ఏప్రియల్ 10 డా|| హానిమన్ పుట్టినరోజు.ఆ సందర్భంగా ఈ మధ్యన నేను చేసిన ఒక కేస్ వివరాలు చూద్దాం.
పేషంట్ వయసు: 40+
సమస్య: నెలల తరబడి విడువని దగ్గు.
డాక్టర్లకు చూపిస్తే ముందుగా కొండనాలిక పరీక్షచేసి జారలేదు బాగానే ఉంది అని చెప్పారు. మళ్ళీ యధావిధిగా పేషంట్ చెబుతున్న వివరాలు ఏమాత్రం వినకుండా వారికి తోచిన క్లినికల్ టెస్ట్ లు వారుచేసి లంగ్స్ క్లియర్ గా ఉన్నాయి అని చెప్పారు. మరి దగ్గు ఎందుకు తగ్గడం లేదు? అనడిగితే చూద్దాం అని కొన్ని మందులు రాసి వాడమన్నారు.అవి వాడినా ఏమీ ఉపయోగం కలగలేదు.దగ్గు ఇంకా ఎక్కువై గొంతు బొంగురు పోయింది.అప్పుడు డాక్టర్ గారికి బల్బ్ వెలిగి ఇది వాయిస్ బాక్స్ ప్రోబ్లం లా ఉంది కనుక ఈఎంటీ స్పెషలిస్ట్ కి చూపించండి.అని చెప్పారు.
అయ్యా దగ్గీదగ్గీ పేషంటు గొంతు బొంగురుపోయింది కాని ఇది ప్రాధమికంగా వాయిస్ బాక్స్ సమస్యలా లేదు,ENT డాక్టర్ అవసరం లేదు అని పేషంట్ పక్కన ఉన్నవారు చెప్పినా డాక్టర్ గారికి అర్ధంకావడం లేదు. చివరికి డాక్టర్ గారికి ఇంకో ఆలోచన వచ్చింది.పేషంట్ ను కొద్దిసేపు బయట కూచోమని చెప్పి బంధువులతో ఇలా చెప్పాడు.
'మీ పేషంట్ కు ఏ రోగమూ లేదు.ఎందుకంటే మా టెస్ట్ లలో అంతా నార్మల్ అని వస్తున్నది.ఇదంతా నటన అని నా అనుమానం.కొందరికి హిస్టీరియా ఉంటుంది.వాళ్ళు లేని సమస్యలను కూడా ఉన్నట్లు ఊహించుకుని ఇలా నటిస్తుంటారు.కనుక మీ పేషంట్ ఊరకే నటిస్తున్నాడు.నిజంగా దగ్గులేదు ఏమీలేదు.అందుకని కొన్నాళ్ళు మత్తుమందులు (tranquilizers) ఇద్దాం. అప్పుడు ఆ మత్తులో పడి హిస్టీరియా తగ్గిపోతే దగ్గు కూడా తగ్గిపోతుంది."
ఈ సలహా బంధువులకు నచ్చలేదు.నిక్షేపంగా ఉన్న మనిషికి హిస్టీరియా అంటాడేమిటి ఈ డాక్టర్ కే పిచ్చిలా ఉంది.ఇక ఈయన ట్రీట్మెంట్ కొనసాగిస్తే ఇంకా రోగం ముదిరేలా ఉంది దేవుడా అని ఆయనకు ఒక దండం పెట్టి బయటకు వచ్చారు. ఈ లోపల పేషంట్ కి కూడా విసుగు వచ్చి ఇక నావల్ల కాదు.ఈ హింస నేను భరించలేను.అని హోమియో విధానానికి షిఫ్ట్ అయ్యారు.
కేస్ నేను టేకప్ చేసేసరికి పరిస్తితి ఇలా ఉంది.
- లంగ్స్ నార్మల్ గా ఉన్నాయి.వీజింగ్స్ విజిల్స్ లేవు.
- దగ్గు ఊపిరితిత్తులలోనుంచి కాకుండా పొట్టలోనుంచి వస్తున్నట్లు ఉన్నది.(Sympathetic stomach cough).
- ఏదైనా తిన్న తర్వాత దగ్గు ఎక్కువ అవుతుంది.కడుపు నిండుగా తింటే దగ్గు మొదలై ఆగకుండా వచ్చి వచ్చి తిన్నదంతా వాంతి అయ్యేవరకూ అలా వస్తూనే ఉంటుంది.
- వాంతి అయి తిన్నదంతా పడిపోయిన తర్వాత దగ్గు ఆగిపోతుంది.వాంతి ఒక్కొక్కసారి పుల్లగా ఒక్కొక్కసారి చేదుగా ఉంటుంది.
- రాత్రి పూట తిని నడుం వాల్చిన తర్వాత దగ్గు విపరీతంగా వస్తుంది.మళ్ళీ వాంతి అయ్యే వరకూ అలా వస్తూనే ఉంటుంది.రాత్రంతా దగ్గుతో నిద్ర ఉండదు.(striking and peculiar symptom)
- దగ్గు ఖళ్ళు ఖళ్ళుమని లోతుగా(deep cough) వస్తుంది.
- పేషంట్ కి చలిగాలి పడదు.ఎండలో కూచుంటే హాయిగా ఉంటుంది.
- స్వతహాగా చల్లని నీళ్ళు ఐస్ క్రీమ్స్ ఇష్టం.కానీ ఇప్పుడు మాత్రం వేడిగా ఏదైనా తాగితే హాయిగా ఉంటుంది.
- దాదాపు నెల నుంచీ ఆగని దగ్గుతో పక్కలు డొక్కలు అన్నీ నొప్పిగా ఉన్నాయి.దగ్గినప్పుడు నొప్పి బాగా ఎక్కువ అవుతుంది.
లక్షణాలన్నీ పరిశీలించి రిపర్టరైజ్ చెయ్యగా 'నక్స్ వామికా' ఇండికేట్ అయింది.ఆ రోజు రాత్రి దగ్గు వచ్చినపుడు రెండు మాత్రలు 1M పొటేన్సీలో వెయ్యమని చెప్పాను.వేసిన రెండు నిమిషాలకే దగ్గు మాయం అయ్యి పేషంట్ గాఢ నిద్రలోకి వెళ్ళడం జరిగింది.రాత్రంతా మళ్ళీ దగ్గు రాలేదు.
24 గంటలు గడిచినా మళ్ళీ దగ్గు రాలేదు.మర్నాడు భోజనం చేసినా కూడా దగ్గు లేదు.వాంతి రాలేదు.కాని రాత్రి భోజనం చేసి పడుకోగానే మళ్ళీ దగ్గు మొదలైంది.అయితే దగ్గులో మునుపటి తీవ్రత లేదు.లోతునుంచి వస్తున్న శబ్దం పోయి పైపైన వస్తున్నట్లుగా ఉన్నది.మళ్ళీ మందు రిపీట్ చెయ్యమని చెప్పాను.ఈ సారి కూడా మందు పడగానే దగ్గు ఆగిపోయింది.రాత్రంతా నిద్ర హాయిగా పట్టింది.
మూడవరోజు పగలూరాత్రీ దగ్గు రాలేదు.డొక్కలు నొప్పులన్నీ తగ్గిపోయాయి. నిద్ర బాగా పట్టింది.అదే విధంగా నాలుగో రోజూ ఆరో రోజూ మందు వాడవలసి వచ్చింది.అంటే వ్యాధితీవ్రత క్రమేణా తగ్గిపోతూ వచ్చింది.అదే విధంగా మందును కూడా అవసరం ఉన్నపుడే వెయ్యమని,లేకుంటే ఆపమనీ సూచించాను.
వారం తర్వాత దగ్గు ఎటుపోయిందో ఎలా మాయం అయిందో తెలీదు.పేషంట్ అన్ని విధాలుగా కోలుకోవడం జరిగింది.ప్రస్తుతం ఇది జరిగి దాదాపు రెండు నెలలు దాటింది.ఇంతవరకూ మళ్ళీ దగ్గు రాలేదు.ఆహారం చక్కగా జీర్ణం అవుతున్నది.నిద్ర బాగా పడుతున్నది. Patient is cured.
ఇదీ హోమియోపతి చికిత్స యొక్క అద్భుతం!! సింగిల్ రేమేడీతో అన్ని సమస్యలూ ఏ సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా నయం అయ్యాయి.అంతకు ముందు టెస్ట్ లకు దాదాపు అయిదారువేలు అయ్యాయి.కాని ఇక్కడ టెస్ట్ లూ చెయ్యలేదు.ఇరవై రకాల మందులూ వాడలేదు.రోగికి అయిన మందు ఖర్చు ఇరవై రూపాయలు మాత్రమే.
ఇక ఘనత వహించిన మన ఇండియా అల్లోపతీ వైద్యుల డొల్ల ట్రీట్మెంట్ గురించి కొంత చెప్పుకుందాం.
అసలు రోగి ఏమి చెబుతున్నాడో వాళ్ళు సరిగా వినిపించుకోరు.వారి దృష్టి అంతా సాయంత్రానికి మనం ఎంత సంపాదించబోతున్నాం అని డబ్బు మీదే ఉంటుంది కాని అయ్యో పాపం పేషంట్ ఎంత బాధపడుతున్నాడో మనం ఇతనికి ఎలాగైనా సాయం చెయ్యాలి ఈ బాధను నయం చెయ్యాలి అన్న మానవతాదృష్టి వారికి ఉండదు. పోనీ సంపాదిస్తే సంపాదించారు.డబ్బు మీద ప్రతివారికీ ఆశ ఉంటుంది. కాని సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వవచ్చు కదా? అదీ చెయ్యరు.రోగం ఒకటైతే ట్రీట్మెంట్ వేరొకటి.ఈలోపు పేషంట్ కి అదృష్టం బాగుంటే తగ్గుతుంది.లేకుంటే లేదు.ఒకవేళ అటూ ఇటూ అయినా ఎకౌంటబిలిటీ లేదు.ఇదీ మన ఇండియా డాక్టర్ల వరస.
వీళ్ళలో చాలామంది 35 మార్కులతో పాసైన డాక్టర్లే.వారిదగ్గర సబ్జేక్టూ ఉండదు.చిత్తశుద్దీ ఉండదు.ఇక పోతే బాగా చదువుకుని మంచి మార్కులతో పాసైన డాక్టర్లకు దురాశ ఎక్కువ. సాయంత్రానికి లక్షలు కళ్ళజూడాలన్న తలంపు తప్ప వారికి ఇంకోధ్యాస ఉండదు.మన దేశంలో వైద్యం మీద సరియైన చట్ట నియంత్రణా లేదు.సరియైన కంట్రోలూ లేదు.అందుకని ఎవరి ఇష్టం వచ్చిన ఇష్టారాజ్య ట్రీట్మెంట్ వారు ఇవ్వవచ్చు.అడిగేవాడూ లేడు.అడిగినా జవాబు చెప్పేవాడూ ఉండడు.
నేను అనేక వైద్య విధానాలను చాలా ఏళ్ళు చాలా క్లోస్ గా పరిశీలించాను. ఆ అనుభవంతో ఒక్క విషయం చెప్పగలను.హోమియోపతిని మించిన వైద్య విధానం లేనే లేదు. అతి సింపుల్ గా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా,రోగాన్ని మూలం నుంఛి కూకటి వేళ్ళతో నయం చేసేది ఇదొక్కటే అని నేను అనుభవంతో చెప్పగలను.దీనిని రుజువు చేసే అనేక కేస్ లు నా కేస్ ఫైల్స్ నుంచి ఉదాహరణలుగా ఇవ్వగలను.
10-4-2013 న డా||హానిమాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని మరొక్కసారి స్మరిస్తూ ఈ కేస్ లో విజయాన్ని ఆయనకే అంకితం చేస్తున్నాను.