నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

11, ఫిబ్రవరి 2013, సోమవారం

జ్యోతిష్కులకు కొన్ని మంచి సూచనలు

నేడు జ్యోతిష్య విద్యమీద అభిరుచి చాలామందికి కలుగుతున్నది.ఇది మంచి పరిణామమే.చాలామంది జ్యోతిష్యరంగంలో పరిశ్రమ చేస్తూ ఇతరులకు జాతకాలు చెబుతూ పరిహార క్రియలు చెబుతూ చేయిస్తూ ఉండటం గమనిస్తున్నాను.ఇదీ మంచిదే.కాని ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి.

ఏ రంగంలో నైనా పరిపూర్ణత,పరిపక్వత లేనిదే ఇతరులకు మనం సరియైన సహాయంగాని సేవగాని అందించలేము.మనకే పూర్తిగా విద్యమీద అవగాహన లేనప్పుడు ఇతరులకు ఏదో చెప్పబోవడం చాలా పొరపాటు.ఈ క్రమంలో ఔత్సాహిక జ్యోతిష్కులకు కొన్ని సూచనలు ఇస్తున్నాను గమనించండి.

  • జ్యోతిష్య విద్య ఇతర లౌకిక విద్యలవంటిది కాదు.ఇది దైవికమైన విద్య.కనుక దీనిని వ్యాపారానికి వాడరాదు.అలా వాడితే డబ్బు మీద ఆశ జ్యోతిష్కుని మనస్సును కలుషితం చేస్తుంది.అలాంటి మాలిన్యపూరిత మనస్సులో సత్యజ్ఞానం ప్రతిఫలించదు.కనుక డబ్బు సంపాదన కోసం జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు ఎప్పటికీ సఫలీకృతులు కాలేరు.ఎందుకంటే వారి ప్రాధమిక ఉద్దేశ్యంలోనే లోపం ఉన్నదికనుక.
  • జీవితమంతా నేర్చుకున్నప్పటికీ ఈ విద్యలో ఇంకా నేర్చుకోవలసింది మిగిలే ఉంటుంది.ఈ విద్యాభ్యాసం ఎన్నటికీ పూర్తి కాదు.కనుక జ్యోతిష్య విద్యార్ధి వినమ్రభావంతో ఎల్లప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగానే ఉండాలి.విర్రవీగుడు అనేది ఈ రంగంలో ఏమాత్రం పనికిరాదు.
  • ఏదో కొన్ని పుస్తకాలు చదివినంత మాత్రానా,చెప్పిన కొన్ని జోస్యాలు నిజమైనంత మాత్రానా మొత్తం విద్య వచ్చేసినట్లు భావించి విర్రవీగడం చాలా పొరపాటు.ఇలాంటి గర్వం కనుక మనసులో ప్రవేశిస్తే అతని పురోగతికి ఆ రోజే ఆఖరిరోజు అవుతుంది.ఎందుకంటే గర్వము అహంకారము నిండి ఉన్న మనస్సులో సత్యజ్ఞానం నిలువలేదు.
  • తెలిసీ తెలియని రేమేడీలు చెప్పి వచ్చినవారి వద్ద డబ్బు తీసుకుంటే దానికి పదింతలు దోషం జ్యోతిష్కునికి అంటుకుంటుంది.ఒక పరిహారం చెప్పినపుడు ఆ పరిహారం అనేది మన ఊహమీద ఆధారపడి ఉండకుండా దానికి కొంత శాస్త్రీయత ఉండేటట్లు చూచుకోవాలి.మంత్ర శాస్త్రంలో ప్రావీణ్యత ఉండటం పరిహారక్రియలకు తప్పనిసరి.
  • వ్యక్తిగత జీవితంలో నియమనిష్టలు పాటించకుండా జ్యోతిష్య విద్యను గనుక ఇష్టం వచ్చినట్లు వాడితే దాని పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి.ఈ విషయం నేను అనేకమంది జ్యోతిష్కుల జీవితాలలో గమనించాను.నవగ్రహములతో చెలగాటం నిప్పుతో పాముతో చెలగాటం కంటే ప్రమాదకరం.అలా చెలగాటం ఆడి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా నాకు తెలుసు.
  • జ్యోతిష్య విద్యను అభ్యసించేవారు ఎక్కడ బడితే అక్కడ తినకూడదు. ఎవరి చేతితోబడితే వారిచేతితో వండినవి ఇచ్చినవి తినకూడదు. ఎందుకంటే,ఆహారదోషమూ ఆశ్రితదోషమూ తీసుకున్న వారి మనస్సును ప్రభావితం చేస్తాయి. అటువంటి మనస్సులో సత్యజ్ఞానం ప్రతిఫలించదు.  
  • ధూమపానం,మద్యపానం,మాంసాహారం,జూదం,దుస్సాంగత్యం మొద లైనట్టి వ్యసనాలకు జ్యోతిష విద్యార్ధి ఆమడదూరంలో ఉండాలి.
  • ముఖ్యంగా జ్యోతిష్కుడైనవాడు మితవాక్కును పాటించాలి.పది మాటలు అవసరమైన చోట ఒక మాటనే మాట్లాడాలి.ఎందుకంటే అప్పుడు గాని అతనికి వాక్శుద్ధి కలుగదు.అతిగా వాగేవారికి జ్యోతిష్య విద్య ఫలించదు.జ్యోతిష్య విద్యలో వాక్కు ప్రధానం గనుక వాగ్నియమం తప్పనిసరి.అబద్దాలు చెప్పేవారికి జ్యోతిష్యం పట్టుబడదు అని గ్రహించాలి.
  • గర్వం,అహంకారం,కోపం,క్రూరస్వభావం,కుట్రలు చేసే స్వభావం, దురాశ, దూకుడుతనం,విచ్చలవిడితనం,చాడీలు చెప్పడం,ఒకరి చెడును కోరడం  మొదలైన స్వభావాలను ప్రవర్తనలను అన్నింటినీ జ్యోతిష్య విద్యార్ధి వదిలిపెట్టాలి.
  • నిత్యజీవితంలో మితాహారం,బ్రహ్మచర్యం,తపస్సు,మౌన ధ్యానం,దైవ ప్రార్ధనలతో కూడిన ఏకాంత జీవితాన్ని ఎక్కువగా గడపాలి. అప్పుడే అతనికి దైవ సంకల్పాన్ని గ్రహించే శక్తి వృద్ధి అవుతుంది.నియమ యుతమైన జీవితం గడపనివాడు ఎన్నటికీ జ్యోతిష్కుడు కాలేడు.
  • ఇన్ని బాధలు పడి చివరికి డబ్బు సంపాదించక పోతే ఉపయోగం ఏమిటి?అసలు ఇవన్నీ ఎందుకు?అని కొందరికి సందేహం రావచ్చు.ఇది పూర్తిగా పొరపాటు అభిప్రాయం.జీవిత పరమార్ధం ధన సంపాదన ఒక్కటే అయితే ఈ లోకంలో వ్యాపారం తప్ప ఇక తక్కినవి ఉండే అవకాశమే లేదు.జ్యోతిష్యవిద్యను ధనార్జనకు వాడవచ్చు కాని అదే పరమావధి మాత్రం కాకూడదు.అలా వాడటానికి కొన్ని నియమాలు పరిమితులు ఉన్నాయి. వాటికి లోబడి మాత్రమె ధనాన్ని స్వీకరించాలి.దురాశకు పోయి ఏవేవో తెలిసీ తెలియని మాయమాటలు వచ్చినవారికి చెప్పి మోసగిస్తే దారుణమైన కర్మ జ్యోతిష్కుని నెత్తిన తిష్ట వేసుకుని కూచుంటుంది.
  • ఇతరులకు చెడు చెయ్యడానికి ఈ విద్యను వాడరాదు. ఇలాకూడా చెయ్యవచ్చా అని కొందరికి సందేహం వస్తుంది.చెయ్యవచ్చు.ఒకరి జాతక చక్రం మనకు తెలిస్తే ఆ వ్యక్తిని మన చెప్పుచేతల్లోకి తీసుకోవచ్చు.ఒకరకంగా ఇది చేతబడి లాంటిదే.అయితే అదృష్టవశాత్తూ ఇది చాలా రహస్య విద్య మరియు  అందరికీ అందుబాటులో ఉండని స్థాయి గనుక సరిపోయింది.కానీ అటువంటి చర్యలకు జాతక చక్రాన్ని వాడరాదు.అలా వాడితే ఫలితాలు మళ్ళీ వికటిస్తాయి. ప్రత్యేకించి కొంతమంది జాతకాలు ఇలాటి చర్యలకు చాలా అనుకూలంగా ఉంటాయి.అందుకనే పాతకాలపు జోస్యులలో కొందరు 'నీ చెయ్యి ఎవరికీ చూపించకు,నీ జాతకం ఎవరికీ చూపించకు'మొదలైన సలహాలు ఇచ్చేవారు. ఇప్పటివారికి ఆ రహస్యాలు తెలియవు గనుక ఆ మాటలు ప్రస్తుతం మనం ఎక్కడా వినలేకపోతున్నాము.
  • చాలామంది పురోహితులు జ్యోతిష్కులు ఈ విద్యను చాలా తేలికగా తీసుకోవడం నేను గమనించాను.అది వారి అజ్ఞానానికి సూచన.ఇది తేలికగా తీసుకునే విద్యకాదు.తేలికగా పట్టుబడే విద్య కూడా కాదు.కర్మతో చెలగాటం కనుక ఏదైనా తేడా వస్తే దాని ఫలితం జ్యోతిష్కుడు అనుభవించవలసి వస్తుంది.సాధారణంగా పురోహితులలో అహంకారం,గర్వం బాగా ఎక్కువగా ఉంటాయి.దానికి తోడు వారు పైకి ప్రదర్శించేటంత సాధనాబలం వారి లోపల ఉండదు.కనుక వారి చేతిలోనే ఈ విద్య దుర్వినియోగం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • పురోహితులు మరియు సాధారణజ్యోతిష్కులు ఈ విద్యలో లోతైన పరిశ్రమ చేసినవారు కారు.వారికి ఏవో కొన్ని కొండగుర్తులు తెలిసి ఉంటాయి.వాటితో బండి నడిపిస్తారు గాని,పరిశోధనాత్మకంగా నిరంతరం నేర్చుకుంటూ ముందుకు పోయే బుద్ధి వారిలో ఉండదు.వారు నిజమైన జ్యోతిష్కులు కాదలుచుకుంటే చాలా పరిశ్రమ చెయ్యవలసి ఉంటుంది. 
నిరంతరమూ నేర్చుకుంటూ,జీవితాన్ని పరిసరాలనూ వ్యక్తులనూ రకరకాల జాతకాలనూ పరిశీలిస్తూ,నియమ నిష్టలతో కూడిన జీవితాన్ని గడుపుతూ గర్వము అహంకారము లేని మనస్సు కలిగిన దైవభక్తులకే జ్యోతిష్యవిద్య యొక్క యదార్ధ స్వరూపం అవగతం అవుతుంది. 

ఈ విద్యను నిజంగా ఔపోసన పట్టాలి అనుకున్నవారు పైన సూచింపబడిన దిశగా ప్రయాణిస్తే సత్ఫలితాలు పొందగలుగుతారు.అలా కాకుండా అహంకారంతో ఏవో స్వల్ప ప్రయోజనాల కోసం ఈవిద్యను స్వార్ధానికి ఉపయోగిస్తే వారు ఒకరోజు కాకున్నా ఇంకొకరోజు ఇబ్బందుల పాలు కావడం తధ్యం.