నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

11, జులై 2013, గురువారం

మానవుని అహంకారం-మరికొన్ని పద్యములు

ఈరోజు ఆశువుగా వచ్చిన కొన్ని పద్యాలు ఇక్కడ ఇస్తున్నాను.'కందం చెప్పగలవాడే కవి' అన్న సామెత వల్లనో ఏమో చాలావరకూ కందపద్యాలే పలికాయి.చివరలో రెండు మాత్రం ఆటవెలది పద్యాలు.అర్ధం సులభగ్రాహ్యమే అయినప్పటికీ ఒక మిత్రురాలి విజ్ఞప్తి మేరకు దానిని కూడా వ్రాశాను.

1.
అహమున జిక్కిన మనుజుల
బహుపూజల ఫలితమెల్ల బూదిని గలియున్  
ఇహపరముల జెడిపోదురు
మహనీయత నందబోరు మహిలో సత్యా

అహంతో విర్రవీగే మనుషులు ఎన్నెన్ని పూజలు చేసినా వారికి ఫలితం అంటూ ఏమీ ఉండదు.వాటి ఫలితం అంతా బూడిదలో కలిసిపోతుంది. అహంకారులు ఇహంలోనూ పరంలోనూ కూడా ఏమీ సాధించలేరు. మహనీయులు కాలేరు.

2.
యాత్రలు కల్లలు వినుమా
పాత్రత లేనట్టి పాట్లు పాడగు వెతలున్
గాత్రమ్మున శుద్ధి మరచి
ఆత్రమ్ముగ పాడబోవు యాతన సత్యా

అహంకారంతో యాత్రలు చెయ్యడం వృధాప్రయాస.పాత్రతను బట్టి మనకు ఫలం దక్కుతుంది గాని,అది లేకపోతే మనం పడే పాట్లన్నీ చివరికి ఏమీ ఫలితాన్ని ఇవ్వలేక అగచాట్లుగా మారతాయి.పాత్రత లేకుండా యాత్రలు చేసేవారు గాత్రశుద్ది లేకుండా గానం చెయ్యాలని ఆశపడే ఆత్రగాళ్ళ మాదిరి ఉంటారు.

3.
సతులందరు మాయయనెడి
సుతులందరు ఋణము లనెడి సత్యము వినుమా
మితిమీరిన యాశ విడచి
మతిచెదరని యోగనిష్ట మరుగర సత్యా

భార్యాపిల్లలు బంధువులు స్నేహితులు ఋణానుబంధాలన్న సంగతి గ్రహించు.ఆశను బొత్తిగా విడచిపెట్టు.స్థిరమైన మనస్సుతో యోగనిష్టుడవై ఉండు.

4.
ఆశల రుచులను మరగుచు
పాశంబుల బద్ధుడౌచు పడియుండు నరున్
ఆశల బాపును కర్మము 
పాశంబుల దీర్చు మిత్తి పరుగున సత్యా

ఆశల రుచిని మరగి,అష్టపాశములలో చిక్కి కదలలేని మనుష్యులకు వారివారి కర్మమే బుద్ధి గరపుతుంది.చివరకు మరణమే వారి బంధాలను విడదీస్తుంది.

5.
అహమున జిక్కెను సర్వము
అహరహమును నందులోనె యమరుచు నడచున్ 
అహమన్న మిధ్య జూడగ 
ఇహమందున నిదియె వింత నెరుగర సత్యా 

లోకం మొత్తం 'అహం' అనే ఉచ్చులో చిక్కి నిత్యమూ అందులోనే అఘోరిస్తూ ఉన్నది.ఇంతా చూస్తె 'అహం' అనేది అసలు లేనేలేదు.అదొక ఎండమావి. ప్రపంచంలో ఇదే పెద్ద వింత.దీనిని మించిన వింత లేనేలేదు.

6.
ఇహమందున పరమందున
అహమే యసలైన శత్రువనుటను వినుమా
అహమంత విచ్చిపోవగ
అహమే మిగులును జివరకు ననువుగ సత్యా

ఈలోకంలోగాని పరలోకంలోగాని మనిషికి అహంకారమే అతి పెద్ద శత్రువు. ఈ అహంకారం మొత్తం నాశనమైతే చివరికి సత్యమైన తానే మిగులుతాడు.

7.
ఒరులెవ్వరు లేరిచ్చట 
పరులను మదినెంచి జూడ పాపము గలుగున్ 
గురిగా జూచెడి చూపున 
సరియగు యాత్మగనె దోచు సర్వము సత్యా

ఈ ప్రపంచంలో పరాయివారంటూ ఎవ్వరూ లేరు.పరులు అనుకోవడం పాపమే.గురిగా సరిగా చూచితే సర్వం ఆత్మమయంగానే కనిపిస్తుంది.

8.
యమ నియమపు నీమమ్ముల
సమయోచితముగ దెలియుచు సాధన రీతుల్
అమనస్కపు మార్గమ్మున
విమలాత్మను బొంది జూడు వింతను సత్యా

యమనియమాది విధులను చక్కగా పాటిస్తూ,సాధనా రీతులను సరిగ్గా అనుసరిస్తూ, అమనస్క యోగాన్ని సాధించి,కల్మషం లేని ఆత్మను అనుభవంలో పొంది, అప్పుడు కనిపించే అసలైన వింతను చూడాలి.

9.
ఒడలంతయు బూదినలది 
మడిగట్టుక బూజ సేయు మనుజుని మదిలో .
దడవుచు వాసనలుండిన
అడుగున బురదల చెరువగు నతడిక సత్యా

ఒకడు ఒళ్లంతా బూడిద పూసుకుని మడి కట్టుకుని పూజలు చేసినా,అతని అంతరంగంలో వాసనలు ఉంటే ఆ పూజల ఫలితం సున్నాయే.అడుగున బురద ఉంచుకుని పైపైన మాత్రం మంచి నీరు కలిగిఉండే చెరువు మాదిరి ఈ వ్యవహారం ఉంటుంది.

10.
లోకాచారము లెల్లను
నాకటముగ మీరవలయు నీభువి యందున్
లోకుల మాటలు జూడగ
వాకిట దివ్వెలు కడమను జీకటి సత్యా 

సాధకులు లోకాన్ని ఎప్పుడూ లెక్క చెయ్యకూడదు.దానిని సునాయాసంగా అధిగమించాలి.కారణం ఏమంటే,వాకిటిలో మాత్రం దీపం ఉండి,ఇంటి లోపల అంతా చీకటి ఉన్నట్లుగా లోకుల మాటలు ఉంటాయి.అవి పైపై పూతలు. కనుక వాటిని లెక్కించ పనిలేదు.

11.
వదరుబోతులెల్ల నొకచోట గుమిగూడి 
శాస్త్ర చర్చయనుచు సాగదీయ 
ఎవనికైనగాని యనుభవమ్మది లేక
రచ్చ యగును గాని రక్తి నిడదు

అనుభవం లేని వాగుడుకాయలందరూ ఒకచోట చేరి శాస్త్రచర్చ చెయ్యబోతే అది చివరికి రచ్చ అవడమే గాని ఫలితం ఉండదు.ఏకాభిప్రాయమూ రాదు.

12.
తిండి కొరకు నేల దిరిగేటి జీవుండు
మూడునాళ్ళ కొరకు మోహమంది
తానె ఘనుడ నంచు తైతక్క లాడంగ
పంచభూత చయము పక్కుమనియె

ప్రపంచంలో ఎంతటి మానవుడైనా విర్రవీగవలసిన అవసరం ఏమాత్రమూ  లేదు.ఎందుకంటే,ప్రతి మనిషీ బతుకుతున్నది తిండికోసం మాత్రమే.తినితిని చివరికి చావడం తప్ప ఇక్కడ ఎవరైనా ఉద్దరిస్తున్నది ఏమీలేదు. ఒకవేళ ఎవడైనా అలా అహంకరిస్తే పంచభూతాలు వాడిని చూచి పక్కుమని నవ్వుతాయి.ఎందుకంటే,వాటి కళ్ళముందు ఇలాంటి అల్పులైన నరులు కోటానుకోట్లు గతించారు.అవి శాశ్వతములు.మానవులు కాదు.
read more " మానవుని అహంకారం-మరికొన్ని పద్యములు "

9, జులై 2013, మంగళవారం

హస్త సాముద్రికం-2

జ్యోతిష్యాది రహస్యవిద్యలలో బాగా ప్రావీణ్యం వస్తే ఒక విచిత్రం జరుగుతుంది. ఒక మనిషిని కొద్దిసేపు గమనిస్తే అతని మనస్తత్వమే గాక,ఆ మనిషి ఏమి చేస్తాడు? అతని నిజస్వరూపం ఏమిటి? అతను ఇంతకు ముందు ఏమేం నేరాలు గట్రా చేసాడు? అసలితన్ని నమ్మవచ్చా? ఒకవేళ నమ్మితే ఎంతవరకు నమ్మవచ్చు? మొదలైన విషయాలు కూడా వెంటనే తెలుస్తాయి. అయితే తెలిసిన ప్రతి విషయమూ వెంటనే బయటకు చెప్పడం కూడదు.అలా చెబితే గొడవలు జరుగుతాయి.కొన్ని సార్లు సంసారాలు విచ్చిన్నం అవుతాయి. జీవితాలే నాశనం అవుతాయి.అందుకే తెలిసినా తెలియనట్లు ఊరుకోవడం జరుగుతుంది.

నాకు ఎదురైన వ్యక్తుల హస్తరేఖలను చూచీ చూడనట్లుగా పరిశీలించడం నా అలవాటు.అదికూడా 'ఏదీ మీ చెయ్యి ఒకసారి చూపించండి' అని అడిగి చూడను.వారితో మాట్లాడే సమయంలో వారివారి హావభావ విన్యాసాలలో చేతులు అటూఇటూ తిప్పే సమయంలో ఆయారేఖలు ఇతరగుర్తులు కనిపిస్తాయి.దానినిబట్టి పైన ఉదహరించిన విషయాలన్నీ సునాయాసంగా  తెలిసిపోతాయి.లోలోపల నవ్వుకుని బయటకు మాత్రం  మామూలుగా ఊరుకుంటాను.

మామూలుగా అందరి చేతుల్లో కనిపించే రేఖలు కాకుండా కొందరి చేతులలో కొన్ని ప్రత్యెక గుర్తులు,రేఖలు ఉంటాయి.అలాంటివి ఎన్నాళ్ళైనా సరే అలా  గుర్తుండిపోతాయి.

ఉదాహరణగా అలాంటివి మూడు కేసులు చెబుతాను.

ఒకసారి ఒకాయన చేతిలో ఒక విచిత్రమైన రేఖను చూచాను.దాని ప్రకారం అతను మేకవన్నె పులి అనీ,పరమ స్వార్ధపరుడనీ,తన కుటుంబం అంటే కూడా ఏమాత్రం ప్రేమ లేనివాడనీ,ఏమాత్రం నమ్మదగిన వ్యక్తి కాదనీ వెంటనే గ్రహించాను.

ఆ తర్వాత విచారిస్తే,అతనికి సెకండ్ ఫామిలీ ఉందనీ,తనను అమితంగా ప్రేమించిన భార్యను మోసం చేసి ఇంకొక ఆమెను ఉంచుకున్నాడనీ,నోరు తెరిస్తే అబద్దాలు చెబుతాడనీ,తన స్వార్ధం కోసం ఎవరినైనా బలి చెయ్యడానికి వెనుకాడడనీ తెలిసింది.

ఈ సంఘటన జరిగి ఇరవై ఏళ్ళయింది.ఈ మధ్యనే జరిగిన ఇంకొక రెండు సంఘటనలు చెబుతాను.

ఒకామెతో కాజువల్ గా మాట్లాడే సమయంలో ఆమె చేతిలో ఒక విచిత్రమైన గుర్తు కనిపించింది.దానిప్రకారం ఆమెకు అనేకమందితో శారీరిక సంబంధాలు ఉండాలి.కాని ఆమెను చూస్తె చాలా పద్దతిగా సంసారపక్షంగా  కనిపించింది. చాలా మర్యాదగా మాట్లాడుతుంది కూడా.వాళ్ళ ఆయన కూడా సమాజంలో మంచి వ్యాపారస్తుడు.ఈమె చేతిలో ఈ గుర్తు ఉందేమిటా అని తెలిసిన వారిని విచారిస్తే,ఆమె ఒక హైక్లాస్ కాల్ గర్ల్ అనీ,పెద్దపెద్ద వాళ్ళతో మొబైల్ ద్వారా పరిచయాలు కలిగి ఉందనీ,మొబైల్ లోనే అప్పాయింట్మెంట్ తీసుకుని అక్కడకు వెళ్లి వస్తూ ఉంటుందనీ,మొగుడూ పిల్లలూ ఉన్నాకూడా ఈమెకు ఇదొక సరదా అనీ,కానీ వ్యక్తిగతంగా మంచివ్యక్తి అనీ,మిగిలిన అన్ని విషయాలలో చాలా పద్దతిగా ఉంటుందనీ తెలిసింది.

ఇంకొక వ్యక్తితో యదాలాపంగా మాట్లాడుతున్నపుడు అతని చేతిలో ఇంకొక  విచిత్రమైన గుర్తు కనిపించింది.దానిప్రకారం అతనొక క్రిమినల్ అయి ఉండాలి.నేరచరిత్ర కలిగినవాడై ఉండాలి.కాని ప్రస్తుతం అతను చాలా మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాడు.సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో కూడా ఉన్నాడు.ఇదేమిటో అర్ధం కాలేదు.తర్వాత విచారిస్తే,ఈ స్థాయికి రాకముందు కొన్ని సంవత్సరాల క్రితం అతను రెండు హత్యలు చేశాడనీ ఆ సంగతి సంఘంలో అందరికీ తెలుసనీ,కాని ఎవిడెన్స్ లేకుండా చేసి తప్పించుకున్నాడనీ,ప్రస్తుతం అతనున్న రాజకీయస్థాయిలో అతన్ని ఎవరూ ఏమీ చెయ్యలేరనీ అర్ధమైంది. 

ఇలాంటివి ఎన్నో కేసులు నేను గమనించాను.ప్రతిసారీ ఈ పరిశీలనవల్ల నాకు కొన్ని నిజాలు తెలిశాయి.సాముద్రికం ఎంత గొప్ప సైన్సో అర్ధమైంది.

మన వ్యక్తిత్వమూ,మన అలవాట్లూ మన చేతిలోని రేఖలలో గుర్తులలో ప్రతిబింబిస్తూ ఉంటాయి.సంఘానికి తెలియని మనలోని చీకటి కోణాలు కూడా వాటివల్ల స్పష్టంగా కనిపిస్తాయి.అంతేకాదు మన ఆరోగ్య స్థితీ,మన జీవితంలో జరగబోయే సంఘటనలూ కూడా చేతిలో ప్రతిఫలిస్తూ ఉంటాయి.ప్రతి మనిషీ తన జాతకాన్ని తన చేతిలోనే ఉంచుకుని తిరుగుతూ ఉంటాడు.

సాముద్రికశాస్త్రం ఒక అద్భుతమైన విద్య అని పై సంఘటనలను బట్టి నాకు గట్టి నమ్మకం ఏర్పడింది.అంతేకాదు,సరిగ్గా చదవగలిగితే హస్తరేఖలు మన బంధువుల,పిల్లల జాతకాలను కూడా ప్రతిబింబిస్తాయనీ,అంతేగాక మన భవిష్యత్తునూ,మన గతజన్మలను కూడా వాటివల్ల తెలుసుకోవచ్చనీ నాకు విశ్వాసం కలిగింది.
read more " హస్త సాముద్రికం-2 "

7, జులై 2013, ఆదివారం

ఆషాఢ శుక్ల పాడ్యమి - దేశజాతకం



ఆషాఢమాసంలో మన దేశ జాతకం ఎలా ఉందో చూద్దాం.

సోమవారం పునర్వసు నక్షత్రంలో వ్యాఘాతయోగంలో కింస్తుఘ్న కరణంలో చంద్రహోరలో ఆషాఢ మాసం మొదలైంది.

ఈ నెలలో కాలసర్పయోగం దేశాన్ని కాటేస్తున్నది.కనుక ఒక సంక్షోభాన్ని దేశం ఎదుర్కోబోతున్నది.

రాజకీయాలూ,పరిపాలనా తీవ్ర ఒడుదుడుకులకు లోనౌతాయి.అనేక రకాలైన ప్రభావాలకు లోనై అడ్మినిస్ట్రేషన్ గందరగోళం అవుతుంది.

ఆర్ధికరంగం అద్వాన్నంగా ఉంటుంది.షేర్ మార్కెట్లు మొదట్లో బాగున్నట్లు ఉంటాయి.మధ్యలో ఊగులాడుతూ ఉంటాయి.చివరకు మళ్ళీ నిలదొక్కు కుంటాయి.

ఎదుటివారు ఏమైపోతే నాకేమిటి అనుకుంటూ నాయకులూ ప్రజలూ ఎవరికివారు అబద్ధాలు చెబుతూ స్వలాభం కోసం సిగ్గులేకుండా ప్రయత్నిస్తారు.

నాయకుల మధ్య అభిప్రాయభేదాలు,విమర్శలు తీవ్రస్థాయికి చేరుతాయి.మాఫియా కార్యకలాపాలూ,నల్లధనపు లావాదేవీలూ బాగా జరుగుతాయి. 

ధర్మాధర్మాల భేదం తెలియకుండా,మంచీ చెడూ అన్న విచక్షణ లేకుండా ఎవరికి వారు స్వార్ధపరతతో ప్రవర్తిస్తారు.

జూలై 16,17,18 తేదీలలో ఆర్ధిక ఒడుదుడుకులు ఉంటాయి.ప్రజాజీవితం కల్లోలానికి గురవుతుంది.

28,29 తేదీలలో దేశం ఒక నష్టాన్ని ఎదుర్కొంటుంది.జూలై 14 నుంచి 28 వరకూ నవాంశలో మకరరాశిలో శనిగురుల సంయోగం వల్ల భారతదేశం చాలా చెడు పరిస్తితిని ఎదుర్కొంటుంది.

క్రమేణా పరిస్థితులు చక్కబడతాయి.ఎన్ని జరిగినా సర్దుకొనిపోయే మనస్తత్వం మన జనానికి అంతర్లీనంగా ఉండటంవల్ల చివరికి అంతా సర్దుకుని గాడిలో పడుతుంది.
read more " ఆషాఢ శుక్ల పాడ్యమి - దేశజాతకం "

4, జులై 2013, గురువారం

కాలజ్ఞానం-20

ప్రముఖులకేమో గండాలు 
పెద్దవారికే ప్రమాదాలు 
అందే పైలోక పిలుపులు 
ఒకటీ రెండు రోజుల్లో 

కర్మ ప్రభావం దురూహ్యం 
తప్పుకోవడం అసాధ్యం 
విర్రవీగితే ఫలితం శూన్యం 
లయమే కాలపు మలుపుల్లో
read more " కాలజ్ఞానం-20 "

1, జులై 2013, సోమవారం

కల్యాణానంద భారతీస్వామి స్మృతులు -5

'మీ గురువుగారు అలాంటి మాటలు వ్రాశారని మీరు బాధపడుతున్నారా?' అడిగాను.

'అబ్బే అదేం లేదు.' అన్నాడాయన.

'చూడండి.మీరు ఉన్నది ఉన్నట్లుగా చెబితేనే నేను మీకు ఏదైనా వివరించ గలను.మనసులో ఒకటి అనుకుంటూ బయటకు 'అబ్బే ఏమీ లేదు' అంటే నేను చెప్పేదేమీ ఉండదు.' అన్నాను.

ఆయన కొంచం సేపు నావైపు చూచాడు.

'అవునండి.మా గురువుగారంటే నాకు చాలా ఉన్నతాభిప్రాయం ఉన్నది. అలాంటి వ్యక్తి ఇలాంటి భాష వాడారంటే నమ్మలేకపోతున్నాను.చాలా బాధగా ఉన్నది'అన్నాడు.

నాకు నవ్వొచ్చింది.

'చూడండి సార్.మీకు కొన్ని వాస్తవాలు చెబుతాను.మీకు ఇప్పటివరకూ మీ గురువుగారంటే చాలా ఉన్నతమైన అభిప్రాయం ఉన్నది.నిజమేనా?'

'అవును.'

'మరి నా సంగతి చెప్పనా?ఇప్పటివరకూ మీ గురువుగారంటే నాకూ గౌరవభావం ఉండేది.కాని ఇప్పుడు ఆయన వ్రాసిన ఆ తిట్లు చూచాక ఆ గౌరవం వందరెట్లు పెరిగింది.' అన్నాను.

ఆయన అయోమయంగా చూచాడు.

'అదేంటి' అన్నాడు.

'చెప్తా వినండి.నేను ఆ పుస్తకంలో మీకు చూపించిన విషయాలు చదివిన తర్వాత మీకు ఇప్పటివరకూ ఉన్న మంచిఅభిప్రాయం స్థానే కొంచం తేలికపాటి అభిప్రాయం మొదలైంది.ఈ రెండు అభిప్రాయాల మధ్యన ఘర్షణ వల్ల మీ మనసులో అలజడి అశాంతి కలుగుతున్నాయి.మీ అభిప్రాయాలను కాసేపు పక్కన ఉంచండి.వీటివల్ల మీ స్వాములవారి వ్యక్తిత్వంలో ఏమైనా మార్పు కలిగిందా?' అడిగాను.

'లేదు.' అన్నాడు.

'కనుక విషయం ఏమిటంటే,గౌరవం అయినా,చులకన భావం అయినా అది మీ మనసులోదే గాని దానివల్ల మీ స్వామి యొక్క నిజస్వరూపానికి ఏమీ భంగం వాటిల్లలేదు.ఆయన ఎప్పుడూ ఉన్నట్లే ఇప్పుడూ ఉన్నాడు. అవునా?' అడిగాను.

'అవును'అన్నాడు.

'మీరు ఏర్పరచుకున్న అభిప్రాయం వల్లనే మీకు గౌరవమూ,బాధా కలిగాయి.మీ మనస్సే మిమ్మల్ని సంతోషపెడుతున్నది.లేదా బాధ పెట్టింది. అంతేనా?'

ఆయన కొంచం సేపు ఆలోచించాడు.

'అవును'అన్నాడు మళ్ళీ.

'మీ మనసులో మీరు ఊహించుకున్న స్వాములవారి ఉన్నతమైన రూపం వల్ల మీకు ఇప్పటిదాకా ఆయనంటే గౌరవం కలిగింది.ఇప్పుడు మీరు చదివిన బూతు మాటలవల్ల ఆ రూపం కొంచం చెదిరిపోయింది.కనుక మీకు బాధ కలిగింది.అంతే కదా?'

'నిజమే'

'కనుక మీ మనసులో మీరు ఏర్పరచుకున్న మీ గురువుగారి రూపాన్నే మీరు గౌరవిస్తున్నారు గాని నిజమైన మీ గురువుగారి స్వరూపాన్నీ తత్వాన్నీ కాదు.ఈ రెండూ వేర్వేరు.మీరనుకుంటున్న గురువుగారు వేరు.నిజమైన గురువుగారు వేరు.మీరు పూజిస్తున్నది మీరు చిత్రించుకున్న బొమ్మనే గాని నిజమైన మీ గురువుగారిని కాదు.అంతే కదా?' అడిగాను.

ఆయన కొంచం సంశయంగా 'దాదాపుగా అంతే' అన్నాడు.

'మళ్ళీ ఇందులో 'దాదాపుగా' ఎందుకు? అవునా కాదా?చెప్పండి?'అడిగాను.

'అంతే.' అన్నాడు.

'అంటే మీ మనసులో ఉన్న మీ గురువుగారి ఇమేజి అబద్దమైనది.సత్యమైన మీ గురువుగారి స్వరూపం కాదు.అందుకే అది చివరికి మిమ్మల్ని బాధ పెట్టింది.అసత్యం నుంచి ఆనందం రాదు అనేది అందుకే.తాత్కాలికంగా అది ఆనందాన్ని ఇవ్వవచ్చు.కాని చివరికి అది మిగిల్చేది దుఖమే.మనకు నచ్చకపోయినా సత్యమే ఆనందాన్ని ఇస్తుంది.అసత్యం ఇవ్వదు' అన్నాను.

ఆయనేమీ జవాబు చెప్పలేదు.

'ఇప్పుడు మీరు నమ్మలేని కొన్ని నిజాలు చెబుతాను.వింటారా?' అడిగాను.

'చెప్పండి' అన్నాడు.

'శ్రీరాముడు శ్రీకృష్ణుడు మొదలైన అవతార పురుషులు మాంసం తిన్నారనీ మద్యం తాగేవారనీ మీకు తెలుసా?బుద్ధుడూ జీసస్ కూడా అవి తిన్నారనీ తాగారనీ మీకు తెలుసా?కృష్ణుడు రాత్రిళ్ళు మద్యం తాగి ధ్యానంలో ఉండేవాడని తంత్రగ్రంధాలు చెబుతాయి.ఈ విషయం మీకు తెలుసా?' అడిగాను.

'కొంత తెలుసు.కొంత తెలియదు' అన్నాడు.

'అది తప్పా కాదా?' అడిగాను.

'తప్పు కాకపోవచ్చు.ఆయా కాలానికి ఆయా కులాలకు అది తప్పు కాక పోవచ్చు.'అన్నాడు.

'రామకృష్ణుడు పల్లెటూరి బూతుమాటలను తరచుగా తన మాటల్లో అతి మామూలుగా వాడేవాడు.షిర్డీసాయిబాబా తరచుగా మనం వినలేనంత ఘోరమైన బూతుల్లో జనాన్ని తిట్టేవాడు.అఘోరీ సాధువులు మాట్లాడే బూతులను వింటే వాటిని సహజంగా మాట్లాడే పల్లెప్రజలు కూడా వినలేక చెవులు మూసుకుంటారు.అవి అంత చండాలంగా ఉంటాయి.అవధూతలు అనబడే వారు కూడా ఒక్కోసారి పరమ చండాలమైన భాషను వాడతారని తెలుసా?' అడిగాను.

'ఈ విషయాలు నాకు తెలియవు.' అన్నాడాయన.

'అదే మనతో వచ్చిన తంటా.మనం పూజించే వారిని గూర్చి మనకు నిజాలు తెలియవు.కారణాలు లేకుండా మనం వారిని గురించి కొన్ని నిరాధారమైన  అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం.ఇక జన్మంతా వాటినే పట్టుకుని ఊగులాడుతూ ఉంటాం.వాటిని ఎవరైనా చెదరగోడితే మనం భరించలేం. 'ఆయనిలాగే ఉండాలి' అని మనం అనుకుంటూ ఉంటాం.దీనికంతా కారణం మన ఈగో.మన భావాలకు ఏదైనా తేడా వస్తే బాధపడేది మన ఈగోనే అంతేగాని ఈ గోలవల్ల ఆయా మహా పురుషులకు ఏమీ కాదు.వారి స్తితిలో ఏమీ మార్పు ఉండదు.అసలు మన అభిప్రాయాలకూ ఆయా గురువుల సహజస్తితికీ సంబంధమే ఉండదు.

కనుక నేను చెప్పేదేమంటే మనం పూజిస్తున్నది మన అహాన్నే గాని మనం డప్పు కొట్టుకునే దేవుళ్ళనో గురువులనో కానేకాదు.మనలో ప్రతివాడూ పూజిస్తున్నదీ గౌరవిస్తున్నదీ తన అహంకారాన్నే.నిజానికి మన అడ్రసులు కూడా ఈ మహాపురుషులకు తెలియవు.మనం అనేవారం అసలు ఉన్నామనీ వారి గురించి ఇలా అనుకుంటున్నామనీ కూడా వారికి అనవసరం.వారు ఇలాంటివేవీ పట్టించుకోరు.వారి స్తితుల్లో వారుంటారు.' చెప్పాను.

ఆయన ముఖంలో కొంచం తేట కనపడింది.

'ఇంకా చెప్తాను వినండి.పదాలన్నీ 'అ' నుంచి 'క్ష' వరకూ ఉన్న అక్షరాల కలయికతో ఏర్పడేవే కదా? అది మంచి పదమైనా చెడు పదమైనా, ఆ మంచీ చెడూ అనేవి పదాలలో ఉన్నాయా? లేక మీ మనసులో ఉన్నాయా? అంటే మనసులోనే అని తేలుతుంది.ఒక పదాన్ని వింటే మీ మనసులో ఒక ఊహ ఏర్పడుతుంది.ఆ ఊహ మంచిదనో చెడ్డదనో మీ చిన్నప్పటి నుంచి మీరు విని ఏర్పరచుకున్న ఒక అభిప్రాయం ఉంటుంది.ఆ అభిప్రాయాన్ని అనుసరించి మీ మనసులో ఇష్టమో అయిష్టమో కలుగుతుంది.ఇదిగాకుండా,పదాలలో మంచీ చెడూ అంటూ ప్రత్యేకంగా ఎక్కడ ఉన్నాయో నాకు కాస్త వివరించండి. అక్షరాలన్నీ అమ్మ మెడలో వేలాడుతున్న అక్షరమాలలో భాగాలే కదా? కాదంటారా?' అడిగాను.

ఆయన నమ్మలేనట్లు చూచాడు.

'మీరు చదివిన పేరాలలో కౌలాచారాన్ని ఆయన విమర్శించారు.అది కూడా నిజమైన కౌలాచారాన్ని కాదు.ఆమధ్య కాలంలో కొందరు దుష్ట బ్రాహ్మణులు వ్రాసి ప్రచారంలోకి తెచ్చిన దుష్ట కౌలాచారాన్ని ఆయన విమర్శించాడు. విమర్సించవలసిన విషయం అంత చండాలమైనది గనుక ఆయన వాడిన భాష కూడా అలాగే ఉన్నది.అంతమాత్రం చేత మీ స్వాములవారి వ్యక్తిత్వానికీ స్థాయికీ ఏమీ భంగం లేదు.ఆ మాటలు మన దృష్టిలో బూతు కావచ్చు.కాని ఆయన దృష్టిలో కాదు.కనుక ఆయన వాడిన ఆ మాటల వల్ల ఆయన మహత్వానికి ఏమీ భంగం రాదు.' అన్నాను.

ఆయన ముఖంలో మళ్ళీ మునుపటి ఊరట కనిపించింది.

'ఆయన మీద నా గౌరవం వంద రెట్లు పెరిగింది అన్నాను కదా? ఎందుకో ఇప్పుడు చెబుతాను.నేను జగద్గురు స్థానంలో ఉన్న శంకరాచార్యున్ని. నేను అలాంటి బూతులు మాట్లాడితే నా శిష్యుల దృష్టిలో నేను చులకన అవుతాను అని ఆయన భావించలేదు.తన మనసులో ఉన్నది ఉన్నట్లు బయటకు చెప్పడమే ఆయన చేసాడుగాని,ఇతరుల గౌరవం కోసం నటిస్తూ పాకులాడలేదు.అంటే ఆయనలో నిజాయితీ ఉన్నది.తను అనుకున్నది అనుకున్నట్లుగా బయటకు చెప్పాడు.ఆయనలో ధైర్యం ఉన్నది.ఇతరుల మెప్పును ఆశించి నంగిమాటలు మాట్లాడలేదు.తన ఇమేజి కోసం నాటకాలాడలేదు.మామూలు మనుషులకు ఉండే అహంకారం ఆయనలో లేదు.కనుక ఆయనంటే నాకు గౌరవం ఇనుమడించింది.' చెప్పాను.

'అర్ధమైంది శర్మగారు.మీ దృక్కోణం వేరుగా ఉన్నదని నాకర్ధమైంది.ఇప్పుడు నాదొక సందేహం.అడగనా?' అన్నాడు.

'అడగండి' అన్నాను.

'అయితే తాగడం తందనాలాడటం బూతులు మాట్లాడటం జ్ఞానానికి చిహ్నాలా?' అడిగాడాయన.

నవ్వాను.

'కానే కాదు.అవి నేలబారు వ్యవహారానికి దిగజారుడుతనానికి చవకబారు వ్యక్తిత్వానికీ చిహ్నాలే.అవి జ్ఞానానికి చిహ్నాలే అయితే ప్రతి తాగుబోతూ జ్ఞానే అయి ఉండేవాడు.అలా కాదు.జ్ఞాని అయినవాడు అవన్నీ చేసినా కూడా అతని స్థాయి దిగజారదు అని మాత్రమె నేను చెబుతున్నాను.అతని జ్ఞానానికి భంగం రాదు.ఇదే మీరు సరిగ్గా అర్ధం చేసుకోవలసిన పాయింట్. నేను చెబుతున్నది చాలా సున్నితంగా సూక్ష్మంగా అర్ధం చేసుకోవలసిన విషయం.' చెప్పాను.

(మిగతాది తర్వాతి భాగంలో)
read more " కల్యాణానంద భారతీస్వామి స్మృతులు -5 "