“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

26, జూన్ 2014, గురువారం

రాజధాని ఎక్స్ ప్రెస్ ప్రమాదం-ఒక పరిశీలన




రాహు ప్రభావానికి ఇంకొక తార్కాణం నిన్న జరిగింది.

నిన్న ఉదయం 2.15 కి బీహార్ లోని చాప్రా దగ్గర రాజధాని ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది.12 బోగీలు పట్టాలు తప్పాయి.కొన్నైతే విసిరేసినట్లు చాలా దూరంగా పడిపోయాయి.ఆ విషయాలన్నీ టీవీలలో చూచి ఉంటారు.

ఈ సంఘటనను ఒక్కసారి విశ్లేషిద్దాం.
  • లగ్నడిగ్రీ మేషం 26.భరణీనక్షత్రంలో నిలిచి ఉన్నది.భరణికి అధిష్టానదేవత యమధర్మరాజు అని మనకు తెలుసు.మృత్యుకారక నక్షత్రంలో ఇలాంటి సంఘటన జరగటం కాకతాళీయం ఏమీ కాదు.
  • లగ్నం కేతువుతో కలసి ఉన్నది.ఆ కేతువు 0 డిగ్రీలలో రాశి మారబోతూ చాలా చికాకుగా ఉన్నాడు.రాహుకేతు ప్రభావాలవల్ల ప్రమాదాలు జరుగబోతున్నాయని అనుకుంటూనే ఉన్నాం. కేతులగ్నం లోనే ఈ ప్రమాదం జరగడం కూడా కాకతాళీయం కాదు.
  • లగ్నాధిపతి అంగారకుడు షష్ఠంలో శత్రుస్థానంలో ఉన్నాడు.ప్రమాదాలలో అంగారకుని పాత్ర గురించి ఇప్పటికి ఎన్నో పోస్ట్ లలో వ్రాశాను.దానికి అనుగుణంగానే ఇది కూడా జరగడం చూడవచ్చు.
  • అంత్యరాశి అయిన మీనంలో ఉన్న అకస్మాత్తు సంఘటనలకు కారకుడైన యురేనస్ అంగారకునితో ఖచ్చితమైన సమసప్తక దృష్టిలో ఉన్నాడు.ఇది చాలా ముఖ్యమైన యోగం.అకస్మాత్తుగా జరిగే సంఘటనలలో యురేనస్ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది.ఇక్కడ కూడా అది మళ్ళీ ఋజువైంది.
నవాంశ పరిస్థితి చూద్దాం.

  • వాహనకారకుడు శుక్రుడు యురేనస్ తో కలసి ఉన్నాడు.రాశిచక్రంలో అంగారకుని దృష్టి ఉండటం గమనించాలి.కనుక అకస్మాత్తు వాహన ప్రమాదం జరిగింది.
  • శని,కేతువులతో కలసి చంద్రుడు మేషరాశిలో ఉన్నాడు.శనీశ్వరుడు నీచంలో ఉన్నాడు.దీని గురించి ఇక చెప్పనే అక్కర్లేదు.
  • కుజుడు నీచంలో ఉండి ఉచ్ఛగురువుతో కలసి ఉన్నాడు.కనుకనే ప్రమాదపు ఉద్ధృతి తగ్గింది.ఆ బోగీలు విసిరేసినట్లు దూరంగా పడిపోవడం చూస్తె ప్రస్తుత జరిగిన ప్రాణాపాయం చాలా తక్కువ అనే చెప్పాలి.దీనికి గురువు యొక్క కరుణే కారణం.
  • ప్రమాద సమయంలో కుజహోర జరిగింది.ఇంతకంటే ఋజువు ఇంకొకటి అవసరం ఉండదు.ఖచ్చితంగా అంగారకుని అధీనంలో ఉన్న సమయంలోనే ప్రమాదం జరగడం గమనార్హం.కొన్ని కొన్ని సమయాలు కొన్ని గ్రహాల అధీనంలో ఉంటాయన్నది నిజమే అని ఇది ఋజువు చేస్తున్నది.
తిధి:- కృష్ణత్రయోదశి.
ఒక్కరోజులో అమావాస్య రాబోతున్నది.అమావాస్య ప్రభావం గురించి నేను లెక్కలేనన్ని పాత పోస్ట్ లలో వ్రాశాను.హెచ్చరిస్తూ వస్తున్నాను.మళ్ళీమళ్ళీ ఇది నిజం అవుతూ వస్తున్నది.ఈ సారి కూడా మళ్ళీ నిజమైంది. కావలసిన వారు ఒక్కసారి పాత పోస్ట్ లు తిరగెయ్యండి.

చతుర్దంలో గురువు ఉచ్చంలో ఉండటమూ,ఆరూడలగ్నం నుంచి శుక్రుడు స్వక్షేత్రంలో వాహనస్థానంలో ఉండటమూ ఈ ప్రమాదంలో ప్రాణనష్టాన్ని చాలావరకూ తగ్గించాయి.లేకుంటే రాజధాని ఎక్స్ ప్రెస్ పోతున్న వేగానికీ ప్రమాదం జరిగిన ధాటికీ ఇంకా ఎందఱో చనిపోయి ఉండాలి.

గురువు అనుగ్రహం ఈ విధంగా ఎన్నో ప్రాణాలను రక్షించింది.

కాని ఈ విషయం ఎందరు గ్రహిస్తారు?ఎందరు దైవానికి కృతజ్ఞతలు తెలుపు కుంటారు?ఎందరు బుద్ధి తెచ్చుకుని ధర్మానికి కట్టుబడి జీవించడం ప్రారంభిస్తారు?ఎందరు తమను తాము మార్చుకుని అహంకారం తగ్గించుకుని ధర్మపు నీడలోకి వస్తారు?అందరూ రకరకాలైన అహంకారాలతో విర్రవీగేవారే గాని వాస్తవాలను గ్రహించేవారు ఎందరున్నారు? 

అన్నీ శేషప్రశ్నలే.అందుకేనేమో శేషుని ప్రతిరూపం అయిన రాహువు ఈ రకంగా కర్మక్షాళనం గావిస్తున్నాడు.ఇదొక్కటే కాదు.ప్రతిరోజూ అనేక రకాలుగా ఈ ప్రక్షాళన సాగుతున్నది.చూద్దాం ఇంకా ఎన్ని ఉన్నాయో??