“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

10, మే 2014, శనివారం

నేటి ఎన్నికలపై Numerology (సంఖ్యాశాస్త్ర) సూచనలు

జ్యోతిష్యశాస్త్రం లాగే సంఖ్యాశాస్త్రం కూడా చాలా విచిత్రమైనది.నిజానికి ఈ రెండూ వేర్వేరు కావు.ఒకటే.ఒకటి నుంచి తొమ్మిదివరకూ ఉన్న అంకెలలో నవగ్రహాలే ఆటలాడుతూ ఉంటాయి.ప్రపంచంలోని ప్రతిదానినీ ఈ తొమ్మిది అంకెలే శాసిస్తున్నాయని గ్రీక్ తత్త్వవేత్త అరిస్టాటిల్ కూడా నమ్మేవాడు.అంటే అతి ప్రాచీనకాలంనుంచి ఈ భావన ప్రపంచవ్యాప్తంగా నాగరిక దేశాలన్నింటిలో ఉన్నది.ఇది నిజం కూడా.

సంఖ్యాశాస్త్రాన్ని సక్రమంగా వాడుకోవాలని అనుకునేవారు దానిని జ్యోతిష్య జ్ఞానానికి జోడించి ఉపయోగించినప్పుడే సరియైన ఫలితాలు కనిపిస్తాయి. సంఖ్యాశాస్త్ర విజ్ఞానాన్ని నిత్యజీవితంలో చాలా చక్కగా వాడుకోవచ్చు.దీనినీ జ్యోతిష్యాన్నీ కలిపి వాడుకుంటే నిత్యజీవితంలో అడుగడుగునా ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన ఫలితాలను మనం కళ్ళారా చూడవచ్చు.

ముందు ఏముందో తెలియని అగమ్యగోచర జీవితంలో మనల్ని సరిగ్గా నడిపించడానికి భగవంతుడు ఇచ్చిన చేతిదీపాలే జ్యోతిష్యమూ సంఖ్యాశాస్త్రమూ.కొన్ని ఇతర మతాలు భావించేటట్లు ఇవి devilish designs కావు.సైతాన్ శక్తులూ కావు.ఇవి దైవికమైన విద్యలే.ఈ రెండువిద్యల ద్వారా దైవమే మనకు దారిచూపుతుంది.

ప్రస్తుత ఎన్నికల ఫలితాలను విశ్లేషించడంలో ఇవి ఎలా ఉపయోగిస్తాయో చూద్దాం.

మొన్న ఎన్నికలు అయిన తేది 7.
రేపు ఫలితాలు రాబోయే తేదీ కూడా 7.
ఎలాగంటే 16 ను కుదిస్తే 7 అవుతుంది.

7-5-2014=రూట్ నంబర్ 10=1
16-5-2014=రూట్ నంబర్ 10=1

నా వ్యక్తిగత సంఖ్యాశాస్త్ర విధానంలో 7 అంకె శుక్రుని సూచిస్తుంది.16-5-2014 కూడా శుక్రవారమే కావడం గమనించాలి.

కనుక ఈ ఎన్నికలలో శుక్రునికి చాలా ప్రాముఖ్యత ఉండబోతున్నది.ఈ ఎన్నికల ఫలితాలను శుక్రుడే శాసించబోతున్నాడు.

ప్రస్తుత గోచారంలో శుక్రుడు మీనరాశిలో ఉచ్చస్థితిలో చాలా బలంగా ఉన్నాడు.ఈ శుక్రుడు సహజరాశిచక్రంలో ద్వితీయభావానికీ సప్తమభావానికీ అధిపతి.అంటే ఇంటి వ్యవహారాలకూ,ప్రత్యర్దులకూ సూచకుడు.

ఈ శుక్రుడు సహజలగ్నమైన మేషానికి ద్వాదశంలో ఉంటూ బలంగా ఉన్నాడు.అంటే రహస్యకార్యకలాపాలను సూచిస్తున్నాడు.

ఇవన్నీ కలుపుకుని చూస్తే ఏమి గోచరిస్తున్నది?

దేశంలో ప్రజాభిప్రాయం లోపల్లోపల చాలా మారిపోయిందనీ,అది ప్రస్తుతం చాలా బలంగా అంటే ప్రభుత్వాన్ని మార్చివేసేటంతగా తయారైందనీ,ప్రతిపక్ష పార్టీ బాగా బలాన్ని పుంజుకుందనీ,ఉన్న ప్రభుత్వం పోవడం ఖాయమనీ, ప్రతిపక్షం అధికారంలోకి రావడం ఖాయమనీ తెలిసిపోతున్నది.శుక్రుడు సహజరాశిచక్రంలో ప్రతిపక్షానికి సూచకుడు.

దీనిలోని ఇంకొక కోణం ఇప్పుడు చూద్దాం.

శుక్రుడు సినిమానటులకు కూడా కారకుడే.కనుక ప్రజలలో సినిమా నటులకున్న అభిమానం కూడా నేటి ఎలక్షన్లలో విజయానికి తోడుపడుతుందని సూచన ఉన్నది.తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీ ఆర్, సినిమావల్ల సంపాదించిన ప్రజాభిమానం తోనే రాజకీయాలలోకి వచ్చాడు. అలాగే ప్రస్తుతం ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న సినిమానటుడు పవన్ కళ్యాణ్ కూడా మంచి ప్రజాభిమానం ఉన్నవాడే.కనుక ఈ సూచన ప్రకారం కూడా తెలుగుదేశం బీజేపీ కూటమి గెలవడం జరుగుతుంది అన్న సూచన ఉన్నది.

పవన్ కళ్యాణ్ 'బీజేపీ-తెలుగుదేశం' కూటమిని బలపరచడం అనేది ఆ పార్టీలకు చాలా ముఖ్యమైన మలుపు.దానివల్ల ఆ పార్టీల విజయావకాశాలు గణనీయంగా పెరిగాయి.ఇతని సపోర్ట్ లేకపోతే వారికి సీట్లు ఖచ్చితంగా తగ్గి ఉండేవి.ఇదికూడా శుక్రప్రభావమే.

16-5-2014 రోజున జ్యేష్టానక్షత్రం నడుస్తున్నది.చంద్రుడు వృశ్చికరాశిలో నీచస్థితిలో ఉంటూ ఉచ్చశుక్రుని పంచమదృష్టితో చూస్తున్నాడు.ఆ చంద్రుడు సహజ చతుర్ధరాశికి అధిపతి.కనుక ప్రజాభిప్రాయాన్ని సూచిస్తున్నాడు.కాబట్టి గత ప్రభుత్వ పరిపాలనతో విసిగిపోయి కుంగిపోయిన ప్రజలు మార్పును కోరుకుంటూ ఈ రెండు పార్టీలను ఆ రోజున గెలిపిస్తారని (ఆవిధమైన ఫలితం ఆరోజున వస్తుందని) గ్రహములూ సంఖ్యాశాస్త్రమూ చెబుతున్నాయి.

బలంగా ఉన్న శుక్రుడిని వక్రకుజుడు బుధక్షేత్రమైన సప్తమంనుంచి ఎదిరిస్తున్నాడు.అంటే,గెలవబోతున్న ప్రతిపక్షాలను గెలవనివ్వకుండా ఎన్నొ కుట్రలూ కుతంత్రాలూ జరుగుతాయి.వీరు అధికారంలోకి రాకూడదని కోరుకునే శక్తులు బలంగానే ఉంటాయి.అయితే కుజునికంటే శుక్రుడు బలీయంగా ఉండటంతో, అంతిమంగా వారి ఎత్తుగడలు ఫలించవు.

మన దేశంలో ఉన్న విచిత్ర పరిస్థితులలో ఒకటి -- ఎన్నుకోవడానికి సరియైన అభ్యర్ధులు లేకపోవడం.ఉన్న కొద్దిమందీ ప్రజలలో విశ్వసనీయతను సంపాదించలేకపోవడం.

ప్రతిసారీ ఒకరికి అవకాశం ఇవ్వడం.కొన్నాళ్ళ తర్వాత వారిపైన విసుగుతో ఇంకొకరికి అవకాశం ఇవ్వడం.మళ్ళీ కొన్నేళ్ళ తర్వాత వీరిపైన విసుగుతో ఆ మొదటివారికో లేకపోతే ఇంకొకరికో అధికారం ఇవ్వడం -- ఇదే తంతు జరుగుతున్నది.ఈ క్రమంలో, శరవేగంతో జరగవలసిన దేశాభివృద్ధి మాత్రం పడుతూ లేస్తూ కుంటుకుంటూ జరుగుతున్నది.ఈ మధ్యలో జరిగే అవినీతి వల్ల దేశానికి తీవ్రనష్టం జరుగుతున్నది.ప్రపంచదేశాలలో మనదేశం వెనుకబడిపోతున్నది.నవ్వులపాలౌతున్నది.

మనకున్న విపరీత జనాభా వల్ల ఇతర దేశాలకు మనం మార్కెటింగ్ ఏరియాగా ఉపయోగపడటం తప్ప ఏమీ జరగడం లేదు.మానవ వనరులను చైనా ఉపయోగించుకున్నట్లు మనం ఉపయోగించుకోలేక పోతున్నాం.చైనా సాధించిన అభివృద్ధిలో కనీసం మనం ఏభై శాతం కూడా సాధించలేకపోతున్నాం.దానికి కారణం అవినీతి రాజకీయాలు.ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నది అవినీతి పరులైన రాజకీయనాయకులే.వారికి కొమ్ము కాస్తున్న హ్రస్వదృష్టిపరులైన ప్రజలే.

ప్రజలలో దూరదృష్టి రావాలి.ఎంతసేపూ మనకోసం మన కులంకోసం అనికాకుండా దేశంకోసం విశాలమైన దృష్టితో ఆలోచించే స్వభావం రావాలి.నాయకులలో నిజమైన దేశభక్తీ,నిజాయితీ ఉండాలి.మంచి శీలం కలిగిన యువకులు రాజకీయాలలోకి రావాలి.వచ్చాక కూడా చెడిపోకుండా నిలబడి ఉండగలగాలి.అప్పుడే మన దేశం బాగుపడుతుంది.

అటువంటి రోజులు ముందుముందు తప్పకుండా వస్తాయి.కాకపోతే ఆ రోజులు త్వరగా రావాలనీ,మన దేశంకూడా ప్రపంచ దేశాల సరసన గర్వంగా నిలబడాలనీ దేశభక్తి ఉన్న పౌరులుగా మనమూ ఆశిద్దాం.

ఆ మార్గంలో ఎదగడానికి మన దేశాన్నీ మనల్నీ భగవంతుడు ఆశీర్వదించుగాక.