నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

31, జులై 2012, మంగళవారం

తమిళనాడు ఎక్స్ ప్రెస్ ప్రమాదం - ఎవరేం నేర్చుకోవాలి?

నాలుగేళ్ల క్రితం గౌతమీ ఎక్స్ ప్రెస్ ప్రమాదం జరిగి ఇలాగే ప్రయాణీకులు మంటల్లో మాడిపోయారు. మళ్లీ నిన్న తమిళ్ నాడు ఎక్స్ ప్రెస్ లో అదే రకమైన ఘటన జరిగి 30 మంది పైగా సజీవదహనం అయ్యారు.దీన్నుంచి ఎవరైనా ఏమైనా నేర్చుకున్నారా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

అమెరికాలో ట్విన్ టవర్స్ ప్రమాదం జరిగితే మళ్లీ అలాంటి ప్రమాదం ఇంకోటి జరక్కుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అనుమానం ఉన్న ప్రతిచోటా ఇప్పటికీ సోదాలు చేస్తున్నారు. చైనాలో ఒక రైలు ప్రమాదం జరిగినా, ఒక వంతెన కూలిపోయినా బాధ్యులైన వారికి పడే శిక్షలు దారుణంగా ఉంటాయి. అందుకే అక్కడ అలాంటివి మళ్లీ మళ్లీ జరగవు. మన దేశంలో మాత్రం అలా కాదు. ఇక్కడ ఏ రోజుకి ఆ రోజే. మర్నాటికి అందరూ అన్నీ మర్చిపోతారు.

మనదేశంలో పరిస్తితి భలే విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ ఏం జరిగినా ఎవరికీ పట్టదు. మూడో రోజుకి ఇది చద్దిన్యూస్ అయిపోతుంది. అందరూ దీనిని చక్కగా మర్చిపోతారు. మళ్లీ ఇంకో కొత్త సెన్సేషనల్ న్యూస్ మనకు కావాలి. ఆ కాసేపు మీడియా హడావుడి చేస్తుంది. అధికారులు ఏమీ చెప్పలేరు. ఎంక్వైరీ అయ్యాక చెప్తామంటారు. అదెప్పుడు అవుతుందో ఎవరికీ తెలియదు. నాలుగేళ్ల క్రితం జరిగిన గౌతమీ ఎక్స్ ప్రెస్ సంఘటనలోనే ఇంతవరకూ ఎక్స్ గ్రేషియా ఇవ్వలేదట. చాలా బాగుంది. రూల్స్ అనేవి ఇలాంటప్పుడే మేమున్నాం అంటూ నిద్రలేస్తాయి. మరి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడూ, వాటికి బాధ్యులను శిక్షించాల్సి వచ్చినపుడూ ఆ రూల్స్ ఎక్కడుంటాయో ఎవరికీ తెలియదు.

ముంబాయి పేలుడుకు కారకులైన హంతకులను, పార్లమెంట్ దాడి హంతకులను హైక్లాస్ జైలు లో ఉంచి బిరియానీలతో మేపుతూ, ఏళ్ళ తరబడి వాళ్ళను పోషింఛి, వారిని వస్తాదుల్లా తయారుచేసే  మనకు ఇలాంటి శాస్తి జరగవలసిందే. అయితే నాయకులు చేస్తున్న పనులకు శిక్ష మాత్రం సామాన్యుడికి పడుతున్నది. అదీ విచిత్రం. 

మొన్న మంటల్లో మాడి మసై పోయింది, హంతకులో, టెర్రరిష్టులో కాదు. జేబులో డబ్బు చెల్లించి హుందాగా ప్రయాణం చేద్దామనుకున్న అమాయక ప్రయాణీకులు. యధావిధిగా అనుమానాలు అన్నీ మూడు కారణాలవైపు మళ్ళుతున్నాయి. ఒకటి -- విద్యుత్ షార్ట్ సర్క్యూట్. రెండు --విద్రోహ చర్య. మూడు -- కాకతాళీయ ప్రమాదం. కారణం ఈ మూడిట్లో ఏదైనా, దానిని నివారించలేకపోయిన ఇంత పెద్ద యంత్రాంగం సిగ్గుతో ఆత్మహత్య చేసుకోవాలి.ఎవరికో జరిగిందిలె మనం సేఫ్ అని నేడు అనుకుంటే రేపు ఇలాంటి ఇంకో ప్రమాదంలో మన బంధువులే ఉండొచ్చు, లేదా మనమే ఉండొచ్చు.

ఇలాంటి ప్రమాదాలకు కొన్ని కారణాలు, వాటిని నివారించవలసిన తీరులు పరిశీలిద్దాం.

1. రైల్వే కోచ్ లకు పీరియాడికల్ ఓవర్ హాలింగ్ అనేది కాగితాలకే పరిమితమా లేక నిజంగా జరుగుతున్నదా అన్న విషయం పరిశీలించాలి. కాలం చెల్లిన కోచ్ లను కూడా ఇంకా కొన్ని లైన్లలో తిప్పడం నిజమేనా కాదా పరిశీలించాలి.   

2. మూడు నాలుగు కోచ్ లకు ఒక టీటీఈ ఉంటే అతను ఏ కోచ్ పైనా దృష్టి పెట్టలేడు. ఏ సంఘటనకూ అతన్ని బాధ్యుడినీ చెయ్యటం వీలుకాదు. కనుక ఈ రూల్ ను మార్చాలి. ప్రతి కోచ్ లోనూ ఒక టీటీఈ ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. ఒకవేళ ఇది వీలుకాని పక్షంలో ప్రత్యామ్నాయం ఏదో ఒక ఏర్పాటు చెయ్యాలి. అంతేగాని భద్రతను గాలికి వదిలేయ్యకూడదు. ఒక స్టేషన్లో రైలు ఆగితే, టీటీఈ తను పని చేస్తున్న నాలుగు కోచ్ లకున్న 16 తలుపులనుంచీ ఎవరు ఎక్కుతున్నారో ఎవరు దిగుతున్నారో ఎవరు ఏమి తీసుకుని ఎక్కుతున్నారో చూడగలడా? ప్రాక్టికల్ గా ఇది సాధ్యమేనా?   

3. ప్రమాదం జరిగాక చేసే కంటితుడుపు చేష్టలు మానేసి చిత్తశుద్ధితో ముందుచూపుతో భద్రతాచర్యలు చేపట్టాలి. రైళ్ళలో రక్షకసిబ్బంది సంఖ్యను పెంచాలి. వాళ్ళు హాయిగా పక్కేసుకుని నిద్రపోకుండా చర్యలు చేపట్టాలి. చాలారైళ్ళలో భద్రతా సిబ్బంది నిద్రపోతుంటే ప్రయాణీకులు మేలుకుని కాపలా కాస్తూ ఉంటున్నారు. నేటికీ రైళ్ళను ఆపి దారిదోపిడీలు చేస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి అంటే మనం అడివిలో ఉన్నామో, నాగరిక ప్రపంచంలో ఉన్నామో ఆలోచించాలి.

4. ఎనిమిదేళ్ళుగా రైల్వే చార్జీలు పెంచలేదు. పెంచుదామని ఒక మంత్రి ప్రయత్నిస్తే అతన్ని ఇంటికి పంపించిన ఘనమైన వ్యవస్థ మనది. ఓట్లకోసం చూచుకుంటూ రేట్లు పెంచకపోతే సిస్టం మెయింటేనేన్స్  కు ఫండ్స్ లేక ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో కలుస్తాయని ఎన్నో కమిటీలు మొత్తుకున్నాయి. ఎవరు వింటారు? పోయేది ఎవరివో ప్రాణాలు కదా? ఏసీ రూముల్లో కూచుని ఆదేశాలిచ్చే వారికి ఆ కష్టం ఎలా తెలుస్తుంది? ఆమ్ ఆద్మీ మాకు ముఖ్యం రెట్లు పెంచకూడదు అని గందరగోళం చేశారు. మరిప్పుడు చస్తున్నది ఆమ్ ఆద్మీనే కదా. దీనికి వారి జవాబు ఏమిటి?

5. నిన్న జరిగిన సంఘటనలో ముఖ్యమైన విషయం -- కోచ్ కి ఉన్న నాలుగు తలుపులలో మూడు తెరుచుకోలేదు. ఒక్కటే తెరుచుకుంది అంటున్నారు. ఆ ఒక్క తలుపు దగ్గర ఆ మంటలలో పొగలో ఎంత తొక్కిసలాట జరిగి ఉంటుందో ఊహించవచ్చు. మూడు తలుపులు నిజంగానే 'జాం' అయ్యాయా అన్న విషయం పరిశీలించాలి. ఒకవేళ అలా 'జాం' అయి ఉంటే, మరి దానికి బాధ్యులెవరు, అసలు తలుపులు ఎలా 'జాం' అయ్యాయి  అన్నది తేల్చాల్సి ఉంది.

6. కొత్త రైళ్ళు కొత్త లైన్లు లేక, ప్రయాణాలు చేసేవారి సంఖ్య పెరిగి, ఉన్న రైళ్ళలో ప్రయాణీకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది. లాంగ్ డిస్టెన్స్ రైళ్ళలో జనరల్ కోచ్ ల పరిస్తితి చూస్తే చాలా దారుణంగా ఉంటున్నది. టాయిలెట్ లో పదిమంది ఇరుక్కుని ప్రయాణిస్తూ కనిపిస్తున్నారు. ఇలాంటి దారుణం ఆఫ్రికన్ దేశాలలో కూడా ఉండదేమో అనిపిస్తుంది. దీనిని తక్షణమే నివారించే చర్యలు చేపట్టాలి.

7. స్లీపర్ క్లాస్ రిజర్వేషన్ కోచ్ లో మామూలుగా 72 మంది మాత్రమె ప్రయాణించాలి. కాని రాత్రిపూట కనీసం నూరుమంది ఉంటున్నారు. చాలామంది కింద పడుకొని ప్రయాణం చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదం ఏదైనా జరిగినప్పుడు జరిగే తొక్కిడిలో బయటపడలేక ఎందఱో ఎక్కడికక్కడే మాడి మసై పోతున్నారు. కోచ్ లలో ఓవర్ క్రౌడింగ్ నివారించాలి.

8. మొన్నటికి మొన్న నీళ్ళతో నడిచే కార్ ఇంజన్ కనుక్కున్నామని పాకిస్తాన్ ప్రకటించింది. అక్కడ ప్రభుత్వం లేదు. అంతర్యుద్ధం జరుగుతోంది. అలాంటి చోట అలాంటి ఆవిష్కరణలు వస్తున్నాయి. మన దేశంలో ఐఐటీ లున్నాయి, ఎన్ఐటీ లున్నాయి. వేలకోట్ల రూపాయలు రీసెర్చి మీద ఖర్చు పెడుతున్నారు. మంటలు అంటుకోని మెటీరియల్ తో  కోచ్ లు తయారుచేసే పరిజ్ఞానం పెద్ద గొప్ప ఆవిష్కరణ ఏమీ కాదు. అది చాలా సింపుల్ టెక్నాలజీ. దానిమీద ఎవరూ ఎందుకు దృష్టి పెట్టరో, ఇన్ని ప్రమాదాలు జరిగిన తర్వాత కూడా, ఎందుకు పట్టించుకోరో అర్ధం కాదు.   


9. చాలా స్టేషన్లలో పాయింట్స్ మెన్ లేరు. సహాయకుడు లేకుండా స్టేషన్ మాస్టర్ ఒక్కడే విధులు నిర్వహిస్తున్న స్టేషన్లు వందల్లో ఉంటున్నాయి. రైలు రెండో వైపు వెళ్లి పరిస్తితి గమనించి గ్రీన్ లైట్ సిగ్నల్ ఇవ్వాల్సిన పాయింట్స్ మెన్ లేకపోవడం సేఫ్టీకి తిలోదకాలివ్వడమే కదా.

10. రైల్వేలలో సేఫ్టీ చాలా ఘోరంగా ఉంది. కాలం చెల్లిన వంతెనలు, సరిగ్గా పట్టించుకోని ట్రాకూ, కాలం చెల్లిన సిగ్నలింగ్ వ్యవస్థా, సింగిల్ లైన్లూ, క్రమశిక్షణ లేని సిబ్బందీ ఇలా ఎన్నో కోణాలలో 'భద్రత' నీరుగారి పోతున్నది అని 'ఖన్నా కమిటీ' లాంటి ఎన్నో సేఫ్టీ కమిటీలు మొత్తుకున్నాయి. అవన్నీ ఎప్పుడో చెత్తబుట్ట పాలయ్యాయి. ట్రాక్ లేయింగ్ పనులు అవుట్ సోర్సింగ్ చెయ్యడం వల్ల పనుల్లో నాణ్యత లోపిస్తున్నది. క్రిమినల్ చరిత్ర కలిగిన లోకల్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించే బదులు L&T వంటి వారికి సోల్ కాంట్రాక్ట్ ఇస్తే పనుల్లో నాణ్యత బ్రహ్మాండంగా ఉంటుంది. సకాలంలో ఎస్టిమేట్ ప్రకారం పనీ పూర్తవుతుంది. లోకల్ రాజకీయాలకూ అడ్డుకట్ట పడుతుంది. భద్రతా ప్రమాణాలూ బాగుంటాయి. కాని ఆ పని ఎవ్వరూ చెయ్యరు. దానికి రూల్స్ అడ్డు వస్తాయి. రూల్స్ పెట్టుకున్నది మనమే. కాని మారుతున్న కాలంతో బాటు వాటిని మార్చుకోవాలి అన్న సంగతి మనం విస్మరించాం. కనుక ఈ ఖర్మ తప్పదు.


11. నెల్లూరు స్టేషన్లో అంతా బాగానే ఉన్నట్లు స్టేషన్ మాస్టర్ చెబుతున్నాడు. మరి ఆ స్టేషన్ దాటి ఒక కిలోమీటర్ కూడా పోకముందే అంత పెద్ద ఎత్తున మంటలు ఒక్కసారిగా లేచి కోచ్ మొత్తం ఒక పావుగంటలో తగలబడిపోయిందీ అంటే దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి? లోపం ఎక్కడుంది? ఒకవేళ ఎవరన్నా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి అతన్ని అంతం చెయ్యడానికి ఈ పద్దతి ఉపయోగించారా? విద్రోహ చర్య కాకుంటే ఇలా పావుగంటలో మొత్తం కోచ్ తగలబడే ఆస్కారం ఎంతమాత్రం లేదు కదా. కానీ అప్పుడు కూడా దానిని గమనించాల్సిన భద్రతా సిబ్బంది ఏమి చేస్తున్నట్లు?

ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో లోపాలున్నాయి. ఇన్ని లోపాలున్న వ్యవస్థలో ఎప్పుడో ఒక ప్రమాదం 'మాత్రమే' జరగటం దేన్నీ సూచిస్తున్నది? వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్న విషయం తెలీటం లేదూ? మన అనుమానాలు పనికిమాలినవనీ, ఆవేశాలు అసలే పనికిరానివనీ మనకెప్పుడు అర్ధమౌతుందో ఏమో?  


సరే ఈవిధంగా ఎవరెన్ని మాట్లాడుకున్నా,ఎన్ని చర్చలు చేసినా,పరిపక్వత చెందిన ప్రజాభిప్రాయమే ప్రజాస్వామ్యంలో శ్రీరామరక్ష అన్నది నగ్నసత్యం. దురదృష్టవశాత్తూ అదే మన వ్యవస్థలో లోపించింది. ప్రజలు ప్రలోభాలకు తలొగ్గి ఓట్లను అమ్ముకునే మన ఛండాలపు వ్యవస్థలో, రాజకీయులూ ప్రజలూ కలిసి దోపిడీ సాగిస్తున్న ఈ దేశంలో, ఇంతకంటే గొప్ప పరిస్తితి ఎలా ఊహించగలం? ఈ దేశంలో ఏదో ఉన్నతంగా జరగాలని ఊహించడమే అసలు మనం చేస్తున్న మొదటితప్పు. కనుక ఏది జరిగినా ఆ రోజుకి చర్చించడం, మర్నాటికి మర్చిపోవడం ఇంతే మనదేశంలో జరిగేది. ముందుముందు జరుగబోయేది కూడా ఇదే. ఖర్మ అనుభవిన్చేవాళ్ళు అనుభవిస్తారు. ఎంజాయ్ చేసేవారు చేస్తూ ఉంటారు. పోయేవారు పోతూ ఉంటారు. ఎప్పటికైనా ఈ దేశపు ఖర్మ ఇంతే.

ఏ.ఎల్.బాషం  రాసిన ఒక పుస్తకం ఉన్నది 'ది వండర్ దట్ వజ్ ఇండియా' అని. ఎంత నిజం? ఇండియా ఒకప్పుడు వండర్ కంట్రీనే. కానీ ఇప్పుడు మాత్రం కాదు. ఇప్పుడు పైన పటారం లోన లొటారం. అన్ని రకాల రోగాలతో కుళ్ళిపోతున్న స్తితిలో ప్రస్తుతం మనదేశం ఉంది. అదీ సంగతి. కనీసం ఇంతకు  ముందు చేసిన తప్పులనుంచి కూడా మనం గుణపాఠాలు నేర్చుకోక పోతే మనకంటే మూర్ఖులు ఇంక ఉండరు. అదే కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇతర దేశాలు మనల్ని చూచి పగలబడి నవ్వుతున్నాయి. మనకి మాత్రం ఎన్నటికీ బుద్ధి రాదు. 

మన దేశంలో ఏది నేర్చుకున్నా సామాన్యుడే నేర్చుకోవాలి. ప్రయాణాలు చెయ్యకుండా ఉన్నచోటే ఉండటం ఎలాగో అతను నేర్చుకోవాలి. తిండి తినకుండా ఉండటం నేర్చుకోవాలి.నీళ్ళు తాగకుండా ఎలా ఉండాలో నేర్చుకోవాలి. గాలి పీల్చకుండా ఉండటం అభ్యాసం చెయ్యాలి. అసలు ఏదీ ఆశించకుండా ఏదీ కోరుకోకుండా ఒక యంత్రంలా ఎలా బ్రతకాలో అతను ముందుగా నేర్చుకోవాలి. రాజకీయులూ అధికారులూ మాత్రం ఎప్పటికీ ఏమీ నేర్చుకోరు. కనీసం నేర్చుకునే ప్రయత్నమూ చెయ్యరు. వారిని ఎవరూ ప్రశ్నించలేరు. ప్రశ్నించే సాహసం సామాన్యుడు చెయ్యలేడు. ఇక సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? ప్రమాదాలు ఎలా ఆగుతాయి? 


కనుక ఊరకే మాట్లాడుకుంటూ మనకు మాత్రం టైంవేస్ట్ ఎందుకు? ఎక్కడా ఏమీ జరగలేదు. ఎవరో పోతే పోయారు. మనం బాగానే ఉన్నాం కదా. సో, ఎవరి పని వారు చూచుకుందాం.

జైహింద్. జై భారత్.