“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

20, ఫిబ్రవరి 2014, గురువారం

దయచేసి మీ పుస్తకాలు మీరే ఉంచుకోండి

మొన్నొకరోజున హైదరాబాద్లో ఉండగా ఒక ఫోనొచ్చింది.

'నాపేరు ఫలానా' అంటూ అవతలి వైపునుంచి ఒక స్వరం వినిపించింది.

నేను వెంటనే ఆ వ్యక్తిని గుర్తుపట్టాను.

అయినా తెలీనట్లు 'మీరెవరో తెలుసుకోవచ్చా?' అనడిగాను.

'నేను 'విశ్వజనని' మాసపత్రిక ఎడిటర్ని' అంటూ ఆయన పరిచయం చేసుకున్నారు.

ఆయన తనను ఎలా పరిచయం చేసుకుంటారో చూద్దామనే నేను అలా అడిగాను.ఎందుకంటే ఆయన జిల్లెళ్ళమూడి అమ్మగారికి మంచి భక్తుడేగాక, కుర్తాళం స్వాములవారి సోదరుడు కూడా.కొన్ని ఉపన్యాస కార్యక్రమాలలో స్టేజి మీద ఆయన్ను చూచాను.

ఆయన తనను వ్యక్తిగతంగా పరిచయం చేసుకుంటారా, ఉద్యోగపరంగా పరిచయం చేసుకుంటారా,సోదరుని రిఫరెన్స్ ఇస్తారా,లేక జిల్లెళ్ళమూడి అమ్మగారి తరఫున రిఫరెన్స్ ఇస్తారా చూద్దామని అలా అడిగాను.సమాధానం సంతృప్తికరంగానే వచ్చింది.

'నేను మీకు తెలీదు కాని,నాకు మీరు తెలుసు సార్' అన్నాను.

'నేను ప్రస్తుతం మీ ఆఫీస్ లోనే ఉన్నాను.ఇక్కడికి వస్తే మీరు లైన్ మీద వెళ్ళారని తెలిసింది' అన్నాడాయన.

నాకు తెలిసి ఆయనకు వయస్సు డెబ్భై ఏళ్ల పైనే ఉండాలి.పాపం అంత పెద్దవాడు వెతుక్కుంటూ నాకోసం రావడం బాధ అనిపించింది.

'నేను రేపు గుంటూరుకు వస్తాను.ఏదైనా పనుంటే చెప్పండి సార్.మీరెందుకు రావడం?నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను' అడిగాను.

'లేదులెండి.(జిల్లెళ్ళమూడి)అమ్మగారి అబ్బాయి మిమ్మల్ని ఒకసారి కలవమని చెప్పినారు.నేనే మళ్ళీ కలుస్తాను' అంటూ ఫోన్ కట్ చేసాడాయన.

కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది.

ఆరోజు ఆదివారం.గుంటూరులోనే ఉన్నాను.ఎందుకోగాని ఆ రోజున అకాలవర్షం పడుతోంది.

'మీ ఇల్లు ఎక్కడో చెబితే నేను వచ్చి కలుస్తాను' అన్నారాయన.

మా ఇంటి అడ్రస్ ఆయనకు చెప్పాను.ఆ వర్షంలో పాపం అంత పెద్దాయనని ఇబ్బంది పెట్టడం ఎందుకని ' సార్.ప్రస్తుతం నేను మీ ఇంటిదగ్గర లోనే ఉన్నాను.మీ ఇల్లు ఎక్కడో చూచాయగా నాకు తెలుసు కాని సరిగ్గా తెలియదు.కొండగుర్తులు చెబితే నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను.' అని చెప్పినాను.

ఆయన అడ్రస్ చెప్పినారు.

పెద్దగా కష్టపడకుండా సులభంగానే అడ్రస్ దొరికింది.ఇంతలో ఆయనే బయటకు వచ్చి నాకోసం ఎదురొచ్చారు.

'నమస్కారం సార్' అంటూ 'నేనే మీరు ఫోన్ చేసిన సత్యనారాయణ శర్మను' అన్నాను.

'రండి' అంటూ ఇంటిలోకి తీసికెళ్ళాడు ఆయన.

ఇంటిలో ఎక్కడ చూచినా అమ్మగారి ఫోటోలు కనిపిస్తున్నాయి.వాటిలో చాలా పాత ఫోటోలు కూడా ఉన్నాయి.ముందు గదిలో కూచున్నాము.

పరిచయాలూ కుశల ప్రశ్నలూ అయ్యాక 'ఒక్క నిముషం' అంటూ లోనికెళ్ళి రెండు పుస్తకాలు తెచ్చి నాకిచ్చారు.ఒకటి కొంచం లావుగా ఉన్న పుస్తకం. ఇంకొకటి చిన్న హేండ్ బుక్ లాంటి పుస్తకం.

ఈలోపల నేను గోడలకున్న ఫోటోలు చూస్తూ కూచున్నాను.

'నేను 'విశ్వజనని' పత్రికలో చాలా ఏళ్ళనుంచీ వ్రాస్తూ వస్తున్న సంపాదకీయాలు అన్నీ కలిపి ఈ పెద్ద పుస్తకంగా వేశాము.చదవండి.ఇది ఇంకొక చిన్న పుస్తకం.కొత్తవాళ్ళకు అమ్మ గురించి అమ్మ చింతన గురించీ పరిచయం చేస్తుంది.ఇవి మీకిద్దామనే రమ్మన్నాను'- అని రెండు పుస్తకాలు ఇస్తూ అన్నారు.

నేను ఒక్క క్షణం ఆ పుస్తకాలవైపు చూచాను.

'సార్.మీరేం అనుకోకండి.నాదొక చిన్నమాట' అన్నాను.

ఆయన ప్రశ్నార్ధకంగా చూచాడు

'ఈ పుస్తకాలు నాకొద్దు.మీరే ఉంచుకోండి.'అన్నాను.

ఆయన ముఖంలో ఆశ్చర్యం కనిపించింది.

'అమ్మ గురించి అంతా చదివాను.నాకు మొత్తం అర్ధమైంది అని నేను చెప్పను.ఎందుకంటే ఆ మాట అహంకారం అవుతుంది.కాని సవినయంగా ఒక మాట చెబుతాను.చిన్నప్పటినుంచి అమ్మ సాహిత్యం బాగానే చదివినాను. పుస్తకాలు చదివి ఇంక నేను తెలుసుకోవలసినది ఏదీ లేదని నా ఉద్దేశ్యం. అందుకని దయచేసి ఏమీ అనుకోకండి.ఈ పుస్తకాలు మీ దగ్గరే ఉంచండి.' అని సున్నితంగా చెప్పినాను.

'అలాగా.అయితే మీరు ఫలానా పుస్తకాలు చదివారా?' అంటూ మూడు నాలుగు ముఖ్యమైన పుస్తకాల పేర్లు ఆయన అడిగినారు.

'చదివాను' అని జవాబిచ్చాను.

'మీరు అమ్మగారిని చూచారా?' అడిగారు.

'నాకు 13 ఏళ్ళ వయస్సులో ఒక్క రెండు నిముషాల పాటు అమ్మగారిని దర్శించే భాగ్యం జిల్లెళ్లమూడిలో కలిగింది.అంతకంటే అదృష్టం కలగలేదు' అని మాత్రం చెప్పినాను.

'ఆధ్యాత్మిక మార్గంలో నిజానికి పుస్తకాల ఉపయోగం పెద్దగా ఏమీ లేదు.అంతా వాడి కరుణతో రావలసిందే' అంటూ ఆకాశం వైపు చేతులు చూపాడాయన. 'అయితే నడవాల్సిన దారి ఏమిటో పుస్తకాలు చూపిస్తాయి.అంతవరకే వాటి ఉపయోగం' అన్నాడు.

అది నిజమే కావడంతో నేను మౌనంగా తలాడించాను.

'నేను 1958 నుంచీ జిల్లెళ్ళమూడి వెళుతున్నాను.అప్పట్లో దారి కూడా సరిగ్గా ఉండేది కాదు.రెండు కాలవలు దాటి వెళ్ళాలి.వాటి మీద తాటి దుంగలు వేసి ఉండేవి.ఆ దుంగల మీదుగా నడిచి కాలవలు దాటి వెళ్ళవలసి వచ్చేది.వాన పడితే మోకాలి లోతు బురదలో పొలాలలో నడుస్తూ వెళ్ళేవాళ్ళం.' అన్నాడాయన.

'అప్పటికి నేనింకా పుట్టలేదు సార్' అన్నాను.

నవ్వాడాయన.

'అప్పట్లో పెద్దగా జనం ఉండేవారు కారు.ముఖ్యమైన రోజులలో అయితే ఒక పదీ పదిహేను మంది కంటే వచ్చేవారు కారు.కాని 1962 తర్వాత జనం బాగా రావడం మొదలైంది.ఒక్కోసారి పదివేల మంది అమ్మ దర్శనం కోసం వచ్చిన రోజులు కూడా ఉన్నాయి.అయితే అందరూ అమ్మకోసం వచ్చేవారు కారు.ఒకసారి సినిమా నటులు కృష్ణా విజయనిర్మలా అమ్మ దర్శనం కోసం వస్తే వాళ్ళను చూడటం కోసం ఊరిజనం తండోపతండాలుగా ఎగబడ్డారు.' అని నవ్వాడాయన.

నాకూ నవ్వొచ్చింది.సినిమా నటులు మద్రాస్ నుంచి అమ్మను చూడటానికి వస్తే,ఆ ఊరిలోనే ఉన్న జనం ఆ నటులను చూడటానికి ఎగబడటం ఎంత విచిత్రం?మాయాప్రభావం అంటే ఇదే కదా?ఎంత మహనీయులైనా సరే రోజూ ఎదురుగా కనిపిస్తుంటే వారి విలువ తెలియదు.ఇది సహజమే.

'పిచ్చిజనం! అంతేగా మరి' అనుకున్నాను.

'ఆ రోజులు అమ్మ చరిత్రలో స్వర్ణయుగం అనుకుంటా?' అడిగాను.

'అవును.ఎంతోమంది ప్రముఖులూ గొప్ప గొప్పవాళ్ళూ అమ్మ దర్శనం కోసం వచ్చేవారు.'అంటూ అప్పటి మహాకవులూ పండితులూ సాధకుల పేర్లు చాలా ఉటంకించాడాయన.'వీళ్ళందరూ అమ్మ పాదాల వద్ద కూచున్నవారే.మా సోదరులు ప్రస్తుతం కుర్తాళం పీఠాధిపతి కూడా అమ్మ వద్దకు వచ్చి అమ్మ పాదాలవద్ద కూర్చున్నవారే.' అన్నాడు.

నేను మౌనంగా వింటున్నాను.

'కుర్తాళం స్వాములవారు మా సోదరులే.వారిదే మౌనప్రభ అని ఒక పత్రిక ఉన్నది.దాని బాధ్యతలు కూడా నేనే చూస్తూ ఉంటాను.' అన్నారు.

నేనేమీ మాట్లాడలేదు.

'ప్రస్తుతం చాలామంది స్వామీజీలున్నారు.కాని ఆయనవంటి మంత్రోపాసకులు మాత్రం ప్రస్తుతం ఎవరూ లేరు' అన్నారు.

'ఉపాసకులు లేకుండా ఎలా ఉంటారు?వారున్నట్లు మనకు తెలియకపోవచ్చు. అందర్నీ మనం గుర్తించగలమా?' అన్నాను.

ఆయన కొంచం ఆశ్చర్యంగా చూచాడు.

'మా వంశంలో మూడుతరాలుగా కవిత్వం ఉన్నది.మాతాతగారు మా నాన్నగారు మంచి కవులు.అదే మాకూ అబ్బింది.'-అంటూ ఆయన చిన్నప్పుడు వ్రాసిన రెండుమూడు పద్యాలను చదివి వినిపించాడు.

'బాగున్నాయి'-అన్నాను నవ్వుతూ.

'మా సోదరులు కులపతి గారు ఇప్పటికి ఆధ్యాత్మికత మీద దాదాపు నలభై పుస్తకాలు వ్రాశారు.చదివారా?' అన్నాడు.

'బహుశా ఒకటో రెండో చదివానేమో గుర్తులేదు' అన్నాను నిరాసక్తంగా.

ఆ పుస్తకాల గురించి నా అభిప్రాయాలు చెప్పి పాపం పెద్దాయనని బాధ పెట్టడం ఎందుకనిపించింది.

ఆధ్యాత్మికతనూ అమ్మ తత్వాన్నీ నాకు పరిచయం చెయ్యాలన్న ఉద్దేశ్యంతో ఆయన నన్ను రమ్మన్నట్లు నాకు అర్ధం అయింది.ఆ ఉద్దేశ్యం నెరవేరే అవకాశం నా దగ్గర ఆయనకు కనపడలేదు.బహుశా ఆయన అనుకున్న తీరులో నేను ఆయనకు కనిపించలేదేమో.ఎంతసేపు కూచున్నా నేనేమీ ఆయన్ను ప్రశ్నలు అడగడం లేదు. మౌనంగా కూచుని చూస్తున్నాను.లేదా ముక్తసరిగా జవాబులు ఇస్తున్నాను.అది ఆయనకు ఇబ్బందిగా ఉన్నదని ఆయన బాడీ లాంగ్వేజి చూస్తే నాకర్ధమైంది.

మౌనం తప్ప మాటలు ముందుకు సాగడంలేదు.ఇక బయలుదేరడం మంచిదని నాకు తోచింది.

'నేను వెళ్ళి వస్తానండి.పుస్తకాలలో మీలాంటి పెద్దవారి పేర్లు చదవడమే కాని ఇన్నాళ్ళూ పరిచయం లేదు.మీతో ఈరోజు ఇలా పరిచయం చేయించింది అమ్మ.' అంటూ లేచాను.

'మంచిది' అన్నాడాయన.

అంత పెద్దవయసులో కూడా ఆధ్యాత్మికతనూ అమ్మ తత్త్వచింతననూ నలుగురికీ పరిచయం చెయ్యాలన్న ఆయన తపనకు నాకాశ్చర్యం వేసింది.అదే సమయంలో,పాండిత్యం అనేది సత్యాన్ని ఎలా దగ్గరకు చేరనివ్వకుండా అడ్డుపడుతుందో కూడా మళ్ళీ ఇంకొక్కసారి అర్ధమైంది.

నేర్చుకునేవారికి జీవితంలో అనుక్షణం ఎన్నో అవకాశాలను దైవం ఇస్తూనే ఉంటుంది.జీవితం నిజంగా ఎంతో అద్భుతమైన వరం.దానిని సరిగ్గా ఉపయోగించుకుంటే అనుక్షణం ఎంతో నేర్చుకోవచ్చు.అంతరికంగా ఎంతో ఎదగవచ్చు.ఉపయోగించుకోలేకపోతే,ఎదురౌతున్న అవకాశాలను వృధా చేసుకోవచ్చు కూడా.చాలామందికి జరిగేది అదే.

కానీ దైవం ఎన్నటికీ విసుగు చెందదు.ఒకదాని తర్వాత ఒకదానిని అలా అవకాశాలను పరంపరగా ఇస్తూనే ఉంటుంది.వాటిని ఎలా స్వీకరించాము వాటినుంచి ఎంత నేర్చుకున్నాము ఎంత ఎదిగాము అన్నదే జీవితంలో అతి ముఖ్యమైన విషయం.

మనం ఎంతవరకు చూస్తే అంతవరకే ఎదుటి మనిషి అర్ధమౌతాడు.మన దృష్టే మనకు దారి చూపిస్తుంది.అదే దృష్టే మళ్ళీ ప్రతిబంధకమూ అవుతుంది.కళ్ళు తెరిచి చూస్తే చూచినంత మేరకే కనిపిస్తుంది.కళ్ళు మూసుకుని చూచే విద్య తెలిస్తే సర్వం కనిపిస్తుంది.కళ్ళు మూసుకుని చూచే కిటుకును నేర్చుకున్న వాడే నిజంగా చూడగలిగినవాడు.వాడే నిజంగా కళ్ళున్నవాడు.

మన దృక్కోణమే మనలను సంకుచితపరుస్తుంది.సత్యాన్ని చూడనివ్వకుండా మన మనస్సే మనకు అడ్డు పడుతుంది.అంతిమంగా మనం చూడాలనుకున్న దానినే మనం చూస్తాం.అంతేగాని ఉన్నదానిని ఉన్నట్టు చూడము.తాను చూడాలనుకున్న దానిని మాత్రమే చూడటం నిజమైన చూపు కాదు. ఉన్నదాన్ని ఉన్నట్టు చూడటమే అసలైన దృష్టి.అది లేనంతవరకూ దేవుడు వచ్చి మన ఎదురుగా నిలబడినా మనకు అర్ధం కాబడడు.ఎందుకంటే మన దృష్టి ఎక్కడో ఉంటుంది గనుక.

తెలివైనవాడు జీవితంలోని ప్రతి అడుగులోనూ ఒక కొత్త విషయాన్ని చూస్తాడు.ఒక కొత్త సంగతి నేర్చుకుంటాడు.నేర్చుకోగలిగితే జీవితాన్ని మించిన గురువు ఇంకెవరున్నారు?ప్రతిక్షణమూ దైవం మన ఇంటి తలుపులు తడుతూనే ఉంటుంది.కాని మనం మొండిగా మన తలుపులు మూసుకుని కూచుంటే అది ఎవరి తప్పు అవుతుంది?

జిల్లెళ్ళమూడి అమ్మగారు కూడా ఇదే అనేవారు.

'నీవు అడిగితే అడిగినదే ఇస్తాను.అడగకపోతే నీకు అవసరమైనది ఇస్తాను'-అనేది అమ్మ వాక్కులలో ఒకటి.

అడగకుండా ఉండగలిగేవారు ఈ భూమ్మీద ఎందరుంటారు?తమ ఇష్టాన్ని పక్కనపెట్టి,దైవం ఇచ్చిన 'అవసరమైన దానిని' ఆనందంగా స్వీకరించగలిగే వారు ఎందరుంటారు?

చూస్తూ కూడా చూడనివారూ,చూడకుండా చూచేవారూ ఈ పిచ్చిలోకంలో ఎక్కడుంటారు?

లోలోపల నవ్వుకుంటూ బైక్ స్టార్ట్ చేసి మా ఇంటి వైపు పోనిచ్చాను.