“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

1, మార్చి 2014, శనివారం

వ్రతాలు-పూజలు-ధ్యానాలు-నిజమైన ఆధ్యాత్మికత

ఈ మధ్యకాలంలో అనేకమంది గురువులూ వాళ్ళ స్కూల్సూ పుట్టుకొచ్చినందువల్ల మంచి జరిగినా జరుగకున్నా ఒక చెడుమాత్రం తప్పక జరుగుతోంది.

మన పూజలూ వ్రతాలూ ఆచారాలూ అన్నీ తప్పులనీ వాటిని ఆచరించవలసిన అవసరం లేదనీ ఒక వితండవాదం బయలుదేరుతోంది.ఇది చాలా తప్పుభావన.చాలాసార్లు ఇలాంటి భావనలను సోకాల్డ్ గురువులే పెంచి పోషిస్తున్నారు.ఇదీ అసలైన వింత.

నా స్నేహితుడైన ఒకాయన ముప్ఫై ఏళ్లక్రితమే పరమహంస యోగానంద గారి YSS క్లాసులు తీసుకుని తీవ్రంగా సాధన చేసేవారు.అప్పట్లోనే రోజుకు మూడుగంటలపాటు ఆయన క్రమం తప్పకుండా ధ్యానంలో ఉండేవారు. క్రమేణా ఆయనకు హార్ట్ ఎన్లార్జ్ మెంట్ వచ్చేసి చిన్నవయసులోనే చనిపోయారు.అతి ఉత్సాహంతో క్రియాప్రాణాయామం కౌంట్ ఆయన ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటూ పోయినందువల్ల ఇలా జరిగిందని నా అభిప్రాయం.

మాకు తెలిసిన ఒకావిడ ఉన్నది.ఆమె కూడా YSS కు వీరభక్తురాలే గాక క్రియాయోగ సాధకురాలు.పూజల్నీ ఆచారాలనీ వ్రతాలనీ ఆమె తీవ్రంగా విమర్శిస్తూ ఉంటుంది.వాళ్ళ ఇంటిలో పూజగది గత ఏడెనిమిది ఏళ్ళుగా మూతపడి ఉన్నది.వరలక్ష్మీ వ్రతమూ సత్యనారాయణ వ్రతమూ మొదలైన అనేకవ్రతాలు ఆమె చెయ్యకపోగా చేస్తున్నవారిని విమర్శిస్తుంది.ఈ పిచ్చివేషాలు చూచి కొందరు మిత్రులుకూడా వాళ్ళ ఇంటికి పోవడం మానుకున్నారు.

మా బంధువులలో ఒకామె ఈమధ్యనే పరమహంస యోగానందగారి ఆశ్రమానికి వెళ్ళింది.

అక్కడ ఎదురైన ఒకాయన 'మీరెవరు?ఏమిటి ఇలా వచ్చారు?' అని అడిగారట.

'నేను "పరమహంస యోగానంద గారి ఆటో బయాగ్రఫీ ఆఫ్ ఎ యోగి" పుస్తకం చదివాను.అందుకని వచ్చాను.' అని ఆమె చెప్పింది.

ఆయన వెంటనే -'సరే మీరు ఈ అప్లికేషన్ పూర్తి చెయ్యండి.రెండువేలు కట్టండి.మీకు సాధన ఎలా చెయ్యాలో నేర్పిస్తాము.' అని అన్నాడు.

ఈమె బిత్తరపోయి అక్కడనుంచి తప్పించుకుని వచ్చేసింది.

ఓం ప్రధమంగా మొదలుపెట్టడమే డబ్బుతో మాటలు మొదలైతే అదెంత ఆర్టిఫిషియల్ గా ఉంటుందో,అదేమి ఆధ్యాత్మికతో ఆమెకు అర్ధం కాలేదని నాకు చెప్పింది.

ఇదంతా వింటుంటే గతంలో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తొచ్చింది.

పదేళ్లక్రితం ఎవరైనా మంచి సాధకులు పరిచయం అవుతారేమో అని నేను వెదుకుతూ ఉండేవాడిని.ఆ క్రమంలో భాగంగా ఒకసారి గుంటూరులోని YSS వారి సంస్థకు వెతుక్కుంటూ వెళ్లాను.ఆ రోజున ఏదో ఒక స్పెషల్ క్లాసు ఉన్నదని అక్కడవారు చెప్పారు.అప్పటికి ఇంకా ఎవరూ రాకపోతే అక్కడ కూచుని చాలాసేపు వేచి చూచాను.

ఇంతలో ఒకాయన వచ్చి అనుమానంగా నావైపు చూచాడు.

'అదేంటి అలా చూస్తున్నాడు?' అనుకున్నాను.

'మీరు క్రియాయోగా ఇనిషియేషన్ తీసుకున్నారా?' అడిగాడు.

'లేదు.కాని నాకు క్రియాయోగం తెలుసు' అని జవాబిచ్చాను.

'ఎలా తెలుసు?' అడిగాడు.

అవన్నీ అతనికి చెప్పడం ఎందుకని నేను మౌనంగా ఊరుకున్నాను.

'మీరు దయచేసి బయటకు వెళ్ళిపొండి.మా సంస్థలో ఇనిషియేషన్ తీసుకున్నవారు మాత్రమే ఇక్కడ ఉండాలి.ఇది బయటవాళ్ళకోసం కాదు.' అని అతనన్నాడు.

నేను మౌనంగా బయటకు వచ్చేసాను.

వచ్చేముందు గుమ్మం వద్ద ఆగి ఆయన్ను ఒక మాట అడిగాను.

'దయామాత వ్రాసిన "ఓన్లీ లవ్" అనే పుస్తకం మీరు చదివారా?'

అతను అనుమానంగా చూచాడు.కాసేపుంటే నన్ను బయటకు తోసేసేవాడే.అంత దగ్గరగా వచ్చాడు.

అతని వాలకం చూస్తే ఆపుస్తకం పేరు కూడా అతను వినలేదని నాకర్ధమైంది.

'ఆమె ఎవరో కాదు.మీ పరమహంస యోగానంద గారి ప్రియశిష్యురాలు.ఆమె వ్రాసిన పుస్తకం పేరే "ఓన్లీ లవ్".ఒకసారి చదవండి.' అని చెప్పి అక్కడనుంచి వచ్చేశాను.

అతనికంటే మామూలు క్రైస్తవులు చాలా బెటర్ అని నాకనిపించింది.మనం ఏ చర్చికి వెళ్ళినా లోపలికి రమ్మని పిలుస్తారు గాని బయటకు పొమ్మని ఎవరూ చెప్పరు.అదీ నీతులు చెప్పే మన ఆధ్యాత్మిక సంస్థల ఘనత!!!

కదిలిస్తే చాలు పుంఖానుపుంఖాలుగా నీతులు వల్లించడమూ ఆచరణలో దానికి పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తించడమే హిందువుల పతనానికి అసలైన కారణమని వివేకానందస్వామి ఎన్నోసార్లు అనేవారు.ప్రేమా,విశాలమైన దృక్పధమూ లేనిది ఆధ్యాత్మికత ఎలా అవుతుందో నాకైతే అర్ధం కాదు.

ధ్యానం ఒక్కటే చాలు ఇంకే పూజలూ అవసరం లేదు-అనే వాదం ఒకటి ఈ మధ్యన ఒక గడ్డంగురువుగారు ప్రారంభం చేశారు.బౌద్ధాన్నీ హిందూమతాన్నీ ఇంకా అనేకానేక సాంప్రదాయాలని కలగలిపి ఇష్టం వచ్చినట్లు సాంబారు వండిన ఆయన చివరకు ఎటుపోవాలో అర్ధంకాక గందరగోళంలో పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది.ఇప్పటికే వారు ఒక డెడ్ ఎండ్ కు చేరినట్లు వాళ్ళ కార్యక్రమాలను చూస్తే నాకనిపిస్తున్నది. ఇకపోతే,ఆయన శిష్యుల సంగతి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది.

పూజలూ వ్రతాలూ మంచివి కాకపోతే మహర్షులు వాటిని ఎందుకు ప్రోత్సహించారు?అన్ని పురాణాలు వ్రాసిన మన మహర్షి వేదవ్యాసునికి ఇంత చిన్న విషయం తెలియలేదా?ధ్యానం అంటే ఏమిటో లోకానికి బోధించిన మహర్షులకు ధ్యానం గురించి తెలియదా?మనంత తెలివి వాళ్లకు లేదా?అని ఆలోచిస్తే ఎవరికైనా ఒక్క విషయం తెలుస్తుంది.

మన హిందూమతం లేదా సనాతనధర్మం లేదా ఆర్షధర్మం అనబడేది ఒక యూనివర్సిటీ వంటిది.ఇందులో కేజీ నుంచి పీజీయే కాదు రీసెర్చి వరకూ అన్ని విభాగాలూ ఉన్నాయి.మనకేది సరిపోతుందో మనమే స్థాయిలో ఉన్నామో మనమే క్లాసులో చేరాలో తెలుసుకుని అక్కడనుంచి మొదలుపెట్టి పైకి ఎదగాలి.అంతేగాని మనకు అర్ధమైన స్వల్పవిషయాన్ని చూచుకుని అదే సర్వస్వం అనుకుని ఇక మిగిలిన అంతా అనవసరం అనీ పనికిరానిదనీ విమర్శించడం చాలా పొరపాటు.ఈ యూనివర్శిటీ ని ప్రారంభించినవాళ్ళు సామాన్య్లులు కారనీ మనకంటే వాళ్లకు తెలివితేటలూ జ్ఞానమూ కొన్ని లక్షల రెట్లు ఎక్కువనీ మనం మరచిపోరాదు.

పై క్లాసులకు ఎదగకుండా ఉన్న క్లాసులోనే ఉండటం ఎంత పొరపాటో, నేనున్న విభాగమే మంచిది ఈ యూనివర్సిటీలో ఇక మిగిలిన విభాగాలన్నీ తప్పులే అనుకోవడమూ అంతే పొరపాటు.ఇదే పొరపాటును చాలామంది హిందువులు నేడు చేస్తున్నారు.వారివారి గురువులూ చేయిస్తున్నారు.

చాలామంది చేస్తున్న ఇంకొక ఘోరమైన తప్పు ఉన్నది.

మనం ఒక ఆధ్యాత్మిక సంస్థలోనూ కల్ట్ లోనో చేరతాం.ఇక మిగిలిన మనుషులందరూ అంటరానివాళ్లనీ అజ్ఞానులనీ వాళ్ళ పొడకూడా మనకు సోకరాదనీ అనుకుంటూ అందర్నీ దూరంగా ఉంచడమే ఆ తప్పు.ఈ తప్పును చాలామంది చేస్తూ ఉండటం నేడు మనం చూస్తున్నాం.

నిజమైన ఆధ్యాత్మికత అంటే వికాసం చెందటం.మన పరిధి క్రమేణా విస్తృతం కావాలి.అందరినీ మనం దగ్గరకు చేర్చుకోవాలి.విశాలమైన భావాలూ దృక్పథమూ మనకు రావాలి.సమస్త ప్రపంచాన్నీ అక్కున చేర్చుకునే మనస్తత్వం మనకు రావాలి.అదీ నిజమైన ఆధ్యాత్మికత.అంతేగాని మనలోకి మనం కుంచించుకుపోతూ ఎదుటివారిని అంటరానివారిగా చూస్తూ ఉంటే అది ఆధ్యాత్మికత కాదు.అదొక మానసికరోగం మాత్రమే.అటువంటి వారికి కావలసినది ధ్యానమూ సాధనలూ కాదు.వారికి అర్జంటుగా మానసిక వైద్యం ఇప్పించాలి.

వ్రతాలూ మంచివే,పూజలూ మంచివే,ధ్యానాలూ మంచివే,యోగాలూ మంచివే.నీరు పారుతున్నంతవరకూ కుళ్ళుడు పట్టదు.అదే నిలబడిపోతే కుళ్ళిపోతుంది.చేసే మనలో మంచితనం ఉంటె అన్నీ మంచివే.ఉండకూడని చండాలమంతా మనలోనే ఉంటే మనం చేసే సాధనలు కూడా అలాగే ఉంటాయి.అవి ఎంత గొప్ప సాధనలూ యోగాలూ అయినా మనలోని దరిద్రమే వాటిలోనూ ప్రతిఫలిస్తుంది.కనుక సాధనలు ముఖ్యం కాదు.మనమేమిటి అనేదే అసలైన విషయం.   

ఎవరికి ఏది అవసరం?ఎవరికి ఏది మంచిది?అన్న ప్రశ్నకు ఒకే సమాధానం ఉన్నది.ఎవరు దేనిని ఆచరించగలరో వారికి అది మంచిది.ఇంకొకరు ఇంకొకదానిని ఆచరిస్తూ ఉన్నంత మాత్రాన అది చెడ్డదికాదు.కాకపోతే, ఎక్కడివారు అక్కడ మురిగిపోకూడదు.ఏ విధానంలోనైనా సరే stagnation మంచిది కాదు.stagnation వచ్చిందంటే అది ఏ విధానమైనా ఏ మతమైనా వారు తప్పు చేస్తున్నట్లే లెక్క.

తనకు చేతనైనదానిని చేస్తూ అక్కడనుంచి మున్ముందుకు ఎదగడమే నిజమైన ఆధ్యాత్మికత.అంతేగాని కళ్ళకు గంతలు కట్టుకుని మనకు కనిపిస్తున్నంతవరకే సత్యం అనుకొని ఎదుటివారిని విమర్శించడం,వారిని దూరం చేసుకోవడం నిజమైన అధ్యాత్మికత కాదు.

సరిగ్గా చేస్తే అన్నీ మంచివే.ఆ సరిగ్గా చేసే విధానం ఏమిటో తెలుసుకోవడమే మన బాధ్యత.తెలుసుకున్నదానిని ఆచరించడమే మన తెలివి.

తమ కుటుంబసభ్యులను తామే ప్రేమించలేనివారు ఆధ్యాత్మికంగా ఎదగలేరు.తమ కుటుంబసభ్యులతో సమానంగా ఇతరులను కూడా ప్రేమించలేనివారు కూడా ఆధ్యాత్మికంగా ఎన్నటికీ ఎదగలేరు.

కళ్ళకు గంతలు కట్టుకోవడం ఆధ్యాత్మికత కాదు.కళ్ళకు ఇప్పటికే ఉన్న గంతలూ పొరలూ అన్నీ విడిపోవడమే నిజమైన ఆధ్యాత్మికత.