“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

6, మే 2013, సోమవారం

ఇపుడే తెలిసింది

నువ్వింతే.. 
ఎన్నేళ్ళు నీతో ఉన్నా 
అర్ధం కావు 
మాటలాడని మౌన చకోరంలా 

నువ్వింతే 
ఎన్నాళ్ళు నీకోసం వేచినా 
రానేరావు 
మరలిపోయిన మధుర వసంతంలా

నువ్వింతే 
ఎన్ని బాధలను నీకోసం సైచినా 
ఎటో ఎగిరిపోతావు 
తిరిగి చూడని స్వేచ్చా విహంగంలా 

ఎదురుచూచి ఎదురుచూచి 
పగలంతా నీకోసం 
రాత్రికి అలసి సొలసి 
మాగన్నుగా నిద్రిస్తుంటే

ఏ నిశి రాత్రో విన్పించినట్లైంది 
సుతిమెత్తగా నీవు 
తలుపు తట్టిన సవ్వడి 

వినికూడా నీ పిలుపును
జారుకున్నా నిద్రలోకి 
నీవు కాదేమో అనుకుని 
ఒకవేళ నువ్వే అయినా 
ఇప్పుడెందు కొస్తావనుకొని 

భళ్ళున తెల్లవారాక తెలిసింది 
కాసేపు వాకిట నిలిచి 
నీవెళ్ళి పోయావని 

ఝల్లున గుండెపగిలాక తెలిసింది 
నే వేచిన మధురక్షణం 
వచ్చి వెళ్ళిపోయిందని 

నిరాశగా నవ్వాయి మల్లెలు
నీవు రాత్రి నిల్చినచోట 
పరాకుగా కరిగాయి కన్నులు 
తలచితలచి నీవు పాడిన పాట

ఇపుడే తెలిసింది 
తెల్లవారిన తర్వాత
నా బ్రతుకులో చీకటి పడిందని

ఇపుడే తెలిసింది  
నాకోసం కాకుండా 
నీకోసం నేనెదురు చూడాలని

ఇపుడే తెలిసింది 
నీ ప్రేమను గెలవాలంటే 
నన్ను నేను మరవాలని

ఇపుడే తెలిసింది 
నీ సందిట చేరాలంటే 
నేను నీవుగా మిగలాలని.....