నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

3, మే 2014, శనివారం

పో...నన్ను వెంబడించకు

జీవితం చాలా విచిత్రమైనది

కోరుకున్నది కోరుకున్నట్లు ఇక్కడ ఎవరికీ ఏదీ దక్కదు.ఆ దక్కినదానిలో ఏదో ఒక వెలితి ఉంటూనే ఉంటుంది.ఆ వెలితి ఎందుకుంటుంది అన్నదే జీవితపు అసలైన రహస్యం.

ఒకవేళ కోరుకున్నది కోరుకున్నట్లు దక్కినా అందులో చివరకు తాను ఆశించినది ఏమీ కనపడదు.మనం ఎందుకోసం దానిని ఆశించామో అది తప్ప అన్నీ అందులో కనిపిస్తాయి.ఏదో అర్ధం కానిది అందులో మిస్సయినట్లు తోస్తుంది.ఆలోచనాపరులైన ప్రతివారికీ ఇది అనుభవమే.ఒకవేళ ఇంకా అనుభవం కాకపోతే,వారిలో ఆలోచన ఇంకా వికసించలేదన్నదీ సత్యమే.

అయినవాళ్ళనుకున్నవారి అంతరంగాలు వేరని తెలిసినప్పుడు ఆవేదన నిన్ను కుదిపేస్తుంది.ఏళ్ళతరబడి నీతో ఉన్నవారు చివరకు నిన్ను అర్ధం చేసుకోకపోతే వారిపై నీకు జాలి కలుగుతుంది.ఒక్కోసారి నీ అమాయకత్వానికి నీమీద నీకే జాలి కలుగుతుంది.

జీవితం ఎంత విచిత్రమైనదో అన్న ఆలోచన నిన్ను వివశుడిని చేస్తుంది.

స్వచ్చమైన జీవితం గడపకుండా కపటంలో మనుష్యులు ఎందుకు కూరుకుని ఉన్నారో అర్ధంకాక నీకు విసుగొస్తుంది.మనుషుల అంతరంగాలను అర్ధం చేసుకునే కొద్దీ ఈలోకం మీదా ఈ మనుషులమీదా నీకు విరక్తి నానాటికీ ఎక్కువౌతుంది.

ఈ పాడులోకాన్ని వదిలి ఎక్కడికో ఎగిరిపోదామనిపిస్తుంది.

ప్రతి ఆశా మనిషిని చివరకు నిరాశలోనే తేలుస్తుంది.
ప్రతి నిరాశా మళ్ళీ ఒక ఆశవైపు నడిపిస్తుంది.
ఆశ నిరాశల వలయంలో చివరకు జీవితం ఆహుతి అయిపోతుంది.
ఒకనాడు వెనక్కు తిరిగి చూస్తే,జీవితం చివరి మజిలీ వెక్కిరిస్తూ కనిపిస్తుంది.

ఈ భూమ్మీద నీపాత్రను పోషించడంలో నీవు ఘోరంగా ఓడిపోయావని విధి నవ్వుతుంది.
అనవసర కాలక్షేపాలలో జీవితాన్ని వృధా చేసుకున్నావని నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తుంది.
కానీ అప్పటికే జీవితపు కొలిమిలో ఇంధనం అడుగంటుతూ ఉంటుంది.
ఎందుకు ఈ జీవితం వృధా అయిందో అర్ధంకాని పరిస్థితి ఎదుట నిలుస్తుంది.

ఎక్కడికి పోవాలో తెలియని అయోమయంలో కొత్త ప్రయాణం మొదలౌతుంది.

తెలిసినా తెలియకున్నా ప్రతివారి జీవితమూ ఇంతే
అవునన్నా కాదన్నా ప్రతివారి జాతకమూ ఇదే
ఈ నిరంతర విశ్వభ్రమణానికి అంతమూ లేదు
జన్మజన్మలుగా జీవుని యాత్రకు పొంతనా లేదు

నిజానికి,తమకేమి కావాలో ఇక్కడెవరికీ తెలియదు
అలాగని,అర్ధంకాని ఈ వెదుకులాట ఆగనూ ఆగదు
ఇదొక గమ్యం లేని నిరంతర పయనం
అడుగడుగునా గమ్యం ఎదురైనా ఆగని పయనం.

జీవితం నిజంగానే చాలా విచిత్రమైనది.

దీని రహస్యం ఎప్పటికీ అంతుచిక్కదు.
ఈ ప్రయాణం ఎన్నటికీ ముగింపుకు రాదు.

కొన్నేళ్ళ క్రితం నేనొక విచిత్రమైన మనిషిని కలిశాను.

జీవితం ఎంత విచిత్రమైనదో అతనూ అంతే విచిత్రమైనవాడు.
ఏ క్షణంలో ఎటు పోతాడో ఊహించలేం.
ఏ నిముషంలో ఏం మాట్లాడతాడో అసలే గ్రహించలేం.
అతను ఎవరికీ అంతుచిక్కడు.

'నాతో రా.జీవిత రహస్యాన్ని నీకు నేర్పిస్తాను' అని అతను నాతో అన్నాడు.

కొన్నేళ్ళు అతనితో కలసి జీవించాను.
అతను ఎక్కడికి పోతే అక్కడికి నేనూ వెళ్లాను.
అతనితో తిన్నాను.తిరిగాను.

చివరకు అతను ఏమీ చెప్పలేదు.

విసుగొచ్చి ఒకరోజున అడిగాను.

'ఏదీ నీవు నేర్పిస్తానన్న జీవిత రహస్యం?' అంటూ.

అతను వింతగా నవ్వాడు.

'పో.ఈ జన్మకి నీకు అర్ధం కాదు.ఇక నాతో రావద్దు' అంటూ పిచ్చివాడిలా నవ్వాడు.

ఆ క్షణంలో నాకర్ధమైంది.

జీవించడంలోనే జీవిత రహస్యం ఉన్నది.
ఊహలలో బ్రతకడంలో అది లేదు.

నీ మనసుని నీవు నమ్మడంలో అది లేదు.
నీ ఆశలలో నీ నిరాశలలో అది లేదు.
నీ కపటంలో నీ తెలివిలో అది లేదు.
నీ అపనమ్మకంలో నీ అనుమానంలో అది లేదు.

ఎప్పుడూ ఏదో ఒకటి ఆశిస్తూ బ్రతకడంలో అది లేదు
నిత్యం నటిస్తూ బ్రతకడంలో అది లేదు
ఒకరిదగ్గర నేర్చుకోవడంతో అది రాదు
ఊరకే జీవించడంలోనే అది ఉన్నది.

నీకు బందీవి కాకుండా నీవు జీవించడంలో అది దాగున్నది.

'ఓస్.ఇంతేనా? ఇది మాకెప్పుడో తెలుసు.' అంటావా?

నీకేమీ తెలీదని నేనంటాను.

ఎందుకంటే,
నీకీ విషయం నిజంగా తెలిస్తే,
నీవు నాదగ్గరకు రావు.
నన్ను అడగవు.
నేను చెప్పేది వినవు.
నాతో మాట్లాడవు.
నాతో వాదించవు.
సరాసరి జీవిస్తావు.

ఇక్కడే తెలుస్తోంది
నీకు జీవితమంటే ఏమీ తెలీదని.
ఇక్కడే తెలుస్తోంది
నీకు జీవించడం రాదని.

జీవితమంటే ఏమిటో నీకు నిజంగా తెలిస్తే,నీవిలా ఉండవు.
జీవితం అంటే తెలిసిన వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలుసు.
అలాంటివాళ్ళను నేను చూచాను.వాళ్ళతో కలసి తిరిగాను.

'ఊరకే జీవించడం' నీవనుకుంటున్నంత తేలిక విషయం కాదు.
జీవితంలో అత్యంత కష్టమైన పని అలా జీవించడమే.

జీవితం చాలా విచిత్రమైనది.

విచిత్రమైన మనుషులకే అది అర్ధమౌతుంది.
వాళ్ళనే అది ప్రేమిస్తుంది.
మామూలు మనుషులకు అది అర్ధం కాదు.
పిచ్చివాళ్ళదే ఈ జీవితం.
నీవూ నాలా పిచ్చివాడివి అయినప్పుడే జీవితం అంటే ఏమిటో నీకు బోధపడుతుంది.

ఆనాడు ఆ పిచ్చివాడు నాతో చెప్పినదే నీకు ఈనాడు చెబుతున్నా.

'పో..నన్ను వెంబడించకు.
జీవితమంటే ఏమిటో నీకీ జన్మకి అర్ధంకాదు'.