నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

9, జులై 2013, మంగళవారం

హస్త సాముద్రికం-2

జ్యోతిష్యాది రహస్యవిద్యలలో బాగా ప్రావీణ్యం వస్తే ఒక విచిత్రం జరుగుతుంది. ఒక మనిషిని కొద్దిసేపు గమనిస్తే అతని మనస్తత్వమే గాక,ఆ మనిషి ఏమి చేస్తాడు? అతని నిజస్వరూపం ఏమిటి? అతను ఇంతకు ముందు ఏమేం నేరాలు గట్రా చేసాడు? అసలితన్ని నమ్మవచ్చా? ఒకవేళ నమ్మితే ఎంతవరకు నమ్మవచ్చు? మొదలైన విషయాలు కూడా వెంటనే తెలుస్తాయి. అయితే తెలిసిన ప్రతి విషయమూ వెంటనే బయటకు చెప్పడం కూడదు.అలా చెబితే గొడవలు జరుగుతాయి.కొన్ని సార్లు సంసారాలు విచ్చిన్నం అవుతాయి. జీవితాలే నాశనం అవుతాయి.అందుకే తెలిసినా తెలియనట్లు ఊరుకోవడం జరుగుతుంది.

నాకు ఎదురైన వ్యక్తుల హస్తరేఖలను చూచీ చూడనట్లుగా పరిశీలించడం నా అలవాటు.అదికూడా 'ఏదీ మీ చెయ్యి ఒకసారి చూపించండి' అని అడిగి చూడను.వారితో మాట్లాడే సమయంలో వారివారి హావభావ విన్యాసాలలో చేతులు అటూఇటూ తిప్పే సమయంలో ఆయారేఖలు ఇతరగుర్తులు కనిపిస్తాయి.దానినిబట్టి పైన ఉదహరించిన విషయాలన్నీ సునాయాసంగా  తెలిసిపోతాయి.లోలోపల నవ్వుకుని బయటకు మాత్రం  మామూలుగా ఊరుకుంటాను.

మామూలుగా అందరి చేతుల్లో కనిపించే రేఖలు కాకుండా కొందరి చేతులలో కొన్ని ప్రత్యెక గుర్తులు,రేఖలు ఉంటాయి.అలాంటివి ఎన్నాళ్ళైనా సరే అలా  గుర్తుండిపోతాయి.

ఉదాహరణగా అలాంటివి మూడు కేసులు చెబుతాను.

ఒకసారి ఒకాయన చేతిలో ఒక విచిత్రమైన రేఖను చూచాను.దాని ప్రకారం అతను మేకవన్నె పులి అనీ,పరమ స్వార్ధపరుడనీ,తన కుటుంబం అంటే కూడా ఏమాత్రం ప్రేమ లేనివాడనీ,ఏమాత్రం నమ్మదగిన వ్యక్తి కాదనీ వెంటనే గ్రహించాను.

ఆ తర్వాత విచారిస్తే,అతనికి సెకండ్ ఫామిలీ ఉందనీ,తనను అమితంగా ప్రేమించిన భార్యను మోసం చేసి ఇంకొక ఆమెను ఉంచుకున్నాడనీ,నోరు తెరిస్తే అబద్దాలు చెబుతాడనీ,తన స్వార్ధం కోసం ఎవరినైనా బలి చెయ్యడానికి వెనుకాడడనీ తెలిసింది.

ఈ సంఘటన జరిగి ఇరవై ఏళ్ళయింది.ఈ మధ్యనే జరిగిన ఇంకొక రెండు సంఘటనలు చెబుతాను.

ఒకామెతో కాజువల్ గా మాట్లాడే సమయంలో ఆమె చేతిలో ఒక విచిత్రమైన గుర్తు కనిపించింది.దానిప్రకారం ఆమెకు అనేకమందితో శారీరిక సంబంధాలు ఉండాలి.కాని ఆమెను చూస్తె చాలా పద్దతిగా సంసారపక్షంగా  కనిపించింది. చాలా మర్యాదగా మాట్లాడుతుంది కూడా.వాళ్ళ ఆయన కూడా సమాజంలో మంచి వ్యాపారస్తుడు.ఈమె చేతిలో ఈ గుర్తు ఉందేమిటా అని తెలిసిన వారిని విచారిస్తే,ఆమె ఒక హైక్లాస్ కాల్ గర్ల్ అనీ,పెద్దపెద్ద వాళ్ళతో మొబైల్ ద్వారా పరిచయాలు కలిగి ఉందనీ,మొబైల్ లోనే అప్పాయింట్మెంట్ తీసుకుని అక్కడకు వెళ్లి వస్తూ ఉంటుందనీ,మొగుడూ పిల్లలూ ఉన్నాకూడా ఈమెకు ఇదొక సరదా అనీ,కానీ వ్యక్తిగతంగా మంచివ్యక్తి అనీ,మిగిలిన అన్ని విషయాలలో చాలా పద్దతిగా ఉంటుందనీ తెలిసింది.

ఇంకొక వ్యక్తితో యదాలాపంగా మాట్లాడుతున్నపుడు అతని చేతిలో ఇంకొక  విచిత్రమైన గుర్తు కనిపించింది.దానిప్రకారం అతనొక క్రిమినల్ అయి ఉండాలి.నేరచరిత్ర కలిగినవాడై ఉండాలి.కాని ప్రస్తుతం అతను చాలా మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాడు.సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో కూడా ఉన్నాడు.ఇదేమిటో అర్ధం కాలేదు.తర్వాత విచారిస్తే,ఈ స్థాయికి రాకముందు కొన్ని సంవత్సరాల క్రితం అతను రెండు హత్యలు చేశాడనీ ఆ సంగతి సంఘంలో అందరికీ తెలుసనీ,కాని ఎవిడెన్స్ లేకుండా చేసి తప్పించుకున్నాడనీ,ప్రస్తుతం అతనున్న రాజకీయస్థాయిలో అతన్ని ఎవరూ ఏమీ చెయ్యలేరనీ అర్ధమైంది. 

ఇలాంటివి ఎన్నో కేసులు నేను గమనించాను.ప్రతిసారీ ఈ పరిశీలనవల్ల నాకు కొన్ని నిజాలు తెలిశాయి.సాముద్రికం ఎంత గొప్ప సైన్సో అర్ధమైంది.

మన వ్యక్తిత్వమూ,మన అలవాట్లూ మన చేతిలోని రేఖలలో గుర్తులలో ప్రతిబింబిస్తూ ఉంటాయి.సంఘానికి తెలియని మనలోని చీకటి కోణాలు కూడా వాటివల్ల స్పష్టంగా కనిపిస్తాయి.అంతేకాదు మన ఆరోగ్య స్థితీ,మన జీవితంలో జరగబోయే సంఘటనలూ కూడా చేతిలో ప్రతిఫలిస్తూ ఉంటాయి.ప్రతి మనిషీ తన జాతకాన్ని తన చేతిలోనే ఉంచుకుని తిరుగుతూ ఉంటాడు.

సాముద్రికశాస్త్రం ఒక అద్భుతమైన విద్య అని పై సంఘటనలను బట్టి నాకు గట్టి నమ్మకం ఏర్పడింది.అంతేకాదు,సరిగ్గా చదవగలిగితే హస్తరేఖలు మన బంధువుల,పిల్లల జాతకాలను కూడా ప్రతిబింబిస్తాయనీ,అంతేగాక మన భవిష్యత్తునూ,మన గతజన్మలను కూడా వాటివల్ల తెలుసుకోవచ్చనీ నాకు విశ్వాసం కలిగింది.