పాతతరపు హిందీ రొమాంటిక్ హీరో రాజేష్ ఖన్నా పోయాడు. పుట్టిన ప్రతివాడూ పోకతప్పదు. మనిషి ఎన్నింటిని తప్పుకున్నా తప్పనిది చావు ఒక్కటే. అది వింత కాదు. కాని ఈ సంఘటన కొన్ని గ్రహస్తితులకు సరిగ్గా అతికినట్లు సరిపోవడం అసలైన వింత.
18-12-2011 న "మార్గశిర పౌర్ణమి - మేదినీ జ్యోతిష్యం" అని ఒక పోస్ట్ వ్రాస్తూ కొన్ని మాటలు వ్రాశాను. దాని లింక్ ఇక్కడ ఇస్తున్నాను.
ఈ జోస్యం చెప్పి ఆర్నెల్లు గడవక ముందే రాజేష్ ఖన్నా మరణించడం జరిగింది. ఇంకా మరి కొందరు తయారుగా ఉన్నారు. దీనిని బట్టి ఒక విషయం మళ్లీ రుజువైంది. కాకతాళీయంగా జరుగుతున్నాయి అని మనం అనుకునే సంఘటనల వెనుక మనకు తెలియని కర్మ బంధాలు ఉంటాయి. ఆ కర్మ ప్రభావాలను దైవస్వరూపాలైన గ్రహాలు నియంత్రిస్తూ ఉంటాయి. అందుకే ఆయా గ్రహాలు కొన్ని కొన్ని స్థానాలలో ఉన్నప్పుడు ఆయా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుత సంఘటన సరిగ్గా అమావాస్య రోజున జరగడం ముఖ్యంగా గమనించవలసిన విషయం. అందుకేనేమో "అన్నీ తెలిసినవాడు అమావాస్యనాడు పోతాడు. ఏమీ తెలియని వాడు ఏకాదశినాడు పోతాడు" అని ఒక సామెత ఉంది.
అన్నీ మనకు తెలుసు అని విర్రవీగడం చాలా పొరపాటు. మనకు తెలీకుండా ఈ జగన్నాటకంలో తెరవెనుక కధ చాలా నడుస్తూ ఉంటుంది. మనిషికి తెలిసేది కనిపించేది చాలా స్వల్పం. తెలీనిది కనిపించనిది ఎంతో ఉన్నది. దానిని తెలుసుకునే మార్గాలున్నాయి. మార్చుకునే విధానాలున్నాయి. వినయం, శ్రద్ధ, రుజువర్తనా ఉన్నవారికే అవి తెలుసుకునే అవకాశం భగవంతుడు కల్పిస్తాడు. అందుకనే యోగమూ తంత్రమూ మరియు జ్యోతిశ్శాస్త్రాది ప్రాచీనవిద్యలను అనవసరంగా అవహేళన చెయ్యడం పొరపాటు అని నేనంటాను. అలా చెయ్యడం అహంకారానికి నిదర్శనం తప్ప ఇంకొకటి కాదు.
రాజైనా పేదైనా ఎవరైనా కర్మబద్దులే. ఎవరి కర్మ అయిపోతే వారు తెరవెనక్కు పోక తప్పదు. మళ్లీ జన్మ తీసుకోకా తప్పదు. కనుక దీనిగురించి బాధపడటం అనవసరం. నిజమైన కళాకారుడు ఎప్పుడూ అభిమానుల గుండెల్లో బ్రతికే ఉంటాడు.
ఈ సందర్భంగా "ఆనంద్" సినిమాలో ముకేష్ గొంతులోనుంచి "కహీ దూర్ జబ్ దిన్ డల్ జాయే" అంటూ జాలువారిన ఈ పాటను ఒకసారి చూస్తూ వినండి. ఇది నాకు చాలా ఇష్టమైన మధుర గీతం. ఏకాంతాన్ని కోరుకునేవారికీ, భావుకులైనవారికీ, అంతర్ముఖులైనవారికి ఎవరికైనా ఈ పాట బాగా నచ్చుతుంది.