“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

29, జనవరి 2013, మంగళవారం

వీదిబజారులో వింత మోళీలు

ఎవరో తెలియని లోకుల కోసం
ఏదీ పట్టని లోకం కోసం 
నీవేడుస్తావెందుకు నేస్తం
నీ ఏడుపు వినేవాడెవ్వడు
నిన్నోదార్చే వాడెవ్వడు
భ్రమలు వీడి సత్యం వైపు తేరిచూడు
పొరలు కరిగిపోయేలా పట్టిపట్టి చూడు

ఈ నాటకరంగంలో 
రాజు రాజూ కాడు 
పేద పేదా కాడు
వాళ్ళ మాటలు వాస్తవాలూ కావు
వాళ్ళ వేషాలు సత్యమైనవీ కావు
పాత్రలు నిజమని భ్రమించకు నేస్తం
నాటకం అబద్ధం నాటకరంగం వాస్తవం
ఎప్పటికీ ఇదే సత్యం 
తెలుసుకో ఈ నిజం

నేటి వ్యధార్త హృదయాలు 
రేపు చేస్తాయి నాట్యాలు
నేటి విలాసపు లోగిలిలో 
రేపు వింటావు రోదనలు
పరుగెత్తేవాడు ఆగక తప్పదు
అడుగెయ్యనివాడు కదలకా తప్పదు
నిత్యచలనం ఈ లోకపు గమ్యం

అర్దించే అనాధ హస్తం వెనుక 
కనలేవా నిన్నటి గర్వాన్ని
విర్రవీగే విలాసపు మంటల వెనుక
చూచావా మొన్నటి బాధల చీకటిని   
 నిన్న పొమ్మని విదిలించిన చెయ్యి
నేడు ఆశగా అర్ధిస్తుంది 
మొన్న నిర్దయగా కసిరిన నోరు 
నేడు దీనంగా ప్రార్ధిస్తుంది
నాడు ఏనుగుపై ఊరేగిన దేహం
నేడు దుమ్ములో పడి దొర్లుతుంది 

నేటి వేటగాడు రేపు పక్షౌతాడు
నేడు నవ్వేవాడు రేపేడుస్తాడు
నీకెందుకు బాధ పిచ్చి నేస్తం
లోకం తీరుకు కర్తవు నీవా?
అందరి బాధల పరిహర్తవు నీవా?
చక్రభ్రమణమేగా ఈ జీవితసత్యం 

వీదిబజారులో వింత మోళీలు చూస్తూ
రంగుటద్దాలలో సొంత బింబాలు చూస్తూ
ఆపావెందుకు నీ పయనం
మరచావెందుకు నీ గమ్యం?
నిశికన్య నిను కమ్ముకున్నప్పుడు
ఎడారిరాత్రిలో నీవొంటరిగా మిగిలినప్పుడు
ఈ వింతలన్నీ కావా మాయం?

చిమ్మ చీకటిలో 
మెరిసే చుక్కల జల్లెడ కింద 
అంతులేని ఎడారిలో 
ఒంటరి యాత్రికుడివి నీవు
నీకెందుకీ వృధా ప్రయాస
ఎవరికోసం నీకీ ఎగశ్వాస
నీవారెవరూ లేరిక్కడ 
నీదంటూ ఏదీ కాదిక్కడ

నీదేశాన్ని వీడి 
ఎన్ని యుగాలైందో చూడు
నీవారిని మరచి 
ఎన్ని తరాలైందో చూడు
పరదేశంలో తెలివిలేక తిరిగే 
పాంధుడివి నీవు
మానవత్వం లేని మాయలోకంలో 
దారితప్పిన బేలవు నీవు
చిక్కుకోకు ఈ లోకపు మాయలలో
భ్రమించకు ఈ చీకటి లోయలలో

తలెత్తి చూడు పిలుస్తోంది నీలోకం
వెలుగు హస్తాలు చాచింది నీకోసం
ఎన్నాళ్ళున్నా నీ ఇల్లిది కాదుగా
యజమాని కుటుంబం ఏనాడూ నీదవదుగా 
తెంచుకో నీవే కట్టుకున్న శృంఖలాలు
త్రుంచుకో నువ్విష్టపడే బంధనాలు
విప్పుకో మరచిన నీ వెలుగు రెక్కలు
ఆపలేవిక నిన్నీ లోకపు దిక్కులు 

సాగిపో...
నిన్నెపుడూ పిలిచే నీలాకాశం వైపు
మృతి లేని వెలుగు సముద్రం వైపు 
తిమిరమే లేని ఉజ్వల లోకం వైపు
బాధలే లేని ఆనంద శూన్యం వైపు