దారుణ రేప్ కు గురై చనిపోయిన అమ్మాయి శవాన్ని ఒక దొంగశవంలా దొంగచాటుగా దహనం చెయ్యడం హీనమైన చర్య. ఆ అమ్మాయికి సొంత ఊర్లో దహనసంస్కారాలు జరుగకుండా ఎక్కడో డిల్లీలో అనామకంగా అవి జరిపించడం ఆ అమ్మాయికి ఆత్మశాంతి లేకుండా చెయ్యడమే.కసబ్ నూ ఈ అమ్మాయినీ ఒకే విధంగా ప్రజలకు కనిపించకుండా కడతేర్చారు.ఇదా మనం ఈ అమ్మాయికి ఇచ్చే కనీస మర్యాద?ప్రధానమంత్రి ,ఇంకా ఇతర ప్రముఖులు దహన సంస్కారాలకు వచ్చినంత మాత్రానా,గంధపు కట్టెలతో దహనం చేసినంత మాత్రానా అదేమీ గొప్పకాదు.అది రాజకీయుల ఇమేజిని పెంచే రాజకీయప్రయత్నం కావచ్చు కాని ఈ కంటితుడుపు చర్యవల్ల ఆ అమ్మాయి ఆత్మమాత్రం శాంతించదు.తనకు జరిగిన అన్యాయానికి తగిన పరిహారమూ,ప్రతీకారమూ జరిగినప్పుడు మాత్రమె ఆ ఆత్మకు శాంతి. అంతేగాని మనం వెలిగించే కొవ్వొత్తులు,మనం ఇచ్చే ఉపన్యాసాలు,టీవీ చర్చలు,రాజకీయ ముష్కరుల శుష్కవాగ్దానాలవల్ల ఆ అమ్మాయి ఆత్మ ఎట్టి పరిస్తితిలోనూ శాంతించదు.
పార్లమెంట్లో ఎంపీలు కంటనీరు పెట్టుకున్నందువల్లా, కెమెరాల ముందు కళ్ళు తుడుచుకున్నందువల్లా,రుద్ధకంఠంతో టీవీలో మాట్లాడినందువల్లా సమస్య పరిష్కారం కాదు.ఇవన్నీమసక బారిన వారి ఇమేజిని తుడుచుకునే ప్రయత్నాలే,వారి ముఖాలకు పట్టిన బురదను కడుక్కునే ప్రయత్నాలేగాని నిజమైన చర్యలు కావు.రాజకీయనాయకులున్నది ఏడవడానికి కాదు.వారున్నది పటిష్టమైన చర్యలు చేపట్టడానికి.ఇటువంటి బఫూన్ చర్యలతో ప్రజలను మోసం చెయ్యలేరు.
ఇకపొతే నిందితులకు ఒక శిక్షగా విధించాలని రాజకీయులు ఊహిస్తున్న రసాయనిక నపుంసకత్వం (chemical castration) అనేది సరియైన ఊహ కానేకాదు.ఎందుకంటే,దీనివల్ల నిందితులు లైంగికంగా ఒక అమ్మాయిని హింసించలేకపోవచ్చు.వారిలో లైంగిక వాంచలు నశించవచ్చు.కానీ సమాజం తమను ఇలా చేసింది అన్న కసితో, అమ్మాయిలమీద ఇంకా దారుణమైన హింసకు వారు పాల్పడవచ్చు.మొన్న ఆ అమ్మాయి చనిపోయినది కూడా రేప్ వల్ల కాదనీ,మారణాయుదాలతో నిందితులు చేసిన అమానుషదాడి వల్లనే అని గుర్తుంచుకోవాలి.కనుక రసాయనిక నపుంసకత్వం తమకు విధించారన్న కసితో సైకోలుగా మారి అమ్మాయిలను మరిన్ని చిత్రహింసలకు గురిచేస్తే ఇక ఆచట్టం వల్ల ఉపయోగం ఏమిటి? సమస్య ఎలా పరిష్కారం అవుతుంది?కనుక నిందితులకు మరణదండనే సరియైన శిక్ష.అదికూడా ఉరితో కాదు.వారిని నడిరోడ్ల కూడలిలో పబ్లిక్ గా నిలబెట్టి పైనుంచి కిందకు వరుసగా బుల్లెట్లతో జల్లెడగా కాల్చి నిదానంగా ఒక రోజంతా చంపాలి.
లేదా నేనేగనుక జడ్జినైతే,నాకే గనుక అధికారం ఉంటె, వారికి ఇంకా దారుణమైన శిక్ష విదిస్తాను.నిందితులకు ఒకకాలు ఒకచెయ్యి,అంటే కుడికాలు,ఎడమచెయ్యి,లేదా ఎడమకాలు,కుడిచెయ్యి,వీటితో పాటు మర్మావయవాన్ని కూడా నరికెయ్యాలి. కాని నిందితుడు చావకుండా మెడికల్ కేర్ లో ఉంచి ప్రాణాన్ని నిలపాలి. బాగై పోయిన తర్వాత, అతన్ని రోడ్డు మీద వదిలెయ్యాలి.జీవితమంతా అలాంటి దుర్భరమైన బాధ అనుభవిస్తూ అతను నిండు నూరేళ్ళు బతకాలి. బాధితురాలు పడిన దుర్భరమైన బాధను అతను ప్రతిరోజూ అనుభవిస్తూ ఎన్నో ఏళ్ళు బ్రతకాలి.అదే నేను విధించే శిక్ష. ఇలాంటి శిక్షలు కొన్ని ముస్లిందేశాలలో విధిస్తారు.ఇది వింత కాదు.అసహజమూ అమానుషమూ కూడా కాదు.
కాని ఇలాటి శిక్షలు విధించడానికి మన పీనల్ కోడ్ ఒప్పుకోదు.పదిమంది నేరస్తులు తప్పించుకున్నా పరవాలేదు కాని ఒక్క అమాయకుడికి శిక్ష పడరాదు అన్నది మన న్యాయసూత్రం.ఇది చాలా మంచి ఉద్దేశమే. కాదనలేము.కాని వాస్తవంలో ఇది ఘోరమైన వక్రీకరణకు గురౌతున్నది. ఎలా అంటే ఈ సూత్రాన్ని కాపాడటానికి,ఒక ముద్దాయి తనను తాను నిర్దోషిగా నిరూపించుకునే అన్ని అవకాశాలనూ మన పీనల్ కోడ్ కల్పించింది.కనుక దోషులు తప్పించుకునే అవకాశాలు మన వ్యవస్థలో అధికం.వాస్తవానికి జరిగేది మాత్రం 'బలం ఉన్నవాడిని వాడు నేరస్తుడైనా సరే వదిలెయ్యి,బలహీనుడిని వాడు నిర్దోషైనా శిక్షించు.పదిమంది అమాయకులకు శిక్ష పడినా పరవాలేదు కాని ఒక్క పలుకుబడి కలిగిన నేరస్తుడికి శిక్ష పడరాదు.'అనేదే మన దేశంలో అమలులో ఉన్న న్యాయసూత్రం.
నాకు చాలామంది పోలీస్ ఆఫీసర్స్ స్నేహితులున్నారు.ఒక కేస్ ను పట్టుకొని, FIR ఫ్రేం చేసి,కేసును తయారు చేసి,కోర్టులో పెడితే,ఎదో చిన్న మెలికతో,benefit of doubt తో, కేసు కొట్టేసి దోషులను విడుదల చేసిన కేసులు ఎన్నో ఉన్నాయి.ఇదంతా మన ఘనత వహించిన లాయర్ల ప్రతిభ.అప్పుడా పోలీస్ ఆఫీసర్ పడే మానసిక వేదన దారుణంగా ఉంటుంది. ఆ వ్యక్తీ దోషి అని పోలీస్ ఆఫీసర్ కు తెలుసు.కాని అతని కళ్ళముందే శిక్ష పడకుండా అతను బయటకి వస్తాడు.ఇదీ మన న్యాయ వ్యవస్థను మనం పక్కదారి పట్టించిన తీరు. మనకు చట్టాలు చాలా ఉన్నాయి.కాని వాటిని అమలు చేసే చిత్తశుద్ధి లేదు.అది లేనంత వరకూ ఎన్ని చట్టాలున్నా, ఇంకెన్ని కొత్త చట్టాలు చేసినా ఏమీ ఉపయోగం ఉండదు. వాటిని ఎలా నీరుగార్చాలో బహుశా మనకు తెలిసినంత ఏ ఇతరదేశపు ప్రజలకూ తెలియదు.
సరే,ఇదంతా వ్యవస్థాగతమైన చర్చ.ఇలాంటి చర్చలు బ్రేక్ ఫాస్ట్ తర్వాత మొదలై లంచ్ వరకూ జరుగుతాయి.అంటే మనకు పనీపాటా లేనప్పుడూ,లంచ్ టైం ఇంకా కానంతవరకూ మాత్రమె ఇలాంటి చర్చలు జరుగుతాయి.ఈ వ్యవస్థ ఎప్పుడు బాగుపడుతుందో ఆ దేవుడికే ఎరుక.అలా బాగుపడాలంటే, పరిణతి చెందిన ప్రజాభిప్రాయం ప్రభుత్వాన్ని కదిలించేటంత బలంగా ఉండాలి.మనదేశంలో అదంత సులభంగా జరిగేది కాదు. కనుక దాని సంగతి అలా ఉంచి,వ్యక్తిగతస్థాయిలో మనం ఏమి చెయ్యాలో,ఏమి చెయ్యగలమో కొంచం చూద్దాం.
1.మొదటగా, ఐటం సాంగ్స్ ఉన్న సినిమాలను ఎవరూ చూడకుండా బహిష్కరించాలి.అమ్మాయిలను వెంటపడి వేధిస్తూ,అదేదో హీరోయిజం అని చూపించే సన్నివేశాలతో ఉన్న సినిమాలను కూడా ప్రజలు బహిష్కరించాలి.హీరోయిన్లను కురచ బట్టలతో చూపే ప్రతి సినిమానూ ప్రజలు బహిష్కరించాలి.ఎందుకంటే దానిమీద డబ్బు సంపాదించే సినిమా రంగం ఆ పని చెయ్యదు. సేన్సారూ ఆ పని చెయ్యదు.కనుక ప్రజాభిప్రాయమే బలపడాలి.
2.టీవీలలో సినిమా పాటలకు చిన్న పిల్లల చేతా, యువతీ యువకుల చేతా డాన్సులు చేయించే ప్రతి ప్రోగ్రామునూ బహిష్కరించాలి. ఆ చానల్స్ ప్రజలు చూడరాదు.ఎంతసేపూ సినిమాలే లోకంగా చూపించే చానళ్ళను, ఆ హీరో హీరోయిన్లను ఏదో దేవతలుగా చూపే చానళ్ళను బహిష్కరించాలి.
3.ఒళ్ళు ప్రదర్శిస్తూ ఉండే దుస్తులు వేసుకున్న కూతుళ్ళను తల్లిదండ్రులు మందలించి ఆపాలి.మగస్నేహాలనూ,వేళాపాళా లేకుండా బయట బాయ్ ఫ్రెండ్స్ తో తిరగడాన్నీ,గంటలుగంటలు చాటుకు వెళ్ళి మొబైల్లో అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడటాన్నీతల్లిదండ్రులు అరికట్టాలి.
4.అసభ్యమైన సినిమా బూతుభాష మాట్లాడే అబ్బాయిలను తల్లిదండ్రులు మందలించాలి.అమ్మాయిలతో షికార్లు తిరిగే విద్యార్ధులను గమనించి అది మంచి పద్ధతి కాదని వారికి నచ్చచెప్పి ఆ పనులు ఆపించాలి.
5.పిల్లలకు ఇల్లే మొదటి విద్యాలయం.కనుక ఇంటిలో మంచి ఉన్నతమైన చర్చలు జరగాలి. మంచి పుస్తకాలు ఇంటిలో ఉండాలి.మహనీయుల జీవితాల గురించీ, విలువలతో కూడిన జీవితాల గురించీ మాట్లాడుకోవాలి. ఎంతసేపూ సినిమాల గురించీ,చెత్త విషయాల గురించీ చర్చలు ఇళ్ళలో జరగరాదు.అలా జరగాలంటే,ముందు తల్లిదండ్రులలో వ్యక్తిత్వం ఉండాలి. అప్పుడే అది పిల్లలకు కూడా అలవడుతుంది.మనం హేయమైన భాషను వాడుతూ,చవకబారు జీవితం గడుపుతూ,మన పిల్లలు ఉన్నతమైన వ్యక్తిత్వంతో రూపు దిద్దుకోవాలంటే అది జరగని పని.
6.సిగిరేట్లూ తాగుడూ మొదలైన అలవాట్లు పిల్లలకు కాకుండా చూడాలి. పెద్దలకు ఆ అలవాట్లు ఉంటె తత్క్షణం వాటిని మానుకోవాలి.కొన్ని కులాలలో యువకులకు తండ్రులూ,బాబాయిలూ,మేనమామలే తాగుడును నేర్పించడం నేను చూచాను.'తాగకపోతే నువ్వేం మొగాడివిరా?' అని ఎగదోస్తూ ఒక యువకుడికి అతని బాబాయిలే తాగడం అలవాటు చేసిన కుటుంబాలు నాకు తెలుసు.ఇంకొన్ని కుటుంబాలలో అందరూ కలిసి తాగుతూ కూచుంటే ఆ ఇల్లాలూ ఇంటిలోని ఇతర ఆడవారూ వంటలు చేసి వారికి అందించడం సర్వసాధారణం.ఇలాంటి కుటుంబాలలో సంస్కార వంతమైన పౌరులు తయారౌతారని ఊహించడం కూడా తప్పే.
7.బజార్లోనో,బస్టాండ్ లోనో,గుడి దగ్గరో,కాలేజి దగ్గరో,సినిమా హాల్ దగ్గరో,ఇంకెక్కడైనా ఎవరైనా వ్యక్తులు అమ్మాయిలను అల్లరి పెడుతూ కనిపిస్తే, నాకెందుకులే అని ఊరుకోకండి.వారీకి ఎదురు తిరగండి. ప్రతిఘటించండి. అలా ప్రతిఘటించడానికి ప్రతివారికీ మార్షల్ ఆర్ట్స్ రానక్కరలేదు.చిత్తశుద్ధి,ధైర్యమూ ఉంటె చాలు.ఆ అమ్మాయిలో మన చెల్లెలో అక్కో అమ్మో కనిపిస్తే చాలు.
8.ముఖ్యంగా కులపిచ్చిని పిల్లలకు ఎక్కించడం మానండి.చాలామంది పిల్లలు అమాయకులు.వారికీ కులాన్నీ మతాన్నీ ఎక్కించేది తల్లిదండ్రులూ తాతలూ అవ్వలే.ఇక అక్కణ్ణించి వారి నైతిక పతనం మొదలౌతుంది. 'మనకేంట్రా,మనది ఫలానా కులం.గవర్నమెంట్ మనదే.నువ్వేం చేసినా ఏమీ కాదు.కానీయ్.మన ఆస్తి ఎంతుందో చూడు.' ఇలాంటి విషాన్ని మాత్రం దయచేసి పిల్లలకు ఎక్కించకండి. ఒకవేళ అలాచేస్తే,మీరెంత తప్పు చేస్తున్నారో మీరు ఊహించలేరు.భవిష్యత్తులో ఆ పిల్లవాడూ,పిల్లా చేసే ఘోరాల పాపం మీమీద పడుతుంది.ఆ పాపఫలం మీరు కూడా అనుభవించవలసి వస్తుంది.ఆ పిల్లలు ఖచ్చితంగా ఎదో ఒక రకమైన క్రిమినల్స్ గా తయారవ్వడం ఖాయం.
9.అన్నికంటే ముఖ్యంగా, కర్మ సిద్ధాంతాన్ని పిల్లలకు చెప్పండి. 'తప్పు చేస్తే శిక్ష తప్పదు.దీన్ని ఎవరూ తప్పించుకోలేరు.సమాజం నుంచీ, కోర్టులనుంచీ, పోలీసులనుంచీ తప్పించుకోవచ్చేమో గాని,ప్రకృతి నుంచి తప్పించుకోలేము.' అన్న విషయం పిల్లలకు గట్టిగా చెప్పాలి. ఒక తప్పు చెయ్యాలంటే, తనకు తనకే భయం కలిగేలా వ్యక్తీ నిర్మాణం జరగాలి.
10.పేదరికంలో ఉన్నా పరవాలేదు. కాని ధర్మం మాత్రం తప్పవద్దు అన్న విషయం పిల్లలకు ముఖ్యంగా నేర్పాలి. తల్లిదండ్రులూ దీనిని పాటించాలి. 'ఏదో రకంగా డబ్బు సంపాదించు.ఏ నేరాలూ ఘోరాలూ మోసాలూ చేసైనా పరవాలేదు.సంపాదించు.ఎంజాయ్ చెయ్యి'అని మాత్రం నూరిపోయ్యకండి. అలా చెయ్యడం వల్ల మీరు ఒక క్రిమినల్ ను తయారు చేసి సమాజం మీదకు వదులుతున్నారన్న విషయం మర్చిపోకండి.
ఈ రకంగా ఒక వెయ్యి సూత్రాలు చెప్పవచ్చు.కాని అసలు సమస్య సూత్రాల లేమిలో లేదు.చిత్తశుద్ధి లేమిలో ఉంది.నీతులు ఎదుటివాడికి,అవకాశవాదం మనకి అన్న భావజాలంలోనే అసలైన సమస్యంతా ఉన్నది. ఇది పోవాలి. అలా పోయే దిశగా అందరూ కృషి చెయ్యాలి. ఎవరో చేస్తారులే అని అందరూ ఊరుకోకుండా, నేనేం చేస్తున్నాను? నా ఇంట్లో పరిస్తితి ఎలా ఉంది? అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అలా ఆలోచించాలంటే ముందుగా మన చెత్త లైఫ్ స్టైల్ వదులుకోడానికి మనకు మనసు రావాలి. అదెంతమందికి వస్తుంది?
పేపర్లో ఒక వార్త చూచాను. ఈ రేప్ కేస్ నిందితులలో ఒకడి తల్లిదండ్రులు అవమానం భరించలేక వారి ఇంటిలో నుంచి బయటకు రాలేకపోతున్నారట. ఇది చదివి నాకు చాలా అసహ్యం వేసింది.తమ కొడుకుని ఒక మృగంగా పెంచినప్పుడు, పెంచి సమాజం మీదకి వదిలినప్పుడూ ఈ సిగ్గు ఏమై పోయింది? అసలు ఉరి తియ్యవలసింది నేరస్తులను కాదు. వారితో పాటు వారిని అలా ఆంబోతులాగా పెంచిన ఆ తల్లినీ తండ్రినీ కూడా ఉరితియ్యాలి.
ఒక నేరానికైనా,ఘోరానికైనా,ఉన్నతత్వానికైనా,ఇంటిలోనే బీజాలు పడతాయి.మనం ఎలాంటి విత్తనం విత్తుతామో అలాంటి చెట్టే వస్తుంది. అలాంటి పండ్లే కాస్తాయి. పశువుకు పశువే పుడుతుంది. దేవతలు పుట్టరు. కనుక ప్రతిఒక్కరూ ఇంటి స్థాయినుంచే మార్పు తెచ్చినపుడే సమాజం బాగుపడుతుంది.అంతేగాని ఇది చట్టాలవల్లో,ఇంకొకదానివల్లో జరిగే పని కాదు.చిన్నతనం నుంచే శీలనిర్మాణం జరగాలి.అదే ముఖ్యం.విలువలతో నిండి ఉన్న కుటుంబం నుంచి క్రిమినల్స్ రారనీ,అలా వచ్చే ప్రతి క్రిమినల్ కూ కుటుంబ స్థాయిలోనే పునాదులు పడతాయనీ గ్రహించండి.
ఇదంతా చదివి చాలామంది ఏమనుకుంటారో నాకు తెలుసు.ఈ నీతులు పాటించడం ఈరోజుల్లో అయ్యేపని కాదు. ఈ ఫాస్ట్ లైఫ్ లో నీతీ న్యాయం ధర్మం అంటూ కూచుంటే ఇంతే సంగతులు.లైఫ్ ఎంజాయ్ చెయ్యాలి. పక్కవాడితో మనకేంటి? లోకం ఎలా పోతే మనకేంటి? ఈ నీతులన్నీ చేతగానివాళ్ళు చెప్పే మాటలు.సంపాదించు,అనుభవించు,నేరాలు చెయ్యి,తెలివిగా తప్పించుకో, అదే ముఖ్యం. అనుకుంటారు.
మీరు ఇలా అనుకున్నంతవరకూ ఈ సమాజం మారదు.ఏవరో ఆకాశం నుంచి దిగివచ్చి మార్పు అనేదాన్ని తీసుకురారు.అది మనలోనుంచి రావాలి. మార్పనేది మనతో ప్రారంభం కావాలి.అలా కానంతవరకూ ఎన్ని చర్చలు చేసినా,ఎన్ని చట్టాలు చేసినా,ఏమీ ఉపయోగం లేదు. ప్రతివ్యక్తి గుండెలో ఒక న్యాయస్థానం ఉంది.అయితే ప్రస్తుతం అది చీకటిలో ఉంది.దానిలో దీపాలు వెలగాలి.అప్పుడే ఆదర్శవంతమైన సమాజం సాధ్యమౌతుంది.అలాంటి సమాజంలో నేరాలనేవే ఉండవు.అప్పుడే, 'తప్పు చెయ్యకు' అని ఒకరు మనకు చెప్పాల్సిన అవసరమూ ఉండదు.
సరేగాని,పై పదిసూత్రాలలో మీరు ఎన్ని పాటించ గలరో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి.అలా చేసుకోలేకపోతే, ఊరకే ఈ పోస్ట్ ను చదివి వదిలేస్తే, 'నిర్భయ' పడిన నరకయాతనకు మీరూ బాధ్యులే. ఆ పాపంలో మీకూ భాగం ఉందని మర్చిపోకండి.