నేలకట్లు తెంచుకోని
నీలిమబ్బు అలలు దాటి
శూన్యసముద్రం దిశగా
మనసు ఎగసిపోయింది
కుళ్ళు కంపు కొట్టుచున్న
మానవ బంధాలు విడచి
శుద్ధజలపు గంగోత్రిని
జలకమాడ సాగింది
మమతలన్ని మాయలనెడి
మహాసత్యమును దెలిసి
మాయాతీతపు స్వేచ్చను
మనసు వెదకి చూచింది
నానామోహ భ్రమలను
నగుబాట్లను నిలువరించు
సత్యాయుధ ఖడ్గమొకటి
మనసుకంది వచ్చింది
తనను పట్టి బంధించిన
మురికినంత శుద్ధి చేయు
తన్మయ సరోవరాన
మనసు మునకలేసింది
అంతులేని శూన్యసీమ
నిర్నిమేష మహాంబుధిని
నిర్భీతిని మనసు మునిగి
నిష్కళగా నిలిచింది
వాదములన్నియు వదలుచు
నాదాశ్వము నధివసించి
నాదబిందు కళల దాటి
నభోముద్ర నంటింది
అంతయు నాదనుట నుండి
దంతయు నేననుట వరకు
అన్ని భూమికల తాకుచు
అణువు తరచి చూచింది
అతిశైత్యపు హిమసీమల
విజనాత్మక వీధులందు
ఆశలన్నిటిని వదలిన
అగ్ని ఒకటి వెదికింది
వెలుగులయందలి చీకటి
చీకటి యందలి వెలుగుల
వివరము నెరిగిన వెలుగున
వింతనవ్వు విరిసింది
క్షుద్రజగతి కందనట్టి
తేజోరాశుల పంచన
కట్టుబాట్ల నధిగమించి
కన్నెమనసు మురిసింది
నిత్యరోదనల మధ్యన
నిశ్చింతగ నిలిచి వెలిగి
చిరునవ్వులు చిందించెడి
చైత్యమొకటి వెలసింది....