ఈ మధ్యనే జరిగిన ఒక సంగతి.
నాకు తెలిసిన ఒక నాయకుడు మొన్నటి ఎలక్షన్లలో పోటీ చేద్దామని ఒకానొక పార్టీ టికెట్ కోసం తెగ ప్రయత్నం చేశాడు.చేస్తే చేశాడు.ఎలక్షన్లలో గెలుస్తానా లేదా అని మధ్యలో నన్నడిగాడు.
అతనికి మొదట్లో జ్యోతిష్యం అంటే నమ్మకం ఉండేదికాదు.జ్యోతిష్యాన్ని తెగ విమర్శించేవాడు.కాని అతని జీవితంలో రెండేళ్ళ నాడు జరిగిన ఒక సంఘటనతో అతనికి జ్యోతిష్యశాస్త్రం అంటే నమ్మకం ఏర్పడింది.రెండేళ్ళ క్రితం ఉత్త కుతూహలంతో నన్ను కలిశాడు.మా సంభాషణ అంతా అతను జ్యోతిష్య శాస్త్రాన్ని విమర్శించడమూ నేను వింటూ మౌనంగా ఉండటమే సరిపోయింది. లాజికల్ గా చేసే చర్చలతో ఇలాంటి వాటిని రుజువు చెయ్యలేమని నాకు తెలుసు.
అందుకే వినీ వినీ చివరకు ఇలా చెప్పాను.
'ఇదంతా ఎందుకు గాని,మీ జాతకవివరాలు ఇవ్వండి.కొన్ని విషయాలు చెబుతాను.అప్పుడు మీకు నమ్మకం కలుగుతుంది'
అతని వివరాలు చూచి గతంలో జరిగిన కొన్ని సంఘటనలు అతనికి చెప్పాను.
అవి సరిపోవడంతో అతనికి సగం నమ్మకం కుదిరింది.
'గతాన్ని చాలామంది చెబుతారు.మా స్నేహితులు వైదీశ్వరన్ కోయిల్ వెళ్లి చెప్పించుకున్నారు.అక్కడి నాడీ జ్యోతిష్కులు వాళ్లకు గతమంతా బాగా చెప్పారు.కాని భవిష్యత్తు మాత్రం వాళ్ళు చెప్పినట్లు ఏమీ జరగలేదు' అన్నాడు.
సరే చూద్దామని కొద్ది నెలలలో జరగబోయే కొన్ని సంఘటనలు అతనికి చెప్పాను.తీసుకోవలసిన జాగ్రత్తలూ చెప్పాను.
అవి అలాగే జరగడంతో అతనికి అప్పుడు నమ్మకం కుదిరింది.ఇక ప్రతిదానికీ నన్ను సంప్రదించడం మొదలు పెట్టాడు.
అతివృష్టి అనావృష్టిలాగ చాలామంది ఇంతే చేస్తారు.నమ్మకపోతే అసలు నమ్మరు.నమ్మితే ఇక అడుగుతీసి అడుగు వెయ్యడానికి జ్యోతిష్యాన్ని సంప్రదిస్తారు.నా దృష్టిలో రెండూ తప్పే.జ్యోతిష్యశాస్త్రానికి మనం బానిసలం కాకూడదు.దానిని ఎంతవరకో అంతవరకే వాడుకోవాలి.అలా వాడుకునే తీర్పరితనం మనలో ఉండాలి.జ్యోతిష్యం అనేది మనలో భయాన్నీ అనుమానాన్నీ పెంచకూడదు.
ఇదంతా గతం.ఇప్పుడు ప్రస్తుతంలోకి వద్దాం.
ఎలక్షన్లలో తనకు ఒక పార్టీ నుంచి టికెట్ వచ్చేలాగా ఉన్నదని అతను చెప్పాడు.కాకపోతే ఇంకొక పోటీదారుడు తనకంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడనీ తనకు పోటీ వస్తున్నాడనీ అతన్ని ఓడించడానికి ఏం చేస్తే బాగుంటుందో చెప్పమనీ అడిగాడు.
'సారీ.నేనిలాంటి రెమేడీలు చెప్పను.అవి చెప్పేవాళ్ళు వేరే చాలామంది ఉంటారు.వాళ్ళను కలవండి' చెప్పాను.
'మరి మీ సలహా ఏమిటి?' అడిగాడు.
'మీరు టికెట్ కోసం ప్రయత్నం చెయ్యవద్దు.విరమించుకొండి.మీ ప్రత్యర్ధినే ఖర్చు పెట్టుకోనివ్వండి.అతన్నే పోటీ చేయ్యనివ్వండి.ప్రస్తుతం మీకు ఎలక్షన్లలో విజయం లేదు.' అని చెప్పాను.
అయినా వినకుండా 'ఏదైనా రెమెడీ చెప్పమని' అడిగాడు.
నాకు విసుగొచ్చింది.
'ఒక్కోసారి జీవితంలో నష్టంలోనే లాభం ఉంటుంది' అని మాత్రం చెప్పాను.
అతనికి నా సలహా రుచించలేదు.ఇక ఎంత బతిమాలినా నేనేమీ పలకక పోతుంటే అయిష్టంగా వెళ్ళిపోయాడు.
చాలామంది ఇంతే.వాళ్ళ మనసులో మాటను మన నోటివెంట చెప్పిద్దామని చూస్తారు.వాళ్లకు కావలసింది నిజం కాదు.ఒక మానసిక ఆసరా మాత్రమే. వాళ్ళు చేసేది న్యాయమైనా అన్యాయమైనా దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడనే ఒక ధీమా మాత్రమె వాళ్లకు కావాలి.ఇలాంటివారికి జ్యోతిష్యపరంగా సలహాలు ఇవ్వకూడదు.
చాలామంది ఇంతే.వాళ్ళ మనసులో మాటను మన నోటివెంట చెప్పిద్దామని చూస్తారు.వాళ్లకు కావలసింది నిజం కాదు.ఒక మానసిక ఆసరా మాత్రమే. వాళ్ళు చేసేది న్యాయమైనా అన్యాయమైనా దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడనే ఒక ధీమా మాత్రమె వాళ్లకు కావాలి.ఇలాంటివారికి జ్యోతిష్యపరంగా సలహాలు ఇవ్వకూడదు.
ఎలక్షన్లు అయిపోయాయి.
ఈ మధ్యనే అతను మళ్ళీ కలిశాడు.
'సార్ మీరు నా జీవితాన్ని నిలబెట్టారు.'అన్నాడు.
నాకర్ధం కాలేదు.
'ఏమైంది' అడిగాను.
'మీ మాట విని ఊరుకోకుండా నా ప్రయత్నం నేను తీవ్రంగా చేశాను. అవసరమైతే ఆస్తులు అమ్మి మరీ ఎలక్షన్లలో ఖర్చు పెడదామని వెళ్లాను. కాని నా ప్రత్యర్ధి మంచి ఆస్తిపరుడు.నాకంటే ఆర్ధికంగా ఇంకా బలంగా ఉన్నాడు.అతనికే పార్టీ టికెట్ వచ్చింది.అతను కూడా ఇల్లూ స్థలాలూ అమ్మి మరీ ఎలక్షన్లలో డబ్బు పంచాడు.కాని చివరికి ఘోరంగా ఓడిపోయాడు.ఆస్తీ పోయింది.ఎలక్షన్లోనూ గెలవలేదు.రెంటికిచెడ్డ రేవడి అయ్యాడు.ఇప్పుడు తలుచుకుంటే నాకు వణుకు పుడుతున్నది.ఒకవేళ నాకే టికెట్ వచ్చి ఉంటె నేనూ అలాగే మొత్తం ఆస్తిని అమ్మి డబ్బు పంచి ఉంటె నా గతి ఏమయ్యేది? నా కుటుంబం రోడ్డున పడి ఉండేది.దేవుడు నన్ను ఇలా రక్షించాడన్న మాట.' అన్నాడు.
'నేను చెప్పాను.మీరే వినలేదు.సరే అంతా మంచికే జరిగింది.సంతోషం' అన్నాను.
'జ్యోతిష్య శాస్త్రం చాలా గొప్పది.ఇప్పుడు నమ్ముతున్నాను.' అన్నాడు.
నేను నవ్వి ఊరుకున్నాను.
అతను ఇంకా పొగుడుతున్నాడు.
ఇక ఇలా కాదని ' సరే.ఇప్పుడు మీకు ఎంత మిగిలింది?' అన్నాను.
'ఆ అదంతా ఎందుకు లెండి' అన్నాడు.
'పరవాలేదు అంతా అయిపొయింది కదా.చెప్పండి.' అడిగాను.
'ఒక పది కోట్లు మిగిలి ఉంటుంది' అన్నాడు.
అతను అబద్దం చెబుతున్నాడనీ అది చాలా తక్కువ మొత్తం అనీ నాకు తెలుసు.
నేను నవ్వి 'మీకు జ్యోతిష్యశాస్త్రం మేలు చేసింది అంటున్నారు కదా.అందులో జస్ట్ రెండు లక్షలు నాకు ఫీజు గా ఇవ్వండి.' అన్నాను.
అతనిలోని రాజకీయ నాయకుడు బయటకొచ్చాడు.
'నాకు టికెట్ రాదనీ,నా ప్రత్యర్ధికి వస్తుందనీ,అతను భయంకరంగా ఖర్చు పెడతాడనీ,కానీ గెలవడనీ మీరు క్లియర్గా చెప్పలేదు కదా.నీకు రాజకీయంగా టైం బాగాలేదు.పోటీ చెయ్యవద్దు అని మాత్రమె చెప్పారు.అలా కాకుండా జరగబోయేదానిని స్పష్టంగా చెప్పి ఉంటె అప్పుడు మీరు ఎంత అడిగితే అంత నేను ఇచ్చేవాడిని' అన్నాడు.
'ఇప్పుడే కదా మీరన్నారు.జ్యోతిష్యశాస్త్రం నా బ్రతుకును నిలబెట్టింది అని? అన్నాను.
'ఏదో మాటవరసకి అన్నాను.అయినా జరగాల్సినది జరుగుతుంది.జరగనిది జరగదు అని రమణమహర్షి అన్నారు కదా?' అన్నాడు వక్రంగా నవ్వుతూ.
రమణమహర్షి పరిస్థితి ఎంత ఘోరంగా తయారైంది!!!ప్రతి అవకాశవాదీ ఆయన్ని ఆసరాగా తీసుకునేవాడే.
'రమణమహర్షి ఆ మాటను నాతో అనలేదు.మీతో అన్నారేమో నాకు తెలియదు.అందుకని ఆ మాట నిజమో కాదో కూడా నేను చెప్పలేను.అదంతా సరేగాని నా రెండు లక్షలు ఎప్పుడిస్తున్నారు.సీరియస్ గా అడుగుతున్నాను.' అన్నాను.
'మీరు భలే జోకులేస్తారు శర్మగారు.సరే వస్తా సార్ పనుంది.' అంటూ అతను సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.
'పీడా వదిలింది' మనసులో అనుకున్నాను.