నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

29, జూన్ 2014, ఆదివారం

బ్లాక్ సాటర్ డే

నిన్న శనివారాన్ని బ్లాక్ సాటర్ డే అని అనుకోవచ్చు.

ఎందుకంటే నిన్న ఒకే రోజున ఎన్నో ప్రమాదాలు జరిగాయి.

ఉదయం డిల్లీలో భవనం ఒకటి కూలిపోయి జనం చనిపోయారు.

సాయంత్రం చెన్నైలో భవనం కూలిపోయి 11 మంది చనిపోయారు.కనీసం ఇంకా 20 మంది శిధిలాలక్రింద చిక్కుకుని ఉన్నారంటున్నారు.

ఇందులో విచిత్రం ఏమంటే,ఉదయం డిల్లీ సంఘటనకూ సాయంత్రం చెన్నై సంఘటనకూ నవాంశ చక్రం ఒకటే.నవాంశ లగ్నం రెంటికీ మీనమే అయింది.చతుర్దాతిపతి అయిన బుధుడు ఈ రెండు చక్రాలలోనూ అష్టమంలో రాహువుతో కలసి ఉన్నాడు.ఇదొక నమ్మలేని నిజం.జ్యోతిష్య విద్యార్ధులకు ఈ విచిత్రం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించడమేగాక,గ్రహప్రభావాలు ఎంత విచిత్రంగా ఉంటాయో మరొక్కసారి కళ్ళకు కట్టిస్తుంది.

ఈ రెండు సంఘటనలకూ దాదాపు తొమ్మిది గంటలు తేడా ఉన్నది.కానీ రెండు సంఘటనలలోనూ నవాంశలో గ్రహస్తితులు దాదాపు ఒకే రకంగా ఉన్నాయి. మనకు కనపడని శక్తులు ఏ విధంగా సంఘటనా క్రమాన్ని నిర్దేశిస్తూ ఉంటాయో చెప్పడానికి ఇదొక మచ్చుతునక.ఖచ్చితంగా ఆయా సమయాలకు ఆయా గ్రహస్తితులు సరిగ్గా ఎవరో కదిపినట్లు ఆయా ప్రదేశాలకు చేరుకుంటాయి.మనకు తెలియని ఒక అతీతశక్తి పర్యవేక్షణలో అంతా నడుస్తున్నదని చెప్పడానికి ఇవే నిదర్శనాలు.

అయితే ఈ సమయంలో హోరాదిపతి శుక్రుడు అయ్యాడు.రాశి చక్రంలో చతుర్దాదిపతి అయిన శని నవాంశలో నీచంలో ఉంటే ఆయనతో కలసి ఈ శుక్రుడున్నాడు.కనుకనే కూలి చేసుకునే సాదాసీదా జనం ఈ ఘటనలో చనిపోయారు.

విశాఖపట్నంలో ఫార్మా కంపెనీలో పేలుడు జరిగింది.

కాన్పూర్ లో గ్యాస్ ప్రమాదం జరిగింది.

గుజరాత్ పోర్ట్ లో ఇలాంటిదే ఒక ప్రమాదం జరిగింది.

ఇలా రకరకాల చోట్ల ఒకేరకమైన ప్రమాదాలు ఒకేరోజున జరగడం కాకతాళీయం కాబోదు.దీనివెనుక ఉన్న కారణం ప్రతికూల గ్రహస్థితులు మాత్రమే.

ఈరోజు మళ్ళీ ఏమీ జరగలేదు.దానికి కారణం అమావాస్య ప్రభావం బలహీనపడటమే.

ఈ విధంగా వ్యక్తిగత జీవితాలలో గత పదిరోజులుగా ఎన్నో సంఘటనలు జరిగాయి.మచ్చుకి కొన్ని చూద్దాం.

మా స్నేహితుని అబ్బాయికి 14 ఏళ్ళు.అతనికి ఉన్నట్టుండి షుగర్ లెవెల్ 800 కి వెళ్ళిపోయింది.కళ్ళు తిరిగి పడిపోతే ఆస్పత్రిలో చేర్పించారు.షుగర్ లెవల్ ఈ స్థాయిలో ఉంటె అసలు బ్రతకడం కష్టం.ఇదేదో మిరకిల్ గా ఉన్నది అని ట్రీట్ చేస్తున్న డాక్టర్లే నోరెళ్ళబెట్టారు.ఈ వయసులోనే అతను ఇన్సులిన్ డిపెండెంట్ అయ్యాడు.ఇది జరిగి 5 రోజులు అయింది.ఈ విషయం చెప్పి స్నేహితుడు వాపోయాడు.ఊహించని అంతుబట్టని ఆరోగ్య సమస్యలకు రాహువు కారకుడని చాలాసార్లు గతంలో వ్రాశాను.

గతవారంలో అనేకమంది అకస్మాత్తు ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిని దర్శించడం జరిగి ఉంటుంది.ఎన్నో యాక్సిడెంట్లు జరిగి ఉంటాయి.నా చుట్టుపక్కల నేనే ఎన్నో కేసులు చూచాను.ఇదీ ఈ గ్రహప్రభావమే.

అంతేకాదు ఇరాక్ లో ప్రస్తుతం జరుగుతున్న అంతర్యుద్ధం కూడా రాహువు ప్రభావమే.ముస్లిం దేశాలు ఆయన ఆధీనంలోనే ఉంటాయి.

ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా అనేక పెద్ద సంఘటనలూ,వ్యక్తిగత జీవితాలలో అనేక రోజువారీ సంఘటనలూ రాహుప్రభావంతో జరుగుతున్నాయి.చూచే దృష్టితో చూస్తే వాటిని చక్కగా అర్ధం చేసుకోవచ్చు.

అయితే కొంతమందికి అనుమానం వస్తుంది.

ఈ ప్రమాదాలలో అందరూ సామాన్యులే పోతున్నారు.తెరవెనుక ఉండి ఈ పనులను చేయిస్తున్న పెద్దవారు హాయిగానే ఉన్నారు కదా అని.

కర్మ ఎవరినీ వదలదు.దానికి ధనవంతులనీ పేదవారనీ తేడా ఉండదు. ఎవరిసమయం వచ్చినపుడు వారికి వాత పెడుతుంది.అయితే ఆ వాతను పెట్టే విధానంలో తేడాలుంటాయి.మోసకారులకు మోసపూరితంగానే దెబ్బ తగులుతుంది.అతితెలివి ఉన్నవారికి ఇంకా తెలివిగా దెబ్బ తగులుతుంది. కర్మను చేసికూడా తప్పుకుందాం అనుకునేవారికి వారు ఊహించని విధంగా, తప్పుకోలేని విధంగా దెబ్బ తగులుతుంది.అహంకారులకు వారి అహం అణగిపోయే విధంగా శిక్ష పడుతుంది.క్రూరంగా కర్మ చేసినవారికి ఇంకా క్రూరంగా శిక్ష పడుతుంది.దీనిని ఆపడం ఎవరి తరమూ కాదు.

పేదవాళ్ళ బాధలు బయటకు కనిపిస్తాయి.ధనికుల బాధలు అలా కనిపించవు.వాళ్ళ బాధలు చెప్పుకోలేనివి.కానీ వాళ్లవి వాళ్ళకూ ఉంటాయి.వారి సమయం వచ్చినపుడు వారూ అనుభవిస్తారు.

తన జీవితంలో జరిగిన సంఘటన ఒకటి నా స్నేహితుడు నాతో చెప్పాడు.

వాళ్ళ అబ్బాయి చైనాలో MBBS చదువుతున్నాడు.అతన్ని చూడటానికి మా స్నేహితుడు చైనా వెళ్లాడు.చేతిలో పదిలక్షల క్యాష్ ఉన్నది.కానీ దురదృష్టవశాత్తూ దానిని మార్చుకోడానికి ఆరోజున బ్యాంకులు మూసేసి ఉన్నాయి.ఇతను షుగర్ పేషంటు.కనీసం టీ త్రాగుదామంటే చేతిలో డబ్బులు లేవు.మన కరెన్సీ అక్కడ చెల్లదు.చేతిలో పదిలక్షల ఇండియన్ కరెన్సీ ఉండికూడా టీ తాగడానికి డబ్బుల్లేని పరిస్తితిని అతడు చైనా రోడ్లమీద అనుభవించాడు.

తిండిలేక షుగర్ లెవల్స్ పడిపోయి చివరకు కళ్ళుతిరిగి రోడ్డుమీద పడిపోయే స్థితిలో ఉన్నాడు.అక్కడ ఎవడికీ ఇంగ్లీష్ రాదు.మావాడికి చైనీస్ రాదు.ఏం చెయ్యాలి?చివరికి తట్టుకోలేక రోడ్డు పక్కనే ఉన్న కొన్నిషాపులలో అడుక్కున్నాడు కూడా.అయితే భాష రాకపోవడంతో వాళ్లకు ఇతనేమి చెబుతున్నాడో అర్ధం కాలేదు.ఇతను మనదేశంలో ఒక హోటల్ యజమాని. ఏసీ రూం దాటి సాధారణంగా బయటకు రాడు.కాని ఆరోజున చైనాలో ఒక కప్పు 'టీ' కోసం అడుక్కునే స్థితిలోకి నెట్టబడ్డాడు.

ఇంతలో ఇతని అదృష్టం బాగుండి ఒక చైనా అమ్మాయి అక్కడకు వచ్చింది. ఆ అమ్మాయి అక్కడ యూనివర్శిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్.ఇతను చెబుతున్నది ఆమెకు అర్ధమై,వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆరోజుకు ఆశ్రయం ఇచ్చింది. మర్నాడు బ్యాంకులు తెరిచాక ఇతను డబ్బు మార్చుకున్నాడు.

ఆరోజున ఆ అమ్మాయి గనుక అక్కడ కన్పించకపోతే చేతిలో పదిలక్షల కరెన్సీతో చైనారోడ్లమీద టీ నీళ్ళకోసం ముఖంవాచి కుక్కచావు చచ్చి ఉండేవాడిని అని నాతో చెప్పి వాపోయాడు.చేతిలో డబ్బున్నా కొన్నిసార్లు కర్మపెట్టే బాధలు ఇలా ఉంటాయి.డబ్బు అన్నివేళలా అన్నింటినీ పరిష్కరించలేదు.

అతను తరచుగా గుంటూరులో అన్నదానం చేస్తూ ఉంటాడు.ఎంతోమంది దిక్కులేనివాళ్లకు తనచేత్తో తరచుగా అన్నం పెడుతూ ఉంటాడు.ఆ సంగతి నాకు తెలుసు.

అతనితో ఇలా చెప్పాను.

"నీవు చేసిన అన్నదానమే ఆ సమయంలో నిన్ను ఆదుకుంది. అన్నపూర్ణాదేవి ఆ అమ్మాయి రూపంలో వచ్చి ఆ దేశంకాని దేశంలో ఆపదలో ఉన్న నిన్ను ఆదుకుంది.నిన్ను ఆదరించి నీకు అన్నం పెట్టింది. నీవు ఇక్కడ చేసిన మంచిపని అక్కడ నీకు అక్కరకు వచ్చింది." అని చెప్పాను.

మన కర్మ మన వెనకే  ఉంటుంది.ఎక్కడికీ పోదు.అది మనకు కనిపించక పోవచ్చు.కాని మన నీడలా వెన్నంటే ఉంటుంది.

ఒక హిందీ సామెత ఇలా అంటుంది.

"భగవాన్ కే ఘర్ మే దేర్ హై అంధేర్ నహీ"

'భగవంతుని ఇంటిలో(సృష్టిలో) ఆలస్యం ఉందేమో గాని చీకటి లేదు.' అంటే ఆలస్యమైనా చివరికి న్యాయం జరుగుతుంది అని.

నన్నడిగితే మాత్రం ఈ సామెత తప్పంటాను.

భగవంతుని న్యాయస్థానంలో ఆలస్యమూ లేదు.చీకటీ లేదు.

మనం అనుకున్న సమయానికి అనుకున్నట్లు జరగకపోతే అలా అనుకుంటాము.కాని అది నిజం కాదు.ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా ఖచ్చితంగా జరుగుతుంది.ఎలా జరపాలో దైవానికి తెలుసు.ఎప్పుడు జరపాలో కూడా ఖచ్చితంగా తెలుసు.

కాకపోతే ఆ జరిగేదాని వెనుక ఉన్న రహస్యసూత్రాలను అర్ధం చేసుకోవడమే మనం చెయ్యవలసిన పని.జ్యోతిష్యశాస్త్రపు పరమ ప్రయోజనం అదే. సృష్టిరహస్యాలను చక్కగా ఆకళింపు చేసుకోవడమే జ్యోతిష్యశాస్త్రపు పరమ ప్రయోజనం.

అలా అర్ధం చేసుకుని ప్రయోజనం ఏమిటీ అని అడగవచ్చు.

అలా వాటిని అర్ధం చేసుకుంటే ఆ తప్పులను మన జీవితంలో మనం చెయ్యకుండా ఉంటాం.ఆ బాధలు పడకుండా తప్పుకోగలుగుతాం. దైవన్యాయానుసారం జీవించగలుగుతాం.దైవానికి దగ్గర కాగలుగుతాం.

మనిషి జన్మలో ఇంతకంటే ఇంకేం కావాలి?