నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

20, జనవరి 2014, సోమవారం

శ్రీశైలం నుంచి పిలుపొచ్చింది -3

'ఒక్కొక్క సారి ఆయన జోలెలో నుంచి ఒక రూపాయి తీసి ఇచ్చేవాడు సార్.ఆ రూపాయిని బీరువాలో జాగ్రత్తగా ఉంచుకొని దాచుకున్న వారు నేడు కోటీశ్వరులైపోయారు.అలాంటి వాళ్ళు ఎందఱో ఉన్నారు.నాకూ ఒకరోజున తన జోలేలోనుంచి ఒక రూపాయిబిళ్ళను తీసి ఇచ్చినాడు సార్.దానిని ఇంట్లోనే జాగ్రత్తగా ఉంచినాను.కానీ ఇంట్లో వాళ్ళు ఏదో పనికి దానిని వాడేసినారు.అది ఇంట్లోనుంచి వెళ్ళిపోయింది.' అన్నాడు.

నాకు ప్రయాణం అంతా భలే వినోదమే అనుకున్నాను.అమ్మ నాకోసం ఇలాంటి ఏర్పాట్లు ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది.

ఒక సద్గురువును ఇలాంటి నాసిరకం మహాత్యాలతో లెక్కిస్తారు తెలియనివారు. షిరిడీ సాయిబాబాని కూడా ఇదే పనిచేశారు.ఒక గురువుని సరిగ్గా అర్ధం చేసుకోవడం ఎప్పుడైనా సరే అతికొద్దిమందికే సాధ్యమౌతుంది. ఎందుకంటే,దానికి మన మనస్సులో ఉండే కుళ్ళును,మన ఆలోచనా విధానాలను,మన ఆశలను,మన ద్వేషాలనూ,మన సంకుచిత మనస్తత్వాలనూ పక్కన పెట్టి ఉన్నవిషయాన్ని ఉన్నట్టుగా అతన్ని చూడగలగాలి.ఆపని చెయ్యడం చాలామందికి సాధ్యంకాదు.దానికి వారి అహం తీవ్రంగా అడ్డు వస్తుంది.అందుకే సద్గురువులు సామాన్యంగా ఎవరికీ అర్ధం కారు.పైగా పొరపాటుగా అర్ధం కాబడతారు.

లోకుల దృష్టిలో ఒక గురువు యొక్క విలువ ఎప్పుడంటే - అప్పనంగా కోట్లు వచ్చిపడే సులువు చెప్పడమో, లేదా వీళ్ళ కోరికలు తేరగా తీర్చే మార్గమో రెమెడీయో చెబితే అప్పుడు అతన్ని గొప్పవాడని లోకం అంటుంది.లేకుంటే 'నాకు హారతి పట్టు ఇక నువ్వు ఏ వెధవపని చేసినా నేను కాపాడతాను'- అంటే లోకం దృష్టిలో అతడు గొప్ప గురువు అవుతాడు.ఇది చాలా చవకబారు మనస్తత్వం అని నేనంటాను.సద్గురువైనవాడి విలువ ఇలాంటి చీప్ ట్రిక్స్ లో ఉండదు.నిజమైన సద్గురువు ఇలా అప్పనంగా ఎవడికీ ఏదీ ఇవ్వడు.ఇస్తానని అభయమూ ఇవ్వడు.

'నన్ను నమ్ము.ఇక నువ్వేది చేసినా నాదే భారం' అని అనేవాడు అసలు సద్గురువే కాదు.'సరియైన దారి ఇది.దీనిలో నడిచే ప్రయత్నం చెయ్యి.చేస్తే నీ అదృష్టం.లేకుంటే నీఖర్మ.దారి మాత్రం ఇదే.' అని చెప్పేవాడే అసలైన సద్గురువు.


చాలామంది సోకాల్డ్ శిష్యులు గురువును ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి తమ అవసరాలకు అతడిని వాడుకుందామని చూస్తారు. వాళ్ళు చేసే స్తోత్రాలూ పూజలూ పొగడ్తలూ ఈ ప్రక్రియలో భాగాలే.అది వాళ్ళ తప్పుకూడా కాదు.వారిలో ఉండే భయమూ సంకోచమూ అహమూ దురాశా వారిచేత ఈ పనిని చేయిస్తాయి.అవే వారిని అడుగు ముందుకు వెయ్యనివ్వవు.చాలామంది మనుషులకు వీటిని వదిలించుకునే లోపే జీవితాలు పరిసమాప్తి అయిపోతూ ఉంటాయి.లోకంలో ఎక్కడైనా ఇదే జరుగుతుంది.ఈ సంఘర్షణలో ఏళ్ళకేళ్ళు గడుపుతూ ఉంటారుగాని గురువు చెప్పిన దారిలో నడుద్దామని త్రికరణశుద్ధిగా ముందుకు రారు.రాలేకుండా వారిలోని భయమూ సంకోచమూ అహమూ దురాశా అడ్డు పడుతుంటాయి. అక్కడే వాళ్ళు పరీక్షలో తప్పిపోతుంటారు.చివరిలో బాధపడతారు.


గురువును మనం అనుసరించాలిగాని అతనికి దారిని మనం చూపకూడదు. అలా చూపిస్తే అది మన అహం అవుతుంది.అహం ఉన్నవారు ఎన్నటికీ శిష్యులు కాలేరు.శిష్యులు కానిదే దారిలో నడవలేరు.నడవనిదే గమ్యం దొరకదు.ఇవన్నీ ఒకదానికి ఒకటి అనుసంధానం ఉన్న ప్రక్రియలు.మనలని పట్టి బంధిస్తున్న సంకెళ్ళను ఒక్కొక్కటీ తెంచుకుంటూ గురువు చూపిన మార్గంలో నడవాలి.అంతేగాని ఊరకే మాటలు మాట్లాడుతూ చర్చిస్తూ కూచుంటే ఆధ్యాత్మికంగా ఏమీ సాధించలేరు.అప్పుడు అశాంతి తప్పదు.

పాండిచ్చేరి మదర్ అనిన మాట ఒకటి మనసులో తళుక్కున మెదిలింది.

'మహత్యాన్ని బట్టి గురువును అంచనా వేసేవారు అల్పులైన శిష్యులు. గురువును బట్టి మహత్యాన్ని అంచనా వేసేవారు ఉత్తమ శిష్యులు.'

ఈ మాట సరిగ్గా అర్ధం కావడానికే చాలామందికి సగం జన్మ సరిపోదు.

నా ఆలోచనను భగ్నం చేస్తూ రామ్మూర్తి స్వరం మ్రోగింది.

'ఒకసారి కాశినాయన ఏదో ఊరికి పోవడానికి ఒక బస్సెక్కినాడు సార్.నాయన టికెట్ తీసుకుంటాడు.కాని ఆయన వేషంచూచి అడుక్కునేవాడేమో అని భావించి బస్ కండక్టర్ బస్సులోనుంచి ఆయన్ను ఒక్క త్రోపు త్రోశినాడు. నాయన కింద పడిపోయినాడు. బస్ కడ్డీ ఒకటి తగిలి నాయనకు బాగా దెబ్బ తగిలింది.బస్సు బయలుదేరి వెళ్ళిపోయింది.ఆ బస్సు చేరవలసిన ఊరికిచేరి ఆగేసరికి నాయన నవ్వుతూ బస్సుకు ఎదురుగా నిలబడి ఉన్నాడు.చూచిన వారి పై ప్రాణాలు పైనే ఎగిరిపొయ్యాయి.'

ఇంకో సంగతి ఇలాంటిదే చెబుతాను వినండి.కాశినాయనకు శిదిలాలయాలను బాగుచేయించి వాటిలో మళ్ళీ పూజా పునస్కారాలు మొదలు పెట్టించడమంటే చాలా ఇష్టం.ఆ విధంగా ఆయన రాయలసీమలోని ఎన్నో శివాలయాలను బాగుచేయించాడు.ఒక సారి నల్లమల అడవిలోని ఒక శివాలయాన్ని ఇలాగే బాగుచేయించాడు.ఆ క్రమంలో అక్కడ చెట్లను కొన్నింటిని కొట్టించాడు.ఆ నేరానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయనపైన కేసు పెట్టారు.స్వయానా ఒక కలెక్టర్ ఆయన్ను అరెస్ట్ చెయ్యడానికి వచ్చాడు.

'నాయనా,నువ్వు కోర్టుకు రావాలి.జీపెక్కు' అని వాళ్ళు అడిగినారు.

'ఎందుకు నాయనా?' అని కాశినాయన అడిగినాడు.

'నీవు అడవిలో చెట్లను కొట్టించినావు.అది నేరం.కాబట్టి నీవు ఫలానా ఊరిలోని కోర్టుకు రావాలి.రా జీపెక్కు పోదాం.' అని వారన్నారు.

'నేను మామూలు మనిషిని నాకు జీపెందుకులే నాయనా.మీరెళ్ళండి.నేను నడిచి వస్తాలే.పదండి.' అని ఆయన లేచాడు.

'వాళ్ళు ఆ ఊరికి చేరి కారులో కోర్టుకు చేరేసరికి,అక్కడ కోర్టు ఆవరణలో ఒక చెట్టు కింద కూర్చుని నాయన వాళ్లకు కనిపించాడు.కలెక్టర్ తన కళ్ళను తానే నమ్మలేక బిత్తరపోయి నాయనకు భక్తుడై పోయినాడు.' అన్నాడు రామ్మూర్తి.

'ఇవన్నీ నిజాలేనా?'- కావాలనే ఇలా అడిగాను.

'మీకు అబద్దాలు చెబితే మాకేమొస్తుంది సార్?' అన్నాడు రామ్మూర్తి.

'కాశినాయన నంద్యాలకు వస్తే లక్ష్మమ్మగారి ఇంటికి మాత్రమే ఎక్కువగా పొయ్యేవాడు.లక్ష్మమ్మ అనే సాధ్వి ఎన్నో ఏండ్ల నుంచి ఈ ఊరిలో నిత్యాన్నదానం చేస్తూ ఉన్నది.నంద్యాల చాలా మహత్యం ఉన్న ప్రాచీనమైన ఊరు సార్.లక్ష్మమ్మ ఆయనను కూర్చుండబెట్టి ఆయనకాళ్ళు ఒక పళ్ళెంలో పెట్టి కడిగి పూజ చేసేది.కాసేపు అక్కడ ఉండి తర్వాత ఎటో వెళ్ళిపోయేవాడు.'

'ఆయన ఎప్పుడైనా ఏదైనా బోధ చేసేవాడా?' అడిగాను.

'లేదు సార్.అలాంటి బోధలూ అవీ చెయ్యగా నేను ఎప్పుడూ చూడలేదు. అసలు ఎక్కువగా మాట్లాడేవాడే కాదు.ఎక్కువభాగం మౌనంగా ఉండేవాడు. మొన్నా మధ్యన రిటైరైన స్టేషన్ మాస్టర్ రామకృష్ణయ్యగారు కూడా నాయనను ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళింటికి తీసుకెళ్ళి కాళ్ళు పళ్ళెంలో పెట్టి కడుగుతూ రుద్రమూ నమకచమకాలూ చదివేవాడు.రామకృష్ణయ్య గారు సద్బ్రాహ్మణుడు. ఆయన నాయనకు పరమభక్తుడు.'

'మరి ఒక బ్రాహ్మణుడు తన కాళ్ళు కడుగుతూ రుద్రం పఠిస్తే నాయన ఏమనేవాడు?' అడిగాను.

'ఏమీ అనేవాడు కాదు.కడిగించుకునేవాడు.అంతే.చదవడం ఆపితే మాత్రం 'పోగులయ్యా..చదువయ్యా' అని మాత్రం అనేవాడు.'రామకృష్ణయ్య గారి చెవులకు పోగులుండేవి.అందుకని అలా అనేవాడు.'

చాలాసార్లు రైల్లో కూడా ప్రయాణం చేస్తూ ఉండేవాడు.మన రైల్వే స్టాఫ్ చాలామందికి కాశిరెడ్డినాయన తెలుసు సార్.మనలో ఎంతోమంది ఆయన భక్తులున్నారు.అలా కనిపించినప్పుడు బాగా బతిమిలాడితే ఒక కప్పు టీ మాత్రం తాగేవాడు.ఒక్కొక్కసారి అదీ తీసుకునేవాడు కాదు.

'ఆయన చాలా దేవాలయాలను జీర్ణోద్ధారణ చేయించినాడు సార్.నంద్యాల దగ్గరున్న 'ఓంకారం' శివాలయం కూడా ఆయన బాగుచేసినదే.ఆయన మఠాలలో అన్నిచోట్లా నిత్యాన్నదానం నడుస్తున్నది సార్.ఎవరు అక్కడికి పోయినా చక్కగా భోజనం పెడతారు.' అన్నాడు రామ్మూర్తి.

'చాలా మంచిపద్ధతి.ఒక్కొక్క ప్రాంతంలో ధర్మోద్ధరణ ఒక్కొక్కరిద్వారా జరుగుతోంది.మంచి పరిణామమే.తన లీలలో అమ్మ ఎవరిని ఎలా ఉపయోగించుకుంటుందో ఎవరికి తెలుస్తుంది?' అన్నాను.

'ఆయన ఎందుకని అలా ఊళ్లు పట్టుకుని తిరుగుతూ ఉండేవాడు?' రామ్మూర్తి ఏమంటాడో చూద్దామని అడిగాను.

'అది మనం అర్ధం చేసుకోలేం సార్.వాళ్ళు ఎప్పుడు ఎందుకు ఏ పని చేస్తారో మనకు అర్ధంకాదు.వాళ్ళ ఆలోచనాస్థాయి వేరుగా ఉంటుంది.చాలాసార్లు మనం అనుకునేది ఒకటీ వాళ్ళ మనసులో ఉండేది వేరోకటీ అయ్యి ఉంటుంది.' అన్నాడు రామ్మూర్తి.

'ఫరవాలేదు బాగానే అర్ధం చేసుకున్నాడు'- అనుకున్నాను.

ఇంతలో అడివి మధ్యలోకి వచ్చినాము.తెలతెలవారుతూ ఉంటే మసక చీకటీ అప్పుడే వస్తున్న వెలుతురూ కలసి ఒక విధమైన మార్మిక వాతావరణం అలముకుంటుంది.ఏదో ఫెయిరీ లాండ్ లోకి అడుగు పెట్టినట్లు అనిపిస్తుంది.తెల్లవారుతోందికదా ఇంక చిన్నచిన్న సాధుజంతువులూ పక్షులూ ఆహారవేటకు బయలుదేరాయి.

'ఇప్పుడు పులులూ ఎలుగుబంట్లూ కనిపించడం మానేశాయిగాని, పాతకాలంలో దారికి అడ్డంగా కూడా కనిపించేవి సార్.వాటి జనాభా కూడా బాగా తగ్గిపోయింది.కనిపించినదాన్ని కనిపించినట్లు చంపేసి చర్మం దగ్గరనుంచీ అన్నీ అమ్మేసుకుంటున్నాడు మనిషి.ఇప్పుడు మనిషి కనిపిస్తే అవి వణికిపోయి అడవిలోకి పారిపోతున్నాయి.ఇంతకు ముందు అడవి ఇంకా బాగా చిక్కగా ఉండేది.ఇప్పుడు పలచబడిపోయింది.ఎక్కడికక్కడ చెట్లు కొట్టేసి అమ్మేసుకుంటున్నారు.' అన్నాడు రామమూర్తి.

దారిలో అడవికోళ్ళూ,కోతులూ దారి పొడుగూతా కనిపించాయి.ఊరికోడికీ అడవికోడికీ ఆకారంలో చాలాతేడా ఉన్నది.ఇక కోతులైతే చెప్పనక్కర్లేదు.కార్లో పోయేవాళ్ళు విసిరే పదార్ధాలు తినడానికి కోతులు అలవాటు పడ్డాయిలా ఉన్నది.కారు వస్తుంటే గుంపులుగా కారు దగ్గరగా వచ్చి ఏమైనా వేస్తామేమో అని చూస్తున్నాయి.

'అరె.ఈ సంగతి తెలిస్తే ఒక అరటి గెలను కార్లో పెట్టించి దారిలో కోతులకి వేస్తూ వెళ్ళేవాళ్ళం కదా?' అన్నాను.

'మాకూ ఆ ఆలోచన రాలేదు సార్.అయినా అంత పొద్దున్నే అరటి పళ్ళు ఎక్కడ దొరుకుతాయి?ఈసారి వచ్చినప్పుడు అలా చేద్దాం.డోర్నాల దాటినాక అడివిలో ఒక కోతిమూక మనకు ఎదురువస్తుంది.వాటి లీడర్ కోతి రెండుకాళ్ళ మీద మనిషిలా నడుస్తుంది.అంతేకాదు బస్సుకు ఎదురుగా నిలబడి రెండుకాళ్ళమీద వెనక్కు నడుస్తుంది అది.మళ్ళీ మనం విసిరినవాటిని అదేమీ తినదు.తన గుంపులోని కోతులు అన్నీ తినిన తర్వాత చివరిలో అది తింటుంది.' అన్నాడు.

'అది మంచి లీడర్ రామమూర్తిగారు.నాయకత్వ లక్షణాలు దానికి పుష్కలంగా ఉన్నాయి.నిజమైన లీడర్ తన గుంపులోని వారి బాగోగులు ముందుగా చూచి తన బాగోగులు చివరిలో చూచుకోవాలి.అదే నిజమైన నాయకలక్షణం' అన్నాను.

'ఇందాక నంద్యాల ఊరి గురించి చెప్పినారు కదా? బ్రహ్మంగారు ఇక్కడికి వచ్చినారా?' అడిగాను.

'ఎందుకు రాలేదు సార్? ఆయన చాలాసార్లు నంద్యాలకు వచ్చినారు.ఈఊరు చాలా ప్రాచీనమైనది.బ్రహ్మంగారు చేసిన రెండు గొప్పమహత్యాలు నంద్యాలలో చేసినవే. వినండి.' అని చెప్పసాగాడు రామ్మూర్తి.

(ఇంకా ఉంది)