“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

24, మే 2013, శుక్రవారం

ఒకరికొకరు దొందూ దొందే

'మంచివాళ్లకి మంచివాళ్ళే దొరుకుతారు. ఏలినవారికి నేను దొరికాను' - అందిట ఒకామె అనవసరంగా తనను తిడుతున్న భర్తతో.

మన ప్రభుత్వాలను ప్రజలనూ చూస్తె నాకు పై సామెతే గుర్తుకొస్తుంది.అన్ని వనరులూ ఉన్న అన్నపూర్ణలాంటి దేశాన్ని ఎంత అధ్వాన్నంగా పరిపాలించవచ్చో, ఎన్ని రకాలుగా దాన్ని భ్రష్టు పట్టించవచ్చో నిరూపిస్తున్నారు నేటి పాలకులు.

ఇక ప్రజలు మాత్రం తీసిపోయారా? పాలకులను మించిన దొంగల్లాగా వీళ్ళూ తయారయ్యారు.ఎవడికీ కామన్ సెన్స్ ఉండదు.కనీసం సివిక్ సెన్స్ కూడా ఉండదు.ఆరోజు పబ్బం ఆరోజుకి గడవటమే మన ప్రజల లక్ష్యం.ఆ క్షణానికి పక్కవాణ్ని వెనక్కి నెట్టేసి తాను ముందుకు పోవడమే గొప్ప అని ప్రతివాడూ అనుకుంటాడు.కనుకనే ప్రజలూ పాలకులూ దోపిడీలో ఒకరికొకరు సరిపోయారు.

'వడదెబ్బ తగిలి వందమంది మృతి.రోడ్డు ప్రమాదంలో ఇరవై మంది హరీ.అగ్నిప్రమాదంలో అరవై మంది మృతి.కట్టడం కూలి వందల్లో చచ్చిన జనం.' పొద్దున్న లేస్తే ఎక్కడ చూచినా ఇవే వార్తలు.

మనకు ప్రతి ఎండాకాలమూ వడదెబ్బ తగిలి వందల్లో వేలల్లో జనం పిట్టల్లా పిచ్చుకల్లా చస్తూనే ఉంటారు. పొరపాటు. పిచ్చుకలను ఎప్పుడో నిర్మూలనం చేసేశాం కదా.కనుక వాటిని ఇప్పుడు మన మాటల్లోకి తేకూడదు.అలా జనం ప్రతి ఏడాదీ చస్తున్నా సరే, మనకు ముందు చూపు అనేది మాత్రం ఉండదు.వచ్చే ఏడాది గురించి ప్లానింగ్ అసలే ఉండదు.పోనీలే జనాభా తగ్గుతుంది అనుకుంటారో ఏమిటో అర్ధం కాదు.

చెట్లు పెంచితే చల్లదనం ఉంటుంది అని కొన్ని వందల ఏళ్ళ నించీ ఎంతోమంది మొత్తుకుంటూనే ఉన్నారు.కాని ఆ పని ఎవరూ చేస్తున్నట్లు కనిపించదు. ఎక్కడికక్కడ చెట్లను నరికేయ్యడమే మనకు నిత్యమూ కనిపించే సత్యం. 

ప్రకాశం జిల్లాలో మొన్నొక ఊరు చూచాను. ఊరిమొత్తం మీద ఒక్కటంటే ఒక్క చెట్టు లేదు. చాలా విచిత్రం అనిపించింది. ఊరంతా భయంకరమైన వేడితో కాలిపోతున్నట్లు ఉన్నది. అయినా సరే,జనం అలాగే బతికేస్తున్నారు గాని చెట్లు పెంచుకుందాం అని ఒక్కరికీ తోచదు. మళ్ళీ రాత్రయ్యే సరికి అరుగులమీద చేరి ఎవడిని కదిలించినా డిల్లీ రాజకీయాలకు తక్కువ కాకుండా మాట్లాడతారు.సోనియా మనసులో ఏముందో చెబుతారు.మోడీ ప్రధానమంత్రి అవుతాడా కాడా చెప్పేస్తారు. కానీ ఎదురుగా తమను వేధిస్తున్న సమస్యమీద దృష్టి ఉండదు.ఆ బాధ్యత తమది కాదనీ,అది ఎవరో వచ్చి చెయ్యాల్సిన పని అనీ అనుకుంటారు.

వేసవిలో నీళ్ళు లేక అల్లాడటం అనేది కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్న చరిత్ర. ఈ సమస్యను కూడా ఎలా పరిష్కరించాలో ఎవ్వరికీ పట్టదు. ఈనాటికీ వేసవిలో మైళ్ళకు మైళ్ళు నడిచిపోయి నీళ్ళ బిందెలు మోసుకోచ్చుకునే ఊళ్లు ఎన్నో ఉన్నాయి.ఇంకుడు గుంటలు అనేవి ఏర్పాటు చేసుకుంటే వర్షాకాలంలో పడిన వర్షపునీరు భూమిలోకి ఇంకి భూగర్భజలాలు సమృద్ధిగా ఉంటాయి.దీనివల్ల వేసవిలో నీటి ఎద్దడి ఉండదు. దానికి తోడు నేలవేడి కూడా తగ్గుతుంది.అని ఎందఱో చెప్పారు. కాని ప్రజలు ఎవరూ వినరు.ఆ పని ఎవ్వరూ చెయ్యరు.

బౌద్ధంలో మైత్రీధ్యానం అని ఒకటుంది. అది చేసేవారికి శత్రువులంటే కూడా సౌమ్యభావం ఏర్పడుతుంది. కాని నేటి సమాజాన్ని చూస్తుంటే అలాంటి వారికి కూడా పిచ్చికోపం వస్తున్నది. ఒక వారం క్రితం నాకు తెలిసిన ఒకామె కనిపించింది.ఆమె కొడుకు అతివేగంగా ఆటో నడుపుతూ ఎదురుగా వస్తున్న ఒక లారీని గుద్దేసి తనతో పాటు తన ఆటోలో ప్రయాణిస్తున్న అందరినీ పరలోకానికి తీసుకుపొయాడు. చిన్న వయసులోనే కొడుకు పోయాడని చెప్పి ఆమె బాధపడింది.నాకేమీ బాధ కలగలేదు.

సరికదా ఆమెకు ఇలా చెప్పాను.

'ఏడిచి ఉపయోగం ఏముంది.నువ్వు కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపో'.

'అదేంటి సార్ అలాగంటావు?'

'అంతే మరి.అలాంటి కొడుకుని కన్నందుకు నీకు నీవు వేసుకోవలసిన శిక్ష అదే. తనతో బాటు కొంతమంది ప్రయాణీకుల ప్రాణాలకు తాను బాధ్యుణ్ణి అన్న విషయం మర్చిపోయిన అలాంటి మృగాన్ని కన్నందుకు, వాడిని అలా పెంచినందుకు నీకూ శిక్ష పడాలి.' అని చెప్పాను.

'దానికి నేనెందుకు చావాలి? అడిగింది ఆమె.

'మరి ఆ చనిపోయిన ప్రయాణీకుల బంధువులు ఎంత ఏడుస్తున్నారో నీకెందుకు తట్టలేదు?వాళ్ళవి ప్రాణాలు కావా? నీ కొడుకోక్కడిదే ప్రాణమా?' అడిగాను.

జవాబు లేదు.

మనుషులలో మానవత్వం అనేది మాయమై రాక్షసత్వమూ పైశాచికత్వమూ వెర్రి తలలు వేస్తున్నాయి అనడానికి నిత్యజీవితం నుంచి ఎన్నైనా ఉదాహరణలు ఇవ్వగలను.

మొన్నొక రోజున ఒక ఆస్పత్రికి పనుండి వెళ్లాను.

ఒక పేషంట్ ని వీల్ చైర్లో తీసుకొచ్చారు ఆస్పత్రిలో చేర్చడానికి.అతను పేషంట్ కి ఎక్కువా శవానికి తక్కువలాగా ఉన్నాడు.ఇప్పుడో ఇంకాసేపట్లోనో అన్నట్టు ఉంది వాడి వాలకం.పక్కనే వాడిని నెట్టుకొచ్చిన ఇంకోడు ఉన్నాడు.ఎందుకనో వాళ్ళు అక్కడ కాసేపు వెయిట్ చేస్తున్నారు.నేనూ అక్కడే నిలబడి ఉన్నాను.ఇంతలో ఆ అటెండెంట్ అనబడేవాడు శవం లాంటి పేషంట్ తో అన్న మాటవిని నేను నిర్ఘాంతపోయాను.

అటుగా పోతున్న ఒకమ్మాయిని చూపిస్తూ 'ఒరేయ్ చూడు చూడు కత్తిలా ఉంది కదూ' అంటున్నాడు వీల్ చెయిర్లో శవపేషంట్ ని తోసుకోచ్చిన వ్యక్తి.ఆ పేషంట్ కూడా ఆ అమ్మాయి వైపు గుడ్లప్పగించి చూస్తున్నాడు. వాళ్ళక్కడికి ఎందుకొచ్చారో అన్న జ్ఞానం కూడా వాళ్లకు ఉన్నట్లు కనిపించలేదు.

ఇలా చెప్పుకుంటూ పోతె తెల్లవారి లేచిన దగ్గరనుంచీ ఉదాహరణలు వందలూ వేలల్లో ఇవ్వవచ్చు.ఒకటి మాత్రం స్పష్టం.

ప్రజల్లో బాధ్యతారాహిత్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఎక్కడ చూచినా అవినీతీ, అహంకారమూ, పొగరూ, నిర్లక్ష్యధోరణీ, అవకాశవాదమూ, స్వార్ధమూ బాగు చెయ్యలేనంతగా ఎక్కువయ్యాయి.కనుక ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా, ఎవరికి ఏ ఆపద వచ్చినా ఈ మధ్యన నాకు జాలి అనేది కలగడం లేదు.

ఇక రోడ్డు మీద ట్రాఫిక్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఎవడిష్టం వచ్చినట్లు వాడు రయ్యిమంటూ పోతూ ఉండటం చూస్తె,ఒకవేళ ఏదన్నా జరిగినా కూడా 'అయ్యో పాపం' అనిపించడం లేదు. కాకపోతే ఇలాంటి వాళ్ళవల్ల పక్కన తప్పుకొని పోతున్న అమాయకులు బలౌతున్నారు. వాళ్ళని చూస్తె మాత్రం బాధనిపిస్తుంది.

చట్టాన్నీ న్యాయాన్నీ పూర్తిగా ఉల్లంఘిస్తున్న నేటి ప్రజలనూ ప్రభుత్వాలనూ, అలా ప్రవర్తించే పౌరులను తయారుచేస్తున్న తల్లిదండ్రులనూ  చూస్తుంటే 'దొందూ దొందే' అన్న సామెతే గుర్తుకొస్తుంది.కనుకనే ప్రకృతి విలయాలు కూడా యధేచ్చగా పెరిగిపోతున్నాయి.సమాజన్యాయాన్ని, ప్రకృతి న్యాయాన్ని,మానవతా న్యాయాన్ని తుంగలో తొక్కుతున్న ప్రస్తుత సమాజాన్ని ఎవరూ బాగుచేయ్యలేరు.ఆ దేవుడొక్కడే దీనిని రక్షించాలి (ఆయనకు రక్షించాలి అనిపిస్తే).