నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

13, ఏప్రిల్ 2013, శనివారం

అవసరానికి పనికి రాని శక్తులెందుకు?

అనగనగా ఒక స్వామిగారున్నారు.ఆయన్ను చూస్తె జనానికి భక్తికి తోడు భయమూ ఎక్కువే.ఎందుకంటే ఆయనకు తాంత్రిక విద్యలు తెలుసని అందరూ గుసగుసలాడుకుంటారు. ఆయన అప్పుడప్పుడూ అమెరికా కూడా వెళ్లి అక్కడి భక్తులను కరుణించి వస్తూంటారు.ఆయన ఆశ్రమంలో రకరకాల పనులు కావడానికి ఎండు మిరపకాయల హోమాలూ,ఆవాల హోమాలూ, బొగ్గుల హోమాలూ అర్ధరాత్రిపూట జోరుగా సాగుతూ ఉంటాయి.ఆయనకు మంత్రుల అధికారుల అండదండలు కూడా బాగా ఉన్నాయని చెప్పుకుంటారు.

ఆయన తంత్రవిద్యలో అఖండుడని ఆయన భక్తబృందం ప్రచారం చేస్తూ ఉంటుంది.ఆయన శిష్యులందరూ అమావాశ్యకీ పౌర్ణమికీ రాత్రిపూట మేలుకుని డాబాల మీద కెక్కి ఆరుబయట హోమాలు చేస్తూ ఉంటారు.వాళ్ళలో కొందరు నగ్నంగా కూడా మారి ఆయా హోమాలు చేస్తూ ఉంటారట.ఆయనకు ఆయన శిష్యులకు అతీంద్రియ శక్తులున్నాయనీ వాళ్ళు పిలిస్తే అమ్మవారు పలుకుతుందనీ చెప్పుకుంటూ ఉంటారు. ఆయనకున్న శక్తుల గురించి రకరకాల కధలు ఉన్నవీ లేనివీ కల్పించి ఆయా శిష్యులు ప్రచారాలు చేస్తూ ఉంటారు.పిచ్చి జనం నమ్ముతూ ఉంటారు.

ఆ మధ్యన ఆకాశంలో దేవతలూ రాక్షసులూ కొట్టుకుంటూ ఉంటె ఆ యుద్ధంలో తిరుపతి వెంకటేశ్వరస్వామి శక్తి హీనుడై ఓడిపోతే అప్పుడు పిట్స్ బర్గ్ వెంకటేశ్వరస్వామి అమెరికా నుంచి ఎగురుకుంటూ వచ్చి ఆ యుద్ధంలో దేవతల పక్షాల పోరాడి రాక్షసులని చావా చితకగొట్టి చెవులు మూసి పంపించాడనీ ఈ సంఘటనకి తానె ప్రత్యక్షసాక్షిననీ ఆయన ఒక ఉపన్యాసంలో చెబుతుంటే సదరు శిష్యులు తన్మయత్వంలో పడి వింటూ ఆనందబాష్పాలు కార్చారు.అంతటితో ఆగకుండా ఆపకుండా చప్పట్లు కొట్టి ఆయన్ను ఉత్తేజపరిచారు.అదీ ఆ స్వామివారి మరియు వారి భక్తుల స్తితి.

కానీ సదరు స్వామిగారి దగ్గర ఒక మంచి అలవాటుంది.అడిగినవారికీ అడగనివారికీ దశమహావిద్యా మంత్రాలను పప్పుబెల్లాల వలె పంచి పెడుతూ ఉంటాడు.నా స్నేహితుడు ఒకాయన భార్యకు బ్రెస్ట్ కేన్సర్ వస్తే ఈ స్వామిగారు అతనికి ధూమవతీ మంత్రాన్ని ఉపదేశం చేసి 'దీనిని జపించు నీ భార్యకు తగ్గిపోతుంది' అని చెప్పారు.పాపం స్నేహితుడు ఆయన చెప్పినట్లే తూచా తప్పకుండా చేశాడు.కాని అతని భార్య మాత్రం కేన్సర్ కు యధావిధిగా బలి అయిపోయింది.మంత్రం పని చెయ్యలేదు.

ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, ఈ మధ్యనే వీళ్ళ గ్రూపులో ఒకాయన కొడుకు ఒక పరాయి దేశంలో ఉన్నట్టుండి కనపడకుండా మాయమయ్యాడు.ఆ తర్వాత పదిరోజులకు అతని శవం ఆ దేశపు పోలీసులకు దొరికింది.మరి ఈ పదిరోజులూ ఈ తాంత్రికస్వామివారూ ఆయన శిష్య బృందమూ హోమాలు చేసి ఆ కుర్రవాడి ఆచూకీ కనిపెట్టి ఉండవచ్చు కదా? పోనీ అమ్మవారితో డైరెక్ట్ గా మాట్లాడే శక్తి మాకుందని వీరంతా చెబుతూ ఉంటారు కదా.అలాంటప్పుడు అమ్మవారితో మాట్లాడి అతనికి జరుగబోతున్న ఆపదను నివారించవచ్చు కదా?దీనిలో ఏదీవారు చెయ్యలేక పోయారు.

పోనీ కర్మ బలీయం కనుక అతనికి అలా రాసిపెట్టి ఉందని,మేము తప్పించలేమనీ వీళ్ళు చెప్పవచ్చు. అంటే కర్మను తప్పించే శక్తి వీరికి లేదని ఒప్పుకున్నట్లేగా? అలాంటప్పుడు ఏవేవో శక్తులున్నాయని మాయమాటలు చెప్పి జనాన్ని మోసం చెయ్యడం ఎందుకు?నిజంగా శక్తులు ఉంటె పని చెయ్యవలసిన కష్టసమయంలో అవెందుకు పని చెయ్యలేదు?

పోనీ కర్మను తప్పించడం కష్టం అనేమాట నిజమే కాబట్టి మనమూ ఒప్పుకుందాం. కనీసం ఈ పదిరోజులలో ఆ అబ్బాయికి ఏమైందో అతని శవం ఎక్కడ పడి ఉందొ అదైనా వీళ్ళ శక్తులు (అవి వీళ్ళకు నిజంగా ఉంటె) ఉపయోగించి తెలుసుకుని పోలీసులకో తల్లిదండ్రులకో చెప్పవచ్చు కదా? వీరికి వెతుకులాట తప్పేది కదా? లోకాన్ని మొత్తం ఉద్దరించమని నేను చెప్పడం లేదు.అది సాధ్యం కాదని నాకూ తెలుసు.కనీసం వాళ్లకు బాగా తెలిసిన వారికి వచ్చిన ఆపదను కూడా నివారించలేని,కనీసం అతని శవం ఎక్కడ పడి ఉందో కూడా చెప్పలేని వీళ్ళు తమకు ఏవో శక్తులున్నాయని ప్రచారాలు చేసుకోవడం ఆత్మవంచన మాత్రమె కాదు.ప్రజా వంచన కూడా. వీరి వెంటపడే భక్తులు కూడా స్వార్ధంతో తమ పనులు కావడానికి వీళ్ళ వెంట తిరుగుతూ ఉండే చవకబారు భక్తులే.వీళ్ళలో ఎవరికీ నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలీదు.దాని అవసరం కూడా వారికి లేదు.

భక్తుల పనులు కావడం కోసం స్వామి చుట్టూ తిరుగుతారు.స్వామి కూడా అంతే.తన పనులకోసం భక్తులను వాడుకుంటాడు.ఇదొక సింబియాటిక్ రిలేషన్.ఇద్దరికీ దేవుడు అక్కర్లేదు.ఆధ్యాత్మికతా అక్కర్లేదు.అంతా నాటకం మోసం.

ఇంకొక గురువు గారున్నారు.ఆయన లోకుల సమస్యలన్నీ తీరుస్తారని ప్రచారంలో ఉంది.అలా పనులైన భక్తులూ శిష్యులూ ఎన్నో కధలను చెబుతూ కూడా ఉంటారు.సీసా దగ్గర్నుంచి వీసా వరకూ ఏ పని కావాలన్నా ఆయన ఒక్క చూపు చూస్తె అయిపోతుందిట.కాని ఆ గురువుగారి ఇంట్లోనే తీరని సమస్యలు కొన్నున్నాయి.వాటి గురించి ఎవరైనా అడిగితే మాత్రం ఆయన గౌరవప్రదమైన మౌనం వహిస్తారు.లోకుల విషయంలో పనిచేసే ఆయన శక్తులు తన కుటుంబ సభ్యుల విషయంలో ఎందుకో మరి పనిచెయ్యవు.

ఆపరేషన్ దియేటర్ లో కూడా ప్రత్యక్షమై డాక్టర్లను పక్కకు తప్పుకోమని భక్తులకు తానె ఆపరేషన్ చేసారని ఒక స్వామి గురించి చెప్పుకునేవారు.ఆయనగారు ఒకరోజున తన విదేశీ భక్తులిచ్చిన హెయిర్ బ్లోయర్ తన గదిలో కూచుని వాడుకుంటూ తన జుట్టును రింగులు తిప్పుకునే పనిలో ఉండగా,పొరపాటున కరెంటు పోయి అది ఆగిపోయింది.ఏమైందా అని దాని గొట్టాన్ని కంటి దగ్గర పెట్టుకుని ఆయన దాంట్లోకి చూస్తూ ఉండగా అకస్మాత్తుగా కరెంట్ రావడమూ,బ్లోయర్ పనిచెయ్యడం మొదలుపెట్టి వేడిగాలిని ఆయన కంట్లోకి స్పీడుగా చిమ్మడమూ అది వాఛి ఎర్రబడి పోవడమూ తత్ఫలితంగా స్వామివారి దర్శనాలు కొన్నాళ్ళు కేన్సిల్ కావడమూ,పాపం విదేశాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఆ రెండుమూడు రోజులు వేచి చూడవలసి రావడమూ చకచకా జరిగిపోయాయి.వేల మైళ్ళ దూరాన ఉన్న ఆపరేషన్ దియేటర్ లో ప్రత్యక్షమై తానె ఆపరేషన్ చెయ్యగల స్వామిగారికి హెయిర్ బ్లోయర్ తో పనేమిటి?భక్తులు బయట ఎండలో వెయిట్ చేస్తుండగా ఈయన తన గదిలో కూచుని జుట్టును రింగులు తిప్పుకునే ఖర్మేమిటి? జవాబులు లేవు.రావు.   

ఇంకో స్వామి గారున్నారు.ఆయన సంగీతంతో రోగాలు తగ్గిస్తానని ప్రచారం చేసుకుంటారు.ఏభై ఏళ్ళు దాటినా ఆయన జుట్టూ బవిరిగడ్డమూ నల్లగా నిగనిగలాడుతూ ఉండేవి.అదంతా ఆయన యోగశక్తి మహిమ అని అందరూ అనుకునేవారు.ఈయన గారు అగ్నిగుండంలో దిగి బయటకు వచ్చినా ఒక వెంట్రుక ముక్క కూడా కాలదని ప్రచారం చేసేవారు.అలాంటిది ఉన్నట్టుండి ఒక వారంలో అంతా తెల్లబడి పోయింది. అదేంటయ్యా అంటే 'స్వామి వారు రంగేసుకోవడం మానేశారు' అని ఒక శిష్యుడు నాకు లోపాయికారీగా తెలియజేశాడు.'పోనీ ఆ బృహత్తర బాధ్యతను మీ శిష్యులలో ఎవరైనా ఒకరు తీసుకుని ఆయనకు రెగ్యులర్గా రంగు వెయ్యవచ్చు కదా' అని అడిగాను.'ఛీ బాగుండదు.గోడకు సున్నం వేసినట్లు గురువుగారి జుట్టుకి గడ్డానికి మేము రంగేస్తే చండాలంగా ఉంటుంది' అని అతను చెప్పాడు.పరవాలేదు కొంచం సెన్స్ ఇతనిలో ఇంకా బతికి ఉంది అనుకున్నాను.

కేన్సర్ వంటి ఇతరుల రోగాలు సంఘీతంతో తగ్గించే ఈ స్వామివారు తన జుట్టు తెల్లబడకుండా అదే సంఘీతాన్ని ప్రయోగించుకోలేడా? అని ఎవరికైనా సందేహం వస్తే ఆ వ్యక్తి హిందూమత ద్రోహి కింద లెక్క. అసలు స్వామివారి జుట్టు నల్లగా ఉంటె ఏమిటి తెల్లగా ఉంటె ఏమిటి?ఆయనేమన్నా తెలుగుసినిమా హీరోనా తొంభై ఏళ్ళోచ్చినా జుట్టు నెరవకుండా చర్మం ముడతలు రాకుండా ఉండటానికి? అయినా స్వామివారికి గ్లామర్ మీద మోజేమిటి? అలాంటి వ్యక్తి 'స్వామి'అనే పదానికి అర్హుడేనా? అని ఎవరైనా అడిగితే అతన్ని రాళ్ళతో కొట్టినా కొట్టి చంపుతారు పిచ్చి తలకెక్కిన భక్తశిఖామణులు. 

సమయానికి పనికిరాని శక్తులు ఎందుకు? అనేదే నా ప్రశ్న. ఇలాంటి స్వాములను నమ్మడం ఎంతవరకు కరెక్ట్ అనేదే నా సందేహం.అసలు ఈ శకులు వీరికి ఉన్నాయా? ఉంటె అవసర సమయంలో ఎందుకు పనిచెయ్యవు?నిజంగా అవసరం అయినప్పుడు వీళ్ళు ఎందుకు ముఖం చాటేస్తారు?అంటే వీళ్ళు చెప్పేవన్నీ ఉత్తఉపన్యాసాలూ కబుర్లూ అబద్దాలేనా?ఈ ప్రశ్నలకు జవాబులు లేవనీ రావనీ కూడా నాకు తెలుసు.అన్నీ తెలిసినా ప్రశ్నలు అడగటం నా బలహీనత.అన్నీ తెలిసి కూడా జనాన్ని మోసగించడం ఇలాంటి స్వాముల బలహీనత.దురాశకు లోనై మోసపోవడం శిష్యుల బలహీనత.

ఏం చేస్తాం?ఎవరి బలహీనతలు వారివి.లోకమంతా పరస్పర బలహీనతల మీద ఆధారపడి నడుస్తున్నది.ఆశపోతు జనానికి దురాశ నాయకులు, స్వార్ధ భక్తులకు పరమస్వార్ధ స్వామీజీలు,దొంగ శిష్యులకు దొంగ గురువులు ఎవరికి తగిన వాళ్ళు వారికి దొరుకుతారు.లోకం తీరు ఎన్నటికీ మారదన్నది మాత్రం పరమసత్యం.