“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

17, జులై 2013, బుధవారం

కల్యాణానంద భారతీస్వామి స్మృతులు - 8 (శ్రీవిద్యా చర్చ)

'శర్మగారు.కొన్ని విషయాలు నాకు తెలిసినంతవరకూ చెబుతాను.వినండి. మధ్యలో మీకు అనుమానాలు వొస్తే అడగండి.' అంటూ మొదలు పెట్టాను.

ముఖ్యంగా మీ స్వాములవారి విధానం నాకర్ధమైనంత వరకూ ముందుగా చెబుతాను.ఇది వారి పుస్తకాలనుండి ఏర్పరచుకున్న అభిప్రాయమే గాని నాకు మీ విధానంతో ప్రత్యక్ష పరిచయం లేదు.

శ్రీవిద్యలో వైదికమూ అవైదికమూ అంటూ రెండు మార్గాలున్నవని ఆయన నమ్మారు.గౌడపాదుల వద్దనుండీ శంకరుల ద్వారా తమకు అందివచ్చినది వైదికమార్గమనీ దానికి మూలం వేదమూ,సనకాది మహర్షిప్రణీతమైన శుభాగమపంచకమూ అని,తద్విరుద్ధమైనది అవైదికమనీ దానికి మూలాలు కులార్ణవతంత్రము,వామకేశ్వరతంత్రము మొదలైన ఇతర వామాచార తంత్రములనీ,వాటిని పాటించే బెంగాల్ తాంత్రికులూ,కాశ్మీరశైవమని పిలువ బడే త్రికసాంప్రదాయమూ ఆమార్గపు ప్రముఖులైన అభినవగుప్తాదులూ దారితప్పిన వామాచారతాంత్రికులనీ,నవీన కాలములో,అంటే దాదాపు 300 ఏండ్ల క్రితం నివసించిన భాస్కరరాయలూ,ఆయన శిష్యుడైన జగన్నాధ పండితరాయలూ,వారి శిష్యుడైన రామేశ్వరుడూ అందరూ క్షుద్ర వామాచారులనీ వారు వ్రాసిన వరివస్యా రహస్యము, నిత్యోత్సవము, సేతుబంధము, సౌభాగ్య భాస్కరము మొదలైన గ్రంధములు తాగినమత్తులో వారు వ్రాసిన చెత్తవ్రాతలనీ ఆయన భావించారు.
      
అంతేగాక వారికి అసలైన శ్రీవిద్య తెలియదనీ వారికి తెలిసినదేల్లా ఉపాసన పేరుతో 'మ'పంచకసేవనమే అనీ,కులగోత్రాదులను వావివరసలను మరచి మద్యము మాంసము సేవించి భైరవచక్రమనీ, కులచక్రమనీ, శ్రీచక్రమనీ నేలమీద పెద్దముగ్గు వేసి అందులోకి అడుగుపెట్టి అక్కడ నానాకులాల స్త్రీలూ పురుషులూ కలిసి వివస్త్రులై త్రాగి ముందుగా పంచోపచార దశోపచార లేదా షోడశోపచారపూర్వకంగా ఆయా నగ్నస్త్రీలను అర్చించి తర్వాత వారితో రాత్రంతా సంభోగించడమే వారికి తెలిసిన శ్రీవిద్య అనీ ఆయన అనుకున్నారు.

వైదికులమైన మనకు అశ్వలాయన,బోధాయన,ఆపస్తంబ సూత్రములే ప్రమాణములు గాని,భాస్కరాదులు ఉటంకించినటువంటి పరశురామ కల్పసూత్రము అనేది నిజానికి కల్పసూత్రము కాదనీ అదొక కల్పిత సూత్రమనీ అందులో ఉన్నటువంటి పది అధ్యాయములూ ఆరువేల శ్లోకములూ అన్నీకూడా ఎవడో సంస్కృతం వచ్చిన వామాచార భ్రష్ట బ్రాహ్మణుని కపోలకల్పితములనీ వాటికి వేదప్రామాణికత ఏమాత్రమూ లేదనీ ఆయన నమ్మారు. 

పరశురామ కల్పసూత్రం అనేది కేరళలో ప్రచారంలో ఉన్నది.మనవైపు అంత ప్రచారంలో లేదు.దానిలో చెప్పబడిన విషయం ప్రకారం సృష్టిమొదట్లో సమస్తజ్ఞానాన్నీ పరమశివుడు ఆగమము, రహస్యము, సంహిత,యామళ,ఆర్ణవ,తంత్రములనే భాగములలో లోకానికి అనుగ్రహించాడు.విషయవిస్తృతిలో అనంతంగా ఉండి సామాన్యులకు గ్రహించడానికి అసాధ్యంగా ఉన్నటువంటి ఈ జ్ఞానరాశిని అంతటినీ త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు క్లుప్తీకరించి దత్తసంహితగా లోకానికి అందించాడు.అనేక వేలశ్లోకాలతో అది కూడా అగమ్యగోచరంగా ఉన్నందువల్ల దీనిని కూడా ఇంకా చిన్నదిగా చేసి దత్తాత్రేయుని శిష్యుడైన పరశురాముడు తన శిష్యులకు బోధించాడు.అది కూడా అల్పబుద్ధులైన మనుష్యులకు అర్ధంకాని స్తితిలో ఉంటే పరశురాముని శిష్యుడైన సుమేధుడు దానికి మళ్ళీ క్లుప్తీకరించి పది అధ్యాయములు ఆరువేల శ్లోకములు ఉన్నటువంటి పరశురామ కల్పసూత్రముగా లోకానికి అందించాడని అంటారు.

1775 లో ఉమానందుడనే భాస్కరుని శిష్యుడు ఈ సూత్రాలకు నిత్యోత్సవమనే వ్యాఖ్యానం వ్రాశాడు.ఇతనికే జగన్నాధ పండితరాయలని ఇంకొక పేరు.ఉమానందుడు ఈ సూత్రాలను సరిగా అర్ధం చేసుకోలేదనీ తప్పుగా వ్యాఖ్యానించాడనీ భావించిన రామేశ్వరుడు దీనిపైన 1831 లో సౌభాగ్య సుధోదయమనే ఇంకొక వ్యాఖ్యానాన్ని వ్రాశాడు.ఈ పుస్తకాలన్నీ శ్రీవిద్యపై ప్రమాణాలు కావనీ, వీళ్ళందరూ క్షుద్రులనీ,వామాచారులనీ వీళ్ళు చేసిన చేష్టలూ అద్భుతాలూ అన్నీ విప్రవినోదుల గారడీవిద్యల వంటివనీ  మీ స్వాములవారు వీరిని తీవ్రంగా విమర్శించారు.ఈ పుస్తకాలను ఆయన చెత్త సాహిత్యంగా కొట్టి పారేశారు.అంతేగాదు.అసలైన శ్రీవిద్యను భ్రష్టు పట్టించి సర్వనాశనం చేస్తున్నవి ఈ పుస్తకాలేనని,నిత్యోత్సవం అనే గ్రంధం నిత్యార్చన గ్రంధం అవడం వల్లనే గోదావరీతీర బ్రాహ్మణులు అందరూ వామాచార పరాయణులై భ్రష్టులైనారని ఆయన తిట్టిపోశారు.

దానికి తోడు ఆయన చూచిన కొన్ని తంత్ర గ్రంధాలలో ఆయనకు కనిపించిన 

'పీత్వా పీత్వా పున:పీత్వా యావత్పతతి భూతలే 
ఉద్దాయచ పున:పీత్వా పునర్జన్మ నవిద్యతే

(నేలమీద స్పృహతప్పి పడిపోయెంతవరకూ మళ్ళీమళ్ళీ మద్యం తాగు.స్పృహవచ్చి లేచిన తర్వాత మళ్ళీ తాగు.ఇలా చేస్తే నీకు పునర్జన్మ ఉండదు)'

మొదలైన శ్లోకాలు ఆయనకు పరమఅసహ్యాన్ని కలిగించి ఉంటాయి.ఇదేకాదు.ఇంకా పరమ చండాలమైన పనులు చెయ్యమని ప్రేరేపించే తంత్రసాహిత్యం కూడా ఉన్నది.ఇలాంటివి చదివినమీదట మీ స్వామికి ఇటువంటి జుగుప్స కలగడం సహజమే.అయితే అసలైన తంత్రం ఇదికాదు.తంత్రమంటే అతిగా ఏదిబడితే అదితినే బకాసురత్వమూ (gluttony),వావివరసలు లేని మతాచార విశృంఖల సంభోగమూ(religious sexual orgy) అనుకోవడం శుద్ధతప్పు.ఖర్మకాలి నేడు తంత్రమంటే ఇవే అని చాలామంది విదేశీయులు అనుకుంటున్నారు.ఇక మనవాళ్ళలో చాలామందికి ఈ మాత్రం అవగాహన కూడా లేదు.తంత్రమంటే ఏదో భూత ప్రేతాలకు సంబంధించిన ఒక క్షుద్రవిద్య అని మనలో చాలామంది అనుకుంటారు.ఇదీ పూర్తిగా తప్పు భావనే.

ఈ విధమైన నీచతంత్రాన్ని ఆయన విమర్శించడం చాలా కరెక్ట్.ఇంతవరకూ నేనూ మీ స్వాములవారితో ఏకీభవిస్తున్నాను.ఆయన భావించినట్లుగా కొన్ని కొన్ని యామళ,డామర తంత్రాలలో అటువంటి రహస్యాచారాలు ఉన్నమాట వాస్తవమే.అలాంటి పిచ్చి పోకడలను ఖండించవలసిందే.వాటిని ఖండిస్తూ ఆయన పుస్తకాలు వ్రాసి చాలా మంచిపని చేశారు.కాని ఇంతమాత్రం చేత వామాచారం అంటే ఒక చండాలమైన మార్గమనీ,అక్కడ అంతా పంచమకారాలే తప్ప ఉపాసన అన్నది లేదు అన్నటువంటి ఆయనయొక్క తృణీకారభావనతోనే నేను విభేదిస్తున్నాను.నిజమైన వామాచారం ఇది కాదు.నేడు చాలామంది చేస్తున్నది నిజమైన దక్షిణాచారం కానట్లే మీ ప్రత్యర్ధులు చేస్తున్నదీ నిజమైన వామాచారం కాదు.అదీ దిగజారింది.ఇదీ దిగజారింది.అసలైన ఆచారాలు వాడుకలో భ్రష్టములై నామమాత్రములుగా మిగిలి ఉన్నవన్నది మాత్రమే సత్యం.

నా ఉద్దేశ్యం వినండి.ఎవనికైతే సరియైన దక్షిణాచారమూ సరియైన వామాచారమూ కూడా తెలుస్తాయో అతడే నిజమైన సంపూర్ణమైన తాంత్రికుడు.ఏదో ఒకటి తెలిసినవానికి పూర్ణత్వం లేదు.దక్షిణాచారం అంటే శివతత్వం అనీ వామాచారం అంటే శక్తితత్వం అనీ వాటియొక్క అసలైన ప్రాచీనార్ధంలో నేను ఈపదాలను గ్రహించాను.శివశక్తి తత్వాలను ఆమూలాగ్రం అర్ధం చేసుకుని అనుభవంలో వాటిని సంపూర్తిగా గ్రహించినవాడే నిజమైన పరమయోగి.అతడే తాంత్రిక చక్రవర్తి.శ్రీ రామకృష్ణులే దీనికి పరమప్రమాణం.తంత్రంలో ఆయనతో సమానమైన శిఖరాలను అందుకున్నవాడు ఇప్పటివరకూ సృష్టిలో ఒక్కడుకూడా లేడు.ఒక్క పరమశివుణ్ణి మాత్రమె ఆయనకు పోలికగా చెప్పవచ్చు.ఇంకెవరూ ఆయన స్థాయికి కనుచూపు మేరలోకి కూడా రాలేరు.

అంతటి అవతారపురుషుడు కూడా తన గురువైన భైరవీబ్రాహ్మణి ఆధ్వర్యంలో వామాచార సాధనలు చేశాడు.అయితే వాటిని సాత్వికరీతిలో చేశాడు.దానికి కారణం ఆయనకున్నటువంటి పరమశుద్ధమైన మనస్సు. 'సురా' అన్న పదం వినడంతోనే ఎవని మనస్సు అయితే ఇంద్రియాలను అధిగమించి సమాధిలో లయమైపోతున్నదో అతనికి ప్రత్యక్ష సురాపానం యొక్క ఆవశ్యకత ఏముంటుంది?అదీ ఆయన యొక్క మహోన్నతమైన స్తితి.మామూలు మనుష్యులకు ఈ స్తితి ఊహకు కాదుకదా,కలలోకి కూడా అందదు.అంతటివాడే వామాచార సాధనలు ఆచరించాడు.కనుక వామాచారం తప్పు కాదు.

బెంగాల్లో ఉన్న ఇంకొక వామాచారసిద్ధుడు తారాపీఠనివాసి బామాఖేపా. బెంగాలీలు 'వా' అన్న పదాన్ని 'బా' అని పలుకుతారు. ఆయన అసలు పేరు వామాఖేపా.ఖేపా అంటే పిచ్చివాడు అని అర్ధం.ఆయన ఒక మహోన్నతుడైన తారాసిద్ధుడు.తారాదేవికి ఆయన పరమభక్తుడు.శరీరస్పృహకు అతీతుడై నిత్యం నగ్నంగా సంచరించేవాడు.ఎన్నో అతీతశక్తులు కలిగిన సిద్ధపురుషుడు.ఎన్నో మహిమలు ప్రదర్శించాడు.ఈయన కూడా వామాచార పరాయణుడే.

కాశీలోని కాళీపీఠంలో ఎందఱో మహనీయులైన వామాచార సిద్దులున్నారు. వారెవరూ దురాచారపరులు కారు.డొల్ల ఆచారపరులూ డాంబికులూ కారు. వారందరూ నిజమైన మహనీయులు.
       
మీ స్వాములవారు క్షుద్ర వామాచారాన్నీ,వామాచారం పేరుతో జరుగుతున్న మోసాన్నీ,అసహ్యకరములైన తప్పుడు పద్ధతులనీ ఖండించి తూర్పారబట్టారు.దానికి ఆయనకు నమోవాకాలు అర్పించవలసినదే.కాని అదే సమయంలో అసలైన వామాచారం అనేది ఒకటి ఉన్నదని ఆయన మరచిపోయారు.బహుశా దానిగురించి ఆయనకు కూడా తెలిసి ఉండకపోవచ్చు.ఎందుకంటే,అందరికీ అన్నీ తెలియాలని ఎక్కడా వ్రాసిపెట్టి లేదు. కాకపోతే,తనకు తెలియని దానిని కూడా తీవ్రభాషలో విమర్శించడమే వారు చేసిన పొరపాటు.

అదే సమయంలో,ఒక్క లలితాఉపాసన మాత్రమే సాత్వికమనీ,మిగతా ఉపాసనలైన కాళీ ఉపాసన,తారా ఉపాసన,భైరవీ ఉపాసన మొదలైనవన్నీ అవైదికములూ తుచ్చములూ అని ఆయన విమర్శించారు.కాశ్మీర త్రిక సాంప్రదాయులు ఘోరమైన కౌళికులనీ(కాళీ ఉపాసకులనీ) అదే విధంగా బెంగాల్లో కూడా ఈ కాళీ ఉపాసన అనే చెడు సాంప్రదాయం ప్రబలిందనీ ఆయన విమర్శించారు.ఇది పొరపాటు.కాళీ ఉపాసన చెడుమార్గం కాదు.కాళీక్రమం,సుందరీక్రమం,భైరవీక్రమం అనేవి శ్రీవిద్యలో ఉన్నాయి.కాని ఒక్క లలితా ఉపాసనమే ఉత్తమం అని మీ స్వాములవారు నమ్మారు.ఇది తప్పు.

ఏ శక్తినైతే లలితా అంటున్నామో ఆమెనే కాళీ, త్రిపురా, తారా, ఉమా, శాంభవీ,బగళా,భైరవీ అనీ ఇంకా ఎన్నో పేర్లతో పిలుస్తున్నాం.శాక్తతంత్రాలలో ఈ భావన చాలాచోట్ల కనిపిస్తుంది. అజ్ఞానులు మాత్రమె వీరందరూ వేర్వేరు దేవతలని భావిస్తారు.తెలిసినవారు వీరందరూ ఒక్క శక్తి యొక్క వివిధ రూపాలే అని తెలుసుకుంటారు.అంతేకాదు ఆ శక్తి ఏ రూపంలో పిలిస్తే ఆ రూపంలో పలుకుతుందనీ, అంతేగాక ఆ శక్తి నిరాకార కూడా అనీ వారికి తెలుసు.

మహాభక్తుడైన బెంగాల్ తాంత్రికుడు 'కమలాకాంత' --'సాకారె ఆకార్ నిరాకార్ మా త్వంహి తారా-'(అమ్మా.నీవు సాకారవు.నిరాకారవు కూడా.సకలాన్ని తరింపచేసే శక్తివి నీవే)' అని కీర్తించాడు.తంత్రాలలో ఈ భావన అసంఖ్యాకమైన చోట్లలో చెప్పబడింది.ఇంకా మనం అర్ధం చేసుకోలేక పోతే ఎలా?  

ఆమాటకొస్తే అసలు వేదాలలో ఎక్కడా శక్తి ప్రస్తావనే లేదు.అక్కడ త్రిమూర్తులే లేరు.శివ విష్ణు బ్రహ్మ మొదలైన పదములు వేదాలలో ఉన్నాయి.కాని ఈనాడు మనం ఊహించి పూజిస్తున్న రూపములు వారికి ఆనాడు లేవు. ఒకే ఒక్క పరబ్రహ్మము యొక్క గుణాలుగా ఈ మాటలు వేదములలో వాడబడ్డాయి.పురాణకాలంలో మాత్రమె వీరికి ప్రత్యెక రూపాలను ఇచ్చి వీరిని వేర్వేరు దేవతలుగా భావించే దుష్ట సాంప్రదాయం మొదలైంది.ఒక్క కేనోపనిషత్తులో మాత్రం 'ఉమా' అంటూ శక్తిప్రస్తావన ఉన్నది.కాని ఆ ఉపనిషత్తును తర్వాత తర్వాత వ్రాయబడినదిగా కొందరు భావిస్తారు.అందరూ దీనిని అంగీకరించరు.

శంకరుల పరమగురువైన గౌడపాదులు 'సుభగోదయ స్తుతి' అన్న స్తోత్రాన్ని వ్రాశారు.అందులో వేదప్రతిపాదితమైన అద్వైతాన్ని సమయాచారమైన కుండలినీతంత్రంతో సమన్వయము చేసిన భావనలు కనిపిస్తాయి. పరమాద్వైతులైన వీరు శక్తిఉపాసనను వారి అద్వైతవిధానానికి ఎలా అన్వయించుకున్నారో,అనుసరించారో అర్ధంకాదు.కాశ్మీరంలో అప్పటికే శక్తి ఉపాసన ఉన్నది.శంకరులు కాశ్మీరంలో పర్యటించినప్పుడు అక్కడి తాంత్రిక శక్తిఉపాసనా రహస్యాలు నేర్చుకున్నారనీ అందుకే అప్పటినుంచే ఆయన అద్వైతానికి శక్తిఉపాసనను జోడించారనీ,కనుకనే వారి మఠాలలో అన్నింటిలోనూ ఇప్పటికీ శ్రీచక్రార్చనమూ శక్తిపూజనమూ ఉందనీ కాశ్మీర త్రిక సాంప్రదాయులు అంటారు.

గౌడపాదులు ఎక్కడివారో నాకు తెలియదు.కాని పూర్వకాలంలో బెంగాల్ రాష్ట్రాన్ని గౌడదేశం అనేవారు.కనుక పేరును బట్టి ఆయన బెంగాల్ వాడే అయి ఉండవచ్చు అనుకుంటాను.శక్తిఉపాసన అక్కడిదే గనుక ఆ మూలాలను ఆయన అనుసరిస్తూ 'సుభగోదయ స్తుతి' వ్రాసి ఉండవచ్చు. వారినుంచి వారి అనుయాయి అయిన ఆదిశంకరులు ఈ భావనలను అందిపుచ్చుకుని ఉండవచ్చు.జన్మత: కేరళ బ్రాహ్మణుడైన ఆది శంకరులకు శక్తిపూజ సహజంగానే అలవాటు అయి ఉంటుంది.  

మీ స్వాములవారు శంకరసాంప్రదాయాన్ని సమర్ధిస్తూ కాశ్మీరత్రికాన్ని క్షుద్రం అన్నారు.వారేమో శక్తి ఉపాసనను శంకరులు మావద్దనే నేర్చుకున్నారని అంటారు.శంకరాద్వైతం త్రికం కంటే తక్కువది అని వారి భావన.వేదాన్ని అతి తక్కువ చేసి ఆ తర్వాత వైష్ణవమూ శైవమూ ఇలా క్రమేణా ఒకదానికంటే ఒకటి గొప్పవనీ అన్నింటి కంటే గొప్పది త్రిక సాంప్రదాయమని కొందరు శ్లోకాలు వ్రాసుకున్నారు.ఇంకొందరేమో అన్నింటి కంటే వామాచారం గొప్పదనే అర్ధం వచ్చేలా శ్లోకాలను వ్రాసుకున్నారు.ఈ విధంగా ఎవరికి వారు డప్పు కొట్టుకోవడం తప్ప విషయాన్ని సరిగ్గా అర్ధం చేసుకుందామని ఎవరూ ప్రయత్నం చెయ్యలేదు.

అసలు విషయం ఏమంటే,వీటిలో ఏ ఒక్కటీ సంపూర్ణమూ పరిపూర్ణమూ కాదు.అన్నింటినీ సమన్వయం చేసి అర్ధం చేసుకునే భావమే సరియైనది. విశ్వంలో అన్నీ ఇమిడి ఉన్నాయి.దేని స్థానం దానికుంది.మనం దేనినీ తృణీకరించలేము.దైవమె దానిని ఒప్పుకుని దానికంటూ ఒక స్థానాన్ని తన సృష్టిలో ఇచ్చింది.కాదనడానికి మనమెవరం? విశ్వప్రణాళికలో దాని స్థానం ఏమిటి అన్నది మాత్రమె మనం సరిగ్గా అర్ధం చేసుకోవాలి.శ్రీరామక్రిష్ణులు వివేకానందులూ చెప్పినది ఇదే.

ఒకసారి వివేకానందుడు ఇంకా నరెంద్రునిగా ఉన్న సమయంలో ఒక సంఘటన జరిగింది.అప్పుడు ఆయనకు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు ఉంటాయి.అప్పుడే ఆయన రామకృష్ణుని వద్దకు వచ్చి ఉన్నాడు.కాని అప్పటికే ప్రాచ్య పాశ్చాత్య వేదాంతములు అన్నీ చదివి ఉన్నాడు.బెంగాల్లో తంత్ర సంప్రదాయాలు ఎక్కువ.రామకృష్ణులవారి గదిలో తరచుగా వేదాంతచర్చలు జరిగేవి.భావి మహనీయులైన యువకశిష్యుల మధ్య వేదాంతచర్చలను ఆయన ప్రోత్సహించి వారు ఎలా వాదిస్తారా అని తాను మౌనంగా వింటూ ఉండేవారు.ఒకరోజున నరేంద్రుడు కూడా మీ స్వాములవారి వలె వామాచారతంత్రాన్ని అతి తీవ్రభాషలో విమర్శిస్తూ ఒక రెండుగంటల పాటు మాట్లాడాడు.అదొక చండాలమైన మార్గమనీ దానిని అనుసరిస్తే అధోగతే అనీ తీవ్రమైన పదజాలంతో దూషించాడు.అంతా మౌనంగా విన్న రామకృష్ణులు చివరకు ఒకే ఒక్క మాట అన్నారు.

'నాయనా.నరేన్.ప్రతి ఇంటికీ ఒక దొడ్డిదారి కూడా ఉంటుంది.మరచిపోకు.'

అనుభవంతో చెప్పబడిన ఈ ఒక్క మాటతో నరేంద్రుని రెండుగంటల వాగ్దాటీ ఆయన లాజిక్కూ అంతా ఎక్కడికో కొట్టుకుపోయింది.ఆయన ఎంతో ఉత్తమసాధకుడు కారణజన్ముడూ గనుక వెంటనే గురుదేవుల మాటలోని సత్యాన్ని గ్రహించాడు.మౌనంగా గురుదేవుల పాదాలపై బడి ప్రణామం చేసాడు.తర్వాత ఎన్నో ఏళ్ళకు విదేశాలలో ఇచ్చిన 'My Master' అన్న ఒక అద్భుతమైన ఉపన్యాసంలో ఈ సంఘటనను ఆయన ఉటంకించాడు.

కనుక నేను చెప్పేది ఒకటే.దారిలో తప్పుగా నడిచేవారు ఉండవచ్చు.అసలు దారే తప్పంటే ఎలా? అన్ని దారులూ చివరకు చేర్చేది ఒక్క చోటికే అని రామకృష్ణులు ఎప్పుడూ అనేవారు.ఈ విశాలమైన భావం ఉంటే ఏ బాధా లేదు.అసలైన తంత్రాన్ని అర్ధం చేసుకోవాలంటే అందుకే రామకృష్ణుని జీవితాన్ని చదవాలని,అర్ధం చేసుకోవాలనీ నేనంటాను.ఇప్పుడు చెప్పండి.మీ సంశయాలు తొలగిపోయాయా ఇంకా ఉన్నాయా?' అడిగాను.

(మిగతాది తర్వాతి భాగంలో)