సూర్య కిరణ హస్తాలను
ప్రేమమీర అందుకొనుచు
సువర్లోక సీమలకై
ఎగసిపోవు అగ్నినేను
నింగిరేని నిచ్చెనలను
అందిపుచ్చుకొని ఎంతయు
వెలుగులోకమును చేరెడి
విద్యనెరుగు వేత్త నేను
విశ్వ భ్రమణము చేయుచు
చుట్టపు చూపుగ ధరణికి
చూచిపోవగా వచ్చిన
చావులేని వెలుగు నేను
చీకటి సీమల మీరుచు
నిత్యము వెలిగెడి లోకపు
పచ్చని పచ్చిక బయళ్ళ
విశ్రమించువాడ నేను
నక్షత్రపు వీధులందు
ఇష్టము మీరగ తిరుగుచు
లోకములెల్లను జుట్టెడి
బంధరహిత యాత్మ నేను
ప్రాపంచిక బాధలందు
మగ్గిపోవు మనుజులగని
వారి కర్మవలయమెంచి
నవ్వుకొనెడి ద్రష్ట నేను
ఇంద్రియాల వలను దాటి
ఇదే యనుచు చెప్పలేని
ఆనందాంబుధి నొక్కటి
మునుగబోవు మౌని నేను
నిశ్చలంపు మౌనమందు
హృదయసీమ లోతులలో
నిశిరాత్రిని వినగ వచ్చు
మధుర వేణునాదమేను
లోకమెల్ల నిదురించగ
కళ్ళు తెరచి విస్తరించి
జగతినెల్ల కమ్ముకొనెడి
నీరవ నిశ్శబ్దమేను
యోగియొక్క నేత్రాలను
నిలిచి నిండి వెలుగునట్టి
లోకాతీతపు జ్యోతుల
చల్లని తేజమ్ము నేను
మారువేషమున లోకపు
వీధులందు తిరిగి చూచి
వేసటతో తిరిగిపోవు
విస్మృత చారుడను నేను
మహామౌన సంద్రమందు
అలవిగాని లోతులలో
సదా మునిగి యుండునట్టి
సద్రూపపు శిలను నేను
చావులోన మునిగియున్న
అజ్ఞానపు లోకమందు
మరణపు టాజ్ఞల మీరుచు
మత్తు విడిన మనిషి నేను
లోకపు నాటక రంగపు
లోతుల నంతయు తెలియుచు
కర్మల మర్మము నెరిగిన
దీర్ఘదర్శి నొకడ నేను
నానా జన్మల మాటున
నాటకాల నటియించుచు
నన్ను నేను మరువనట్టి
నిత్యుండగు నటుడ నేను
ప్రకృతి శక్తుల రూపున
పరిడవిల్లుచును బాగుగ
లోకమంతటిని నడపెడి
ముదిమి లేని సత్వమేను
వేరొక్కటి కానరాని
అవ్యక్తపు స్తితిని చేరు
ఉన్మత్తపు ఋషిని నేను
నేను అనెడి భావమెల్ల
నిర్మూలనమవ్వుటకై
నిరంతరము యత్నించెడి
నిజమగు నొక నేను నేను