తనలో తానుండు వరకు
తనకున్నతి రాబోదోయ్
తనను తాను దాటినపుడె
తత్వమొంట బట్టేనోయ్
వేషధారులందరికి
వెంబడించి చెబుతున్నా
తత్వమెరుగ వలెనంటే
తనను తాను దాటిపోయి
తటిల్లతల లోకంలో
తళతళమని మెరవాలోయ్
వీధులలో తిరుగువాడు
ఇంటిలోకి చేరలేడు
ఇంటిలోనె యుండువాడు
వీధి సొగసు కానలేడు
దాగియున్న గుట్టునంత
విప్పి చెప్పబోతున్నా
ఇంటా బయటా నెగ్గిన
ఇష్టగురుని దీక్షబూని
ఇతరములన్నియు వద్దని
ఇలను చెలగి రావలెనోయ్
గిరుల దాటి మీరకుంటె
వివరమెట్లు తెలిసేనోయ్
గిరులలోనె గింజుకుంటె
నరుల బ్రతుకు కల్లేనోయ్
సత్యమైన మాటనొకటి
సవ్యముగా చెబుతున్నా
కట్లు తెంచుకోకపోతె
గుట్లు తెలియు విధమేదోయ్
కట్టుబాట్ల దాటకుంటె
కష్టమెపుడు తీరేనోయ్
పర్వతాగ్ర సీమలందు
పసిడివెలుగు లున్నాయోయ్
లోయలోని చీకటిలో
లోకమంత నిలిచిందోయ్
ఒళ్ళు మరచి వినవలసిన
మాటనొకటి చెబుతున్నా
లోయలలో వెలుగు నింపి
కొమ్మున చీకట్ల జేర్చి
రేయింబవళ్ళ రెంటిని
కొమ్మున చీకట్ల జేర్చి
రేయింబవళ్ళ రెంటిని
నిలిచి నిగిడి చూడాలోయ్
సర్వమెరుగు దొరలమంచు
వెర్రివారు వదరేరోయ్
వివరమెరుగు వేత్తలెపుడు
వింతగానె మసలేరోయ్
లోకులకందని వెలుగును
లోన నింపబోతున్నా
తిక్కస్వామి
తరగతిలో
తిరుగులేని చదువు చదివి
వింతలోక వీధులలో
వెర్రినాట్యమాడాలోయ్
పిచ్చివారి
పెళ్ళివోలె
లోకమెల్ల నడచేనోయ్
మాయదారి
మసకలతో
మదిని
మబ్బు నిండేనోయ్
నీ
దారిని వదలకుండ
నడవమంటు
చెబుతున్నా
లోకుల
మాటలవింటే
లోతుల
పడిపోతావోయ్
వేకువ
జామున వెలిగెడి
వెలుగుల
దిశ నడవాలోయ్
వెర్రి గొర్రె మందలతో
లోకమంత నిండిందోయ్
గుడ్డివాళ్ళ గొడవలతో
చిక్కుముళ్ళు పెరిగేనోయ్
కళ్ళను తెరిపింపచేయు
నిజమునొకటి చెబుతున్నా
మొక్కుబళ్ళు తీర్చకుంటె
మోక్షమెట్లు దొరకేనోయ్
కుళ్ళును కడిగేయకుంటె
దీక్షలెట్లు గెలిచేవోయ్
ఆధ్యాత్మిక సీమలందు
ఆవులన్ని పులులేనోయ్
ఆత్రముగా నిన్నుబట్టి
అప్పడమును చేస్తాయోయ్
నిజమగు దారిని చూపెడి
నిక్కు నొకటి చెబుతున్నా
లోబయలుల చూపులన్ని
లోతుల మళ్లించాలోయ్
గుహలో చేతులనుంచుచు
గుట్టును సాధించాలోయ్
మెరమెచ్చుల నాటకాల
మరబొమ్మల నమ్మకోయ్
అరువిచ్చిన అంగళ్ళను
అప్పుబేర మెందుకోయ్
నిన్ను నీవు అంగడిలో
అమ్ముకొనగ వలదన్నా
బేరసార వ్యాపారపు
భ్రమలు వీడి మెలగాలోయ్
సారమైన గురునిబోధ
తెరలు తీసి తెలియాలోయ్
సంపదలను కోరుకుంటు
సంద్రాలను దాటినపుడు
సంప్రదాయ వాకిళ్ళను
నీవు దాటగలగాలోయ్
సత్యమొకటి చూపించగ
నీ ముంగిట నిలిచున్నా
నీలోపలి సంపదలను
నీవెప్పుడు వెదకాలోయ్
నీచేతిని నీవుబట్టి
నీలోనికి నడవాలోయ్
అందరు నావారనుచు
అరచి సొమ్మసిల్లేవోయ్
నీవారెవరూ లేరను
నిజమునెపుడు కంటావోయ్
వెర్రిభ్రమల వీడమంచు
వెయ్యిసార్లు చెబుతున్నా
నీ కాళ్ళను నీవు నరికి
నింగిలోని కెగరాలోయ్
నీ తలనే నీవు తరిగి
నిశ్చలముగ నిలవాలోయ్
నీవొచ్చిన పనిని మరచి
నిక్కు నీలుగెందులకోయ్
నీ ఇంటిని నీవు విడచి
టక్కుల మునకెందులకోయ్
కళ్ళు తెరచి నీ ఇంటికి
నిన్ను చేరమంటున్నా
నిన్ను నీవు ప్రేమించుచు
నీలోపలి కేగాలోయ్
నిన్ను దాటి నిన్ను చేరి
నిత్యుడగుచు నిలవాలోయ్