నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

30, మార్చి 2014, ఆదివారం

హోమియోపతి సర్వరోగ నివారిణియా?

హోమియోపతిని నేను పొగిడే దానిని బట్టి అది సర్వరోగ నివారిణిగా నేను భావిస్తున్నానని కొందరు అనుకోవచ్చు.ఈ భావన సరికాదు.దాదాపు రెండు దశాబ్దాల అనుభవంతో నేను ఒక మాట నిజాయితీగా చెప్పగలను.హోమియోపతి సర్వరోగనివారిణి కాదు.నేడు వస్తున్న,లేదా పూర్వంనుంచీ ఉన్న అనేక రోగాలకు అందులో మందులు లేవు అన్నది చేదువాస్తవం.

మిగిలిన వైద్య విధానాలకంటే హోమియోపతి మంచిదే అనడంలో ఏ అనుమానమూ లేదు.కాకపోతే అందులో కూడా తగ్గని రోగాలు చాలా ఉన్నాయి.అలాంటి కొన్ని రోగాలకు ఆయుర్వేదంలో చక్కని మందులు ఉన్నాయి.ఇది వినడానికి వింతగా ఉండవచ్చు.కాని నిజం.

నిజానికి ఏ వైద్యవిదానమూ పర్ఫెక్ట్ కాదు.ఇవన్నీ పడుతూ లేస్తూ నేర్చుకుంటూ ముందుకు సాగుతున్న ప్రక్రియలే.కాకపోతే ఈ క్రమంలో తక్కువ హానితో ఎక్కువగా మేలు చేసేది ఏది అని ఆలోచిస్తే కొన్నింటికి ఎక్కువ మార్కులు పడతాయి.కొన్నింటికి తక్కువ మార్కులు పడతాయి.కాని అన్నీ ఎదిగే క్రమంలో ఉన్నట్టివే.హోమియోపతి ఈ భావనకు అతీతమైనది ఏమీ కాదు.

నా అనుభవంలో హోమియోపతికి లొంగని రోగాలను నేను చూచాను.దానికి కారణం వైద్యం తెలియకపోవడం కాదు.ఆయా రోగాలను తగ్గించే మందులు హోమియోపతిలో లేకపోవడమే.

డాక్టర్ హన్నేమాన్ విరచిత 'ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్' కాని, 'క్రానిక్ డిసీజెస్' కాని మనం క్షుణ్ణంగా చదివితే ఒకవిషయం అర్ధమౌతుంది.డా||హన్నేమాన్ కూడా చాలారోజులు మొక్కలనుంచీ లోహాల నుంచీ మినరల్స్ నుంచీ విషాలనుంచీ తీసిన మందులు వాడి రోగాలు తగ్గించేవాడు.కాని కొన్ని రోగాలు ఈ మందులకు తగ్గకపోవడం ఆయనకూడా గమనించాడు.ఆ క్రమంలో పన్నెండేళ్ళ రీసెర్చి అనంతరం ఆయన 'మయాజం' అన్న భావాన్ని కనుక్కున్నాడు.

ఈ 'మయాజం' అన్న దోషం రోగిలో ఉన్నపుడు ఇండికేటేడ్ మందులు పనిచేయ్యవని ఆయనకూడా గ్రహించాడు.అప్పట్లో ఆయన అనుభవాన్ని బట్టి సోరా,సిఫిలిస్,సైకోసిస్ అనబడే మూడు మయాజంలే ప్రపంచంలో ఉన్నాయని ఆయన అనుకున్నాడు.తర్వాతి తరాలవారు వారి పరిశోధనలో ట్యూబర్కులర్ మయాజం,కేన్సర్ మయాజం మొదలైన ఇంకా ఉన్నాయని గ్రహించారు.అందుకే హానిమాన్ ప్రవేశపెట్టిన సోరినం,సిఫిలినం,మెడోరైనం మొదలైన విషఔషధాల సరసన ట్యూబర్కులైనం,కేర్సినోసిన్ మొదలైన నోసోడ్స్ చేరాయి.

ప్రస్తుతం వీటన్నిటినీ మించి ఎయిడ్స్ ఒకటి తయారైంది.ఎయిడ్స్ వైరస్ ను కూడా పోటెంటైజ్ చేసి 'ఎయిడినం' అనే మందుగా కొందరు చేశారు.ఎయిడ్స్ రోగుల ట్రీట్మెంట్ లో అది చాలామంచి ఫలితాలను ఇస్తున్నదని కొందరు చెబుతున్నారు.

నా మిత్రులైన ఒక సీనియర్ హోమియో డాక్టర్ ఈ మధ్యనే ఒక విషయం చెప్పారు.ఒక రోగికి ఇలాగే ఏ మందు ఇచ్చినా పనిచేయ్యకపోతుంటే చివరికి అతని రక్తం ఒక బొట్టు తీసుకుని దానినె potentize చేసి మందుగా అతనికే ఇస్తే అప్పుడు అతనికి మందులు పనిచెయ్యడం మొదలుపెట్టి అతను మృత్యుముఖంలో నుంచి బయటపడ్డాడని చెప్పారు.

కనుక హోమియోపతిలో కూడా ఏ మందూ పనిచెయ్యని స్టేజ్ ఒకటి వస్తుంది.అది అన్నిరోగాలలో రాదు.కాని కొన్ని రోగాలలో ఈ పరిస్తితి వస్తుంది.అందుకే మనం నోసోడ్స్ డ్రగ్ పిక్చర్స్ లో చదివితే 'when the well indicated remedy fails to act or improve permanently'అనేమాట తరచుగా కనిపిస్తుంది.అలాంటప్పుడు నోసోడ్స్ వాడటం తప్పనిసరి అవుతుంది.'విషానికి విషమే విరుగుడు' అన్న మాట ఆయుర్వేదంలో కూడా ఉన్నది.

అలాంటి పరిస్థితుల్లో ఆ రోగకారక వైరస్సో బాక్టీరియానో ఏదైతే ఉంటుందో దానినె potentize చేసి అతనికి మందుగా ఇస్తేతప్ప ఆ రోగి respond కాడు.ఈ విధానాన్ని Isopathy అని డా|| హన్నేమాన్ అన్నాడు.ఇలాంటి పరిస్తితి ముఖ్యంగా autism,candida infection,hormonal imbalance మొదలైన అనేక రోగాలలో కనిపిస్తుంది.ఇవి సామాన్యమైన మందులకు లొంగవు.

కాని విచిత్రం ఏమంటే,ఇలాంటి రోగాలు కూడా ఆయుర్వేదంలో ఉన్న కొన్ని మందులకు తగ్గుతాయి.దీనిని నేను అనుభవంలో గమనించాను.అయితే దానికి కూడా ఎంతో అనుభవమూ పరిశీలనా మంచిమందులు సరైన సమయంలో వాడటమూ జరగాలి.అప్పుడే అవి తగ్గడం గమనించాను.ప్రాచీన ఆయుర్వేదం ఎంత గొప్ప సైన్సో నేను అప్పుడు అర్ధం చేసుకోగలిగాను.

హోమియో మెటీరియా మెడికాలో దాదాపు 300 మందులున్నాయి.వీటిలో 100 మందులు డా||హన్నేమాన్ ప్రవేశ పెట్టినవే.ఈ మందులలిస్టు ఇంకా ఇంకా పెరుగుతూ పోతున్నది.కొత్తకొత్త మందులు ఆవిర్భవిస్తున్నాయి. ఆయుర్వేదంలో ఉన్న కొన్ని అద్భుతమైన మందులను హోమియోపతి కూడా స్వీకరించి వాటిని proving చేసి,లక్షణాలను రాబట్టి వాటిని కూడా వాడుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి ఈ దిశగా పరిశోధనలు చేస్తున్నది.ఇంకా ఎంతో చెయ్యవలసిన అవసరమూ ఉన్నది.

ఈదిశగా కొందరు బెంగాల్ హోమియో డాక్టర్లు ఇప్పటికే పరిశోధన చేశారు.అనేక మందులను(Indian drugs)ప్రూవ్ చేశారు.కానీ ఇంకా చాలావాటిని చెయ్యవలసిన అవసరం ఉన్నది.ఇప్పటికే ప్రూవ్ చేసిన వాటిని కూడా,పైపైన prove చెయ్యడం కాకుండా,లోతుగా డా||హన్నేమాన్ చేసిన విధంగా క్షుణ్ణమైన provings చెయ్యబడాలి.అప్పుడే హోమియోపతిలో కూడా నేడు తగ్గని అనేక రోగాలు తగ్గడం మనం చూడగలం.

ప్రస్తుతానికి హోమియోపతి సర్వరోగనివారిణి కాదు.మిగిలిన ఎన్నో వైద్యవిధానాలలాగే అదికూడా రోజురోజుకూ నేర్చుకుంటూ క్రమేణా ఎదుగుతున్న సైన్స్ మాత్రమే అనేది నిజం.దానిలో కూడా పురోగతికీ రీసెర్చికీ ఎంతో అవకాశం ఉన్నది.
read more " హోమియోపతి సర్వరోగ నివారిణియా? "

29, మార్చి 2014, శనివారం

జయనామ సంవత్సరం - ఉగాది కుండలి-ఫలితములు

జయనామ  సంవత్సర ఉగాది ధనుర్లగ్నంలో 31-3-2014 న రాత్రి 00.16 కి మొదలౌతున్నది.ఉగాది కుండలి ప్రకారం మనరాష్ట్రం వరకూ ఈ క్రొత్తసంవత్సరం ఎలా ఉండబోతున్నదో పరిశీలిద్దాం.

రాష్ట్ర పరిస్థితి ప్రజలు ఊహిస్తున్నంత బాగా ఏమీ ఉండదు.అధికార మార్పిడి హింసాత్మక సంఘటనల మధ్య జరుగుతుంది.

ఎంతసేపూ కేంద్రం మీద ఆధారపడి అడుక్కోవలసిన పరిస్థితి ఉంటుంది.

ప్రజాజీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయి.రాష్ట్ర విభజన చేసుకున్నంత ఆనందంగా ఆ తర్వాత పరిస్థితులు ఉండవు.చతుర్ధంలోని అమావాస్య, ప్రజాజీవితంలో చీకటి ముసురుకుంటుందని,అంతా మొదలునుంచి ప్రారంభం కావాల్సి వస్తుందని సూచిస్తున్నది.ఏదో చేద్దామని నాయకులు ఆశించినప్పటికీ,దానికి తగిన పరిస్థితులు వారికి అందుబాటులో ఉండని కారణం చేత,వారు అనుకున్న అన్నింటినీ చెయ్యలేరు.

రాష్ట్ర ఆర్ధికపరిస్థితి గడ్డుగానే ఉంటుంది.ఆర్ధికరంగంలో అనేక చిక్కులు ఎదురౌతాయి.కాకపోతే సమయానికి ఏదో విధంగా నెట్టుకురావడం జరుగుతుంది.

ఈ సమస్యలనుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే మంచి పట్టుదల ఉన్న నాయకత్వం అవసరమౌతుంది.అటువంటి నాయకుడు ఉన్నప్పటికీ కూడా, అతను రాష్ట్రాన్ని నడపడానికి చాలా చిక్కులు ఎదుర్కోవలసి ఉంటుంది.

రాష్ట్రంలో అధికారంలో వచ్చె ప్రభుత్వం,కేంద్రప్రభుత్వంలోని మిత్రుల సహాయం వల్లనే ముందుకు పోగలుగుతుంది.కేంద్రంతో ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ఈ వ్యవహారం జరుగుతుంది.

శని నక్షత్రంలో శనిహోరలో మొదలౌతున్న ఈ సంవత్సరం రాష్ట్ర పరంగా పెద్ద గొప్ప ఫలితాలనేమీ ఇవ్వదనే చెప్పాలి.కొందరు నాయకులు ఊహిస్తున్న స్వర్ణాంధ్రను నిర్మించడం ఈ ఒక్క సంవత్సరంలో అయితే మాత్రం జరగని పని.

ఒక్క మాటలో చెప్పాలంటే నాయకులకు భోగాలు,ప్రజలకు కష్టాలతో ఈ సంవత్సరం గడుస్తుందని చెప్పవచ్చు.జయనామ సంవత్సరం నాయకులకు జయాన్ని తెచ్చిపెట్టినా, ప్రజలకు మాత్రం అపజయాన్నే మిగులుస్తుంది.

అతితెలివితో,స్వార్ధంతో ముందుచూపు లేకుండా ప్రవర్తించే ప్రజలకు ఇంతకంటే చక్కని రోజులు ఎలా వస్తాయి?సామూహిక కర్మప్రభావం దాట శక్యంకానిదన్న విషయం ఇప్పటికైనా ప్రజలు గ్రహించి వారివారి నిత్యజీవితాల్లో సక్రమంగా ఉండటం మొదలుపెడితే మంచిది.లేకుంటే ఇంకా గడ్డురోజులు ముందున్నాయి.
read more " జయనామ సంవత్సరం - ఉగాది కుండలి-ఫలితములు "

23, మార్చి 2014, ఆదివారం

మకర లగ్న(రాశి) జాతకులకు వృత్తిపరంగా ఇబ్బందులు

మకరలగ్నజాతకులకు లేదా మకరరాశి జాతకులకు వృత్తిపరంగా ఇబ్బందులు ప్రస్తుతం నడుస్తూ ఉంటాయి.నామాటలు నిజమా కాదా అని ఎవరికి వారు గమనించుకొని చూచుకోవచ్చు.

ఈ ఇబ్బందులు వారికి ఫిబ్రవరి 5 నుంచి మొదలై ఉంటాయి.వృత్తిలో విరోధాలు,సహోద్యోగులతో,పై ఉద్యోగులతో మాట పట్టింపులు,మనస్పర్ధలు మొదలైనవి మొదలై ఉంటాయి.

మార్చి 1 వ తేదీనుంచి ఇవి మరీ తీవ్రరూపం దాల్చి ఉండాలి.కొంతమంది ఉద్యోగాలు కొనసాగించలేక మానేద్దామా అని ఆలోచించడం,ఒకవేళ కొనసాగించవలసి వస్తే ప్రతిరోజూ యుద్ధమూ చికాకులతో ఉద్యోగం నడుస్తూ ఉంటుంది.ఇదే పరిస్తితి మార్చ్ 26 వరకూ కొనసాగుతుంది.ఆ తర్వాత కొంచం రిలీఫ్ వస్తుంది.

మళ్ళీ మే 21 నుంచీ ఇదే తంతు మొదలౌతుంది.అయితే అప్పుడు వచ్చె చికాకులు వేరు విధంగా ఉంటాయి.అవేమిటో అప్పుడు కొంచం ముందుగా చూద్దాం.

ఈ సమస్యలకు రెమెడీ కావలసినవారు నాకు వ్యక్తిగతంగా ఈ-మెయిల్ చేసి అడగవచ్చు.
read more " మకర లగ్న(రాశి) జాతకులకు వృత్తిపరంగా ఇబ్బందులు "

22, మార్చి 2014, శనివారం

మలేషియా విమానం-మరికొన్ని లీడ్స్

మలేషియా విమానం అదృశ్యమై 14 రోజులైంది.కాని దాని జాడ తెలియలేదు. మార్చ్ 18 న సమాచారం లభిస్తుందని ఇంతకు ముందు వ్రాశాను.కాని ఒక లీడ్ మాత్రమే ఆరోజు లభించింది.ప్రశ్నచక్రంలో బుధ రాహువుల మధ్యన దృష్టి ఆరోజున ఉన్నప్పటికీ బుధుడు లగ్నాత్ ద్వాదశంలో ఉండటం వల్ల అది రహస్యసమాచారంగానే మిగిలిపోయింది.తమ రాడార్ ఒక పాసెంజర్ ప్లేన్ ను కనుక్కుందనీ అది ప్రయాణించిన దిశా వివరాలను మలేషియా ప్రభుత్వానికి చెప్పామని థాయ్ ప్రభుత్వం చెప్పింది.

జ్యోతిష్యపరంగా అసలైన కీలకం గ్రహాలవక్రత్వంలో ఉన్నది.శనికుజులు ఇద్దరూ వక్రత్వంలో ఉండటం వల్ల రహస్యం చేదింపబడటంలేదు.ఈ కోణంలో పరిశీలిస్తే కొన్ని తేదీలు కనిపిస్తున్నాయి.

>>కుజుడు మార్చ్ 26 న రాశి మారి కన్యలోకి వస్తున్నాడు.
>>బుధుడు ఏప్రియల్ 4 న రాశిమారి మీనంలోకి అడుగుపెడుతున్నాడు.
>>కుజుడు తన వక్రత్వాన్ని మే 19 న వదులుతున్నాడు.
>>శని భగవానుడు జూలై 20 న వక్రత్వాన్ని వదులుతున్నాడు.

కనుక ఆయా తేదీలలో సమాచారం లభించవచ్చని ఆశించవచ్చు.వీటిలో మే 19,జూలై 20 మనకు చాలా దూరంగా ఉన్నాయి కనుక మార్చ్ 26 న గాని,ఏప్రియల్ 4 న గాని విమానం ఆచూకీ లభిస్తుందని ఆశిద్దాం.
read more " మలేషియా విమానం-మరికొన్ని లీడ్స్ "

20, మార్చి 2014, గురువారం

హోమియో అద్భుతాలు - 31 ఏళ్ల పార్శ్వపు తలనొప్పి(Migraine)-రెండవభాగం

క్రానిక్ డిసీజెస్ లో పేషంట్ కు కౌన్సెలింగ్ చాలా తప్పనిసరిగా ఇవ్వవలసి ఉంటుంది.హోమియో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది?ఎలా ఓపిక పట్టాలి?రోగం ఎలా తగ్గుతూ వస్తుంది?అన్న విషయాలు వివరంగా చెప్పవలసి ఉంటుంది.

'మీరు ముప్ఫై ఏళ్ళనుంచి దీనితో బాధపడుతున్నారు కదా?ఇప్పుడు హోమియోపతికి మారుతున్నారు.మీకు నొప్పి తగ్గుతుంది.కాని వ్యాధి పూర్తిగా నయం కావాలని వెంటనే ఆశించకండి.కనీసం ఒక ఏడాది పాటు నేను సూచించిన మందులను మీరు క్రమం తప్పకుండా వాడుతూ,నేను సూచించిన విధంగా పత్యం చేస్తూ ఉంటె మీకు పూర్తిగా తగ్గిపోతుంది.మరి మీరు సిద్ధమేనా?' అని అడిగాను.

'ఈ బాధ పోతుందంటే మీరు ఏమి చెప్పినా చెయ్యడానికి నేను సిద్ధం సార్' అని ఆయన అన్నాడు.

సరే.వినండి.ప్రస్తుతం మీ ఒంట్లో రెండు వ్యాదులున్నాయి.ఒకటి నేచురల్ డిసీజ్ రెండోది ఆర్టిఫిషియల్ డిసీజ్.ఒకటి మీకు సహజంగా వచ్చిన మైగ్రేన్.రెండు మీరు ఇన్నాళ్ళుగా ఇంగ్లీషు మందులు వాడటం వల్ల మీ ఒంట్లో పేరుకున్న పొల్యూషన్.మీరు వాడిన ఇంగ్లీష్ మందులు పెయిన్ సిగ్నల్స్ మీ మెదడుకు చేరకుండా అడ్డుకుంటాయి.దానితో మీకు బాధ తగ్గినట్లు అనిపిస్తుంది.కాని ఆ బాధ రావడానికి ఏదైతే మూలమో ఆ మూలం చక్కగా మీ ఒంట్లోనే తిష్ట వేసుకుని ఉంటుంది.అది రోజురోజుకూ బలాన్ని పుంజుకుంటూ ఉంటుంది.అందుకే మీరు మందుబిళ్ళ వేసుకుంటే తలనొప్పి తగ్గినా ఒంట్లో హాయిగా ఉండదు.ఏదో చికాకుగా అసహజంగా ఉంటుంది.మీకు ఇప్పుడు వస్తున్న,ఇప్పటికే వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ మందుల దుష్ప్రభావమే.

ఇప్పుడు ప్లాన్ ఆఫ్ ఏక్షన్ ఏమంటే ముందుగా మీమీద ఇన్నేళ్ళుగా ఉన్న ఇంగ్లీషు మందుల దుష్ప్రభావాన్ని అంటే ఆర్టిఫిషియల్ డిసీజ్ ని తీసివేయాలి.ఆ తర్వాత మీ ఒరిజినల్ డిసీజ్ అయిన మైగ్రేన్ పోవాలి.మీ ట్రీట్మెంట్ ఈ క్రమంలోనే జరుగుతుంది.

నేనిచ్చిన మందులు వేసుకున్న తర్వాత మీకు ఎలిమినేషన్ మొదలౌతుంది.అంటే,ఇన్నాళ్ళూ ఈ రెండు వ్యాధులవల్ల మీ ప్రాణశక్తి అణగిపోయి కుంగిపోయి ఉంటుంది.ఇప్పుడు నేనిచ్చే పొటెంటైజుడ్ మెడిసిన్ వల్ల మీ ప్రాణశక్తి బలం పుంజుకుని దానిని అణచివేస్తున్న ఈరెండు రోగాలనూ బయటకు త్రోసివేయ్యాలని ప్రయత్నిస్తుంది.దీనినే ఎలిమినేషన్ అంటాము. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ఒక్కొక్కరికి ఒక్కొక్కవిధంగా ఉంటుంది. కొందరికి విరేచనాల రూపంలో,ఇంకొందరికి వాంతుల రూపంలో,మరికొందరికి చర్మరోగంలాగా వచ్చి తగ్గిపోతుంది.అది వచ్చినపుడు భయపడి ఇదేదో కొత్త రోగం అనుకుని నాకు చెప్పకుండా మీరు ఇతర మందులు ఏవీ వాడవద్దు. దీనిని మీరు జాగ్రత్తగా గమనించాలి.'అని చెప్పాను.

ఆయన సరేనంటూ ఒప్పుకున్నాడు.

లక్షణాలను క్రోడీకరించి చూడగా గ్లోనోయిన్, శాంగ్వినేరియా, ఫాస్ఫరస్, పల్సటిల్లా ఇండికేట్ అయ్యాయి.ఫస్ట్ రెమేడీ క్రింద పల్సటిల్లా-200 తో మొదలు పెట్టమని చెప్పాను.ఆరోజు సాయంత్రం మందు వేసుకున్న ఒక గంటకు తలనొప్పి క్రమేణా తగ్గిపోయింది.మర్నాడు ఉదయం నిద్ర లేచేసరికి తలనొప్పి రాలేదు.ఆయన సంతోషంగా ఫోన్ చేశాడు.

'త్వరపడకండి.ఒక్క డోస్ కే ఇంత దీర్ఘవ్యాధి తగ్గదు.సాయంత్రానికో రేపు ఉదయానికో ప్రత్యక్షమౌతుంది.ఓపిక పట్టండి.ఒకవేళ వస్తే మాత్రం మళ్ళీ పల్సటిల్లా రిపీట్ చెయ్యండి.' అని చెప్పాను.

ఈలోపల కేస్ ను మా అమ్మాయికి వివరించాను.తనెలాగూ BHMS చదువుతున్నది.రకరకాల కేసులు చూస్తె తనకూ క్లినికల్ ఎక్స్ పీరియెన్స్ ఉంటుంది.

'పేషంట్ బొద్దుగా ఉన్నాడు.తలలో చెమటలు పడతాయి.నిద్రలో తలలో చెమటలున్నాయి.కాల్కేరియా కార్బ్ ఇండికేట్ అయింది కదా.నీవు ఎందుకు దానిని ఇవ్వలేదు?' అని మా అమ్మాయి అడిగింది.

'గుడ్.కానీ పేషంట్ చిల్లీ పేషంట్ కాడు.హాట్ పేషంట్.చలికాలంలో కూడా చన్నీళ్ళు స్నానం చేస్తాడు.కాల్కేరియా కార్బ్ అలా చెయ్యలేడు.నీవు దానిని గమనించాలి.కనుక కాల్కేరియా కార్బ్ contra-indicate అయింది.నీవు పర్టిక్యులర్స్ కంటే జెనెరల్స్ కు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి.ఎందుకంటే జెనెరల్స్ పేషంట్ ను సూచిస్తాయి.పర్టిక్యులర్స్ రోగాన్ని సూచిస్తాయి.రోగం కంటే పేషంట్ ముఖ్యం.Totality అంటే అదే.డాక్టర్ కెంట్ దానినే నొక్కి చెప్పాడు.

అదీగాక ఆ లావు సహజమైన లావు కాదు.అది మందుల సైడ్ ఎఫెక్ట్ .కనుక దానిని నీవు ఒక లక్షణంగా తీసుకోకూడదు.సహజమైన రోగలక్షణాలనూ అసహజమైన డ్రగ్ డిసీజ్ నూ నీవు విడివిడిగా చూడడం అలవాటు చేసుకోవాలి.వ్యక్తికి నీవు మందివ్వాలి.రోగానికి కాదు.వ్యక్తి అంటే వ్యక్తిలోని ప్రాణశక్తి.ప్రాణం బలాన్ని పుంజుకున్నపుడు రోగాన్ని అదే తరిమేస్తుంది. డాక్టర్ సర్ జాన్ వెయిర్ చెప్పింది అదే.

అదిసరే,ఇంగ్లీష్ వైద్యంలోని ఓవర్ డ్రగ్గింగ్ తీసేయ్యాలంటే ఏయే మందులు మొదట్లో ఇవ్వాలో చెప్పు?' అని ప్రశ్నించాను.

'నక్స్ వామికా,పల్సటిల్లా' అని జవాబు చెప్పింది.

'వెరీ గుడ్.కానీ వాటిని కూడా రొటీన్ గా ఇవ్వకూడదు.Indicated remedy మాత్రమె ఇవ్వాలి.'అన్నాను

'మరి ప్రాణం బలాన్ని పొందటానికి ఏదైనా టానిక్ లాంటిది ఇవ్వొచ్చు కదా?' అడిగింది.

'చూడమ్మా.క్లాసికల్ హోమియోపతీ లో టానిక్స్ ఉండవు.నీవు Dr Kent's Lectures on Materia Medica శ్రద్ధగా చదువు.అందులో ఆయన ఒకచోట ఇలా అంటాడు.In Homoeopathy,there is no better tonic than the indicated remedy.It will take care of everything.'అన్నాను.

అనుకున్నట్లే మర్నాడు ఉదయం 3 గంటల సమయంలో తలనొప్పి ప్రత్యక్షమైంది.దానితోనే నిద్ర మెలకువ వచ్చేసింది.కానీ నాకు ఫోన్ చెయ్యకుండా అలాగే బాధను భరిస్తూ తెల్లవారేవరకూ కూచున్నాడు.తెల్లవారే సరికి నొప్పి బాగా ఎక్కువై వాంతులు మొదలయ్యాయి.

చూచీచూచీ పదిగంటల సమయంలో నేనే ఫోన్ చేశాను.విషయం తెలిసింది. పల్సటిల్లా వేసుకున్నా ఈ సారి నొప్పి కంట్రోల్ అవలేదు.శాంగ్వినేరియా-200 వేసుకోమని చెప్పాను.అది వేసుకున్నాక కొంచం తగ్గినట్లు ఉండి మళ్ళీ వాంతులు ఎక్కువయ్యాయి. వేచిచూడమని చెప్పాను.సాయంత్రం వరకూ అలా వాంతులు అవుతూ ఉన్నాయి.వాంతులు అవుతుండే కొద్దీ చాలా తేలికగా ఉన్నదని చెప్పాడు.

సాయంత్రం అయిదు ప్రాంతంలో మెడికల్ షాపుకు వెళ్లి కొన్ని ఇతర మందులు కొనుక్కుని నేనే వాళ్ళ ఇల్లు వెతుక్కుంటూ వెళ్లాను.ఎందుకంటే మందులు తెచ్చిపెట్టడానికి తన చేతికింద ఎవరూ లేరని తెలిసింది.తను ఉండే ప్రదేశం హోమియో మెడికల్ షాప్ ఉండే సెంటర్ కు బాగా దూరం.నేను ఫోన్ లో చెప్పినా ఆ మందులు తేవడానికి ఎవరూ అందుబాటులో లేరు.సరే,ఆ అడ్రస్ సరిగా దొరకక ఒకగంట సేపు అటూఇటూ తిరిగి చివరికి పట్టుకోగలిగాను.కర్మ అడ్డు వస్తున్నదని అర్ధమైంది.

నేను వెళ్లేసరికి వాంతులు ఇంకా అవుతున్నాయి.నేను కూచున్న కొద్దిసేపటి లోనే రెండుమూడు వాంతులు అయిపోయాయి.మొదట్లో కాఫీరంగు జిగట పదార్ధం,తర్వాత బ్రౌన్ కలర్ లోకి మారి,చివరికి రంగులేని శ్లేష్మం పడుతున్నది.అప్పటికి ఒక పదిమగ్గుల శ్లేష్మం పొట్టలోనుంచి పడిపోయిందని చెప్పాడు.రుచి ఎలా ఉన్నదని అడిగాను.ఉదయాన్నే మొదట్లో చేదుగా,రానురాను పుల్లగా,ఇప్పుడు సాయంత్రానికి ఏరుచీ లేకుండా పడుతున్నదని చెప్పాడు.ఎలిమినేషన్ జరుగుతున్నదని గ్రహించాను.

ఈలోపల వాళ్ళమ్మగారు లోపలనుంచి వచ్చారు.నన్ను చూస్తూ-'ఏదైనా ఆస్పత్రికి తీసుకెళితే మంచిదేమోనండి.బాధ చూడలేకపోతున్నాను. 'అన్నారు. నేనేమీ మాట్లాడలేదు.

తను అంత బాధలోకూడా పాపం నవ్వుతూ 'సార్ డాక్టరేనమ్మా.మందులు ఆయనే తెచ్చారు.' అన్నాడు.

ఆమె నావంక కొంత అనుమానంగా చూచింది.నా వాలకం చూస్తె డాక్టర్ లక్షణాలేమీ ఆమెకు కనిపించలేదు.పైగా డాక్టర్ అంటే ఒక నర్సింగ్ హోమ్ లో ఏసీ రూమ్ లో కూచుని చెబుతున్నది వినకుండా ఏవేవో మందులు వ్రాసేసి పొమ్మని కసురుకోవాలిగాని,ఇలా ఇంటికి వెతుక్కుంటూ మోటార్ సైకిల్లో వచ్చి పక్కన కూచుని ఏవో పిచ్చి మందులిస్తుంటే ఎలా నమ్మకం కుదురుతుంది?

లోలోపల నవ్వుకున్నాను.

ఒక గంటసేపు అక్కడే కూచున్నాను.వాంతుల ఉద్ధృతం కాస్త తగ్గుతున్నట్లు కనిపించింది.అప్పుడు ఫాస్ఫరస్-200 ఇచ్చి వేసుకోమని చెప్పాను.ఆ తర్వాత కొద్దిసేపు కూచున్నాను.వికారమూ,తలనోప్పీ తగ్గుముఖం పడుతున్నాయని ఆయన చెప్పాడు.ఒక గంటలో ఫోన్ చెయ్యమని చెప్పి ఇక నేను బయలుదేరి వచ్చేశాను.

గంటలో ఫోన్ వచ్చింది.వాంతులు మళ్ళీ రాలేదు.పొద్దుననుంచీ బాధ పెడుతున్న తిప్పుడూ వికారమూ మాయమయ్యాయి.తలనొప్పి బాగా తగ్గిపోయింది.ఒక 5% మాత్రం మిగిలి ఉన్నదని చెప్పాడు.లోపలనుంచి ఏదో పెద్ద బరువు తీసేసినట్లు చాలా తేలికగా హాయిగా ఉన్నదని చెప్పాడు.వెయిట్ చెయ్యమని చెప్పాను.ఉదయం నుంచీ ఏమీ తినలేదు కనుక తేలికగా అరిగే ఆహారం ఏదన్నా తీసుకోమని చెప్పాను.

మర్నాడు అంతా తలనొప్పి లేదు.వాంతులు ఆగిపోయాయి.వికారం లేదు.

కాని ఆ మర్నాడు ఉదయం మళ్ళీ తలనొప్పి వచ్చింది.అయితే ఈసారి కుడివైపు రాకుండా ఎడమవైపు వచ్చింది.ఉదయమే మొదలైంది.క్రమేణా పెరగడం లేదు.దాని ఉద్ధృతం తగ్గిందిగాని మళ్ళీ కనిపించింది.

గ్లోనోయిన్ -200 వేసుకోమని చెప్పాను.వేసుకున్న అరగంటలో తలనొప్పి పూర్తిగా మాయమై పోయింది.ఇప్పటికి ఇది జరిగి వారం అయింది.మళ్ళీ తలనొప్పి రాలేదు.

మధ్యలో ఒకసారి మాత్రం గుంటూరు వేసవి ఎండలలో ఒక రెండు మూడు గంటలు ట్రాక్ దగ్గర ఏదో పనిని సూపర్వైజ్ చెయ్యవలసి వచ్చింది.మధ్యాహ్నం భోజనం మిస్ అయింది.అప్పుడు మళ్ళీ లైట్ గా తలనొప్పి మొదలైంది.కొద్ది సేపు వేచిచూచి తగ్గకపోతే మళ్ళీ గ్లొనోయిన్-200 రిపీట్ చెయ్యమని చెప్పాను.వేసుకున్న అరగంటలో మళ్ళీ తగ్గిపోయింది.

మనిషి లావు తగ్గినట్లుగా కనిపిస్తున్నాడు.ముఖం చాలా తేటగా ఉన్నది. చాలా తేలికగా హాయిగా ఉన్నదని చెబుతున్నాడు.

'లావు తగ్గడానికి కొన్ని ఆసనాలూ ప్రాణాయామమూ నేర్పిస్తాను అవి చెయ్యండి.కాఫీ టీ మానేయ్యండి.కొన్ని ఆహార నియమాలు చెబుతాను.అవి పాటించండి.మళ్ళీ మునుపటిలా సన్నంగా అవుతారు' అని చెప్పాను.

అలాగే అని అంగీకరించాడు.

ప్రస్తుతానికి ఏ మందులూ వాడకపోయినా వారం నుంచీ ఏ తలనొప్పీ లేదు. వాంతులు లేవు.ఆకలీ నిద్రా బాగా ఉన్నాయి.మందులు వాడకుండా నొప్పి రాకుండా గత 31 ఏళ్ళలో ఇదే ప్రధమం.హోమియోపతి ఎలా పనిచేస్తుందో ప్రాక్టికల్ గా చూచాక ఇప్పుడు వాళ్లకు నమ్మకం కలిగిందని నాకనిపిస్తున్నది.

(అయిపొయింది)
read more " హోమియో అద్భుతాలు - 31 ఏళ్ల పార్శ్వపు తలనొప్పి(Migraine)-రెండవభాగం "

కేజ్రీవాల్ Vs నరేంద్రమోడి

ఇంతకుముందు నటుడు చిరంజీవి జాతకాన్ని నేను విశ్లేషిస్తూ ఈయనకు మంచి రాజయోగాలున్నాయి.అధికారం హస్తగతం అవుతుంది అని వ్రాశాను. కాని తర్వాత ఆయన తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చెయ్యడంతో,ఎందరి నమ్మకాలనో ఆ చర్య కూలద్రోసిందని భావిస్తూ నా పోస్ట్ ను తొలగించాను.

అదేవిధంగా,కేజ్రీవాల్ జాతకాన్ని కూడా విశ్లేషించినప్పుడు ఎన్నికలలో గెలుస్తాడని అధికారం హస్తగతం అవుతుందని వ్రాశాను.ఇప్పుడు ఆయన వారణాసిలో నరేంద్ర మోడీకి ఎదురు నిలవాలని నిశ్చయించుకున్నారు.

నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం నేడు భారతప్రధాని అభ్యర్ధికి నరేంద్రమోడీని మించిన వ్యక్తి లేడు.మోడీ కాకుండా ఇంకెవరైనా  ప్రధాని అయితే అది ప్రస్తుతం దేశానికి ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది అని నా వ్యక్తిగత విశ్వాసం.

కేజ్రీవాల్ నిర్ణయానికి నిరసనగా ఆయన జాతకవిశ్లేషణ పోస్ట్ ను నా బ్లాగ్ నుంచి తొలగిస్తున్నాను.
read more " కేజ్రీవాల్ Vs నరేంద్రమోడి "

19, మార్చి 2014, బుధవారం

హోమియో అద్భుతాలు - 31 ఏళ్ల పార్శ్వపు తలనొప్పి(Migraine)

నా కొలీగ్ ఒకాయన గత 31 ఏళ్ళుగా పార్శ్వపు తలనొప్పితో బాధపడుతున్నాడు.దీనిని వాడుకభాషలో 'మైగ్రేన్' అనీ వైద్యపరిభాషలో 'హెమిక్రేనియా' అనీ 'క్రానిక్ పెర్సిస్టెంట్ హెమిక్రేనియా(CPH)' అనీ పిలుస్తారు.

ఆయన వాడని మందు లేదు.అన్నీ ఫెయిలై చివరకు ఇంగ్లీష్ మందులు వాడుతూ సమస్యతో యుద్ధం చేస్తూ ఉన్నాడు.ప్రతిరోజూ రాత్రి ఒక బిళ్ళ వేసుకోకపోతే మర్నాడు లేచేసరికి భయంకరమైన తలనొప్పితో మెలకువ వస్తుంది.ఆ నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందంటే అది భరించలేక,ఏదైనా గన్ అందుబాటులో ఉంటే దానితో కణతలోకి షూట్ చేసుకుందామా అన్నంత తీవ్రంగా ఉంటుందని అంటాడు.కొన్నేళ్లుగా అలా మందులు వాడటం వల్ల క్రమేణా ఆ మందుల సైడ్ ఎఫెక్ట్స్ శరీరం మీద కనిపిస్తున్నాయి.

లావెక్కడం,ఉన్నట్టుండి విషయాలను మర్చిపోవడం, ఆబ్సెంట్ మైండెడ్ అయిపోవడం,తన ప్రమేయం లేకుండా ఆలోచనలు ఎటో వెళ్ళిపోవడం,ప్రతి చిన్న విషయానికీ ఆదుర్దా గాభరా ఏర్పడటం మొదలైన లక్షణాలు కనిపించడం ప్రారంభం అయింది.

ఈయన నాకు పరిచయం అయ్యి కొద్ది నెలలే అయింది.మాటల సందర్భం వచ్చినపుడు దీర్ఘవ్యాదులు తగ్గించడంలో హోమియోపతి యొక్క విశిష్టతను గురించి చెబుతూ ఉండేవాడిని.

తాను హోమియోపతి కూడా వాడానని అయినా తన మైగ్రేన్ తగ్గలేదని ఆయన చెప్పాడు.

'హోమియో మందులు ఇచ్చే ప్రతివారూ వారికి డిగ్రీలున్నప్పటికీ హోమియో వైద్యులు కాలేరు.వారు చేసేది హోమియో వైద్యమూ కాదు.'Organon of Medicine' లో డాక్టర్ హన్నేమాన్ చెప్పిన సిద్ధాంతాల ప్రకారం వాటిని వాడితేనే అది సరియైన హోమియో ట్రీట్మెంట్ అవుతుంది.అప్పుడే దీర్ఘవ్యాదులు తగ్గుతాయి.లేకుంటే హోమియోపతి మందులు వాడినా అవి తగ్గవు.' అని నేను చెప్పాను.

తన మైగ్రేన్ కు హోమియోపతి ట్రీట్మెంట్ ఇవ్వమని ఆయన ఒకటి రెండుసార్లు అడిగాడు కాని దానికి సరియైన సమయం రాకపోవడంతో అది కుదరలేదు.ఈ 'సమయం రావడం' అనేది చాలా విచిత్రమైన ప్రక్రియ.

చాలామంది నన్ను ఆధ్యాత్మిక సూచనల కోసమో,లేక వారి సందేహాల నివృత్తి కోసమో వచ్చి కలుస్తుంటారు.కాని వచ్చినవారు వారు ఎందుకొచ్చారో మర్చిపోయి కూచున్న కాసేపు ఏదేదో లోకాభిరామాయణం మాట్లాడి వెళ్లిపోతుంటారు.నాలో నేను నవ్వుకొని ఊరుకుంటూ ఉంటాను.అలాగే కొంతమంది ఏళ్ళతరబడి పరిచయం ఉన్నాకూడా నానుంచి వారు కోరినది ఏమీ పొందలేరు.కొంతమంది చాలా దగ్గరగా వచ్చికూడా కనీసం నన్ను కలవలేక ఒకవేళ కలిసినా ఏమీ పొందలేక హటాత్తుగా దూరమై పోతుంటారు. దానికి కారణం వారివారి కర్మ పరిపక్వం కాకపోవడమే.మాయ అనేది రకరకాలుగా వారిని దూరంగా ఉంచుతుంది.

జీవితంలో అనుభవించవలసిన కర్మ చాలా మిగిలి ఉన్నపుడు సత్యానికి మనం దగ్గర కాలేము.ఏదేదో కారణాలు చూపించి అది దూరంగా లాక్కుపోతుంది.ఆ కారణాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా భలే విచిత్రంగా ఉంటాయి.వారివారి పొరపాట్లను గ్రహించి వారు కళ్ళు తెరిచేసరికి జీవితంలో ఏళ్ళకేళ్ళు దొర్లిపోయి ఉంటాయి.అప్పుడు చింతించి ఉపయోగం ఉండదు.

సమయం రానిదే సరియైన ఆధ్యాత్మిక గురువు దొరకడు.సమయం రానిదే సరియైన వైద్యుడూ దొరకడు.ఒకవేళ దొరికినా ఉపయోగం ఉండదు.సమయం రానిదే ఉన్నతమైన సత్యాలు అందవు.సమయం రానిదే జీవితంలో ఏదీ జరగదు.కర్మ పరిపక్వం కావడమే సమయం రావడమంటే.

అయితే మనంతట మనం కర్మపరిపక్వం చేసుకునే మార్గాలు ఉన్నాయి. ఉద్దేశ్యపూర్వకంగా వాటిని ఆచరించి కర్మను తగ్గించుకోవచ్చు.సాధన అంటే అదే.అయితే ఆ రహస్యాలు తెలియాలంటే కూడా మళ్ళీ కొంతకర్మ పరిపక్వత కావాలి.సరైన మార్గదర్శకులు పరిచయం కావాలి.వారిని అడిగి తెలుసుకుందామన్న జిజ్ఞాస మనకు కలగాలి.అందుకు అడ్డుగా ఉండే మన అహంకారం పక్కకు తప్పుకోవాలి.ఆ తర్వాత,ఆయా మార్గాలను ఆచరించే బుద్ధి మనకు పుట్టాలి.కర్మచక్రంలో సూక్ష్మంగా ఉండే ఇన్ని అడ్డంకులు తొలగిపోతేగాని ఇదంతా సాధ్యం కాదు.ఇదొక విచిత్రమైన మార్మిక వలయం.

ఒకరోజున ఏదో ప్రయాణంలో ఉన్నాము.మళ్ళీ ఆయన అదేమాట అడిగాడు.

సమయం వచ్చిందని నాకు ఇంట్యూటివ్ గా అనిపించింది.

వెంటనే అక్కడికక్కడే కేస్ టేకింగ్ మొదలుపెట్టాను.హోమియోపతి వైద్యవిధానంలో కేస్ టేకింగ్ ఎలా ఉంటుందో దానికి ఎంత సూక్ష్మపరిశీలనా ఓపికా కావాలో ఈ విశ్లేషణను చూచి అర్ధం చేసుకోవచ్చు.

కంప్లెయింట్:-కుడివైపు తలనొప్పి-గత 31 ఏళ్ల నుంచి వదలకుండా పీడిస్తున్నది.అంటే పేషంట్ కు 15 ఏళ్ల వయసునుంచీ అన్నమాట.

తల్లితండ్రుల వివరాలు:-

తండ్రి:-40 ఏళ్ల వయస్సులో జాండీస్ తో చనిపోయారు.
తల్లి:-హిస్టీరియాతో బాధపడేవారు.ప్రస్తుతం తగ్గింది.
చిన్నసోదరుడు:-BP ఉన్నది.ఈమధ్యనే హార్ట్ ఎటాక్ వచ్చి కోలుకున్నాడు. కోపమూ ఇర్రిటేషనూ ఎక్కువ.
చెల్లెలు:-ఈమెకు కూడా కోపమూ ఇర్రిటేషనూ ఎక్కువే.27 ఏళ్ల వయస్సులో చనిపోయింది.సూయిసైడ్ అని అనుమానం.

ఫేమిలీ హిస్టరీని బట్టి వీరి జీన్స్ లో నెర్వస్ టెంపరమెంట్ ఎక్కువగా ఉన్నదని తెలుస్తోంది.మైగ్రేన్ కూడా నరాలదోషంవల్ల వచ్చె బాధనే(nervous complaint).కనుక తత్వపరమైన ట్రీట్మెంట్ (constitutional treatment with a number of anti-psoric remedies)అవసరం అవుతుంది.

పేషంట్ వివరాలు:-

వయస్సు:-46 ఏళ్ళు.బొద్దుగా ఉన్నాడు.కానీ మొదట్లో ఇలా ఉండేవాడిని కాననీ సన్నంగా ఉండేవాడిననీ,మైగ్రెన్ కు వాడుతున్న ఇంగ్లీషు మందులలో కార్టిజాన్స్ ఉండటం వల్ల హటాత్తుగా రెండు మూడేళ్ళలో 47 నుంచి 96 కేజీలకు బరువు పెరిగిపోవడం జరిగిందనీ అన్నాడు.

నొప్పి ఎక్కువగా కుడికణత ప్రాంతంలో వస్తుంది.క్రమేణా ఎక్కువైపోయి అక్కడనుంచి పాకి కుడికంటిలో బోరింగ్ పెయిన్ తో లోకలైజ్ అవుతుంది.

కణత నుంచి భుజానికి కూడా పాకుతుంది.ఒక ఏభైసార్లు కుడివైపున వస్తే ఎప్పుడైనా ఒకసారి ఎడమవైపున కూడా వస్తుంది.

నొప్పి వచ్చినపుడు కాంతిని చూడటం కష్టంగా ఉంటుంది.అసలు లైట్ ను చూడలేడు.

ఒక చీకటిగదిలో దిండ్ల మధ్యన తల దాచుకుని తలకు ఒక గుడ్డ గట్టిగా చుట్టుకుని వత్తుకుంటూ పడుకుంటే కొంత ఉపశమనంలాగా ఉంటుంది కాని నొప్పి తగ్గదు.క్రమేణా బాగా ఎక్కువైపోతే వాంతులు మొదలౌతాయి.

పొట్టలో ఉన్న ఆఖరి నీటిబొట్టు కూడా వాంతి అయిపోతేగాని వాంతులు ఆగవు.వరసగా అవుతూనే ఉంటాయి.పొట్ట మొత్తం ఖాళీ అయిన తర్వాత తలనొప్పి శాంతిస్తుంది.ఇదంతా జరగడానికి దాదాపు ఒకరోజంతా పడుతుంది.

వేళకు తినకపోతే తలనొప్పి మొదలౌతుంది.

ఏదైనా రోజువారీ షెడ్యూల్ తప్పినా వస్తుంది.

రాత్రిపూట నిద్రమేలుకుంటే వచ్చేస్తుంది.

టెన్షన్ వచ్చినా మొదలౌతుంది.

నొప్పి వచ్చే సమయంలో కళ్ళు ఎర్రబడిపోతాయి.ముఖం ఉబ్బరించినట్లుగా అవుతుంది.కళ్ళవెంట ధారగా నీళ్ళు కారిపోతూ ఉంటాయి. చూచేవాళ్ళు ఏడుస్తున్నాడని అనుకుంటారు.తెలియనివాళ్ళు అడుగుతారు కూడా ఎందుకు ఏడుస్తున్నావు అని.

తలలో చెమటలు ఎక్కువగా పోస్తాయి.నిద్రలో కూడా తలలో చెమటలు ఉంటాయి.తలనొప్పి వచ్చే సమయంలో తలా,మెడా,ఛాతీల మీద చెమటలు పోస్తాయి.

రాత్రంతా నిద్రపోయి లేచినా ఉదయానికి ఫ్రెష్ గా ఉండదు.

ఉద్రేక-ఉపశమనములు (aggravation & amelioration)

>వాంతుల వల్ల పొట్ట పూర్తిగా ఖాళీ అవడం,గట్టి వత్తిడి,
<మలబద్దకం,జాగారం,టెన్షన్,పగటిపూట,కాంతి,శబ్దం,గాఢమైన వాసనలు,రొటీన్ మార్పు.

కోరికలు(Desires)

తిండి:--ఉప్పంటే ఇష్టం,స్వీట్లు కూడా ఇష్టమే(ఇప్పుడు మాత్రమె, మొదటినుంచీ లేదు),కాఫీ లాంటివి వేడిగా త్రాగితే బాగుంటుంది.ఆహారం తినేటప్పుడు చాలా గబగబా తినడం జరుగుతుంది.

వాతావరణం:--చల్లనిగాలి కావాలి.కానీ బాగా చలిగాలి అయితే తలనొప్పి వస్తుంది.చలికాలంలో కూడా చన్నీళ్ళు స్నానం చేస్తాడు.ఏమీ కాదు(hot constitution)

అలవాట్లు:--దురలవాట్లు ఏమీ లేవు.శుభ్రత ఎక్కువ.బ్రష్ కూడా మూడు లేదా నాలుగుసార్లు చేస్తాడు.స్నానం కూడా వీలైతే రోజుకు మూడు లేదా నాలుగుసార్లు చేస్తాడు(syphilitic miasm)

అసహ్యాలు(Aversions)

తిండి:--కారం ఇష్టం ఉండదు.మసాలా పదార్ధాలు పడవు(తింటే వాంతి అవుతుంది)

మానసికం:--గదిలో వస్తువులు చెల్లాచెదురుగా ఉంటె నచ్చదు.వెంటనే ఎక్కడి వస్తువును అక్కడ సర్దడం జరుగుతుంది.(Fastidious nature)

మానసిక లక్షణాలు(Mental symptoms):--

ఇంతకు ముందు బాగా కోపమూ ఇరిటేషనూ ఉండేవి.రైల్వేలో చేరక ముందు టీచర్ గా ఒక స్కూల్లో పని చేస్తున్నప్పుడు వాటిని బాగా కంట్రోల్ చేసుకోవడం అలవాటయ్యింది.అప్పటినుంచే తలనొప్పి కూడా ఎక్కువయ్యింది.

చాలా నిజాయితీపరుడు.ఆత్మాభిమానం ఎక్కువ.బాధ్యతగా ప్రవర్తిస్తాడు.చాలా పద్దతిగా ఉండే వ్యక్తి.

ఇంతకు ముందు వాడిన మందులు:--


ఇంగ్లీషు మందులు:--Migranil & Flonarine.ఫ్లోనరిన్ వాడిన తర్వాత బాగా లావెక్కడం జరిగింది.ఇందులో స్టేరాయిడ్ ఉన్నది.

హోమియోపతి:--ఒక హోమియో డాక్టర్ ఇచ్చిన బెల్లడోనా -30 మందు రోజుకు నాలుగు సార్లు వాడడం జరిగింది.తలనొప్పి తగ్గకపోగా భయంకరంగా ఎక్కువైంది.కనుక మళ్ళీ అదే డాక్టర్ దానిని యాంటీ డోట్ చెయ్యడం జరిగింది.ఆ తర్వాత హోమియో జోలికి పోలేదు.

పై లక్షణాలను సేకరించిన తర్వాత, ఎలా వీటిని ఎనలైజ్ చేసాను?ఏ మందులు ఇచ్చాను?ఆ తలనొప్పి ఎలా కంట్రోల్ అయింది? అన్న వివరాలు వచ్చే పోస్ట్ లో చదవండి.

(ఇంకా ఉంది)
read more " హోమియో అద్భుతాలు - 31 ఏళ్ల పార్శ్వపు తలనొప్పి(Migraine) "

16, మార్చి 2014, ఆదివారం

తారాస్తోత్రానికి చేర్చిన క్రొత్త పద్యములు

తారాస్తోత్రం(శ్రీవిద్య 51 భాగం)లోని అన్ని శ్లోకాలకూ తొమ్మిది తొమ్మిది చొప్పున తెలుగు పద్యములు పూర్తికాలేదు.కొన్ని బాకీ ఉండిపోయినవి. కనుక ఆయా శ్లోకముల దిగువన ఈ తెలుగు పద్యములు క్రొత్తగా ప్రస్తుతం చేర్చబడినాయి.ఈ క్రొత్త పద్యములతో శ్రీవిద్య 51 భాగం పరిపూర్ణత్వాన్ని సంతరించుకున్నది.

మత్తేభము||
భృకుటీ మూలపు దాపటన్ మధురముల్ భృంగేశ నాదంబులన్
నికరంబౌ ఘనయోగ భూమికల నానందంబుగా దేలుచున్
సుఖకాసారపు లోతులన్ మునిగి యాసాంతంబు రంజిల్లుచున్
అకలంకాత్ములు సంచరింతురిలలో ఆరూఢచిద్రూపులై

త్రివేణీసంగమస్థానమైన భ్రుకుటీమూలమున లయించిన చిత్తముకలవారలై తుమ్మెదఝుంకారము వంటి ఓంకారప్రణవనాదమును వినుచూ సుఖసముద్రపు లోతులలో నఖశిఖపర్యంతము ఆనందఝరిలో మునిగి నీ భక్తులైన శుద్దాత్ములు నీదైన చిద్రూపమును పొందినవారై ఈ భువిలో సంచరిస్తున్నారు కదా.

కం||తెలియని తనమున జేసిన
కలుషపు కార్యంబులెల్ల కరచెడి వేళన్
పలుచన యయ్యెడి వేళల
కలవరముల బాపి గాచు కామేశ్వరివే

అమ్మా.తెలియనితనంతో నేను పూర్వం చేసిన చెడుపనులు పక్వమునకు వచ్చి పాములై నన్ను కరుస్తున్న వేళలో,కాలం ఎదురు తిరిగి లోకంలో నేను హీనుడనైనవేళలో,నా కలవరమును మానసిక కల్లోలమును పోగొట్టి నన్ను రక్షిస్తున్న మహాకామేశ్వరివి నీవేకదా.

కం||తెంపరితనమున కర్మల
నింపున నేజేసి మగుడనీటుల బడుచున్
కంపంబున వేడ;సకల
తాపంబుల బాపజేయు తారిణి వీవే

మూర్ఖుడనై కుకర్మలను ఆనందముగా చేసి తదుపరి కర్మపరిపాకమున బాధలలో చిక్కుకొని అసహాయుడనై భయముతో నిన్ను వేడిన రోజులలో దయామయివై నా సమస్త తాపములనూ అంతమొనర్చిన భవతారిణివి నీవే కదా.

కం||అమ్మా యని నోరారగ
నెమ్మనమున బిల్చినంత నగవుల గనుచున్
సమ్మతమున దరిజేరుచు
నిమ్మహిలో సుతులకిడుదు విష్టఫలంబుల్

ఎవరైనా సరే మనసారా 'అమ్మా' అని నిన్ను ఆర్తితో పిలిచినంతనే వారివైపు చిరునవ్వుతో చూచి,ప్రేమగా వారి చెంతకు చేరి,వారివారికి కావలసిన ఫలములను ఇప్పుడే ప్రసాదిస్తున్నావు కదా.

కం||అనలాత్మక దేహంబున
వినిహితమౌ మార్గమందు విశృంఖలవై
కనివిని ఎరుగని రీతుల
అనవరతము సంచరించు అద్భుతవీవే

సాధకుని సూక్ష్మశరీరము తపోబలంవల్ల అగ్నిమయంగా ఉంటుంది. దాని యందున్న తేజోమయ నాడీమార్గంలో నీఇష్టం వచ్చినట్లుగా సంచరిస్తూ ఆతనిలోని కల్మషములను ప్రక్షాళనగావిస్తూ నిత్యమూ ప్రకాశించే అద్భుతరూపిణివైన కుండలినివి నీవేకదా.

కం||వ్యూహంబుల ఛేదింపుచు
సాహసమున సత్యమార్గ సమయాంతరివై
అహమహమను భావమణచి
సహజాత్మక బోధనొసగు సురపాలినివే 

అమ్మా.గ్రంధిత్రయమనబడే అంతర్వ్యూహమును  నీవు సులభముగా ఛేదించగలవు.అతిసాహసివై సత్యమార్గమైన సుషుమ్నాపధమున సంచరించుచూ అహమహమనే నిరంతర భ్రాంతిని వదిలించి సహజాత్మ బోధను కలిగించగల దేవతారాధ్యవు నీవే కదా.

కం||రక్కసి మూకల నెంతయు
అక్కజమొప్పార గూల్చి అభయం బిడుచున్
మిక్కిలి కూరిమి మీరగ
చక్కగ మమ్మెపుడు గాచు చండికవీవే

నాలోని దుష్టగుణములనబడే రాక్షసిమూకలను ఆశ్చర్యమొప్పగా కూల్చి, మిక్కిలి ప్రేమతో ఎల్లప్పుడూ నన్ను రక్షించి అభయాన్ని ప్రసాదిస్తున్న చండికవు నీవే కదా.

కం||అరిషడ్వర్గములనబడు
సురవైరీగణము నెల్ల చూర్ణము జేయన్
పరతత్త్వము నందించగ
సరియెవ్వరు నీకు నిత్య సంసిద్ధతలో

ప్రతిమానవునీ ఆవేశించి యున్న షడ్వర్గములే రాక్షసగణము.ఈ రాక్షసగణము నశించనంతవరకూ మనిషికి పరతత్వము లభించదు.ఈ రాక్షసగణమును అంతమొనర్చి పరమార్ధమును అందించుటలో నీవు నిత్యసంసిద్ధవు.నీకు సాటి వేరెవ్వరూ లేరు.

కం||నీవే మాయవు మగుడన్
నీవే మాయాతిరిక్త నిత్యేశ్వరివై
నీవే కని,పెంచి,తుదకు
నీవే సమయింతువిచట నిఖిలాండములన్    

అమ్మా.నీవే మాయవు.మరలా నీవే మాయాతీతవగు నిత్యసత్యమువు.ఈ సమస్త లోకములనూ చరాచరాది సమస్తజాలమునూ నీవే కని పెంచి తుదకు సంహరిస్తున్నావు. ఈ సమస్తమూ నీ లీల తప్ప వేరేదీ కాదు.
read more " తారాస్తోత్రానికి చేర్చిన క్రొత్త పద్యములు "

మలేషియా విమానం ఏమైంది?

పిబ్రవరి మార్చ్ నెలల జాతకాలు వేసినప్పుడు వాహన ప్రమాదాల గురించి యాక్సిడెంట్ల గురించీ, జననష్టం గురించీ ప్రస్తావించాను. అవి ఊహించినట్లే జరుగుతూ ఉండటం గమనించవచ్చు. జరుగుతున్న సంఘటనలను కనెక్ట్ చేసుకుని చూస్తే విషయాలు అర్ధమౌతాయి.

పోయిన శనివారం నాడు అదృశ్యమైన మలేషియా విమానం ఏమైందో ప్రశ్న ద్వారా చూద్దాం.అది ఆరోజున (అంటే మార్చ్ 8 న) 1.22 గంటలకు చివరిసారిగా ఫ్లైట్ కంట్రోల్ కు అందుబాటులో ఉన్నది.తర్వాత ఏమైందో తెలియదు.

దీనిగురించి చెప్పమని పంచవటి సభ్యుడు ఒకాయన పంపిన మెయిల్ ఈరోజు చూచాను.ఈరోజు ఉదయం 7.34 కి ప్రశ్న చక్రం వేసి పరిశీలించడం జరిగింది.దీనిని కొంత విశ్లేషణ చేద్దాం.

మీనలగ్నం సూర్యసహితమై ఉదయిస్తున్నది.జలతత్వ లగ్నం గనుక విమానం నీటిలో ఉన్నట్లు తెలుస్తున్నది.సూర్యుడు షష్టాదిపతి గనుక శత్రువుల కుట్రవల్ల ఈ ప్రమాదం సంభవించిందని సూచన ఉన్నది.

లగ్నంలో ఉన్న యురేనస్ లగ్నాధిపతి అయిన గురువుతో ఖచ్చితమైన కేంద్రదృష్టిలో ఉండటం వల్ల,అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా విమానం దారితప్పి కూలిపోయిందని తెలుస్తున్నది.అష్టమాదిపతి అయిన శుక్రునితో యురేనస్ అర్ధకోణదృష్టి గమనార్హం.ఇదికూడా ఇదే ఫలితాన్ని సూచిస్తున్నది.

లగ్నాధిపతి గురువు చతుర్దంలో ఉండటంవల్ల విమానం పాతాళంలో(అంటే నీటి అడుగున) ఉన్నదని తెలుస్తున్నది.చతుర్దానికి పాతాళం అని జ్యోతిష్య శాస్త్రంలో పేరున్నది.

అష్టమంలోని మూడు గ్రహాల(శని,రాహు,కుజ)కూటమి వల్ల ఘోరప్రమాదం జరిగిందని సర్వనాశనం అయిందని తెలుస్తున్నది.రాహువు,శని,కుజుడూ కలసినప్పుడు ఘోరమైన ప్రమాదాలు జరుగుతాయని ఎంతోముందే హెచ్చరించాను.ఈ విషయం నేనేకాదు ప్రపంచం మొత్తంమీద ఎందఱో జ్యోతిష్కులు గమనించి ముందే హెచ్చరించారు.ఈ గ్రహకూటమి ఫలితంగా ప్రతిరోజూ ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉండటం నేడు మనం కళ్ళారా చూస్తున్నాం.దానిలో ఒకటే ఈవిమాన ప్రమాదం కూడా.

అయితే ఈ విమానం ప్రస్తుతం ఎక్కడున్నది అనేదే అసలైన ప్రశ్న.

ఈ చక్రంవరకూ మిధునం ఉత్తరదిక్కును సూచిస్తున్నది.అలాగే పాపగ్రహ కూటమి ఉన్న తులారాశి కూడా ఉత్తరదిక్కును సూచిస్తున్నది.లగ్నాధిపతి గురువు ఈశాన్యదిక్కుకు అధిపతి.పై గ్రహసూచనలను బట్టి ఈ విమానం ప్రస్తుతం మనకు ఉత్తరఈశాన్యంలో సముద్రంలో పడిఉన్నదని నేను ఊహిస్తున్నాను.మనకు ఉత్తరఈశాన్యం అంటే కాంబోడియా, థాయిలాండ్, బర్మా,ఇండియాల మధ్యన ఉన్న సముద్రప్రాంతం.

విమాన సమాచారం లోకానికి ఎప్పుడు లభిస్తుంది?

ఈరోజు ప్రశ్నసమయానికి శుక్రనక్షత్రమూ శుక్రహోరా జరుగుతున్నాయి. శుక్రుడు ప్రశ్నలగ్నానికి లాభస్తానంలో ఉన్నాడు.కనుక సమాచారం లభిస్తుంది.

సమాచార వ్యవస్థకు కారకుడైన బుధుడు ఎల్లుండి అనగా మార్చ్ 18 న రాహువుతో ఖచ్చితమైన డిగ్రీ కోణదృష్టిలోకి వస్తాడు.కనుక విమానం ఎక్కడుందో అప్పుడు లోకానికి తెలుస్తుంది.
read more " మలేషియా విమానం ఏమైంది? "

15, మార్చి 2014, శనివారం

జనసేన పార్టీ జాతకచక్రం ఏమంటున్నది?



నిన్న 14-3-2014 రాత్రి 19-16 నిముషాలకు హైదరాబాద్ లో సినీనటుడు పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని ప్రకటించాడు. సందర్భంగా పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒకసారి పరికిద్దాం.

ముహూర్తాలు నిర్ణయించి అన్నీ మనమే నిర్దారించగలం అని చాలామంది అనుకుంటారు.ఇది తప్పు.భవిష్యత్తును మనం చేతిలోకి తీసుకోవడం సాధ్యం కాదు.మన ఇష్టం వచ్చినట్లుగా మన భవిష్యత్తును మార్చుకోవడం కర్మాతీతులైన మహర్షులకూ మహాయోగులకే సాధ్యమౌతుంది గాని మామూలు మనుషులకు సాధ్యం కాదు.మనుష్యులు ఎంతటివారైనా కర్మబద్దులే.

నిర్ణయింపబడిన ముహూర్తాన్ని కూడా పూర్వకర్మ తెలివిగా అతిక్రమిస్తుంది. రహస్యాలు ఏమిటో మామూలుగా ముహూర్తాలు పెట్టే సామాన్య జ్యోతిష్కులకూ పురోహితులకూ తెలియవు.అంతరిక యోగసాధనలో ఉన్నతస్తరాలు అందుకున్న వారికే విషయాలు అర్ధమౌతాయి.

ప్రస్తుతానికి వస్తే,లగ్నం ద్విస్వభావమైన కన్య అయింది.కనుక పార్టీ పరిస్తితి ఎప్పుడూ ఊగిసలాటగానే ఉంటుంది.గట్టి స్థిరత్వం ఉండకపోవచ్చు. లాభాదిపతి అయిన పూర్ణచంద్రుడు లగ్నానికి సపోర్ట్ గా ఉన్నప్పటికీ రెండింట ఉన్న పాపగ్రహ కూటమి వల్ల ఒక విషయం స్పష్టంగా కనిపిస్తున్నది.పవన్ కు ప్రజాభిమానం దండిగా ఉన్నప్పటికీ ఆయన్ను ముందుకు పోనివ్వకుండా ఆపేశక్తులు కూడా బలంగానే ఉంటాయన్న విషయం సుస్పష్టంగా కనిపిస్తున్నది.

మఖా నక్షత్రం నడుస్తున్నరోజున ఈ పార్టీ ప్రారంభం అయింది.కేతువు అష్టమంలో ఉన్నాడు.ఇది అంత మంచి శకునం కాదు.తన సిద్ధాంత ఔన్నత్యాలను అందుకోవడానికి ఈపార్టీ చాలా కష్టనష్టాలను చవిచూడవలసి ఉంటుంది.అంతేగాక ఈ పార్టీ ప్రారంభించడానికి ముందు పవన్ ఎంతో మానసిక సంఘర్షణను అనుభవించాడని కూడా ఈ యోగం సూచిస్తున్నది.

కుజహోరలో ఈ పార్టీ మొదలైంది.కుజుడు జ్ఞాతికారకుడుగా కుటుంబ స్థానంలో వక్రించి ఉన్నాడు.కనుక ఈ చర్యవల్ల పవన్ కు సొంత కుటుంబంలోనే వ్యతిరేకతా,శత్రుత్వమూ ఎదురయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి.

రెండింట ఉన్న శని రాహు కుజులవల్ల ఇతరపార్టీల సిద్ధాంతాలనూ ఆచరణలనూ తూర్పారబట్టే విధానం పార్టీలో కనిపిస్తుంది.పవన్ ఉపన్యాసంలోనే ధోరణి స్పష్టంగా కనిపించింది.ఇది వాక్స్తానంలో ఉన్న మూడుగ్రహాల ప్రభావమే.సిద్ధాంతాల పట్ల నిబద్ద్తతను శని ఇస్తే,ఎదుటివారి దాడిని తిప్పికొట్టడంలో రాహువూ కుజుడూ ప్రముఖపాత్ర పోషిస్తారు.

పంచమంలోని ధర్మస్థానాధిపతి శుక్రుడు పార్టీకి మంచి ఆలోచనలనూ నైతికతనూ ఆపాదిస్తాడు.ఉన్నతమైన సిద్ధాంతాలతో పార్టీ ప్రారంభించ బడుతుంది.ఈరోజు శుక్రవారం కావడం వెనుకగల ప్రభావమూ, పవన్ ఉపన్యాసం కుల మత ప్రాంతీయ తత్వాలకు అతీతంగా సాగడంలోని గ్రహప్రభావమూ ఇదే.

ఇకపోతే,లగ్నాధిపతి బుధుడు ద్వాదశాదిపతి అయిన సూర్యునితో కలసి ఆరవ ఇంటిలో ఉండటం వల్ల తన సూటి విమర్శలతో ఇతర పార్టీల రహస్య శత్రుత్వాన్ని కొనితెచ్చుకుంటాడని సూచిస్తున్నది.నిన్న ఆయన వేదికమీదనుంచి చేసిన విమర్శలు ఎవరికైనా మింగుడు పడటం కష్టమే.కానీ అవన్నీ నిజాలే గనుక ఎవరూ ఏమీ జవాబు చెప్పలేని పరిస్త్తితి ఉన్నది. కుజబుధుల మధ్యన గల ఖచ్చితమైన కోణదృష్టి కూడా దీనినే సూచిస్తున్నది.చంద్ర రాహువుల మధ్య ఉన్న అర్ధకోణ దృష్టివల్ల రకరకాలైన భావాలతో పార్టీ ఊగిసలాడుతుందని సూచన ఉన్నది.

ఎనిమిదింట కేతువు వల్ల లోతైన ఆధ్యాత్మికచింతన కలుగుతుంది.కేతువు ఇక్కడ కుజుడిని సూచిస్తున్నాడు.కుజుడు సోదరకారకుడు గనుక సోదరులతో శత్రుత్వమూ విభేదాలూ రావడం ఖాయం.పార్టీ కూడా అనూహ్యమైన అకస్మాత్తు నష్టాలను చవిచూడవలసి వస్తుంది.

పదింట గురువూ ద్వాదశంలో చంద్రుడూ జాతకానికి ముఖ్యమైన గ్రహాలు. దశమ గురువువల్ల సైద్ధాంతిక పరంగా మంచి ధార్మికత ఉంటుంది. కులమతప్రాంతీయభేదాలను అధిగమించి మానవత్వపరంగా ప్రజలకు మేలు చెయ్యాలన్న కోరిక పార్టీ నేతలకు ఉంటుంది.అయితే ఇది ఎంతవరకు ఆచరణలో సాధ్యపడుతుంది అన్నది ప్రశ్నార్ధకమే. ఎందుకంటే, గురువు లగ్నానికి కేంద్రాదిపత్య దోషి.కనుక సొంత గూటిలోనే కొంత అసంతృప్తిని కలిగిస్తాడు.అలాగే శత్రువుల కుట్రలవల్ల పార్టీ అనుకున్నవి అనుకున్నట్లుగా చెయ్యలేకపోవచ్చు.కనీసం అలా చెయ్యాలన్న ప్రయత్నంలో చాలా చిక్కులూ అవరోధాలూ అధికారులవద్ద నుంచీ నాయకుల వద్దనుంచీ వీరు ఎదుర్కోవలసి వస్తుంది.

లాభాదిపతి ద్వాదశంలో స్థితివల్ల పార్టీ ఆర్ధికంగా బాగా సంపాదించుకునేది ఏమీ ఉండదని అనిపిస్త్తున్నది.'నేను సంపాదించడానికి రాజకీయాలలోకి రావడం లేదు'- అన్న పవన్ మాటల వెనుక ఉన్న నిజాయితీని గ్రహయోగం సూచిస్తున్నది.

ఇదే యోగంవల్ల తన అన్నలతో ఈయనకు రహస్య శత్రుత్వం వస్తుందన్న సూచనా ఉన్నది.పైకి ఏమీ లేదని చెప్పినా లోలోపల ఈ చర్య వారిమధ్యన విభేదాలకు తప్పక దారితీస్తుందని వ్యయంలోని లాభాదిపతి సూచిస్తున్నాడు.

ద్వితీయంమీదా షష్ఠంమీదా ఉన్న గురుదృష్టి వల్ల తొందరపడి కామెంట్స్ చెయ్యడంవల్ల వచ్చె అనర్దాలనుండీ శత్రుత్వాలనుండీ గురువు కాపాడతాడని సూచన ఉన్నది.

చతుర్ధంమీద ఉన్న వక్రోచ్చశనిదృష్టివల్ల,పవన్ యొక్క ఆధ్యాత్మికచింతనా, విశాలభావాలూ క్రమేణా తన పార్టీలోని వారికే మింగుడుపడకపోవచ్చన్న సూచన ఉన్నది.అదే చతుర్ధం మీద ఉన్న గురుదృష్టి వల్ల పార్టీలో వచ్చె కల్లోలాలు మళ్ళీ శాంతిస్తాయన్న సూచనా ఉన్నది.

శుభార్గళం పట్టిన ఆరూఢలగ్నంవల్ల--ప్రాధమికంగా పార్టీ చాలా ఉన్నతమైన మంచి ఉద్దేశ్యాలతో మొదలైనా కూడా ఆచరణలో తాను అనుకున్న విలువలతో కూడిన రాజకీయాలను సాకారం చేసుకోవడం అంత సాధ్యం కాదేమో అన్న సంశయం దశమంలో ఉన్న కేతువు వల్ల కలుగుతున్నది.

చతుర్దంలో ఉన్న పాపగ్రహకూటమి వల్ల క్రమేణా సొంతపార్టీలోనే పవన్ భావాలను పూర్తిగా అర్ధం చేసుకోలేనివారు తయారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.నిన్న ఆయన సమావేశానికి వచ్చిన వారందరూ ఆయనంత పరిపక్వమైన ఆలోచనా,దార్శనిక స్పష్టతా,సిద్ధాంతఔన్నత్యమూ ఉన్నవారేనా లేక ఉత్త సినీ అభిమానులా అన్నది ఆలోచించదగిన విషయమే.

పాకలగ్నమైన కుంభం నుంచి రాహువు నవమంలో ఉండటం వల్ల,ఈ జాతకానికి అష్టోత్తరీ దశ ఉపయోగిస్తుంది.ఆ దశాప్రకారం పార్టీ ప్రారంభ సమయానికి చంద్ర/బుధ/శుక్రదశ నడుస్తున్నది.జ్యేష్టసోదరులతో విభేదాలూ (చంద్రబుధుల సమసప్తకం),ఉన్నత ఆశయాలతో(నవమాధిపతి పంచమ స్థితి) ఈ పార్టీ మొదలైందని స్పష్టంగా కన్పిస్తున్నది.

వింశోత్తరీ దశాప్రకారం కేతు/రాహు/శని దశలో ఈపార్టీ మొదలైంది. అష్టమంలోని కేతువు వల్ల మానసిక సంఘర్షణా,ద్వితీయంలో ఇంకా రెండు గ్రహాలతో కలసి ఉన్న రాహువువల్ల కుటుంబానికి ఇష్టంలేకపోయినా పార్టీని ప్రారంభించడమూ,ఉచ్ఛ వక్రశనివల్ల ప్రజలకు బాధ్యతగా ఏదోమేలు చెయ్యాలన్న సత్సంకల్పమూ కనిపిస్తున్నాయి.  

చాలా పార్టీలు ఉన్నత సిద్ధాంతాల తోనే మొదలౌతాయి.క్రమేణా ఆచరణలో ఘోరంగా దిగజారిపోతాయి.తద్వారా ప్రజలు నిరాశకు గురికావడమూ జరుగుతూనే ఉంటుంది.ఇలా ఇప్పటికి ఎన్నో సార్లు జరిగింది. మధ్యనే ఉన్నతమైన ఆశయాలతో వచ్చిన ఆమాద్మీ పార్టీ చేస్తున్న పిల్లచేష్టలతో పార్టీ క్రమేణా ఎంతగా విశ్వసనీయతను కోల్పోతున్నదో గమనిస్తే నేను చెబుతున్నది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అని అర్ధం అవుతుంది.

పవన్ మాటల్లోని నిజాయితీ నాకు నచ్చింది.అతని విశాలమైన ప్రాక్టికల్ గా ఉన్న భావాలూ నాకు నచ్చాయి.అతను ఏదీ దాచుకోకుండా ఓపెన్ గా మాట్లాడే విధానమూ నాకునచ్చింది.కులానికీ మతానికీ ఇతర అల్పమైన విషయాలకూ అతీతంగా అతను ఆలోచించే విధానం అన్నింటికంటే నాకు బాగా నచ్చింది.

అయితే వ్యక్తిగత భావాలు వేరు.ఒక పార్టీని నడిపించడం వేరు.పార్టీ అంటే ఎన్నెన్నో భావాలూ విభేదాలూ ఉన్న అనేకమంది వ్యక్తుల సమూహం. మొదట్లో ఉత్సాహంతో అందరూ చేరతారు.క్రమేణా స్వార్ధాలూ,కుట్రలూ మొదలౌతాయి.చీలికలు మొదలౌతాయి. క్రమంలో కొన్ని సిద్ధాంతాలను త్యాగం చెయ్యవలసి వస్తుంది.అప్పటినుంచి పతనం ప్రారంభం అవుతుంది. చివరకు అదికూడా అన్ని పార్టీల్లాగే తయారౌతుంది.ఇది ప్రతి పార్టీలోనూ జరిగే తంతే.

అటువంటి పతనం సంభవించకుండా,పార్టీనీ కేడర్ నూ నడుపుతూ,తాను నిన్నచెప్పిన సిద్దాంతాలలో రాజీపడకుండా నిజంగా ప్రజల సంక్షేమంకోసం కుల మత ప్రాంత వర్గవిభేదాలకు అతీతంగా పవన్ కృషి చెయ్యగలిగితే అంతకంటే సంతోషం ఇంకేదీ ఉండదు.ప్రస్తుతం మన రెండు రాష్ట్రాలకూ కావలసింది ఇలాంటి భావాలే.

కానీ అది సాధ్యమేనా?ప్రస్తుత కుళ్ళుసమాజం పనిని సజావుగా చెయ్యనిస్తుందా?

తరతరాలుగా వేళ్ళూనుకొని ఉన్న స్వార్ధపరశక్తులు అటువంటి మార్పును స్వాగతిస్తాయా?ముఖ్యంగా భావావేశాలకు తేలికగా పడిపోయే మన ప్రజలు అటువంటి ఉన్నతమైన మార్పును ఒప్పుకుంటారా?

ఏమో? కాలమే సమాధానం చెప్పాలి.
read more " జనసేన పార్టీ జాతకచక్రం ఏమంటున్నది? "