“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

18, మే 2014, ఆదివారం

అంగారకుని వక్రత్యాగం 19-5-2014-ఫలితాలు

కుజుడు లేదా అంగారకుడు ఈ నెల 19 నుంచి రుజుగతి (Direct motion) లోకి రాబోతున్నాడు.ఇన్నాళ్లుగా కుజుడు వక్రగతి (Retrograde motion) లో ఉండి తులారాశినుంచి కన్యలో ప్రవేశించాడు.ప్రస్తుతం కన్యారాశిలో హస్తానక్షత్రం రెండో పాదంలో (నవాంశలో వృషభరాశిలో ఉన్నాడు).వక్రగతిని వదలి రుజుగతిలోకి వస్తున్న కుజుడు 20-5-2014 నుంచి ఏమి ఫలితాలు ఇవ్వబోతున్నాడో ఒకసారి పరిశీలిద్దాం.

కుజుడు శక్తి కారకుడు.శక్తిహస్తుడు.ఏ పని చెయ్యాలన్నా అతని అనుగ్రహం ఉండే తీరాలి.ఆయన స్థితిని బట్టి పనులు స్తంభించి పోవడమో కదలడమో నిర్ణయింపబడుతుంది.ఇన్నాళ్ళూ ఆయన పరిస్థితి బాగాలేదు.ఇప్పుడు రుజుగతి మొదలు కావడం క్రమేణా వేగాన్ని పుంజుకోవడం వల్ల ప్రభుత్వ,ప్రజా రంగాలలో అనేక వేగమైన మార్పులను మనం ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

ఈ గ్రహచలనం వల్ల ముఖ్యంగా రాబోయే మార్పు ఒకటుంది.అది అనేకమంది జీవితాలలో ఇప్పుడు ఖచ్చితంగా కనిపిస్తుంది.అది ఏవిధంగా ఉండబోతున్నదో ఇప్పుడు చూద్దాం.

చాలామందికి కొన్ని నెలలుగా ఏ పనులూ ముందుకు కదలక ఆగిపోయి ఉంటాయి.అలాంటి వారు ఆయా పనులలో ఇప్పుడు కదలికను గమనించవచ్చు.కొందరికి ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. కొద్ది నెలలుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆశ కనిపించడం మొదలౌతుంది.కొంతమందికి ఈ సందర్భంగా స్థానచలనం ఉంటుంది.

కొంతమంది కొన్ని నెలలుగా పరాయి ప్రాంతానికి వెళ్లి ఉండవలసిన పరిస్తితి ఉంటుంది.అది ఉద్యోగరీత్యా కావచ్చు,వ్యాపార రీత్యా కావచ్చు,చదువు రీత్యా కావచ్చు.అలాంటివారు మళ్ళీ ఇప్పుడు స్వస్థలానికి తిరిగివచ్చే సూచనలున్నాయి.

ఎన్నో రంగాలలో పనులు చకచకా కదలడం ఈరోజునుంచి ప్రత్యక్షంగా గమనించవచ్చు.ఇది నేను ప్రస్తుత రాజకీయ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అనడం లేదు.కుజుని వక్రత్యాగాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమె చెబుతున్నాను.

కేంద్రంలో పాతప్రభుత్వం మూటా ముల్లె సర్దుకొని ఇంటిదారి పట్టడమూ,కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టడమూ ఇప్పుడే మొదలు కావడం గమనార్హం. అంతేకాదు ఆంధ్రాలో కొత్త ప్రభుత్వం తెరమీదకు రావడమూ రాజధాని నిర్ణయమూ ఉద్యోగుల బదిలీ మొదలైన అనేక విషయాలు ఇక చకచకా కదులుతాయి.

పాత వ్యవస్థను ప్రక్షాలన చేసి కొత్తదనాన్ని నింపే దిశలో పరిస్థితులను ఈ కుజగ్రహపు స్థితిమార్పు మొదలు పెట్టిస్తుంది.నవాంశలో మన స్వాతంత్ర్య లగ్నమైన వృషభంలో కుజుని స్థితివల్ల మన దేశం మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.దానికి సూచనలు కనిపిస్తూనే ఉన్నాయి కదా.అమెరికాకు ఇది ద్వాదశం కావడం వల్ల మనదేశం పట్ల ఆ దేశం తాత్సార ధోరణి వదలిపెట్టి ఓపెన్ గా కలిసి పనిచెయ్యడానికి ముందుకు రావలసిన పరిస్తితిని ఈ గ్రహస్థితి కల్పిస్తుంది.ఉన్నట్టుండి నరేంద్రమోడీ మీద అమెరికాకు పుట్టుకొచ్చిన ప్రేమకు ఈ గ్రహస్తితే కారణం.

భూమిమీద జరిగే ఏ ముఖ్యమైన పనులకైనా గ్రహముల స్థితిగతులు ఖచ్చితంగా కోరిలేట్ అవుతాయి అనడానికి ఇదే నిదర్శనం.లేకుంటే ఇప్పటిదాకా ఊరుకుని,ఇప్పుడే ఈ పనులన్నింటిలో కదలిక రావడానికి కారణం ఏమిటి?అది సరిగ్గా కుజుని వక్రత్యాగతేదీకి ఖచ్చితంగా సరిపోవడం ఏమిటి? చూచే దృష్టితో చూస్తే అన్నీ అర్ధం చేసుకోవచ్చు.

కానీ కొన్ని నెగటివ్ సంఘటనలు కూడా ఇప్పుడు జరుగుతాయి.ముఖ్యంగా ఎవరి జాతకాల్లో అయితే కుజుడు ఆత్మకారకుడో లేదా లగ్నాదిపతియో లేదా ఇతర ముఖ్యవిషయాలకు కారకుడో వారు ఈరోజు రేపూ జాగ్రత్తగా ఉండాలి.వారికి ఆరోగ్య సమస్యలూ ఆటంకాలూ ఉన్నట్టుండి ఈ రెండురోజుల్లో తలెత్తుతాయి.ఎందుకంటే వక్రస్తితిని వదలి డైరెక్ట్ మోషన్ లోకి రాబోయే ముందు గ్రహములు స్తంభన(immobile)స్థితిలోకి వస్తాయి.కనుక ఈ రెండురోజుల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురౌతాయి.కాని ఆ తర్వాత 20 వ తేదీనుంచి అవన్నీ తగ్గిపోతాయి.

చంద్రునిదైన హస్తానక్షత్రంలో ఇది జరుగుతున్నది.చంద్రుడు సహజ చతుర్దాదిపతి.కనుక ప్రజాభిప్రాయం చాలా వేగంగా ఇప్పుడు మారబోతున్నది. వారి ఆలోచనలలో మంచి మార్పులు ఇప్పుడు వస్తాయి.ఇప్పటివరకూ అర్ధంకాని గందరగోళ మానసిక స్థితిలో ఉన్నవారికి ఇప్పుడు క్లారిటీ తో కూడిన ఆలోచనలు మొదలౌతాయి. 

స్తంభించిపోయి కదలకుండా విసుగు పుట్టిస్తున్న అనేక పనులను కుజుని వక్రత్యాగం చాలా వేగంగా మొదలుపెట్టిస్తుంది.ఈ పరిణామాలను ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాలలో 20 వ తేదీనుంచి అందరూ వీక్షించవచ్చు.