ఈ మధ్య ఒక అభిమాని వచ్చి కలిశాడు.అలా వచ్చేవారిలో చాలామంది మంచి మంచి పుస్తకాలు బాగా చదివినవారు ఉంటారు.కనుక వారికి ఎకాడెమిక్ సందేహాలు ఎక్కువగా వస్తుంటాయి.పాపం వెతుక్కుంటూ దూరంనుంచి వచ్చారుకదా అని నేనూ ఓపికగా చెబుతూ ఉంటాను.
చెప్పినదానిని ఎంతవరకు అర్ధం చేసుకుంటారో ఆ అర్ధమైనది వారికి ఎంతవరకూ జీవితంలో ఉపయోగిస్తుందో మాత్రం వారికే ఎరుక.
ఆయన అడిగిన సందేహాలూ నేనిచ్చిన జవాబులూ మీ అందరి ఉపయోగం కొసం ఇక్కడ ఇస్తున్నాను.
చదవండి.
'జ్యోతిశ్శాస్త్రమూ హస్తసాముద్రికమూ వంటి వాటి జోలికి పోవద్దని బుద్ధుడు చెప్పినాడు.రమణమహర్షి కూడా అదేమాట చెప్పినాడు.మీ అభిప్రాయం ఏమిటి?'
'నేనలా అనుకోవడంలేదు.వారు చెప్పినది వారివరకూ నిజమే కావచ్చు. పూర్తిగా నివృత్తిమార్గంలో పోయేవారికి ఇది అవసరం లేదు.కాని అలా ఎంతమంది పోతున్నారు?అందరూ ఇళ్ళలో హాయిగా సంసారాలు చేసుకుంటూ బుద్దుడినీ రమణమహర్షినీ వాళ్ళ అవసరార్ధం కోట్ చేస్తున్నారు.వారిని నిజంగా అనుసరించే వారు ఎక్కడో ఒకరోఇద్దరో ఉంటారు.వారికి దీని అవసరం ఉండదు. జ్ఞానికి జ్యోతిష్యం అవసరం లేకపోవచ్చు.కాని యోగమార్గంలో అది చాలా ఉపయోగపడుతుంది'
'ఎలా ఉపయోగపడుతుంది?'
'నిన్ను నువ్వు అర్ధం చేసుకోవడానికి పనికొస్తుంది.నీ కర్మశేషం ఏమిటో తెలుస్తుంది.నీ భవిష్యత్ రూట్ ఏమిటో తెలుస్తుంది.అలాగే నీకు ఎదురయ్యే పరిచయమయ్యే వారినీ లోతుగా అర్ధం చేసుకోవడానికి పనికొస్తుంది.నీ జీవితంలో వారిపాత్ర ఏమిటో తెలుస్తుంది.నీ మార్గంలో ఎక్కడ అడ్డంకులున్నాయో తెలుస్తుంది.వాటిని ఎలా అధిగమించాలో తెలుస్తుంది. ఇంతకంటే ఇంకేం కావాలి?'
'మరి బుద్ధుడూ రమణమహర్షీ మరికొందరు మహాత్ములూ అలా ఎందుకు చెప్పారు?'
'ఇవన్నీ అనవసరమని వారు అనుకోని ఉండవచ్చు.దేహమూ వద్దు, సంసారమూ వద్దు,అసలీ ప్రపంచమే నాకొద్దు అనుకునేవారికి ఇక జ్యోతిష్యం ఎందుకు?వారిలా ఉండగలిగితే జ్యోతిష్యసహాయం తీసుకోనక్కర్లేదు.కాని వారిలా నిజంగా జీవించాలి.ఊరకే వారి మాటలను పుస్తకాలలో చదివి మనం చిలకల్లా వాటిని తిరిగివల్లిస్తే సరిపోదు.ఆధ్యాత్మికంలో జీవనం ప్రధానం. మాటలు కాదు.'
'సాధనకు జ్యోతిష్యం అడ్డంకి అవుతుందా?'
'కావచ్చు.కాకపోవచ్చు.అది నీవున్న స్థితిమీద ఆధారపడి ఉంటుంది.నీకు తగినంత శక్తి ఉంటె అది సహాయకారి అవుతుంది.అది లేకుండా నీవు ఇతరుల బరువును మొయ్యాలని ప్రయత్నిస్తే అది నీకే ఆటంకాలు సృష్టిస్తుంది.నీ కర్మను బాధలనూ తగ్గించేబదులు ఇంకా పెంచుతుంది.'
'రెమెడీలు చెప్పడం వల్ల వారికర్మ కొంత మనకు అంటుకోవడం నిజమేనా?'
'నిజమే'
'అయితే ఇలా ఎంతమంది కర్మలను మనం మోయగలం?'
'ప్రపంచంలో ఉన్న అందరూ మీ దగ్గరకు వచ్చి వారి భవిష్యత్తునూ జాతక దోషాలనూ నివారణలనూ నిన్ను అడగలేరు.ఎవరికైతే నీతో కర్మసంబంధం ఉన్నదో వారే అలా నీ దగ్గరకు వస్తారు.అడుగుతారు.వారి కర్మతో నీకు కొంతైనా సంబంధం లేకుంటే నీవూ వారికి దారి చూపలేవు.వారూ నీ దగ్గరకు రారు.నీవు చెప్పినదానిని అనుసరించలేరు.నీకు ఉపాసనాబలం లేనిదే నీవుకూడా వారికి సరిగ్గా చెప్పలేవు.'
'ఏదేమైనా, కర్మ అంటుకోవడం నిజమే కదా?'
'నీకు అహంభావన ఉంటే అంటుతుంది.నీవు వారి దగ్గరనుంచి ఏదైనా ఆశిస్తే వారి కర్మబరువును నీవు మొయ్యవలసి వస్తుంది.నీవు నిస్వార్ధంగా ఉంటే అది నీకు అంటదు.'
'జ్యోతిష్యం పుస్తకాలు చదివి నేర్చుకోవచ్చా?'
'అసాధ్యం.కొంతవరకూ పైపైన తెలుస్తుంది.కాని లోతైన సూక్ష్మరహస్యాలు అర్ధం కావు.ఎవరో ఒక గురువును ఆశ్రయించి అతని మెప్పును పొంది మాత్రమె వాటిని గురుముఖతా గ్రహించవలసి ఉంటుంది.ఇది పరంపరాగతమైన గుప్తవిద్య అని మరచిపోకూడదు.దీనికి మంత్రసాధన అవసరం అన్న విషయమూ మరచిపోకూడదు.'
'కొంతమంది ఎక్కడ బడితే అక్కడ టీవీలలో కూడా రేమేడీలు ఎడాపెడా చెబుతూ ఉంటారు.వారి పరిస్థితి ఏమిటి?'
'వారి దశలు వచ్చినపుడు వారుపడే బాధలు పరమ భయంకరంగా ఉంటాయి. అవి మనకు కనపడవు.అలా ఎక్కడబడితే అక్కడ,ఎవరికీబడితే వారికి డబ్బు కోసం రెమెడీలు చెప్పడం శుద్ధతప్పు.దాని ఫలితంగా ఆ కర్మలో కొంతభాగాన్ని చెప్పినవాడు భరించవలసి వస్తుంది.వాడికి ప్రస్తుతం వస్తున్న డబ్బే కనిపిస్తుంది.అంటుకుంటున్న కర్మ కనిపించదు.పడేటప్పుడు మాత్రమె అది తెలుస్తుంది.అదికూడా సూక్ష్మదృష్టి ఉంటె అర్ధమౌతుంది.లేకుంటే పడేటప్పుడు కూడా అది అర్ధంకాదు'
'జ్యోతిష్యసహాయం లేకుండా సరాసరి ఒక మనిషిని చూస్తూనే విషయాలు గ్రహించడం సాధ్యమేనా?'
'సాధ్యమే.అది యోగులకు సాధ్యమౌతుంది.ఆస్థితి వచ్చినపుడు ఇంక జ్యోతిష్యంతో అవసరం ఉండదు.కాకుంటే గ్రహములు ఏమి చెబుతున్నవో చూడటంకోసమూ తన మనస్సు గ్రహిస్తున్నది ఎంతవరకూ సత్యమో తెలుసుకోవడం కోసమూ తన ఇంట్యూషన్ చేప్పినదానిని జ్యోతిష్యంతో పోల్చి చూచుకోవచ్చు.చాలామంది జ్యోతిష్యజ్ఞానం ఉన్న యోగులు కూడా అలా చేస్తారు.'
'అలాంటి వాళ్ళు మీకు తెలుసా?మీరు చూచారా?'
'తెలుసు.చూచాను.చాలామంది అలాంటివారు ఉత్తరాదిలో ఉన్నారు.మనవైపు తమిళనాడులో ఉన్నారు.పరమహంసయోగానంద గురువైన స్వామి యుక్తెశ్వర్ గిరి అలాంటివారే.చెయ్యిచూచి జాతకంలోని లగ్నాన్ని ఆయన గుర్తించగలిగేవారు.ఆయన అయనాంశకూడా వేరుగా ఉన్నది.'
'జ్యోతిష్యం క్షుద్రవిద్య అని కొందరు అంటున్నారు.మీ అభిప్రాయం ఏమిటి?'
'వేదాంగం క్షుద్రవిద్య ఎలా అవుతుంది? వారికి అర్ధంకాక అలా అనుకోవచ్చు'
అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అంటారు కదా.అడిగిన ప్రతిదానికీ చెబుతున్నానని ఈసారి ఆయన ఆఖరి ప్రశ్నను ఇలా సంధించాడు.
'నేను మిమ్మల్ని అనుసరించగలనా లేదా?మీ జ్యోతిష్యజ్ఞానం ఉపయోగించి చెప్పండి'
'ఇది చెప్పడానికి జ్యోతిష్యజ్ఞానం అవసరంలేదు.అది నీశ్రద్ధమీదా అదృష్టంమీదా ఆధారపడి ఉన్నది.నీకు నిజమైన చిత్తశుద్ధి ఉంటె అనుసరించగలవు.లేకుంటే అనుసరించలేవు.'