“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

27, ఏప్రిల్ 2013, శనివారం

నీవు - నేను

నా కళ్ళలోకి తొంగితొంగి చూడకు 
అక్కడి శూన్యపు లోతులను 
నీవు తట్టుకోలేవు 

నా ఆలోచనలను చదవాలని చూడకు  
అక్కడేమీ లేకుండటం చూచి  
నీవు భయపడతావు 

నా హృదయాన్ని తాకాలని చూడకు 
అక్కడున్న ప్రేమవెల్లువను 
నీవు భరించలేవు

నన్ను ద్వేషించాలని ప్రయత్నించకు 
ఆ ప్రయత్నంలో మునిగి  
నీ అస్తిత్వాన్ని కోల్పోతావు  

నన్నర్ధం చేసుకోవాలనుకోకు  
నీవు నేనుగా మారనిదే 
నన్ను నన్నుగా గ్రహించలేవు

నన్ననుసరించాలనుకోకు 
జారిపోయే శూన్యాన్ని 
నీ చేతితో పట్టుకోలేవు   

అమృతాన్నీ కాలకూట విషాన్నీ 
ఒకేసారి రుచి చూడగలిగితే 
నేనెవరో తెలుసుకోగలవు

అమితసుఖాన్నీ అంతులేని బాధనీ
నీ గుండెలో నింపుకోగలిగితే   
నా స్థాయిని నీవందుకోగలవు  

నాలో కరిగి నీవు మాయమైతేనే 
నన్ను నీవు చూడగలవు
నను చేరే ప్రయత్నం మానితేనే 
నేనెవరో నీవు గ్రహించగలవు 

నీవూహించే ఊహలన్నీ నేనే 
ఆ ఊహల వెనుక శూన్యమూ నేనే 
నాగురించి నీ ఊహలన్నీ తప్పులే
నా ఆనంద మందిరంలో అన్నీ నిట్టూర్పులే 
ఎందుకంటే నాలో అన్నీ ఉన్నా 
మళ్ళీ నాలో ఏవీ లేవు

నీ ఊహలకే ఆధారాన్ని నేను
నీ ఊహకందని అగాధాన్ని నేను
నీ ఆలోచనల వెనుక నిలబడి 
నిను నిత్యం గమనిస్తున్న 
నీ నిశ్శబ్ద ఆత్మను నేను 

చావు పుట్టుకల కెరటాలపై 
నిను  తేలుస్తున్న తెప్పను నేను 
నన్ను మరచి నీవు దూరమేగినా 
నిన్ను వదలని నీడను నేను

మండే వేసవి ఎండల్ల్లో 
నిను తాకే చల్లని గాలిని నేను 
నిను కాల్చే తీరని దుఃఖంలో 
ఓదార్చే సుతిమెత్తని స్పర్శను నేను 

ఏం కావాలో తెలియక నిత్యం 
నీవెప్పుడూ వెతికే సత్యం నేను 
భయపడుతూ నీవెపుడూ కోల్పోయే
నీలోపలి అంతిమ గమ్యం నేను.....