నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

18, జూన్ 2013, మంగళవారం

ఆత్మహత్యా యోగాలు-జియాఖాన్ జాతకం

ఒక బ్లాగ్మిత్రురాలు నిన్న మెయిల్ చేస్తూ ఇలా అడిగింది.

'జియాఖాన్ జాతకం ఒకసారి చూస్తారా?ఆమె ఆత్మహత్య చేసుకోడానికి జ్యోతిష్యపరంగా కారణాలు ఏమున్నాయో కొంచం చూడగలరా?'

గురువు రాశిమారిన తర్వాత ఇలాటివి జరుగడం,చాలామంది జీవితాలలో అనూహ్య మార్పులు రావడం   ఊహించినదే గనుక ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.జ్యేష్టమాస జాతకంలో కూడా ఆడపిల్లలు ప్రేమలో పడి మోసపోయే కోణం ప్రస్తావించాను.కాని మిత్రురాలు అడిగిన తర్వాత ఒకసారి ఈ నటి జాతకం చూద్దామనిపించింది.

చనిపోయినవారి జాతకాలను సామాన్యంగా నేను చూడను.అయితే వారు ప్రముఖులు అయితే రిసెర్చ్ కోసం ఎప్పుడైనా వారి జాతకాలు చూడవచ్చు అని భావిస్తాను.పైగా ఈ మధ్య ఒక వింతవిషయం నాకు కనిపిస్తున్నది. బ్రతికున్నవారిలోనే నాకు పిశాచాలు దర్శనం ఇస్తున్నాయి. చనిపోయిన వారు నిస్సహాయులు.పాపం ప్రేతాత్మలుగా ఉండి బాధలు పడుతుంటే ఎప్పుడైనా కనిపించి ఏదైనా సాయం అడుగుతారు గాని అంతకంటే వారు ఏమీ చెయ్యలేరు.దానికి భిన్నంగా బతికున్నవారిలోనే అసలైన పైశాచికత్వం రాక్షసత్వం నాకు కనిపిస్తున్నాయి. కనుక చనిపోయినవారి జాతకాలు చూస్తె తప్పేమిటి అనిపించింది.

సాంప్రదాయ జ్యోతిష్యంలో ఆత్మహత్యా యోగాలు బలవన్మరణ యోగాలు చాలా ఇవ్వబడ్డాయి. ఏఏ రకాలుగా వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకుంటారు?వాటికి ఏఏ గ్రహయోగాలు కారణాలు అవుతాయో కూడా కొన్నిచోట్ల క్లుప్తంగానూ కొన్నిచోట్ల విపులంగానూ చర్చ జరిగింది.

ముఖ్యంగా జైమిని సూత్రాలలో మనం చూస్తె, లగ్నాత్ తృతీయానికి గానీ,ఆత్మకారకాత్ తృతీయానికి గానీ పాపగ్రహసంబంధం ఉంటే బలవన్మరణం లేదా అసహజ మరణం ఉంటుందని వ్రాసి ఉన్నది.

ఈ అమ్మాయి 20-2-1988 న న్యూయార్క్  లో పుట్టింది.జననసమయం నాకు దొరకలేదు.కనుక లగ్నం మనకు తెలియదు.దానిని కూడా కనిపెట్టవచ్చు.కాని అంత శ్రమపడాల్సిన అవసరం లేదు.మిదునలగ్నం అయి ఉండవచ్చు అని ఇంట్యూషన్ చెబుతున్నది.అప్పుడే ఈ అమ్మాయి జీవితం కరెక్ట్ గా సరిపోతుంది. తృతీయానికి  రవిద్రుష్టి ఉన్నది. రవిదృష్టి ఉన్నపుడు ఉరివంటి అసహజ మరణాలు ఉంటాయని జైమిని సూత్రాలు చెప్పాయి.

లేదా సినిమా నటులకు బాగా అచ్చివచ్చే తులాలగ్నం కావచ్చు.అప్పుడు కూడా తృతీయానికి పాపసంబంధం ప్రబలంగా ఉన్నది.ఈ లగ్నం అయినప్పుడు బలవన్మరణ యోగం కూడా కొంత సరిపోతుంది.పైగా తులా లగ్నం వారు ప్రస్తుతం శపితయోగ పరిధిలో ఉన్నారు.


చంద్రుడు కానీ బుధుడు కానీ ఈ అమ్మాయికి ఆత్మకారకుడు అయి ఉండాలి.చంద్రుని నుంచి చూస్తె జైమిని యోగం లేదు.పోతే బుధుడు వక్రి.అంతేగాక అతని నుంచి బలమైన జైమిని యోగం ఉన్నది.కనుక బుదుడే ఈమె ఆత్మకారకుడు.పైగా బుధ కారకత్వాలైన సున్నితత్వమూ, కళాభినివేశమూ ఈ అమ్మాయిలో ఉన్నవి.ఇవి గాక చూడగానే కొన్ని యోగాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.
  • శనికుజుల యోగం యాక్సిడెంట్లకూ అసహజ మరణానికీ సూచిక.  
  • చంద్ర,రాహు యోగం వల్ల అతి చంచల మనస్సు ఉంటుంది.ఉచ్ఛ శుక్రుని తోడువల్ల త్వరగా అందరినీ నమ్మడం ప్రేమలో పడటం ఉంటుంది.
  • వక్రిబుధుని వల్ల సున్నిత స్వభావం,తనలో తానె కుమిలిపోవడం ఉంటాయి.అదీగాక ఈ అమ్మాయిది రేవతీ నక్షత్రం. రేవతీ నక్షత్రం వారు సున్నిత మనస్కులు.తేలికగా ఇతరులను నమ్ముతారు.కనుక మోసాలు బాధలు తప్పవు.
  • నవాంశలో శనిబుధుల యోగం వల్ల తేలికగా డిప్రెషన్ లోకి వెళతారు.
  • మీనంలో ఉన్న మూడు గ్రహాలమీద శనికుజుల సమ్మిలిత దృష్టి గమనార్హం.ప్రేమ+వృత్తి+సున్నితమనస్తత్వం+అత్యాశ+డిప్రెషన్+ యాక్సిడెంట్ లను ఈ యోగం సూచిస్తున్నది.

గోచారం (3-6-2013)

  • గోచార చంద్రుడు జనకాల చంద్రునికి చాలా దగ్గరగా అదే రేవతీ నక్షత్రంలో ఉన్నాడు.  
  • గోచారశుక్రుడు జననకాల శనికుజులకు సరియైన అపోజిషన్లో ఉన్నాడు.
  • గోచార బుధుడు కూడా ఈ శుక్రునికి దగ్గరగానే ఉన్నాడు.
  • ఈ అమ్మాయికి చంద్రలగ్నాదిపతి అయిన గోచారగురువు అప్పుడే రాశిమారి సున్నాడిగ్రీలలో బలహీనుడుగా ఉన్నాడు.
దశలు

జనన సమయం ఖచ్చితంగా దొరకనందున దశలు ఖచ్చితంగా నిర్దారించ లేము.కాని ఊహప్రకారం ఈ అమ్మాయికి ఇప్పుడు శుక్రదశలో కుజ అంతర్దశ జరుగుతూ ఉండవచ్చు.కనుక ప్రేమవ్యవహారంలో పడి చావుకొని తెచ్చుకుంది.

మనుషులకు అత్యాశ ఎక్కువై పోయిన నేటి సమాజంలో చదువులో ర్యాంకుల దగ్గరనుండి,జీవితంలో అవకాశాలు రావేమో సరిగా స్తిరపడలేమేమో అనే అభద్రతాభావం ప్రతిదానిలోనూ చాలామంది పిల్లలలో పెరిగిపోతున్నది. ఇటువంటి భావాలు ఉన్న పిల్లలపట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా సున్నిత మనస్కులైన పిల్లలను జాగ్రత్తగా కంటికి రెప్పలా కాచు కోవాలి.అలా చెయ్యకుండా ఇంకాఇంకా వారిని టెన్షన్ కు గురిచేసి హింస పెడితే చివరికి ఆత్మహత్యలే మిగులుతాయి.

జియాఖాన్ ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అందరికీ చాలావరకూ తెలుసు. కాని చదువులో టెన్షన్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్న పిల్లలను చూస్తె మనసు వికలమై పోతుంది.ఈ సంఘటనల బాధ్యత చాలావరకూ తల్లిదండ్రులదే అని చెప్పాలి.ప్రతివారిలో స్వార్ధమూ,దురాశా పెరిగిపోతున్న నేటి వ్యవస్థలో ఇమడలేని అమాయకులు చెల్లిస్తున్న మూల్యాలుగా వీటిని భావించాలి.వీటిలో కుటుంబ సభ్యుల పాత్ర ఎంత?చుట్టూ ఉన్న వ్యవస్థ పాత్ర ఎంత అనే విషయాలు ఎవరు ఆలోచిస్తారు?నేటి పరుగుపందెపు జీవితాలలో అలా ఆలోచించే సమయం ఎవరికుంది???