“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

21, జూన్ 2013, శుక్రవారం

కల్యాణానంద భారతీస్వామి స్మృతులు -2

ఆదివారం విజయవాడలో పనిచూచుకుని తెనాలి చేరేసరికి సాయంత్రం అయిదయింది.ఇల్లు తేలిగ్గానే దొరికింది.నేను వెళ్లేసరికి శర్మగారు నాకోసం ఎదురు చూస్తున్నారు.ఇంట్లో ఆయనొక్కరే ఉన్నారు.

కాసేపు కూచుని అవీఇవీ మాట్లాడాక 'రండి మా పూజామందిరం చూద్దురుగాని' అని లోపలకి తీసికెళ్లారు.బయట పంపుదగ్గర కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని లోపలకి దారితీశాను.ఆయన దగ్గరున్న శ్రీచక్రమూ, పంచలోహ మేరుప్రస్తారమూ,పంచాయతనమూ,అందులో ఉన్న రాళ్ళూ రత్నాలూ,అమ్మవారి చిన్న విగ్రహమూ అన్నీ చూపించారు. అక్కడ కాసేపు కూచుని మళ్ళీ హాల్లోకి వచ్చి కూచున్నాము.
  
'ఎప్పుడూ మిమ్మల్ని శర్మగారూ అని పిలవడమే గాని మీ పూర్తిపేరు ఇప్పటిదాకా తెలియదు' అడిగాను నవ్వుతూ.

'నాపేరు వెంకటకృష్ణశర్మ.దీక్షానామం 'అమలానందనాధ' అన్నాడాయన. 'మా నాన్నగారి పేరు వెంకటరామశర్మ.ఆయన వేమూరు ఎలిమెంటరీ స్కూల్లో హెడ్మాస్టరుగా పనిచేశారు.స్వామివారి వద్ద ఆయన 1920 లో మంత్ర దీక్ష తీసుకున్నారు.' అన్నారు.

ఈలోపల ఇల్లు ఒకమోస్తరు తరంగాలతో నిండిఉండటం గమనించాను.

'మీకోసం ఈ పుస్తకాలు తీసి ఉంచాను'అంటూ ఒక టీపాయ్ మీద ఉంచిన ఒక ముప్పై నలభై పుస్తకాలు చూపించాడు.అవన్నీ ముదురు గోధుమ రంగులోకి మారి అవసానదశకు చేరినట్లు కనిపిస్తున్నాయి.

వాటిలో కొన్నింటి పేర్లు:
  • భగవద్గీతా రహస్యం
  • శృతిధర్మ సంగ్రహం 
  • ప్రజావైచిత్ర్యము 
  • The hypocrisy and villainy of the outcaste untouchable Harijan-Mr M.K.Gandhi
  • వేదాంత మీమాంసా శాస్త్ర దర్శనము 
  • గీతామృత తరంగిణి(భగవద్గీతా వ్యాఖ్యానము) - మూడు భాగములు 
  • విరూపాక్ష పీఠ జంత్రి (క్రీ.శ 1331-32 నుంచి)
  • శ్రీ విద్యోదంతము (1953 లో ప్రచురింపబడినది)
  • సంధ్యా కళా 
  • బ్రహ్మకలా 
  • Open and fair challenge -Srimukham-34
  • Many small booklets on different subjects (Srimukhams)
  • మనుస్మృతి సారః (The jurisprudence of Manu)-Printed in 1952
  • శ్రీ విద్యాస్త్ర పరంపర
  • భారతీ సాంప్రదాయము (1929 లో ముద్రితము)
వీటిలో కొన్ని కొంచం పెద్దగ్రంధములు.చాలావరకూ చిన్నచిన్న గ్రంధములు. కొన్ని అయితే పాంఫ్లెట్ ల మాదిరిగా పది ఇరవై పేజీలతో ఉన్నాయి. ఆయనతో మాట్లాడుతూనే వాటిలో కొన్నింటిని చదివేసి వాటి సారమేమిటో అర్ధం చేసుకుని వాటిని ఒక పక్కన ఉంచాను.

'ఉండండి.మీకు టీ తీసుకొస్తాను.' అంటూ ఆయన లోపలకి వెళ్ళాడు.

ఆయనొచ్చే లోపు కొంచం పెద్ద సైజువి ఇంకొక మూడునాలుగు పుస్తకాలు చదవడం అయిపొయింది.ఆయన టీ కప్పుతో లోపల నుంచి వచ్చి నేను పక్కన ఉంచిన పుస్తకాలు చూచి - 'అన్నీ మీకోసమే తీసుకెళ్ళి చదవండి' అన్నారు. 

'అవి చదవడం అయిపొయింది.వీటిల్లో మాత్రం కొన్ని తీసుకుంటాను.మళ్ళీ ఒక వారంలో వచ్చినపుడు మీవి మీకు తెచ్చి ఇస్తాను'.అన్నాను.

ఆయన అనుమానంగా చూస్తూ 'ఎప్పుడు చదివారు?' అన్నారు.

'ఇప్పుడే.మీతో మాట్లాడుతూ కొన్ని చదివాను.మీరు టీ తెచ్చేలోపు కొన్ని చదివాను.నేను చాలా వేగంగా పుస్తకాన్ని చదవగలను.ఎంత వేగంగా అంటే మీరు ఆశ్చర్యపోయేటంత వేగంగా.మీకు కావాలంటే ఆ పక్కన ఉంచిన పుస్తకాల్లోంచి ఏవైనా ప్రశ్నలు అడగండి' అన్నాను నవ్వుతూ.

ఆయనేమీ మాట్లాడలేదు.

టీ తాగుతూ 'స్వామివారు కొంచం వివాదాస్పద వ్యక్తిలా ఉన్నారే?' అన్నాను గాంధీని ఆయన తీవ్రంగా విమర్శించిన పుస్తకాలు చూస్తూ.

'అమ్మో.మామూలు వ్యక్తి కాదండీ.ఆయనకు తెలియని విషయం అంటూ లేదు.లౌకికం ఆధ్యాత్మికం ప్రతిదాన్నీ తూర్పార పట్టి పారేసేవాడు.చాలా ఇంటలెక్చువల్. ఆరోజుల్లోనే సిద్ధాంతపరంగా గాంధీని కాంగ్రెస్నీ ఏకి పెట్టాడు' అన్నారు శర్మగారు.

'అవును చూచాను.శృంగేరీ మఠాన్ని కూడా చాలెంజ్ చేస్తూ ఓపన్ లెటర్ వ్రాశారే.'అన్నాను.

'అవును.శృంగేరిమఠం కూడా అసలు మఠం కాదనీ ఉపమఠం అనీ ఆయన వాదన.కంచి మఠాన్నైతే అసలు ఆయన ఒప్పుకోనేలేదు. ఆదిశంకరులు స్థాపించినవి నాలుగే మఠాలనీ అయిదోది లేదనీ,శృంగేరికి కంచిమఠం  బ్రాంచనీ  తర్వాత ఎప్పుడో ఒక సమయంలో విడిపోయిందనీ ఆయన సప్రమాణికంగా వాదించేవారు.ఈ విషయం అంతా ఆయన ఇచ్చిన శ్రీముఖాలలో ఉంది చూడండి.' అన్నారు.

'అవును.చూచాను.' అంటూ "అసలీయన ఎక్కడివారు?" అనడిగాను.

"ఆయన స్వగ్రామం అమలాపురం దగ్గర పేరూరుఅగ్రహారం.వేదజ్ఞానులైన పండితుల కుటుంబంలో ఆయన జన్మించారు.1914 లో కాశీలో జరిగిన పండిత సభలో ఆయనకు TT& DVD (Terror of Theosophy & Defender of Vaidic Dharma) అనే బిరుదు అనీబిసెంట్ చేత ప్రదానం చెయ్యబడింది.అప్పటికి ఆయనకు 16 లేదా 17 ఏండ్లు ఉండేవి.అనీబిసెంట్ ఆ బిరుదును ఇచ్చింది.స్వామివారు ఆంగ్ల ఆంధ్ర సంస్కృతాలలో మంచి పండితుడు." చెప్పారు.

'అదేంటి? తమ దివ్యజ్ఞాన సిద్ధాంతానికి వ్యతిరేకమైన బిరుదును ఆమె ఎలా ఇచ్చింది?' అడిగాను.

'అదేమరి వింత.మొదట్లో ఆయనకు మూడు నిముషాలే మాట్లాడటానికి సమయం ఇచ్చింది.తర్వాత స్వామివారి వాగ్ధాటికి ముగ్దురాలై పందోమ్మిది నిముషాలు పొడిగించింది.' అన్నారు.

"ఆయన పారాయణం చేసే లలితలో 1053 నామాలుండేవి.ఆ 53 నామాలు ఎక్కణ్ణించి తెచ్చాడో తెలియదు.బహుశా అవి ఆయన స్ఫురణకు అందిన నామాలు కావచ్చు.ఆయన లలితాసహస్రనామాలకు భాష్యం వ్రాశారు. ఆ భాష్యానికి 'శ్రీకళ' అని పేరు. 1923 డిసెంబర్ లో ఆయన అరండల్ పేటలోని శ్రీ పీఠానికి ఆధిపత్యం వహించారు."

"పరంపరలో చూస్తె విజయనగర సామ్రాజ్యానికి రాజగురువైన విద్యారణ్య స్వామి తర్వాత ఈయన 44వ వాడు.ఈయన గురువు బోధానందభారతి. ఆయన గురువు ఉద్దండభారతిస్వామి.చల్లపల్లి జమీందారు గారు (ఇప్పటాయనకు ముత్తాత) ఉద్దండభారతిస్వామి శిష్యుడు.ఆయనకు కూడా స్వామి శ్రీవిద్యాదీక్ష ఇచ్చారనీ,ఆ సాధనా ఫలితంగా జమీందారుగారికి కూడా శ్రీమాత సాక్షాత్కారం కలిగిందనీ అంటారు.

'బ్రాహ్మణులు కానివారికి శ్రీవిద్యను ఇవ్వరాదని అంటారు కదా? మరి కమ్మవారికి ఉద్దండభారతి శ్రీవిద్యను ఎలా ఇచ్చారు?' అడిగాను.

"స్వామి ఇలాంటివి ఒప్పుకునేవారు కారు.అర్హులైతే ఎవరికైనా ఇవ్వవచ్చు అర్హత ప్రధానం అనేవారు.ఆయనలో సాంప్రదాయ చాందసమూ,నవీనధోరణీ విచిత్రంగా కలిసిమెలసి ఉండేవి. పైగా విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత పీఠం స్థానభ్రంశం చెంది దేశమంతా తిరుగుతూ ఉంటె దానిని ఆదరించినవారు బొబ్బిలిరాజావారు మరియు చల్లపల్లిరాజావారు.వీరిద్దరూ ఈ పరంపరా స్వాముల శిష్యులు.కనుక వాత్సల్యపూర్వకంగా శ్రీవిద్యను వారికి ఉపదేశించి ఉండవచ్చు." అన్నారు. 

"శివగంగ అని మచిలీపట్నంలో ఉన్నది.చల్లపల్లి జమీందారుగారు బండ్లు కట్టుకుని కాశీకి వెళ్లి గంగను తెచ్చి ఇక్కడ నీళ్ళలో కలిపారనీ అప్పటినుంచి దానికి శివగంగ అని పేరొచ్చిందనీ అంటారు.అక్కడే ఆయన గురువుగారైన ఉద్దండభారతీస్వామి సమాధి ఉంది.

కళ్యాణానందభారతీస్వామి 'ఖడ్గమాలా పారాయణం' ఎక్కువగా చెయ్యమని చెప్పేవారు.ముఖ్యంగా స్త్రీలను ఈ పారాయణ ఎక్కువగా చెయ్యమని ఆయన చెప్పేవారు.మా పెత్తల్లులు పినతల్లులు అందరూ కలిసి ఏడుగురు. వారందరూ శ్రీవిద్యాదీక్షాపరులే.ఖడ్గమాలను నిరంతరం పారాయణం చేసేవారు. అందరూ పుణ్యస్త్రీలు గానే గతించారు."అన్నారు.

నా చిన్నప్పటినుంచి ఈ పారాయణాలు గట్రా చేసేవారిని కొన్ని వందల మందిని చూచాను.వీళ్ళమీద నాకేమాత్రం మంచి అభిప్రాయం లేదు. ఎందుకంటే అదే సర్వస్వం అనుకుంటూ అహంకారంతో విర్రవీగుతూ ఉంటారు.వీళ్ళలో చాలామందికి నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలియదు.కాని అన్నీ తెలుసనీ అనుకుంటూ ఉంటారు.ఇతరులకు ఉచిత సలహాలు కూడా ఇస్తుంటారు.కాని ఉపాసనామార్గపు లోతులు వీరికి తెలిసి ఉండవు.అలాంటి వారిని లెక్కలేనంతమందిని నేను చూచాను.ఆ సంగతి బయటకి చెబితే ఆయన బాధపడతాడని మౌనంగా నవ్వి ఊరుకున్నాను.

(మిగతా మూడో భాగంలో)