నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

4, డిసెంబర్ 2013, బుధవారం

రాష్ట్రాల విభజనకు ఒక మంచి పరిష్కారం

ప్రత్యేకరాష్ట్రాల ఏర్పాటుకోసం చాలా రాష్ట్రాలలో ఉద్యమాలు జరుగుతున్నాయి.ఇవ్వాలని కొందరూ ఒద్దని కొందరూ ఒకటే గొడవ చేస్తున్నారు.నా దృష్టిలో అసలు ఇదొక సమస్య కానేకాదు.

అసలు ఇంత సింపుల్ విషయానికి ఇంత చర్చా,గొడవా,గోలా అవసరమా అని నాకెప్పటినుంచో ఒక పెద్దసందేహం.వీళ్ళందరూ ఎందుకింత గొడవ పడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు.విడగొట్టుకునే చిత్తశుద్ధి ఉండాలే గాని దీనికి పరిష్కారం చాలా తేలిక.పల్లెల్లో అన్నదమ్ములు ఎలా విడిపోతున్నారు?ఇదీ అంతే.మనం ఎక్కడికి పోతున్నాం?ఇదే దేశంలో ఉంటాం కదా.విభజన వల్ల నష్టం ఏముంది?

నిర్మించుకోవడం మనకు ఎలాగూ తెలియదు.ఆ సంగతి లోకానికి ఎప్పుడో తెలుసు.సరిగ్గా విడగొట్టుకోవడం కూడా మనకు చాతకాదని ఇప్పుడు తెలుస్తోంది.మన తెలివి తెల్లవారినట్టే ఉన్నది.తెలుగుజాతి మనది అని పాడుకోటం తప్ప మనకు తెలిసినది శూన్యం అని దీన్నిబట్టి చక్కగా తెలుస్తోంది.

మాట్లాడే భాషలో యాసను బట్టీ,ప్రాంతీయ సంస్కృతిని బట్టీ ఒక్కొక్క రాష్ట్రం ఏర్పడితే బాగుంటుంది అన్న భావన ఇప్పుడు వినిపిస్తున్నది.తద్వారా ప్రగతి కూడా వేగంగా ఉంటుంది అని అంటున్నారు.అది నిజమే కావచ్చు. ఇప్పుడు తెలంగాణా ఇస్తే ముందుముందు ప్రత్యెకరాష్ట్రాల ఉద్యమాలు ప్రతి రాష్ట్రంలోనూ ఇంకా ఉధృతం కావచ్చు అని కొందరంటున్నారు.అప్పుడు ఏం చెయ్యాలి?అంటే,దీనికి నా దగ్గర ఒక మంచి పరిష్కారం ఉన్నది.

మనకు స్వతంత్రం రావడానికి ముందు 562 రాజ్యాలు(princely states)మనదేశంలో ఉండేవి.మళ్ళీ ఆ రోజుల్లోకి పోయి దేశాన్ని చిన్నచిన్న ముక్కలుగా విభజించుకుంటే సరి.అయిపాయె.అభివృద్ధి శరవేగంగా ఉంటుంది.ఒకవేళ అభివృద్ధి ఉన్నా లేకున్నా జనాభా అభివృద్ధి ఎలాగూ ఉండనే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు.

ప్రస్తుతం మనకు 671 జిల్లాలున్నాయిట.ఒకపని చేస్తే పోతుంది.ప్రతి జిల్లానూ ఒక రాష్ట్రంగా డిక్లేర్ చేసేస్తే అభివృద్ధి శరవేగంతో ఏం ఖర్మ,రాకెట్ వేగంతో ముందుకు పోతుంది.అయితే రాకెట్ కూలిపోయినట్లు అదికూడా ఏ సముద్రంలోనో కూలిపోవచ్చు అంటే మళ్ళీ నెగటివ్ యాటిట్యూడ్ అని కొందరు అనవచ్చు.ఎవరేమనుకున్నా రాకెట్లు అప్పుడప్పుడూ కూలిపోవడం వాస్తవమే గనుక ఈ వాదనను కాదనలేం.

మన దేశంలో ప్రతిజిల్లాకూ భాషలో యాస బిన్నంగా ఉంటుంది.ఒకే భాష మాట్లాడే ఒకేరాష్ట్రంలో కూడా జిల్లాజిల్లాకూ యాస మారుతుంది. ప్రాంతీయంగా ఆహారపు అలవాట్లూ మారతాయి.కడప జిల్లాలో తినే ఆహారం కరీంనగర్లో తినరు.ప్రకాశం జిల్లాలో తినే ఆహారం గోదావరి జిల్లాలో తినరు.ప్రతి జిల్లాకూ తెలుగుభాష మాట్లాడే తీరూ యాసా తేడాగా ఉంటాయి.అలాగే ప్రతి రాష్ట్రంలోనూ పరిస్తితి చక్కనైన ప్రాంతీయభేదాలతో ఇలాగే భిన్నభిన్నాలుగా ఉంటుంది.కనుక ప్రతిజిల్లానూ ఒక రాష్ట్రంగా విడగోట్టుకుంటే తప్ప మనదేశం ఎప్పటికీ ప్రగతిని సాధించలేదు.వేగంగా ముందుకు పోలేదు అనేది సింపుల్ లాజిక్.

ఈ వేగంగా ముందుకు పోయె ప్రక్రియలోకూడా దిశతప్పి ఏ సముద్రంలోకో పోయే అవకాశం కూడా ఉంటుంది.దానికి తగ్గట్టు మన దేశానికి మూడు వైపులా సముద్రం ఎలాగూ ఉన్నది.మన అభివృద్ధిని ఊహించేనేమో ప్రకృతి ఈ వరాన్ని ఎప్పుడో మన దేశానికిచ్చింది.ఎవరికి దగ్గరగా ఉన్న సముద్రంలోకి వారు అభివృద్ధి చెందుతూ వేగంగా ముందుకు పోవచ్చు. మునిగీపోవచ్చు.అక్కడకూడా తేడాలొస్తే సముద్రాన్ని కూడా తడికెలతో 671 ముక్కలుగా విభజించుకుని ఎవరి రేవులో వాళ్ళు మునిగిపోవచ్చు.

మరి ఏ సముద్రమూ లేని ఉత్తరాదివాళ్ళు ఏం జెయ్యాలి? అనే సందేహం కొందరు తెలివితక్కువ దద్దమ్మలకు రావచ్చు.వారి అజ్ఞానానికి జాలిపడుతూ దానికీ ఒక పరిష్కారం సూచిస్తున్నాను.వాళ్ళంతా హిమాలయాల మీదికెక్కి అవతలివైపునున్న చైనాలోకి అభివృద్ధి చెందవచ్చు(దూకొచ్చు).

ఉంకొంతమంది మేదావులకు ఉంకొక సందేహం రావచ్చు.జిల్లాలో కూడా తాలూకాకీ తాలూకాకీ మళ్ళీ తేడాలున్నాయి.జాగ్రత్తగా గమనిస్తే భాషలోనూ యాసలోనూ తిండిలోనూ గుడ్డలు కట్టుకునే తీరులోనూ ఆ తేడాలు అర్ధమౌతాయి.కనుక ప్రతి తాలూకానీ ఒక రాష్ట్రంగా ఎందుకు డిక్లేర్ చెయ్యకూడదు?

అబ్బ! భలే అయిడియా వచ్చింది.అలాగే చేసుకుందాం.ఇబ్బంది లేదు.మన దేశంలో ప్రస్తుతం 5500+ తాలూకాలున్నాయి.వాటినన్నింటినీ రాష్ట్రాలుగా డిక్లేర్ చేసుకుందాం.అప్పుడు అభివృద్ధి ఇంకా అనూహ్యంగా పెరిగిపోతుంది. ఆ అభివృద్ధి కూడా చాలకపోతే ప్రస్తుతం ఉన్న 6,30,000+ పల్లెలనే రాష్ట్రాలు అనుకుంటే ఇంకా బాగుంటుంది.అంతమంది ముఖ్యమంత్రులూ, అంతంతమంది ఇతర మంత్రులూ...ఎంత బాగుంటుందో?

అప్పుడు దేశంలో ప్రతి వంద ఇళ్ళకొక ముఖ్యమంత్రీ,ఇంటికొక మంత్రీ ఉన్నా ఆశ్చర్యం లేదు.ఇక ప్రతి ఇంటినుంచీ కలెక్టర్లూ ఎస్పీలూ ఇతర సివిల్ సర్వేంట్లూ చెప్పాల్సిన పనేలేదు.కుప్పలు తెప్పలుగా ఉంటారు.ఎక్కడ చూచినా మంత్రులే ఎక్కడ చూచినా సివిల్ సర్వెంట్లే.ఎక్కడ చూచినా కాంట్రాక్టులే.ప్రతి వీధిలోనూ అభివృద్ధి పనులే.అద్భుతమైన ప్రగతి ఉంటుంది. గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం అప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది.ఆ రకంగా పాపం ఆయన కలనూ నిజం చేసినవాళ్ళం అవుతాం.

ఇంకాకూడా చాలకపోతే ప్రతి ఇంటినీ ఒక రాష్ట్రంగా అనుకుంటే ఇంకా బాగుంటుంది.ఈ అవుడియాకి తిరుగే లేదు.ఇంటింటికీ ఒక ప్రభుత్వం ఉంటుంది.యజమాని ముఖ్యమంత్రి కావచ్చు.ఇల్లాలు ఆర్ధికమంత్రి ఎలాగూ అవుతుంది.మిగిలిన పోస్ట్ లను వీలును బట్టి నామినేట్ చేసుకోవచ్చు.

ఇక ఒకటే ప్రగతి.ఎక్కడ చూచినా దేశం కళకళలాడుతూ ఉంటుంది.ఎవరి బడ్జెట్ వారిదే.ఎవరి కేటాయింపులు వారికే.ఎవరి ప్రగతి వారిదే.చదువు అక్కర్లేదు.పేదరికం ఉండనే ఉండదు.అందరూ హాయిగా ప్రభుత్వనిధులు బొక్కుతూ కూచోవచ్చు.ప్రతి ఇంటినుంచీ ఎవడోఒకడు ఏదో పదవిలో ఉంటాడు గనుక నిరుద్యోగసమస్య రాత్రికిరాత్రి పరిష్కారం అయిపోతుంది.

అయితే ఒక్కటే సమస్య మిగులుతుంది.ఇంతమంది ప్రజాప్రతినిధులు కూర్చునే సభ ఎక్కడ కట్టాలి?ఎలా కట్టాలి?అంత పెద్ద కాంట్రాక్ట్ ఎవరికి ఇవ్వాలి? అదే అసలైన పెద్ద సమస్య అయి కూచుంటుంది.

దానికీ నాదగ్గిర ఒక పరిష్కారం ఉన్నది.పూర్వకాలంలోని కురుక్షేత్రయుద్ధం లాగా ప్రతి ఏడాదీ ఒక దేశవ్యాప్త యుద్ధం పెట్టుకుంటే అందులో అంతిమంగా ఎవరు గెలిస్తే,వారు ఆ కాంట్రాక్ట్ చేజిక్కించుకోవచ్చు.అయితే దీంట్లో ఉంకో సమస్యుంది.సభ జరిగేటప్పుడు వీళ్ళు ఇసుకతో కట్టిన భవనం ఎలాగూ కూలిపోతుంది గాబట్టి ప్రతినిధులలో చాలా పోస్ట్ లు ఆటోమేటిగ్గా ఖాళీ అవుతాయి.అప్పుడెలా?

అసలు ఇదొక సమస్య కానేకాదు.ప్రతిసారీ శీతాకాల సమావేశాల తర్వాత వేసంకాలంలో మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ ఇచ్చి సభాభవనం కట్టుకుంటూ ఉంటే సరిపోతుంది.మళ్ళీ శీతాకాలంలో అది కూలిపోవడం.వేసంకాలంలో కట్టుకోవడం.ప్రతేడాదీ ఒక కాంట్రాక్ట్ కురుక్షేత్రం పెట్టుకోవడం.సింపుల్.భలేగా ఉంటుంది.ఇలా ఒకపదేళ్లు గడిచేసరికి జనాభా కూడా బాగా తగ్గుతుంది.మన జనాభా మనమే తగ్గించుకుంటున్నాం గనుక పాకిస్తాన్ చైనాలతో విరోధం కూడా తగ్గుతుంది.తద్వారా ఉపఖండంలో శాంతి నెలకొంటుంది.తద్వారా ప్రపంచశాంతికీ మనం దోహదం చేసినవాళ్ళమౌతాం.మన ప్రగతీ బ్రహ్మాండంగా ఉంటుంది.దేశం ప్రగతి చెందాలంటే మనల్ని మనం ఇట్టా ఇబజించుకోడమే మారగం.

ప్రస్తుతం మన దేశంలో 6,30,000+ పల్లెలున్నాయిట.అర్జంటుగా మన దేశాన్ని 6,30,000+ రాష్ట్రాలుగా విభజించుకుందాం.మన దేశం త్వరగా ముందుకు పోవాలంటే ఇదొక్కటే మార్గం.అందరూ కలసి త్వరగా ముందుకు రండి.ఈ అభివృద్ధి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. స్వర్ణభారతాన్ని నిర్మించుకుందాం.

చర్చిల్ మహాశయుడు ఒక మాటన్నాడు.'భారతదేశంలో నాయకులు అందరూ గడ్డిబొమ్మలు(men of straw). ఇప్పుడుగనుక మనం స్వతంత్రం ఇస్తే నిమిషాల్లో దేశాన్ని ముక్కలు చెక్కలు చేసుకోగల సమర్ధులు' అని విన్స్టన్ చర్చిల్ ఎప్పుడో చెప్పాడు.అంత పెద్దాయన అప్పుడే చెప్పినప్పుడు మనం కనీసం ఇప్పుడైనా చెయ్యకపోతే ఎలా?ఆయన ఆత్మ క్షోభించదూ?

అందుకే కదలండి ముందుకు.నడవండి విందుకు.అదుగో ప్రగతి ఎలా పిలుస్తోందో చూడండి.ఏందీ?ఇంత జెప్పినా గూడా ఇందులో పెగతి యాడా గనబట్టం లేదా?అయితే మీకు దుట్టిదోసం ఉన్నట్టే.నేనేం జైలేను.మిమ్మల్ని నేం బాజైలేను బాబోయ్.ఇక మీ కర్మ.