Once you stop learning, you start dying

13, మే 2014, మంగళవారం

Lonely tree













46 డిగ్రీల గుంటూరు వేసవి ఎండ

ఆ చెవినుంచి ఈ చెవికి వీస్తున్న గాడ్పు

ఉదయం పదినుంచి సాయంత్రం ఆరువరకూ మిటమిటలాడే ఎండలో ఒక పల్లెటూరి బయట పొలాలలో ఉండే అదృష్టం పట్టింది ఈ మధ్య.

దూరంగా ఒక వేపచెట్టు కనిపించింది

దాని నీడలో పొలం మట్టిలో పడుకున్నా

దిండుగా ఒక రాయి నేనుంటానంది

వెల్లకిలా పొలంలో పడుకుని పైకి చూశా

విశాలమైన నీలాకాశం

అక్కడక్కడా తెల్లని మబ్బులు

వీస్తున్న గాలి చప్పుడు తప్ప ఇంకే శబ్దమూ లేదు

కనుచూపుమేరలో మనిషి సంచారమూ లేదు

కొంచం చల్లబడమని సూర్యుణ్ణి కోరా

కాలుతున్న మట్టి చల్లగా అనిపించింది


కాలం ఆగినట్లనిపించింది


ఏసీ రూం లో డబల్ బెడ్ మీదకూడా అంత మంచినిద్ర ఎప్పుడూ పట్టలా

ఆశ్రమాలలో దేవాలయాలలో కూడా అంత ప్రశాంతత ఎప్పుడూ దొరకలా

ఆ మట్టిలో పడుకుంటే నా తల్లి ఒడిలో సేదదీరినట్లుంది

ఆ నిశ్శబ్ద ప్రకృతిలో నన్ను నేనే దర్శించినట్లైంది 

సాయంత్రం లేచి ఆ చెట్టుకు మనసులో ఒక నమస్కారం చేశా

మళ్ళీ ఎప్పుడొస్తావ్? అంది చెట్టు

ఎందుకు? అన్నా.

'నా నీడలో నీవు నిద్రించావు.నీ నీడలో నాకు హాయిగా ఉన్నది.'అంది చెట్టు.

'నన్ను వదల్లేవా?' అనడిగా.

'లేను' అంది.

'అయితే నాతో వచ్చెయ్' అన్నా

'సరే' అంటూ అది నాలోకి వచ్చింది.

ప్రస్తుతం నాతోనే ఉంది

ఒంటరితనం నరకమే

మరి ఏకాంతమో.....

స్వర్గం