త్యాగరాజ ఆరాధనోత్సవాలలో భాగంగా నిన్న మోహన్ సంతానం గారి సంగీత కచేరి జరిగింది. దానికి వయోలిన్ మీద సత్యనారాయణశర్మగారు (శ్రీకాకుళం),మృదంగంమీద బీవీ ఎస్ ప్రసాద్ గారు(విజయవాడ),ఘటంమీద భూసురపల్లి వెంకటేశ్వర్లుగారు(గుంటూరు) సహవాయిద్యాలు అందించారు.
మోహన్ గారు సంగీత కుటుంబంలో పుట్టిన భాగ్యశాలి.ఆయన తల్లి సరస్వతిగారు సార్ధక నామధేయురాలు.అమ్మమ్మ గారు మంచి వైణిక విద్వాంశురాలు.మామయ్యా అత్తయ్యలు సంగీత విద్వాంసులు.అలాంటి కుటుంబంలో పుట్టిన మోహన్ గారికి సంగీతం చిన్ననాటినుంచే అలవడటం వింతేముంటుంది? తన సంగీత ప్రతిభతో ఈయన చిన్న వయసులోనే అనేక పురస్కారాలు అందుకున్నారు.ఆయన వెబ్ సైట్ ఇక్కడ చూడవచ్చు
http://www.mohansanthanam.com
http://www.mohansanthanam.com
మేము వెళ్లేసరికి 'ఎందఱో మహానుభావులు'అంటూ తన్మయత్వాన్ని కలిగించే మధురమైన త్యాగరాజకృతి సాగుతోంది. ఎన్నిసార్లు విన్నా ప్రతిసారీ కొత్తగా ఉండే 'ఆ కృతిని' వింటూ శ్రీరాముని 'ఆకృతిని' ధ్యానిస్తూ మౌనంగా కూచుండిపోయాను.
దాని తర్వాత కల్యాణిరాగంలో 'నిధి చాల సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా నిజముగా బల్కు మనసా' అంటూ ఆనందబాష్పాలు రప్పించే కీర్తనాలాపన మొదలైంది. ఈ కీర్తనలో చరణం నాకు చాలా ఇష్టమైన సాహిత్యాన్ని కలిగి ఉన్నది.ఎన్ని సార్లు విన్నా ఈ చరణం ఎంతో ఆనందాన్ని మళ్ళీ మళ్ళీ కలిగిస్తుంది.
దమశమమను గంగాస్నానము సుఖమా
కర్దమ దుర్విషయ కూపస్నానము సుఖమా
మమత బంధనయుత నరస్తుతి సుఖమా
సుమతి త్యాగరాజ నుతుని కీర్తన సుఖమా
రాజాస్థానంలో ఉద్యోగంలో చేరమని ధనము,మణి మాణిక్యములతో కూడిన ఆహ్వానం తనకు అందినపుడు త్యాగయ్య ఆలోచనాపరుడై -- "ఓ మనసా ! నిజాన్ని బలుకు. సాధన సంపత్తియైన శమదమములనే గంగలో స్నానము సుఖమునిస్తుందా?లేక చెడువిషయములనే బావిలో స్నానం సుఖానిస్తుందా?మమత అనే బంధంలో చిక్కుకున్న రాజును కీర్తించడం సుఖమా?లేక సుమతి గల్గిన త్యాగరాజుచే కీర్తించబడే భగవంతుని కీర్తన సుఖమా? నిజంగా చెప్పు?" అంటూ తన మనస్సుని ప్రశ్నించుకుని రాజాహ్వానాన్ని తిరస్కరించి భిక్షాటనతో కూడిన జీవనాన్ని ఎంచుకున్న ఘట్టం కళ్ళముందు మెదిలి మనస్సు ద్రవిస్తుంది.
ఆ తదుపరి 'మాళవికా' రాగంలో 'నెనరుంచినాను అన్నిటికి నీదాసుడను నేను, నీదుపై నెనరుంచినాను' అంటూ సరిగమల సంగీత ప్రస్తారంలో ఓలలాడించే కీర్తనను పాడి ఆనందాన్ని కలిగించారు.
ఆ తర్వాత శ్రోతలలో ఒకరి విన్నపం మేరకు శంకరాభరణ రాగంలో 'వరలీల గానలోల సురపాల సుగుణజాల భరితనీల గళ హృదయాలయ శృతిమూల సుకరుణాలవాల పాలయాశు మాం' అంటూ పాశ్చాత్య రాగ పోకడలలో ఉండే రాగంలో సంస్కృతకీర్తనను ఆలపించి త్యాగరాజస్వామికి పాశ్చాత్య సంగీతంతో ఉన్న పరిచయాన్ని ప్రస్తావించారు.శంకరాభరణరాగం ఉన్నత ప్రస్తారంలో పాశ్చాత్యసంగీతానికి దగ్గరగా ఉంటుంది.
వయోలిన్ సత్యనారాయణ శర్మగారి చేతిలో అద్భుతంగా పలికింది. గాయకుని ప్రజ్ఞకు పోటాపోటీగా వయోలిన్ మీద కీర్తనలను స్వరాలను పలికించిన తీరు శ్రోతలను ముగ్దులను చేసింది.చప్పట్ల వర్షాన్ని కురిపించింది. ప్రసాద్ గారికి జ్వరం ఉన్నదట. అయినప్పటికీ విజయవాడ నుంచి వచ్చి తన మృదంగధ్వనులతో సభికులను అలరించిన తీరు చాలా బాగుంది. ఇక ఘటం వాయించిన వెంకటేశ్వర్లు గారు గుంటూరు సంగీత ప్రియులకు సుపరిచితులే.ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
అద్భుతమైన కచ్చేరిని ఇచ్చిన మోహన్ గారిని ఆశీర్వదిస్తూ (నాకంటే వయసులో చిన్నవాడు గనుక), ఆయనలో కొలువై ఉన్న సరస్వతీమాతకు మానసికంగా ప్రణామం అర్పిస్తూ సెలవు తీసుకున్నాను.