“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

12, జూన్ 2013, బుధవారం

చాలా రోజులైంది...

చాలా రోజులైంది 

నిన్ను నేను మరచిపోయి  
నాలోనే మునిగిపోయి  
చాలా రోజులైంది.

నీ ధ్యాసను విడచిపెట్టి
నన్ను నేను ప్రేమించి
చాలా రోజులైంది

నాలోపల దాగిఉన్న 
నా తల్లిదండ్రులకు 
తర్పణాలు ఒదిలిపెట్టి
చాలా రోజులైంది 

నన్ను నేను సంహరించి 
నగ్నంగా  నిలిచిపోయి
నవ్వుకుని నవ్వుకుని 
చాలా రోజులైంది 

నట్టేటను నిన్ను ముంచి 
నా దారిన నేనుపోయి 
కొండకొమ్ము నుంచి దూకి 
చాలా రోజులైంది 

కాళ్ళనున్న మట్టి తుడిచి
కల్మషాల కడిగివేసి
కాళీ పదముల నంటి
చాలారోజులైంది 

రొచ్చులోన మునిగిపోయి
రోదనలను మరిగిపోయి 
పాతాళపు పల్లె జేరి 
చాలారోజులైంది 

యోనిచక్ర మండలాన
యోచనలను సంహరించి
యోగారూఢత నొంది 
చాలా రోజులైంది   

మకారాలు ఒదిలిపెట్టి 
మత్తులోన మునిగిపోయి 
మంచుకొండ కొమ్ము జేరి 
చాలా రోజులైంది 

కపాలపు రాజ్యమందు 
కస్తూరీ యంత్రమ్మున
కన్యలెందరినో కలిసి
చాలా రోజులైంది 

వింతదైన తంత్రమ్మున
విద్యలెల్ల సాధించి
వికటంగా నవ్వు నవ్వి
చాలా రోజులైంది 

అమావాస్య రోజులలో 
అన్నిటినీ బలినొసంగి
అమ్మ పాదములు తాకి 
చాలా రోజులైంది

అష్టకష్టముల నీది 
అష్ట కన్యకల నడుమ 
అద్భుత రతులను తేలి
చాలా రోజులైంది

అసహ్యపు లోకమొదిలి
తంత్రాన్వయ సీమలోన
తన్మయత్వమును బొంది
చాలా రోజులైంది

మన్మధుణ్ణి మసిని చేసి 
రతీదేవి చెయ్యిపట్టి 
భైరవత్వమున నిలిచి 
చాలా రోజులైంది......