ఎప్పుడో ఇరవై అయిదేళ్ళ క్రితం వ్రాసుకున్న కొన్నిపద్యాలు ఈరోజు పాతపెపర్ల లోనుంచి బయటపడ్డాయి. వాటిని నా అభిమానుల కోసం ఇక్కడ ఇస్తున్నాను.వాటి అర్ధం చాలా సులభంగా గ్రహించవచ్చు.వివరణ అక్కర్లేదు. అన్నీ కందపద్యములే. యధావిధిగా అన్నీ యోగవేదాంత విషయికములే.
చింతలు దొలగుట యోగము
సంతత ధారావాహిగ సత్తై వెలుగన్
అంతము గావలె యాశలు
పంతముగా యోగమన్న పాటిది సత్యా
2.
చూచెడి బొమ్మను గాదని
చూపున్ బ్రతినిముషమందు చూచెడు ఘనుపై
మాపును రేపును మదిలో
యోపించగ నిల్పి జూడు చోద్యము సత్యా
3.
నందానందుని బోధను
డెందములో నిల్పినీవు జెదరని నిష్ఠన్
అందని ఆత్మజ్ఞానపు
చంద్రుని నీలోన నిల్చి చూడర సత్యా
4.
చెల్లని వ్యర్ధపు మాటలు
కల్లలురా వదలి వాని నాత్మను లోలో
చల్లగ వీక్షింపు మనుచు
నెల్లలు దాటించు గురుని నెంచర సత్యా
5.
ఇతరములన్నియు మిధ్యలు
సతతము నీలోని యాత్మ నెరుగ మటంచున్
హితముల నెన్నో దెల్పిన
మితభాషణుడైన గురుని మరువకు సత్యా
6.
అంతర్యోగంబటంచు
వింతగ నేమో జేతురు వేడ్కలు దీరన్
ఇంతకు యోగంబటన్న
అంతరికము గాక బాహ్యమౌనా సత్యా?
7.
నీలో లేరా వేల్పులు?
లోలోపల వెదకిజూడ లోతులు దెలియున్
నీలోని యాత్మ దెలియక
నేలను లంఘించి సాములేలర సత్యా
8.
కర్మల గలుగును జన్మలు
కర్మల వల్లనె బుట్టును మరిమరి కర్మల్
కర్మల వివరము నెరిగిన
మర్మమ్ములు విచ్చిపోవు మహిలో సత్యా
9.
కుండలినీ యోగమ్మును
అండగ నేర్పించు గురులు అరుదుర వింటే
మెండగు సాధన రీతుల
కొండలు దాటించు ఘనుడు గురుడగు సత్యా
10.
మాయా మర్మపు లోకము
ఛాయా మాత్రముగ జూచి చెన్నుగ మదిలో
కాయాతీత రహస్యము
ఆయా సాధన రీతుల నందర సత్యా
11.
వాదన లెల్లను మీరుచు
రోదనముల మోసమెల్ల రోయుచు నిలలో
బాధామయ బంధమ్ముల
ఛేదించుము యోగబలిమి చెదరక సత్యా
12.
నందుని మాటల దలచుచు
అందముగా యనుసరించి యాతని బోధల్
డెందమ్మున మౌనమూని
బంధమ్ముల మించుమింక బాగుగ సత్యా