నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

30, జూన్ 2013, ఆదివారం

కొన్ని పాత పద్యాలు

ఎప్పుడో ఇరవై అయిదేళ్ళ క్రితం వ్రాసుకున్న కొన్నిపద్యాలు ఈరోజు పాతపెపర్ల లోనుంచి బయటపడ్డాయి. వాటిని నా అభిమానుల కోసం ఇక్కడ ఇస్తున్నాను.వాటి అర్ధం చాలా సులభంగా గ్రహించవచ్చు.వివరణ అక్కర్లేదు. అన్నీ కందపద్యములే. యధావిధిగా అన్నీ యోగవేదాంత విషయికములే.

1.
చింతలు దొలగుట యోగము
సంతత ధారావాహిగ సత్తై వెలుగన్
అంతము గావలె యాశలు 
పంతముగా యోగమన్న పాటిది సత్యా   

2.
చూచెడి బొమ్మను గాదని 
చూపున్ బ్రతినిముషమందు  చూచెడు ఘనుపై 
మాపును రేపును మదిలో
యోపించగ నిల్పి జూడు చోద్యము సత్యా 

3.
నందానందుని బోధను 
డెందములో నిల్పినీవు జెదరని నిష్ఠన్
అందని ఆత్మజ్ఞానపు 
చంద్రుని నీలోన నిల్చి చూడర సత్యా 

4.
చెల్లని వ్యర్ధపు మాటలు 
కల్లలురా వదలి వాని నాత్మను లోలో  
చల్లగ వీక్షింపు మనుచు 
నెల్లలు దాటించు గురుని నెంచర సత్యా

5.
ఇతరములన్నియు మిధ్యలు
సతతము నీలోని యాత్మ నెరుగ మటంచున్ 
హితముల నెన్నో దెల్పిన 
మితభాషణుడైన గురుని మరువకు సత్యా 

6.
అంతర్యోగంబటంచు 
వింతగ నేమో జేతురు వేడ్కలు దీరన్
ఇంతకు యోగంబటన్న 
అంతరికము గాక బాహ్యమౌనా సత్యా? 

7.
నీలో లేరా వేల్పులు?
లోలోపల వెదకిజూడ లోతులు దెలియున్
నీలోని యాత్మ దెలియక 
నేలను లంఘించి సాములేలర సత్యా 

8.
కర్మల గలుగును జన్మలు 
కర్మల వల్లనె బుట్టును మరిమరి కర్మల్ 
కర్మల వివరము నెరిగిన 
మర్మమ్ములు విచ్చిపోవు మహిలో సత్యా 

9.
కుండలినీ యోగమ్మును
అండగ నేర్పించు గురులు అరుదుర వింటే 
మెండగు సాధన రీతుల  
కొండలు దాటించు ఘనుడు గురుడగు సత్యా

10.
మాయా మర్మపు లోకము 
ఛాయా మాత్రముగ జూచి చెన్నుగ మదిలో 
కాయాతీత రహస్యము 
ఆయా సాధన రీతుల నందర సత్యా 

11.
వాదన లెల్లను మీరుచు 
రోదనముల మోసమెల్ల రోయుచు నిలలో 
బాధామయ బంధమ్ముల 
ఛేదించుము యోగబలిమి చెదరక సత్యా

12.
నందుని మాటల దలచుచు 
అందముగా యనుసరించి యాతని బోధల్
డెందమ్మున మౌనమూని 
బంధమ్ముల మించుమింక బాగుగ సత్యా
read more " కొన్ని పాత పద్యాలు "

18, జూన్ 2013, మంగళవారం

ఆత్మహత్యా యోగాలు-జియాఖాన్ జాతకం

ఒక బ్లాగ్మిత్రురాలు నిన్న మెయిల్ చేస్తూ ఇలా అడిగింది.

'జియాఖాన్ జాతకం ఒకసారి చూస్తారా?ఆమె ఆత్మహత్య చేసుకోడానికి జ్యోతిష్యపరంగా కారణాలు ఏమున్నాయో కొంచం చూడగలరా?'

గురువు రాశిమారిన తర్వాత ఇలాటివి జరుగడం,చాలామంది జీవితాలలో అనూహ్య మార్పులు రావడం   ఊహించినదే గనుక ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.జ్యేష్టమాస జాతకంలో కూడా ఆడపిల్లలు ప్రేమలో పడి మోసపోయే కోణం ప్రస్తావించాను.కాని మిత్రురాలు అడిగిన తర్వాత ఒకసారి ఈ నటి జాతకం చూద్దామనిపించింది.

చనిపోయినవారి జాతకాలను సామాన్యంగా నేను చూడను.అయితే వారు ప్రముఖులు అయితే రిసెర్చ్ కోసం ఎప్పుడైనా వారి జాతకాలు చూడవచ్చు అని భావిస్తాను.పైగా ఈ మధ్య ఒక వింతవిషయం నాకు కనిపిస్తున్నది. బ్రతికున్నవారిలోనే నాకు పిశాచాలు దర్శనం ఇస్తున్నాయి. చనిపోయిన వారు నిస్సహాయులు.పాపం ప్రేతాత్మలుగా ఉండి బాధలు పడుతుంటే ఎప్పుడైనా కనిపించి ఏదైనా సాయం అడుగుతారు గాని అంతకంటే వారు ఏమీ చెయ్యలేరు.దానికి భిన్నంగా బతికున్నవారిలోనే అసలైన పైశాచికత్వం రాక్షసత్వం నాకు కనిపిస్తున్నాయి. కనుక చనిపోయినవారి జాతకాలు చూస్తె తప్పేమిటి అనిపించింది.

సాంప్రదాయ జ్యోతిష్యంలో ఆత్మహత్యా యోగాలు బలవన్మరణ యోగాలు చాలా ఇవ్వబడ్డాయి. ఏఏ రకాలుగా వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకుంటారు?వాటికి ఏఏ గ్రహయోగాలు కారణాలు అవుతాయో కూడా కొన్నిచోట్ల క్లుప్తంగానూ కొన్నిచోట్ల విపులంగానూ చర్చ జరిగింది.

ముఖ్యంగా జైమిని సూత్రాలలో మనం చూస్తె, లగ్నాత్ తృతీయానికి గానీ,ఆత్మకారకాత్ తృతీయానికి గానీ పాపగ్రహసంబంధం ఉంటే బలవన్మరణం లేదా అసహజ మరణం ఉంటుందని వ్రాసి ఉన్నది.

ఈ అమ్మాయి 20-2-1988 న న్యూయార్క్  లో పుట్టింది.జననసమయం నాకు దొరకలేదు.కనుక లగ్నం మనకు తెలియదు.దానిని కూడా కనిపెట్టవచ్చు.కాని అంత శ్రమపడాల్సిన అవసరం లేదు.మిదునలగ్నం అయి ఉండవచ్చు అని ఇంట్యూషన్ చెబుతున్నది.అప్పుడే ఈ అమ్మాయి జీవితం కరెక్ట్ గా సరిపోతుంది. తృతీయానికి  రవిద్రుష్టి ఉన్నది. రవిదృష్టి ఉన్నపుడు ఉరివంటి అసహజ మరణాలు ఉంటాయని జైమిని సూత్రాలు చెప్పాయి.

లేదా సినిమా నటులకు బాగా అచ్చివచ్చే తులాలగ్నం కావచ్చు.అప్పుడు కూడా తృతీయానికి పాపసంబంధం ప్రబలంగా ఉన్నది.ఈ లగ్నం అయినప్పుడు బలవన్మరణ యోగం కూడా కొంత సరిపోతుంది.పైగా తులా లగ్నం వారు ప్రస్తుతం శపితయోగ పరిధిలో ఉన్నారు.


చంద్రుడు కానీ బుధుడు కానీ ఈ అమ్మాయికి ఆత్మకారకుడు అయి ఉండాలి.చంద్రుని నుంచి చూస్తె జైమిని యోగం లేదు.పోతే బుధుడు వక్రి.అంతేగాక అతని నుంచి బలమైన జైమిని యోగం ఉన్నది.కనుక బుదుడే ఈమె ఆత్మకారకుడు.పైగా బుధ కారకత్వాలైన సున్నితత్వమూ, కళాభినివేశమూ ఈ అమ్మాయిలో ఉన్నవి.ఇవి గాక చూడగానే కొన్ని యోగాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.
  • శనికుజుల యోగం యాక్సిడెంట్లకూ అసహజ మరణానికీ సూచిక.  
  • చంద్ర,రాహు యోగం వల్ల అతి చంచల మనస్సు ఉంటుంది.ఉచ్ఛ శుక్రుని తోడువల్ల త్వరగా అందరినీ నమ్మడం ప్రేమలో పడటం ఉంటుంది.
  • వక్రిబుధుని వల్ల సున్నిత స్వభావం,తనలో తానె కుమిలిపోవడం ఉంటాయి.అదీగాక ఈ అమ్మాయిది రేవతీ నక్షత్రం. రేవతీ నక్షత్రం వారు సున్నిత మనస్కులు.తేలికగా ఇతరులను నమ్ముతారు.కనుక మోసాలు బాధలు తప్పవు.
  • నవాంశలో శనిబుధుల యోగం వల్ల తేలికగా డిప్రెషన్ లోకి వెళతారు.
  • మీనంలో ఉన్న మూడు గ్రహాలమీద శనికుజుల సమ్మిలిత దృష్టి గమనార్హం.ప్రేమ+వృత్తి+సున్నితమనస్తత్వం+అత్యాశ+డిప్రెషన్+ యాక్సిడెంట్ లను ఈ యోగం సూచిస్తున్నది.

గోచారం (3-6-2013)

  • గోచార చంద్రుడు జనకాల చంద్రునికి చాలా దగ్గరగా అదే రేవతీ నక్షత్రంలో ఉన్నాడు.  
  • గోచారశుక్రుడు జననకాల శనికుజులకు సరియైన అపోజిషన్లో ఉన్నాడు.
  • గోచార బుధుడు కూడా ఈ శుక్రునికి దగ్గరగానే ఉన్నాడు.
  • ఈ అమ్మాయికి చంద్రలగ్నాదిపతి అయిన గోచారగురువు అప్పుడే రాశిమారి సున్నాడిగ్రీలలో బలహీనుడుగా ఉన్నాడు.
దశలు

జనన సమయం ఖచ్చితంగా దొరకనందున దశలు ఖచ్చితంగా నిర్దారించ లేము.కాని ఊహప్రకారం ఈ అమ్మాయికి ఇప్పుడు శుక్రదశలో కుజ అంతర్దశ జరుగుతూ ఉండవచ్చు.కనుక ప్రేమవ్యవహారంలో పడి చావుకొని తెచ్చుకుంది.

మనుషులకు అత్యాశ ఎక్కువై పోయిన నేటి సమాజంలో చదువులో ర్యాంకుల దగ్గరనుండి,జీవితంలో అవకాశాలు రావేమో సరిగా స్తిరపడలేమేమో అనే అభద్రతాభావం ప్రతిదానిలోనూ చాలామంది పిల్లలలో పెరిగిపోతున్నది. ఇటువంటి భావాలు ఉన్న పిల్లలపట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా సున్నిత మనస్కులైన పిల్లలను జాగ్రత్తగా కంటికి రెప్పలా కాచు కోవాలి.అలా చెయ్యకుండా ఇంకాఇంకా వారిని టెన్షన్ కు గురిచేసి హింస పెడితే చివరికి ఆత్మహత్యలే మిగులుతాయి.

జియాఖాన్ ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అందరికీ చాలావరకూ తెలుసు. కాని చదువులో టెన్షన్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్న పిల్లలను చూస్తె మనసు వికలమై పోతుంది.ఈ సంఘటనల బాధ్యత చాలావరకూ తల్లిదండ్రులదే అని చెప్పాలి.ప్రతివారిలో స్వార్ధమూ,దురాశా పెరిగిపోతున్న నేటి వ్యవస్థలో ఇమడలేని అమాయకులు చెల్లిస్తున్న మూల్యాలుగా వీటిని భావించాలి.వీటిలో కుటుంబ సభ్యుల పాత్ర ఎంత?చుట్టూ ఉన్న వ్యవస్థ పాత్ర ఎంత అనే విషయాలు ఎవరు ఆలోచిస్తారు?నేటి పరుగుపందెపు జీవితాలలో అలా ఆలోచించే సమయం ఎవరికుంది???
read more " ఆత్మహత్యా యోగాలు-జియాఖాన్ జాతకం "

16, జూన్ 2013, ఆదివారం

ఏదో పరవశ వేదనలో...

నీవెవరో నాకు తెలుసేమో !! 
నీవేమిటో నాకు తెలియదు;
నేనేంటో నీకు తెలుసుగాని 
నేనెవరో నాకే తెలియదు!! 

తనకోసం 
నిన్ను ఖాళీ చేసిన నీవు 
నీలోని తనకోసం 
నన్ను మరచిన నేను 

ఒక్కసారైనా
నన్ను చూడని నీవు
ఒక్కక్షణమైనా
నిన్ను వీడని నేను

నిన్ను మరచి 
తనలో మునిగిన నీవు 
నన్ను విడిచి 
నీలో  తేలిన నేను
  
ఎప్పుడూ ఒకటి కాకున్నా 
ఎప్పుడూ ఒక్కరుగా ఉంటున్న 
ఎప్పటికీ ఒకటే అయిన 
ఇద్దరమేగా మనం?

తనకోసం నీవున్నావు
నీకోసం నేనున్నాను
తానే నీవైనప్పుడు 
నీవే నేనైనప్పుడు 
తాను కాదా నేను

నీవూ నేనూ తానూ
కలసిపోయి ఒక్కటిగా 
ఎవ్వరు ఎవరో తెలియని 
ఏదో పరవశ వేదన...
read more " ఏదో పరవశ వేదనలో... "

12, జూన్ 2013, బుధవారం

చాలా రోజులైంది...

చాలా రోజులైంది 

నిన్ను నేను మరచిపోయి  
నాలోనే మునిగిపోయి  
చాలా రోజులైంది.

నీ ధ్యాసను విడచిపెట్టి
నన్ను నేను ప్రేమించి
చాలా రోజులైంది

నాలోపల దాగిఉన్న 
నా తల్లిదండ్రులకు 
తర్పణాలు ఒదిలిపెట్టి
చాలా రోజులైంది 

నన్ను నేను సంహరించి 
నగ్నంగా  నిలిచిపోయి
నవ్వుకుని నవ్వుకుని 
చాలా రోజులైంది 

నట్టేటను నిన్ను ముంచి 
నా దారిన నేనుపోయి 
కొండకొమ్ము నుంచి దూకి 
చాలా రోజులైంది 

కాళ్ళనున్న మట్టి తుడిచి
కల్మషాల కడిగివేసి
కాళీ పదముల నంటి
చాలారోజులైంది 

రొచ్చులోన మునిగిపోయి
రోదనలను మరిగిపోయి 
పాతాళపు పల్లె జేరి 
చాలారోజులైంది 

యోనిచక్ర మండలాన
యోచనలను సంహరించి
యోగారూఢత నొంది 
చాలా రోజులైంది   

మకారాలు ఒదిలిపెట్టి 
మత్తులోన మునిగిపోయి 
మంచుకొండ కొమ్ము జేరి 
చాలా రోజులైంది 

కపాలపు రాజ్యమందు 
కస్తూరీ యంత్రమ్మున
కన్యలెందరినో కలిసి
చాలా రోజులైంది 

వింతదైన తంత్రమ్మున
విద్యలెల్ల సాధించి
వికటంగా నవ్వు నవ్వి
చాలా రోజులైంది 

అమావాస్య రోజులలో 
అన్నిటినీ బలినొసంగి
అమ్మ పాదములు తాకి 
చాలా రోజులైంది

అష్టకష్టముల నీది 
అష్ట కన్యకల నడుమ 
అద్భుత రతులను తేలి
చాలా రోజులైంది

అసహ్యపు లోకమొదిలి
తంత్రాన్వయ సీమలోన
తన్మయత్వమును బొంది
చాలా రోజులైంది

మన్మధుణ్ణి మసిని చేసి 
రతీదేవి చెయ్యిపట్టి 
భైరవత్వమున నిలిచి 
చాలా రోజులైంది......
read more " చాలా రోజులైంది... "

11, జూన్ 2013, మంగళవారం

నరేంద్ర మోడీ జాతకం- 1

నిన్న నరేంద్రమోడీ మీద ఉంచబడిన బాధ్యతను గమనిస్తే ఆయన జాతకం ఒకసారి చూద్దామనిపించింది.

ఎందుకోగాని,చాలాసార్లు చాలా మంది ప్రముఖులవి అసలైన జాతక వివరాలు దొరకవు.ఒకవేళ దొరికినా అవి సరియైనవో కావో తెలియదు. కనుక తప్పు వివరాలతో జాతకాలు వెయ్యడం సరికాదు గనుకా ఒకవేళ వేసినా అవి ఎలాగూ సరిపోవు గనుకా ఆ ప్రయత్నం చెయ్యడం సాహసమే అవుతుంది.అయినా సరే కొంత ప్రయత్నం చేసి చూద్దాం.

మోడీ జనన వివరాల కోసం వెదికితే  మూడు రకాలైన సమాచారం దొరుకుతున్నది.

జననతేదీ 17-9-1950;వాద్ నగర్;మెహసాన జిల్లా;గుజరాత్.ఇంతవరకూ  కొంత క్లారిటీ ఉన్నట్లు కన్పిస్తుంది.ఆరోజున భాద్రపద శుక్లషష్టి, ఆదివారం,అనూరాధా నక్షత్రం అయింది.

జ్యోతిష్యవిద్య బాగా పట్టుబడితే కొన్ని సులువులు సూత్రాలు అర్ధమౌతాయి. వాటివల్ల, జాతకం వెయ్యకుండానే జననతేదీ నుంచి,తిధి వార నక్షత్రాలనుంచే జాతకుడి జీవితం చాలావరకు స్థూలంగా తెలిసిపోతుంది. అతని జీవితగమనం ఎలా ఉంటుంది,గమ్యం ఏమిటి అనే విషయాలు తెలిసిపోతాయి.

పై స్వల్ప పంచాంగ వివరాలను బట్టి ఈయనకు లోకంతో చాలా గట్టి రుణానుబంధం ఉందని తెలిసిపోతున్నది.అంతేగాక ఈయనది కష్టజాతకం అన్న విషయమూ తెలిసిపోతున్నది.

సరదాగా సంఖ్యాశాస్త్ర సాయం తీసుకుందాం.ఈయన జనన తేదీలోని శని, చంద్రుడు,కుజుడు,బుధుల ప్రభావం వల్ల చాలా విషయాలు తెలుస్తున్నాయి.

ఈయన జీవితం నల్లేరు మీద నడకకాదు.చాలా కష్టం తర్వాతే ఫలం దక్కుతుంది.ముఖ్యంగా బాల్యం కష్టాలతో గడుస్తుంది.ఆధ్యాత్మిక కోణంలో జీవితాన్ని చూస్తాడు.చాలా పట్టుదల ఉన్న వ్యక్తి.తెలివైనవాడు అని ఈ స్వల్ప వివరాలవల్ల తెలుస్తున్నది.ఇవన్నీ నిజాలే అని ఈయన జీవితం చదివితే తెలుస్తుంది.

ఇంకొంచం లోతుగా జాతకాన్ని పరిశీలించాలంటే జనన సమయం కావాలి.అవి మాత్రం మూడు కనిపిస్తున్నాయి.ఇందులో ఏది సరియైన జనన సమయమో ముందుగా తేల్చిన తర్వాత, జాతకంలోని సూక్ష్మవివరాల జోలికి,భవిష్యత్తు జోలికి వెళ్ళాలి.దానికి కొన్ని జ్యోతిష్య సూత్రాలను ఉపయోగిస్తాను.

10.11 hours -- ఈ సమయానికి చంద్రహోర నడుస్తున్నది. 
11.00 hours -- ఈ సమయానికి శనిహోర.
12.21 hours -- ఈ సమయానికి గురుహోర.

వీటిలో మొదటిది తులా లగ్నాన్ని ఇస్తున్నది.మిగిలిన రెండూ వృశ్చిక లగ్నాన్ని ఇస్తున్నాయి.ఇక విశ్లేషణ మొదలు పెడదాం.
  • తులాలగ్నం వారు అందంగా ఉంటారు.మోడీ అంత అందగాడు కాదు.
  • మోడీ పెదవులు కొంచం బండగా ఉంటాయి.అలా ఉండాలంటే వృశ్చిక లగ్నం అయ్యి ఉండాలి.కారణం అక్కణ్ణించి నవమం మీద రాహు దృష్టి.
  • ఈయన పైన ముగ్గురు జ్యేష్టులున్నారు.తులా లగ్నం అయితే అలా కుదరదు.వృశ్చికం అయితే సరిపోతుంది.
  • మోడీ చిన్నప్పుడు బస్టాండ్ లో టీ కొట్లో పనిచేశాడు.అలాంటి వృత్తి చిన్నప్పుడు ఉండాలంటే దశమానికి శని సంబంధం ఉండాలి.వృశ్చిక లగ్నానికే అది సరిపోతుంది.
  • మోడీ బ్రహ్మచారి.తులా లగ్నం అయితే లాభంలో శని శుక్రులవల్ల వివాహం అవ్వాలి,వివాహ జీవితం బాగుండాలి. సప్తమాధిపతి కుజుని కుటుంబస్తితివల్ల కూడా అదే జరగాలి.అదే వృశ్చికం అయితే, సప్తమాధిపతి శుక్రుని దశమ కేంద్రస్తితివల్లా,లగ్న శత్రువైన శనియుతి వల్లా వివాహం బాగా ఆలస్యం కావాలి లేదా అసలు ఆ యోగమే ఉండదు.లేదా వివాహ జీవితంలో వెలితి ఉంటుంది.రెండోదే కరెక్ట్ కనుక ఈయనది వృశ్చిక లగ్నమే.
  • ఇంకొక్క ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే.తులా లగ్నం అయితే ఎప్పుడూ గడ్డం పెంచుకుని తిరగడు.వృశ్చికం అయితేనే అందులోని నీచచంద్ర కుజులవల్ల గడ్డంతో తిరిగే యోగం కలుగుతుంది.మోడీ ఎప్పుడు చూచినా గడ్డంతో దర్శనమిస్తాడు.కనుక ఈయనది వృశ్చిక లగ్నమే.
  • ఈయన పొలిటికల్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాడు.కనుక వృశ్చిక లగ్నం అయితేనే చతుర్ధ గురునివల్ల రాజపరిపాలనా సంబంధ విద్య ఉంటుంది. అదే తులాలగ్నం అయితే ఆ యోగం లేదు.కనుక ఇలా చూచినా వృశ్చిక లగ్నమే కరెక్ట్ అని అనిపిస్తుంది.
పై ఏడు పాయింట్స్ వల్ల మొదటి సమయం కరెక్ట్ కాదు అని తేలుతుంది. మిగతా రెండు సమయాలలో ఏదైనా వృశ్చికలగ్నాన్నే ఇస్తుంది.వాటిలో ఏది కరెక్టో వచ్చే పోస్ట్ లో విశ్లేషణ చేసి చూద్దాం.ముందుగా జనన సమయాన్ని సరి చేస్తే, ఆ తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుందో తీరికగా దృష్టి సారించవచ్చు.
read more " నరేంద్ర మోడీ జాతకం- 1 "

10, జూన్ 2013, సోమవారం

జ్యేష్ట శుక్ల పాడ్యమి-దేశజాతకం


జ్యేష్ట శుక్ల పాడ్యమి కుండలి పరిశీలించి ఈ నెల దేశానికి ఎలా ఉంటుందో చూద్దాం.8-6-2013 న 22-25 గంటలకు గ్రహస్తితి ఇలా ఉన్నది.శనివారం మృగశిరా నక్షత్రం కుజ హోరలో జ్యేష్టమాసం మొదలైంది.

  • దశమంలో శపితయోగం వల్ల పరిపాలన ఏమంత బాగుండదు.అధికారులకు చికాకులు తప్పవు.
  • శుక్ర శనుల మధ్య కోణదృష్టి వల్ల సెక్స్ సంబంధమైన వివాదాలలో అధికారులు చిక్కుకుంటారు.దీనికి వారిమధ్యన గల పరస్పర విభేదాలే కారణం అవుతాయి.
  • కుజ శనుల మధ్య ప్రతికూల దృష్టి వల్ల షేర్ మార్కెట్ కల్లోలాలకు లోనౌతుంది.
  • మేధావులకు తెలివి మందగిస్తుంది.తద్వారా పరిపాలనలో తప్పుడు నిర్ణయాలు తీసుకోబడతాయి.
  • చతుర్ధ కేతువు వల్ల ప్రజా జీవనం శాంతిగా ఉండదు.
  • ఉన్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయాలవల్ల ఆర్ధిక రంగంపైన ప్రతికూల ప్రభావం పడుతుంది.
  • పంచమంలో శుక్రక్షేత్ర కుజునివల్ల అమావాస్య ప్రభావం వల్ల ప్రేమ వ్యవహారాలలో బాలికలు నమ్మి మోసపోవడం దాడులకు గురికావడం యధావిధిగా కొనసాగుతుంది. 
  • ఇదే యోగం వల్ల కొందరు క్రీడాకారులపైనా పోలీస్ అధికారులపైనా చీకటి కమ్ముకుంటుంది.వారి కెరీర్ లు దెబ్బతింటాయి.
  • న్యాయవిభాగం అధికారుల పరిపాలనా తీరుపైన దృష్టి సారించి వారిని నియంత్రించాలని చూస్తుంది.
  • న్యాయాదికారులు కొందరు అనుకోని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
  • జూన్ ఇరవై తేదీన ప్రజా సంబంధ/పరిపాలనా పరమైన చిక్కులు ఎక్కువగా ఉంటాయి.
read more " జ్యేష్ట శుక్ల పాడ్యమి-దేశజాతకం "

9, జూన్ 2013, ఆదివారం

త్రిశంకు స్వర్గం

ఎన్నో జన్మల ఆరాటంలో
కనిపించిందొక స్వర్గం 
ఎన్నో ఏళ్ళ సంఘర్షణలో 
అందిందొక పుంజం  

ఎన్నో దారుల వెతుకులాటలో 
ఎదురైందొక గమ్యం 
ఎన్నో తరాల తపోఫలంగా 
ఎగసిందొక హర్మ్యం 

అందరికీ అందని ఈ స్వర్గం 
కొందరికైనా అందించే సంకల్పం 
వద్దని వారించారు సహచరులు 
వృధా ప్రయాసన్నారు ఖేచరులు 

ఒక ప్రయత్నం చేద్దామనుకున్నా 
ఒక వెలుగుల తెర తీద్దామనుకున్నా
ప్రాణజలాల కాంతి సరస్సుకు
నలుగురినైనా నడుపుదామన్నా 

నా వంతు ప్రయత్నం చేస్తే 
నాతో వచ్చేవారికోసం చూస్తే
కనిపించిందొక విచిత్రం 

కొందరి కళ్ళకు గంతల్లు
కొందరి కాళ్ళకు సంకెళ్ళు  
కొందరి చేతుల బంధాలు 
కొందరి చెవులకు బిరడాలు 

కొందరు మనుషుల మంటారు
కొందరి మనసులు వ్యగ్రాలు 
కొందరు కొమ్ముల జీవాలు 
అమ్ముల పొదిలో ఆవాలు

కొందరికి లేవడమే అయిష్టం
కొందరి నడకే అతికష్టం
కొందరు మత్తున జోగారు
కొందరు నిద్రను మునిగారు

కొందరు కోరల సింహాలు 
కొందరు పాకెడి సర్పాలు
కొందరు ఆశల అగచాట్లు 
కొందరు మబ్బుల ఖగరాట్లు 

కొందరమాయక కుందేళ్ళు 
కొందరు బందీ పెంగ్విన్లు
కొలనున ఎగిరే పెలికాన్లు
కోపపు మాటల టైఫూన్లు

ఎత్తులు మరిగిన పాండాలు
ఏళ్ళు వచ్చినా పసివాళ్ళు
జిత్తులు నేర్చిన జంబుకులు 
మెత్తగ కోసెడి కత్తెరలు

కొందరు కోపపు తోడేళ్ళు 
గడ్డలు కట్టిన సెలయేళ్ళు 
ఎన్నోజన్మల ఎండలలోన 
ఎన్నడు ఉతకని మేజోళ్ళు 

నడకలు మరచిన తాబేళ్లు 
వెలుగును కోరని రాత్రిళ్ళు 
కర్మల బడిలో గుంజిళ్ళు 
కట్లు ఊడని మెడతాళ్ళు

ఆశలు అతిగా ఉన్నప్పటికీ
అడుగులు పడబోవెవ్వరికీ
ఆత్మవంచనల ముసుగులలోని
చీకటి నచ్చును అందరికీ

రెక్కలున్నా మరచి
ఎగరలేనీ నరులు 
వేళ్ళను విడచి వెలుగును
చేరలేనీ తరులు

ఆకాశాన ననుచూచి 
నవ్వుతూ నావాళ్ళు 
నేలనున్న నావారిని 
వీడలేని ఈ నేను...
read more " త్రిశంకు స్వర్గం "

8, జూన్ 2013, శనివారం

ఆఖరి మజిలీ

కొండల్లో కోనల్లో తిరిగా 
ఎన్నాళ్ళో బాధలతో ఒంటరిగా
అడవుల్లో లోయల్లో వెతికా 
ఎన్నేళ్ళో వేదనలో మౌనంగా

నాకోసం నాలోపల నేనే వెతికా 
నీకోసం ఈ లోకపు దారుల్లో వెతికా
అంతులేని వ్యధార్త అన్వేషణలో 
ఏళ్లకు ఏళ్ళంటూ మౌనంగా గడిపా

ఎన్నో కన్నుల ఎడారుల్లో వెతికా
నీ కన్నుల నదిజాడల కోసం  
ఎన్నో మోముల సంజెల్లో వెతికా
నా హృదయపు గుడినీడల కోసం

గతస్మృతుల చీకటి సమాధుల్లో 
గడిచాయెన్నో నిరాశా నిశీధులు 
సుమధుర భావాల వెన్నెల వీధుల్లో  
మెరిశాయెన్నో వెలుగుల తెలిమబ్బులు  

ఎందరి ముంగిటనో పట్టుగా వంచాను
వంగని నా మొండి శిరస్సులను  
అందరి వద్దా గుట్టుగా పొందాను
మరువలేని మౌన ఆశీస్సులను

అంతరాళ వీధులను వెతికాను 
సుంతైనా విసుగు లేకుండా  
వింతవైన ఆత్మలను కలిశాను 
కొంతైనా బెదిరి పోకుండా

ఒకటే వెలితి పీడించింది 
ఎక్కడా నీవు కనిపించలేదని 
ఒకటే బాధ వెంటాడింది 
అసలు నీవున్నావో లేవోనని

ఎక్కడో ఉన్నావని మనసు చెప్పేది 
అదెక్కడో తెలియక తానే వగచేది
ఏదోనాడు ఎదురౌతావనిపించేది   
మనమెపుడో కలుస్తామని తోచేది

అది నా భ్రమేమో అనుకున్నా 
నీవసలు లేవేమో అనుకున్నా 
మనం కలవమేమో అనుకున్నా 
ఈ జన్మకు గెలవనేమో అనుకున్నా

ఆశ ఒదిలేసిన నిముషంలో  
ఈ జన్మకింతేలే అనుకున్నక్షణంలో 
మెరుపులో కనిపించావు 
వానజల్లులో తడిపేశావు

నిను చూచిన క్షణంలో 
అన్నీఇక మరిచాను 
ఉప్పొంగిన నా మదిలో 
నిన్నేమరి తలచాను

మెలకువలో నిద్రలో
నిన్నే నిత్యం స్మరించా
నిదుర మత్తులో మునిగిన 
నిన్ను తట్టి లేపాలని 
అనునిత్యం పరితపించా 

అమాయకంగా అనుకున్నా
నాదారిన నాతో నడుస్తావని
ఒంటరి పయనంలో నా తోడుంటావని 
వేచిన నా మనసును ఓదారుస్తావని  
ఎవరికీ పట్టని నా పిచ్చి ఊసులను 
నీవైనా కొంచం వింటావని 

కానీ....

బండబారిన నీ రాతిగుండెను చూచి
వెలగని నీకళ్ళ లోగిళ్ళను చూచి 
అందరిలో ఒకరుగా మారి 
అవనికి జారిన నింగిని చూచి 

నిజాన్ని కాదని 
నీడలను కోరుకుని
నిన్ను నీవు గెలవలేక
నాతో మరి కలవలేక
నిత్య సంఘర్షణలో నీరౌతూ
నిలిచిపోయిన నిన్ను చూచి

మూతపడిన నీ జ్ఞాపకాల వాకిళ్ళను 
తట్టి తెరచి చూపాలని తలచాను
అసలైన నీ లోకపు వెలుగులనొకసారి
నీ ముంగిట నిలపాలని చూచాను

నాకు మాత్రమేమి తెలుసు 
ఆ ఉద్వేగపు వెల్లువలో   
నీవు బెదిరిపోతావని
నీకు మాత్రమేమి తెలుసు 
ఈ సుదీర్ఘ పయనంలో  
ఇదీనాటి మజిలీ కాదని

నీ మౌనం నా పిచ్చిగుండెను 
లోతుగానే కోసింది 
మానుతున్న పచ్చిగాయాన్ని
ఇంకొంతగా రేపింది

నువ్వు మొదట్నించీ ఇంతే
నీకేం కావాలో నీకే తెలీదంతే 
ఎదురుగా ఉన్నదాన్ని ఒప్పుకోలేవు
సుదూర తారలపై చూపు తిప్పుకోలేవు

తరచి చూడు నీ మనసును ఒకసారి 
ఏదో రూపం లీలగా కనిపిస్తుంది 
వెతికి చూడు నీ హృదయాన్నొకసారి 
ఏదో వేదన నీడలా తెలిసొస్తుంది

తెలుసుకో ఆ రూపం ఎవ్వరిదో  
తరచి చూడు నీ వేదన ఎందులకో   
హృదయాన్ని నమ్ము నీ కళ్ళను కాదు 
ఒకనాటికీ సత్యం నీకూ తెలీకపోదు

బహుజన్మల బాటసారిగా నీకోసం
వేచిందొక హృదయమని
వినిపించని పాటపాడుతూ నీతోనే
నిలిచుందొక ఉదయమని

స్నేహపు రహదారిని వదలి
ఊహలు నీ మదిలో మెదిలి 
జన్మల ప్రవాహంలో మునిగి
కర్మల వలయంలో చిక్కావు
అంతులేని అయోమయంలో 
వింతగా ఎటో దారితప్పావు   

ఎన్నో ఉన్నత శిఖరాలెక్కినా
ఎన్నో వెలుగులు చేజిక్కినా 
నా సుదీర్ఘ పయనం ఆపి 
నీకోసం చూస్తున్నాను
మరచిన నీ దారిని మళ్ళీ 
నీకు గుర్తు చేయాలని 

ఆగిన నీ పయనాన్ని మళ్ళీ
నీవు మొదలు పెట్టాలని
వేచిఉన్న నీ గమ్యాన్ని   
నీవు అందుకోవాలని  

చీకటిలో మునిగిన
నీ కళ్ళు తెరిపించాలని 
సుదూర కాంతి సీమలు 
నీకు చూపించాలని

ఘూర్ణించే ప్రళయాలను
స్థైర్యంతో వాయిదా వేస్తూ 
యుగాలుగా నీకోసం 
రాయిలా నిలిచున్నాను

ఎంతగా హృదయాన్ని 
నీకోసం విప్పినా 
ఎన్నెన్ని సున్నితభావాలను 
నీకోసం చెప్పినా 

ఎప్పటికీ తీరదు 
నాకొక సంశయం 
ఏమిటో మారదు
ఈ వింత సంకటం 
  
అసలంటూ నీలో  
నీవున్నావో లేవోనని 
నాదైన ఈ మౌనరాగం 
నీలో మ్రోగుతుందో లేదోనని

నీ మనసును నీవసలు 
గెలవగలవా అని
నిశ్చలంగా నీవసలు  
నిలవగలవా అని 

నీ ఎదురుచూపులెందుకో
నీకెన్నటికీ అర్ధం కాదు
నా పిచ్చినిరీక్షణ కూడా
నాలాగే అంతంకాదు

మరపురాని గతఛాయలు
నన్నెపుడూ వదలి పోవు
గుర్తులేని గుండె చప్పుళ్ళు 
నిన్నెపుడూ కదిలించ లేవు

వెదికిన గమ్యం కనిపిస్తున్నా
వెచ్చని ఉదయం ఎదురొస్తున్నా 
నచ్చిన నేస్తం ఎదురుగ ఉన్నా
మధ్యన దూరం తరిగేపోదు

నీ మొద్దునిద్దుర అంతం కాదు
నా పిచ్చిమనసుకు బుద్దే రాదు
అంతా చేసే ఆ వింత విధికి 
అలుపెప్పటికీ లేనేలేదు

విధివ్రాతకు అర్ధం లేదు
నీ మనసే నీకు తెలీదు
హృదయమంటూ నీకొకటుందని 
మ్మకమేమో నాకైతే లేదు

తలపులు రేగిన సంజెవేళలో
అలుపుల నెరుగని ఆరాటంలో
వలపులు నింపిన ఆరాధనలో
తలుపులు మూసిన ముంగిళ్ళల్లో

కొంత నిడివిగల బ్రదుకుబాటలో
వింతదైన ఈ వెదుకులాటలో 
అంతులేని నా అన్వేషణలో 
ఆఖరిమజిలీ అంటూ లేదు...
read more " ఆఖరి మజిలీ "