నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

14, మే 2014, బుధవారం

బుద్ధ పౌర్ణమి-2014

బుద్ధపౌర్ణమిని నేను అత్యంత శుభదినంగా భావిస్తాను.చిన్నప్పటినుంచీ బుద్ధుడిని చదివి ఆరాధించి అనుసరించడం దీనికి కారణం కావచ్చు.

గతంలో నాకొక స్నేహితుడుండేవాడు.అతనూ బుద్ధుడంటే అమితమైన అభిమానమూ ఆరాధనా ఉన్నవాడే.అయితే అతను బుద్ధుడిని ఎందుకు ఆరాధించేవాడో నాకు చాలాకాలం అర్ధమయ్యేది కాదు.బుద్ధుడిని దైవంగా భావించే చాలామంది హిందువుల లాగే అతనికీ బుద్ధత్వం అంటే సరియైన అవగాహన ఉండేది కాదు.కానీ బుద్ధుడిని ఆరాధించేవాడు.

ఒకరోజు అతన్ని ఇలా అడిగాను.

'మీ ఇంట్లో అంతా వైదిక సాంప్రదాయం పాటిస్తారు కదా? మరి బుద్ధుడేమో వేదాలని నిరసించాడు.నీవు బుద్ధుడిని ఎలా పూజిస్తున్నావు?'

అతను సరియైన సమాధానం చెప్పలేకపోయాడు.

చాలాసేపు ఆలోచించి 'బుద్ధుడు విష్ణువు అవతారం' అన్నాడు.

'వేదాలను నిరసించిన బుద్ధుడు విష్ణువు అవతారం ఎలా అయ్యాడు?' అడిగాను

అతను మళ్ళీ చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు.కాని చివరకు ఏమీ చెప్పలేకపోయాడు.

'నీకు బుద్ధుడంటేనే కాదు అవతారతత్త్వం అంటే కూడా ఏమీ తెలీదని నాకిప్పుడు అర్ధమైంది.నేను చెప్పనా?' అన్నాను.

'ఊ' అన్నాడు.

'నాస్తికులనూ పాషండులనూ బురిడీ కొట్టించడానికి విష్ణువు బుద్ధునిగా జన్మించి ఒక అసత్యబోదను వారికి బుద్ధమతం రూపంలో చేసి వారిని సరియైన దారినుంచి తప్పించాడని మీవాళ్ళు వ్రాశారు.మొదట్లో దశావతారాలలో బుద్ధుడు లేడు.బలరాముడూ కృష్ణుడూ విడివిడిగా ఉండేవారు.తర్వాత వారిద్దరినీ కలిపేసి ఒక స్లాట్ ఖాళీ చేసి అందులో బుద్ధుడిని ఉంచారు'

'నిజమా?'అన్నాడు 

'అవును.మరి దేవుడు ప్రజలనూ లోకాన్నీ ఎందుకు తప్పుదారి పట్టిస్తాడు?అలాంటి పనులు ఎందుకు చేస్తాడు?'అడిగాను.

'చెయ్యడు.నిజమే' అని ఒప్పుకున్నాడు.

'దేశమంతటా విపరీతంగా అభిమానం సంపాదించుకుంటూ పెరిగిపోతున్న బుద్ధమతం యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడానికే అవతారాలలో బుద్ధుని చేర్చారు.' అన్నాను.

'అయితే మరి అంత ప్రాబల్యం సంపాదించుకున్న బుద్ధమతం ఎందుకు ప్రస్తుతం మన దేశంలో లేకుండా పోయింది?' అడిగాడు.

'దానికి అనేక కారణాలున్నాయి.స్థిరంగా ఎక్కడా ఏదీ ఎల్లకాలం ఉండదు.ఇది సృష్టిధర్మం.అదిగాక బుద్ధమతపు తాత్విక చింతనలో కొన్ని లోపాలున్నాయి. శంకరాచార్యులు తన సునిశిత మేధాసంపత్తితో వాటిని విమర్శించారు.ఆయన వాదనను బౌద్ధులు ఎదుర్కోలేకపోయారు.ఈలోపల ముస్లిముల దండయాత్రలలో బౌద్ధ భిక్షువులను ఎక్కడికక్కడ ఊచకోత కోశారు. తప్పించుకున్నవారు ఇతరదేశాలకు పారిపోయారు.అలా బౌద్ధం మన దేశంలో అదృశ్యమై పోయింది.' అన్నాను.

'బుద్ధమతంలో ఉన్న లోపాలేమిటి? అడిగాడు.

'అది అనాత్మవాదం.నిరీశ్వరవాదం.వారు కర్మను నమ్మారు.కర్మఫలాన్ని నమ్మారు.కాని ఈశ్వరుని నమ్మలేదు.కర్మకు అధిష్టానంగా ఒక శక్తి ఉన్నదని, అది ఫలితాలను పంపిణీ చేస్తుందనీ వారు నమ్మలేదు.కర్మే ఫలితాన్ని ఇస్తుందని వారు అన్నారు.ఈవిషయంలో వారికీ పూర్వమీమాంసా వాదులకూ సామ్యాలున్నాయి.జడమైన కర్మ తనంతట తాను ఫలితాన్ని ఎలా ఇవ్వగలదు?అని శంకరులు ప్రశ్నించారు.దానికి వారు జవాబు చెప్పలేక పోయారు.ఒక్క వేదాంతమే దీనికి సరియైన తర్కబద్దమైన సమాధానం ఇవ్వగలిగింది' అన్నాను.

'ఈ విషయం నాకు తెలియదు.ఇంకా చెప్పు' అడిగాడు.

'వారు పునర్జన్మను నమ్మారు.కాని ఆత్మ లేదన్నారు.ఆత్మ లేకుంటే మళ్ళీ జన్మ ఎత్తెది ఏమిటి?అని శంకరులు వారిని ప్రశ్నించారు.దానికీ వారివద్ద జవాబు లేదు.తర్వాతి తరపు బౌద్ధులు ఈ సమస్యను అధిగమించడానికి 'ఆలయవిజ్ఞానం' అనే కొత్త థియరీని తెరపైకి తీసుకొచ్చారు.కర్మల వల్ల ఏర్పడే సంస్కారాలన్నీ 'ఆలయవిజ్ఞానం' అనే ఒక దానిలో గూడుకట్టుకుని ఉంటాయనీ అదే తిరిగి జన్మ ఎత్తుతూ ఉందనీ వారు భావించారు.అంటే ఆత్మ అనేది ఉందని తర్వాతి తరపు బౌద్ధులు లోపాయికారీగా ఒప్పుకున్నట్లే అయింది.అయితే ఆలయవిజ్ఞానం అనేది కూడా ఆత్మ కాదని వారన్నారు. అదే సమయంలో ఏదీ అంటించుకోని ఆత్మ,సంస్కారాలను ఎలా అంటించుకుని ఒకజన్మనుంచి ఇంకొక జన్మకు తీసుకెళుతుందో వేదాన్తులూ చెప్పలేక పోయారు.దానికోసం వారు,సూక్ష్మశరీరం అనీ,మాయ అనీ కొన్ని కాన్సెప్ట్ లను తెరపైకి తెచ్చారు.

ఏది ఏమైనా,ఆత్మవాదులైన భారతీయులు అనాత్మవాదమైన బౌద్ధాన్ని ఎల్లకాలం ఆరాధించలేకపోయారు.శూన్యాన్ని ఎవరైనా ఎలా ఆరాధించగలరు?' అని చెప్పాను.

'అసలీ గొడవలన్నీ ఎందుకు? అసలంటూ బుద్దుడు ఏమి చెప్పాడు?ఆయన అనుభవం ఏమిటి?ఇల్లూ వాకిలీ వదిలిపెట్టి అన్నేళ్ళు అడివిలో తపస్సుచేసి ఆయన ఏమి తెలుసుకున్నాడు?' అని అడిగాడు.

హోమ్ వర్క్ ఇవ్వకుండా అన్నీ తేరగా చెబుతూ పొతే అలుసవడం తప్ప ఉపయోగం ఉండదని నాకు అనుభవం నేర్పింది.

కనుక ఇలా అన్నాను.

'నాకు తెలియదు.బుద్ధుని అనుభవం ఏమిటో తెలియడానికి నేను బుద్దుడిని కాదుగా.ఆయనేమి చెప్పాడో నీవే తెలుసుకుని నాకు చెప్పాలి.ఏమీ తెలీకుండా ఎందుకు ఆయన్ని ఆరాధిస్తున్నావు?నీ ప్రశ్నలకు జవాబులు నీవే తెలుసుకుని నాకు చెప్పు.వింటాను.'

'నీవూ వైదిక సాంప్రదాయానికి చెందినవాడివే కదా?మరి నీవెందుకు బుద్ధుని ఆరాధిస్తున్నావు?' అడిగాడు.

'నీకో సంగతి తెలుసా?బుద్ధునికి చాలా సన్నిహితులైన ప్రధమశిష్యులు చాలామంది బ్రాహ్మణులే.అంతేకాదు బుద్ధునికి చాలాకాలం దారిచూపి ఆయనకు ధ్యానశిక్షణను ఇచ్చిన గురువులూ బ్రాహ్మణులే.సత్యాన్ని అనుసరించడం కోసం పూర్వకాలంలో తాము నమ్మిన సిద్ధాంతాలను సునాయాసంగా వారు పక్కన పెట్టేవారు.వారికి సత్యమే ప్రధానం గాని సిద్ధాంతాలు కాదు.' అన్నాను.

'నేనడిగిన దానికి నీవు సూటిగా జవాబు ఇవ్వలేదు.' అన్నాడు.

'ఉపనిషత్తులలో చెప్పబడిన జ్ఞానకాండకు అత్యున్నతశిఖరంగా బుద్ధుని నేను భావిస్తాను.శంకరులూ అదే.ఒకే నాణేనికి ఇద్దరూ బొమ్మా బొరుసూ వంటి వారు.శంకరులది పాజిటివ్ అప్రోచ్ అయితే బుద్ధునిది నెగటివ్ అప్రోచ్.అంతే తేడా.ఇద్దరూ చేరినది ఒక్కచోటికే.అయితే కొందరికి నెగటివ్ అప్రోచ్ బాగా నచ్చుతుంది.చిమ్మచీకటి రాత్రిలో ఉన్నట్లు అందులో ఏదో అర్ధంకాని బ్యూటీ ఉన్నది.' అన్నాను.

'ఇంతకీ బుద్ధుని బోధ యొక్క సారం ఏమిటి?' అన్నాడు.

'ఏమో నాకేం తెలుసు?నీవే తెలుసుకుని నాకు చెప్పు.తెలుసుకుంటాను' అన్నాను నవ్వుతూ.