“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

9, మార్చి 2014, ఆదివారం

మార్చ్ 2014-దేశఫలితాలు

14-3-2014 రాత్రి 11-24 కి హైదరాబాద్ లో సూర్యునికి మీనసంక్రమణం జరుగుతుంది. అప్పటి నుంచి ఏప్రియల్ 14 వరకూ మన రాష్ట్రజాతకం ఎలా ఉందో చూద్దాం.

ఈ నెలకు కుట్రల కుతంత్రాల మాసం అని పేరు పెట్టుకోవచ్చు.

రాజకీయంగా చూస్తే,ఎవరికి వారు వారివారి స్వలాభాలు స్వార్ధాలకు రాష్ట్రప్రయోజనాలను తాకట్టు పెడతారు.

పార్టీల మార్పులు చేర్పులు జోరుగా జరుగుతాయి.రాజకీయ సమీకరణాలు జోరుగా మారిపోతాయి.

అధికారం చేజిక్కించుకోవడమే పరమావధిగా అందరూ ప్రవర్తిస్తారు.అందరూ స్వార్ధంతోనూ హిపోక్రసీతోనూ ఆలోచిస్తారు గాని రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎవరికీ పట్టదు.

పరిస్తితి చాలా ఫ్లూయిడ్ గా ఉంటుంది.ఎవరికీ స్థిరమైన అభిప్రాయాలూ నమ్మకాలూ ఉండవు.రాబోయే ఎన్నికలలో ఎలాగైనా గెలవాలి అన్నది ఒక్కటే వారి ఆలోచనగా ఉంటుంది.దానికోసం ఎవరితోనైనా కలుస్తారు లేదా విడిపోతారు.సిద్ధాంతాల రాద్ధాంతాలను ఎవరూ పెద్దగా పట్టించుకోరు.

రహస్య సమాలోచనలూ మంత్రాంగాలూ పొత్తులూ జోరుగా జరుగుతాయి. ఎవరెవరి ప్లానులూ ఎవరెవరి సమీకరణాలూ వారివిగా పరిస్తితి ఉంటుంది.

ప్రతివారికీ ఒకటే చింత వేధిస్తుంది.రాబోయే ఎన్నికలలో మనకు ఓట్లు పడతాయా లేదా?ప్రజలు మనల్ని ఆదరిస్తారా లేదా?అన్న భయం ప్రతివారినీ వెంటాడుతుంది.దానికి అనుగుణంగా పావులు కదుపుతారు. మనసులో మాట ఎవరూ బయటపెట్టరు.అందరూ గుంభనంగా ఉంటారు. లోపలొకటి బయటకొకటి చెబుతూ ఉంటారు.

నీతి అన్న పదానికి అర్ధమే ఉండదు.వ్యక్తిగతప్రయోజనం,స్వార్ధం ఇవి రెండే రాజ్యం ఏలతాయి.తెలివిగా మాట్లాడటమే నీతి అన్న కొత్త నిర్వచనం పుట్టుకొస్తుంది.

ఎవరైనా విలువలతో కూడిన రాజకీయాల గురించి మాట్లాడితే వాడిని వాజమ్మ కింద జమకడతారు.

నల్లధనం విపరీతంగా చేతులు మారుతుంది.చీకటి లావాదేవీలు ఘోరంగా జరుగుతాయి.పైకి మాత్రం అందరూ నీతులు చెబుతూ ఉంటారు.

కుట్రలమాసంలో ఏయే వింతలు ఎదురౌతాయో,ఎవరెవరు కలుస్తారో, ఎవరెవరు విడిపోతారో ముందుముందు చూద్దాం.

మార్చిలో ముఖ్యమైన రోజులు

మార్చ్ 16 నుంచి 20 వరకు:--ప్రజాజీవితం లోనూ వ్యక్తిగత జీవితాలలోనూ చికాకులు గొడవలు నష్టాలు ఆందోళనలు ఉంటాయి.

మార్చ్ 24,25 లలో గొడవలు,యాక్సిడెంట్లు ఉంటాయి.

మార్చ్ 30 నుంచి ఏప్రియల్ 2 వరకు:--వృత్తిలోనూ వ్యక్తిగత జీవితాల లోనూ మానసికచింతలు ఎక్కువగా ఉంటాయి.సంబంధాలు దెబ్బతింటాయి. ప్రమాదాలు జరుగుతాయి.

ఏప్రియల్ 5 నుంచి రాజకీయ కుట్రలు బాగా ఎక్కువైపోతాయి.