“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

16, జులై 2012, సోమవారం

బలులు - మొక్కులు

నిన్న ఒక పనిమీద హైదరాబాద్ లో ఉన్నాను. నా ఖర్మకాలి, నాకు పనిఉన్న ప్రదేశం నేరేడ్ మెట్ కట్టమైసమ్మ గుడి దగ్గరగా ఉంది. అక్కడ దృశ్యాలు చూస్తే పొట్టలో తిప్పి వాంతి వచ్చినంత పనైంది. నిన్న బోనాల పండగ అని అక్కడివారు చెప్పారు. ఆడవాళ్ళందరూ అమ్మవారిలాగా తయారై ముఖానికీ కాళ్ళకూ పసుపు పూసుకుని గుంపులు గుంపులుగా కలశాలు తలమీద మోస్తూ చేతిలో వేపాకులతో అమ్మవారి దర్శనానికి వెళ్లి వస్తున్నారు. అంతవరకూ బాగానే ఉంది.

గుడి ప్రహరీ గోడలోనే ఒకచోట ఒక రూం లాగా కట్టారు. అక్కడ కోళ్ళు గొర్రెలు మేకలు బలి ఇచ్చి ఆ మాంసాన్ని ఒక గుట్టగా పోశారు. అక్కడంతా రక్తపు మడుగు కట్టింది. గుడి నుంచి తిరిగి వస్తున్న  చాలామంది చేతుల్లో ఒక కెరీ బ్యాగు, దానిలో తల లేని కోడి మొండెం, ఆ బ్యాగంతా రక్తం మరకలు, ఈ మొత్తం దృశ్యమంతా ఘోరాతిఘోరంగా ఉంది. బలి ఇవ్వబడడానికి అమాయకంగా వేచిఉన్న మేకలు గొర్రెలను చూస్తే గుండె తరుక్కుపోయింది.

బలి ఇవ్వడానికి జంతువులనూ పక్షులనూ తీసుకువస్తున్న మనుషుల ముఖాలు చూస్తే ఒక్కడి ముఖంలో కూడా ఒక సంస్కారం గాని, ఒక పరిణతి గాని, ఒక వెలుగు గాని కనిపించలేదు. అందరి ముఖాలూ ఏదో చీకటి కమ్మినట్లు ఆముదంతాగిన దొంగలముఖాలలాగా రఫ్ గా ఉన్నాయి.

ఏదో మారుమూల శ్రీకాకుళం జిల్లాలోనో విజయనగరం జిల్లాలోనో ఏదో పల్లెల్లో ఇలాంటి అనాగరిక పద్దతులు అమలులో ఉంటే ఒకరకంగా వాటిని అర్ధం చేసుకోవచ్చు. కాని రాష్ట్ర రాజధాని, సిటీ మధ్యలో ఇలాంటి అనాగరిక ఆటవిక చేష్టలు ఉన్నాయంటే సిగ్గుతో తలదించుకోవాలి. పక్షులనూ జంతువులనూ చంపి వాటి మాంసం తినాలని ఆగలేని ఆత్రంగా ఉంటే డైరెక్టుగా ఆపని చెయ్యవచ్చు. దానికీ దేవుడికీ లింకు పెట్టి మొక్కుల పేరుతో బలులిచ్చి ఆ మాంసం తినడం అనేది దిగజారుడుతనానికి పరాకాష్ట. మనుషులు బహుశ తమ మనసులోని గిల్టీ ఫీలింగ్ కప్పి పుచ్చుకోడానికి  దేవుణ్ణి ఆసరాగా తీసుకుంటారేమో అని నా ఊహ. తన రాక్షసత్వాన్ని దేవుడికి కూడా ఆపాదించి వాణ్ని కూడా ఒక రక్తపిశాచిగా మార్చాడు మానవుడు.

విజయనగరం జిల్లాలో మారుమూల పల్లెల్లో పదేళ్ళ కొకసారి "ఊరి పండగ" అని చేస్తారు. అంతకు ముందు నుంచీ ఒక దున్నపోతును బాగా మేపుతారు. ఆ రోజున దానిని బలిఇచ్చి ఆ మాంసాన్ని అందరూ కలిసి ఆరగిస్తారు. అది బాగా బలిసి ఉంటుంది. అందుకని దానిని అదుపు చెయ్యడం ఒకడి వల్ల కాదు. ఒక ఇరవైమంది కలిసి దానికి తాళ్ళు కట్టి దూరం నుంచి గడకర్రలతో బంధించి చంపుతారు. వేటకత్తి ఎంత పదునుగా ఉన్నా ఒక దెబ్బతో దాని మెడ తెగదు. కనీసం ఒక పదిసార్లు నరికితే గాని దాని మెడ తెగిపడదు. ఈలోపల అది గింజుకొని అటూ ఇటూ పరిగెత్తి నానా భీభత్సం చేస్తుంది. ఆ రక్తమంతా చింది అందరిమీదా జల్లులాగా పడుతుంది.  అక్కడంతా ఒక విధమైన పైశాచిక స్మశానవాతావరణం అలముకొని ఉంటుంది. వాళ్ళంతా కూడా ఏదో ఆనందంతో రాక్షసుల్లాగా ఊగిపోతూ ఉంటారు. ఈ దృశ్యమంతా చూస్తే వీళ్ళసలు మనుషులేనా లేక మనిషి రూపంలో ఉన్న నీచ నికృష్ట పిశాచాలా అనిపించక మానదు. చివరకి ఆ రక్తాన్ని అందరికీ తీర్ధంగా ఇస్తారు. నుదుటబొట్టు కూడా ఆ రక్తం తోనే పెడతారు. ఆ రక్తంతోనే గ్రామదేవత దగ్గర దీపం వెలిగిస్తారు. అక్కడి పూజారులు కూడా దెయ్యాలలాగే ఉంటారు. కనీసం వాళ్ళు కూడా ఇలాంటి పనులు తప్పు అని ఎవరికీ చెప్పరు.ఎవడి స్వార్ధం వాడిది. ఒకవేళ నిజం చెబితే ఈ పిచ్చిజనం వారినీ బతకనివ్వరేమో.

గౌహతిలోని కామాఖ్య ఆలయంలో మొన్నమొన్నటివరకూ నరబలి ఉండేదని అంటారు. ఇప్పటికీ ఉందనీ రహస్యంగా దానిని చేస్తారనీ కూడా వదంతులు ఉన్నాయి. ఇంత అనాగరిక, ఆటవిక, పద్దతులు, ఆచరణలు ఇంకా మన సమాజంలో బతికి ఉన్నాయి అంటే రెండువేల ఏళ్ళ క్రితం పుట్టిన బుద్ధుడు కూడా నేడు మనల్ని చూచి సిగ్గుతో తలదించుకోవాలేమో? వీరిలో ఎవరైనా ఒక్కక్షణం ఆగి ఆలోచిస్తే ఇలాంటి ఛండాలపు పనులు చెయ్యరుగాక చెయ్యరు. సమస్త చరాచర జీవరాశులకు తల్లి అయిన జగన్మాత బలి ఎందుకు కోరుతుంది? అందులోనూ మూగజీవాల రక్తాన్ని మాంసాన్ని ఎందుకు కోరుకుంటుంది? అన్న ఒక్క ఆలోచన, అమ్మవారికంటూ జంతువులను బలిచ్చే ఈ నీచపు వెధవలలో ఒక్కడికీ రాకపోవడం విచిత్రం.

ఈ జీవాలన్నీ మనిషిలో ఉన్న దుష్ట ప్రవృత్తులు. అసుర శక్తులు. ఈ జంతువులన్నీ మనిషిలోపలే ఉన్నాయి. వాటిని తనలోనుంచి తొలగించి నిర్మూలించాలి గాని బయట తిరిగే జంతువులను చంపి వాటి మాంసాన్ని  మెక్కుతూ ఏదో మొక్కు తీర్చుకున్నట్లు, ఘనకార్యం చేసినట్లు, దేవుడి బాకీ తీర్చుకున్నట్లు, ఆయన కరుణకు పాత్రులైనట్లు పొంగిపోతే అంతకంటే అజ్ఞానం ఇంకోటి ఉండదు. ఈ సంగతి మనిషి అర్ధం చేసుకోవాలి. ఎక్కడబడితే అక్కడ ఏరుకొని నానాచెత్తా తినేసి తన పొట్టనింపుకునే తత్వమే మనిషిలోని కోడి. ఈ స్వభావాన్ని వదిలిపెట్టాలి అంతేకాని కోడిని బలిచ్చి దాని మాంసం తినడంకాదు మనిషి  చెయ్యవలసింది. మనిషిలో ఉన్న మదమూ, అహంకారమూ, మొండితనమే దున్నపోతు. ఈ లక్షణాలు వదుల్చుకోవాలి గాని బయట ప్రపంచంలో ఉన్న జంతువును బలిస్తే ఏమి ఒరుగుతుంది? దాని మాంసం తినడం వల్ల మనలో ఇంకా ఇంకా ఆ లక్షణాలు పెరుగుతాయి కాని తగ్గే ప్రసక్తే ఉండదు. దానివల్ల దైవానికి అనుక్షణమూ దూరం అవడమే జరుగుతుంది గాని మనిషి ఎన్నటికీ దైవానికి దగ్గర కాలేడు. ఇకపోతే అమాయక ప్రాణులైన గొర్రెలు మేకలను బలివ్వడం మరీ ఘోరం. మనిషిలోని ఈ క్రూరప్రవృత్తి వల్లే సమాజంలో కిరాతకం పెరిగిపోతున్నది. దయా దాక్షిణ్యాలు అడుగంటుతూ పోతున్నాయి. అందుకే సమాజంలో ఎక్కడ చూచినా మనిషిరూపంలో ఉన్న నక్కలూ తోడేళ్ళూ పులులూ తిరుగుతున్నాయి. 


ఈ పిచ్చిమొక్కులూ పిచ్చిబలులూ ఎందుకూ పనికిరానివని 2000 ఏళ్ళ క్రితమే అశోకచక్రవర్తి తన శాసనాలలో శిలాక్షరాలు లిఖించాడు. కావాలంటే అశోకుని 13 వ శిలాశాసనం చదవండి. ప్రజల అజ్ఞానాన్ని తొలగించాలని  అప్పట్లోనే ఆయన ఎంతగా మొత్తుకున్నాడో అర్ధమౌతుంది. అంతకు 500 ఏళ్ళు ఇంకా ముందు బుద్ధుడూ మహావీరుడూ ఇదే మొత్తుకున్నారు. అంతకు కనీసం వెయ్యేళ్ళు ముందునుంచే ఇరవైముగ్గురు జైన తీర్ధంకరులు అహింసను  పాటించమని బోధిస్తూనే వాళ్ళ తనువులు చాలించారు. అంటే కనీసం 4000 ఏళ్ళ నుంచీ "అహింసా పరమో ధర్మః" అంటూ ఎంతోమంది ప్రవక్తలు చెబుతూనే ఉన్నారు. కాని మనం వాళ్ళమాట వినం. మన జిహ్వచాపల్యమే మనకు ప్రధానం. వాళ్ళ తరువాత ఇన్ని వేలఏళ్ళు గడిచినా మనుషులలో అజ్ఞానం మాత్రం ఇంకా వెర్రి తలలు వేస్తూనే ఉంది. స్వార్ధం వికృతరూపంతో నాట్యం చేస్తూనే ఉంది.

అయినా నా పిచ్చిగాని దేవునికి దగ్గర కావడం ఎవడికి కావాలి? ప్రతివాడికీ దేవుడిచ్చే వరాలు కావాలి. అంతేగాని దేవుడు ఎవరికీ అక్కర్లేదు. దైవాన్ని చేరే మార్గమూ ఎవడికీ అక్కర్లేదు. ఒకవేళ దేవుడే ప్రత్యక్షమైతే అతడి దగ్గర అన్ని వరాలూ గుంజుకొని చివరికి ఆ దేవుడినే  ఒక్క తన్ను తంతాడు ఈ మనిషి. అందుకే దేవుడు ఈ మనుషులకు భయపడి ఎక్కడో దాక్కున్నాడు. మనుషులందరూ స్వార్ధంలో నిలువునా కూరుకుపోయి ఉన్న వేషగాళ్ళూ నాటకాలరాయుళ్ళూను. ప్రతివాడికీ తన కోరికలు తీరడమే ప్రధానంగాని, జీవితంలో ఒక ఔన్నత్యాన్ని పొందేమార్గంగాని దాని గురించి ఆలోచనగాని ఎవరికీ అవసరం లేదు. మంచి చెప్పేవాణ్ణి వీళ్ళు ఎలాగూ బ్రతకనివ్వరు. ఆ సంగతి ఎంతోమంది ప్రవక్తలకు బాగా తెలుసు. వీళ్ళ చీకటిలో వీళ్ళను చక్కగా ఉంచుతూ మరింత చీకటిలోకి వీరిని తోసేవాళ్ళే వీరికి నచ్చుతారు. 

ప్రపంచమంతా ఘోరమైన అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్నది అని ఆదిశంకరులు అన్నమాట ఎంత సత్యమో రోజురోజుకూ నాకు బాగా అర్ధం అవుతున్నది. ఎంతమంది ప్రవక్తలు బోధించినా, ఎంతమంది  మహర్షులు మొత్తుకున్నా, చివరికి దేవుడే అవతారరూపంలో దిగివచ్చి చెప్పినా ఇంకా అర్ధం చేసుకోలేని అధమస్థాయిలో మనిషి ఉన్నాడంటే అతనిలోని అజ్ఞానపుచీకటి ఎంత దట్టంగా ఎంత చిక్కగా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.  


ఇదంతా చూస్తుంటే గీతలో రెండు శ్లోకాలు గుర్తుకు వచ్చాయి.


శ్లో|| యజన్తే సాత్వికా దేవాన్ యక్ష రక్షాంసి రాజసాన్ 
భూతాన్ ప్రేత గణాన్శ్చాన్యే యజన్తే తామసా జనా:
(ఈలోకంలో సాత్వికులు సౌమ్యదేవతలను, రాజసికులు యక్ష రాక్షసులను,తామసులు భూత ప్రేతాలను పూజిస్తారు) 


అమ్మవారు భూతమో ప్రేతమో కాదు. ఆమె జగన్మాత. కాని లోకులు ఆమెను ఒక రక్త పిపాసిగా చేసి కూచోబెట్టారు. వీరి వేషాలకు అజ్ఞానానికి ఆమె ఎంత బాధపడుతూ వీరి పూజలు స్వీకరిస్తోందో ఆమెకే తెలుసు.


శ్లో || కర్మణ సుకృతస్యాహు  సాత్వికం నిర్మలం ఫలం 
రజసస్తు ఫలం దుఖమజ్ఞానం తమస ఫలం
(సాత్విక కర్మలవల్ల నిర్మలత్వం కలుగుతుంది. రాజసిక కర్మలవల్ల దుఖం కలుగుతుంది. తామసకర్మల వల్ల అజ్ఞానం పెరుగుతుంది) 


మనిషి తామసంనుంచి, రాజసాన్ని దాటి, సాత్వికానికి ఎదగాలి. ఏ జంతువుకూ ఇవ్వని "బుద్ధి" అనే ఉత్తమ గుణాన్ని దైవం మనిషికి ఇచ్చింది. దానిని సక్రమంగా ఉపయోగించుకుని సత్కర్మ సదుపాసన చేసి ఉత్తమగతిని పొందాలిగాని అధమకర్మలు చేసుకుని అధమజన్మలు పొందకూడదు. అప్పుడే మానవజన్మ ఎత్తినందుకు సాఫల్యత అనేది ఉంటుంది.

ఎంతమంది ఎంత చెప్పినా, సమాజపు ఈ తీరు ఎలాగూ మారదు గనుక, ఏదో ప్రళయం వచ్చేవరకూ మనుషుల అజ్ఞానం ఇలాగే ఇంకా ఇంకా  వర్దిల్లుగాక అని ఆశిద్దాం.