నిన్న ఈ విషయం మీద వ్రాస్తూ నవాంశలో కేతువుతో కూడిన మేషలగ్నం ఉదయిస్తున్నదని వ్రాశాను.అది 8.15 నిముషాలకు ఉన్నట్టి పరిస్థితి.
కానీ కేసీఆర్ ప్రమాణ స్వీకారం ఉదయం 8.20 నుంచి 8.22 మధ్యన జరిగింది.ఆ సమయానికి నవాంశ చక్రంలో మార్పులొచ్చాయి.8.19 వరకూ మేషనవాంశ ఉన్నది.ఆ తర్వాత వృషభ నవాంశ మొదలైంది.అంటే కేసీఆర్ ప్రమాణ స్వీకార సమయానికి నవాంశలగ్నం మారిపోయింది.ఆ క్రమంలో ఫలితాలలో మార్పులు వస్తాయి.అవేమిటో,రాశి చక్ర ఫలితాలను నవాంశ ఎలా సమర్దిస్తున్నదో చూద్దాం.
ప్రమాణ స్వీకార సమయానికి స్థిరలగ్నమైన వృషభం ఉదయించడం చాలా మంచిసూచన.వృషభ లగ్నానికి యోగకారకుడైన శనీశ్వరుడు లగ్నంలో ఉండటం కూడా మంచి సూచనే.అయితే ఆయన ఈ లగ్నానికి బాధకాదిపతి కూడా అవడం వల్ల మంచీ చెడూ రెండూ కలగలుపుగా ఉంటాయి. చెయ్యాలనుకున్న పనులు అంత త్వరగా ముందుకు కదలవు.
లాభాదిపతి అయిన గురువు లగ్నంలో ఉండటం మంచిదే.కానీ ఆయనకు అష్టమాదిపత్యం కూడా ఉండటం మంచి సూచన కాదు.అంటే కొత్త ప్రభుత్వానికి లాభనష్టాలు రెండూ సమానంగా ఉంటాయన్న సూచన ఉన్నది.అదీగాక ఈ లగ్నానికి దోషి అయిన కుజుడు లగ్నంలో ఉండటం ఎంతమాత్రం మంచిది కాదు.దీనివల్ల నష్టాలూ ప్రత్యర్ధుల వల్ల చికాకులూ గొడవలూ నిత్యమూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయన్న సూచన ఉన్నది.
నవాంశ లగ్నం కూడా రాశి లగ్నం లాగానే పాపార్గళ యుతం కావడం గమనించాలి.కనుక ఏ పని చెయ్యాలన్నా వెంటనే అడుగు ముందుకు పడని పరిస్థితి ఉంటుంది.
లగ్నాధిపతి శుక్రుడు మూడింట ఉండటం వల్ల గొప్పలు చెప్పుకోవడం ఎక్కువగానూ క్రియ తక్కువగానూ ఉంటుంది.రాష్ట్రం సాధించిన ఉత్సాహంలో చాలా దూకుడుగా ముందుకు వెళదామని భావించినా ఆ మార్గంలో మాత్రం అనేక అడ్డంకులు ఎదురౌతాయి.
తృతీయాదిపతి చంద్రుడు నాలుగింట ఉండటం వల్ల ప్రజల్లోనూ ప్రభుత్వంలోనూ మంచి ఉత్సాహం మొదలౌతుంది.అయితే నిజమైన విజయాలు ఆచరణాత్మకంగా సాధించకుండా ఊరకే మీడియాలో గొప్పలు చెప్పుకోవడం కూడా ముందు ముందు జరిగే ప్రమాదం దీనివల్ల ఉన్నది.
రాహుకేతువులు 6,12 లలో ఉండటం చాలా మంచి పరిణామం.8.15 కి ప్రమాణం స్వీకరిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు.గ్రహకుండలిలో ఉన్న కొన్ని యోగాలలో రాహుకేతువులకు ఇది ఒక మంచి ప్లేస్ మెంట్.దీనివల్ల శత్రువులు ఎప్పుడూ కంట్రోల్ లో ఉంటారు.
ఇక ఎనిమిదింట బుధుడు ఉండటం కూడా మంచిదే.అయితే దీనివల్ల విలాసాలతో కూడిన జీవనానికి ప్రజలూ అధికారులూ కూడా ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు.ఉన్నదానికంటే ఎక్కువగా ఇతరులకు ప్రదర్శించుకోవాలన్న తాపత్రయం దీనివల్ల వస్తుంది.
లగ్నంలో రెండు బలమైన శక్తులు వచ్చిచేరాయి.ఒకటి యోగకారకుడైన వక్రశని.రెండు పరస్పరం మిత్రగ్రహాలై లగ్నాదిపతికి శత్రువర్గానికి చెందిన కుజగురువులు.కనుక మంచి ఉద్దేశ్యంతో మొదలైనప్పటికీ కాలక్రమంలో ఈ ప్రభుత్వం అనేక అంతర్యుద్దాలనూ ఆటుపోట్లనూ ఎదుర్కోక తప్పదన్న సూచన ఉన్నది.శత్రువులు ఎప్పుడూ పక్కలో బల్లెంలా ఉంటూనే ఉంటారన్న సూచన ఉన్నది.
అయితే స్థిరలగ్నమైన వృషభం ఉదయించడమూ,సామాన్య జనానికి సూచకుడైన శనీశ్వరుడు అతిబలవంతుడై లగ్నంలో ఉండటమూ చూస్తే అంతిమంగా ప్రజాభిప్రాయమే అత్యున్నత రక్షగా తెలంగాణాను నిలబెడుతుందనీ,ఎదురయ్యే కష్టనష్టాలను అదే చివరకు గట్టెక్కిస్తుందనీ భావించాలి.
ఇక మార్గమధ్యంలో ఉండే నష్టాలంటారా? ప్రజాస్వామ్యంలో అవెలాగూ తప్పవు.మంచి నాయకులను ఎంచుకునే క్రమంలో ప్రయోగాత్మకంగా ముందుకు పోవడమూ ఆ క్రమంలో కొన్ని నష్టాలను అనుభవించడమూ ప్రజాస్వామ్యంలో ప్రజలకు తప్పవు కదా మరి.