయారై ఉన్నాను. ఉదయాన్నే 5.15 కల్లా జిల్లెళ్ళమూడి బయలుదేరాం. తెలతెలవారుతున్న ఆకాశం, ప్రశాంతమైన ఉషోదయ సమయంలో తెల్లవారేలోపలే ఊరుదాటి, పొలాలమీదనుంచి వీస్తున్న చల్లనిగాలిని ఆస్వాదిస్తూ ప్రయాణం సాగించాం. 

జిల్లెళ్ళమూడికి బయలుదేరితే నాకు లోలోపల భావావేశం రావడం మొదలౌతుంది. చరణ్ పరిస్తితి అసలు చెప్పనక్కర్లేదు. దానికి తోడు స్టీరియో లోనుంచి "అమి మంత్ర తంత్ర కుచ్ ని జానీ నేమా (అమ్మా, నాకు మంత్ర తంత్రాలు ఏమీ తెలియవు. నేను నీ బిడ్డను. నాకు ఇంతే తెలుసు) " అంటూ బెంగాలీగీతం మంద్రస్థాయిలో పన్నాలాల్ భట్టాచార్య మధురస్వరంలో వినిపిస్తోంది. అందరం మౌనంగా ఉన్నాం. హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ మొదలయ్యాయి. మౌనంగా ఆ గీతాన్ని అందులోని భావాన్ని ఆస్వాదిస్తూ కొంతదూరం ప్రయాణించాము. అంతలో నిశ్శబ్దాన్ని చేదిస్తూ చరణ్ గొంతు వినిపించింది.

"అన్నగారు!! రాముడికీ కృష్ణుడికీ ఏమి కర్మ ఉన్నదని వాళ్ళు జన్మ తీసుకున్నార్రా?" అని అమ్మ ఒకసారి అన్నది. దీని అర్ధమేమిటి? అసలు జన్మకు కర్మ కారణమా? అది రూలా?" అని అడిగాడు చరణ్. 

నాకు నవ్వొచ్చింది.

"చూడు చరణ్. దీనికి గీతలోనే జవాబు ఉన్నది. అమ్మ ఏ సందర్భంలో ఆ మాట చెప్పిందో మనకు తెలీదు. మహనీయుల మాటలను ఆ సందర్భాన్ని బట్టే అర్ధం చేసుకోవాలి. మిగతా అన్ని సందర్భాలకూ వాటిని వర్తింపచేయరాదు. గీతలో భగవానుడే చెప్తాడు. ఈ లోకంలో నాకు ఏ కర్మగాని కర్తవ్యంగాని లేదు అని ఒకచోట అంటాడు. ఇంకోచోట, నా మాయాప్రభావం చేత నేను స్వయంభువుగా ఈ లోకంలో అవతరిస్తున్నాను. కాని లోకులు నన్ను వారివలె మామూలు మనిషిని అనుకుంటారు. నా మాయ వారినలా మోహితులను చేస్తుంది" అంటాడు.

"తండ్రి పిల్లలతో ఆడుతూ తానూ కిందపడిపోయినట్లు లేవలేనట్లు నటిస్తాడు. చేతులు తాళ్ళతో కట్టేసుకున్నట్లు విడిపించుకోలేనట్లు నటిస్తాడు.అంతమాత్రాన అతను లేవలేడని, కట్లు విడిపించుకోలేడనీ కాదు. ఆటలో అలా నటిస్తాడు. అలాగే, మామూలు మనుషుల జన్మకు వారి పూర్వకర్మ కారణం అవుతుంది. కాని అవతారమూర్తుల జన్మకు వారి సంకల్పమే కారణం అవుతుంది. వారివి మనవంటి కర్మబద్ధ జీవితాలు కావు. వారికి కర్మ లేదు" అన్నాను.

చరణ్ కు ఇంకా సందేహనివృత్తి కాలేదు. అది గమనించి, "నీ సందేహం జిల్లెల్లమూడిలో పోతుందిలే కాసేపు ఆగు". అని నవ్వుతూ అన్నాను.

"అన్నగారు మీరొకసారి చెప్పారు. రామకృష్ణుల జీవితంలో ఆయనకు ఒక వ్యక్తి తారసపడతాడు. అతనికి తన ఒంటిలోనుంచి వెలుగును వెదజల్లే శక్తి ఉంటుంది. ఆ కధ మళ్ళీ ఒకసారి చెప్పండి." అడిగాడు చరణ్.


"చంద్రుడు గిరిజుడు అని ఇద్దరు వ్యక్తులు రామకృష్ణునికి తెలుసు. ఆయన తంత్ర సాధనలు చేసిన సమయంలో వారు పరిచయం అయ్యారు. వారిలో ఒకరికి ఈ సిద్ధి ఉండేది. ఒకరోజు బాగా చీకటి పడేదాకా మాట్లాడి రామకృష్ణులు కాళికా ఆలయానికి వెళదామని బయలుదేరుతారు. చిమ్మ చీకటిలో ఆయనకు దారి కనపడక తడుముకుంటూ ఉంటారు. అప్పుడు గిరిజుడు తన చేతిని పైకెత్తి ఫ్లడ్ లైట్ లాగా వెలుగును దారిపోడుగూతా ప్రసరిమ్పచేస్తాడు. ఆ వెలుగులో ఆయన ఆలయానికి చేరుతారు. ఇంతవరకూ కథ అందరికీ తెలుసు. కాని ఆ తర్వాత తెలియని కథ ఇంకొకటుంది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా గిరిజుడు ఆ పని చెయ్యలేకపోతాడు. ఆ వెలుగు రాదు. ఎందుకంటే రామకృష్ణులు ఆ శక్తిని తనలోనికి ఆకర్షించి అతన్ని ఆ దాస్యం నుంచి విముక్తుణ్ణి చేస్తారు. సిద్ధులు సాధనా మార్గంలో ఆటంకాలు. కనుక ఆ సిద్ధిని తనలోకి తీసుకుని అతన్ని తేలికపరుస్తారు. ఈ సంగతి అతనికి తెలియదు. అవతారపురుషుని ముందు శక్తిప్రకటన చెయ్యడం ఆంజనేయుని ముందు కుప్పిగంతుల వంటిది. చంద్రునికి గుటికాసిద్ధి ఉండేది. దానివల్ల అతనూ ఇబ్బందుల పాలయ్యాడు. తర్వాత దానిని వదిలిపెట్టి సాధన కొనసాగించాడు." అంటూ ఆ కధను వివరించాను. 
  
దారిలో  చాలాచోట్ల మనుషులు రోడ్డుకి అడ్డంగా నిలబడి ఉండటమూ ఎంత హారన్ కొట్టినా పక్కకు తోలగకపోవడమూ చూచి, "వీళ్ళు మనుషులా పశువులా. పశువులే నయం. హారన్ కొడితే పక్కకు పోతాయి. వీళ్ళు వాటికంటే ఘోరంగా ఉన్నారు". అన్నాడు. " తప్పు చరణ్. వీళ్ళంతా మనకు గురువులు. సహనాన్ని  మనకు నేర్పుతున్నారు". అని నవ్వుతూ అనుకున్నాం. చరణ్ కి జీసస్ మాట ఒకటి గుర్తుకొచ్చింది. "O Father in Heaven, forgive them, for they know not what they are doing" అన్నాడు. 

"మంచి మాట చెప్పావ్ తమ్ముడూ. మహనీయుల మనోభావం అదే.ఈ లోకంలో ఉన్న మనుషులను చూచి వాళ్ళు అదే అనుకుంటారు. మన అజ్ఞానమూ, బద్దకమూ, మొండితనమూ చూచి ప్రతి మహానీయుడూ అనుకునేది ఈ మాటలే" అన్నాను.

"నిజమే. అన్నగారు." అంటూ ఒప్పుకున్నాడు చరణ్. "అన్నగారు నాదొక సందేహం. అడగమంటారా?"

"అడుగు. దానికి పర్మిషన్ కావాలా?" అన్నా రోడ్డుమీదనుంచి దృష్టి తిప్పకుండా నవ్వుతూ.

అమ్మ ఒకచోట " కాలం అనేది అసలు లేదు నాన్నా" అని ఒక మహోన్నతమైన స్టేట్మెంట్ ఇచ్చింది. అమ్మ చెప్పిన అన్ని స్థాయిలూ ఎంతో కొంత అర్ధం అయ్యాయి కాని ఈ భావం ఎంత గింజుకున్నా అర్ధం కావడం లేదన్నగారు. దీనిమీద మీ భావం ఏమిటి?" అడిగాడు.

"అద్వైతస్తితిలోకి వెళ్ళే ముందో, లేక అక్కణ్ణించి కిందకు వచ్చే స్తితిలోనో అమ్మ ఈ మాట అని ఉంటుంది తమ్ముడూ. ఆ స్థాయిలో అది సత్యమే. కాని ఇంద్రియబద్ధులమైన మనకు అది సత్యం కాదు. It is an ultimate statement emanating from the indivisible and undifferentiated state of being, but not applicable to poor mortals like us". అన్నాను.

"సరేగాని తమ్ముడూ నీవు అమ్మ సాహిత్యం బాగా చదివావు కదా. నాదొక సందేహం చెప్పు. అతీతలోకాల గురించి, జన్మలగురించి అమ్మ ఎక్కడైనా ఎవరితోనైనా చెప్పిందా? "సాహిత్యం వల్ల రాహిత్యం రాదు నాన్నా" అన్న అమ్మ వాక్యాన్ని మాత్రం చెప్పకు. అది నాకు తెలుసు" అన్నా నవ్వుతూ. 

"అసలు కాలమే లేదు అంటుంటే, ఇక లోకాలు జన్మలు గురించి అమ్మ ఎలా చెబుతుంది అన్నగారు?"

"అలా కాదులే తమ్ముడూ. అమ్మ ఆ ఒక్క మాటే అందరితోనూ చెప్పలేదు. అందరితోనూ ఆ స్థాయిలో మెలగలేదు. ఏ మహానీయుడూ తత్వాన్ని అలా జెనరలైజ్ చేసి చెప్పడు. ఎవరూలేని సమయంలో బాగా సన్నిహితులతో మాట్లాడేటప్పుడు " ఫలానా వాడు ఫలానా చోట పుట్టాడురా" అనో " వీడు పూర్వజన్మలో ఫలానా" అనో లేదా "వీణ్ణి ఫలానా లోకానికి పంపించాను" అనో అమ్మ అనే ఉంటుంది.   అలాంటి సన్నివేశాలు అమ్మ సాహిత్యంలో ఎక్కడైనా చదివావా?"

"లేదు అన్నగారు. నేను చదవలేదు.వినలేదు." 

"అవన్నీ సత్యాలే తమ్ముడు. లోకాలు జన్మలు అన్నీ ఉన్నాయి. కాని వాటిగురించి నలుగురితో మామూలు మాటలు మాట్లాడేటప్పుడు ఏ మహనీయుడూ వెల్లడించడు. అప్పుడు అందరికీ పనికొచ్చే మామూలు వేదాంతం చెబుతారు. రహస్యమైన విషయాలు అందరిలోనూ ఉన్నపుడు చెప్పరాదు. ఎవరూ చెప్పరు కూడా. కాని అవి జరిగే ఉంటాయి." అన్నాను.

"అడుగుదాం అన్నగారు. అక్కడ అమ్మను చూచి అమ్మతో ఎంతో మాట్లాడిన వాళ్ళు, ఎన్నోఏళ్ళు అమ్మతో కలిసి జీవించినవాళ్ళు ఉన్నారు. వసుంధరక్కయ్య ఉన్నది ఆమెను అడుగుదాం." అన్నాడు చరణ్.

నేను 'సరే' అంటూ తలాడించాను. చూస్తూ ఉండగానే బాపట్ల వచ్చింది. అక్కడ ఉపాహారం కానిచ్చి మళ్ళీ బయలుదేరి ఒక అరగంటలో జిల్లెళ్ళమూడి పరిసరాలకు చేరాము. వాగుమీద ఉన్న బ్రిడ్జిదాటి కుడిచేతి పక్కకు మలుపు తిరిగి కొద్దిదూరం ప్రయాణం చేసి ఊళ్లోకి అడుగుపెట్టాము. ఆ దారిలో వెళ్ళే ప్రతిసారీ ఒకేమాట అనుకుంటాము. "ఎంతమంది హేమాహేమీలు మహానుభావులు అమ్మ దర్శనంకోసం ఈ దారిలో నడిచారో కదా" అని. అలా అనుకుంటూ ఉండగానే ఊరోచ్చింది. కొంచం దూరం పోవడంతోనే, "అందరిల్లు" అంటూ బోర్డ్ కనిపించింది. లోపలి వెళ్ళడంతోనే మల్లు ఇంకా కొందరు నిలుచుని నవ్వుతూ కనిపించారు. వాళ్ళను చూడటంతోనే సంతోషం అనిపించింది.

(సశేషం)
read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 1 "

21, జులై 2012, శనివారం

రాజేష్ ఖన్నా జాతకం -- కొన్ని ఆలోచనలు

బాలీవుడ్ మొదటి సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా 29-12-1942 తేదీన అమృత్ సర్ లో పుట్టాడని అంటున్నారు. కాని చాలామంది అతను పాకిస్తాన్ లోని బురేవాలే లో పుట్టాడని చెప్తున్నారు. ఏది ఏమైనా అతని జనన తేదీ మాత్రం అదేనంటున్నారు.జనన సమయం ఖచ్చితంగా తెలియదు. కనుక అతని జాతకాన్ని పైపైన పరిశీలిద్దాం.

శని గురువులు వక్రీకరణ స్తితిలో ఉండటం మొదటగా కనిపించే విషయం. ఇలాంటి వారికి పూర్వకర్మ చాలా బలంగా ఉంటుంది. అయితే అది కలగలుపు కర్మగా ఉంటుంది. ఇలాంటి జాతకులు ముందు బాగా ఉన్నత స్తానానికి ఎగసి అక్కణ్ణించి జారి కిందపడతారు. అతని జీవితంలో ఇది జరిగిందని అందరికీ తెలుసు. చంద్ర లగ్నాత్ దశమంలో వక్రశని మిత్రస్థానంలో ఉండటం కూడా దీనినే సూచిస్తోంది.

రాహుచంద్రులు కలిసి ఉండటం వల్ల, తీవ్ర మనోవేదన ఎదుర్కోవలసి వస్తుంది. నమ్మినవారి చేతిలో మోసపోవడం జరుగుతుంది. ఇదీ అతని జీవితంలో జరిగింది. ఇతని పతనానికి కారణాలలో ఒకటి ఇతని చుట్టూ చేరి ఇతన్ని తప్పుదారి పట్టించిన ఒక గుంపు. నువ్వు ఇంద్రుడివి,చంద్రుడివి అంటూ పొగిడి ఇతన్ని ఆకాశానికి ఎత్తారు. కళ్ళు తెరిచేసరికి పాతాళంలో ఉన్నాడు. ఇది ఈ గ్రహయోగప్రభావమే. వాస్తవాలను విస్మరించి ఊహల్లో ఎక్కువగా గడిపేటట్లు ఈ గ్రహయోగం పనిచేస్తుంది. ప్రేమలో విఫలం కావడం కూడా ఈ గ్రహయోగ ఫలితమే.అందుకనే ప్రేమించిన "అంజు" ను అందుకోలేకపోయాడు. చంద్రలగ్నాత్ సప్తమంలో కేతువు వల్ల సంసారజీవితం సుఖంగా గడవలేదు.

ప్రస్తుతం గోచార గురు కేతువులు జననకాల శనికి చాలా దగ్గరగా సంచరిస్తూ ఉన్నారు. జీవశక్తి క్షీణిస్తున్నదని, కర్మ తీరిందని దీనివల్ల సూచన. గురువువల్ల జీర్ణకోశ, కాలేయ సంబంధిత వ్యాధి సూచింపబడుతూ ఉన్నది. శని వల్ల దీర్ఘవ్యాదీ, కేతువువల్ల అకస్మాత్తుగా వచ్చే మార్పులూ సూచితాలు. వీటన్నిటినీ కలుపుకొని చూస్తే ఇతని చివరిదశ చక్కగా కనిపిస్తుంది.

శక్తికారకుడైన జననకాలకుజుని పైన గోచార రాహువు సంచరిస్తూ ఆ శక్తిని హరిస్తున్నాడు. కనుక దీర్ఘవ్యాదితో తీసుకుని మరణించడం జరిగింది. పోయిన ఏడాది రాహువు వృశ్చికంలోకి మారినప్పటి నుంచే ఇతనికి అనారోగ్యం మొదలైంది.

శని చంద్రనక్షత్రంలో ఉండటమూ, గురువు స్వనక్షత్రంలో ఉండటం వల్ల ఆధ్యాత్మిక భావాలతో చివరిలో కాషాయ వస్త్రాలు ధరించేవాడు. చివరికి మనం వేసుకునే బట్టలూ, ఆ బట్టల రంగులూ కూడా గ్రహ ప్రభావానికీ, అప్పుడు నడుస్తున్న దశాప్రభావానికీ లోబడే ఉంటాయి అని అంటే వినడానికి వింతగా ఉంటుంది కానీ ఇది పచ్చినిజం.

బాలీవుడ్ స్టార్స్ చాలామంది జ్యోతిష్యాన్ని నమ్ముతారు. వీరికి పేరుమోసిన జ్యోతిష్కులు సలహాదార్లుగా ఉంటారు. స్టార్స్ లో చాలామందికి జ్యోతిష్యం ఎంతో కొంత తెలుసుకూడా. ప్రస్తుతం నడుస్తున్న దశలో తన పని ఆఖరని రాజేష్ ఖన్నా తన సన్నిహితులతో చాలాసార్లు అనేవాడు. చివరికి అలాగే జరిగింది కూడా. 

ఖచ్చితమైన జననవివరాలు అందుబాటులో లేనందువల్ల ఇంతకంటే ఈ జాతకాన్ని పరిశీలించలేము.
read more " రాజేష్ ఖన్నా జాతకం -- కొన్ని ఆలోచనలు "

20, జులై 2012, శుక్రవారం

రాజేష్ ఖన్నా మరణం -- రాహుకేతువుల ప్రభావం

పాతతరపు హిందీ రొమాంటిక్ హీరో రాజేష్ ఖన్నా పోయాడు. పుట్టిన ప్రతివాడూ పోకతప్పదు. మనిషి ఎన్నింటిని  తప్పుకున్నా తప్పనిది చావు ఒక్కటే. అది వింత కాదు. కాని ఈ సంఘటన కొన్ని గ్రహస్తితులకు సరిగ్గా అతికినట్లు సరిపోవడం అసలైన వింత. 

18-12-2011 న "మార్గశిర పౌర్ణమి - మేదినీ జ్యోతిష్యం" అని ఒక పోస్ట్ వ్రాస్తూ కొన్ని మాటలు వ్రాశాను. దాని లింక్ ఇక్కడ ఇస్తున్నాను.


"పోయినసారి రాహుకేతువులు నీచలో ఉన్నప్పుడు 1992 లో సినీరంగానికి చెందిన ప్రముఖులు సత్యజిత్ రే, అమ్జాద్ ఖాన్, ప్రేమ్ నాథ్ మరణించారు. మళ్ళీ పద్దెనిమిదేళ్ళ తర్వాత ఇప్పుడు 2011 లో దేవానంద్, మల్లెమాల చనిపోయారు. 2012 ఏడాది మొత్తం రాహుకేతువులు ఇదే నీచపరిస్తితిలో ఉంటారు. జనవరి 2013 లో మాత్రమే వారి స్థానాలు మారుతాయి. కనుక 2012 లో మరికొందరు సినీపెద్దల మరియు దేశప్రముఖుల అస్తమయం జరుగనుంది అని ఖచ్చితంగా ఊహించవచ్చు."


ఈ జోస్యం చెప్పి ఆర్నెల్లు గడవక ముందే రాజేష్ ఖన్నా మరణించడం జరిగింది. ఇంకా మరి కొందరు తయారుగా ఉన్నారు. దీనిని బట్టి ఒక విషయం మళ్లీ రుజువైంది. కాకతాళీయంగా జరుగుతున్నాయి అని మనం అనుకునే సంఘటనల వెనుక మనకు తెలియని కర్మ బంధాలు ఉంటాయి. ఆ కర్మ ప్రభావాలను దైవస్వరూపాలైన గ్రహాలు నియంత్రిస్తూ ఉంటాయి. అందుకే ఆయా గ్రహాలు కొన్ని కొన్ని స్థానాలలో ఉన్నప్పుడు ఆయా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుత సంఘటన సరిగ్గా అమావాస్య రోజున జరగడం ముఖ్యంగా గమనించవలసిన విషయం. అందుకేనేమో "అన్నీ తెలిసినవాడు అమావాస్యనాడు పోతాడు. ఏమీ తెలియని వాడు ఏకాదశినాడు పోతాడు" అని ఒక సామెత ఉంది. 

అన్నీ మనకు తెలుసు అని విర్రవీగడం చాలా పొరపాటు. మనకు తెలీకుండా ఈ జగన్నాటకంలో తెరవెనుక కధ చాలా నడుస్తూ ఉంటుంది. మనిషికి తెలిసేది కనిపించేది చాలా స్వల్పం. తెలీనిది కనిపించనిది ఎంతో ఉన్నది. దానిని తెలుసుకునే మార్గాలున్నాయి. మార్చుకునే విధానాలున్నాయి.  వినయం, శ్రద్ధ, రుజువర్తనా ఉన్నవారికే అవి తెలుసుకునే అవకాశం భగవంతుడు కల్పిస్తాడు. అందుకనే యోగమూ తంత్రమూ మరియు జ్యోతిశ్శాస్త్రాది ప్రాచీనవిద్యలను అనవసరంగా అవహేళన చెయ్యడం పొరపాటు అని నేనంటాను. అలా చెయ్యడం అహంకారానికి నిదర్శనం తప్ప ఇంకొకటి కాదు.

రాజైనా పేదైనా ఎవరైనా కర్మబద్దులే. ఎవరి కర్మ అయిపోతే వారు తెరవెనక్కు పోక తప్పదు. మళ్లీ జన్మ తీసుకోకా తప్పదు. కనుక దీనిగురించి బాధపడటం అనవసరం. నిజమైన కళాకారుడు ఎప్పుడూ అభిమానుల గుండెల్లో బ్రతికే ఉంటాడు.

ఈ సందర్భంగా "ఆనంద్" సినిమాలో ముకేష్ గొంతులోనుంచి "కహీ దూర్ జబ్ దిన్ డల్ జాయే" అంటూ జాలువారిన ఈ పాటను ఒకసారి చూస్తూ వినండి. ఇది నాకు చాలా ఇష్టమైన మధుర గీతం. ఏకాంతాన్ని కోరుకునేవారికీ, భావుకులైనవారికీ,  అంతర్ముఖులైనవారికి ఎవరికైనా ఈ పాట బాగా నచ్చుతుంది.

read more " రాజేష్ ఖన్నా మరణం -- రాహుకేతువుల ప్రభావం "

16, జులై 2012, సోమవారం

బలులు - మొక్కులు

నిన్న ఒక పనిమీద హైదరాబాద్ లో ఉన్నాను. నా ఖర్మకాలి, నాకు పనిఉన్న ప్రదేశం నేరేడ్ మెట్ కట్టమైసమ్మ గుడి దగ్గరగా ఉంది. అక్కడ దృశ్యాలు చూస్తే పొట్టలో తిప్పి వాంతి వచ్చినంత పనైంది. నిన్న బోనాల పండగ అని అక్కడివారు చెప్పారు. ఆడవాళ్ళందరూ అమ్మవారిలాగా తయారై ముఖానికీ కాళ్ళకూ పసుపు పూసుకుని గుంపులు గుంపులుగా కలశాలు తలమీద మోస్తూ చేతిలో వేపాకులతో అమ్మవారి దర్శనానికి వెళ్లి వస్తున్నారు. అంతవరకూ బాగానే ఉంది.

గుడి ప్రహరీ గోడలోనే ఒకచోట ఒక రూం లాగా కట్టారు. అక్కడ కోళ్ళు గొర్రెలు మేకలు బలి ఇచ్చి ఆ మాంసాన్ని ఒక గుట్టగా పోశారు. అక్కడంతా రక్తపు మడుగు కట్టింది. గుడి నుంచి తిరిగి వస్తున్న  చాలామంది చేతుల్లో ఒక కెరీ బ్యాగు, దానిలో తల లేని కోడి మొండెం, ఆ బ్యాగంతా రక్తం మరకలు, ఈ మొత్తం దృశ్యమంతా ఘోరాతిఘోరంగా ఉంది. బలి ఇవ్వబడడానికి అమాయకంగా వేచిఉన్న మేకలు గొర్రెలను చూస్తే గుండె తరుక్కుపోయింది.

బలి ఇవ్వడానికి జంతువులనూ పక్షులనూ తీసుకువస్తున్న మనుషుల ముఖాలు చూస్తే ఒక్కడి ముఖంలో కూడా ఒక సంస్కారం గాని, ఒక పరిణతి గాని, ఒక వెలుగు గాని కనిపించలేదు. అందరి ముఖాలూ ఏదో చీకటి కమ్మినట్లు ఆముదంతాగిన దొంగలముఖాలలాగా రఫ్ గా ఉన్నాయి.

ఏదో మారుమూల శ్రీకాకుళం జిల్లాలోనో విజయనగరం జిల్లాలోనో ఏదో పల్లెల్లో ఇలాంటి అనాగరిక పద్దతులు అమలులో ఉంటే ఒకరకంగా వాటిని అర్ధం చేసుకోవచ్చు. కాని రాష్ట్ర రాజధాని, సిటీ మధ్యలో ఇలాంటి అనాగరిక ఆటవిక చేష్టలు ఉన్నాయంటే సిగ్గుతో తలదించుకోవాలి. పక్షులనూ జంతువులనూ చంపి వాటి మాంసం తినాలని ఆగలేని ఆత్రంగా ఉంటే డైరెక్టుగా ఆపని చెయ్యవచ్చు. దానికీ దేవుడికీ లింకు పెట్టి మొక్కుల పేరుతో బలులిచ్చి ఆ మాంసం తినడం అనేది దిగజారుడుతనానికి పరాకాష్ట. మనుషులు బహుశ తమ మనసులోని గిల్టీ ఫీలింగ్ కప్పి పుచ్చుకోడానికి  దేవుణ్ణి ఆసరాగా తీసుకుంటారేమో అని నా ఊహ. తన రాక్షసత్వాన్ని దేవుడికి కూడా ఆపాదించి వాణ్ని కూడా ఒక రక్తపిశాచిగా మార్చాడు మానవుడు.

విజయనగరం జిల్లాలో మారుమూల పల్లెల్లో పదేళ్ళ కొకసారి "ఊరి పండగ" అని చేస్తారు. అంతకు ముందు నుంచీ ఒక దున్నపోతును బాగా మేపుతారు. ఆ రోజున దానిని బలిఇచ్చి ఆ మాంసాన్ని అందరూ కలిసి ఆరగిస్తారు. అది బాగా బలిసి ఉంటుంది. అందుకని దానిని అదుపు చెయ్యడం ఒకడి వల్ల కాదు. ఒక ఇరవైమంది కలిసి దానికి తాళ్ళు కట్టి దూరం నుంచి గడకర్రలతో బంధించి చంపుతారు. వేటకత్తి ఎంత పదునుగా ఉన్నా ఒక దెబ్బతో దాని మెడ తెగదు. కనీసం ఒక పదిసార్లు నరికితే గాని దాని మెడ తెగిపడదు. ఈలోపల అది గింజుకొని అటూ ఇటూ పరిగెత్తి నానా భీభత్సం చేస్తుంది. ఆ రక్తమంతా చింది అందరిమీదా జల్లులాగా పడుతుంది.  అక్కడంతా ఒక విధమైన పైశాచిక స్మశానవాతావరణం అలముకొని ఉంటుంది. వాళ్ళంతా కూడా ఏదో ఆనందంతో రాక్షసుల్లాగా ఊగిపోతూ ఉంటారు. ఈ దృశ్యమంతా చూస్తే వీళ్ళసలు మనుషులేనా లేక మనిషి రూపంలో ఉన్న నీచ నికృష్ట పిశాచాలా అనిపించక మానదు. చివరకి ఆ రక్తాన్ని అందరికీ తీర్ధంగా ఇస్తారు. నుదుటబొట్టు కూడా ఆ రక్తం తోనే పెడతారు. ఆ రక్తంతోనే గ్రామదేవత దగ్గర దీపం వెలిగిస్తారు. అక్కడి పూజారులు కూడా దెయ్యాలలాగే ఉంటారు. కనీసం వాళ్ళు కూడా ఇలాంటి పనులు తప్పు అని ఎవరికీ చెప్పరు.ఎవడి స్వార్ధం వాడిది. ఒకవేళ నిజం చెబితే ఈ పిచ్చిజనం వారినీ బతకనివ్వరేమో.

గౌహతిలోని కామాఖ్య ఆలయంలో మొన్నమొన్నటివరకూ నరబలి ఉండేదని అంటారు. ఇప్పటికీ ఉందనీ రహస్యంగా దానిని చేస్తారనీ కూడా వదంతులు ఉన్నాయి. ఇంత అనాగరిక, ఆటవిక, పద్దతులు, ఆచరణలు ఇంకా మన సమాజంలో బతికి ఉన్నాయి అంటే రెండువేల ఏళ్ళ క్రితం పుట్టిన బుద్ధుడు కూడా నేడు మనల్ని చూచి సిగ్గుతో తలదించుకోవాలేమో? వీరిలో ఎవరైనా ఒక్కక్షణం ఆగి ఆలోచిస్తే ఇలాంటి ఛండాలపు పనులు చెయ్యరుగాక చెయ్యరు. సమస్త చరాచర జీవరాశులకు తల్లి అయిన జగన్మాత బలి ఎందుకు కోరుతుంది? అందులోనూ మూగజీవాల రక్తాన్ని మాంసాన్ని ఎందుకు కోరుకుంటుంది? అన్న ఒక్క ఆలోచన, అమ్మవారికంటూ జంతువులను బలిచ్చే ఈ నీచపు వెధవలలో ఒక్కడికీ రాకపోవడం విచిత్రం.

ఈ జీవాలన్నీ మనిషిలో ఉన్న దుష్ట ప్రవృత్తులు. అసుర శక్తులు. ఈ జంతువులన్నీ మనిషిలోపలే ఉన్నాయి. వాటిని తనలోనుంచి తొలగించి నిర్మూలించాలి గాని బయట తిరిగే జంతువులను చంపి వాటి మాంసాన్ని  మెక్కుతూ ఏదో మొక్కు తీర్చుకున్నట్లు, ఘనకార్యం చేసినట్లు, దేవుడి బాకీ తీర్చుకున్నట్లు, ఆయన కరుణకు పాత్రులైనట్లు పొంగిపోతే అంతకంటే అజ్ఞానం ఇంకోటి ఉండదు. ఈ సంగతి మనిషి అర్ధం చేసుకోవాలి. ఎక్కడబడితే అక్కడ ఏరుకొని నానాచెత్తా తినేసి తన పొట్టనింపుకునే తత్వమే మనిషిలోని కోడి. ఈ స్వభావాన్ని వదిలిపెట్టాలి అంతేకాని కోడిని బలిచ్చి దాని మాంసం తినడంకాదు మనిషి  చెయ్యవలసింది. మనిషిలో ఉన్న మదమూ, అహంకారమూ, మొండితనమే దున్నపోతు. ఈ లక్షణాలు వదుల్చుకోవాలి గాని బయట ప్రపంచంలో ఉన్న జంతువును బలిస్తే ఏమి ఒరుగుతుంది? దాని మాంసం తినడం వల్ల మనలో ఇంకా ఇంకా ఆ లక్షణాలు పెరుగుతాయి కాని తగ్గే ప్రసక్తే ఉండదు. దానివల్ల దైవానికి అనుక్షణమూ దూరం అవడమే జరుగుతుంది గాని మనిషి ఎన్నటికీ దైవానికి దగ్గర కాలేడు. ఇకపోతే అమాయక ప్రాణులైన గొర్రెలు మేకలను బలివ్వడం మరీ ఘోరం. మనిషిలోని ఈ క్రూరప్రవృత్తి వల్లే సమాజంలో కిరాతకం పెరిగిపోతున్నది. దయా దాక్షిణ్యాలు అడుగంటుతూ పోతున్నాయి. అందుకే సమాజంలో ఎక్కడ చూచినా మనిషిరూపంలో ఉన్న నక్కలూ తోడేళ్ళూ పులులూ తిరుగుతున్నాయి. 


ఈ పిచ్చిమొక్కులూ పిచ్చిబలులూ ఎందుకూ పనికిరానివని 2000 ఏళ్ళ క్రితమే అశోకచక్రవర్తి తన శాసనాలలో శిలాక్షరాలు లిఖించాడు. కావాలంటే అశోకుని 13 వ శిలాశాసనం చదవండి. ప్రజల అజ్ఞానాన్ని తొలగించాలని  అప్పట్లోనే ఆయన ఎంతగా మొత్తుకున్నాడో అర్ధమౌతుంది. అంతకు 500 ఏళ్ళు ఇంకా ముందు బుద్ధుడూ మహావీరుడూ ఇదే మొత్తుకున్నారు. అంతకు కనీసం వెయ్యేళ్ళు ముందునుంచే ఇరవైముగ్గురు జైన తీర్ధంకరులు అహింసను  పాటించమని బోధిస్తూనే వాళ్ళ తనువులు చాలించారు. అంటే కనీసం 4000 ఏళ్ళ నుంచీ "అహింసా పరమో ధర్మః" అంటూ ఎంతోమంది ప్రవక్తలు చెబుతూనే ఉన్నారు. కాని మనం వాళ్ళమాట వినం. మన జిహ్వచాపల్యమే మనకు ప్రధానం. వాళ్ళ తరువాత ఇన్ని వేలఏళ్ళు గడిచినా మనుషులలో అజ్ఞానం మాత్రం ఇంకా వెర్రి తలలు వేస్తూనే ఉంది. స్వార్ధం వికృతరూపంతో నాట్యం చేస్తూనే ఉంది.

అయినా నా పిచ్చిగాని దేవునికి దగ్గర కావడం ఎవడికి కావాలి? ప్రతివాడికీ దేవుడిచ్చే వరాలు కావాలి. అంతేగాని దేవుడు ఎవరికీ అక్కర్లేదు. దైవాన్ని చేరే మార్గమూ ఎవడికీ అక్కర్లేదు. ఒకవేళ దేవుడే ప్రత్యక్షమైతే అతడి దగ్గర అన్ని వరాలూ గుంజుకొని చివరికి ఆ దేవుడినే  ఒక్క తన్ను తంతాడు ఈ మనిషి. అందుకే దేవుడు ఈ మనుషులకు భయపడి ఎక్కడో దాక్కున్నాడు. మనుషులందరూ స్వార్ధంలో నిలువునా కూరుకుపోయి ఉన్న వేషగాళ్ళూ నాటకాలరాయుళ్ళూను. ప్రతివాడికీ తన కోరికలు తీరడమే ప్రధానంగాని, జీవితంలో ఒక ఔన్నత్యాన్ని పొందేమార్గంగాని దాని గురించి ఆలోచనగాని ఎవరికీ అవసరం లేదు. మంచి చెప్పేవాణ్ణి వీళ్ళు ఎలాగూ బ్రతకనివ్వరు. ఆ సంగతి ఎంతోమంది ప్రవక్తలకు బాగా తెలుసు. వీళ్ళ చీకటిలో వీళ్ళను చక్కగా ఉంచుతూ మరింత చీకటిలోకి వీరిని తోసేవాళ్ళే వీరికి నచ్చుతారు. 

ప్రపంచమంతా ఘోరమైన అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్నది అని ఆదిశంకరులు అన్నమాట ఎంత సత్యమో రోజురోజుకూ నాకు బాగా అర్ధం అవుతున్నది. ఎంతమంది ప్రవక్తలు బోధించినా, ఎంతమంది  మహర్షులు మొత్తుకున్నా, చివరికి దేవుడే అవతారరూపంలో దిగివచ్చి చెప్పినా ఇంకా అర్ధం చేసుకోలేని అధమస్థాయిలో మనిషి ఉన్నాడంటే అతనిలోని అజ్ఞానపుచీకటి ఎంత దట్టంగా ఎంత చిక్కగా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.  


ఇదంతా చూస్తుంటే గీతలో రెండు శ్లోకాలు గుర్తుకు వచ్చాయి.


శ్లో|| యజన్తే సాత్వికా దేవాన్ యక్ష రక్షాంసి రాజసాన్ 
భూతాన్ ప్రేత గణాన్శ్చాన్యే యజన్తే తామసా జనా:
(ఈలోకంలో సాత్వికులు సౌమ్యదేవతలను, రాజసికులు యక్ష రాక్షసులను,తామసులు భూత ప్రేతాలను పూజిస్తారు) 


అమ్మవారు భూతమో ప్రేతమో కాదు. ఆమె జగన్మాత. కాని లోకులు ఆమెను ఒక రక్త పిపాసిగా చేసి కూచోబెట్టారు. వీరి వేషాలకు అజ్ఞానానికి ఆమె ఎంత బాధపడుతూ వీరి పూజలు స్వీకరిస్తోందో ఆమెకే తెలుసు.


శ్లో || కర్మణ సుకృతస్యాహు  సాత్వికం నిర్మలం ఫలం 
రజసస్తు ఫలం దుఖమజ్ఞానం తమస ఫలం
(సాత్విక కర్మలవల్ల నిర్మలత్వం కలుగుతుంది. రాజసిక కర్మలవల్ల దుఖం కలుగుతుంది. తామసకర్మల వల్ల అజ్ఞానం పెరుగుతుంది) 


మనిషి తామసంనుంచి, రాజసాన్ని దాటి, సాత్వికానికి ఎదగాలి. ఏ జంతువుకూ ఇవ్వని "బుద్ధి" అనే ఉత్తమ గుణాన్ని దైవం మనిషికి ఇచ్చింది. దానిని సక్రమంగా ఉపయోగించుకుని సత్కర్మ సదుపాసన చేసి ఉత్తమగతిని పొందాలిగాని అధమకర్మలు చేసుకుని అధమజన్మలు పొందకూడదు. అప్పుడే మానవజన్మ ఎత్తినందుకు సాఫల్యత అనేది ఉంటుంది.

ఎంతమంది ఎంత చెప్పినా, సమాజపు ఈ తీరు ఎలాగూ మారదు గనుక, ఏదో ప్రళయం వచ్చేవరకూ మనుషుల అజ్ఞానం ఇలాగే ఇంకా ఇంకా  వర్దిల్లుగాక అని ఆశిద్దాం.
read more " బలులు - మొక్కులు "

10, జులై 2012, మంగళవారం

విశ్వాత్మ(స్వామి విశ్వాత్మానంద) గారు ఇక లేరు

నా బ్లాగు చదువరులకు ఒక దుర్వార్త. నేను పోయినేడాది విశ్వాత్మగారి గురించి వ్రాసినప్పుడు చదివినవారికి ఆయన గుర్తుండి ఉంటారు. మొన్న ఆదివారం 8-7-2012 న హటాత్తుగా ఆయన చనిపోయారు. ఆ సంఘటన  కూడా చాలా బాధాకరంగా జరిగింది. ఆయన శరీరం మూడురోజులనుంచీ విజయవాడ NTR Health University మార్చురీ లో పోస్ట్ మార్టం కోసం వేచి ఉన్నది.

ఆదివారం నాడు ఉదయమే ఆయన ఒక శిష్యునితో కలిసి సీతానగరం వైపు కృష్ణానదీ తీరంలో ఒక పూజను నిర్వహించి తిరిగివస్తున్నారు. శిష్యుడు మోటార్ సైకిల్ తోలుతుంటే ఆయన వెనుక కూర్చొని ఉన్నారు.ప్రకాశం బారేజీ దాటగానే ఒక ట్రాఫిక్ సిగ్నల్ వస్తుంది. ఎడమవైపు వెళితే అమ్మవారి గుడి, కుడివైపు వెళితే కృష్ణ లంక వస్తాయి. ఆ సిగ్నల్ దగ్గర వెనుకనుంచి వచ్చిన ఒక ట్రాక్టర్ ఈ మోటార్ సైకిల్ ను గుద్దేసి వెళ్ళిపోయింది.ఆ ట్రాక్టర్ కు నంబర్ లేదు.  విశ్వాత్మ గారు కిందపడి పోగా తలకు బలమైన దెబ్బ తగిలి అక్కడికక్కడే ప్రాణం వదిలారు. కపాలమోక్షం అలా అయింది. 

ఆయన స్వచ్చమైన సన్యాసి. తన వివరాలు ఎవరికీ చెప్పేవారు కారు. "నవ్వులాట" శ్రీకాంత్ గారికి ఆయన మంచి మిత్రుడు అని చెప్పవచ్చు. శ్రీకాంత్ గారి ఆఫీస్ కి చాలా సార్లు వచ్చి కూచొని తీరికసమయంలో చాలాసేపు మాట్లాడేవారు. నేను ఆయన్ను విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ లో ఒకసారి మాత్రమె చూచాను. కొద్దిసేపు మాట్లాడాను. ఆ కొద్దిసేపటిలోనే ఆయనంటే నాకు గౌరవభావం కలిగింది. నిరాడంబరుడు, నిర్మొహమాటి, చాలా ఉన్నతమైన వేదాంతభావాలు కలిగిన సాధువు అని చెప్పాలి.

ఆయన పుట్టింది సంపన్నమైన కమ్మకులంలో. పెరిగింది సత్యసాయిబాబా సన్నిధిలో ప్రశాంతినిలయంలో. కోట్లు మూలుగుతున్నా ప్రాపంచిక జీవితంమీద విరక్తితో సన్యాసం తీసుకున్నాడు. సత్యసాయిబాబా బెడ్ రూం లోకి అప్పాయింట్ మెంట్ లేకుండా సరాసరి వెళ్లి మాట్లాడగలిగే చనువు ఆయనకు ఉండేది. ఆయనకు తెలియని గురువులు లేరు. ముప్పై ఏళ్ళ క్రితమే ఓషో రజనీష్ తో కొన్నినెలలు పూనాలో ఉండి ఆయనతో కలిసి వ్యాహ్యాళికి వెళ్ళేవాడు. ఒజాయ్ లో జిడ్డు కృష్ణమూర్తితో కొన్ని నెలలు కలిసి గడిపాడు. దలైలామాతో పరిచయం ఆయనకు ఉంది. ఇంకా చాలామంది ప్రసిద్ధ గురువులతో, సమాజంలో ఉన్నత వ్యక్తులతో ఆయనకు వ్యక్తిగత పరిచయాలు ఉండేవి. హిమాలయాలకు తరచూ వెళ్లి కొన్ని నెలలు అక్కడ ఉంటూ ఉండేవాడు. టిబెట్ యోగులతో ఆయనకు పరిచయాలున్నాయి. కానీ ఎక్కడా బయటపడకుండా చాలా నిరాడంబరంగా కనిపించేవాడు. నాలుగు రోజుల క్రితమే టిబెట్ నుంచి తిరిగి వచ్చినట్లు తెలిసింది.

ఆయన ఉండేది విజయవాడలో అయినా ఎక్కడ ఉంటాడో ఎవరికీ చెప్పేవాడు కాదు. ఎక్కువగా ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోడు. కానీ ఎక్కడో యధాలాపంగా కలిస్తే చాలా ఆప్యాయంగా మాట్లాడేవాడు. చాలా మంచి మనిషి. ఉన్నతమైన వేదాంతి. ఉత్త వేదాంత పాండిత్యం కలిగిన ఊకదంపుడు  వ్యక్తి కాదు. వేదాంతాన్ని ఆచరించి జీవితంలో అనుసరించిన వ్యక్తి. ఆయన జేబులో దొరికిన సెల్ ఫోన్ లో ఎవరో కొందరు భక్తుల నంబర్లు తప్ప తనవాళ్ళవంటూ ఎవరివీ నంబర్లు లేవు. ఆ శిష్యులకు కూడా ఆయన బంధువులు ఎవరో ఎక్కడున్నారో తెలియదు. అందుకే ఆయన శరీరం మూడురోజులనుంచీ మార్చురీలో పడి ఉంది.

ఆయన కృష్ణాజిల్లా చల్లపల్లి దగ్గరలోని కొడాలిలో ఉన్న మళయాళ స్వాములవారి సాంప్రదాయ ఆశ్రమంలో కొన్ని నెలలు ఉన్నారు. అక్కడ ఆశ్రమం వారికి ఆయన బాగా పరిచయం ఉన్నారు. కనుక చివరికి ఆ ఆశ్రమంవారే ఆయన దేహాన్ని తీసుకువెళ్ళి కొడాలిలో అంత్యసంస్కారం నిర్వహించాలని నిర్ణయించారు. ఆ కార్యక్రమం ఈరోజు జరగవచ్చు.

నదీమూలం ఋషిమూలం పరిగణించరాదు అంటారు. నది పుట్టినచోట చిన్న కాలువలాగే ఉంటుంది. దాని మహత్తు అక్కడ తెలీదు. సముద్రంలో కలిసే చోట దానిని చూడాలి. అలాగే మహనీయుల విలువను కూడా వారు పుట్టిపెరిగిన కుటుంబమూ పరిసరాలూ నిర్ణయించవు. ఆధ్యాత్మిక జీవితంలో వారు అందుకున్న స్థాయీ, వారి జీవితమూ మాత్రమే దానికి గీటురాళ్ళు. విశ్వాత్మగారు కూడా అటువంటి మంచి వేదాంతీ నిజమైన సాదువూనూ.

దేనినీ కూడా ఆయన గుడ్డిగా విమర్శించడం ఎవరూ చూడలేదు. ఆయన మాటల్లో ఒక రీజన్ ఉండేది. ప్రతివిషయాన్నీ చక్కగా సమన్వయ దృష్టితో చూచేవారు. కాని అసత్యాన్ని ఎక్కడా సమర్ధించేవారు కాదు. లోపం ఉంటే ఎంత పెద్దవారినీ ఒప్పుకునేవారు కాదు. ఆయనకు చిన్నప్పటి నుంచీ తెలిసిన సత్యసాయిబాబాని కొన్ని విషయాలలో విమర్శించడం నాకు తెలుసు.


ప్రస్తుతం రాశి చక్రంలో గురువూ కేతువూ మూడు డిగ్రీల దూరంలో ఉన్నారు. గురువు ఆధ్యాత్మిక గురువులకు సూచకుడు. కేతువు హటాత్ సంఘటనలకు దుర్ఘటనలకు సూచకుడు. శుక్రరాశి వల్ల జలసంబంధ ప్రదేశం సూచితం.ఈ దుర్ఘటన కృష్ణానదీ తీరంలోనే, ప్రకాశం బారేజీమీదే జరిగిందని గమనించాలి. మానవుల మీద గ్రహప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ.


మన దేశంలో ట్రాఫిక్ రూల్స్ ఎవరూ పాటించరు. ఆ మాటకొస్తే ఏ రూల్సూ ఎవరూ పాటించరు. ప్రతివారూ రూల్స్ ఎదుటివారికి మాత్రమె, నాకుకాదు అనుకోవడం మనదేశంలోని విచిత్రపరిస్తితి.గట్టిచట్టాలూ,మంచి న్యాయవ్యవస్తా, పోలీస్ వ్యవస్థా లేకపోవడం మనకొక పెద్దలోపం. ప్రతిదానిలో రాజకీయప్రమేయం ఇంకొక చండాలం. పౌరుల్లో సివిక్ సెన్స్ లేకపోవడం ఇంకొక ప్రధానలోపం.భారతీయులకు ముందుగా కావలసింది సిక్స్త్ సెన్స్ కాదు సివిక్ సెన్స్ & కామన్ సెన్స్ అని నేనెప్పుడూ అంటుంటాను. ట్రాఫిక్ రూల్స్ పాటించని రాష్ డ్రైవింగ్ వల్ల ఎంతమంది జీవితాలు ఇలా రోడ్డుపాలు అయిపోతున్నాయో దేవుడికేరుక.

అంత మంచి సాధువు జీవితం ఇలా ముగియటం మాత్రం బాధాకరం. కర్మ ఎవరినీ వదలదు అనడానికి విశ్వాత్మగారి జీవితంలో చివరిఘట్టం  ఇంకొక  ఉదాహరణ అనిపిస్తుంది.


ఆయన  గురించి వ్రాసిన పాత పోస్ట్ లు ఇక్కడ చూడవచ్చు.


http://teluguyogi.blogspot.in/2011/01/blog-post.html

http://teluguyogi.blogspot.in/2011/01/blog-post_07.html

http://teluguyogi.blogspot.in/2011/01/blog-post_11.html
read more " విశ్వాత్మ(స్వామి విశ్వాత్మానంద) గారు ఇక లేరు "

8, జులై 2012, ఆదివారం

రాహుకేతువుల ఆవృత్తులు - ప్రపంచవ్యాప్త సంఘటనలు- ఒక పరిశీలన

రాహుకేతువులు ఛాయాగ్రహాలైనప్పటికీ వాటి ప్రభావం భూమ్మీద అమితంగా ఉంటుంది అనేది సత్యం.  వీటియొక్క విద్యుత్ అయస్కాంతప్రభావం భూమిమీద ఖచ్చితంగా ఉంటుంది అని ఎన్నో సార్లు రుజువైంది. వీటి యొక్క సైక్లిక్ మూమెంట్ వల్ల అనేక సంఘటనలు భూమ్మీద యాక్టివేట్ అవుతుంటాయి.ఈ రాహుకేతువులు రాశిచక్రాన్ని ఒకసారి చుట్టి రావడానికి 18 ఏళ్ళు పడుతుంది. కనుక ప్రతి 18 ఏళ్ళకూ వీటియొక్క ఒక సైకిల్ పూర్తి అవుతుంది. అందుకనే మనిషి జీవితంలో కూడా ప్రతి పద్దెనిమిది ఏళ్లకూ ఒక విధమైన దశ పూర్తి అవుతుంది.


పుట్టిన నాటినుంచీ 18 ఏళ్ళవరకూ మనిషికి లోకమంటే ఏమిటో తెలియని ఒక విధమైన అమాయకత్వదశ నడుస్తుంది.18 ఏళ్ళు వచ్చేసరికి మనిషి యవ్వనం లోకి అడుగుపెడతాడు.లోకం కొత్తగా కనిపించడం మొదలౌతుంది. తిరిగి 36 ఏళ్ళు వచ్చేసరికి ఆ వేడి తగ్గి ఒకవిధమైన పరిపక్వత వస్తుంది.బాధ్యతలు చుట్టుముడతాయి. బాధ్యతలు ముగిసి 54 ఏళ్ళు వచ్చేసరికి మధ్యవయసు  దశ మొదలౌతుంది.ఎందుకు పుట్టామో ఏం సాధించామో తెలియక మనిషి అయోమయంలో పడే దశ ఇది. తర్వాత వచ్చే ఆవృత్తిలో 72ఏళ్లలోపు చాలామంది పరలోక ప్రయాణం కడుతుంటారు. ఎవరైనా మిగిలితే ఆ తర్వాతి దశలో ఎలాగు చావు తప్పదు. కనుక రాహుకేతువుల అయిదు  చుట్లలోనే మనిషి జీవితం దాగుంది అని చెప్పవచ్చు. ఒకరకంగా చూస్తె పంచభూతాలనే అయిదుచుట్లుగా చుట్టుకున్న రాహుకేతువులనే కాలసర్పం మానవులను బంధించి ఉందని ఊహించవచ్చు.


రావుకేతువులు వృశ్చికంలోనూ వృషభంలోనూ ఉన్నపుడు నీచస్తితిలో ఉంటాయని ఒక భావన ఉంది. వీరి ఉచ్ఛనీచల గురించి అనేక అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఎక్కువగా  అనుసరించబడే రాశులు ఇవి రెండే. వీరు నీచస్తితిలో ఉన్న ప్రతిసారీ ఏమేమి సంఘటనలు జరిగాయో, ప్రపంచవ్యాప్తంగానూ మన దేశంలోనూ కూడా, ఒక్కసారి పరిశీలిద్దాం.

నవంబర్ 1899 నుంచి ఏప్రిల్ 1901  

USS Maine అనే యుద్ధ నౌక హవాన హార్బర్ లో పేలిపోయి మునిగిపోయింది. దానిలోని దాదాపు 300 మంది సిబ్బంది చనిపోయారు. దీనివల్ల అమెరికా స్పెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభం అయ్యింది. అమెరికా ఫిలిప్పైన్స్ మధ్య కూడా ఈ సమయం లోనే యుద్ధం జరిగింది. కొలంబియా లో వచ్చిన సివిల్ వార్ లో దాదాపు లక్షమంది చనిపోయారు. గురుశనులు అమెరికాకు సూచిక అయిన ధనుస్సులో ఉండటం చూడవచ్చు. కొందరి అభిప్రాయం ప్రకారం దీనికి ఎదురుగా ఉండే మిధునం అమెరికాను సూచిస్తుంది.


జూన్ 1918 నుంచి నవంబర్ 1919 వరకూ

 మొదటి ప్రపంచయుద్దపు రోజులు. ప్రపంచమంతా  యుద్ధ జ్వాలలతో గందరగోళంగా ఉంది. ఇదే సంవత్సరంలో మన దేశంలో జలియన్వాలాబాగ్ సంఘటన జరిగింది. షిర్డీసాయిబాబా మరణం కూడా అప్పుడే జరిగింది. గురుశనుల సాముదాయక దృష్టి తులారాశిమీద పడటం చూడవచ్చు. తుల సమతుల్యతకు సూచిక. ప్రపంచపు సమతుల్యత దెబ్బతినడం సూచింపబడుతున్నది. గురుశనులు వక్రించి ఉండటమూ రాహువు నుంచి గురువు అష్టమంలో ఉండటమూ చూడవచ్చు.


జనవరి 1937 నుంచి జూలై 1938

జపాన్ జర్మనీల దురహంకార చర్యల వల్ల రెండవ ప్రపంచయుద్దానికి కావలసిన ఘట్టం సిద్ధం అయ్యింది. చైనా లోని నాంకింగ్ పట్టణం పైన జపాన్ జరిపిన అమానుష దాడిని "రేప్ ఆఫ్ నాంకింగ్" అని ఇప్పటికీ అంటారు.ఈ సమయంలో హిట్లర్ ప్రణాలికలు చాలా చురుకుగా సాగాయి. 1939 లో రెండవ ప్రపంచయుద్ధం మొదలైంది. గురుశనుల సాముదాయకదృష్టి వృషభం మీదా, కన్యమీదా ఉంది. నవీన భారతదేశాన్ని సూచించే వృషభం వల్ల ఈ సమయంలో మన దేశంలో స్వతంత్రం కోసం తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. రంగం సిద్ధం అయింది.


ఆగస్ట్ 1955 నుంచి ఫిబ్రవరి 1957

హంగేరీ లో విప్లవం వచ్చింది. కాని అది బలవంతంగా మిలిటరీ చేతిలో అణిచివేయబడింది. క్యూబా లో కూడా విప్లవం వచ్చింది. సూడాన్ కు బ్రిటన్ చేతులోనుంచి స్వతంత్రం వచ్చింది. సామాన్య జనాన్ని సూచించే శని రాహువుతో కూడి ఉండటం గమనించవచ్చు.ఇదే సమయంలో జనానికి ఉపయోగపడే పోలియో వాక్సిన్ కనుక్కోబడింది.ట్రీటీ ఆఫ్ రొమ్ ద్వారా EEC (యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ) స్థాపించబడింది. రష్యా గగనతలంలోకి స్పుత్నిక్ ను ప్రయోగించింది. మన దేశంలో అయితే ఇదే సమయంలో  భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి.

మార్చి 1974  నుంచి సెప్టెంబర్ 1975

అమెరికాలో వాటర్ గెట్ కుంభకోణం జరిగి ప్రెసిడెంట్ నిక్సన్ రాజీనామా చెయ్యవలసి వచ్చింది. అమెరికాను సూచించే  మిథునంలో శని వక్రించి ఉండటం రాహువు నుంచి అష్టమంలో ఉండటం  చూడవచ్చు. సైప్రస్ ను టర్కీ ఆక్రమించింది. అంగోలా కు స్వతంత్రం వచ్చింది. లెబనాన్ లో సివిల్ వార్ మొదలైంది. అమెరికా రష్యాల స్పేస్ క్రాఫ్ట్ డాకింగ్ జరిగింది. మనదేశంలో పోఖరాన్ అణుపరీక్ష జరిగింది. ఎమర్జెన్సీ విధించబడి దేశం సంక్షోభానికి గురయ్యింది.


నవంబర్ 1992  నుంచి మే 1994
    
బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. యూరోప్ దేశాలన్నీ కలిసి సంఘటిత మార్కెట్ ను మొదలు పెట్టాయి. రువాండా మారణహోమంలో కనీసం పదిలక్షల మంది టుట్సీ జాతివారు హుటూ సైన్యం చేతిలో ఊచకోతకు గురయ్యారు.షూమేకర్ తోకచుక్క గురుగ్రహాన్ని డీ కోట్టింది. గురువు వక్రించి ఉండటమూ,శనిగురువుల మధ్య శని కుజుల మధ్యా షష్టాష్టకం ఉండటమూ కుజుడు నీచలో ఉండటమూ తన అష్టమ దృష్టితో శనిని చూస్తూ ఉండటమూ చూడవచ్చు.ఇందువల్లే అంత మారణహోమం జరిగింది. మనదేశంలో బాబ్రీమసీదు విధ్వంసం కూడా అప్పుడే జరిగింది. 
  
ఇకపోతే మళ్ళీ ఇప్పుడు రాహుకేతువులు నీచస్తితిలో ఉన్నాయి. ప్రస్తుత ప్రపంచ రాజకీయాల గురించీ సంఘటనల గురించీ ప్రత్యేకంగా చెప్పనక్కరలేదుకదా.  అవి కళ్ళ ఎదురుగా కనిపిస్తూనే ఉన్నాయి. కనుక రాహుకేతువులు నీచస్తితిలో ఉన్న ప్రతిసారీ ప్రపంచవ్యాప్తంగా  ముఖ్యమైన సంఘటనలు తప్పక జరుగుతాయి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఆయా సంఘటనలు గురువు, శని, కుజుల స్తితులను బట్టీ  అవి ప్రభావితం చేసే రాశులను బట్టీ జరుగుతూ ఉంటాయి. గ్రహగతులను సూక్ష్మంగా పరిశీలించడం వల్ల వాటిని అర్ధం చేసుకోవచ్చు.
read more " రాహుకేతువుల ఆవృత్తులు - ప్రపంచవ్యాప్త సంఘటనలు- ఒక పరిశీలన "

6, జులై 2012, శుక్రవారం

హిగ్స్ బోసాన్ కణావిష్కరణ - జ్యోతిష్య కోణాలు

4-7-2012 న హిగ్స్ బోసాన్ కణం కనుక్కున్నామని జెనీవాలో శాస్త్రవేత్తలు ప్రకటించారు. దీనిని దైవకణం అంటున్నారు. ఈ కణం ఉందని ఊహాత్మకంగా లెక్కల ఆధారంగా ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నప్పటికీ దీని ఉనికిని నిర్ధారించడం ఇదే మొదటిసారి. నేను పాతికేళ్ళ క్రితం డిగ్రీ చదివే సమయంలోనే మోడరన్ ఫిజిక్స్ లో సబ్ అటామిక్ పార్టికిల్స్ గురించి చదివినప్పుడు చాలా ఇంట్రస్ట్ కలిగేది. మనకు తెలిసిన ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ లే కాక, న్యూట్రినో మొదలైన అనేక ఇంకా సూక్ష్మ అణువులు ఉన్నాయని చదివినప్పుడు భలే ఆశ్చర్యం కలిగేది. సరే విధివశాత్తూ ఆ లైన్ లో నా చదువూ సంధ్యా ముందుకు సాగలేదు. అదలా ఉంచుదాం. మనకు తెలిసిన అటామిక్ మోడల్ తో విశ్వాన్ని అర్ధం చేసుకోవాలంటే అణువులకు బరువును ఇచ్చే ఒక ప్రాధమిక కణం ఉండాలని శాస్త్రవేత్తలు ఎప్పుడో ఊహించారు. దాన్నే హిగ్గ్స్ బోసాన్ కణం అంటున్నారు. థియరీ పరంగా అది ఉండాలి అని ఊహించినప్పటికీ దాని ఉనికిని ఖచ్చితంగా నిర్దారించామని మాత్రం ఇప్పుడే శాస్త్రవేత్తలు ప్రకటించారు.

ఈ సందర్భంగా చిన్న జ్యోతిష్యపరిశీలన చేద్దాం. ప్రతి సైన్స్ ఆవిష్కరణ సమయంలోనూ యురేనస్ గ్రహం ప్రముఖపాత్ర పోషించినట్లు మనం సైన్స్ చరిత్ర చూస్తె అర్ధమౌతుంది. ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరు జ్యోతిశ్శాస్త్రవేత్తలూ ఒప్పుకున్నారు. కనుక యురేనస్ యొక్క పాత్ర ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ కోణంలో 4-7-2012 న గ్రహచక్రం చూస్తె కొన్ని ఆశ్చర్యకర నిజాలు కనిపిస్తాయి.

ఆ రోజున మీనంలో యురేనస్సూ,ధనుస్సులో ప్లూటో, వృషభంలోని శుక్రుడూ, కర్కాటకంలోని బుదుడూ అందరూ కలిసి 14 డిగ్రీలమీద ఖచ్చితమైన కంజంక్షన్ లో ఉన్నారు. ఇది వింతకాక మరేమిటి? యురేనస్ ప్లూటోలు square aspect లోనూ, యురేనస్ బుధులు angular aspect లోనూ ఉన్నారు. యురేనస్ శుక్రుల మధ్యన sextile aspect ఉంది. అలాగే శుక్రబుదుల మధ్య కూడా అదే ఉంది. కనుక స్థూలంగా మూడుగ్రహాల ప్రభావం ఆరోజున బుధుని మీద ఖచ్చితంగా ఫోకస్ అయింది. దీనికి తోడు  ఆరోజున బుధవారం అవటం ఇంకొక వింత. బుధుడు scientist లనూ, మేధావులనూ సూచిస్తాడని మనకు తెలుసు. కనుక ఆరోజునే శాస్త్రవేత్తల నుంచి ఈ ప్రకటన వెలువడింది. శుక్రుడు దైవాన్ని సూచించే గురుకేతువులతో కలిసి ఉండటమే ఈ కణాన్ని దైవకణం అని  పిలవడానికి కారణం. కాని అది దైవకణం కాదు. దైవం ఒక కణంలో మాత్రమె ఎప్పుడూ ఉండదు. ఈ కణం తెలిసినంత మాత్రాన దైవం గురించి మానవుడు ఏమీ తెలుసుకోలేడు.ఈ సంగతి ఇంకోమారు ముచ్చటించుకుందాం.


పౌర్ణమి అమావాస్యల ప్రభావాన్ని గురించి నేను చాలాసార్లు ఇంతకుముందు చెప్పాను. ఎన్నో రుజువులు చూపించాను కూడా. మొన్న మూడో తేదీన పౌర్ణమి. మర్నాడే నాలుగోతేదీన ఈ ఆవిష్కరణ జరిగింది. లోకంలో ముఖ్యమైన సంఘటనలు అన్నీ అమావాస్యా పౌర్ణమి దగ్గరలో జరుగుతాయి అని నేను చెప్తూ వస్తున్నది మళ్ళీ నిజం కావడం గమనించవచ్చు.దీనికి కారణం మనిషి మనసు మీద చంద్రుని ప్రభావమే. మనిషి ఎంత విర్రవీగినా ప్రకృతిశక్తుల ప్రభావానికి అతీతుడు కాలేడు. గ్రహప్రభావానికి అతీతుడు కాలేడు. యోగసాధనలో ఉన్నతస్థాయిలు అధిరోహించినపుడు మాత్రమె మనిషి గ్రహప్రభావానికి అతీతుడు కాగలడు. సామాన్యులకు అది అసాధ్యం. సైంటిష్టులూ సామాన్యమానవులే గనుక వారికీ గ్రహాలు అనుకూలించినప్పుడే ప్రయోగాలు విజయవంతం అవుతాయి. అందుకే పై గ్రహసంయోగాలు ఉన్నప్పుడే అదికూడా పౌర్ణమిఘడియల ప్రభావంలోనే ఈ ఆవిష్కరణ సాధ్యం అయింది.

ఇకపోతే ప్లూటోగ్రహం వక్రస్తితిలో ఉంటూ, గెలాక్టిక్ సెంటర్ కు దగ్గరలో ఉండటం చూస్తె ఒక విషయం స్ఫురిస్తుంది. ప్లూటో గ్రహం అతీతశక్తులకూ అతీంద్రియ స్ఫురణలకూ సూచకుడు. అందుకే ఈ మధ్యన కొత్తకొత్త గ్రహాలూ కనుక్కున్నామనీ, కొత్త గెలాక్సీలు బయట పడ్డాయనీ ప్రకటనలు వెల్లువెత్తుతున్నాయి. దైవకణం కనుక్కోవడం అంటే సృష్టికి మూలం అనేది దగ్గరగా తెలియడమే. మూలానక్షత్ర ప్రాంతంలోనే విష్ణునాభి అనే కాస్మిక్ శక్తికేంద్రం  ఉంటుందని మనకు తెలుసు. అందులోనుంచే సృష్టికర్త అయిన బ్రహ్మ ఉదయించాడు. ఆ ప్రాంతంలో అతీంద్రియ అనుభవాలకూ శక్తులకూ సూచిక అయిన ప్లూటో  గ్రహం సంచరిస్తూ ఉన్నపుడు ఈ దైవకణం గురించి ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్న మనుషులకు తెలియడం కాకతాళీయం ఎలా అవుతుంది? కాదని మనం అర్ధం చేసుకోవచ్చు.

ఇక రాహుకేతువులను పరిశీలిస్తే, ఇంకొక రహస్యం స్ఫురిస్తుంది. రాహుకేతువులు ప్రస్తుతం నీచలో ఉన్నాయి. ఈ సమయంలో ప్రపంచంలో అనేక మార్పులు తప్పక వస్తాయి అనేది చాలాసార్లు రుజువైంది. రాహుకేతువులు నీచలో ఉండగా పుట్టిన జాతకాలు కూడా ప్రత్యేకమైనవే. వీరి ప్రమేయం లేకుండానే వీరికి కొన్ని అతీంద్రియ అనుభవాలు కలుగుతూ ఉంటాయి.అయితే వీరికి కర్మబందాలు ఎక్కువగా ఉంటాయి.వృశ్చికరాశి విశ్వకుండలినికి స్థానం కనుక ఆ స్థానంలో రాహువు ఉన్నప్పుడు విశ్వకుండలినిలో చలనం ఉంటుంది. అందుకే విశ్వమేధస్సు అనబడే మేరుపర్వతం రాహుకేతువులనే తాడుచేత చిలకబడి క్షీరసాగరమధనం జరిగినట్లు జరిగి అందులోనుంచి ఎన్నో విలువైన మణులు పుట్టుకొస్తాయి. అలాంటి మణులలో ఒకటే ప్రస్తుత హిగ్స్ బోసాన్ అనబడే దైవకణం ఆవిష్కరణ. కానీ సాగరమధనంలో హాలాహలం కూడా పుట్టింది. ఆ హాలాహలం ఏమిటి? ఎప్పుడు పుడుతుంది? ఆ విషయాలు ముందు ముందు చూద్దాం. 

ప్రస్తుతానికి ఈసందర్భంగా ఒక కొత్త విషయం స్ఫురిస్తుంది. సుదూరగ్రహాలైన యురేనస్ నెప్ట్యూన్ ప్లూటోలకు మనకు తెలిసి ఏ దృష్టులూ లేవు. కాని పై చక్రం పరిశీలిస్తే కొన్ని విషయాలు స్ఫురిస్తాయి. యురేనస్ కు ఖచ్చితంగా పంచమ దృష్టి ఉన్నది. లేకుంటే అది బుధుడిని డిగ్రీ దృష్టితో చూడలేదు. దీనికి ఇంకొక దృష్టి కూడా ఉండి ఉండాలి. గురువుకు ఉన్నట్లే అది నవమ దృష్టా? అదే అయితే రాహువును తన నవమ దృష్టితో చూస్తూ ఉండాలి. కాని ఇది ఖచ్చితమైన దృష్టి కాదు. ఇకపోతే దశమ దృష్టి అయితే, యురేనస్ ప్లూటో ను ఖచ్చితమైన దృష్టితో చూస్తుంది. కనుక యురేనస్ కు పంచమ దశమ దృష్టులు ఉండి ఉండాలి. అలాగే ప్లూటోకు కుజునికి ఉన్నట్లు చతుర్ధ అష్టమ ప్రత్యెక దృష్టులు ఉండి ఉండాలి. అప్పుడే ప్లూటో యురేనస్ నూ, బుదుడినీ వీక్షించగలుగుతాడు. ఈ ప్రత్యెక దృష్టులు ఈ గ్రహాలకు ఉన్నాయా లేవా అనే విషయం ఒక 50 జాతకాల మీద పరీక్షించి చూస్తె అర్ధం చేసుకోవచ్చు.

రాహుకేతువులు నీచలో ఉండటం, ప్లూటో విష్ణునాభికి దగ్గరగా ఉండటం జరుగుతున్న ఈ సమయంలోనే ఇతర గ్రహాలగురించి తెలియడం ఇతర గెలాక్సీల గురించి తెలియడం సృష్టి మూలకణాల గురించి తెలియడం జరుగుతోంది. అంటే ఒకరకంగా విశ్వరూపసందర్శనం జరుగుతోంది. శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని యుద్ధం ముందే ప్రదర్శించాడు. మళ్లీ ఒకసారి కురుక్షేత్రయుద్ధం మధ్యలో ప్రదర్శించాడు. కనుక ప్రస్తుత విశ్వరూపదర్శనం తర్వాత కూడా ఒక యుద్ధం రాబోతున్నదా? లేకపోతే త్వరలోనే ఒక మినీ ప్రళయం రాబోతున్నదా? సమాజంలో గతి తప్పిన ధర్మమూ, మితిమీరిన స్వార్ధమూ దీనినే సూచిస్తున్నాయా? ప్రకృతి అనేది సమాజానికి గట్టిగా  బుద్ధిచెప్పే సంఘటనలు త్వరలో జరుగనున్నాయా?     

తాంత్రికజ్యోతిష్యం లో ధనుస్సునుంచి మీనం వరకూ ఉన్న రాశులను "లయఖండం" అంటారు. అంటే ఈ నాలుగురాశులూ నాశనాన్ని సూచిస్తాయి. ప్లూటో సృష్టికి మూలం అయిన ధనుస్సులో ఉన్నాడు. యురేనస్ సృష్టికి అంతం అయిన మీనంలో ఉన్నాడు. యురేనస్ నెప్ట్యూన్ ప్లూటోలు ముగ్గురూ లయఖండంలోనే ఉన్నారు. ఈ అమరిక ఏదో ఉత్పాతాన్నే సూచిస్తోంది. ఆ ఉత్పాతం ఏమిటి? ఈ మూడుగ్రహాలూ  భూమికి అతి దూరంలో ఉన్నాయి. కనుక విశ్వాంతరాళంలో సుదూరతీరాల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల భూమికి ఉత్పాతాలు పొంచి ఉన్నాయని ఇది సూచనా? చూద్దాం కొన్ని నెలలు ఆగితే అన్నీ తెలుస్తాయిగా. తొందరెందుకు.
read more " హిగ్స్ బోసాన్ కణావిష్కరణ - జ్యోతిష్య కోణాలు "

5, జులై 2012, గురువారం

ఇదా మానవత్వం?

నిన్న గాక మొన్న జరిగిన ఒక సంఘటన చూచాక మనుషుల మీద నమ్మకం నాకు పూర్తిగా నశించింది. మనుషుల్లో పచ్చి స్వార్ధం తప్ప ఇంకేమీ లేదనీ, మన బ్రతుకులన్నీ దొంగ బ్రతుకులేననీ, మనుషుల్లో మనుషులు లేరనీ ఉన్నవి జంతువులేననీ పూర్తిగా అర్ధం అయింది.

మొన్న గుంటూరులో ఒక వ్యానూ ఒక టూవీలరూ గుద్దుకుని, ఆ వ్యాను టూవీలర్ నడుపుతున్న వ్యక్తీ కాళ్ళ మీదుగా ఎక్కింది. అతనికి రెండు కాళ్ళూ నుజ్జు అయిపోయాయి. కుయ్యో మొర్రో అని ఏడుస్తూ రోడ్డు మీద పడి రక్షించమని అందరినీ ప్రాధేయపడుతుంటే, రోడ్డున పోతున్న వారుగాని, ఆటోలవాళ్ళు గాని, కార్లవాళ్ళు గాని ఎవరూ ఒక్కరుకూడా అతనికి సాయం చెయ్యలేదు. అతను అరిచీ అరిచీ రోడ్డుమీదే ప్రాణం కోల్పోయాడు. దీనిలో హైలైట్ ఏమిటంటే ఇది జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఒక టీవీ చానల్ వారు, అతని అరుపులు ఏడుపులు చక్కగా షూట్ చేస్తూ అతని ప్రాణం పోవడం కూడా స్టేజి బై స్టేజి ఎలా పోతోందో క్లియర్ గా బ్రాడ్ కేస్ట్ చేశారు. అతన్ని రక్షించి వెంటనే ఒక ఆస్పత్రి లో చేరుద్దామని మాత్రం ఒక్కరూ ప్రయత్నం చెయ్యలేదు.ప్రతివారూ ఒక్క చూపు చూచి తమదారిన తాము పోతున్నారు.

పాతకాలంలో అయితే పరిస్తితి ఇలా ఉండేది కాదు. వెంటనే ఎవరో ఒకరు స్పందించి సాయం చేసి ఉండేవారు. కాని ఇప్పుడు ప్రతివారిలోనూ స్వార్ధం విశ్వరూపం దాల్చింది. ఈ పని చేస్తే నాకేంటి లాభం అని ఆలోచిస్తున్నారు. అందుకే  కుటుంబసభ్యుల మధ్యన కూడా ఆర్ధికవ్యాపారమే తప్ప ప్రేమవ్యవహారం ఉండటం లేదు."లోకంలో ఉన్నవి ఆర్ధికపరమైన  సంబంధాలు మాత్రమే"అని మార్క్స్ అన్నది నిజమేనేమో అని అప్పుడప్పుడూ నాకు అనిపిస్తుంది. ప్రస్తుత సమాజంలో అన్ని బ్రతుకులూ నాటకపు బ్రతుకులుగా తయారయ్యాయి. ఎంగిలి చేత్తో కాకిని విదిలించడు అనీ, పిల్లికి బిచ్చం పెట్టడు అనీ, విరిగిన వేలిమీద ఒంటెలు కూడా పొయ్యడు అనీ పల్లెటూర్లలో సామెతలు ఉండేవి.ఇప్పుడు నిత్యజీవితంలోనే అవి ప్రతిరోజూ కనిపిస్తున్నాయి.ఒకవైపు భక్తి కూడా ఎక్కడచూచినా వికృతనృత్యం చేస్తున్నది. ప్రతి ఊళ్లోనూ గుళ్ళూ గోపురాలూ కిటకిటలాడుతున్నాయి. అది భక్తి కాదు, భయం అని నా అవగాహన చెబుతోంది. మనుషులలో స్వార్ధం మితిమీరినప్పుడు భయం కూడా ఎక్కువ అవుతుంది. తాము చేస్తున్నది తప్పని తమ అంతరాంతరాలలో తెలుసు కాబట్టి భయంతో గుడికెళ్ళి దేవుడికి లంచం ఇద్దామని ప్రయత్నం చేస్తాడు మానవుడు. దానిని భక్తిగా భ్రమిస్తాడు.తన కళ్ళు తాను పొడుచుకుని దేవుడి కళ్ళు కూడా పొడవడమే నేటి భక్తికి నిర్వచనం. భక్తిగా మనకు కనిపించేది నిజానికి మితిమీరిన స్వార్ధమూ భయమూ మాత్రమే.

మానవత్వం లేనివాడికి దైవత్వం అనేది ఎన్ని జన్మలెత్తినా దొరకదు అని నేనెప్పుడూ చెబుతాను. స్వార్ధం వికృతరూపం దాలుస్తున్న నేటి సమాజంలో మానవత్వమే మృగ్యం అవుతుంటే ఇక దైవత్వం అనేది మానవుల ఊహకు కూడా అందదు అనేది నగ్నసత్యం. సాటిమనిషిలో దేవుని చూడమని వివేకానందస్వామి చెప్పాడు. కనీసం మనిషిని మనిషిగా చూడటం కూడా మనకు సాధ్యం కావడం లేదు. ఒక వస్తువుకంటే హీనంగా ఎదుటి మనిషిని చూస్తున్నాం. నేటి సమాజంలోని మానవమృగాలకు ఎప్పటికైనా నిష్కృతి అనేది ఉంటుందా అని నా అనుమానం.  

మన చుట్టూ మనుషులు లేరని, మనిషి తోలు కప్పుకుని పులులూ తోడేళ్ళూ నక్కలూ కుక్కలూ పాములూ ఎలుగుబంట్లూ తిరుగుతున్నాయని నేను ఎప్పుడూ అనుకుంటాను. అది నిజమే అని ప్రతిరోజూ నిర్ధారణ అవుతోంది.

భగవంతుడు ఎంత ఉన్నతమైన భావనతో మనిషిని సృష్టించాడు? చివరికి మనిషి ఎలా తయారయ్యాడు? ఏదన్నా ప్రళయం వచ్చి ఈ ప్రపంచం  అంతా త్వరగా సర్వనాశనం అయి, కొద్దిమంది మంచివాళ్ళు మాత్రమె మిగిలితే ఎంత బాగుంటుంది అని ఈ మధ్యన నాకు తరచుగా అనిపిస్తోంది.
read more " ఇదా మానవత్వం? "

2, జులై 2012, సోమవారం

గురుపూర్ణిమ (గుండెధైర్యం లేనివాళ్ళు చదవొద్దు)

ఈరోజు ఉదయమే కొంతమంది నా దగ్గరకొచ్చి గురుపూర్ణిమ చందా అడిగారు. "సరే దాందేముంది ఇస్తాలేగాని దానితో ఏం చేస్తారు?" అని అడిగాను. సాయిబాబా గుళ్ళో ప్రత్యెకపూజ చేయిస్తామని చెప్పారు. "మామూలు పూజే వేస్ట్ అని నేననుకుంటుంటే ప్రత్యేకపూజ కూడానా?" అన్నాను. ఇంకొకసారి నా దగ్గరకొచ్చి ఇలాంటి పిచ్చిమాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు. పరిస్తితి తేడాగా ఉంటుంది అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపాను. 

గురుపూర్ణిమ అంటూ రకరకాల గుళ్ళలోనూ, గురువుల సమక్షంలోనూ  చేసే తంతులన్నీ శుద్ధ పనికిమాలిన పనులు. ఈరోజుల్లో కులానికొక గురువు, వర్గానికొక గురువు, పనులు కావడానికొక గురువూ, పాస్ పోర్ట్ త్వరగా రావడానికొక గురువూ, గర్ల్ ఫ్రెండ్ త్వరగా కరుణించడానికొక గురువూ ఇలా వీధికొకరు, పనికొకరు, పనికిమాలిన గురువులు బ్రోకర్లలా  తయారయ్యారు. వీళ్ళందరూ అసలు "గురువు" అన్న పదానికి అర్హులేనా అని నాకు ఎప్పటినుంచో పెద్ద అనుమానం.

"అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిదీయతే" అంటూ అంధకారాన్ని తొలగించేవాడే గురువు అని శాస్త్రం చెబుతోంది. మరి ఇన్నేళ్ళ నుంచీ చేస్తున్న ఈ గురుపూజలవల్ల ఎవరికి ఏ అంధకారం ఎలా తోలిగిందో నాకైతే అర్ధం కాదు. నేను ఇన్నేళ్ళలో కొన్ని వందలమందిని క్లోజ్ గా గమనించాను.  గురుపూజా మహోత్సవాలు అని జరుపుకునే ప్రహసనాలు చాలా చూచాను. నాకు తెలిసి ఈ పూజలు చేస్తున్న ఎవరిలోనూ ఏ అందకారమూ తొలగలేదు. అహంకారరూపంలో ఇంకా బాగా దట్టంగా పట్టుకుంది. 

సమస్తలోకాలకూ ఆదిగురువు పరమశివుడు ఈ రోజున ఎవరికీ గుర్తురాడు. చిన్ముద్రాలంకృతుడై మౌనంగా అత్యుత్తమ జ్ఞానప్రసారం చేసి అనవసరపు  శాస్త్రజ్ఞానపు బరువుతో ముసలివగ్గులై పోయిన శిష్యులకు ఆత్మానుభవజ్ఞానాన్ని ప్రసాదించిన దక్షిణామూర్తి ఎవరికీ గుర్తురాడు. అనంతమైన వేదరాశిని ఆమూలాగ్రం అవగతం చేసుకొని దానిని ఋగ్యజుస్సామాధర్వణ భాగాలుగా విభజన చేసి పద్దెనిమిది పురాణాలనూ, ఉపపురాణాలనూ రచించి భరతజాతికి ఒక సంస్కృతిని ఇచ్చి ప్రాణంపోసిన వేదవ్యాసమహర్షి ఎవరికీ గుర్తురాడు.బ్రహ్మమానసపుత్రులై జన్మించి సంసారాన్ని తిరస్కరించి నిత్యమూ బ్రహ్మానుభూతిలో విరాజిల్లుతూ అయిదేళ్ళ పసిబాలురవలె వెలిగే సనక సనందన సనత్కుమార సనత్సుజాతులనబడే  జ్ఞానమూర్తులు ఎవరికీ గుర్తురారు. త్రిమూర్తుల ఔన్నత్యాన్నే పరీక్షించిన తపశ్శాలి భ్రుగుమహర్షి ఎవరికీ గుర్తురాడు.అరవైవేలమంది క్షత్రియయోధులను ఒక్క చూపుతో భస్మం చేసిన కపిలమహర్షి ఎవరికీ గుర్తురాడు. నిరంతర నారాయణనామస్మరణతో తన్మయుడై వైకుంఠానికి ఎప్పుడు బడితే అప్పుడు వెళ్లి రాగలిగిన మహాగురువు దేవరుషి నారదుడు ఎవరికీ గుర్తుకు రాడు. ఒకవేళ వచ్చినా మన దరిద్రపుకధలు సిగ్గులేని సినిమాల పుణ్యమా అని ఒక కమెడియన్ గా, ఒక తంపులమారిగా గుర్తొస్తాడు. కనీసం ద్వైతాద్వైత విశిష్టాద్వైత మత ప్రవర్తకులైన మధ్వ, శంకర, రామానుజులు కూడా గుర్తురారు. ఇదీ మన పరిస్తితి. 

మన గోత్రఋషులలో ఎవరి చరిత్ర ఏమిటో ఎవరికైనా తెలుసా? వారు ఎంతటి బ్రహ్మజ్ఞాన సంపన్నులైన మహర్షులో ఎంతటి తపశ్శక్తి సంపన్నులో ఎంతటి చరితార్ధమైన జీవితాలను గడిపినవారో తెలుసా? మనవలె శిశ్నోదర పరాయణులై నిరర్ధక జీవితాలను గడిపినవారు కారని మనకు తెలుసా? కనీసం వారి మహోన్నత ఆదర్శమయ జీవితాలను తెలుసుకుందామనీ, అనుసరించే ప్రయత్నం చేద్దామనీ మనకు ఎన్నడైనా అనిపిస్తుందా? 

గురుపూర్ణిమ ఎలా చేసుకోవాలో మనకసలు తెలుసా? ఆ అర్హత మనకసలు ఉందా? మనకు తెలిసిందల్లా జనందగ్గర చందాలు వసూలు చేసి, పూజలంటూ ఏవేవో వస్తువులు పోగేసి వాటితో ఏవేవో దండగమారి పూజలు చేసేసి, ఏదన్నా సొమ్ము మిగిలితే దానిని స్వాహా చేసేసి, ఏదో ఘనకార్యం చేసినట్లు పొంగిపోవటమే కాని, భరతజాతికి అసలు గురువులెవరు? వారేమి ఉపదేశించారు? ఎంతటి మహత్తర జ్ఞానసంపదను వారు మనకు అందించారు? అందులో మనకెంత అర్ధం అయింది? దానిని ఎలా ఆచరించాలి? అని ఒక్కసారైనా ఆలోచించిన పాపం చేశామా?

సాయిబాబా అంటే నాకేమీ ద్వేషంలేదు. కాని గురుపూర్ణిమ రోజున సాయిబాబా గుళ్ళలో జరిగే తంతులు చూస్తుంటే నాకు పొట్ట చెక్కలయ్యే నవ్వు వస్తుంది. ఈ మనుషుల మీదా సమాజం మీదా అసహ్యం  తీవ్రస్థాయిలో నాలో పెరిగిపోతుంది. నిత్యజీవితాలలో కుళ్ళూ కుత్సితాలతో పుచ్చిపోయిన దొంగభక్తులందరూ అక్కడ చేరి వారివారి కోరికల చిట్టాలు తెరిచి, తమకు అర్హత ఉందా లేదా అనేదికూడా చూచుకోకుండా, మాకదివ్వు ఇదివ్వు అంటూ ఒకటే ఊదరగొట్టి, నాలుగుడబ్బులు పడేసి, ఏదో ఘనమైన పూజలు ఆయనకు చేసినట్లు ఆత్మవంచన చేసుకుంటూ పొంగిపోతూ బయటకు వస్తుంటారు.సాయిబాబా కనుక జీవంతో ఉంటే, "పొండిరా దొంగల్లారా" అంటూ  తన చేతిలో ఉన్న కమ్చీతో తనకు ఓపిక ఉన్నంతవరకూ వీళ్ళను తరిమితరిమి కొట్టి ఉండేవాడు.

ఒక భక్తురాలు సాయిబాబాకు ఎన్నో ఏళ్లుగా ఎన్నో పూజలు చేసింది. కాని 29 ఏళ్ల ఆమె కూతురు ఈ మధ్యనే అకస్మాత్తుగా చనిపోయింది. "ఇన్నేళ్ళు పూజలు చేసినందుకు ఇదేనా బాబా నాకిచ్చే ప్రతిఫలం?" అంటూ నాతో వాపోయింది. ఎందుకలా చేసాడో బాబానే అడగమని ఆమెకు చెప్పాను. "ఆయన ఏమీ పలకడం లేదని" ఆమె చెప్పింది. "దానికి నేనేం చెయ్యను ఇన్నాళ్ళూ పలికినాయన ఇప్పుడెందుకు పలకడం లేదు?" అని అడిగాను.ఆమెకు బాధ కలిగినా ఇంకొకమాట కూడా అన్నాను. "మీ పూజలు కావాలని ఆయనేమైనా దేబిరించాడా? ఆ పూజలు చేసినందువల్ల మీకాయన బానిసగా ఉంటానని బాండ్ రాసిచ్చాడా?" అని అడిగాను."ఈ పూజల వల్ల ఉపయోగం ఏమిటి?" అని తప్పకుండా ఆమెకు సందేహం వచ్చి ఉంటుంది. ఈ సందేహాన్ని వదలకుండా పట్టుకుంటే అదే ఆమెకు జ్ఞానాన్ని కలిగిస్తుంది. కాని ఆపని ఆమె చెయ్యలేదు. ఆమే కాదు. కోరికల చిట్టాతో కుళ్ళిపోతున్న మనుషులందరి పరిస్తితీ అంతే.

ఇంకొక భక్తురాలుంది. ఈమె శ్రీ రామకృష్ణుని ముప్ఫైఏళ్ళ పైగానే కొలిచింది. ముప్పై ఏళ్లక్రితం ఈమెకు పెళ్లయింది. అయిదేళ్ళ క్రితం భర్త గతించాడు. మామూలుగా భార్యాభర్తల మధ్యన ప్రేమ గట్టిగా ఉంటే ఇద్దరికీ ఒకేసారి పోవాలని అనిపించడం సహజం. కాని అలా జరగదు కదా. ఇద్దరూ ఒకేసారి పుట్టలేదుగా ఒకేసారి పోవడానికి. ఒకరు ముందూ ఒకరు వెనుకా ఎవరికైనా తప్పదు. కాని ఈ సంఘటనను జీర్ణించుకోలేక తాను ఇన్నేళ్ళుగా పూజిస్తున్న పటాలను తీసి పడేసింది. ఇప్పుడు పూజాలేదు ఏమీ లేదు. ఇన్నేళ్ళ ఆరాధన వల్ల వచ్చిన పరిపక్వత ఇదా అని నాకనిపించింది. అన్నీ మనం అనుకున్నట్లు జరుగుతూ ఎక్కడా కష్టాలూ చావులూ లేకుండా లోకం ఉండాలంటే కుదురుతుందా? మనం చేసే దొంగపూజల వల్ల ఇక ప్రతివాడికీ అన్నీ అనుకున్నట్లు జరిగితే సృష్టి ఎందుకు? 

నాకు తెలిసి ఇంకొక భక్తురాలుంది. ఆమె సాయిబాబా భక్తురాలు కాదు. ఇంకొక మహాగురువును ఆరాదిస్తుంది. ఆమె తల్లిగారు ఒకరోజున దేవునికి హారతి ఇస్తూ ఆ మంట చీరకొంగుకు అంటుకుని గమనించే లోపల వళ్ళంతా కాలిపోయి సజీవదహనం అయి చనిపోయింది. తన తల్లి అలా చనిపోతే ఆ భక్తురాలు ఒక్కమాట అనలేదు. "మన ఖర్మ ఇలా ఉంటే దైవాన్ని నిందించి ఏమి ప్రయోజనం?" అన్నది. ఈ ముగ్గురూ భక్తులే. ముగ్గురికీ పెద్ద నష్టమే వాటిల్లింది. మరి దేవుడిలో తేడా ఉందా? భక్తులలో తేడా ఉందా? భక్తిలో తేడా ఉందా? లేక వీరి కర్మలో తేడా ఉందా?

జిల్లెళ్ళమూడి అమ్మగారిని ఒకరు ఇలా అడిగారు.
"అమ్మా. మన కష్టాలు తీర్చమని భగవంతుని కోరుకోవచ్చా?"
దానికి అమ్మ ఇలా చెప్పారు.
"ఆ. నీవిచ్చిన కష్టాలు నీవే తీసెయ్యమని అడగవచ్చు."

అమ్మ ఇంకా ఇలా అనేవారు. "సుఖాలు భగవత్ప్రసాదం అయితే మరి కష్టాలు ఎవరిస్తున్నారూ?". కష్టాలు కూడా ఆయనే ఇస్తున్నపుడు ఇంక వాటిని తీసెయ్యమని అడగడం ఎందుకు? ఎలా అడగాలి? అలా అడిగితే ఆయన మీద మనకు ప్రేమ లేదనే కదా. నీకన్నా నేనే తెలివైనవాడిని అన్న అహంకారం భగవంతుని దగ్గర ప్రదర్శించినట్లే కదా.

నేటి సమాజంలో ఒక ప్రసిద్ధ గురువుగారున్నారు. పాతకాలంలో ఆయనతో నాకు బాగా పరిచయం ఉంది. ఒకసారి ఆయన్ని ఇలా అడిగాను. "మీరు ఏవేవో పూజలూ అవీ చెయ్యమని జనాలకు ఎందుకు పురెక్కిస్తారు? పైగా మీరు చెప్పే ఉపన్యాసాలలో ఏమీ సత్యం ఉన్నట్లు నాకు అనిపించదు. ఉన్న సత్యాన్ని ఉన్నట్లు జనానికి చెప్పవచ్చు కదా" అన్నాను. దానికాయన- "అలా చెప్తే మాదగ్గరకు ఎవరొస్తారు?" అని నిజాన్ని ఒప్పుకున్నాడు. ఆ మాటతో సత్యం ఆయనకు కూడా అనుభవం కాలేదని నాకు అర్ధమైంది. ఎందుకంటే సత్యసాక్షాత్కారం అయినవాడు, ఒకడు తన దగ్గరికి రాలేదనో, తనకు భజన చెయ్యలేదనో చస్తే అనుకోడు. అలా అనుకుంటున్నాడంటే అతను సత్యానికి ఆమడదూరంలో ఉన్నాడని అర్ధం. ఆరోజు తర్వాత నేనా గురువు దగ్గరకు మళ్ళీ పోలేదు. ఈ సంఘటన జరిగి ఇరవైఏళ్ళు దాటింది.

"గురుతు చెప్పేవాడే గురువు" అని జిల్లెళ్ళమూడి అమ్మగారన్నారు. గురువు చెప్పిన గురుతును మనం గట్టిగా పట్టుకోవాలి. అంటే ఆ ఉపదేశాన్ని మన జీవితంలో శ్రద్ధగా ఆచరించాలి. అది చెయ్యకుండా, ఆయనకు గ్రానైట్ విగ్రహం చేయించి, ఒక బంగారుకిరీటం పెట్టించి, ఏడాదికొకసారి ఊరేగిస్తే దానివల్ల ఏమిటి ఉపయోగం? ఆ గురువు ఆత్మ క్షోభించడం తప్ప? "గురువు శిష్యుడన్న గుడ్డెద్దు చేనురా విశ్వదాభిరామ వినుర వేమా" అని వేమనయోగి మొత్తుకున్నాడు. ఆయన చెప్పినదానిలో కనపడని లోతైన అర్ధం ఉంది. గుడ్డిగా గురువు చెప్పినది నమ్మి ఆచరిస్తే అదే మనల్ని మహోత్తమస్థాయికి తీసుకెళుతుంది. ఆ ఆచరణే నేడు కరువైంది. ఒక రాయిని నమ్మినా, మన నమ్మకంలో లోపం లేకుంటే అదే మనకు మోక్షాన్నిస్తుంది. ఏకలవ్యుడికి,తిన్నడికీ,వాల్మీకికీ జరిగింది అదేకదా. అటువంటి తదేకదీక్షా, భక్తీ మనకు ఉండాలి.

"చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుమ్భినీధవు  జెప్పెడి గురుడు గురుడు"- అంటాడు ప్రహ్లాదుడు. దైవాన్ని చేరే మార్గం చూపేదే నిజమైన చదువు. అక్కడకు ఎలా చేరాలో ప్రాక్టికల్ గా చూపించేవాడే అసలైన గురువు. అంతేగాని ఫీజులు కట్టించుకొని పాదపూజలు చేయించుకునేవారు , షాపులు ఓపెన్ చెయ్యడానికి డబ్బులు తీసుకొని విచ్చేసే గురువులూ గురువులు కారు. వారు శిష్యుల విత్తాపహారులే గాని, చిత్తాపహారులూ కారు, చిత్త తాపహారులు అసలే కాలేరు. ఆత్మవిద్యను ఆమూలాగ్రం బోధించలేక ఏవేవో కాకమ్మకబుర్లు చెబుతూ శిష్యులను అంధకారంలో ఇంకా పడదోశేవారు "గురువు" అన్న పదానికి అనర్హులు.అలాంటి గురువులు చెప్పేది విద్య కాదు. మిధ్య. అలాంటి గురువులు మరణించిన తర్వాత నరకంలో ఎలాంటి బాధలు పడతారో ఒక నిజమైన సన్యాసి ఒకసారి చెప్పి బాధపడ్డారు. గడ్డాలు పెంచి రంగుబట్టలు వేసుకున్నంత మాత్రాన ఎవరూ గురువులు కాలేరు.

నలభై ఏభై ఏళ్ళక్రితం ఒక సంఘటన జరిగింది. ఒకసారి జిల్లెళ్ళమూడి అమ్మగారు మద్రాసు వెళ్లారు.అక్కడ ఒక భక్తురాలి ఇంటిలో ఉన్నప్పుడు సినిమానటి సావిత్రి అమ్మ దర్శనానికి వచ్చింది. దర్శనం అయ్యిన తర్వాత వెళుతూ వెళుతూ, "అమ్మా. మా ఇంటికి కూడా ఒకసారి మీరు రావాలి" అని అడిగింది. అమ్మ మౌనంగా ఉంది. సావిత్రి ఏమనుకుందో ఏమో, "అలా రావడానికి మీరేం తీసుకుంటారమ్మా?" అనింది. ఆమెవైపు చూచి చిరునవ్వు నవ్విన అమ్మ, "నేను ఇచ్చే అమ్మనే గాని తీసుకునే అమ్మను కానమ్మా" అని జవాబు చెప్పింది. అదీ దైవత్వం అంటే. పాపం సావిత్రి తప్పుకూడా ఏమీ లేదు. ఆమెకు అప్పటివరకూ తారసపడిన గురువులూ బాబాలూ అందరూ ఇంకా ఇమ్మని అడిగి మరీ తీసుకున్నవారె గాని ఇస్తామంటే వద్దన్నవారు ఒక్కరూ లేరు. అందుకే ఆమె తెలీక అలా మాట్లాడింది.

నూట ఏభై ఏళ్ళ క్రితం శ్రీ రామకృష్ణులకు లక్ష్మీనారాయణ మార్వాడీ అని ఒక సంపన్న భక్తుడు ఉండేవాడు. ఒకసారి ఆ భక్తుడు పదివేల బంగారు నాణేలను శ్రీ రామకృష్ణునికి కానుకగా ఇవ్వబోతాడు. "అలాంటి సంకల్పాలు పెట్టుకుంటే ఇంకోసారి నీ ముఖం నాకు చూపించకు" అని రామకృష్ణులు గట్టిగా చీవాట్లు పెట్టి పంపిస్తారు. అది నిజమైన దైవత్వం అంటే. ఆరోజుల్లో పదివేల బంగారు నాణేలు అంటే ఈరోజుల్లో ఎంతో మనం ఊహించుకోవచ్చు.

లోకం అంతా నకిలీగురువులతో నిండి ఉంది. ఎక్కడో కొన్ని ఆశ్రమాలు,కొందరు స్వాములూ తప్ప, మిగతా అన్ని చోట్లా ధనమూ అసత్యమూ కలిసి అసహ్యపు రికార్డింగ్ డాన్స్లు చేస్తున్నాయి.ఆశ్రమాలు వ్యాపారకేంద్రాలయ్యాయి. స్వాములు అసలైన వేదాంతాన్ని ఎక్కడా చెప్పడం లేదు. అలాంటి దొంగస్వాములను నమ్మిన జనం కొన్నేళ్ళకు తమ తప్పు తెలుసుకొనికూడా ఆ విషవలయం నుంచి బయట పడలేక కన్నంలో దొంగల్లా కిక్కురుమనకుండా జీవితాలు సాగిస్తున్నారు.స్వార్ధంతో నిండిపోయిన జనంకూడా తమతమ లౌకికపనులు అవుతాయి అనుకున్న గురువులు దేవుళ్ళ దగ్గరకే ఎగబడుతూ ఉన్నారుగాని సత్యాన్ని సూటిగా బోధించే గురువులు ఎవరికీ అవసరం లేదు. "హంసలు హంసలగుంపులో కలుస్త్తాయి. కాకులు కాకులగుంపులో కలుస్తాయి" అని ఊరకే అనలేదు. 

"యదా పత్నీ తదా పతి:  యదా శిష్యా తదా గురు:" భార్యకు తగిన భర్తలూ,శిష్యులకు తగిన గురువులూ కర్మానుసారంగా ఎవరికివారు దొరుకుతారు. చలంగారు ఒక మంచిమాట చాలాసార్లు అనేవారు. "ప్రతివాడూ తనకు సీతాదేవిలాంటి పతివ్రత భార్యగా కావాలని అనుకుంటాడు. కాని తాను శ్రీరామచంద్రుడేనా అన్నది మాత్రం ఎవడూ చూచుకోడు." అలాగే ప్రతివాడూ తనకు రామకృషుని వంటి గురువు కావాలని అనుకుంటాడు. అలా ఆశించడంలో తప్పులేదు. కాని తనకు వివేకానందునికున్న లక్షణాలు ఉన్నాయా లేవా అని మాత్రం ఎవడూ ఆలోచించడు. ఇదీ విచిత్రం.

సత్యాన్ని సూటిగా బోధించని గురువులు వేశ్యలవంటి వారు. వేశ్యకు ప్రేమ ఎలా ఉంటుంది? దాని దృష్టి అంతా విటుడు తెచ్చే దనం మీద ఉంటుంది. అలాగే నకిలీ గురువుల దృష్టికూడా, శిష్యుని సామాజిక స్థాయి మీదో, అతని పదవి మీదో, అతని వద్ద ఉన్న ఆస్తిమీదో ఉంటుంది. అలాగే ఈ శిష్యులకు కూడా ఆ గురువు వల్ల ఒనగూడే హై లెవల్ పరిచయాలు, ప్రయోజనాల  మీదే దృష్టి ఉంటుంది. ఇద్దరికీ దైవంతో మాత్రం పని ఉండదు. కనుక చివరికి ఇదొక అసహ్యకరమైన అక్రమసంబంధంగా మారుతుంది. ఒక విటునికి స్వచ్చమైన ప్రియురాలు ఎలా దొరుకుతుంది? అతనికి వెలయాలే దొరుకుతుంది. అలాగే, నకిలీ శిష్యులకు స్వచ్చమైన సద్గురువులు ఎలా దొరుకుతారు? వారికి తగిన గురువులే వారికి దొరుకుతారు.

రమణ మహర్షిని ఒకతను చాలా రోజులనుంచీ "మాయ అంటే ఏమిటి?" అని అడుగుతూ ఉండేవాడు. మహర్షి ఏమీ చెప్పేవారు కాదు. మౌనంగా ఉండేవారు. ఇలా ఉండగా ఒకరోజున రాష్ట్రపతిగా ఉన్న బాబూ రాజేంద్రప్రసాద్ మహర్షి దర్శనార్ధమై వచ్చారు.ఆశ్రమవాసులందరూ హడావుడి చేసారు. మహర్షి ముఖంలో మాత్రం ఏ మార్పూ లేదు. ఒక సామాన్యుడు వస్తే ఎలా  ఉన్నాడో రాష్ట్రపతి వచ్చినా అలాగే ఉన్నాడు. రాజేంద్రప్రసాద్ గారు మహర్షి సమక్షంలో మౌనంగా కాసేపు కూర్చున్నారు. దర్శనం అయిపోయాక రాష్ట్రపతి వెళ్ళేటప్పుడు అందరూ ఆయనకు సెండాఫ్ ఇవ్వడానికి పోలోమంటూ పరిగెత్తి పోయారు. మహర్షి దగ్గర ఎవరూ లేరు. ఈ సందేహం అడిగిన వ్యక్తి ఒక్కడే ఉన్నాడు. అప్పుడు మహర్షి అతనితో " మాయ అంటే ఇదే " అని ఒక్కమాట మాత్రం చెప్పారు. వారు అసలైన గురువులు.

వివేకానందుడు ఎంతో మందిని " మీరు దేవుని చూచారా?" అని అడిగాడు. ఎవరూ ఆయనకు సూటిగా జవాబు చెప్పలేదు. ఒక్క శ్రీరామకృష్ణుడు మాత్రం " చూచాను. చూస్తున్నాను. నీకూ చూపగలను" అన్నాడు. అలా అంటూనే  నరేంద్రుని హృదయస్థానంలో చిన్నగా స్పర్శించి సమాధి స్తితిని, దైవానుభవాన్నీ ఒక్క క్షణంలో ప్రసాదించాడు. నరేంద్రుడు ఆ అనుభవం పొందిన తర్వాత "మీరు దేవుణ్ణి చూచారా?" అని ఇంకెవరినీ అడగలేదు. వారు నిజమైన గురువులు.

అలాంటి గురువులు చెప్పినదేమిటో మనం అర్ధం చేసుకోవాలి. దానిని జీవితంలో ఆచరించాలి. అనుభవాన్ని పొందాలి. అంతేగాని, మంది దగ్గర డబ్బులు వసూలు చేసి వాటితో ప్రత్యేకపూజలూ నా బొందపూజలూ చేయ్యడం వల్లనో గుళ్ళూ గోపురాలూ కట్టించి ఏడాదికోకసారి దేవుడికి పెళ్లి చేసి (వీలైతే ఆంజనేయుడూ వినాయకుడూ కుమారస్వామీ వంటి బ్రహ్మచారులకు కూడా రెండు పెళ్ళిళ్ళు చేసి) ఉత్సవాలు చేసినంత మాత్రానో ఏమీ ప్రయోజనం లేదు. మనుషుల జీవితాలలో మార్పు రావాలి. వ్యక్తిత్వాలు ఉన్నతంగా ఎదగాలి. మనుషులలో దైవత్వం నిండాలి. బోధలు మాటలలో కాదు చేతలలో ప్రతిఫలించాలి. ఆచరణలు నిత్యజీవితంలో నిరూపింపబడాలి. అప్పుడే గురువులైనవారు సంతోషిస్తారు. వారు సంతోషించినప్పుడే నిజమైన గురుపూర్ణిమ. దైవం కూడా అప్పుడే సంతోషిస్తుంది.

"ఈయన నా గురువు" అని మనం డప్పు వాయించుకోవడం కాదు. "వీడు నా ప్రియశిష్యుడు" అని ఒక సద్గురువు తన నోటితో చెప్పినప్పుడే మనకు నిజమైన ఘనత. అదే నిజమైన గురుపూర్ణిమ. ఎందుకంటే అప్పుడే మనం గురువు యొక్క ఆకాంక్షను పూర్తి చేసినవారం అవుతాము. ఏ గురువైనా తన శిష్యుడు దైవానుభూతిని పొందాలనే కోరుకుంటాడు. తనను మించి తన శిష్యుడు ఎదగాలని కోరుకుంటాడు. శిష్యుడు అలా ఎదిగినప్పుడే ఆ గురువుకు పూర్ణిమ. అదే నిజమైన గురుపూర్ణిమ. అంతేగాని మనం ఇచ్చే బోడి బహుమతులూ, చేసే దొంగపూజలూ, మన బ్లాక్ మనీ తో చేయించే బంగారుకిరీటాలూ, మన సొల్లు పొగడ్తలూ, చొంగ కార్చే నంగివేషాలూ, ఏ సద్గురువూ ఆశించడు. మన పొగడ్తలు వారికి అగడ్తలుగా తెగడ్తలుగా కనిపిస్తాయి. ఒకవేళ వాటిని ఆశిస్తే అతను సద్గురువే కాదు, మామూలు "గురువు" అన్న పదానికి కూడా అతను అర్హుడు కాదు.

గురువుకు ఉండవలసిన లక్షణాలను ఉపనిషత్తులు వివరించాయి.గురువు అనేవాడు శ్రోత్రియుడూ బ్రహ్మనిష్ఠ కలిగినవాడూ అయి ఉండాలి అని పిండితార్ధంగా అవి ఘోషించాయి. అంటే వేదములకు సరియైన అర్ధం తెలిసినవాడూ ఆ తెలిసినదానిని ఆచరణలో పెట్టగలిగినవాడూ అయి ఉండాలి అని అర్ధం. అంతేగాక అతడు కరుణా హృదయుడూ, విశాల భావాలు కలిగిన వాడూ అయిఉండాలి. ముండకోపనిషత్ అయినా వివేకచూడామణి అయినా ఇదే చెప్పాయి. 

మరి శిష్యునికి కూడా కొన్ని లక్షణాలు ఉండాలి కదా. అవేమిటి? సంసారం అంటే విరక్తి కలిగి దానిని ఎలాగైనా దాటాలి, తానెవరో దైవమేవరో తెలుసుకోవాలి అన్న బలమైన తపన శిష్యునకు ఉండాల్సిన ముఖ్యమైన అర్హత.అది అతని జీవితంలో మొదటి priority అయి ఉండాలి. ఏమీ తోచనప్పుడు కలిగే last priority కాకూడదు. దానికోసం అతడు ఏమైనా చెయ్యడానికి తయారుగా ఉండాలి. దారి చూపగల గురువుకోసం అవసరమైతే భూగోళం అవతలి అంచుకు కూడా వెళ్లి వెదకగల తపన ఉండాలి.ఆ దారి దొరికెంత వరకూ తిండి సహించక నిద్రపట్టక చికాకుతో అసహనంతో వేగిపోయే స్త్తితిలో శిష్యుడు ఉండాలి. ఆ తపన ముందు కుటుంబసభ్యులూ బందుత్వాలూ స్నేహాలూ అన్నీ గడ్డిపోచలలాగా కనిపించాలి. "నన్ను నేనెలా తెలుసుకోవాలి? దైవాన్ని ఎలా తెలుసుకోవాలి?" అన్న తపనే అతని జీవితంలో ప్రప్రధమస్థానాన్ని ఆక్రమించాలి. అది అతనికి నిద్రపట్టకుండా చెయ్యాలి. ఊపిరాడకుండా చెయ్యాలి. ప్రాణం పోతుందేమో అన్నంత తపనతో అతను వేగిపోవాలి. దానికోసం జీవితంలో అతడు ఇంక దేనినైనా వదులుకోగలిగే స్తితికి రావాలి. నిజమైన శిష్యునికి అలాంటి తపన ఉండాలి.

అటువంటి శక్తివంతుడూ కరుణాసముద్రుడూ అయిన గురువూ, ఇటువంటి నిరంతర తీవ్రతపన కలిగిన శిష్యుడూ ఒకచోట కలిసినపుడు అద్భుతాలు జరుగుతాయి. కానీ అలాంటివాళ్ళు ఈ భూమండలంలో ఎక్కడో తప్ప ఉండరు కనుక మామూలుగా గురువూ శిష్యులూ అనుకునేవారిలో అలాంటి అద్భుతాలు ఏవీ జరగవు.ఎందుకంటే శిష్యునికి అలాంటి తపనా ఉండదు. గురువుకు అలాంటి జ్ఞానమూ,శక్తీ,కరుణా ఉండవు. కనుక వారి మధ్యన ఏమీ జరగదు. వ్యాపారాలు మాత్రం బాగా సాగుతూ ఉంటాయి. కాలక్షేపం కబుర్లు మాత్రం జరుగుతూ ఉంటాయి.

ఏ గురువైనా శిష్యునిలో ఆత్మశక్తిని పెంపొందించాలి. తనను తాను  తెలుసుకునే దారి చూపించాలి. అంతేగాని ఎల్లకాలమూ గురువుమీద శిష్యుడు ఆధారపడి ఉండేటట్లు చెయ్యరాదు. అతన్ని తన చుట్టూ తిప్పుకొని తన అవసరాలకు అతన్ని వాడుకోకూడదు. లౌకిక వాసనలు వారిమధ్యన ఏవీ ఉండరాదు. ఇద్దరి ఆలోచనా "దైవానుభూతిని ఎలా పొందాలి" అన్న ఒక్క విషయం చుట్టూనే పరిభ్రమించాలి. భయమూ స్వార్ధమూ అపనమ్మకమూ అనవసర సంభాషణలూ వారిమధ్యన ఉండరాదు. ఒకరికొకరు సైకలాజికల్ బరువు దించుకునే చెత్తబుట్టలు కాకూడదు. అలాంటి గురుశిష్యుల బంధం నిజమైనది. "ఆశ్చర్యో వక్తా కుశలస్యలబ్ధా ఆశ్చర్యో జ్ఞాతా కుశలానువిష్ట:" అంటుంది కఠోపనిషత్తు. అలాంటి గురువూ శిష్యుడూ ఇద్దరూ ఆశ్చర్యకరమైనవారే అని అర్ధం. అటువంటివారి మధ్యనే బ్రహ్మానుభూతి అనే అద్భుతం ఆవిష్కరింపబడుతుంది.    

శ్రద్ధ కలిగిన శిష్యుని చూచినపుడు గురువు ఆనందంతో పరవశిస్తాడు. ఎందుకు? అలాంటి స్తితిలో తానూ కొన్నేళ్ళ క్రితం గందరగోళంలో ఉన్నాడు. తనకు దారి సులువుగా దొరికి ఉండవచ్చు లేదా చాలా కష్టం తర్వాత దొరికి ఉండవచ్చు. అలాంటి స్తితిలో ఇంకొక మనిషి ఇప్పుడు తన ఎదురుగా ఉన్నాడు. దారీ తెన్నూ కనపడక తపిస్తున్నాడు. అతనికి ఆ దారి చూపించాలి అని ఉప్పొంగిపోతాడు. వివేకానందుని మొదటిసారి చూచినపుడు శ్రీ రామకృష్ణుని మనసు ప్రపంచాన్ని అధిగమించి సమాధి స్తితిలోకి ఎగసిపోయింది. ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఇంత మంచి ఉత్తమలక్షణ సమన్వితుడైన సాధకుడు వచ్చాడు కదా అని ఆనందంతో పరవశించింది. ఒరనుంచి తీసిన ఖడ్గం లాగా వైరాగ్యజ్వాలతో వెలుగుతున్న  నరేంద్రుని తన అక్కున చేర్చుకుంది.

అటువంటి గురువును వెదకి పట్టుకొని ఆ గురువు ఉపదేశించిన సాధనను అచంచలవిశ్వాసంతో, తదేకనిష్టతో, ఆచరించి ఫలితాన్ని పొంది గురువుకు ఆనందాన్ని కలిగించిననాడే నిజమైన గురుపూర్ణిమ. అంతేగాని స్వార్ధంతో కూడిన కోరికలతో జీవంలేని విగ్రహాలకు శవపూజలు చేసినంత మాత్రాన గురుపూర్ణిమ అనిపించుకోదు. అలాంటి పూజల వల్ల ఏ సద్గురువూ సంతోషాన్ని పొందడు.

నిజమైన గురువు మన మనసే. "శుద్ధమనసే అసలైన గురువు" అని శ్రీ రామకృష్ణులు అన్నారు. "మరి గురువును బయట వెదకడం ఎందుకూ?" అంటే "తెలియక" అని జిల్లెళ్ళమూడి అమ్మగారు జవాబు చెప్పారు. తగినంత పరిశుద్ధమైన మనసు మనలో లేదు కనుక బయట ఒక గురువు అవసరం అవుతుంది. దానికి తగినంత పరిపక్వతా శుద్ధతా వచ్చినపుడు అదే గురువు అవుతుంది. "కొన్నేళ్ళ సాధన తర్వాత నీ మనసే నీ గురువౌతుంది." అని బ్రహ్మానంద స్వామి అనేవారు. గురుశక్తీ దైవశక్తీ సాధకుని మనస్సులో ప్రవేశించినపుడు అంతా మనసులోనే అర్ధమౌతుంది.

గురుపూర్ణిమను ఎలా జరుపుకోవాలో ఇక మన ఇష్టం. వేదం సూచించిన మార్గాన్ని అనుసరించాలా లేక మన ఇష్టానుసారం పిచ్చిపనులు చేసుకుంటూ ఇదే సరైన దారి అనుకుంటూ కాలక్షేపం చెయ్యాలా మన ఇష్టం. "యం శాస్త్రవిధి ముత్సృజ్య వర్తతే కామకారకాత్ నస సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం", శాస్త్రం నిర్దేశించిన మార్గాన్ని వదలి తన ఇష్టానుసారం చేసేవాడు ఇహనికీ పరానికీ చెడి, రెంటికిచెడిన రేవడి అవుతాడు అని భగవానుడే గీతలో చెబుతాడు.
read more " గురుపూర్ణిమ (గుండెధైర్యం లేనివాళ్ళు చదవొద్దు) "